అధ్యాయము - 41

దుర్వాసుడు:

ఏవం మాఘే సితే పక్షే ద్వాదశీం ధరణీభృతః

వరాహస్య శృణుష్వాద్యాం మునే పరమధార్మిక.

దుర్వాసుడు:

ఓ మునీ! పరమ ధార్మికుడా! భూమిని తాల్చిన వరాహ దేవుని మొదటి ద్వాదశిని గూర్చి వినుము. అది మాఘ మాసమున శుక్ల పక్షమున వచ్చును.

ప్రాగుక్తేన విధానేన సంకల్పస్నాన మేవ చ,

కృత్వా దేవం సమభ్యర్చ్య ఏకాదశ్యాం విచక్షణః.

మునుపు చెప్పిన పద్ధతి ప్రకారమే వివేకము కలవాడు ఏకాదశి యందు సంకల్పము, స్నానము ఆచరించి దేవుని అర్చింప వలయును.

ధూపనైవేద్యగంధైశ్చ అర్చయిత్వాచ్యుతం నరః,

పశ్చాత్‌ తస్యాగ్రతః కుంభం జలపూర్ణంతు విన్యసేత్‌.

ధూపము, నైవేద్యము, గంధములతో అచ్యుతుని అర్చించి ఆతని ముందు నీరు నింపిన కుంభమును ఉంచ వలయును.

ఓం వరాహాయేతి పాదౌతు మాధవాయేతి వైకటిమ్‌,

క్షేత్రజ్ఞాయేతి జఠరం విశ్వరూపేత్యురో హరేః.

సర్వజ్ఞాయేతి కంఠం తు ప్రజానాం పతయే శిరః,

ప్రద్యుమ్నాయేతి భుజౌ దివ్యాస్త్రాయ సుదర్శనమ్‌,

అమృతోద్భవాయ శంఖం తు ఏష దేవార్చనే విధిః.

‘ఓం వరాహాయ నమః’ అని పాదములను, ‘మాధవాయ నమః’ అని నడుమును, ‘క్షేత్రజ్ఞాయ నమః’ అని కడుపును, ‘విశ్వ రూపాయ నమః’ అని హరి వక్షమును, ‘సర్వజ్ఞాయ నమః’ అని కంఠమును, ‘ప్రజాపతయే నమః’ అని శిరస్సును, ‘ప్రద్యుమ్నాయ నమః’ అని భుజములను, ‘దివ్యాస్త్రాయ నమః’ అని సుదర్శనమును, ‘అమృతోద్భవాయ నమః’ అని శంఖమును పూజింప వలయును. ఇది దేవార్చన యందు పద్ధతి.

ఏవ మభ్యర్చ్య మేధానీ తస్మిన్‌ కుంభేతు విన్యసేత్‌,

సౌవర్ణం రౌప్యతామ్రం వా పాత్రం విభవ శక్తితః.

తెలివి గలవాడు ఇట్లు అర్చించి ఆ కుంభమున తన విభవ శక్తి మేరకు బంగారము తోడనో, వెండి తోడనో, రాగి తోడనో పాత్రము నుంచ వలయును.

సర్వబీజైస్తు సంపూర్ణం స్థాపయిత్వా విచక్షణః,

తత్ర శక్త్యాతు సౌవర్ణం వారాహం కారయేద్‌ బుధః.

ఆ కుంభమును అన్ని విత్తనములతో నిండిన దానినిగా జేసి శక్తి ననుసరించి అందు బంగారు వరాహ ప్రతిమను ఉంచ వలయును.

దంష్ట్రాగ్రేణద్ధృతాం పృధ్వీం సపర్వతవనద్రుమామ్‌,

మాధవం మధుహన్తారం వారాహం రూప మాస్థితమ్‌.

సర్వభీజభృతే పాత్రే రత్నగర్భం ఘటోపరి,

స్థాపయేత్‌ పరమం దేవం జాతరూపమయం హరిమ్‌.

కొండలతో, ఆడవులతో, చెట్లతో కూడిన భూమి నంతటిని కోర చివరతో ఎత్తిన వాడును, మధువను రక్కసుని చంపిన వాడును, మాధవుడును, వరాహ రూపమును తాల్చిన వాడును అగు హరిని బంగారు రూపముతో చేసి ఆ బీజము లన్నియు నింపిన పాత్రలపై నిలుప వలయును.

సితవస్త్రయుగచ్ఛన్నం తామ్రపాత్రం తు వై మునే,

స్థాప్యార్చయేద్‌ గన్ధపుజష్పై ర్నైవేద్యై ర్వివిధై శ్శుభైః.

తెల్లని వస్త్రముల జంట కప్పిన రాగి పాత్ర యందు నిలిపి గంధములతో, పూవులతో, పెక్కు విధములగు నైవేద్యములతో అర్చింప వలయును.

పుష్పమండలికాం కృత్వా జాగరం తత్ర కారయేత్‌,

ప్రాదుర్భావాన్‌ హరేస్తత్ర వాచయేద్‌ భావయేద్బుధః.

పూవుల రంగ వల్లిని తీర్చి ఆ రాత్రి అచట జాగరము చేయ వలయును. హరి అవతారములను చదివింప వలయును. భావించు చుండ వలయును.

ఏవం పూజాం విధాయాథ ప్రభాతే ఉదితే రవౌ,

శుచిః స్నాత్వా హరిం పూజ్య బ్రాహ్మణాయ నివేదయేత్‌.

ఈ విధముగా నియమమును పూర్తి చేసి తెల్లవారిన పిదప సూర్యు డుదయించు సమయమున స్నానము చేసి శుచియై హరిని పూజించి ఆ పాత్రను ఉత్తమ బ్రామ్మణునకు సమర్పింప వలయును.

వేదవేదాంగవిదుషే సాధువృత్తాయ ధీమతే,

విష్ణు భక్తాయ విప్రర్షే విశేషేణ ప్రదాపయేత్‌.

వేదములను, వేదాంగములను ఎరిగిన వాడు, మంచి నడవడి కలవాడు, బుద్ధి మంతుడు, విష్ణు భక్తుడునగు విప్రర్షికి విశేషముగా అర్పింప వలయును.

దేవం సకుంభం తం దత్వా హరిం వారాహరూపిణమ్‌,

బ్రాహ్మణాయ భవేద్‌ యద్ధి ఫలం తన్మే నిశామయ.

వరాహ ప్రతిమ రూపమున నున్న హరిదేవుని కుంభముతో పాటు బ్రహ్మణునకు దాన మిచ్చిన కలుగు ఫలమేమో చెప్పెదను వినుము.

ఇహ జన్మని సౌభాగ్యం శ్రీః కాన్తి స్తుష్టి రేవచ,

దరిద్రో విత్తవాన్‌ సద్యః అపుత్రో లభతే సుతమ్‌,

అలక్ష్మీర్నశ్యతే సద్యో లక్ష్మీః సంవిశతే క్షణాత్‌.

ఈ జన్మము నందతనికి సౌభాగ్యము, సంపద, కాంతి, తుష్టి కలుగును. దరిద్రుడు ధనవంతు డగును. కొడుకులు లేనివాడు కుమారుని పొందును. దరిద్ర దేవత వెను వెంటనే నశించును. లక్ష్మి అప్పటి కప్పుడు వచ్చి చేరును.

ఇహజన్మనిసౌభాగ్యం పరలోకే నిశామయ,

అస్మిన్నర్థే పురావృత్త మితిహాసం పురాతనమ్‌.

ఈ జన్మము నందు పర లోకము నందును కలుగు సౌభాగ్యమును గూర్చి ప్రాత కాలపు కథ యొకటి కలదు. వినుము.

ఇహ లోకేభవద్‌ రాజా వీరధన్వేతి విశ్రుతః,

స కదాచిద్‌ వనం ప్రాయాన్‌ మృగహేతోః పరంతపః.

ఈ లోకమున పూర్వము వీర ధన్వుడను రాజుండెడి వాడు. ఆ మహావీరు డొకనాడు వేట కొరకు అడవి కరిగెను.

వ్యాపాదయన్‌ మృగగణాన్‌ తత్రర్షివనమధ్యగః,

జఘాన మృగరూపాన్‌ సోజ్ఞానతో బ్రాహ్మణాన్‌నృపః.

ఆ అడవి యందు మృగముల గుంపులను చంపుచు, అడవి నడుమ తిరుగుచు, మృగ రూపమున నున్న బ్రాహ్మణులను తెలియక ఆ రాజు చంపెను.

భ్రాతర స్తత్ర ప ఞ్చా శన్మృతరూపేణ సంస్థితాః,

సంవర్తస్య సుతా బ్రహ్మన్‌ వేదాధ్యయనతత్పరాః.

అట్లు మృగ రూపమున నున్నవారు సంవర్తుడను వాని పుత్రులు, అన్న దమ్ములు, ఏబది మంది వేద అధ్యయనము నందు నిష్ఠ కలవారు.

సత్యతపుడు:

కారణం కిం సమాశ్రిత్య తే చక్రు ర్మృగరూపతామ్‌,

ఏతన్మే కౌతుకం బ్రహ్మన్‌ ప్రణతస్య ప్రసీద మే.

సత్యతపుడు:

మహర్షీ! వారే కారణమున మృగ రూపమును ధరించిరి? ఇది వినుటకు వేడుక కలదు. మ్రొక్కెదను. నాకు దానిని వినిపింపుము.

దుర్వాసుడు:

తే కదాచిద్‌ వనం యాతా దృష్ట్వా హరిణపోతకాన్‌,

ఏకైకం జగృహుస్తే హి తే మృతాః స్కంధసంస్థితాః.

దుర్వాసుడు:

వారొ కప్పుడు అడవి కరిగిరి. పుట్టి నంతనే తల్లిని కోల్పోయిన లేడి పిల్లలను చూచి ఒక్కొక్క రొక్కొక్క దానిని గ్రహించిరి. బుజముపై నిలుపు కొనగా అవి చని పోయెను.

తతస్తే దుఃఖితాః సర్వే యయుః పితర మన్తికమ్‌,

ఊచుశ్చ వచనం చేదం మృగహింసామృతే మునే.

అంత వారందరు దుఃఖితులై తండ్రి కడ కరిగి మృగహింస చేయని వారు కనుక ఇట్లు పలికిరి.

ఋషి కుమారులు:

జాతమాత్రా మృగాః పఞ్చ అస్మాభి ర్నిహతా మునే,

అకామత స్తతోస్మాకం ప్రాయశ్చిత్తం విధీయతామ్‌.

ఋషి కుమారులు:

మహర్షీ! అప్పుడే పుట్టిన అయిదు లేడి పిల్లలు మా వలన మా నిమిత్తము లేకయే చని పోయినవి. అందు వలన మాకు ప్రాయశ్చితమును విధింపుము.

సంవర్తుడు:

మత్పితా హింసక స్త్వాసీ దహం తస్మా ద్విశేషతః,

భవన్తః పాపకర్మాణః సంజాతా మమ పుత్రకాః.

సంవర్తుడు:

నా తండ్రి హింస చేసిన వాడు. నేనంత కంటెను పాపాత్ముడను. కనుక పాప కర్ములైన మీరు నాకు పుత్రకులై పుట్టిరి.

ఇదానీం మృగచర్మాణి పరిధాయ యతవ్రతాః,

చరధ్వం పఞ్చవర్షాణి తతః శుద్ధా భవిష్యథ.

ఇప్పుడు మృగ చర్మములు ధరించి నియమ జీవితము గడపుచు అయిదేండ్లు తిరుగుడు. మీరు శుద్ధు లగుదురు.

ఏవముక్తాస్తు తే పుత్రా మృగచర్మోపవీతినః,

వనం వివిశు రవ్వగ్రా జపన్తో బ్రహ్మ శాశ్వతమ్‌.

తండ్రి యిట్లు పలుకగా ఆ కొడుకులు మృగ చర్మము ధరించి ఏకాగ్ర చిత్తముతో శాశ్వతమగు బ్రహ్మమును జపించుచు అడవి లోనికి ప్రవేశించిరి.

తథా వర్షే వ్యతిక్రాన్తే వీరధన్వా మహీపతిః,

తత్రాజగామ యస్మింన్తే చరన్తి మృగరూపిణః.

అట్లు ఒక యేడు గడువగా వీరధన్వ మహారాజు వారు లేడి రూపములతో తిరుగు వనమునకు వచ్చెను.

తే చాప్యేక తరో ర్మూలే మృగచర్మోపవీతినః,

జపన్తః సంస్థితా స్తే హి రాజ్ఞా దృష్ట్వా మృగా ఇతి,

మత్వా విద్ధాస్తు యుగప న్మృతాస్తే బ్రహ్మవాదినః.

ఒక చెట్టు మొదట మృగ చర్మములను ధరించి జపము చేసి కొనుచున్న వారిని గాంచి ఆతడు మృగములే యనుకొని కొట్టగా ఆ వేద పారాయణము చేయువారు ఒక్క మారుగా మృతి చెందిరి.

తాన్‌దృష్ట్వా తు మృతాన్‌ రాజా బ్రాహ్మణాన్‌ సంశితవ్రతాన్‌

భయేన వేపమానస్తు దేవరాతాశ్రమం యయౌ,

తత్రా పృచ్ఛద్‌ బ్రహ్మవధ్యా మమాయాతా మహామునే.

చక్కని వ్రతములు గల ఆ బ్రాహ్మణులను మరణించిన వారిని చూచి ఆ రాజు భయముతో వణకి పోవుచు దేవరాతుని ఆశ్రమమున కరిగెను. ఓ మహామునీ! నాకు బ్రహ్మ హత్యా పాతకము కలిగిన దని పలికెను.

ఆమూలం తద్‌ వధం వృత్తం కథయిత్వా నరాధిపః,

భృశం శోకపరీతాత్మా రురోద భృశదుఃఖితః,

ఆ వధ వృత్తాంతము మొదటి నుండియు చెప్పి ఆరాజు పరమ శోకము పైకొనగా పెద్ద పెట్టున ఏడ్చెను.

స ఋషి ర్దేవరాతస్తు రుదన్తం నృపసత్తమమ్‌,

ఉవాచ మాభై ర్నృపతే అపనేష్యామి పాతకమ్‌.

ఆ దేవరాత మహర్షి అట్లు విలపించు చున్న రాజవరుని గాంచి రాజా! భయ పడకుము. నీ పాతకమును నేను తొలగింతును.

పాతాలే సుతలాఖ్యే చ యథా ధాత్రీ నిమజ్జతీ,

ఉద్ధృతా దేవదేవేన విష్ణునా క్రోడమూర్తినా.

సుతలమను పాతాళమున భూధేవి మునిగి పోయి నపుడు దేవుడగు విష్ణువు వరాహ రూపము తాల్చి పైకెత్తి నట్లు నిన్ను ఉద్ధరించెదను.

తద్వద్‌ భవన్తం రాజేన్ద్ర బ్రహ్మవధ్యా పరిప్లుతమ్‌,

ఉద్ధరిష్యతి దేవోసౌ స్వయమేవ జనార్దనః.

బ్రహ్మ హత్య పాపము చుట్టు కొన్న నిన్ను ఆ జనార్దన దేవుడే స్వయముగా ఉద్ధరించును.

ఏవ ముక్త స్తతో రాజా హర్షితో వాక్య మబ్రవీత్‌,

కతరేణ ప్రకారేణ స మే దేవః ప్రసీదతి,

ప్రసన్నే చాశుభం సర్వం యేన నశ్యతి సత్తమ.

ముని యిట్లు పలుకగా ఆ రాజు సంతోషించి, ఏ విధముగా ఆ దేవడు నా యెడ ప్రసన్ను డగును? ప్రసన్నుడై నా పాపము నెట్లు రూపు మాపును? అని అడిగెను.

దుర్వాసుడు:

ఏవముక్తో మునిస్తేన దేవరాత ఇమంవ్రతమ్‌,

ఆచఖ్యౌ సోపి తంకృత్వా భుక్త్వా భోగాన్‌ సుపుష్కలాన్‌.

మృత్యుకాలే మునిశ్రేష్ఠ సౌవర్ణేన విరాజతా,

విమానే నాగమత్‌ స్వర్గ మిన్ద్రలోకం సపార్థివః.

దుర్వాసుడు:

అతడట్లు పలుకగా ఆ దేవరాతు డతనికీ వ్రతము నుపదేశించెను. ఆతడును దానిని చక్కగా నొనరించి పుష్కలము లైన భోగముల నను భవించి అంత్య కాలమున బంగారు విమానముతో ఇంద్ర లోకమగు స్వర్గమున కరిగెను.

తస్యేన్ద్ర స్త్వర్ఘ్య మాదాయ ప్రత్యుత్థానేన నిర్యయౌ,

ఆయాన్త మిన్ద్రం దృష్ట్వాతు తమూచుర్విష్ణు కింకరాః,

న ద్రష్టవ్యో దేవరాజ స్త్వద్ధీన స్తపసా ఇతి.

ఆర్ఘ్యమును గొని దేవరాజు ఆతనికి ఎదురుగా వెడలెను. అట్లు వచ్చు చున్న ఇంద్రుని చూచి విష్ణు కింకరులు, దేవరాజు నిన్ను చూడరాదు. నీకంటె అతడు తక్కువ తపస్సు కలవాడు, అనిరి.

ఏవం సర్వే లోకపాలా నిర్యయు స్తస్య తేజసా,

ప్రత్యాఖ్యాతా శ్చ తైర్విష్ణు కింకరై ర్హీనకర్మణః,

ఏవం స సత్యలోకాంతం గతో రాజా మహామునే.

ఇట్లే లోకపాలు రందరు ఆతని కెదురుగా అరిగిరి. వారి నందరిని విష్ణు కింకరులు మీరందరు హీన కర్ములని కాదనిరి, ఇట్లతడు సత్య లోకము తుది వరకు వెడలెను.

అపునర్మారకే లోకే దాహ ప్రలయ వర్జితే,

అద్యాపి తిష్ఠతే దేవైః స్తూయమానో మహానృపః,

ప్రసన్నే యజ్ఞపురుషే కిం చిత్రం యేన తద్భవేత్‌.

మరల మరణము లేనిది దాహము ప్రళయము దాపు రింపనిది అగు లోకమున ఆ మహారాజు దేవతలు కొనియాడు చుండగా ఈనాటికిని నిలిచి యున్నాడు. యజ్ఞ పురుషుడు ప్రసన్నుడు కాగా ఆతడు అట్టి స్థితి పొందుటలో వింతయేమి?

ఇహ జన్మని సౌభాగ్యమాయు రారోగ్యసంపదః,

ఏకైకా విధినోపాస్తా దదాత్యమృతముత్తమమ్‌.

విధి ననుసరించి చేసిన ఒక్కొక్క వ్రతము కూడ ఈ జన్మమున సౌభాగ్యము, ఆయువు, ఆరోగ్యము, సంపద అను వానిని, పరమున ఉత్తమ మగు అమృత స్థితిని ఒసగును.

కిం పునర్వర్షసంపూర్ణే స దదాతి స్వకం సదమ్‌,

నారాయణ శ్చతుర్మూర్తిః పరార్ధ్యం చ న సంశయః.

నిండు సంవత్సరము పూర్తి యైనచో నాలుగు రూపములు కల నారాయణుడు తన పదము నొసగు ననుటలో సందేహమేమి కలదు?

యధైవోద్ధృతవాన్‌ వేదాన్‌ మత్య్సరూపేణ కేశవః,

క్షీరాంబుధౌ మథ్యమానే మందరం ధృతవాన్‌ ప్రభుః

తద్వచ్చ కూర్మరూపాఖ్యా ద్వితీయా పశ్చవైష్ణవీ.

ఆ కేశవుడు పాల సముద్రము చిలుకు నపుడు చేప రూపుతాల్చి వేదములను పైకి తెచ్చెను. అట్లే ఈ తాబేటి రూపము రెండవ విష్ణు స్వరూపము.

యథా సరాతలాత్‌ క్ష్మాంచ ధృతవాన్‌ పురుషోత్తమః,

వరాహరూపీ తద్వచ్చ తృతీయా పశ్చవైష్ణవీ.

ఆ పురుషోత్తముడు వరాహ రూపము తాల్చి భూమిని పైకెత్తెను. అది మూడవ వైష్ణవ రూపము.