వరాహ మహా పురాణము
అధ్యాయము - 115
శ్రీవరాహ దేవుడు:
మయా ప్రోక్తవిధానేన యస్తు కర్మాణి కారయేత్,
శృణుష్వ త్వం మహాభాగే యేన సాఫల్య మాప్నుయాత్.
శ్రీవరాహ దేవుడు:
పుణ్యురాలా! నేను చెప్పిన తీరున కర్మములు ఆచరించు వాడు ఎట్లు సఫలత్వము పొందునో చెప్పెదను వినుము.
ఏకచిత్తః సమాధాయ అహంకారవివర్జితః,
మచ్చిత్తోపగతో నిత్యం క్షాన్తోదాన్తో జితేన్ద్రియః
చెదరని చిత్తమును కూర్చుకొని అహంకారమును వదలి వైచి, మనస్సును, ఇంద్రియము లను అణచి వైచుకొని నన్నే హృదయ మున నిలుపుకొన వలయును.
ఫలములాని శాకాని ద్వాదశ్యాం వా కదాచన,
పయో వ్రతశ్చ తత్కాలే పునశ్చైవ నివామిషః.
అప్పుడప్పుడు ద్వాదశి యందు దుంపలు, కూరలు తినుచు పాలు త్రాగుట యను వ్రతము నవలంబించి సాత్వికా హారమును భుజింప వలయును.
షష్ఠ్యష్టమీ అమావాస్యా ఉభేపక్షే చతుర్ధశీ,
మైథునం నాభిసేవేత ద్వాదశ్యాం చ తథాప్రియే.
షష్ఠి, అష్టమి, అమావాస్య, రెండు పక్షము లందును చతుర్ధశి, ద్వాదశి అను తిథు లందు మిథున కర్మము జోలికి పోరాదు.
ఏవం యోగవిధానేన కర్మ కుర్యాద్ దృఢవ్రతః,
పూతాత్మా ధర్మసంయుక్తో విష్ణులోకంతు గచ్ఛతి.
ఇట్లు యోగ విధానముతో చెడని వ్రతము కలవాడై కర్మ మాచరించు వాడు పవిత్రమైన హృదయము కలవాడై ధర్మముతో కూడిన వాడై విష్ణు లోకమున కరుగును.
నగ్లాని ర్న జరా తస్య నమోహో రోగ ఏవచ,
భుజాష్టాదశ జాయన్తే ధన్వీ ఖడ్గీ శరీ గదీ.
అతనికి అలసట, ముసలి తనము, మతి చంచలత, రోగము అనునవి కలుగవు. విండ్లు, ఖడ్గములు, శరములు, గదలు గల పదు నెనిమిది భుజములు కలవాడగును.
తేషాం వ్యుష్టిం ప్రవక్ష్యామి మమ కర్మసముత్థితామ్,
షష్టి వర్షసహస్రాణి షష్టివర్షశతాని చ,
మమార్చన విధిం కృత్వా మమలోకే మహీయతే.
నా సంబంధమగు ఈ కర్మము వలన కలుగు ప్రయోజనము చెప్పెదను. ఈ విధముగా నా అర్చన విధి చేసిన వాడు, అరువది వేల ఆరు వందల సంవత్సరములు, నా లోకమున ప్రతిష్ఠ పొందును.
దుఃఖ మేవ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,
ఉచితే నోపచారేణ దుఃఖమోక్ష వినాశనమ్.
వసుంధరా! ఇప్పుడు దుఃఖమును గూర్చి చెప్పెదను. తగు విధములగు ఉప చారములతో పోగొట్టు కొనదగు దుఃఖము లెట్టివో వివరింతును.
అహంకారవృతో నిత్యం నరోమోహేన చావృతః,
యే మాం నైవ ప్రపద్యన్తే తతో దుఃఖతరం ను కిమ్.
ఎల్లప్పుడు అహంకారము పై కొనగా మోహము చుట్టు కొనగా నన్ను శరణు పొందకుండుట కంటె మిక్కిలి దుఃఖమే ముండును?
సర్వాశీ సర్వవిక్రేతా నమస్కారవివర్జితః,
యే చ మాం నప్రపద్యన్తే తతో దుఃఖతరంను కిమ్.
అన్నియు తినువాడు, అన్నింటిని అమ్మువాడు, నమస్కారము మానిన వాడునై నన్ను శరణు పొందని వాడు పొందు దుఃఖము కంటె మించిన దేమి కలదు?
సర్వాన్నానితు సిద్ధాని పాకభేదం తు కారయేత్,
నవైశ్వదేవా నాశ్నన్తి తతో దుఃఖతరం తు కిమ్?
పెక్కు విధములతో పాకములతో అన్ని తీరులగు అన్నము లను సిద్ధ పరచుకొని వైశ్వ దేవము చేయక, తాము తినకుండుట కంటె మించిన దుఃఖ మేది?
ప్రాప్తకాలే వైశ్వదేవే దృష్టమతిథి మాగతమ్,
అదత్వా తస్య యోభుంక్తే తతో దుఃఖతరంను కిమ్.
వైశ్వదేవ సమయమున కాన వచ్చిన అతిథికి పెట్టక తినువాడు పొందు దుఃఖము కంటె మించిన దేది?
అసంతుష్టశ్చ పైశూన్యే పరదారాభిమర్మకః,
పరోపతాపీ మన్దాత్మా తతో దుఃఖతరం నుకిమ్?
తృప్తి నందడు, లోభము నందే నిలుచును. పరుల భార్యలను తాకు చుండును. ఇతరులను బాధించు చుండును. బుద్ధిలేని వాడగును. దీనికి మించిన దుఃఖ మేది?
అకృత్వా పుష్కలం కర్మ గృహే సంపసతే నరః,
మృత్యుకాలవశం ప్రాప్త స్తతో దుఃఖతరం ను కిమ్
ఇంటిలో నివసించుచు పుష్కలముగా మంచి పనులు చేయక చావు దాపురించి నపుడు పొందు దుఃఖము కంటె మించిన దేది?
హస్త్య శ్వరథయానాని గచ్చమానాని పశ్యతి,
న చేత్ తస్యాగ్రతః పృష్ఠే తతో దుఃఖ తరంను కిమ్.
ఒక యేనుగు గాని, గుఱ్ఱము గాని, వాహనము గాని తనకు ముందు వెనుకలుగా పోవు చుండుటను చూడ కుండుట కంటె మించిన దుఃఖమేది?
అశ్నన్తి పిశితం కేచిత్ ఘృతశాలిసమన్వితమ్,
శుష్కాన్నం కేచి దశ్నన్తి తతో దుఃఖతరం సుకిమ్.
కొందరు నెయ్యి, మంచి ధాన్యముతో అలరారు భోజనము మాంసముతో పాటు తినుచుండగా కొందరు సారము లేని కూడు తిను చుందురు. అంత కంటె మిగిలిన దుఃఖమేది?
వరవస్త్రవృతాం శయ్యాం సమాసేవన్తి భూషితామ్,
కేచిత్ తృణేషు శయతే తతో దుఃఖతరం ను కిమ్.
కొందరు మేలిమి వస్త్రములు, భూషణములు గల హంస తూలికా తల్పములపై నిద్రించు చుండగా కొందరు గడ్డి పరకలపై వ్రాలి యుందురు, అంత కంటె దుఃఖ మేముండును?
సురూపో దృశ్యతే కశ్చిత్ పురుష శ్చాత్మకర్మభిః,
కేచిద్ విరూపా దృశ్యన్తే తతో దుఃఖతరం ను కిమ్.
ఒక నరుడు తన పుణ్య కర్మముల చేత పరమ సుందర రూపము కలవాడై యొప్పారును. కొందరు వికృతా కారములతో కాన వత్తురు. అంతకు మించిన దుఃఖమేది?
విద్వాన్ కృతీ గుణజ్ఞశ్చ సర్వశాస్త్ర విశారదః,
కేచి న్మూకాశ్చ దృశ్యన్తే తతో దుఃఖతరంను కిమ్.
విద్వాంసుడు, ప్రయోజనమును సాధించు వాడు, గుణము లెరిగిన వాడు, సర్వ శాస్త్రములలో ఆరితేరిన వాడు నై ఒకడుండగా కొందరు మూగి వారై కాన వత్తురు. దానికి మించిన దుఃఖమేది?
విద్యమానే ధనే కేచిత్ కృపణా భోగవర్జితాః,
దరిద్రో జాయతే దాతా తత్ర దుఃఖతరంను కిమ్.
ధన మున్నను కొందరు పిసిని గొట్టులై భోగములకు దూర మగుదురు. దాత దరిద్రు డగు చుండును. ఇంత కంటె దుఃఖమేది?
పురుషస్యద్వయే భార్యే తాభ్యాం చైకపుమాంస్తదా,
ఏకా పి దుర్భగా తత్ర తతో దుఃఖతరం ను కిమ్.
ఇద్దరు భార్యలు, ఒక్క పురుషుడు. వారిలో ఒకతె నికృష్ట అంత కంటె దుఃఖమేమి?
లబ్ధ్వాతు మానుషీం సంజ్ఞాం పంచభూతసమన్వితామ్,
మామేవ న ప్రపద్యన్తే తతో దుఃఖతరం ను కిమ్.
పంచ భూతములతో ఏర్పడిన మనుష్యత్వ మను స్థితిని పొందియు నన్ను శరణు కోరరు. ఇంతకు మించి దుఃఖమేది?
లబ్ధ్వా బ్రాహ్మణభావంతు వర్ణానా ముత్తమం ధరే,
పాపకర్మరతో యః స్యాత్ తత్ర దుఃఖతరంనుకిమ్.
అన్ని వర్ణములలో ఉత్తమ మైన బ్రాహ్మణ భావమును పొంది పాప కర్మము లందు ఆసక్తి కలిగి యుండుట కంటె మించిన దుఃఖమేది?
ఏతత్ తే కథితం భద్రే దుఃఖకర్మవినిశ్చయమ్,
సర్వభూతహితార్థాయ యత్త్వయా పరిపృచ్ఛితమ్.
మంచిదానా! ఇట్లు నన్ను నీ వడిగిన దుఃఖ కర్మముల నిశ్చయమును గూర్చి సర్వ భూతముల హితమును కోరి చెప్పతిని.
యచ్చ మాం పృచ్ఛసే భద్రే శుభం కీదృశ ముచ్యతే,
తచ్ఛ్రుణుష్వానవద్యాంగి మమ కర్మ వినిశ్చయమ్.
ఓ నిర్మలాంగీ! శుభ కర్మ మెట్టిదని నన్న డిగితివి. చెప్పు చున్నాను. నేను చేయు కర్మ నిర్ణయమును వినుము.
కృత్వా తు విపులం కర్మ మద్భక్తేషు నివేదయేత్,
యస్య బుద్ధ్యా చ జాయేత స సుఖాయోపపద్యతే.
విస్తృతమైన కర్మము నొనరించి నా భక్తుల యందు నివేదింప వలయునను బుద్ధి ఎవనికి కలుగునో వాడు సుఖమును పొందును.
మా మేవ మర్చనంకృత్వా తత్ర ప్రాపణ ముత్తమమ్,
శేష మన్నం సమశ్నాతి తతః సౌఖ్యతరం నుకిమ్
నన్నే అర్చించి అందు నివేదించిన ఉత్తమ మగు మిగిలిన అన్నమును భుజించుట కంటె మించిన సుఖమేది?
త్రికాలం యే ప్రపద్యన్తే మామేచ చ వసుంధరే,
కృత్వా సాయాహ్నికం కర్మ తతః సౌఖ్యతరంను కిమ్.
మూడు కాలములలో నన్నే శరణు పొంది సాయంకాలము చేయు సంధ్యా వందనము చేయుట కంటె సుఖమేది?
దేవతాతిథి మర్త్యానాం దత్వా చాన్నం వసుంధరే,
పశ్చాత్ స వై సమశ్నాతి తతః సౌఖ్యతరంను కిమ్.
దేవతలకు, అతిథులకు, మనుజులకు అన్న మొసగి మిగిలిన అన్నమును తరువాత తిను వాని కంటె సుఖవంతు డెవ్వడు?
ప్రవిష్ట స్త్వతిథిర్యస్య నిరాశో యన్న గచ్ఛతి,
యేన కేనచిద్తత్తేన తతః సౌఖ్యతరంను కిమ్.
తన యింటికి అతిథి రాగా ఏదో కొంత ఆతని కిచ్చి ఆతనిని నిరాశునిగా పంప కుండుట కంటె సౌఖ్యతర మేముండును?
మాసి మాస్యేకదిపస మమావాస్యేతి యోచ్యతే,
పితరో యస్య తృప్యన్తి తతః సౌఖ్యతరంను కిమ్.
నెల నెల అమావాస్య నాడు ఎవని పితరులు తర్పణములు పొందుదురో అంతకు మించిన సుఖమేమి కలదు?
భోజనేషు ప్రపన్నేషు యవాన్నం యః ప్రయచ్ఛతి,
అభిన్నముఖరాగేణ తతః సౌఖ్యతరంను కిమ్?
భోజనములకు వచ్చిన వారికి ముఖములో ఏ భేదము లేని అనురాగ భావముతో యవాన్న మిడుట కంటె సౌఖ్యము ఏముండును?
ఉభయో రపి భార్యాసు యస్య బుద్ధి ర్న నశ్యతి,
సమం పశ్యతి యో దేవి తతః సౌఖ్యతరం సుకిమ్.
ఇద్దరు, లేక ఇంకను మించిన సంఖ్యతో భార్యలు న్నపుడు బుద్ధి నశింపక సమముగా ఎవడు చూడ గలడో అంతకు మించిన సుఖమే ముండును?
అహింసనం తు కుర్వీత విశుద్ధే నాంతరాత్మనా,
అహింసోపరతః శుద్ధః ససుఖా యోపపద్యతే.
విశుద్ధమగు అంతరాత్మతో అహింసను పాటింప వలయును. అట్లు అహింసచే ఆనంద పడు శుద్ధుడు సుఖము పొందును.
పరభార్యాసు రూపాసు మనో దృష్ట్వా నచాల్యతే,
యస్య చిత్తం నగచ్ఛేత తతః సౌఖ్యతరం నుకిమ్.
సుందర రూపము గల ఇతరుల భార్యలను చూచి ఎవని మనస్సు చలింపదో, ఎవని మనస్సు వారి యందు ప్రవర్తింపదో వాని కంటె సుఖము కల వాడెవ్వడు?
మౌక్తికాదీని రత్నాని తథైవ కనకాదయః,
లోష్ఠవత్ పశ్యతే యస్తు తతః సౌఖ్యతరంను కిమ్.
ముత్యములు, రత్నములు, సువర్ణా భరణములు మొదలగు వానిని మట్టి ముద్దల వలె చూడ గలిగిన దాని కంటె మించిన సుఖమేది?
ముదితే చాశ్వనాగేన్ద్రే ఉభేసైన్యే పథి స్థితే,
యస్తు ప్రాణాన్ ప్రముచ్యేత తతః సౌఖ్యతరంను కిమ్.
గుఱ్ఱములు, ఏనుగులు గల రెండు సైన్యములు తన దారి యందు ఆనందముతో నుండగా ప్రాణములు కోల్పోయిన వారు పొందు సుఖము కంటె మించినది ఏమి కలదు?
లబ్ధేన చాప్యలబ్ధేన కుత్సితం కర్మవర్జితమ్,
యస్తు జీవతి సంతుష్టః ససుఖాయోపపద్యతే.
కుత్సితమైన పనిని చేపట్టక లాభ నష్టములకు వగవక సంతృప్తితో జీవించుట కంటె మించిన సుఖ మేముండును?
భర్తుస్తు వై వ్రతం స్త్రీణా మేవ మేవ వసుంధరే,
యేన తుష్యతి భర్తారం తతస్సౌఖ్యతరం నుకిమ్.
వసుంధరా! స్త్రీల విషయములలో భర్త కిదియే వ్రతము. తన వలన ఆమె సంతోషము పొంద వలయును. ఇంత కంటె సుఖమేమి?
విద్యతే విభవేనాపి పురుషో యస్తు పణ్డితః,
నిగృహీ తేన్ధ్రియః పఞ్చ తత్ర సౌఖ్యతరం నుకిమ్.
ఐశ్వర్యము సమగ్రముగా నుండినను పండితుడై పురుషుడు అయిదు ఇంద్రియములను నిలువరించి యుండు వాడైనచో అంత కంటె సుఖమే ముండును?
సహతే చావమానంతు వ్యసనే నతు దుర్మనాః,
యుస్యేదం విదితం సర్వం తతః సౌఖ్యతరం నుకిమ్.
అవమానమును సహించును. కష్టము నందు మనసు వికలము కాదు. ఇట్టి స్పష్టముగా తెలిసిన ప్రవర్తన కలవాని కంటె సుఖవంతు డెవ్వడు?
అకామో వా సకామో వా మమ క్షేత్రే వసుంధరే,
యస్తు ప్రాణాన్ ప్రముచ్యేత తతః సౌఖ్యతరం నుకిమ్
కోరియో కోరకయో నా పుణ్య స్థలమున ప్రాణము విడుచుట కంటె మించిన సుఖము ఏమండును?
మాతరం పితరం చైవ యః సదా పూజయే న్నరః,
దేవతే వ సదా పశ్యేత్ తతః సౌఖ్యతరం సుకిమ్.
తల్లిని తండ్రిని దేవత వలె సర్వ కాలములలో పూజించుట కంటె మించిన సుఖ మేముండును?
ఋతుకాలేచ యో గచ్ఛే న్మాసేమాసేతు మైథునమ్,
అనన్యమానసో భూత్వా తతః సౌఖ్యతరం నుకిమ్.
ప్రతి మాసము నందును ఋతు కాలము నందే మిథున కర్మమును, ఇతర వ్యక్తులందు మనసు పెట్టక, ఆచరించుట కంటె మించిన సుఖమేమి కలదు?
ప్రయుక్తః సర్వదేవానాం యో మామేవం ప్రపూజయేత్,
తస్యాహం నప్రణశ్యామి స చమే న ప్రణశ్యతి
నన్నెట్లు చక్కగా పూజించునో అట్లే సర్వ దేవతల యందును శ్రద్ధ కలవాడై పూజించు వానికి నేను దూరము కాను. ఆతడు నా విషయమున చెడడు.
ఏతత్ తే కథితం భద్రే శుభాశుభ వినిశ్చయః,
సర్వలోకహితార్థాయ యన్మాం త్వం పరిపృచ్ఛసి.
శుభశీలా! ఈ విధముగా అన్ని లోకముల మేలును గోరి నీవు నన్నడిగిన శుభాశుభముల వినిశ్చయమును నీకెరిగించితిని.