అధ్యాయము - 119

శ్రీవరాహ దేవుడు:

శృణుష్వ పరమం గుహ్యం యత్‌ త్వయాపూర్వపృచ్ఛితమ్‌,

దేవి సర్వం ప్రవక్ష్యామి సంసారతరణం మహత్‌.

శ్రీవరాహ దేవుడు:

దేవీ! నీవు నన్నింతకు ముందడిగిన సంసార తరణమును గూర్చి మిక్కిలి రహస్యమగు దానిని చెప్పెదను వినుము.

స్నానం కృత్వా యథాన్యాయం మమ కర్మపరాయణాః,

ఉపసర్పన్తి మేభక్త్యా కదన్నాశా జితేన్ద్రియాః.

నా పనుల యందు పరమ శ్రద్ధ కలవారు, విధి నను సరించి స్నాన మాచరించి చెడ్డ కూడు తిను వారయ్యు ఇంద్రియ నిగ్రహము కలవారై నాకడ కరు దెంతురు.

యచ్చైవ ముచ్యతే భద్రే మమ రూపం సనాతనమ్‌,

అహమేవ వరారోహే సర్వభూతం సనాతనమ్‌.

సుందరీ! నా సనాతనమగు రూపమేది చెప్ప బడుచున్నదో అదియే సర్వము సనాతనము అయిన నేను.

అధశ్చోర్ధ్వం చ యశ్చైవ అహమేవ వ్యవస్థితః,

దిశాంచ విదిశాం చైవ అధశ్చోర్ధ్వం చ భావిని

క్రింది వైపు, పై వైపు, అన్ని దిక్కులలో క్రిందు మీదు లందును నెలకొని ఉన్న వాడను నేనే.

సర్వదా వన్దనీయా స్తే మమ భక్తేన నిత్యశః,

క్రియాయుక్త సమూహేన యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌

కావున నా భక్తుడు పరమ గతిని కోరు వాడైనచో అన్ని విధముల అందరిని అన్నింటిని పూజాదికార్య సముదాయము చేత నమస్కరింప వలయును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి గుహ్యం లోకే మహద్యశః,

యదావై వన్దనీయా స్తే మమ మార్గానుసారిణః.

నా మార్గము ననుసరించు వారిని ఎట్లు వందనము చేయ వలయునో ఆ రహస్యమును, గొప్ప కీర్తికల దానిని కూడ నీకు తెలిపెదను

కృత్వాపి పరమం కర్మ బుద్ధి మాదాయ తద్విధామ్‌,

తతః పూర్వముఖో భూత్వా శుచి ర్గృహ్య జలాంజలిమ్‌,

మూలయోగం సమాదాయ ఇమం మన్త్ర ముదీరయేత్‌.

పరమమైన అర్చనను గావించి, ఆ విధమైన బుద్ధిని నిలుపుకొని తూర్పునకు మోగముంచి పరిశుద్ధుడై దోసిలితో నీటిని గ్రహించి మూల యోగమును చక్కగా చేసికొని ఈ మంత్రమును పలుక వలయును (మూల యోగము అన్నింటికి మూలమగు మనస్సును పరమాత్మతో కలుపుట)

యజామహే ధర్మపరాయణోద్భవం నారాయణం ప్రసీదేశాన,

సర్వలోక ప్రధానం పురాణం కృపాసంసారమోక్షణమ్‌.

ధర్మమును పరమ గతికి కారణమైన వాడు, సర్వలోక ప్రధానుడు, పురాణుడు, కృపతో భక్తుల సంసారమును పటాపంచలు చేయువాడు నగు శ్రీనారాయణుని పూజింతుము. ఈశ్వరా! ప్రసన్నుడవు కమ్ము.

తతః పశ్చాన్ముఖోభూత్వా పునర్గృహ్య జలాంజలిమ్‌,

ఓంనమోనారాయణేత్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌.

మరల పడమటి వైపు మొగము పెట్టి దోసిలి లోనికి నీటిని గ్రహించి ‘ఓం నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

మంత్రము:

యదాను దేవః ప్రథమాదికర్తా పురాణకల్పం చ యథా విభూతిః

దివి స్థితా చాది మనన్తరూప మమోఘమోఘం సంసారమోక్షణమ్‌.

మంత్రము:

ఆది దేవుడు మొదటి సృష్టి కర్త. సనాతనుడు సర్వ ఐశ్వర్య రూపుడు. స్వర్గమున నున్నవాడు. సర్వమునకు మొదటి వాడు. అనంతమైన రూపములు కలవాడు. ఎందును ఎదురు లేని వాడు. సంసారము నుండి ముక్తి నొసగు వాడు.

అధ తస్మింస్తు కాలేస్మిన్‌ పునర్గృహ్య జలాంజలిమ్‌,

తేన చైవాస్య యోగేన భూత్వా చైవోత్తరాముఖః,

నమోనారాయణేత్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌.

అటు పిదప మరల నీటి దోసిలిని గ్రహించి అదే యోగముతో ఉత్తరము వైపు ముఖము ఉంచి ‘ఓం నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

మంత్రము:

యజామహే దివ్యపరం పురాణ మనాది

మధ్యాంతమనంత రూపమ్‌. భవోద్బవం సంసార మోక్షణమ్‌.

మంత్రము:

దివ్యుడు, పరుడు, పురాణుడు, ఆది మధ్యాంతములు లేనివాడు, అనంతము లైన రూపములు గలవాడు, సంసారము నుండి విడుదల కలిగించు వాడునగు దేవుని అర్చింతుము.

తతస్తేనైవ కాలేన భూత్వా వై దక్షిణాముఖః,

నమః పురుషోత్తమాయేత్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌

వెను వెంటనే దక్షిణమునకు మొగము పెట్టి ‘ఓం నమః పురుషోత్తమాయ’ అని పలికి మంత్రమును చదువ వలయును.

మంత్రము:

యజామహే యజ్ఞమహో రూపజ్ఞం కాలంచకాలాదిక

మప్రయేయమ్‌. అనన్యరూపం సంసారమోక్షణమ్‌.

మంత్రము:

యజ్ఞ రూపుడు, రూపములు నెరిగిన వాడు, కాల స్వరూపుడు, కాలమునకు మొదటి వాడు, ఊహింప రానివాడు, అనన్యమగు రూపము కలవాడు, సంసారమును రూపు మాపు వాడునగు స్వామిని పూజింతుము.

కాష్ఠకృత్యస్తతో భూత్వా కృత్వా చేన్ద్రియనిగ్రహమ్‌,

అచ్యుతే తు మనఃకృత్వా ఇమం మన్త్రముదాహరేత్‌.

పిదప సమిధల పని ముగించి ఇంద్రియ నిగ్రహము కలవాడై అచ్యుతుని యందు మనస్సును నిలిపి ఈ క్రింది మంత్రమును చదువ వలయును.

మంత్రము:

యజామహే సోమపథేన భావే త్రిసప్తలోకనాథమ్‌,

జగత్ర్పదానం మృత్యురూపం సంసారమోక్షణమ్‌.

మంత్రము:

మూడేడు లోకములకు నాథుడు, సోమ మార్గమున (యజ్ఞ పద్ధతి యందు) నిలిచి యుండు వాడు, జగత్తునకు ప్రధానుడు, మృత్యు రూపుడు అయి సంసారమును రూపు మాపు దేవుని యజింతుము.

ఏతేషాం త్రిషు సంధ్యాసు కర్మచైవం సమాచరేత్‌,

బుద్ధిమాన్‌ మతిమాన్‌ భూత్వా యదీచ్ఛేత్‌ పరమాంగతిమ్‌

ఈ తీరుగా బుద్ధియు ప్రజ్ఞయు గల భక్తుడు, పరమ గతిని కోరు వాడైనచో ఈ పూజా విధానములు మూడు సంధ్యల యందును భక్తితో చేయ వలయును.

యోగానాం పరమో యోగో గుహ్యానాం గుహ్యముత్తమమ్‌,

సాంఖ్యానాం పరమం సాంఖ్యం కర్మణాం కర్మచోత్తమమ్‌

ఇది యోగములలో పరమ యోగము, రహస్యములలో ఉత్తమ రహస్యము. జ్ఞాన మార్గములలో పరమ సాంఖ్యము. కర్మములతో ఉత్తమ కర్మము.

ఏతన్నదద్యా న్మూర్ఖాయ పిశునాయ శఠాయచ,

దీక్షితాయైవ దాతవ్యం సుశిష్యాయ దృఢాయ చ.

ఈ యోగమును మూర్ఖునకు, పిసిని గొట్టునకు, మొండి వానికి ఒసగ రాదు. ఉత్తమ శిష్యుడు, గట్టి గుండె నిబ్బరము కలవాడు నగు దీక్షితునకు మాత్రమే ఒసగ వలయును.

ఏతన్మరణకాలేపి గుహ్యం విష్ణుప్రభాషితమ్‌,

బుద్ధిమాన్‌ మతిమాన్‌ భూత్వా విస్మరేన్న కదాచన.

శ్రీమహా విష్ణువు ఉపదేశించిన ఈ రహస్యమును బుద్ధి ప్రజ్ఞలు గల వాడై భక్తుడు చావు దాపురించి నపుడును మరువ రాదు.

య ఏతత్‌ పఠతే నిత్యం కల్యోత్థాయ దృఢవ్రతః,

మమాపి హృదయే నిత్యం స్థితః సత్త్వగుణాన్వితః.

ప్రతి దినము ప్రాతః కాలమున నిద్ర లేచి ఏ మాత్రము చెదరని వ్రతము కలవాడై దీనిని పఠించు వాడు సత్త్వ గుణముతో కూడిన వాడై నా హృదయమున శాశ్వతముగా నిలుచును.

య ఏతేన విధానేన త్రిసంధ్యం కర్మ కారయేత్‌,

తిర్యగ్యోన్యాపి సంప్రాప్య మమ లోకాయ గచ్ఛతి.

ఈ విధానముతో మూడు సంధ్యల యందును కర్మము నాచరించు వాడు పశు పక్ష్యాదుల కడుపున పుట్టినను నా లోకమున కరుగును.