వరాహ మహా పురాణము
అధ్యాయము - 106
హోత:
నవనీతమయీం ధేనుం శృణు రాజన్ ప్రయత్నతః,
యాం శ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః.
హోత:
రాజా! వెన్న ఆవును గూర్చి శ్రద్ధతో వినుము. దానిని విని మానవుడు సర్వ పాపముల నుండియు ముక్తుడగును. సంశయము లేదు.
గోమయే నామ లిప్తాయాం భూమౌ గోచర్మ మానతః
తత్రో పరి కృష్ణమృగస్య చర్మ ప్రసారితం నవనీతస్య కుంభమ్,
సంస్థాపయేత ప్రయతో మనుష్యో వత్సం తథా తస్య చతుర్థభాగే.
గోమయముతో అలికిన భూమిపై గోచర్మపు కొలతలో నల్ల జింక చర్మమును పరచి వెన్న కుండను శ్రద్ధతో నుంచ వలయును. అందు నాల్గవ భాగముతో దూడను చేయ వలయును.
కృత్వా విధానేన చ రాజసింహ, సువర్ణశృంగా సుముఖా చ కార్యా.
నేత్రే చ తస్యా మణిమౌక్తికాని కృత్వా తథాస్యంచ గుడేన తస్యాః,
జిహ్వాం తథా శర్కరయా ప్రకల్ప్య ఫలాని దన్తాః కంబలం పట్టసూత్రమ్.
శాస్త్రము ననుసరించి బంగారు కొమ్ములు, ముఖమును కూర్ప వలయును. మణులతో ముత్యములతో కనులను, బెల్లముతో నోటిని, చెక్కెరతో నాలుకను, పండ్లతో దంతములను, పట్టు వస్త్రముతో గంగడోలును చేయ వలయును.
నవనీతస్తనీం రాజ న్నిక్షుపాదాం ప్రకల్పయేత్,
తామ్రపృష్ఠాం సూత్రపుచ్ఛాం దర్భరోమకృతచ్ఛవిమ్.
స్వర్గశృజ్గాం రౌప్యఖురాం పఞ్చరత్న సమన్వితామ్,
చతుర్భి స్తిలపాత్రైశ్చ సంయతాం సర్వతో దిశః.
వెన్నతో పొదుగును, చెరకులతో కాళ్లను, రాగితో పిరుదు భాగమును, త్రాటితో తోకను, దర్భలతో రోమములను బంగారుతో కొమ్ములను, వెండి గిట్టలను అమర్చి దానిని అయిదు రత్నములతో కూర్ప వలయును. అన్ని దిక్కులలో నాలుగు తిల పాత్రలను ఉంచ వలయును.
ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన గంధపుష్పై రలంకృతామ్,
దిగ్భ్యోదీపాంశ్చ ప్రజ్వాల్య బ్రాహ్మణాయ నివేదయేత్.
జమిలి వస్త్రములతో కప్పి గంధ పుష్పములతో అలంకరించి అన్ని వైపుల దీపములను వెలిగించి బ్రాహ్మణునకు సమర్పింప వలయును.
వేదవేదాంగవిదుషే ఆహితాగ్నే జితాత్మనే,
మన్త్రాస్త ఏవ జప్తవ్యాః సర్వధేనుషు యేస్మృతాః.
ఆతడు వేద వేదాంగములను అధ్యయనము చేసిన వాడు. ఆహితాగ్ని, జితేంద్రియుడు కావలయును. తక్కిన ధేనువుల విషయములో చెప్పిన మంత్రములనే యిచటను చదువ వలయును.
పురా దేవాసురైః సర్వైః సాగరస్య తు మన్థనే,
ఉత్పన్నం దివ్య మమృతం నవనీత మిదం శుభమ్,
ఆప్యాయనం తు భూతానాం నవనీత నమోస్తుతే.
మునుపు దేవ దానవులు సాగరమును చిలికి నపుడు దివ్యమగు అమృతముగా ఈ నవనీతము వెలు వడినది. శుభమైనది. సర్వ భూతములకు ప్రీతి కలిగించు నది. అట్టి ఓ నవనీతమా! నీకు నమస్కారము.
ఏవ ముచ్చార్య తాం దద్యాద్ బ్రాహ్మణాయ కుటుంభినే,
ధేనుంచ దత్వా సువ్రతాం సోపధానం నయేద్ గృహమ్.
ఇట్లు పలికి కుటుంబము గల బ్రాహ్మణునకు మంచి లక్షణములు గల వస్తువులతో పాటుగ ఇచ్చి వాని యింటికి చేర్ప వలయును.
విప్రవర్యస్య భూపాల హవిష్యమన్నం సరసంచైవ,
భుక్త్వా తిష్ఠేద్ దినం ధేనుద స్త్రీణి విప్రః.
విప్రవర్యునకు హవిష్యమగు సరసమైన అన్నమును పెట్ట వలయును. ధేనువు నిచ్చు వాడు ఒక దినము పుచ్చు కొన్నవాడు మూడు దినములు ఆ భోజనమే చేసి యుండ వలయును.
యః ప్రపశ్యతి తాం ధేనుం దీయమానాం నరోత్తమ.
సర్వపాపవినిర్ముక్తః శివసాయుజ్యతాం ప్రజేత్.
అట్లు ఈబడు చున్న గోవును చూచిన వాడు సర్వ పాపములను పాపుకొని శివ సాయుజ్యమును పొందును.
పితృభిః పూర్వజైః సార్ధం భవిష్యద్భి శ్చ మానవః.
విష్ణులోకం వ్రజత్యాశు యావదాభూత సంప్లవమ్.
వెనుక ముందు తరముల పితృ దేవతలతో పాటు ప్రళయ కాలము వరకు విష్ణు లోకమున నివసించుచు.
య ఇదం శృణుయాద్ భక్త్యా శ్రవయేద్ వాపి మానవః.
సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకే మహీయతే.
దీనిని వినువాడు వినిపించు వాడునగు మానవుడు సర్వ పాపముల నుండియు విశుద్ధుడై విష్ణు లోకమున ప్రతిష్ఠ గాంచును.