అధ్యాయము - 17

ధరణి:

యేతే మణౌ సరాదేవ ఉత్పన్నా నరపుంగవాః,

తేషాం వరో భగవతా దత్త స్త్రేతాయుగేకిల.

రాజానో భవితారో వై కథం తేషాం సముద్భవః,

కించి చక్రుర్హి తే కర్మ పృథఙ్‌ నామాని శంస మే.

ధరణి:

ప్రభూ! త్రేతా యుగమున ఆ మణి వలన పుట్టిన నరవరు లున్నారే, వారికి భగవంతుడు, మీరు రాజులగు దురని వర మొసగెను గదా! వారి జన్మ మెట్టిది? వారేమి కావించిరి? వారి పేరు లేమి? నాకు తెలియ జెప్పుము.

శ్రీవరాహ దేవుడు:

సుప్రభో మణిజో యస్తు రాజానామ మహామనాః,

తస్యోత్పత్తిం వరారోహే శృణు త్వం భూతధారిణి.

శ్రీవరాహ దేవుడు:

మణి వలన పుట్టిన సుప్రభుడు మహామనుడను రాజాయెను. భూతధాత్రీ! ఆతని పుట్టుకను గూర్చి చెప్పెదను, వినుము.

ఆసీద్రాజా మహాబాహు రాదౌ కృతయుగే పురా,

శ్రుతకీర్తి రితి ఖ్యాత స్త్రైలోక్యే బలవత్తరః.

తొల్లి మొదటి కృత యుగమున శ్రుతకీర్తి యని కీర్తి గన్న మహాబాహు వగు రాజుండెను. ఆతడు ముల్లోకములలో గొప్ప బలము కలవాడు.

తస్య పుత్రత్వ మాపేదే సుప్రభో మణిజో ధరే,

ప్రజాపాలేతి వైనామ్నా శ్రుతకీర్తి ర్మహాబలః.

మణి వలన పుట్టిన సుప్రభుడు ఆ రాజునకు పుత్రుడాయెను. గొప్ప కీర్తియు, మిక్కుటమగు బలమును గల ఆతని పేరు ప్రజాపాలుడు.

స ఏకస్మిన్‌ దినే ప్రాయాద్‌ గహనం శ్వాపదాకులమ్‌,

తత్రాపశ్యదృషే ర్ధన్యం మహదాశ్రమ మండలమ్‌.

అతడొక నాడు క్రూర మృగములతో నిండిన ఘోరాటవి కరిగెను. అందు పవిత్రమగు ఋష్యాశ్రమమును గాంచెను.

తస్మిన్‌ మహాతపానామ ఋషిః పరమధార్మికః,

తపస్తేపే నిరాహారో జపన్‌ బ్రహ్మ సనాతనమ్‌.

ఆ ఆశ్రమమున పరమ ధార్మికుడగు మహా తపుడను ఋషి అన్నపానములు వదలి సనాతనమగు బ్రహ్మమును జపించుచు తప మొనర్చు చుండెను.

తత్రాసౌ పార్థివః శ్రీమాన్‌ ప్రవేశాయ మతిం తదా,

చకార చావిశద్రాజా ప్రజాపాలో మహాతపాః.

శుభ సంపదలు గల ఈ రాజు ఆ ఆశ్రమమును ప్రవేశింప గోరెను. మహా తపస్సు గల ఆ ప్రజాపాలు డందు ప్రవేశించెను.

తస్మిన్‌ వరాశ్రమపదే వనవృక్షజాత్యా ధరాప్రశస్తోర్జిత మార్గజుష్టాః,

లతాగృహా ఇన్దురివ ప్రకాశినో నాయాసజ్ఞా యత్ర యాతా హి భృంగాః.

ఉత్తమ మగు ఆ ఆశ్రమము నందు శ్రేష్ఠమగు వృక్ష జాతులు భూమి యందలి ప్రశస్తములగు మార్గములను క్రమ్మి యుండినవి. లతా గృహములు చంద్రుని వలె ప్రకాశించు చున్నవి. అందు ప్రవేశించిన తుమ్మెదలు ఆయాసము నెరుగ కున్నవి.

సురక్త పద్మోదర కోమలాగ్ర నఖంగుళీభిః ప్రసృతైః సురాణామ్‌,

వరాంగనాభిః పదపంకి ముచ్చై ర్విహాయ భూమిం త్వపి వృత్రశత్రోః.

ఆ ఆశ్రమ స్థానమున దేవ కాంతల పాద పంక్తులు కానవచ్చు చున్నవి. ఆ దేవ కాంతల కాలి గోళ్లు మంచి ఎరుపు వన్నె తిరిగిన పద్మముల లోపలి కాంతుల వంటి కాంతులతో విరాజిల్లు చున్నవి. వారు ఈ ఆశ్రమము నందలి ప్రీతితో దేవ భూమిని కూడ వదలి వచ్చిరి.

క్వచిత్సమీపే తమతీవ హృష్టై ర్నానాద్విజైః షట్చరణౖశ్చ మత్తైః,

వాసద్భి రుచ్చై ర్వివిధ ప్రమాణాః శాఖాః సుపుష్పాః సమయోగయుక్తాః.

మరియు ఆ ఆశ్రమ పరిసరములలో వేరువేరు ప్రమాణములు గలవియు, మంచి పూవులు గలవియు ఎత్తైనవియు నగు వృక్షములు గలవు. వానిపై పెక్కు విధములగు పక్షులు, మత్తెక్కిన తుమ్మెదలు ఆనందము నిండిన హృదయములతో అలరారు చున్నవి.

కదంబ నీపార్జున శీలశాల లతా గృహస్థై ర్మధురస్వరేణ,

జుష్టా విహంగైః సుజన ప్రయోగా నిరాకులా కార్యధృతి ర్యథా స్థైః.

కడిమి, మంకెన, అర్జునము, శీలము, సాలము మొదలగు చెట్ల యందు, పూపొదరిండ్ల యందను ఉన్న పక్షుల కమ్మని రావములతో నిండినదై సుజనులు ప్రయోగించి నదియు, ఎట్టి చిక్కులు లేనిదియు నగు కార్య భారము కలదియో యన్నట్లు విరాజిల్లెను.

మఖాగ్నిధూమై రుదితాగ్ని హోమైస్తత స్సమన్తాద్‌ గృహమేధిభిర్ద్విజైః,

సింహై రివాధర్మకరీ విదారితః సుతీక్షదంష్టై ర్వరమత్తకేసరైః.

అందు గృహస్థులగు బ్రాహ్మణులు చేయుచున్న యజ్ఞముల నుండి వెలువడు చున్న ధూమములు, అగ్ని హోత్రములు, వాడి కోరలు, మేలైన జూలు గల సింహముల వలె అధర్మమను ఏనుగును చీల్చి చెండాడు చున్నవి.

ఏవం స రాజా వివిధా నుపాయాన్‌ వరాశ్రమే ప్రేక్షమాణో వివేశ,

తస్మిన్‌ప్రవిష్టేతు స తీవ్రతేజా మహాతపాః పుణ్యకృతాం ప్రధానః,

దృష్టో యథా భాను రనంతభానుః కౌశ్యాసనే బ్రహ్మవిదాం ప్రధానః.

ఇట్లా రాజు ఆ శ్రేష్ఠమగు ఆశ్రమమున పెక్కు వింతలను చూచుచు ప్రవేశించెను. అట్లు ప్రవేశించు చునే అందు తీవ్రమగు తేజస్సుతో అలరారు చున్న వాడును, అంతు లేని కిరణములు గల సూర్యుని వలె వెలుగొందు చున్న వాడును, పుణ్యాత్ములలో ముఖ్యుడును, బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడును దర్భాసనమున కూర్చున్న వాడును అగు మహా తపో మహర్షిని గాంచెను.

దృష్ట్వా సరాజా విజయే మృగాణాం మతిం విసస్మార మునేః ప్రసంగాత్‌,

చకార ధర్మం ప్రతి మానసం స అనుత్తమం చా ప్రతిమం మునిం సః.

ఆ మహర్షిని చూచి నంతనే ఆ రాజు మృగములను వశ పరచు కొనుట యను పనిని మరచి పోయెను. ముని ప్రసంగము వలన ఆతని మానసము ధర్మముపై నిలిచి పోయెను. సర్వ శ్రేష్ఠుడు, సాటిలేని వాడునగు ఆ మునిని గాంచిన ఆరాజు అట్టి మనస్థితిని పొందెను.

స ముని స్తన్నృపం దృష్ట్వా ప్రజాపాల మకల్మషమ్‌,

అభ్యాగత క్రియాం చక్రే ఆసనస్వాగతాదిభిః.

ఆ మునియు ఎట్టి దోషము నెరుగని ప్రజాపాల మహారాజును గాంచి, ఆసన మొసగుట, స్వాగతము పలుకుట మొదలగు సత్కారములతో ఆతనికి అతిథి మర్యాదలు సలిపెను.

తతః కృతాసనో రాజా ప్రణమ్య ఋషిపుంగవమ్‌,

పప్రచ్ఛ వసుధే ప్రశ్న మిమం పరమదుర్లభమ్‌.

అంత నా రాజు ఆ ఋషి వరునకు ప్రణమిల్లి ఆసనమున కూర్చుండి పరమ దుర్లభగు ప్రశ్న నిట్లడిగెను.

భగవన్‌ దుఃఖసంసారమగ్నైః పుంభి ర్జిగీషుభిః,

యత్కార్యం తన్మమాచక్ష్వ ప్రణతే శంసితవ్రత.

స్వామీ! దుఃఖములతో నిండిన సంసారమున మునిగిన వారు, దానిని గెలువ గోరు వారునగు పురుషులు చేయ దగినదేమో నాకు తెలియ జేయుము. నీకు మ్రొక్కుదును.

మహా తపోముని:

సంసారార్ణవమజ్జమాన మనుజైః పోతః స్థిరోతిధ్రువః,

కార్యః పూజన హోమదానవివిధైర్యజ్ఞైః సమంధ్యాయనైః,

కీలైః కీలితమోక్షభిః సురభటై రూర్ధ్వే మహారజ్జుభిః

ప్రాణాద్యై రధునా కురుష్వ నృపతే పోతం త్రిలోకేశ్వరమ్‌.

మహా తపోముని:

సంసారమను సముద్రమున మునుగు చున్న నరులు చెదరనిదియు, మిక్కిలి గట్టిది యునగు ఒక తెప్పను చేసికొన వలయును. పూజలు, హోమములు, దానములు, యజ్ఞములు, ధ్యానములు దానికి కీలలు. చక్కగా నాటుకొన్న మోక్షము గల దేవ భటులు ప్రాణములు మొదలగు త్రాళ్లతో అట్టి నరులను పైకి లాగుదురు. రాజా! నీవు త్రిలోక ప్రభువునే ఇపుడు తెప్పగా చేసి కొనుము.

నారాయణం నరకహరం సురేశం భక్త్యా నమస్కుర్వతి యో నృపేశ,

స వీతశోకః పరమం విశోకం ప్రాప్నోతి విష్ణోః పద మవ్యయం తత్‌.

నరకమును రూపుమాపు వాడు, దేవ దేవుడు అగు నారాయణునకు నమస్కరించు వాడు సంసార దుఃఖమును బోనాడి పరమము, దుఃఖ వాసన యైన లేనిదియు నగు శ్రీమహా విష్ణువు యొక్క అవ్యయ పదము నందు కొనును. (అవ్యయము = ఎట్టి కాలము నందును, ఏ దశ యందును చెడనిది)

రాజు:

భగవన్‌ సర్మధర్మజ్ఞ కథం విష్ణుః సనాతనః,

పూజ్యతే మోక్షమిచ్ఛద్భిః పురుషై ర్వద తత్త్వతః.

రాజు:

సర్వ ధర్మములు చక్కగా నెఱిగిన మహానుభావా! సనాతనుడైన విష్ణువును మోక్షము పొందగోరు పురుషులు ఎట్లు పూజింతురు? దీని కలరూపు ఎరిగింపుము.

మహాతపుడు:

శృణు రాజన్‌ మహాప్రాజ్ఞ యథా విష్ణుః ప్రసీదతి,

పురుషాణాం తథాస్త్రీణాం సర్వయోగీశ్వరో హరిః.

మహాతపుడు:

బుద్ధిశాలీ! సర్వ యోగీశ్వరుడగు హరి శ్రీమహా విష్ణువు పురుషులకును, మరియు స్త్రీలకును ఎట్లు ప్రసన్ను డగునో చెప్పెదను. వినుము.

సర్వేదేవాః సపితరో బ్రహ్మాద్యాశ్చాండ మధ్యగాః,

విష్ణోః సకాశా దుత్పన్నా ఇతీయం వైదికీ శ్రుతిః.

పితృ దేవతలతో పాటు దేవత లందరును, బ్రహ్మ మొదలగు వారును, బ్రహ్మాండము నడుమ నున్న ఎల్ల వారును విష్ణువు వలననే పుట్టిరి. ఇది వేదమున వినవచ్చు సత్యము.

అగ్నిస్తథాశ్వినౌ గౌరీ గజవక్త్ర భుజంగమాః,

కార్తికేయ స్తథాదిత్యా మాతరో దుర్గయాసహ.

దిశో ధనపతి ర్విష్ణు ర్యమో రుద్రః శశీ తథా,

పితరశ్చేతి సంభూతాః ప్రాధాన్యేన జగత్పతేః.

అగ్ని, అశ్వినీ దేవతలు, గౌరి, వినాయకుడు, ఆదిశేషుడు, కుమారుడు, ఆదిత్యులు, దుర్గాదేవితో పాటు సప్త మాతృకలు, దిక్కులు, కుబేరుడు, లోక పాలకుడగు విష్ణువు, యముడు, రుద్రుడు, చంద్రుడు, పితృ దేవతలు ~ ఈ అందరు జగన్నాయకుడగు శ్రీమహా విష్ణువు నుండి పుట్టిన వారే.

హిరణ్య గర్భస్యతనౌ సర్వఏవ సముద్భవాః,

పృథక్‌ పృథక్‌ తతో గర్వం వహమానాః సమంతతః.

ఇట్లు హిరణ్య గర్భుని దేహమున పుట్టిన ఈ అందరును అటుపై పెచ్చు పెరిగిన గర్వము గల వారైరి.

అహం యోగ్యస్త్వహం యాజ్య ఇతి తేషాం స్వనోమహాన్‌,

శ్రూయతే దేవసమితౌ క్షుబ్ధసాగర సన్నిభః.

‘నేను యోగ్యుడను, నన్ను పూజింప వలయును’ అను పెనురొద దేవతల గుంపులో అల్లకల్లోలమగు సముద్రపు ఘోషవలె విన వచ్చినది.

తేషాం వివదమానానాం వహ్ని రుత్థాయ పార్థివ,

ఉవాచ మాం యజస్వేతి ధ్యాయధ్వం మామితిబ్రువన్‌.

ప్రాజాపత్య మిదంనూనం శరీరం మద్వినా కృతమ్‌,

వినాశ ముపపద్యేత యతో నాహం తతో మహాన్‌.

అట్లు వివాదము చేయుచున్న వారిలో నుండి అగ్ని పైకి లేచి ‘నన్ను పూజింపుడు, నన్ను ధ్యానింపుడు. ఇదిగో ప్రజాపతి నిర్మించిన దైన దేహము నానుండి వేరై నేను లేని కారణమున నశించును. కావున నేనే గొప్ప వాడను’ అని పలికెను.

ఏవ ముక్త్వా శరీరం తు త్యక్త్వా వహ్ని ర్వినిర్యయౌ,

నిర్గతేపి తతస్తస్మింస్తచ్ఛరీరం న శీర్యతే.

ఇట్లు పలికి అగ్ని దేవుడు శరీరమును వదలి వెలికి వచ్చెను. అట్లతడు వెలువడినను ఆ శరీరము చెడి పోకుండెను.

తతోశ్వినౌ మూర్తిమాన్తౌ ప్రాణాపానౌ శరీరగౌ,

ఆవాం ప్రధానా విత్యేవ మూచతు ర్యాజ్యసత్తమౌ.

అంత ప్రాణము, అపానము అను స్వరూపములతో దేహమున నుండు అశ్వినీ దేవతలు దేహమున మేమే ప్రధానులము. కావున పూజ్యులలో మేమే గొప్ప వారమని పలికిరి.

ఏవ ముక్త్వా శరీరం తు విహాయ క్వచిదాస్థితౌ,

తయో రపి క్షయం కృత్వా క్షీణం తత్పురమాస్థితమ్‌.

ఇట్లు పలికి వారిరువురు శరీరమును విడచి మరియొక చోట నిలిచిరి. వారిరువురు లేక పోయినను దేహము ఏ లోపము లేనిదై చక్కగా నుండెను.

తతో వాగబ్రవీ ద్గౌరీ ప్రాధాన్యం మయి సంస్థితమ్‌,

సాప్యేవముక్త్వా క్షేత్రాత్తు నిశ్చక్రామ బహిః శుభా.

తయా వినాపి తతేక్షత్రం వాగూనం వ్యవతిష్ఠత.

పిదప వాగ్రూపిణియగు గౌరి ‘ప్రాధాన్యము నాయందు కలదు!’ అని పలికి క్షేత్రము నుండి (దేహము నుండి) వెలుపలి కరుదెంచెను. అయినను దేహము పలుకొక్కటి మాత్రము లేనిదై భద్రముగనే యుండెను.

తతో గణపతి ర్వాక్యమాకాశాఖ్యోబ్రవీత్తదా,

నమయా రహితం కించి చ్ఛరీరం స్థాయి దూరతః.

కాలాంతరేత్యేవముక్త్వా సోపి నిష్ర్కమ్య దేహతః,

పృథగ్భూత స్తథాప్యేత చ్ఛరీరం నాప్యనీనశత్‌,

వినాకాశాఖ్యతత్త్వేన తథాపి న విశీర్యతే.

అంత ఆకాశమను పేరుగల గణపతి యిట్లు పలికెను. ‘నేను లేని దేహమే కొంచెము కొలది కాలమైనను నిలువ జాలదు’. ఇట్లని యాతడును దేహము నుండి వేరయ్యెను. అయినను, ఆకాశమను తత్త్వము లేకున్నను శరీరము చెడ కుండెను.

సుషిరైస్తు విహీనంతు దృష్ట్వా క్షేత్రం వ్యవస్థితమ్‌,

శరీరధాతవః సర్వే తేబ్రూయ ర్వాక్య మేవ హి.

రంధ్రము లేవియు లేక చక్కగా నెలకొని యున్న దేహమును చూచి శరీరము నందలి ధాతువు లన్నియు నిట్లు పలికినవి.

అస్మాభి ర్వ్యతిరిక్తస్య నశరీరస్య ధారణమ్‌,

భవతీత్యేవ ముక్త్వా తే జహుః సర్వే శరీరిణః.

మా కంటె వేరుగా శరీరమునకు నిలుకడ లేదు. అని పలికి అవియన్నియు దేహమును వదలెను.

తై ర్వ్యపేత మపి క్షేత్రం పురుషేణ ప్రపాల్యతే,

తం దృష్ట్వా త్వబ్రవీత్‌ న్కందః సోహంకారః ప్రకీర్తితః.

అవి వదలినను క్షేత్రమును పురుషుడు భద్రముగనే యుంచెను. అది కాంచి ‘అహంకార’ మని పేరుగన్న కుమారస్వామి యిట్లు పలికెను.

మయా వినా శరీరస్య సంభూతి రపి నేష్యతే,

ఏవ ముక్త్వా శరీరాత్తు స వ్యపేతః పృథక్‌ స్థితః.

నేను లేనిచో శరీరమునకు నిలుకడయే లేదు - అని పలికి శరీరము నుండి వెలువడి వేరుగా నిలిచెను.

తేనాక్షతేన తత్‌ క్షేత్రం వినా ముక్తవదాస్థితమ్‌,

చెడని రూపు గల ఆ అహంకారము వదలి పోయినను దేహము, ముక్తుని వలె చెడక నిలిచెను.

తం దృష్ట్వా కుపితోభానుః స ఆదిత్యః ప్రకీర్తితః.

మయా వినా కథం క్షేత్ర మిమం క్షణ మపీష్యతే,

ఏవ ముక్త్వాథ యాతః స తచ్ఛరీరం న శీర్యతే.

ఆదిత్యుడని ప్రసిద్ధి గల సూర్యున కది చూచినంత కోపము పెల్లుబికి వచ్చెను. ‘నేను లేనిదే యీ దేహము క్షణమైనను నిలువదు’ అని పలికి శరీరమును వదలి పోయెను. అయినను దానికి ఇనుమంతయు చెరుపు కలుగ లేదు.

తతఃకామాది రుత్థాయ గణో మాతృవిసంజ్ఞితః,

న మయా వ్యతిరిక్తస్య శరీరస్య వ్యవస్థితిః.

పిదప మాతృ గణమను పేరుగల కామము మొదలగునది లేచి నేను లేనిచో శరీరమునకు ఉనికియే లేదని పలికెను.

ఏవముక్తః స యాతస్తు శరీరం తన్న శీర్యతే.

ఇట్లని అది దేహమును వదలి వెలికి వచ్చెను. కాని దేహము చెడిపో కుండెను.

తతో మాయా బ్రవీత్కోపా త్సా చ దుర్గా ప్రకీర్తితా,

న మయాస్య వినా భూతి రిత్యు క్త్వాంతర్దధే పునః.

అంత దుర్గయని పేరొందిన మాయ, నేను లేనిదే దీనికి అస్తిత్వము లేదని పలికి అదృశ్య మయ్యెను.

తతో దిశః సముత్తస్థు రూచు శ్చేదం వచో మహత్‌,

నాస్మాభీ రహితం కార్యం భవతీతి న సంశయః,

చతస్ర ఆగతాః కాష్ఠా స్తాః ప్రయాతాః క్షణా త్తదా.

పిదప నాలుగు దిక్కులును పైకి లేచినవి. మేము లేనిదే ఏపనియు జరుగదు. సందియము లేదు. ఇట్లు పలుకుచు ఆ నాలుగు దిక్కులును ఒక్క క్షణమున లేచి పోయినవి.

తతో ధనపతి ర్వాయు ర్మధ్యత స్త్యక్త సంభవః,

శరీరస్యేతి సోప్యేవ ముక్త్వా మూర్ధానగోభవత్‌.

అపుడు ధనపతియగు వాయువు నేను దేహము నడుమ లేకున్నచో దీనికి స్థితియే లేదనుచు తలనుండి వెలుపలికి వచ్చెను.

తతో విష్ణో ర్మనోబ్రూయా న్నాయం దేహో మయావినా,

క్షణమప్యుత్సహేత్‌ స్థాతు మిత్యుక్త్వాంతర్ధధే పునః.

ఆ వెనుక విష్ణు స్వరూపమగు మనస్సు నేను లేనిదే యీ దేహము క్షణమైనను నిలువ జాలదని పలికి అదృశ్య మాయెను.

తతోధర్మోబ్రవీత్‌ సర్వమిదం పాలితవానహమ్‌,

ఇదానీ మప్యుపగతే కథ మేత ద్భవిష్యతి.

ఏవముక్త్వా గతో ధర్మ స్తచ్ఛరీరం న శీర్యతే.

అంత ధర్ముడు నేనే అంతటిని పాలించితిని. ఇప్పుడు నేను వెలువడినచో ఇది యెట్లు బ్రతుకును? అని పలికి వెలువడి పోయెను. అయినను శరీరము చెడలేదు.

తతోబ్రవీన్మహాదేవః అవ్యక్తో భూతభావనః.

మహత్సంజ్ఞో మయా హీనం శరీరం నోభవేద్‌ యథా,

ఏవముక్త్వా గతఃశంభు స్తచ్ఛరీరం నశీర్యతే.

అటుపై అవ్యక్తము, మహత్తు అనుపేర్లు గల భూతములకు నిర్దేశకుడు అయిన మహా దేవుడు ‘నేను లేనిచో శరీరము ఉండదు’ అని పలికి వెడలి పోయెను. అయినను శరీరము చెరుపునంద కుండెను.

తద్ధృష్ట్వా పితర శ్చోచు స్తన్మాత్రం యావదస్మభిః,

ప్రగతై రేభి రేతచ్చ శరీరం శీర్యతే ధ్రువమ్‌,

ఏవముక్త్యాతు తద్దేహం త్యక్త్వాంతర్ధానమాగతాః.

అదిచూచి తన్మాత్రలని పేరొందిన పితృ దేవతలు మేము వదలి పోయినచో దేహము తప్పక రూపు మాయునని పలికి ఆ దేహము వదలి వెడలి పోయిరి. (తన్మాత్రలనగా అయిదు ఇంద్రియముల గుణములు ~ శబ్ద స్పర్శ రూప రస గంధములు)

అగ్నిః ప్రాణః అపానశ్చ ఆకాశం చైవధాతవః,

క్షేత్రం తద్వదహంకారో భానుః కామాదయో మయా,

కాష్ఠా వాయు ర్విష్ణుధర్మౌ శంభుశ్చైవేంద్రి యార్థకాః.

ఏతై ర్ముక్తంతు తత్‌క్షేత్రం ముక్తావివతు సంస్థితమ్‌,

అగ్ని, ప్రాణము, అపానము, ఆకాశము, ధాతువులు, అహంకారము, సూర్యుడు, కామాదులు, మాయ, దిక్కులు, వాయువు, విష్ణువు, ధర్మము, శంభువు, తన్మాత్రలు అనునవి యన్నియు వదలి పోయినను దేహము ముక్తి యందున్నదో యన్నట్లు నిలిచి యుండెను.

సోమేన పాల్యమానం తు పురుషేణేందురూపిణా.

పురుషుడుగా ప్రసిద్ధి కెక్కిన చంద్ర స్వరూపుడు రక్షించు చుండగా దేహము చెడ కుండెను.

ఏవం వ్యవస్థితే సోమే షోడశాత్మ న్యథాక్షరే,

ప్రాగ్వత్తత్ర గుణోపేతం క్షేత్ర ముత్థాయ బభ్రమ.

పదునారింటి లక్షణములు గల అక్షరమగు సోముడు నెలకొని యుండగా దేహము మునుపటి వలె అన్ని గుణములతో కూడినదై లేచి తిరుగ సాగెను. (పదునారు = అగ్ని మొదలగునవి పదునైదు + సోమ స్వరూపుడగు పురుషుడు).

ప్రాగవస్థం శరీరంతు దృష్ట్వా సర్వజ్ఞ పాలితమ్‌,

తాఃక్షేత్ర దేవతాః సర్వా వైలక్షం భావ మాస్థితాః.

సర్వజ్ఞుడు పాలించు చుండగా మునుపటి స్థితిలో నున్న శరీరమును గాంచి ఆయా క్షేత్ర దేవతలు వెలవెల బోయిరి.

తమేవం తుష్టుపుః సర్వాస్తం దేవం పరమేశ్వరమ్‌,

స్వస్థాన మీయిషుః సర్వా స్తదా నృపతిసత్తమ.

ఆ క్షేత్ర దేవత లందరు తమతమ నెలవులు పొందగోరి అందరును పరమేశ్వరుడగు ఆ దేవుని స్తుతించిరి.

త్వమగ్ని స్త్వం తథా ప్రాణ స్త్వమపానః సరస్వతీ,

త్వమాకాశం ధనాధ్యక్ష స్త్వం శరీరస్య ధాతవః.

అహంకారో భవాన్‌ దేవ త్వమాదిత్యోష్టకో గణః,

త్వంమాయా పృథివీ దుర్గా త్వందిశస్త్వం మరుత్పతిః.

త్వం విష్ణు స్త్వం తథా ధర్మ స్త్వం జిష్ణుస్త్వం పరాజితః,

అక్షరార్థ స్వరూపేణ పరమేశ్వర సంజ్ఞితః.

ప్రభూ! నీవే అగ్నివి, ప్రాణము, అపానము, సరస్వతి, ఆకాశము, వాయువు, శరీరము నందలి ధాతువులు, అహంకారము, ఆదిత్యుడు, మాతృ గణము, మాయ, దుర్గ, దిక్కులు, దేవతల ప్రభువు, విష్ణువు, ధర్మము, జిష్ణువు, ఓటమి యెఱుగని వాడు ఇవి యన్నియు నీవే. అక్షర శబ్దమునకు అర్థమైన స్వరూపముతో నుండు పరమేశ్వరుడవు నీవే.

అస్మాభి రపయాతై స్తు కథ మేత ద్భవిష్యతి,

ఏవమత్ర శరీరంతు త్యక్తమస్మాభిరేవచ.

తత్‌ పరం భవతా దేవ తదవస్థం ప్రపాల్యతే,

స్థనభజ్గో న నః కార్యః స్వయం సృష్ట్వా ప్రజాపతే.

మేము వదలి పోగా ఇది యెట్లు నిలిచిన దనగా ఇట్లు మేము వదలిన యీ దేహమును నీవే సంరక్షించు చున్నావు కనుక నిలిచినది. మాకు స్థానమును చెరుప వలదు. ఓ ప్రజాపతీ! నీవే స్వయముగా మమ్ములను సృజించితివి కదా!

ఏవం స్తుత స్తతో దేవ స్తేషాం తోషం పరం యయౌ,

ఉవాచ చైతాన్‌ క్రీడార్థం భవంతోత్పాదితా మయా.

ఇట్లు వారు స్తుతింపగా ఆ ప్రభువు పరమానంద మందెను. మరియు ఇట్లు పలికెను. మిమ్ముల నందరిని కేవలము లీలకై నేను సృజించితిని.

కృతకృత్యస్య మే కింను భవద్భి ర్విప్రయోజనమ్‌,

తథాపి దద్మి నో రూపే ద్వేద్వే ప్రత్యేకశోధునా.

కార్యము నెర వేరిన నాకు మీతో పని యేమి! అయినను మీకు ఒక్కొక్కిరికి రెండేసి రూపము లొసగుదును.

భూతకార్యే ష్వమూర్తేన దేవలోకే తు మూర్తినా,

తిష్ఠధ్వ మపి కాలాంతే లయం త్వావిశత ద్రుతమ్‌.

భూత కార్యముల యందు ఆకారము లేని స్థితితో, దేవ లోకమున ఆకారముతో నిలుపుడు. పిదప కాలము ముగిసిన వెనుక లయము పొందుడు. (భూత కార్యము లనగా భూలోకమున ప్రాణుల విషయము నందు అని భావము)

శరీరాణి పునర్నైవం కర్తవ్యోహమితి క్వచిత్‌,

మూర్తీనాంచ తథా తుభ్యం దద్మి నామాని వోధునా.

మీకెన్నటికిని నేను దేహములను ఏర్పరుప రాదు. మీ మూర్తులకు ఇప్పుడు పేరు పెట్టెదను.

అగ్ని ర్వైశ్వానరో నామ ప్రాణాపానౌ తథాశ్వినౌ,

భవిష్యతి తథాగౌరీ హిమశూలసుతా తథా.

అగ్నికి వైశ్వానరుడని పేరు. అశ్వులకు ప్రాణాపానములని పేరు. గౌరి హైమవతి యగును.

పృథివ్యాదిగణ స్త్వేష గజవక్త్రో భవిష్యతి,

శరీరధాతవ శ్చేమే నానాభూతాని ఏవ తు,

అహంకార స్తథా స్కంధః కార్తికేయో భవిష్యతి.

పృథివి మొదలగు అయిదు భూతముల సముదాయము వినాయకుడగును. శరీర ధాతువులు, అనేక భూతములు. అహంకారము అను వానికి స్కందుడను పేరు ఏర్పడును. ఆతడే కార్తికేయుడు.

భానుశ్చాదిత్యరూపోసౌ మూర్తామూర్తే చ చక్షుషీ,

కామాద్యోయం గణోభూయో మాతృరూపో భవిష్యతి.

భానుడు ఆదిత్య రూపుడు. మూర్తము, అమూర్తము కన్నులు కామాదుల సముదాయమే మాతృ గణము.

శరీరమాయా దుర్గైషా కారణాంతే భవిష్యతి,

దశకన్యా భవిష్యన్తి కాష్ఠా స్త్వేతాస్తు వారుణాః.

శరీరమున మాయయను పేరు గల యీమెకు దుర్గ అనిపేరు. ఒక కారణము వలన ఈమె మరల ఏర్పడును. పది దిక్కులు వరుణుని కన్యలుగా జనింతురు.

అయం వాయు ర్ధనేశస్తు కారణాంతే భవిష్యతి,

అయం మనో విష్ణునామా భవిష్యతి నసంశయః.

ఈ వాయువు ఒక కారణమున కుబేరు డగును. మనస్సునకు విష్ణువను నామము కలుగును. సంశయము లేదు.

ధర్మోపి యమనామా చ భవిష్యతి న సంశయః.

మహత్త త్త్వం చ భగవాన్‌ మహాదేవో భవిష్యతి.

ధర్ముడు యముడను పేరొందును. మహత్తత్త్వము భగవానుడగు మహాదేవు డగును.

ఇంద్రియార్థా శ్చ పితరో భవిష్యన్తి న సంశయః,

అయం సోమః స్వయంభూత్వా యామిత్రం సర్వదామరాః

ఇంద్రియ విషయములగు శబ్దాదులు పితృ దేవతలగును. ఈ సోముడు స్వయముగా సప్తమ స్థానము కలవాడగును. (యామిత్ర - ఇది జ్యోతిషసంజ్ఞ - ఏడవ స్థానము మిక్కిలి పవిత్ర మైనది)

ఏవం వేదాంతపురుషః ప్రోక్తో నారాయణాత్మకః,

స్వస్థానే దేవతాః సర్వా దేవస్తు విరరామ హ.

ఇట్లు నారాయణ స్వరూపుడగు వేదాంత పురుషుని చెప్పితిమి. పిదప దేవత లందరు వారివారి స్థానముల కరిగిరి. దేవుడు అదృశ్యు డాయెను.

ఏవంప్రభావో దేవోసౌ వేదవేద్యో జనార్దనః,

కథితో నృపతే తుభ్యం కి మన్య చ్ఛ్రోతు మిచ్ఛసి.

వేదములచే తెలియ దగిన జనార్దనుని ప్రభావ మిట్టిది. రాజా! నీ వింకేమి వినవలతువు?