అధ్యాయము - 94

శ్రీవరాహ దేవుడు:

అథ మిద్యుత్ర్పభో దైత్య స్తథా దూతో విసర్జితః

దేవ్యాః సకాశం గత్వాసౌ తామువాచ సుమధ్యమామ్‌.

శ్రీవరాహ దేవుడు:

అంత మహిషుడు దూతగా పంపిన విద్యుత్ప్రభుడు దేవి సమీపమున కరిగి ఆ సుమధ్యమతో ఇట్లు పలికెను.

ప్రణమ్య ప్రయథో భూత్వా కుమారీశతసంకులామ్‌,

ఆస్థానే వినయావన్న స్తతో వచన మబ్రవీత్‌.

ప్రణమిల్లి భక్తి యుక్తుడై వందల కొలది కన్యలతో ఉన్న ఆమె ఆస్థానమున వినయము కలవాడై యిట్లు పలికెను.

విద్యుత్ర్పభుడు:

దేవి పూర్వమృషిస్త్వాసీ దాదిసర్గే కసంభవః,

సఖా సారస్వతో జాతః సుపార్మ్యో నామ వై విభుః.

విద్యుత్ర్పభుడు:

దేవీ! మొదటి సృష్టిలో జలము నందు పుట్టిన సుపార్శ్వుడను ఋషి కలడు. అతడు సారస్వత మహర్షికి మిత్రము.

తస్యాభవన్‌ మహాతేజాః సింధుద్వీపః ప్రతాపవాన్‌,

స హి తీవ్రం తవస్తేపే మాహిష్మత్యాం పురోత్తమే.

అతనికి గొప్ప తేజస్సు, ప్రతాపము గల సింధు ద్వీపుడను కొడుకు పుట్టెను. అతడు మాహిష్మతియను గొప్ప పట్టణమున తీవ్రమగు తపస్సు చేసెను.

కుర్వతస్తు తపోఘోరం నిరాహారస్య శోభనే,

ఆద్యా తు విప్రచిత్తేస్తు సుతా సురసుతోపమా,

మాహిష్మతీతి విఖ్యాతా రూపేణాసదృశీ భువి.

అట్లు నిరాహారుడై మహా ఘోర తప మాచరించు చున్న అతనికి మాహిష్మతి యను కూతురు పుట్టెను. ఆమె విప్రచిత్తికి అక్క, రూపములో సాటి లేనిది. దేవకన్య వంటిది.

సా సఖీభిః పరివృతా విహరన్తీ యదృచ్ఛయా,

ఆగతా మందరద్రోణీం తత్రాపశ్యత్‌ తపోవనమ్‌,

మునే రంబర సంజ్ఞస్య వివిధ ద్రుమ మాలినమ్‌.

ఆమె చెలులతో కూడి ఒకనాడు విహరించుచు అనుకొనకుండ మందర పర్వతము లోయలో అంబరుడను పేరుగల ముని తపో వనమును, పెక్కు విధముల చెట్ల వరుసలు కలదానిని, చేరు కొనెను.

లతా గృహైస్తు వివిధై ర్వకులై ర్లకుచై స్తథా,

చందనైః స్పందనైః శాలైః సరళై రుపశోభితమ్‌,

విచిత్ర వనఖండైస్తు భూషితం తు మహాత్మనః.

ఆ మహాత్ముని తపోవనము పెక్కు పొదరిండ్లతో, పెక్కు విధములగు పొగడలు, గజ నిమ్మలు, మంచి గంధపు చెట్లు, సాలములు, సరళములు, విచిత్రములగు తోటలు మొదలగు వానితో అలంకృతమై యుండెను.

దృష్ట్వాశ్రమపదం రమ్యం సాసురీ కన్యకా శుభమ్‌,

మాహిష్మతీ వరారోహా చిన్తయామాస భామినీ.

అట్టి అంద మైనది, శుభ మైనది అగు ఆశ్రమ పదమును గాంచి ఆ రాక్షస కన్య మాహిష్మతి ఇట్లు తలపోసెను.

భీషయిత్వాహ మేనం తు తాపసం త్వాశ్రమే స్వయమ్‌,

తిష్ఠామి క్రీడతీ సార్ధం సఖీభిః పరమార్చితా.

నా సఖు లందరు నన్ను మిన్నగా మన్నించు చుండగా ఈ తాపసుని భయపెట్టి స్వయముగా నేనే ఇందు క్రీడించుచు నిలిచి పోయెదను.

ఏవం సంచిన్త్య సా దేవీ మహిషీ సంబభూవ హ,

సఖీభిః సహ విశ్వేశి తీక్ష్న శృంగాగ్ర ధారణీ.

ఇట్లు తలపోసి ఆ దేవి చెలులతో పాటు మిక్కిలి వాడి యయిన కొమ్మలు తాల్చి మహిషిగా ఆయెను. (మహిషి = గేదె)

తమృషిం భీషితుం తాభిః సహ గత్వా వరాననా,

అసౌ బిభీషిత స్తాభి స్తాం జ్ఞాత్వా జ్ఞానచక్షుషా,

ఆసురీం క్రోధసంపన్నః శశాప శుభలోచనామ్‌.

సుందరమగు మొగము గల ఆ రాక్షసి చెలులతో పాటు అతనిని భయ పెట్టుటకై అరిగెను. అంత ఋషి జ్ఞాన నేత్రముతో ఆమెను గుర్తించి క్రోధము పెచ్చు రేగగా ఆ అసుర కన్యను శపించెను.

యస్మాద్‌ భీషయసే మాం త్వం మహిషీ రూపధారిణీ,

అతో భవ మహిష్యేవ పాపకర్మే శతం సమాః.

నన్ను గేదె రూపు తాల్చి భయ పెట్టిన కారణముగా ఓ పాప కర్మురాలా! నూరేండ్లు గేదెవు కమ్ము.

ఏవ ముక్తా తతః సాతు సఖీభిః సహ వేపతీ,

పాదయో ర్న్యపతత్‌ తస్య శాపాంతం కురు జల్పతీ.

ఇట్లు పలుకగా ఆమె చెలులతో పాటు వణకి పోవుచు శాపము తీరు దారి చెప్పుమని మరల మరల పలుకుచు అతని పాదములపై పడెను.

తస్యా స్తద్‌ వచనం శ్రుత్వా సమునిః కరుణాన్వితః,

శాపాంత మకరోత్‌ తస్యా వాక్యం చేద మువాచ హ.

ఆమె ఆ మాట విని ఆ ముని కరుణ కలవాడై శాపము తీరుటను ఏర్పరచెను. ఈ వాక్యమును పలికెను.

అనేనైవ స్వరూపేణ పుత్ర మేకం ప్రసూయ వై,

శాపాన్తో భవితా భద్రే మద్వాక్యం నమృషా భవేత్‌.

మంచిదానా! నీవు ఈ స్వరూపము తోడనే ఒక కొడుకును గని శాపాంతమును పొందుదువు. నా వాక్యము అబద్ధము కాదు.

ఏవ ముక్తా గతా సా తు నర్మదాతీర ముత్తమమ్‌,

యత్ర తేపే తపోఘోరం సింధుద్వీపో మహాతపాః.

అత డట్లు పలుకగా ఆమె సింధు ద్వీప మహర్షి ఘోరమగు తపస్సు చేసిన ఉత్తమమగు నర్మద తీరమున కరిగెను.

తత్ర చేన్దుమతీనామ దైత్యకన్యాతిరూపిణీ,

సా దృష్టా తేన మునినా వివస్త్రా మజ్జతీ జలే.

అచట ఇందుమతి యను ఒక దైత్య కన్య మహా రూపవతి వివస్త్రయై జలమున మునుగుచు ఆ ముని కంట బడెను.

చస్కంద చ మునిః శుక్రం శిలాద్రోణ్యాం మహాతపాః,

తచ్చ మాహిష్మతీ దృష్ట్వా దివ్యగన్ధి సుగన్ధి చ,

తతః సఖీ రువాచేదం పిబామీదం జలం శుభమ్‌.

అంత నా మహా తాపసుడు రాతి దొన్నె యందు శుక్రమును వదలెను. దివ్యమైన పరిమళము, శ్రేష్ఠమగు వాసన గల ఆ శుక్రమును జూచి మాహిష్మతి సఖులతో నేనీ నీరమును త్రావెద ననెను.

ఏవ ముక్త్వా తు సా పీత్వా తచ్ఛుక్రం మునిసంభవమ్‌,

ప్రాప్తా గర్భం మునే ర్బీజాత్‌ సుషాన చ తదా సతీ.

ఇట్లు పలికి ఆమె ముని వలన ఏర్పడిన ఆ శుక్రమును త్రావెను. ముని బీజము వలన గర్భము తాల్చెను. కుమారుని కనెను.

తస్యాః పుత్రోభవద్‌ ధీమాన్‌ మహాబలపరాక్రమః,

మహిషేతి స్మృతో నామ్నా బ్రహ్మవంశ వివర్ధనః,

సత్వాం వరయతే దేవి దేవసైన్య విమర్దనః.

ఆమెకు కొడుకు పుట్టెను. అంతడు గొప్ప బుద్ధిశాలి. గొప్ప బలము, పరాక్రమము కలవాడు. బ్రహ్మ వంశమును పెంపొందించు వాడు. పేరు మహిషుడు. దేవీ! దేవ సైన్యమును పిండి గొట్టిన ఆతడు నిన్ను వరించు చున్నాడు.

స సురానపి జిత్వాజౌ త్రైలోక్యం చ తవానఘే,

దాస్యతే దేవి సుప్రీత స్తవ సర్వం మహాసురః,

తస్యాత్మోపప్రదానేన కురు దేవి మహత్‌ కృతమ్‌.

అతడు దేవతలను యుద్ధమున గెలిచి మిక్కిలి ప్రీతి కలవాడై పుణ్యురాలా! నీకు మూడు లోకముల నొసగును. నీవును నిన్ను ఇచ్చు కొనుట ద్వారా, గొప్ప కృత్యమును ఆచరింపుము.

ఏవ ముక్తా తదా దేవీ తేన దూతేన శోభనా,

జహాస పరమా దేవీ వాక్యం నోవాచ కిఞ్చన.

ఇట్లా దూత పలుకగా ఆ శోభన, ఆ పరమ దేవి నవ్వెను. ఏమియు పలుక కుండెను.

తస్యా హసన్త్యా దూతోసౌ త్రైలోక్యం సచరాచరమ్‌,

దదర్శ కుక్షౌ సంభ్రాంత స్తతక్షణాత్‌ సమపద్యత.

అట్లు నవ్వు చున్న ఆమె కడుపులో చరాచరాత్మక మయిన మూడు లోకములను ఆ క్షణమున ఆ దూత చూచెను. తల తిరిగి పోయెను.

తతో దేవ్యాః ప్రతీహారీ జయా నామాతి తేజనా,

దేవ్యా హృది స్థితం వాక్య మువాచ తనుమధ్యమా.

అంత దేవి ప్రతీహారి జయ అను గొప్ప తేజశ్శాలిని సన్నని నడుము గలది, దేవి హృదయమున నున్న భావమును గూర్చి యిట్లు పలికెను.

జయ:

కన్యార్థీ వదతే యద్ధి తత్త్వయా సముదీరితమ్‌,

యది నామ వ్రతం చాస్యాః కౌమారం సార్వకాలికమ్‌,

అపి చాన్యాః కుమార్యోత్ర సన్తి దేవ్యాః పదానుగాః.

జయ:

కన్యను కోరువాడు పలుక వలసినది పలికితివి. కాని ఈయమ సర్వ కాలమునకు సంబంధించిన కౌమార వ్రతమును పట్టినది. అట్లే ఇక్కడి కన్య లందరు ఆమె అడుగు జాడలలో నడచు వారు కలరు.

తాసా మేకాపి నో లభ్యా కిము దేవీ స్వయంశుభా,

యాహి దూత త్వరన్‌ మాతే కిఞ్చి దన్యద్‌ భవిష్యతి.

వారిలో ఏ యొక్కతెయు మీకు లభింపదు. ఇక పరమ పవిత్ర యగు దేవి సంగతి చెప్పనేల? ఓయి దూతా! త్వరగా నీకిక్కడ ఏదో మూడక ముందే పొమ్ము.

ఏవ ముక్తో గతో దూత స్తావద్‌ వ్యోమ్ని మహామునిః,

ఆయాతో నారద స్తూర్ణం నృత్య న్నుచ్చై ర్మహాతపాః.

ఇట్లు పలుకగా ఆ దూత వెడలి పోయెను. ఇంతలో మహా ముని నారదుడు పెద్దగా నృత్యము చేయుచు అచటకు వడివడిగా విచ్ఛేసెను.

దిష్ట్యా దిష్ట్యేతి వదత స్తాం దేవీం శుభలోచనామ్‌,

ఉపవిష్టో జగాదాథ ఆసనే పరమేర్చితః.

భాగ్యము భాగ్య మనుచు ఆ శుభ లోచన యగు దేవిని గూర్చి పలుకుచు మంచి మన్నన గొన్నవాడై పరమాసనమును కూర్చుండెను.

ప్రణమ్య దేవీం సర్వేశీ మువాచ చ మహాతపాః,

దేవి దేవై రహం ప్రీతైః ప్రేషితోస్మి తవాన్తికమ్‌.

ఆ మహా తాపసుడు సర్వేశ్వరియగు ఆ దేవికి ప్రణమిల్లి యిట్లు పలికెను. అమ్మా! దేవత లందరు ప్రీతి నంది నన్ను పంపగా నీకడకు వచ్చితిని.

విజితా దేవి దైత్యేన మహిషాఖ్యేన నిర్జరాః,

త్వాం గృహీతుం ప్రయత్నం స కృతవాన్‌ దేవి దైత్యరాట్‌.

దేవీ! మహిషుడను రక్కసునికి దేవత లందరు ఓడిరి. ఆ దైత్యరాజు నిన్ను చేపట్టుటకు ప్రయత్నము చేసి యున్నాడు.

ఏవ ముక్తోస్మి దేవై స్త్వాం బోధయామి వరాననే,

స్థిరీభూతా మహాదేవి తం దైత్యం ప్రతిఘాతయ.

మంచి మొగము గల ఓ తల్లీ! మహా దేవీ! దేవతలు నీకిది తెలుపు మని నన్ను పలికిరి. నీవు గట్టిగా నిలబడి ఆ రక్కసుని పరమార్పుము.

ఉక్త్వె వాన్త ర్హితః సద్యో నారదః స్వేచ్ఛయా యయౌ,

దేవీ చ కన్యా స్తాః సర్వాః సన్నహ్యన్తా మువాచ హ.

ఇట్లు పలికి నారదుడు వెను వెంటనే అంతర్ధానము చెంది యిచ్చ వచ్చిన చోటి కరిగెను. దేవియు ఆ కన్యల నందరను సిద్ధము కండని పలికెను.

తతః కన్యా మహాభాగాః సర్వాస్తా దేవిశాసనాత్‌,

బభూవు ర్ఘోరరూపిణ్యః ఖడ్గ చర్మధనుర్ధరాః,

సంగ్రామ హేతోః సంతుస్థు ర్దైత్యవిధ్వంసనాయ తాః.

అంత నా పుణ్యాత్మలగు కన్య లందరు దేవి ఆజ్ఞ వలన కత్తులు, డాళ్లు, విండ్లు చేత దాల్చి ఘోర రూపము కలవారై యుద్ధ మునకును, దైత్యుని రూపు మాపుటకును సిద్ధ పడిరి.

తావద్‌ దైత్య బలం సర్వం ముక్త్వా దేవచమూంద్రుతమ్‌,

అయయౌ యత్ర తద్‌ దేవ్యాః సన్నద్దం స్త్రీ బలం మహత్‌.

ఇంతలో ఆ రక్కసుని సైన్య మంతయు దేవ సేనను వదలి గొప్పది యగు స్త్రీ బలమున్న చోటికి పరుగున వచ్చెను.

తతస్తా యుయుధుః కన్యా దానవైః సహ దర్పితాః,

క్షణేన తద్‌ బలం తాభి శ్చతురంగం నిపాతితమ్‌.

గొప్ప ఆత్మ ధైర్యము గల ఆ కన్యలు రక్కసులతో పోరి క్షణములో వారి నాలుగు అంగములు గల సేన నంతటిని కూలవైచిరి.

శిరాంసి తత్ర కేషాంచి చ్ఛిన్నాని పతితాని చ,

అపరేషాం విదార్యోరః క్రవ్యాదాః పాన్తి శోణితమ్‌.

అందు కొందరి తలలు పగిలి నేల గూలినవి. మరి కొందరి రొమ్ములను చీల్చి క్రూర మృగములు నెత్తురు త్రావినవి.

అన్యే కబంధభూతాస్తు ననృతు ర్దైత్యనాయకాః,

ఏవం క్షణేన తే సర్వే విధ్వస్తాః పాపచేతసః,

అపరే విద్రుతాః సర్వే యత్రాసౌ మహిషాసురః.

మరి కొందరు మొండెములు మాత్రము మిగిలిన దైత్య నాయకులు నృత్యములు గావించిరి. ఇంకను మిగిలిన వారందరు మహిషా సురుడున్న చోటికి పారిపోయిరి.

తతో హాహాకృతం సర్వం యథా దైత్యబలం మహత్‌,

ఏవం తదాకులం దృష్ట్వా మహిషో వాక్య మబ్రవీత్‌,

సేనాపతే కి మేతద్ధి బలం భగ్నం మమాగ్రతః.

అపుడు పెద్దదియగు ఆ రాక్షస సేన హాహాకరములు చేసెను. ఈ గందర గోళమును చూచి మహిషుడు సేనాపతీ! ఇదేమి! నా ఎదుటనే నాసేన నాశన మాయెను? అని పలికెను.

తతో యజ్ఞహను ర్నామా దైత్యో హస్తిస్వరూపవాన్‌,

ఉవాచ భగ్న మేతద్ధి కుమారీభిః సమన్తతః.

అప్పుడు యజ్ఞహను రక్కసుడు ఏనుగు రూపము కలవాడు, ఆ కన్య లందరు ఈ సేనను సర్వ విధముల విరిచి ప్రోవులు పెట్టెనని పలకెను.

తతో దుద్రావ మహిష స్తాః కన్యాః శుభలోచనాః,

గదా మాదాయ తరసా కన్యా దుద్రావ వేగవాన్‌.

అంత మహిషుడు గద చేపట్టి చక్కని కనులు గల ఆ కన్నెల నందరిని మహా వేగముతో తరుముచు వచ్చెను.

యత్ర తిష్ఠతి సా దేవీ దేవగన్ధర్వ పూజితా,

తత్రైవ సోసురః ప్రాయాద్‌ యత్ర దేవీ వ్యవస్థితా,

సా చ దృష్ట్వా తమాయాన్తం వింశద్ధస్తా బభూవ హ.

దేవతలు, గంధర్వులు పూజించు చున్న ఆ దేవి ఉన్న చోటికే వాడు పరువెత్తుచు వచ్చెను. ఆమెయు నట్లు వచ్చి పడుచున్న రక్కసుని కని ఇరువది చేతులు కలది ఆయెను.

ధనుః ఖడ్గం తథా శక్తిం శరాన్‌ శూలం గదాం తథా,

పరశుం డమరుం చైవ తదా ఘణ్టాం విశాలినీమ్‌,

శతఘ్నీం ముద్గరం ఘోరం భుశుణ్డీం కుంత మేవ చ.

ముసలం చ తథా చక్రం భిందిపాలం తథైవ చ,

దండం పాశం ధ్వజం చైవ పద్మం చేతి చ వింశతిః.

భూత్వా వింశభుజా దేవీ సింహమాస్థాయ దంశితా,

సస్మార రుద్రం దేవేశం రౌద్రం సంహారకారణమ్‌.

విల్లు, కత్తి, శక్తి, బాణములు, శూలము, గద, గొడ్డలి, డమరువు, పెద్ద ఘంట, శతఘ్ని, ఇనుప గుదియ, ఘోరమైన భుశుండి, ఈటె, రోకలి, చక్రము, భింది పాలము, దండము, పాశము, ధ్వజము, పద్మము అను ఈ ఇరువదింటిని చేతులతో పట్టుకొని సింహము నెక్కి చక్కగా కవచము మొదలగు వానిని ధరించి ఆ దేవి సంహార కారణుడు భయంకరుడు నగు రుద్రుని స్మరించెను.

తతో వృషధ్వజః సాక్షాద్‌ రుద్ర స్తత్రైవ ఆయయౌ,

తయా ప్రణమ్య విజ్ఞప్తః సర్వాన్‌ దైత్యాన్‌ జయామ్యహమ్‌.

అంత ఎద్దు ధ్వజముగా గల రుద్రుడు తనకు తానై అచటకు వచ్చెను. ఆమె అతనికి ప్రణమిల్లి యిట్లు విన్న వించెను. ఈ దైత్యుల నందరిని నేను గెలుతును.

త్వయి సన్నిధిమాత్రే తు దేవదేవ సనాతన,

ఏవముక్త్వాసురాన్‌ సర్వాన్‌ జిగాయ పరమేశ్వరీ.

దేవదేవా! సనాతనా! నీవు చేరువలో నున్న చాలును. అని పలికి ఆ అసురుల నందరిని ఆ పరమేశ్వరి గెలిచెను.

ముక్త్వా తమేకం మహిషం శేషం హత్వా తమభ్యయాత్‌,

యావద్‌ దేవీ తతః సాపి తాం దృష్ట్వా సోపి దుద్రువే.

ఆ మహిషు నొక్కని వదలి తక్కిన మూక నంతటిని చంపివైచి వానిపై కురికెను. ఇంతలో వాడును ఆమెను గాంచి యామెవైపు దుమికెను.

క్వచిద్‌ యుద్ధ్యతి దైత్యేన్ధ్రః క్వచిచ్చైవ పలాయతి,

క్వచిత్‌ పునర్మృధం చక్రే క్వచిత్పున రుపారమత్‌.

ఒక్కయెడ ఆ దైత్య రాజు పోరాడును. కొండొకచో పారి పోవును, మరొక వేళ యుద్ధము చేయును. మరొక యెడ మాని వేయును.

ఏవం వర్షసహస్రాణి దశ తస్య తయా సహ,

దివ్యాని విగతాని స్యు ర్యుద్ధ్యత స్తస్య శోభనే,

బభ్రామ సకలం త్వాజౌ బ్రహ్మాండం భీతమానసమ్‌.

ఇట్లు ఆమెతో పోరుచున్న ఆతనికి పదివేల దివ్య వత్సరములు గడచి పోయెను. బ్రహ్మాండ మంతయు బెదరు గుండెతో కదలి పోయెను.

తతః కాలేన మహతా శాతశృఙ్గే మహాగిరౌ,

పద్భ్యా మాక్రమ్య శూలేన నిహతో దైత్యసత్తమః.

అంత పెద్ద కాలమునకు శతశృంగ మహా పర్వతమున ఆ తల్లి పాదములతో నాక్రమించి ఆ ఘోర దైత్యుని శూలముతో పొడిచి చంపి వైచెను.

శిరశ్చిచ్ఛేద ఖడ్గేన తత్ర చాన్తఃస్థితః పుమాన్‌,

నిర్గత్య విగతః స్వర్గం దేవ్యాః శస్త్రనిపాతనాత్‌.

ఖడ్గముతో వాని తలను కోసి వైచెను. అట్లు దేవి ఆయుధము పడుట వలన ఆ మహిషునిలో నున్న ఒక పురుషుడు వాని దేహము నుండి వెలువడి స్వర్గమున కరిగెను.

తతో దేవగణాః సర్వే మహిషం వీక్ష్య నిర్జితమ్‌,

సబ్రహ్మకాః స్తుతిం చక్రు ర్దేవ్యా స్తుష్టేన చేతసా.

అంత బ్రహ్మతో పాటు దేవత లందరు ఓడి చచ్చిన మహిషుని గాంచి సంతసించిన హృదయముతో దేవి నిట్లు స్తుతించిరి.

దేవతలు:

నమో దేవి మహాభాగే గంభీరే భీమదర్శనే,

జయస్థే స్థితసిద్ధన్తే త్రినేత్రే విశ్వతోముఖి.

దేవతలు:

పూజ్యులారా! దేవీ! ఎరుగ నలవి కాని తత్త్వము కలదానా! భయంకరముగా కానవచ్చు ఓ దేవీ! జయము నందున్న తల్లీ! సిద్ధాంతమును నెలకొల్పు మాతా! మూడు కన్నుల దానా! అన్ని వైపుల ముఖములు గల ఓ అమ్మా! నీకు నమస్కారము.

విద్యావిద్యే జయే యాజ్యే మహిషాసురమర్దిని,

సర్వగే సర్వదేవేశి విశ్వరూపిణి వైష్ణవి.

అమ్మా! నీవు విద్యవు, అవిద్యవు, జయవు, పూజ్యవు, మహిషాసురుని మర్దించితివి. అంతట నుందువు. సర్వ దేవతలకు ఈశ్వరివి. విశ్వ మంతయు నీ రూపమే. ఓ విష్ణుశక్తీ! నీకు ప్రణతి.

వీతశోకే ధ్రువే దేవి పద్మపత్ర శుభేక్షణే,

శుద్ధ సత్వ వ్రతస్థే చ చణ్డరూపే విభావరి.

నిన్ను శోకమంటదు. నీవు స్థిరమైన దానవు. తామర రేకుల వంటి చక్కని కన్నులు గల ఓ దేవీ! శుద్ధ సత్వ స్వరూపము గల వ్రతము నందున్న దానవు. చండ రూపము నీయది. రాత్రి రూపిణివి.

బుద్ధి సిద్ధిప్రదే దేవి విద్యేవిద్యేమృతే శివే,

శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వలోకనమస్కృతే.

సంపదను, సిద్ధిని ఒసగుదువు. విద్యవు, అవిద్యవు, అమృత స్వరూపిణివి. మంగళ రూపవు, శంకర, విష్ణు, బ్రహ్మల శక్తులన్నియు కలదానవు. సర్వ లోకములు నీకు నమస్కరించును.

ఘంటాహస్తే త్రిశూలాస్త్రే మహామహిషమర్దిని,

ఉగ్రరూపే విరూపాక్షి మహామాయేమృతస్రవే.

ఘంట హస్తమున గలదానవు. త్రిశూలము ఆయుధమైన దానవు. మహా మహిషుని మర్దించిన దానవు. ఉగ్రమగు రూపము గల దానవు. విరూపములగు కన్నులు కల దానవు. మహామాయవు. అమృతమును జాలువార్చు తల్లివి.

సర్వసత్వహితే దేవి సర్వసత్వమయే ధ్రువే,

విద్యాపురాణ శిల్పానాం జననీ భూతధారిణీ.

నీవు సర్వ జంతువులకు మేలు కూర్చు దానవు. సర్వ ప్రాణులు నీ స్వరూపమే అయిన దానవు. స్థిరమైన దానవు. విద్యలు, పురాణములు, శిల్పములు అను వానిని పుట్టించిన దానవు. సర్వ భూతములను పట్టి నిలుపు దానవు.

సర్వదేవ రహస్యానాం సర్వసత్వవతాం శుభే,

త్వమేవ శరణం దేవి విద్యేవిద్యే శ్రియేంబికే.

విరూపాక్షి తథా క్షాన్తి క్షోభితాంతర్జలేవిలే.

సర్వ దేవతల రహస్యములకు, సర్వ శక్తులు కలవారికి నీవే శరణము. దేవీ! విద్యయు, అవిద్యయు, సంపదయు, నీవే. నీవే తల్లివి. నీవు మూడు కన్నులతో విరూపాక్షివి. సహన స్వరూపిణివి. నీటి లోపలి శక్తి నీ స్వరూపమే. ఏ కలుషము లేని దానవు.

నమోస్తు తే మహాదేవి నమోస్తు పరమేశ్వరి,

నమస్తే సర్వదేవానాం భావనిత్యేక్షయేవ్యయే.

మహాదేవి! నీకు నమస్సు. పరమేశ్వరీ! నీకు ప్రణామము. సర్వ దేవతల భావము లందు నిత్యమై వెలయు తల్లీ! అక్షయా! అవ్యయా! నీకు మ్రొక్కులు.

శరణం త్వాం ప్రపద్యన్తే యే దేవి పరమేశ్వరి,

న తేషాం జాయతే కించి దశుభం రణసంకటే.

పరమేశ్వరీ! దేవీ! ఘోరమగు యుద్ధముల కష్ట సమయములలో నిన్ను శరణు పొందిన వారికి ఏ కీడును కలుగదు.

యశ్చ వ్యాఘ్రభయే ఘోరే చౌరరాజభయే తథా,

స్తవ మేనం సదా దేవి పఠిష్యతి యతాత్మవాన్‌.

నిగడస్థోపి యో దేవి త్వాం స్మరిష్యతి మానవః,

సోపి బంధై ర్విముక్త స్తే సుసుఖం వసతే సుఖీ.

పులి భయము, ఘోరమగు చోర భయము, రాజ భయము కలిగి నపుడు నిశ్చలమగు చిత్తముతో ఈ స్తోత్రమును పఠించు వాడును, బంధనమున నుండి నిన్ను తలచిన నరుడును ఆ అన్నింటి నుండి విముక్తుడై సుఖముతో జీవించును.

శ్రీవారహ దేవుడు:

ఏవం స్తుతా తదా దేవీ దేవైః ప్రణతి పూర్వకమ్‌,

ఉవాచ దేవాన్‌ సుశ్రోణీ వృణుధ్వం వర ముత్తమమ్‌.

శ్రీవారహ దేవుడు:

ఇట్లు దేవత లందరు చేతులు మోడ్చి స్తుతింపగా ఆ పరమ సుందరి దేవతలను గాంచి, మేలైన వరము కోరు కొనుడని పలికెను.

దేవతలు:

దేవి స్తోత్ర మిదం యే హి పఠిష్యన్తి తవానఘే,

సర్వకామ సమాపన్నాన్‌ కురుదేవి స నో వరః.

దేవతలు:

అమ్మా! పుణ్యాత్మా! ఈ స్తోత్రమును భక్తితో చదువు వారు అన్ని కామితములను పొందు వారగు నట్లు చేయుము. ఇదియే మాకు వరము.

ఏవ మస్త్వితి తాన్‌ దేవా నుక్త్వా దేవీ పరాపరా,

విససర్జ తతో దేవాన్‌ స్వయం తత్రైవ సంస్థితా.

అట్లే యగుగాక! అని పలికి ఆ పరాపరయగు దేవి తానచటనే నిలిచినదై దేవత లందరిని వారి వారి తావులకు పంపి వైచెను.

ఏతద్‌ ద్వితీయం యోజన్మ వేదదేవ్యా ధరాధరే,

స వీతశోకో విరజాః పదం గచ్ఛ త్యనామయమ్‌.

ఓ ధరిత్రీ! దేవి యీ రెండవ జన్మమును గూర్చి తెలిసి కొన్న వాడు శోకము లేనివాడు, రజో గుణమంటని వాడును అయి ఏ రోగము లేని పదమునకు చేరుకొనును.