అధ్యాయము - 31

మహాతపుడు:

మనోర్నామ మనుత్వంచ యదేతత్‌ పఠ్యతే కిల,

ప్రయోజనవశాద్‌ విష్ణు రసావేవ తు మూర్తిమాన్‌.

మహాతపుడు:

మనువను పేరును, మనువు తనమును గ్రంథములలో కానవచ్చు చున్నది. ఒక ప్రయోజనము కొఱకు విష్ణువే యీ మనువు రూపమును దాల్చెను.

యోసౌ నారాయణో దేవః పరాత్‌ పరతరో నృప,

తస్య చిన్తా సముత్పన్నా సృష్టిం ప్రతి నరోత్తమ.

రాజా! పరము కంటె ఇంకను పరమైన ఈ నారాయణ దేవునకు సృష్టిని గూర్చి ఆలోచన పుట్టెను.

సృష్టా చేయం మయా సృష్టిః పాలనీయా మమైవ హ,

కర్మకాణ్డం త్వమూర్తేన కర్తుం నైవేహ శక్యతే,

తస్మా న్మూర్తిం సృజమ్యేకాం యయా పాల్యమిదం జగత్‌.

ఈ సృష్టిని నేనే చేసితిని. దీనిని నేనే పాలింప వలయును గదా! ఆకారము లేని సృష్టితో ఆయా పనులు చేయ నలవి కాదు. కావున ఒక మూర్తిని సృజింతును. అది ఈ జగము నెల్ల పాలించును.

ఏవం చిన్తయత స్తస్య సత్యాభి ధ్యాయినో నృప,

ప్రాక్‌ సృష్టిజాతం రాజన్‌ వై మూర్తిమత్‌ తత్పురో బభౌ.

సత్యమునే ధ్యానించు ఆ విష్ణువు ఇట్లు తలపోయు చుండగా మునుపటి సృష్టి సముదాయ మంతయు రూపుగొని ఆతని ముందు ప్రకాశించెను.

పురోభూతే తత స్తస్మిన్‌ దేవో నారాయణః స్వయమ్‌,

ప్రవిశన్తం దదర్శాథ త్రైలోక్యం తస్య దేహతః.

ఆ సృష్టి యంతయు నెదుట నిలిచి యుండగా తన దేహము నుండి మూడు లోకములు అందు ప్రవేశించు చుండుటను స్వామి గమనించెను.

తతః సస్మార భగవాన్‌ పరదానం పురాతనమ్‌,

వాగాదీనాం తత స్తుష్టః ప్రాదాత్‌ తస్య పునర్వరమ్‌.

అంతట ఆ భగవంతుడు మునుపు వాక్కు మొదలగు వానికి తానిచ్చిన వరమును స్మరించెను. దానితో తృప్తిపడి మరల వర మొసగెను.

సర్వజ్ఞః సర్వకర్తా త్వం సర్వలోకనమస్కృతః

త్రైలోక్యవిశనాచ్చ త్వం భవవిష్ణుః సనాతనః

నీవు సర్వ మెరిగిన వాడవు. సర్వమునకు కర్తవు. సర్వ లోకము నీకు మ్రొక్కును. మూడు లోకములను ప్రవేశించుట వలన సనాతనుడ వగు నీవు ‘విష్ణువు’ అను పేరు గల వాడ వగుదువు.

దేవానాం సర్వదా కార్యం కర్తవ్యం బ్రహ్మణ స్తథా,

సర్వజ్ఞత్వం చ భవతు తవ దేవ నసంశయః.

బ్రహ్మ దేవుడు ఎల్ల వేళల దేవతల కార్యము చేయుచుండ వలయును. ఓ దేవా! నీకు సర్వజ్ఞత కలుగు గాక, సందియము లేదు.

ఏవముక్త్వా తతో దేవః ప్రకృతిస్థో బభూవ హ,

విష్ణు రప్యధునా పూర్వాం బుద్ధిం సస్మార చ ప్రభుః.

ఇట్లు పలికి ఆ దేవుడు మరల సహజ స్థితికి వచ్చెను. విష్ణువు ఇప్పుడు ఆ పూర్వపు బుద్ధిని స్మరించెను.

తదా సంచిన్త్య భగవాన్‌ యోగనిద్రాం మహాతపాః,

తస్యాం సంస్థాప్య భగవానిన్ద్రియార్ధోద్భవాః ప్రజాః,

ధ్యాత్వా పరేణ రూపేణ తతః సుష్వాప వైప్రభుః.

అప్పుడు గాఢ భావన గల ఆ భగవానుడు యోగ నిద్రను భావించెను. ఇంద్రియ విషయముల వలన పుట్టిన నందరను అందు స్థాపించి శ్రేష్ఠ మగు రూపముతో ధ్యానించి ఆ ప్రభువు నిదురించెను.

తస్య సుప్తస్య జఠరా న్మహత్‌ పద్మం వినిఃసృతమ్‌,

సప్తద్వీపవతీ పృథ్వీ ససముద్రా సకాననా.

అట్లు గాఢ నిద్ర నొందిన ఆ భగవంతుని కడుపు నుండి ఒక పెద్ద పద్మము వెలువడెను. అందు ఏడు ద్వీపములతో, సముద్రములతో, అడవులతో నిండిన భూమి యంతయు ఏర్పడెను.

తస్య రూపస్య విస్తారం పాతాలం నాలసంస్థితమ్‌,

కర్ణికాయాం తథామేరు స్తన్మధ్యే బ్రహ్మణో భవః.

ఆ పద్మము రూపము అట్లు విస్తరిల్లెను. పాతాళము కాడ యందు నెలకొనెను. దుద్దునందు మేరువు కన్పట్టెను. దాని నడుమ బ్రహ్మ పుట్టుక ఏర్పడెను.

ఏవం దృష్ట్వా పరం తస్య శరీరస్య తు సంభవమ్‌,

ముముచే తచ్ఛరీరస్థో వాయు ర్వాయుం సమంసృజత్‌.

ఆతని శరీరము నుండి పుట్టిన దీని నంతటిని గాంచి ఆ శరీరము ననే యున్న వాయువు మరియొక వాయువును సృజించి వెలుపలికి వదలెను.

అవిద్యా విజయం చేమం శఙ్ఖరూపేణ ధారయ,

అజ్ఞానచ్ఛేదనార్థాయ ఖడ్గం తేస్తు సదాకరే.

కాలచక్ర మిమం ఘోరం చక్రం త్వం ధారయాచ్యుత,

అధర్మ గజ ఘాతార్థం గదాం ధారయ కేశవ.

స్వామీ! అజ్ఞానమును జయించుటకై దీనిని శంఖ రూపముతో ధరింపుము, అజ్ఞానమును రూపు మాపుటకై నీచేత ఎల్లప్పుడు ఈ ఖడ్గము నిలుచు గాక! ఇదిగో ఈ ఘోరమైన చక్రము కాల చక్రము. అచ్యుతా! అధర్మ మనెడు ఏనుగులను మోదుటకై కేశవా! గద గ్రహింపుము.

మాలేయం భూతమాతాతే కణ్ఠే తిష్ఠతు సర్వదా,

శ్రీవత్స కౌస్తుభౌ చేమౌ చన్ద్రా దిత్యచ్ఛలేన హ.

భూతములకు తల్లియగు ఈ మాల ఎల్లవేళల నీమెడలో నిలుచు గాక! ఈ శ్రీవత్సము కౌస్తుభమును చంద్ర సూర్యులకు బదులుగా నీ కడ నుండును.

మారుత స్తే గతి ర్విర గరుత్మాన్‌ స చ కీర్తితః,

త్రైలోక్యగామినీ దేవీ లక్ష్మీస్తేస్తు సదాశ్రయే,

ద్వాదశే చ తిథిస్తేస్తు కామరూపీ చ జాయతే.

వాయువే నీ గమనము. దానిని గరుత్మంతు డందురు. మూడు లోకములలో సంచరించు లక్ష్మీదేవి ఎల్లవేళల నిన్నా శ్రయించి యుండును. నీకు ప్రియమైన తిథి ద్వాదశి. అది యిచ్చ వచ్చిన రూపు తాల్చిన దగును.

ఘృతాశనో భవేద్యస్తు ద్వాదశ్యాం త్వత్పరాయణః,

సస్వర్గవాపీ భవతు పుమాన్‌ స్త్రీవా విశేషతః.

ద్వాదశి తిథి యందు నీయందు మనసు నిలిపి నేతి భోజనము చేయు వ్యక్తి స్త్రీ యైనను, పురుషు డైనను స్వర్గము నందు నివసించును.

ఏష విష్ణు స్తవాఖ్యాతో మూర్తయో దేవదానవాః,

హన్తి పాతి శరీరాణి సృజత్యన్తాని చాత్మనః.

దేవ దానవుల మూర్త లన్నియు. ఈ విష్ణువే. అతడే శరీరములను సృజించును. రక్షించును. సంహరించును.

యుగే యుగే సర్వగోయం వేదాన్తే పురుషో హ్యసౌ,

నహీన బుద్ధ్యా వక్తవ్యో మనుష్యోయం కదాచన.

ప్రతి యుగమున ఈతడే సర్వత్ర వ్యాపించు పరమ దైవము వేదాంతమున పురుషుడని ఈతనినే అందురు. హీన బుద్ధితో అతనిని కేవలము మనుష్యుడని యెన్నటికిని పలుక రాదు.

య ఏవం శృణుయాత్‌ సర్గం వైష్ణవం పాపనాశనమ్‌.

స కీర్తి మిహ సంప్రాప్య స్వర్గలోకే మహీయతే.

పాపమును పటా పంచలు చేయు ఈ విష్ణు సంబంధమైన సృష్టిని వినువాడు ఇహ లోకమున చక్కని కీర్తి పొంది స్వర్గ లోకమున శాశ్వతముగా నిలుచును.