వరాహ మహా పురాణము
అధ్యాయము - 130
శ్రీవరాహ దేవుడు:
దన్త కాష్ఠ మఖాదిత్వా యో హి మా ముపసర్పతి,
పూర్వకాలకృతం కర్మ తేన చైకేన నశ్యతి.
శ్రీవరాహ దేవుడు:
ఉదయమున పలుదోము పుల్ల నుపయోగింపక (పండ్లు తోము కొనక) నా కడకు వచ్చు వాని పూర్వ పుణ్య మంతయు ఆ ఒక్క పాపముతో నశించును.
నారాయణవచః శ్రుత్వా పృథివీ ధర్మసంస్థితా,
విష్ణుభక్త సుఖార్థాయ హృషీకేశ మువాచ హ.
నారాయణుని మాట విని ధర్మము నందు నిలుకడ గల భూదేవి విష్ణు భక్తుల సుఖము కొరకై విష్ణువుతో నిట్లు పలికెను.
ధరణి:
సర్వకాలకృతం కర్మ క్లేశేన మహతానఘ,
కథ మేకాపరాధేన సర్వ మేవ ప్రణశ్యతి,
ధరణి:
ఎంతో కష్టపడి సంపాదించిన సర్వకాల సంబంధమగు పుణ్య మంతయు ఒక్క తప్పుతో ఎట్లు నశించును?
శ్రీవరాహ దేవుడు:
శృణు సుందరి తత్త్వేన కథ్యమానం మయానఘే,
యేన చైకాపరాధేన పూర్వకర్మ ప్రణశ్యతి.
శ్రీవరాహ దేవుడు:
సుందరీ! ఒక్క తప్పు చేత పూర్వ పుణ్య మంతయు ఎట్లు నశించునో నేను చెప్పెదను. వినుము.
మనుష్యః కిల్బిషీ భద్రే కఫపిత్తసమన్వితః,
పూయశోణిత సంపూర్ణం దుర్గన్థి ముఖమస్య తత్.
మనుష్యుడు సహజముగా దోషములు కలవాడు. కఫము, పిత్తములతో కూడిన వాడు. కుళ్ళిన రక్తముతో నిండిన ఆతని ముఖము చెడు వాసన కలదియై యుండును.
న సహే దుచితం దేవి దన్తకాష్ఠస్య భక్షణాత్,
శుద్ధిం భాగవతీం చైవ ఆచారేణ వివర్జితామ్.
పలుదోము పుల్లను వాడుట వలన, ఆ దోషము నిలువదు. ఆచారము వదలిన భక్తునికి శుద్ధి కలుగును.
ధరణి:
దన్తకాష్ఠ మఖాదిత్వా యః కర్మాణి కరోతి తే,
ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి యేన ధర్మం న నశ్యతి.
ధరణి:
పలుదోము పుల్లను నమలక నీ పూజా కర్మముల నాచరించు వానికి ప్రాయశ్చిత్తమేమి? దేని వలన నాతని ధర్మము నశింప కుండును? నాకు చెప్పుము.
శ్రీవరాహ దేవుడు:
ఏవ మేత న్మహాభాగే యన్మాం త్వం పరిపృచ్ఛసి,
కథయిష్యామి తే హీదం యథా శుద్ధ్యన్తి మానవాః.
శ్రీవరాహ దేవుడు:
పుణ్యాత్మురాలా! నీవు నన్నడిగిన దానికి సమాధానముగా మానవు లెట్లు శుద్ధి పొందుదురో చెప్పెదను.
ఆకాశశయనం కృత్వా దినాని ద్వే చ పఞ్చ చ,
అభుక్త్వా దన్తకాష్ఠస్య ఏవం శుద్ధ్యతి మానవః.
ఏడు దినములు ఆకాశ శయనము చేసినచో పలు దోమని పాపము నుండి మానవుడు శుద్ధి పొందును.
య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్,
న తస్యై వాపరాధోస్తి ఏవ మేవ న సంశయః.
ఈ విధానముతో ప్రాయశ్చిత్త మొనరించిన వానికి దోషము కలుగదు. సంశయము లేదు.