వరాహ మహా పురాణము
అధ్యాయము - 7
ధరణి:
రైభ్యోసౌ మనిశార్దూలః శ్రుత్వా సిద్ధం వసుం తదా,
స్వయం కి మకరోద్ దేవ సంశయో మే మహానయమ్.
ధరణి:
వసువు సిద్ధి పొందెనని విన్న ముని వరుడు రైభ్యుడు ఏమి చేసెను? దేవా! ఇది నాకు పెద్ద సంశయము.
శ్రీవరాహ దేవుడు:
స రైభ్యో మునిశార్దూలః శ్రుత్వా సిద్ధం వసుం తదా,
ఆజగామ గయాం పుణ్యాం పితృతీర్థం తపోధనః,
తత్ర గత్వా పితౄన్ భక్త్యా పిణ్డదానేన తర్పయత్.
శ్రీవరాహ దేవుడు:
ముని వరుడగు ఆ రైభ్యుడు వసువు సిద్ధి పొందెనని విని పుణ్యయగు గయ యనెడు పితృ తీర్థమున కరిగెను. అందరిగి పితృ దేవతలను భక్తితో పిండ దానము చేసి తృప్తి పరచెను.
తతో వై సుమహ త్తీవ్రం తపః పరమదుశ్చరమ్,
చరత స్తస్య తత్తీవ్రం తపో రైభ్యస్య ధీమతః,
ఆజగామ మహాయోగీ విమానస్థోతిదీప్తిమాన్.
పిదప ఆతడు ఎవరికి చేయు శక్యము కాని మహాతపము గావించెను. బుద్ధి మంతడగు రైభ్యు డట్లు తీవ్ర తపము చేయు చుండగా విమానము నందున్న గొప్ప తేజశ్శాలి యగు మహాయోగి యొకడు అటకు వచ్చెను.
త్రసరేణుసమే శుద్ధే విమానే సూర్యసన్నిభే,
పరమాణుప్రమాణేన పురుష స్తత్ర దీప్తిమాన్.
నలుసంతది, సూర్యని వలె వెలుగొందు చున్నది, శుద్ధ మైనది యగు విమానమున ఆ పురుషుడు గొప్ప కాంతితో పరమాణు వంత లెక్కలో నుండెను.
సోబ్రవీద్ రైభ్య కిం కార్యం తప శ్చరసి సువ్రత,
ఏవ ముక్త్వాదివో భూమిం మాపయామాస వై పుమాన్.
ఆ పురుషుడు రైభ్యా! నీ వేల తప మొనర్చు చున్నావు? అని పలికి భూమిని, ఆకాశమును తన దేహముతో కప్పి వైచెను.
తత్రాపి రథపఞ్చాభం విమానం సూర్యసన్నిభమ్,
యుగపద్ బ్రహ్మభువనం వ్యాప్నువస్తం దదర్శ హ.
అందును అయిదు రథముల పెట్టున నున్నదియు సూర్యుని వలె వెలుగొందు చున్నదియు, ఒక్కుమ్మడి బ్రహ్మ లోకమునకు వ్యాపించు చున్నదియు నగు విమానమును రైభ్యుడు గాంచెను.
తతః స విస్మయావిష్టో రైభ్యః ప్రణతిపూర్వకమ్,
పప్రచ్ఛ తం మహాయోగిన్ కో భవాన్ ప్రబ్రవీతు మే.
అంత రైభ్యుడు ఆశ్చర్యమున మునిగి తేలుచు ప్రణామ పూర్వకముగ ఓ మహాయోగీ! తమరెవరు? నాకు చెప్పుడని యడిగెను.
పురషుడు:
అహం రుద్రా దవరజో బ్రహ్మణో మానసః సుతః,
నామ్నా సనత్కుమారేతి జనలోకే వసామ్యహమ్.
పురషుడు:
నేను రుద్రుని తమ్ముడను. బ్రహ్మ మానస పుత్రుడను. నా పేరు సనత్కుమారు డందురు. జన లోకమున నివసింతును. (మానస పుత్రుడనగా సంకల్పము వలన పుట్టిన వాడని యర్ధము. జన లోకము – భూ లోకము మొదలు కొని పై నున్న లోకములలో అయిదవది)
భవతః పార్శ్వ మాయాతః ప్రణయేన తపోధన,
ధన్యోసి సర్వథా వత్స బ్రహ్మణః కులవర్ధనః
ఓయీ! తపోధనా! నీ యందు అనురాగముతో నీ కడకు వచ్చితిని. నాయనా! నీ వన్ని విధముల ధన్యుడవు. బ్రహ్మ కులమును వృద్ధి పొందించు వాడవు.
రైభ్యుడు:
నమోస్తు తే యోగివర ప్రసీద దయాం మహ్యం కురుషే విశ్వరూప,
కిమత్ర కృత్యం వద యోగిసింహ కథం హి ధన్యోహ ముక్త స్త్వయా చ.
రైభ్యుడు:
యోగివరా! నీకు నమస్సు. ప్రసన్నుడ వగుము. విశ్వరూపా! నా యందు దయ చూపుము. యోగి సింహా! పని యేమో సెలవిమ్ము. నన్ను ధన్యుడ వంటివి. అది యెట్లు?
సనత్కుమారుడు:
ధన్యస్త్వమేవ ద్విజవర్యముఖ్య యద్ వేద వాదాభిరతః పితౄంశ్చ,
ప్రీణాసి మస్త్ర్రజ జప్యహోమై ర్గయాం సమాసాద్య తథాన్నపిండైః.
సనత్కుమారుడు:
బ్రాహ్మణ ప్రవరా! నీవు నిజముగా ధన్యుడవు. ఏలయన వేద వాక్యములన్న మిక్కిలి ప్రీతి గలవాడవు. ఈ గయకు వచ్చి పితృ దేవతలను మంత్రములతో, వ్రతములతో, జపములతో, హోమములతో, పిండ దానములతో తృప్తి పరచు చున్నావు.
శృణుష్వ చాన్యం నృపతి ర్బభూవ విశాలనామా స పురీం విశాలామ్,
ఉవాస ధన్యో ధృతిమా నపుత్రః స్వయం విశాలాధిపతి ర్ద్విజాగ్ర్యాన్,
పప్రచ్ఛ పుత్రార్థ మమిత్ర సాహస్తే బ్రాహ్మణా శ్చోచు రదీనసత్త్వాః.
రాజా! మరియొక సంగతి వినుము. విశాల నగరమున విశాలుడను రాజుండెడి వాడు. అతడు పుణ్యాత్ముడు ధైర్యము గలవాడు. అతనికి పుత్రులు లేరు. అంత నా విశాలాధిపతి బ్రాహ్మణ ప్రవరులను ‘పుత్రు లెట్లు కలుగదు’రని యడిగెను. ధృడమైన సత్త్వము గల ఆ బ్రాహ్మణు లిట్లు పలికిరి. (ఆమిత్రసాహః - శత్రువులను సహింప గలవాడు).
రాజన్ పితౄం స్తర్పయ పుత్రహేతోర్గత్వా గయా మన్నదానై రనేకైః,
ధ్రువం సుత స్తే భవితా నృపేశ సుసంప్రదాఆ సకలక్షితీశః,
రాజా! కుమారుల కొఱకు గయ కరిగి అన్న దానములు పెక్కు చేసి పితృ దేవతల నల రింపుము. నీకు తప్పక కొడుకు పుట్టును. అతడు గొప్ప దాతయు, సకల భూమికి ఎలికయు నగును.
ఇతీరితో బ్రాహ్మణౖః స ప్రహృష్టో రాజా విశాలాధిపతిః ప్రయత్నాత్,
ఆగత్య తేన ప్రవరేణ తీర్థే మఘాసు భక్త్యాథ కృతం పితౄణామ్.
బ్రాహ్మణు లిట్లు పలుకగా సంబర పడు ఆ విశాలాధిపతి పని గట్టుకొని మఘా నక్షత్ర మున్న దినము నందు భక్తితో పితృ దేవతలకు ఆ తీర్థమును తర్పనములు గావించెను.
పిండ ప్రదానం విధినా ప్రయత్నాద్దదద్ వియ త్యుత్తమమూర్తయ స్తాన్,
పశ్యన్ స పుంసః సితపీతకృష్ణానువాచ రాజా కిమిదం భవద్భిః,
ఉపేక్ష్యతే శంసత సర్వమేవ కౌతూహలం మే మనసి ప్రవృత్తమ్.
విధిని బట్టి ప్రయత్నముతో ఆతడు పిండ ప్రదానము గావించుచు ఆకసమున ఉత్తమ రూపములు తెల్లని, పచ్చని, నల్లని వర్ణములు గల మువ్వురు పురుషులను చూచి రాజు ‘తమరు ఊరకున్నారేల? నాకు కుతూహలము ఎక్కువగు చున్నది’ చెప్పుడు అని పలికెను.
తెల్లని వాడు:
అహం సిత స్తే జనకోస్మి తాత నామ్నా చ వృత్తేన చ కర్మణా చ,
అయం చ మే జనకో రక్తవర్ణో నృశంసకృద్ బ్రహ్మహా పాపకారీ.
తెల్లని వాడు:
నాయనా! నేను నీ తండ్రిని. పేరును బట్టియు, నడవడిని బట్టియు, చేష్టలను బట్టియు నన్ను సితు డందురు. ఎఱ్ఱని వన్నెగల యీయన నా తండ్రి, క్రూర కర్ముడు, బ్రహ్మ హత్య చేసిన వాడు. పాపపు పనులు చేయు వాడు.
అధీశ్వరో నామ పరః పితాస్య కృష్ణో వృత్త్యా కర్మణా చాపి కృష్ణః
ఏతేన కృష్ణేన హతాః పురావై జన్మన్యనేకే ఋషయః పురాణాః
ఈతని తండ్రి పేరు అధీశ్వరుడు. వృత్తిని బట్టియు, కర్మమును బట్టియు ఈతడు నల్లని వాడు. ఈ కృష్ణుడు ముందు జన్మమున పెక్కండ్రు పురాణ ఋషులను చంపి వైచెను.
ఏతౌ మృతౌ ద్వావపి పుత్ర రౌద్రమవీచి సంజ్ఞం నరకం ప్రపన్నౌ,
అధీశ్వరో మే జనకః పరోస్య కృష్ణః పితా ద్వా వపి దీర్ఘకాలమ్,
అహం చ శుద్ధేన నిజేన కర్మణా శక్రాసనం ప్రాపితో దుర్లభం తతః.
ఈ నా తండ్రియగు అధీశ్వరుడును, అతని తండ్రి కృష్ణుడును మరణించిన పిదప పరమ ఘోరమగు ‘అవీచి’ యను పేరు గల నరకమున పెద్ద కాలము పడి యుండిరి. నేను మాత్రము పవిత్రమగు కర్మము వలన, పొంద రానిదగు ఇంద్ర సింహాసనమును పొందితిని.
త్వయా పునర్మంత్రవిదా గయాయాం పిణ్డప్రదానేన బలా దిమౌ చ,
మేలాపితౌ తీర్థపిండ ప్రదాన ప్రభావతో మే నరకాశ్రితా వపి.
మంత్రములను చక్కగా ఎరిగిన నీవు గయ యందు పిండ ప్రదానము చేసి దాని బలము వలన నరకము నంటి యున్న వీరిరువురిని నాతో కలిపితివి. ఇది తీర్థమున పిండ ప్రదానము చేయుట వలన కలిగిన ప్రభావము.
పితౄన్ పితామహం స్తత్ర తథైవ ప్రపితామహాన్,
ప్రీణయా మీతి తత్తోయం త్వయా దత్త మరిందమ.
తండ్రులను, తాతలను, ముత్తాతలను ప్రీతి పొందింతునని నీవు ఆ జలమును వదలితివి.
తేనాస్మ ద్యుగపద్యోగో జాతో వాక్యేన సత్తమ,
తీర్థప్రభావాద్ గచ్ఛానుః పితృలోకం న సంశయః
ఆ నీ మాట వలన మా మువ్వురకు ఒక్క మారుగా కలయిక యేర్పడినది. ఈ తీర్థ మహిమ వలన మేము పితృ లోకమున కరుగుదుము. సంశయము లేదు.
అత్ర పిండప్రదానేన ఏతౌ తవ పితామహౌ,
దుర్గతా వపి సంసిద్ధౌ పాపకృ ద్వికృతిం గతౌ.
ఇచట పిండ ప్రదానము చేయుట చేత దుర్గతి చెందిన వారయ్యు, పరమ వికారము పొందిన వారయ్యు నీ తాత ముత్తాతలు సద్గతిని చేరు కొనిరి.
తీర్థ ప్రభావ ఏషోస్మిన్ బ్రహ్మఘ్నస్యాపి తత్సుతః,
పితుః పిణ్డప్రదానేన కుర్యా దుద్ధరణం పునః.
బ్రహ్మ హత్య చేసిన తండ్రికి కూడా ఈ తీర్థమున కొడుకు పిండ ప్రదానము చేసి తండ్రి నుద్దరింప గలడు. ఇది ఈ తీర్థ మహిమ.
ఏతస్మాత్ కారణాత్ పుత్ర అహ మేతౌ విగృహ్యవై,
ఆగతో స్మి భవన్తం వై ద్రష్టుం యాస్యామి సాంప్రతమ్,
ఏతస్మాత్ కారణాద్ రైభ్య భవాన్ ధన్యో మయోచ్యతే.
కుమారా! ఈ కారణమున నేను వీరిరువురిని కలుపు కొని నిన్ను చూచుటకు వచ్చితిని. ఇప్పుడు వెడలెదను. రైభ్యా! ఈ కారణము వలన నిన్ను నేను ‘ధన్యుడ’ వంటిని.
సకృద్ గయాభిగమనం సకృత్పిణ్డ ప్రదాపనమ్,
దుర్లభం త్వం పున ర్నిత్య మస్మిన్నేవ వ్యవస్థితః
ఒక్క మారు గయ కరుగుటయు, ఒక్క మారు అచట పితృ దేవతలకు పిండము లోసగుటయు చాల కష్టమైన పని. ఇక నీవన్ననో యిందే నివసించి యున్న వాడవు.
కిమనుప్రోచ్యతే రైభ్య తవ పుణ్య మిదం ప్రభో,
యేన సాక్షాద్ గదాపాణి ర్దృష్టో నారాయణః స్వయమ్.
రైభ్యా! నీ పుణ్యము నేమని వర్ణింతును! నీవు సాక్షాత్తు గదా పాణియగు నారాయణుని దర్శించితివి.
తతో గదాధరః సాక్షా దస్మింస్తీర్థే వ్వయవస్థితః,
అతోతి విఖ్యాతతమం తీర్థమేతద్ ద్విజోత్తమ.
బ్రాహ్మణ శ్రేష్ఠా! ఈ తీర్థమున గదను చేపట్టిన శ్రీమహా విష్ణువు నెలకొని యున్నాడు. కావుననే ఈ తీర్థమునకు గొప్పపేరు ప్రతిష్ఠలు కలిగినవి.
శ్రీవరాహ దేవుడు:
ఏవ ముక్త్వా మహాయోగీ తత్రై వాస్త రధీయత,
రైభ్యోపి చ గదాపాణే ర్హరేః స్తోత్ర మథాకరోత్.
శ్రీవరాహ దేవుడు:
ఇట్లు పలికి ఆ మహాయోగి అక్కడి కక్కడ అదృశ్యు డాయెను. రైభ్యుడును గదా పాణియగు హరిని ఇట్లు స్తుతించెను.
రైభ్యుడు:
గదాధరం విబుధజనై రభిష్టుతం ధృతక్షమం క్షుధితజనార్తి నాశనమ్,
శివం విశాలాసురసైన్య మర్ధనం నమామ్యహం హతసకలాశుభం స్మృతౌ.
రైభ్యుడు:
జ్ఞాన సంపన్నులు స్తుతించు వాడును, భూమిని ధరించిన వాడును, ఆకలి గొన్న జనుల దుఃఖమును పోకార్చు వాడును, మంగళ స్వరూపుడును, విశాలమైన రక్కసుల సేనను తుక్కుదూగరగా గొట్టు వాడును, స్మరించి నంత మాత్రమున కీడుల నన్నింటిని రూపు మాపు వాడును అగు గదాధర దేవునకు అంజలింతును.
పురాణ పూర్వం పురుషం పురుష్టుతం పురాతనం విమలమలం నృణాం గతిమ్,
త్రివిక్రమం ధృతధరణిం బలే ర్హరం గదాధరం రహసి నమామి కేశవమ్.
నేను ఏకాంతమున పురాణ పురుషుడు, గొప్పగా స్తుతులందు కొనువాడు, సనాతనుడు, స్వచ్చమైన వాడు, నరు లందరకు రక్షణ నొసగ గలవాడు, మూడు అడుగుల విజృంభణతో బలిని రూపు మాపి భూదేవి నుద్ధరించిన వాడు అగు గదాధర కేశవుని నమస్కరింతును.
సుశుద్ధభావం విభవై రుపావృతం శ్రియావృతం విగతమలం విచక్షణమ్,
క్షితీశ్వరై రపగతకిల్బిషైః స్తుతం గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్.
మిక్కిలి శుద్ధమైన భావములు గలవాడు, సకల సంపదలతో విలసిల్లు వాడు, లక్ష్మీ దేవికి ఆశ్రయ మిచ్చిన వాడు, దోషముల స్పర్శయు లేనివాడు, జ్ఞాన సంపన్నుడు, పాపములు పటా పంచలు చేసికొనిన రాజులకు కొలువ దగిన వాడు అగు గదా ధరునికి మ్రొక్కిన వాడు సుఖములతో చిర కాలము నిలిచి యుండును.
సురాసురై రర్చితపాదపఞ్కజం కేయూర హారాఞ్గద మౌళిధారిణమ్,
అబ్ధౌ శయానం చ రథాఞ్గపాణినం గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్.
దేవతలు, దానవులు పూజించిన పాద పద్మములు కలవాడు, కేయూరములు, అంగదములు, శిరో భూషణములు తాల్చు వాడు, సముద్రమున యోగ నిద్రలో నుండువాడు, చక్రము చేత దాల్చువాడు నగు గదా ధరునికి మ్రొక్కిన వాడు సుఖముగా నుండును.
సితం కృతే త్రేతాయుగేరుణం విభుం తథా తృతీయే పీతవర్ణ మచ్యుతమ్,
కలౌ ఘనాలిప్రతిమం మహేశ్వరం గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్.
కృత యుగమున తెల్లని వాడై, త్రేతా యుగమున ఎఱ్ఱని వాడై, మూడవదగు ద్వాపరమున పచ్చని వన్నె కలవాడై, కలి యుగమున నీల మేఘము వన్నె కల వాడైన మహా ప్రభువును గదా ధరుణి మ్రొక్కు వాడు సుఖముగా నుండును.
బీజోద్భవో యః సృజతే చతుర్ముఖ స్తథైవ నారాయణరూపతో జగత్,
ప్రపాలయేద్, రుద్రవపు స్తథాన్తకృద్ గదాధరోజయతు షడర్ధమూర్తిమాన్.
ఆ విష్ణువు బీజమున పుట్టిన బ్రహ్మ లోకములను పుట్టించును. నారాయణ రూపమున జగములను పాలించును. అట్లే రుద్ర దేహముతో లయము కావించును. ఇట్లు మూడు రూపములు గల ఆ గదా ధరుడు జయము పొందు గాక.
సత్త్వం రజ శ్చైవ తమో గుణాస్త్రమ స్త్వేతేషు నాన్యస్య సముద్భవః కిల,
స చైక ఏవ త్రివిధో గదాధరో దధాతు ధైర్యం మమ ధర్మమోక్షయోః.
సత్వము, రజస్సు, తమస్సు అని గుణములు మూడు. ఈ మూడింటికి మరియొక పుట్టుక స్థానము లేదు. ఆ గదాధర దేవు డొక్కడే ఈ మూడు తీరులలో నుండును. అట్టి ప్రభువు నా ధర్మ మోక్షములకు దగిన బుద్ధి సంపదను ప్రసాదించు గాక.
సంసారతోయార్ణవ దుఃఖ తన్తుభిర్వియోగ నక్రక్రమణౖః సుభీషణౖః,
మజ్జన్త ముచ్ఛైః సుతరాం మహాప్లవే గదాధరో మాము దధాతు పోతవత్.
సంసార మనెడు నీరు గల సముద్రమున దుఃఖముల త్రాళ్ళతో, వియోగము లనెడు మిక్కిలి భయము గొల్పు మొసళ్ళ విజృంభణలతో కూడిన తరంగములలో మునకలు వేయుచున్న నన్ను గదా దరుడు నావ వలె ఉద్ధరించు గాక!
స్వయం త్రిమూర్తిః స్వమివాత్మ నాత్మని స్వశక్తిత శ్చాణ్డ మిదం ససర్జ హ,
తస్మింజలో త్థాసన మార్యతేజసం ససర్జ యస్తం ప్రణతోస్మి భూధరమ్.
తనకు తానై మూడు రూపములు తాల్చి, తనలో తాను తన శక్తి చేత ఈ బ్రహ్మాండమును సృజించెను. అందు మహా తేజస్సు గల బ్రహ్మను గూడ సృష్టించెను. అట్టి భూ ధరుడగు దేవునకు సర్వము సమర్పణ చేసి కొందును. (జల + ఉత్థ + ఆసనమ్ = నీటి నుండి పుట్టిన పద్మము ఆసనముగా గలవాడు = బ్రహ్మ)
మత్స్యాదినామాని జగత్సు కేవలం సురాది సంరక్షణతో వృషాకపిః,
ముఖ్యస్వరూపేణ సమస్తతో విభుర్గదాధరో మే విదధాతు సద్గతిమ్.
కేవలము దేవతలు మొదలగు వారిని కాపాడుటకై మత్స్యము మొదలగు పేరులను లోకము లందాతడు తాల్చెను. కాని ముఖ్య స్వరూపముతో ఎల్ల యెడల విరాజిల్లు ప్రభువాతడు. అట్టి గదా దరుడు నాకు సద్గతిని కూర్చు గాక! (వృషమనగా ధర్మము, కపి యనగా వరాహ మూర్తి, ‘కమ్’ అనగా నీరు – దాని నుండి భూమి నుద్ధరించిన వాడు – వృషాకపి యనగా ధర్మ రూపుడును, వరాహ రూపుడును అని యర్థము.)
శ్రీవరాహ దేవుడు:
ఏవం స్తుత స్తదా విష్ణుర్భక్త్యా రైభ్యేణ ధీమతా,
ప్రాదుర్బభూవ సహసా పీతవాసా జనార్దనః
శ్రీవరాహ దేవుడు:
బుద్ధిశాలి యగు రైభ్యు డిట్లు భక్తితో స్తుతింపగా పీతాంబరుడగు జనార్దనుడు వెంటనే యచట సాక్షాత్కరించెను.
శంఖచక్రగదాపాణి ర్గరుడస్థో వియద్గతః,
ఉవాచ మేఘగమ్భీరధీరవాక్ పురషోత్తమః.
శంఖము, చక్రము, గద అను వానిని చేతులతో తాల్చిన వాడు, గరుడ వాహనముపై నున్న వాడు, ఆకసమున నిలిచిన వాడు నగు పురుషోత్తముడు మేఘము వలె గంభీరము స్ఫుటము నగు వాక్కుతో నిట్లు పలికెను.
తుష్టోస్మి రైబ్య భక్త్యా తే స్తుత్యా చ ద్విజసత్తమ,
తీర్థస్నానేన చ విభో బ్రూహి యత్తేభివాంచితమ్.
రైభ్యా! నీ భక్తి చేతను, స్తోత్రము చేతను తీర్థ స్నానము చేతను ప్రీతి పొందితిని. నీకు మిక్కిలి యిష్టమగు కోరిక యేమో తెలుపుము.
రైభ్యుడు:
గతిం మే దేహి దేవేశ యత్ర తే సనకాదయః,
వసేయం తత్ర యేనాహం త్వత్ప్రసాదాద్ గదాధర.
రైభ్యుడు:
గదాధరా! దేవేశా! నీ దయ వలన నేను సనకుడు మొదలగు సిద్ధు లుండు తావున వసింతును. నాకందు గతి నొసగుము.
దేవుడు:
ఏవ మస్త్వితి తే బ్రహ్మ న్నిత్యుక్త్వాన్త రధీయత,
భగవా నపి రైభ్యస్తు దివ్యజ్ఞాన సమన్వితః
క్షణాద్ బభూవ దేవేన పరితుష్టేన చక్రిణా,
జగామ యత్ర తే సిద్ధాః సనకాద్యా మహర్షయః
దేవుడు:
బ్రాహ్మణా! అట్లే యగు గాక! అని పలికి భగవంతుడు అదృశ్యు డాయెను. రైభ్యుడును దివ్య జ్ఞానము కలవాడై పరితుష్టు డైన చక్రపాణి యగు దేవునితో కూడి సనకాది సిద్ధ మహర్షులున్న చోటి కరిగెను.
ఏతచ్చ రైభ్యనిర్దిష్టం స్తోత్రం విష్ణో ర్గదాభృతః,
యః పఠేత్ స గయాం గత్వా పిణ్డదానాద్ విశిష్యతే.
ఇట్లు రైభ్యుడు నిరూపించిన గదాధర దేవుని స్తోత్రమును పటించు వాడు గయ కరిగి పిండ ప్రదానము చేసి మేలు పొందును.