అధ్యాయము - 101

హోత:

గుడధేనుం ప్రవక్ష్యామి సర్వకామార్థ సాధనీమ్‌,

అనులిప్తే మహీపృష్ఠే కృష్ణాజినకుశాస్తృతే,

తస్యోపరికృతం వస్త్రం గుడమానీయ పుష్కలమ్‌

కృత్వా గుడమయీం ధేనుం సవత్సాం కాంస్యదోహనీమ్‌,

సౌవర్ణముఖశృంగాం చ దంతాశ్చ మణిమౌక్తికైః.

గ్రీవా రత్నమయీ త్వస్యా ఘ్రాణం గన్ధమయం తథా,

శృంగౌ చాగురుకాష్ఠేన పృష్ఠం తామ్రమయం తథా.

కాంస్యోపదోహనం తస్యాః పుచ్ఛం క్షౌమమయం స్మృతమ్‌,

ఇక్షుపాదాం రౌప్యఖురాం కమ్బలే పట్టసూత్రకమ్‌.

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన ఘణ్టా చామరభూషితామ్‌,

కాంస్యోపదోహనీం పాత్రీం సర్వాభరణ భూషితామ్‌.

ప్రశస్తపత్రశ్రవణాం నవనీతస్తనీం బుధః,

ఫలై ర్నానావిధై స్తస్యా ఉపశోభం ప్రకల్పయేత్‌.

హోత:

గుడ ధేనువును గూర్చి చెప్పెదను. ఇది కోరికల నన్నింటిని తీర్చునది. అలికిన నేలపై లేడి చర్మము, దర్భా సనము పరచ వలయును. దానిపై వస్త్రము నుంచి పుష్కలముగా బెల్లమును తెచ్చి దూడతో కూడిన ఆవు స్వరూపమును దానితో చేయ వలయును. కంచు పాత్రను ఉంచ వలయును. బంగారముతో ముఖమును కొమ్ములను, మణులతో ముత్యములతో దంతములను, రత్నములతో మెడను, గంధముతో ముక్కును, అగురు కట్టెతో కొమ్ములను, రాగితో వెనుక భాగమును, పాలుపిదుకు కంచు పాత్రను, నార బట్టతో తోకను, చెరకు గడలతో కాళ్లను, వెండితో గిట్టలను, మెడకు పట్టు దారమును కూర్ప వలయును. జమిలి బట్టలతో దానిని కప్ప వలయును, గంటలతో చామరములతో అలంకరింప వలయును. అన్ని విధములగు ఆభరణములతో పితుకు పాత్ర నలంకరింప వలయును. మేలైన ఆకులతో చెవులను, వెన్నతో పొదుగును చేయ వలయును. పెక్కు విధములగు ఫలములతో చుట్టును అందముగా అలంకరింప వలయును.

ఉత్తమా గుడధేనుః స్యాత్‌ సదా భారచతుష్టయమ్‌,

మాగథేన తు తౌల్యేన చతుర్థాంశేన వత్సకమ్‌.

మగధ దేశపు నాలుగు బారువుల తూకపు బెల్లపు ఆవు ఉత్తమ. నాలుగవ వంతు బెల్లముతో దూడను చేయ వలయును. (బారువు = 8000 తులములు)

మధ్యమా చ తదర్థేన భారేణౖకేన చాధమా,

విత్తహీనో యథాశక్త్యా శతై రష్టాభిః కారయేత్‌,

అత ఊర్ధ్వంతు కర్తవ్యం గృహవిత్తానుసారతః.

అందులో సగముతో మధ్యను, ఒక్క బారువు తోనైన అధమ. ధనము లేనివాడు ఎనిమిది వందల తులములతో నైనను శక్తి మేరకు చేయ నగును. ఇంటిలోని ధనము ననుసరించి అటుపై చేయ వలయును.

గన్ధపుష్పాదిభిః కృత్వా ధూపనైవేద్య దీపకాన్‌,

ఈదృశీం కల్పయిత్వాతు బ్రాహ్మణాయ నివేదయేత్‌,

సాధువృత్తాయ శాన్తాయ తథామత్సరిణే నృప.

గంధములతో, పూవులతో, ధూపముతో, నైవేద్యముతో, దీపములతో పూజించి, మంచి నడవడి కలవాడు, శాంతుడు, అసూయ లేని వాడు అగు బ్రాహ్మణునకు నివేదింప వలయును.

ఏవం కృత్వా ద్విజేన్ద్రాయ ఆహితాగ్నే ర్విశేషతః,

ఈదృశాయ ప్రదాతవ్యా సహస్రకనకేన తు.

తదర్థేన మహారా తస్యాప్యర్థేన వా పునః,

శతేన వా శతార్థేన యథాశక్త్యాతు దాపయేత్‌.

ఇట్లు విశేషించి ఆహితాగ్ని అయిన ఉత్తమ బ్రాహ్మణునకు వేయి బంగారు నాణములతో ఆ ఆవును దాన మీవలెను. మహారాజా! అందులో సగ మైనను, సగములో సగ మైనను, నూరైనను, అందు సగ మైనను శక్తి మేరకు దానమీయ వలయును.

గన్ధ వస్త్రాదిభిః కృత్వా ముద్రికా కర్ణపాత్రకైః,

ఛత్రికా పాదుకే దత్త్వా ఇమం మన్త్రముదీరయేత్‌.

గంధ వస్త్రాదులతో, కర్ణా భరణములతో గొడుగు పాదుకలతో ఇచ్చుచు ఈ మంత్రమును పలుక వలయును.

యాశ్రియాదీని మన్త్రాణి పుర్వోక్తాని స్మరేద్‌ బుధః,

ప్రాజ్ముఖోదజ్ముఖో వాపి బ్రాహ్మణాయ నివేదయేత్‌.

తూర్పునకు గాని, ఉత్తరమునకు గాని ముఖము పెట్టి “యాశ్రియా” ఇత్యాది మంత్రములను ముందు చెప్పిన వానిని స్మరించుచు బ్రాహ్మణునకు దానమీయ వలయును.

వాచాకృతం కర్మకృతం మనసా యద్విచిన్తితమ్‌,

మానకూటం తులాకూటం కన్యానృతం గవానృతమ్‌,

తత్సర్వం నాశయేత్‌ పాపం గుడధేను ర్ద్విజార్పితా.

బ్రాహ్మణునకు సమర్పించిన ఈ గుడ ధేనువు మాటతో చేష్టతో, మనసుతో చేసిన పాపములను, మాన విషయముగా, తూకము విషయముగా చేసిన వంచనలను, కన్య విషయములో, గోవు విషయములో ఆడిన అ బద్ధములను ఈ సర్వ పాపములను నశింప జేయును.

దీయమానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమాం గతిమ్‌,

యత్ర క్షీరవహా నద్యః పయః పాయసకర్దమాః,

మునయో ఋషయస్సిద్ధా స్తత్ర గచ్ఛన్తి ధేనుదాః.

ఇట్లు గుడ ధేనువును దానమిచ్చు చుండగా చూచు వారును పరమ గతి కరుగుదురు. పాలు పాయసములే బురదగా నున్న పాల నదులు ప్రవహించు చోటికిని, మునులు, ఋషులు, సిద్ధులు ఉండు చోటికిని ఈ ధేను దానము చేసిన వారరు గుదురు.

దశపూర్వాన్‌ దశపరాన్‌ తారయేద్‌ గుడ ధేనుదః,

అయనే విషువే పుణ్యేవ్యతీపాతే దినక్షయే,

సర్వదైవ ప్రదాతవ్యా పాత్రం దృష్ట్వా మహామతే.

గుడ ధేనువు నిచ్చు వాడు ముందు పది తరముల వారిని, వెనుక పది తరముల వారిని తరింప జయును. అయన పర్వములలో, విషువ మునందును, వ్యతీపాతము నందును, శూన్య తిథి యందును యోగ్యుడైన వ్యక్తి నెన్నుకొని అన్ని విధముల ఈ దానమును భద్రముగా చేయ వలయును.

ఏతదేవ విధానం స్యా దేతే చోపస్కరాః స్మృతాః,

మంత్రావాహన సంయోగః సదా పర్వణి పర్వణి.

ఇదియే విధానము. ఇవియే వస్తు సామగ్రి, ఇదే మంత్ర, ఆవాహన సంయోగము, ప్రతి పర్వము నందును ఇట్లే చేయ వలయును.

గుడధేనుః ప్రదాతవ్యా భుక్తిముక్తి ఫలప్రదా,

సర్వకామప్రదా నిత్యం సర్వపాపహరా శుభా.

ఈ గుడధేను దానము భుక్తిని ముక్తిని ఒసగునది. అన్ని కోరికలను తీర్చునది. సర్వ పాపములను హరించునది.

గుడధేనోః ప్రసాదాత్‌ తు సౌభాగ్యమఖిలం లభేత్‌,

వైష్ణవం పద మాప్నోతి స్మరణే స్మరణే హరేః,

గుడ ధేనువు అనుగ్రహము వలన మానవుడు సంపూర్ణ మగు సౌభాగ్యమును పొందును. హరి ప్రతి స్మరణము నందును విష్ణు పదమును చేరును.