వరాహ మహా పురాణము
అధ్యాయము - 62
అగస్త్యుడు:
అధాపరం మహారాజ వ్రత మారోగ్య సంజ్ఞితమ్,
కథయామి పరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్.
మహారాజ! మిక్కిలి పుణ్యమైనది, పాపము లన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియ జేసెదను.
తస్యైవ మాఘమాసస్య సప్తమ్యాం సముపోషితః,
పూజయేద్ భాస్కరం దేవం విష్ణురూపం సనాతనమ్.
మాఘ మాసము శుక్లపక్ష సప్తమి నాడు ఉపవాస ముండి విష్ణు రూపుడు, సనాతనుడు నగు భాస్కర దేవుని పూజింప వలయును.
ఆదిత్య భాస్కర రవే భానో సూర్య దివాకర,
ప్రభాకరేతి సంపూజ్య ఏవం సంపూజ్యతే రవిః.
ఆదిత్యా! భాస్కరా! రవీ! భానూ! సూర్యా! దివాకరా! ప్రభాకరా! అనుచు పూజింప వలయును.
షష్ఠ్యాం చైవ కృతాహారః సప్తమ్యాం భాను మర్చయేత్,
అష్టమ్యాం చైవభుంజీత ఏష ఏవ విధిక్రమః.
షష్ఠినాడు ఆహారము తీసికొని సప్తమి నాడు భానుని పూజింప వలయును. అష్టమి నాడు మరల భోజనము చేయ వలయును. ఇది యిందలి విధి క్రమము.
అనేన వత్సరం పూర్ణం విధినా యోర్చయేద్ రవిమ్,
తస్యారోగ్యం ధనం ధాన్య మిహ జన్మని జాయతే,
పరత్ర చ శుభం స్థానం యద్గత్వా సనివర్తతే.
ఈ విధితో ఒక నిండు సంవత్సరము సూర్యు నర్చించు వానికి ఈ జన్మమున ఆరోగ్యము, ధనము, ధాన్యము లభించును. పరమున, మరల తిరిగి రాని శుభ స్థానము (మోక్షము) కలుగును.
సార్వభౌమః పురా రాజా అనరణ్యో మహాబలః,
తేనాయ మర్చితో దేవో వ్రతే నానేన పార్థివ,
తస్య తుష్టో వరం దేవః ప్రాదా దారోగ్య ముత్తమమ్.
మునుపు అనరణ్యుడను గొప్ప బలము గల రాజు ఈ వ్రతముతో భాస్కరుని అర్చించెను. అతని యెడ తుష్టుడై ఆ దేవుడు ఉత్తమ మగు ఆరోగ్యమును ప్రాసాదించెను.
భద్రాశ్వుడు:
కిమసౌ రోగవాన్ రాజా యేనారోగ్య మవాప్తవాన్,
సార్వభౌమస్య చ కథం బ్రహ్మన్ రోగస్య సంభవః.
భద్రాశ్వుడు:
ఈ వ్రతముతో ఆరోగ్యమును పొందిన ఆరోగ్యము గల రాజెవ్వడు? సార్వభౌమునకు అంతటి రోగమెట్లు కలిగినది?
అగస్త్యుడు:
స రాజా సార్వభౌమోభూద్ యశస్వీచ సురూపవాన్,
స కదాచిన్నృపశ్రేష్ఠో నృపశ్రేష్ఠ మహాబలః.
గతవాన్ మానసం దివ్యం సరో దేవగణాన్వితమ్,
తత్రా పశ్యద్ బృహత్ పద్మం సరో మధ్యగతం సితమ్.
ఆతడు సార్వభౌముడును, గొప్ప కీర్తియగు మంచి రూపమును కలవాడై యుండెను. ఒకనాడా రాజశ్రేష్ఠుడు మహా బలుడు దేవ గణములతో కూడినదియు దివ్యమును అగు మానస సరోవరమున కరిగెను. అందు సరస్సు నడుమ నున్న తెల్లని పెద్ద తామర పూవును చూచెను.
తం దృష్ట్వా సారథిం ప్రాహ పద్మమేతత్ సమానయ,
ఇదం తు శిరసా బిభ్రత్ సర్వలోకస్య సన్నిధౌ,
శ్లఘనీయో భవిష్యామి తస్మాదాహర మాచిరమ్.
చూచి సారథితో ఇట్లనెను, ఈ పద్మమును కొని రమ్ము. దీనిని తలపై తాల్చి అందరి యెదుట ప్రశంసకు పాత్రుడ నగుదును. కనుక ఆలసింపక కొనిరమ్ము.
ఏవ ముక్త స్తదా తేన సారథిః ప్రవివేశ హ,
గ్రహీతు ముపచక్రామ తం పద్మం నృపసత్తమ.
ఇట్లు రాజు పలుకగా సారథి ఆ కొలను లోనికి ప్రవేశించి ఆ పద్మమును కైకొన నుంకించెను.
స్పృష్జమాత్రే తతః పద్మే హుంకారః సమజాయత,
తేన శబ్దేన సత్రస్తః పపాత చ మమార చ.
ఆ పద్మమును తాకినంత మాత్రమున ఒక హుంకారము బయలు వెడలెను. ఆ శబ్దముతో ఆతడు భీతుడై నేల గూలి మరణించెను.
రాజా చ తత్క్షణాత్ తేన శబ్దేన సమపద్యత,
కుష్ఠీ విగతవర్ణశ్చ బలవీర్యవివర్జితః.
నృపతియు ఆ శబ్దముతో ఒక్క పెట్టున రంగు మారిపోయి కుష్ఠియు, బల వీర్యములు లేని వాడును ఆయెను.
తథాగత మథాత్మానం దృష్ట్వా స పురుషర్షభః,
తస్థౌ తత్రైవ శోకార్తః కిమేత దితి చిన్తయన్.
అట్లు అయిన తన్ను చూచుకొని ఆ పురుష వరేణ్యుడు శోకము పైకొనగా ఇది ఏమి? అని చింతించుచు అందే ఉండెను.
తస్య చిన్తయతో ధీమా నాజగామ మహాతపాః,
వసిష్ఠో బ్రహ్మపుత్రోథ తం స పప్రచ్ఛ పార్థివమ్.
అట్లు చింతించు చుండగా ఆతని కడకు మహా తపస్వి బ్రహ్మ పుత్రుడు, బుద్ధి శాలియునగు వసిష్ఠు డరుదెంచి ఆ రాజు నిట్లడిగెను.
కథం తే రాజశార్దూల తవ దేహస్య శాసనమ్,
ఇదానీ మేవ కిం కార్యం తన్మమాచక్ష్వ పృచ్ఛతః.
మహారాజా! నీ దేహమునకీ శిక్ష యేమి? ఇప్పుడు నీవు చేయ వలసిన దేమి? నాకు చెప్పుము.
ఏవ ముక్త స్తతో రాజా వసిష్ఠేన మహాత్మనా,
సర్వం పద్మస్య వృత్తాంతం కథయామాస సప్రభుః.
ఇట్లు మహాత్ముడగు వసిష్ఠుడు పలుకగా ఆ రాజు ఆ పద్మ వృత్తాంతము నంతటిని ఆతనికి తెలిపెను.
తం శ్రుత్వా స ముని స్తత్ర సాధు రాజ న్నథాబ్రవీత్,
అసాధు రథవా తిష్ఠ తస్మాత్ కుష్ఠిత్వ మాగతః.
అది విని ముని రాజా! నీవు మంచి వాడవు, చెడ్డ వాడవు అయితివి కనుక నీకీ కుష్ఠరోగము కలిగినది. అని పలికెను.
ఏవ ముక్త స్తదా రాజా వేపమానః కృతాంజలిః,
పప్రచ్ఛ సాధ్వహం విప్ర కథవా సాధ్వహం మునే,
కథం చ కుష్ఠం మే జాత మేతన్మే వక్తు మర్హసి.
అతడట్లు పలుకగా రాజు చేతులు జోడించి వణకి పోవుచు విప్రా! నేనెట్లు సాధువను, అసాధువను అయితిని? నాకీ కుష్ఠరోగ మెట్లు వచ్చినది? దీనిని నీవు చెప్ప వలయునని పలికెను.
వసిష్ఠుడు:
ఏతద్ బ్రహ్మోద్భవం నామ పద్మం త్రైలోక్య విశ్రుతమ్,
దృష్టమాత్రేణ చానేన దృష్టాః స్యుః సర్వదేవతాః,
ఏతస్మిన్ దృశ్యతే చైతత్ షణ్మాసం క్వాపి పార్థివ.
వసిష్ఠుడు:
రాజా! ఇది మూడు లోకములలో ప్రసిద్ధి కెక్కిన బ్రహ్మోద్భవ మను పద్మము. దీనిని చూచినంతనే సర్వ దేవతలును కానవత్తురు. ఇది ఎందైనను ఆరు నెలలు మాత్రమే కాన వచ్చును.
ఏతస్మిన్ దృష్టమాత్రే తు యో జలం విశతే నరః,
సర్వపాప వినిర్ముక్తః పరం నిర్వాణ మర్హతి.
దీనిని చూచినంతనే జలమున ప్రవేశించు నరుడు పాపము లన్నింటిని పాడు చేసికొని మోక్షమును పొందును.
బ్రహ్మణః ప్రాగవస్థాయా మూర్తి రప్సు వ్యవస్థితా,
ఏతాం దృష్ట్వా జలే మగ్నః సంసారాద్ విప్రముచ్యతే.
బ్రహ్మము యొక్క మొదటి దశయగు మూర్తి నీటి యందు నెలకొని యున్నది. దానిని చూచి జలమున మునిగిన వాడు సంసారము నుండి ముక్తి పొందును.
ఇమం చ దృష్ట్వా తే సూతో జలే మగ్నో నరోత్తమ,
ప్రవిష్టశ్చ పున రిమం హర్తు మిచ్ఛ న్నరాధిప,
ప్రాప్తవానసి దుర్బుద్ధౌ కుష్ఠిత్వం పాపపూరుష.
రాజా! దీనిని చూచి, దానిని కైకొనుటకై జలమున మునిగి నీ సూతుడు సుగతి కరిగెను. నీవు పాడు బుద్ధితో ఈ కుష్ఠ రోగమును పొందితివి.
దృష్ట మేతత్ త్వయా యస్మాత్ త్వం సాధ్వితి తతః ప్రభో,
మయోక్తో మోహ మాపన్న స్తేనా సాధు రితీరితః.
నీవు దీనిని చూచి నందు వలన నిన్ను నేను ‘సాధువు’ అంటివి. మోహము పొందితిని కావున ‘అసాధుడవు’ అంటిని.
బ్రహ్మపుత్రో హ్యహం చేమం పశ్యామి పరమేశ్వరమ్,
అహన్యహని చాగచ్ఛం స్తం పున ర్దృష్టవానసి.
నేను బ్రహ్మ పుత్రుడను. నేను ప్రతి దినము వచ్చి ఈ పరమేశ్వరుని చూచు చుందును. అట్లే నీవును చూచితివి.
దేవా అపి వదన్త్యేతే పద్మం కాంచన ముత్తమమ్,
మానసే బ్రహ్మపద్మంతు దృష్ట్వా చాత్ర గతం హరిమ్,
ప్రాప్స్యామ స్తత్ పరం బ్రహ్మ యద్ గత్వా న పునర్భవేత్.
ఈ బంగారు పద్మమును గాంచి దేవతలును బ్రహ్మ పద్మ రూపమున మానస సరోవర మునకు హరి వచ్చి యున్నాడు మేము మరల తిరిగి వచ్చుటన్నది లేని ఆ పర బ్రహ్మమును పొందె దమని పలుకుదురు.
ఇదం చ కారణం చాన్యత్ కుష్ఠస్య శృణు పార్థివ,
ఆదిత్యః పద్మగర్భేస్మిన్ స్వయమేవ వ్యవస్థితః.
తం దృష్ట్వా తత్వతో భావః పరమాత్మై ష శాశ్వతః,
ధారయామి శిరస్యేనం లోకమధ్యే విభూషణమ్.
ఏవం తే జల్పతా పాప మిదం దేవేన దర్శితమ్,
ఇదానీ మిమమేవ త్వా మారాధయ మహామతే.
రాజా! నీ కుష్ఠ రోగమునకు కారణమును కూడ చెప్పెదను వినుము. ఈ పద్మము గర్భమున స్వయముగా సూర్య దేవుడు నెలకొని యున్నాడు. ఆతడు నిజమునకు శాశ్వతుడగు పరమాత్మయే అట్టి ఈ పద్మమును గాంచి నీవు దీనిని తలపై విభూషణముగా తాల్చి లోకమున వెలిగి పోయెద నని భావించితివి. ఇట్లు వాగిన నీకు ఈ పాపము నా దేవుడు చూపెను. నీవిపుడా దేవునే ఆరాధింపుము.
అగస్త్యుడు:
ఏవ ముక్త్వా వసిష్ఠస్తు ఇమ మేవ వ్రతం తదా,
ఆదిత్యారాధనం దివ్య మారోగ్యాఖ్యం జగాద హ.
అగస్త్యుడు:
ఇట్లు పలికి ఆ వసిష్ఠ మహర్షి ఆతనికి ఆరోగ్య వ్రతమను పేరుగల ఈ వ్రత విధానమును, సూర్య ఆరాధన పద్ధతిని వివరించెను.
సోపి రాజాకరో చ్చేమం వ్రతం భక్తి సమన్వితః,
సిద్ధించ పరమం ప్రాప్తో విరోగశ్చాభవత్ క్షణాత్.
ఆ రాజును భక్తితో కూడిన వాడై ఈ వ్రతమును కావించెను. పరమ సిద్ధిని పొందెను. వెను వెంటనే రోగము లేని వాడాయెను.