వరాహ మహా పురాణము
అధ్యాయము - 36
మహా తపుడు:
ఆదిత్రేతాసు రాజానో మణిజా యే ప్రకీర్తితాః,
కథయిష్యామి తాన్ రాజన్ యత్ర జాతోసి పార్థివ.
మహా తపుడు:
రాజా! మొదటి త్రేతా యుగమున మణి వలన పుట్టిన రాజులుగా ప్రసిద్ధి చెందిన వారిని గూర్చి తెలిపెదను. నీవు ఆ వంశముననే కదా పుట్టితివి!
యో సౌ సుప్రభానామాసీద్ సత్వంరాజన్ కృతేయుగే,
జాతోసి నామ్నా విఖ్యాతః ప్రజాపాలేతి శోభనః.
కృత యుగమున సుప్రభుడను పేరు గల రాజవు నీవే. అట్టి నీవు ప్రజా పాలుడను పేరున ఉత్తముడవై పుట్టితివి.
శేషా స్త్రేతాయుగే రాజన్ భవిష్యన్తి మహాబలాః,
యో దీప్త తేజా మణిజః స శన్తేతి ప్రకీర్తితః.
తక్కిన వారందరు త్రేతా యుగమున గొప్ప బలము గలవారై పుట్టుదురు. మణి వలన పుట్టిన దీప్త తేజుడు శంతుడను ఖ్యాతి నొంది జనించును.
సురశ్మి ర్భవితా రాజా శశకర్ణో మహాబలః,
శుభదర్శనః పాంచాలో భవిస్యతో నరాధిపః.
సురశ్మియను రాజు శశకర్ణుడను పేరున గొప్ప బలముతో పుట్టును. శుభ దర్శనుడను రాజు పాంచాలు డగును.
సుశాంతి రంగ వంశే వై సుందరో ప్యంగ ఇత్యుత,
సున్దశ్చ ముచుకున్దోభూత్ సుద్యుమ్న స్తుర ఏవచ.
అంగ వంశమున సుశాంతి సుందరుడై పుట్టెను. సుందుడు ముచుకుందు డయ్యెను. సుద్యుమ్నుడు తురుడై పుట్టెను.
సుమనాః సోమదత్తస్తు శుభః సంవరణోభవత్,
సుశీలో వసుదానస్తు సుఖదోసుపతి ర్భవత్.
సుమనుడు సోమదత్తుడు గను, శుభుడు సంవరణుడు గను, సుశీలుడు వసుదానుడు గను, సుఖదుడు అసుపతి గను పుట్టిరి.
శంభుః సేనాపతి రభూత్ కాంతో దశరథః స్మృతః,
సోమోభూ జ్జనకో రాజా ఏతే త్రేతాయుగే నృప.
శంభుడు సేనాపతి యాయెను. కాంతుడు దశరథు డయ్యెను. సోముడు జనక మహా రాజాయెను. త్రేతా యుగమున వీరిట్లు జన్మించిరి.
సర్వే భూమి మిమాం రాజన్ భుక్త్వా తే వసుధాధిపాః,
ఇష్ట్వా చ వివిధై ర్యజ్ఞై ర్దివం ప్రాప్యన్త్య సంశయమ్.
రాజా! ఈ రాజు లందరు ఈ భూమి భోగములను పొంది, పెక్కు విధములగు యజ్ఞము లాచరించి స్వర్గమునకు చేరుకొందురు.
శ్రీవరాహ దేవుడు:
ఏవం శ్రుత్వా సరాజర్షి ర్బ్రహ్మ విద్యామృతం ప్రభుః,
ఆఖ్యానం పరమం ప్రీతి స్తప శ్చర్తు మియాద్ వనమ్.
శ్రీవరాహ దేవుడు:
ఇట్లు బ్రహ్మ విద్యయను అమృతము గల అత్యుత్తమ మగు కథను విని ఆ రాజర్షి ప్రీతుడై తపస్సు చేయుటకై అడవి కరిగెను.
ఋషి రధ్యాత్మయోగేన విహాయేదం కళేబరమ్,
బ్రహ్మభూతో భవద్ ధాత్రి హరౌ లయ మవాప చ.
భూదేవీ! ఋషియును అధ్యాత్మ యోగముచే ఈ దేహమును విడచి బ్రహ్మము గానై హరియందు లీన మయ్యెను.
వృందావనం చ రాజాసౌ తపోర్థం గతవాన్ ప్రభుః,
తత్ర గోవింద నామానం హరిం స్తోతు మథారభత్.
ఈ రాజు తపస్సు కొఱకు బృందా వనమున కరిగెను. అచట గోవింద నామము గల హరిని కొనియాడ దొరకొనెను.
రాజు:
నమామి దేవం జగతాం చ మూర్తిం గోపేంద్ర మింద్రానుజ మప్రమేయమ్,
సంసారచక్ర క్రమణైకరక్షం క్షితీధరం దేవవరం నమామి.
రాజు:
దేవునకు, జగత్తులకు స్వరూప మైన వానికి, గోప దేవునకు, ఇంద్రుని తమ్మునకు, ఊహింప నలవి కాని వానికి, సంసార చక్రమును దాటించుటలో నేర్పు గలవానికి, భూమికి పట్టుగొమ్మ అయిన వానికి దేవ వరునకు నీకు నమస్కరింతును.
భవోదధౌ దుఃఖశతోర్మిభీమే, జరావర్తే కృష్ణ పాతాళమూలే
తదన్త మేకో దధతే సుఖం మే నమోస్తు తే గోపతి రప్రమేయ.
ఈ సంసార మొక సముద్రము. ఇది వందల కొలది దుఃఖము లనెడు తరంగములతో భయపెట్టు చుండును. ముసలి తనమే యిందలి సుడులు. చీకటితో నిండిన పాతాళమే దీనికి మూలము. అట్టి దీనిని నాశనము చేయగల వాడవు నీవొక్కడవే. సుఖమును గూర్చు వాడవును నీవే. ఓ గోపతీ! అప్రమేయా! అట్టి నీకు మ్రొక్కులు.
వ్యాధ్యాదియుక్తైః పురుషై ర్గ్రహైశ్చ సంఘట్టమానం పునరేవ దేవ,
నమోస్తు తే యుద్ధరతే మహాత్మనే జనార్దనోపేంద్ర సమస్తబందో.
దేవా! వ్యాధులతో, గ్రహ బాధలతో కూడిన మానవు లందరు నిన్ను ఆశ్రయింతురు. ఓ మహాత్మా! జనార్దనా! అట్టి వ్యాధులు మున్నగు వానితో పోరాడుట యందు మిక్కిలి ఆసక్తి కలవాడవు. గోపేంద్రా! సమస్తమునకు చుట్టమైన వాడా! నీకు నమస్కారము.
త్వముత్తమః సర్వవిదాం సురేశ త్వయా తతం విశ్వమిదం సమస్తమ్,
గోపేంద్ర మాం పాహి మహానుభావ భవాద్భీతం తిగ్మరథా జ్గపాణే.
సర్వము నెరిగిన వారిలో నీవు శ్రేస్ఠుడవు. దేవ దేవా! ఈ విశ్వ మంతయు నీతో నిండి యున్నది. గోపేంద్రా! సంసారము వలన భయ పడిన నన్ను, వాడియగు చక్రమును చేత దాల్చిన స్వామీ! కాపాడుము.
పరోసి దేవ ప్రవరః సురాణాం పుంసః స్వరూపోసి శశిప్రకాశః,
హుతాశ వక్త్రాచ్యుత తీవ్రభావ గేపేంద్ర మాం పాహి భవే పతన్తమ్.
దేవా! నీవు సర్వమునకు పరుడవు. దేవులలో మిక్కిలి శ్రేష్ఠుడవు. పురుష స్వరూపుడవు. చంద్రుని వలె వెలుగొందు వాడవు. అగ్నియే ముఖమైన వాడవు. అచ్యుతుడవు. పసగల భావములు గల వాడవు. గోపేంద్రా! సంసారమున పడిపోవు చున్న నన్ను పాలింపుము.
సంసారచక్ర క్రమణా న్యనేకాన్యావిర్భవన్త్యచ్యుత దేహినాం యత్,
త్వన్మాయయా మోహితానాం సురేశ కస్తే మాయాం తరతే ద్వంద్వధామా.
దేహము తాల్చిన వారికి సంసారమను చక్రము నందలి తిరుగుళ్లు పెక్కులు సంభవించు చున్నవి. వారందరు నీ మాయచేత మోహితులైన వారే. ద్వంద్వము లందు నిలుచు వాడెవ్వడైన నీ మాయను దాట గలుగునా?
అగోత్ర మస్పర్శ మరూపగంధమనామ నిర్దేశ మజం వరేణ్యమ్,
గోపేంద్ర త్వాం యద్యుపాసన్తి ధీరాస్తే ముక్తిభాజో భవబంధ ముక్తాః.
గోత్రము, స్పర్శ, రూపము, వాసన, పేరు నీకు లేవు. నీవు అజుడవు. సర్వ శ్రేష్ఠుడవు. ఇట్టి నిన్ను ఉపాసించు బుద్ధి శాలులు సంసారమను బంధము నుండి విడివడి ముక్తి పొందుదురు.
శబ్దాతిగం వ్యోమరూపం విమూర్తిం వికర్మిణం శుభభావం వరేణ్యమ్,
చక్రాబ్జపాణింతు తథోపచారాదుక్తం పురాణే సతతం నమామి.
నీవు శబ్దమును మించి పోయిన వాడవు. గగనమే నీ రూపము. నీకొక ఆకారము లేదు. ఒక కార్యము లేదు. శుభమైన భావము కలవాడవు. ఉత్తమోత్త ముడవు. చక్రము, పద్మము చేత దాల్చిన వాడవని సూచనగా పురాణము నందు నిన్ను పేర్కొందురు. అట్టి నీకు ఎల్ల వేళల మ్రొక్కెదను.
త్రివిక్రమం క్రాన్తజగత్త్రయంచ చతుర్మూర్తిం విశ్వగతం క్షితీశమ్,
శంభుం విభుం భూతపతిం సురేశం నమా మ్యహం విష్ణు మనంత మూర్తిమ్.
నీవు త్రివిక్రము డవు. లోకము లన్నింటిని దాటిన వాడవు. నాలుగు మూర్తులు కల వాడవు. విశ్వ మంతట నిండిన వాడవు. భూదేవికి ఈశ్వరుడవు. శుభముల నొసగు వాడవు. విభుడవు. సర్వ భూతములకు పాలకుడవు. దేవ దేవుడవు. విష్ణుడవు. అనంతమైన రూపములు కల వాడవు. అట్టి నీకు నమస్కారము.
త్వందేవ సర్వాణి చరాచరాణి సృజస్యథో సంహరసే త్వమేవ,
మాం ముక్తికామం నయ దేవ శీఘ్రం యస్మిన్ గతా యోగినో నాపయాన్తి.
దేవ ! చరాచరములగు సమస్త భూతములను నీవే సృజింతువు. మరల నీవే లోగొందువు. ఎందేగి యోగులు మరల తిరిగి రారో ఆ తావునకు ముర్తిని కాంక్షించు నన్ను వడిగా చేర్పుము.
జయస్వ గోవింద మహానుభావ జయస్వ విష్ణో జయ పద్మనాభ,
జయస్వ సర్వజ్ఞ జయాప్రమేయ జయస్వ విశ్వేశ్వర విశ్వమూర్తే.
గోవిందా! నీకు జయము. మహానుభావా! నీకు జయము. విష్ణూ! పద్మనాభా! నీకు జయము. సర్వ మెరిగిన దేవా! ఊహల కందని పరతత్త్వమా! విశ్వేశ్వరా! విశ్వ మంతయు ఆకృతి యైన స్వామీ! నీకు జయము.
శ్రీవరాహ దేవుడు:
ఏవం స్తుత్వా తదా రాజా నిధాయ స్వం కళేబరమ్,
పరమాత్మని గోవిందే లయమాగాచ్చ శాశ్వతే.
శ్రీవరాహ దేవుడు:
ఇట్లు స్తుతించి ఆ రాజు తన కళేబరమును వదలి వైచి పరమాత్ముడు, శాశ్వతుడు అయిన గోవిందుని యందు లయము పొందెను.