అధ్యాయము - 61

అగస్త్యుడు:

కామవ్రతం మహారాజ శృణు మే గదతోధునా,

యేన కామాః సమృద్ధ్యన్తే మనసా చిన్తితా అపి.

అగస్త్యుడు:

మహారాజా! నీకిపుడు కామ వ్రతమును చెప్పెదను. వినుము. దీనితో మనస్సులో తలచిన కామములు కూడ నెరవేరును.

షష్ఠ్యాం ఫలాశనో యస్తు వర్షమేకం వ్రతం చరేత్‌,

పౌషమాససితే పక్షే చతుర్థ్యాం కృతభోజనః.

పుష్య మాస శుక్లపక్షము చవితి నాడు భోజనము చేసిన వాడై షష్ఠి మొదలుకొని ఒక్క సంవత్సరము కాలము ఫలములే ఆహరాముగా ఈ వ్రతమును చేయ వలయును.

షష్ఠ్యాంతు పారయేద్‌ ధీమాన్‌ ప్రథమంతు ఫలం నృప,

తతో భుంజీత యత్నేన వాగ్యతః శుద్ధమోదనమ్‌.

బ్రాహ్మణౖః సహ రాజేంద్ర అథవా కేవలైః ఫలైః,

తమేకం దివసం స్థిత్వా సప్తమ్యాం పారయే న్నృప.

షష్ఠినాడు ధీశాలి మొదటగా వాక్కులను నియమించు కొని (మౌనవ్రతము పాటించి) ఫలాహారమును తీసికొన వలయును. అటు పై బ్రాహ్మణులతో పాటు శుద్ధమైన ఆహారమును తీసికొను చుండ వలయును. లేదా కేవలము పండ్లతోనే ఆ ఒక్కరోజు గడపి సప్తమి నాడు భోజనము చేయ వలయును.

అగ్నికార్యం తు కుర్వీత గుహరూపేణ కేశవమ్‌,

పూజయిత్వాభిధానేన వర్షమేకం వ్రతం చరేత్‌.

అగ్నికార్య మాచరించి ఒక ఏడు కుమార స్వామి రూపమున అతని పేరుతో శ్రీమహా విష్ణువును పూజించి ఈ వ్రతమును చేయ వలయును.

షడ్వక్త్ర కార్తిక గుహ సేనానీ కృత్తికాసుత,

కుమార స్కంధ ఇత్యేవం పూజ్యో విష్ణుః స్వనామభిః.

ఆరు మోముల వాడా! కార్తికా! గుహా! సేనానీ! కృత్తికల కుమారుడా! కుమారుడా! స్కందా! అని యిట్లు గుహుని పేరులతో విష్ణువును పూజింప వలయును.

సమాప్తౌ తు వ్రత స్యాస్య కుర్యాద్‌ బ్రాహ్మణభోజనమ్‌,

షణ్ముఖం సర్వ సౌవర్ణం బ్రాహ్మణాయ నివేదయేత్‌.

వ్రతము ముగిసిన పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలయును. బంగారు కుమారస్వామి ప్రతిమను బ్రాహ్మణునకు దాన మొసగ వలయును.

సర్వే కామాః సమృద్ధ్యన్తాం మమ దేవ కుమారక,

త్వత్ర్పసాదాదిమం భక్త్యా గృహ్యతాం విప్ర మాచిరమ్‌.

దేవా! కుమారస్వామీ! విప్ర రూపమున వచ్చినవాడా! నీ దయ వలన నా కోరిక లన్నియు నెరవేరు గాక! భక్తితో ఒసగిన దీనిని గ్రహింపుము. ఆలసింపకుము.

అనేన దత్వా మంత్రేణ బ్రాహ్మణాయ సయుగ్మకమ్‌,

తతః కామాః సమృద్ధ్యన్తే సర్వే వై ఇహ జన్మని.

అను ఈ మంత్రముతో బ్రాహ్మణునకు రెండు వస్త్రములతో పాటు ఒసగ వలయును. దాని వలన ఆతనికి ఈ జన్మమున కోరిక లన్నియు సిద్ధించును.

అపుత్రో లభతే పుత్ర మధనో లభతే ధనమ్‌,

భ్రష్టరాజ్యో లభేద్‌ రాజ్యం నాత్ర కార్యా విచారణా.

పుత్రులు లేనివాడు పుత్రులను, ధనము లేనివాడు ధనమును, రాజ్యము పోయిన వాడు రాజ్యమును పొందును. ఇందు విచారము చేయ నక్కర లేదు.

ఏతద్‌ వ్రతం పురా చీర్ణం నలేన నృపసత్తమ,

ఋతుపర్ణస్య విషయే వసతా వ్రతచర్యయా.

మునుపు ఋతుపర్ణుని దేశమున వ్రతచర్యతో నివసించి నపుడు నలుడీ వ్రతము నాచరించెను.

తథా రాజ్యచ్యుతై రన్యై ర్బహుభి ర్నృప సత్తమైః,

పౌరాణికం వ్రతం చైవ సిద్ధ్యర్థం నృపసత్తమ.

అట్లే రాజ్యము నుండి భ్రష్టులైన పెక్కండ్రు రాజ సత్తములు, మరల రాజ్యమును పొందుటకై పురాణ ప్రసిద్దమగు ఈ వ్రతము నాచరించిరి.