వరాహ మహా పురాణము
అధ్యాయము - 47
దుర్వాసుడు:
శ్రావణస్య తు మాసస్య శుక్లపక్షే తు ద్వాదశీ,
అర్చయేత్ పరమం దేవం గన్ధ పుష్పై ర్జనార్దనమ్.
దుర్వాసుడు:
శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు జనార్దనుడను పరమ దైవమును కొలువ వలయును.
దామోదరాయ పాదౌతు హృషీకేశాయ వై కటిమ్,
సనాతనేతి జఠర మురః శ్రీవత్స ధారిణే.
చక్రపాణయేతి భుజౌ కంఠంచ హరయే తథా,
ముఞ్జకేశాయ చ శిరో భద్రాయేతి శిఖాం తథా.
‘ఓం నమో దామోదరాయ’ అని పాదములను, ‘నమో హృషీకేశాయ’ అని నడుమును, ‘నమస్సనాతనాయ’ అని కడుపును, ‘నమః శ్రీవత్స ధారిణే’ అని వక్షస్సును, ‘నమశ్చక్ర పాణయే’ అని భుజములను, ‘నమో హరయే’ అని కంఠమును, ‘నమో ముంజ కేశాయ’ అని శిరస్సును ‘నమో భద్రాయ’ అని శిఖను పూజింప వలయును.
ఏవం సంపూజ్య సంస్థాప్య కుంభం పూర్వవదేవ తు,
విన్యస్య వస్త్ర యుగ్మంతు తస్యోపరి తతో న్యసేత్.
కాంచనం దేవదేవంతు దామోదర సనామకమ్,
తమభ్యర్చ్య విధానేన గంధపుష్పాదిభిః క్రమాత్.
ఇట్లు సమర్చించి మునుపటి వలెనే కుంభమును పెట్ట వలయును. వస్త్రముల జంటను ఉంచి దానిపై దామోదర నామము గల దేవ దేవుని బంగారు ప్రతిమను నిలుప వలయును. ఆ దేవుని చక్కగా గంధ పుష్పాదులతో విధి ననుసరించి క్రమముగా పూజింప వలయును.
ప్రాగ్వత్ తం బ్రాహ్మణే దద్యాద్ వేదవేదాంగ పారగే,
ఏవం నియమ యుక్తస్య ప్రభావం తచ్ఛృణుష్వ మే.
వెనుకటి వలెనే ఆ ప్రతిమను వేద వేదాంగములను తుదముట్ట నధ్యయనము చేసిన బ్రాహ్మణున కొసగ వలయును. ఇట్లు నియమము పాటించిన వాడు పొందు ప్రభావమును నా వలన వినుము.
ఏష తే విధి రుద్దిష్టః శ్రావణే మాసి వై విభో,
ఏతస్యాశ్చ ప్రభావం యత్ శృణు పాప ప్రణాశనమ్.
శ్రావణ మాసము నందు చేయ వలసిన విధానమును చెప్పితిని. ఆ ద్వాదశీ వ్రత ప్రభావమును, పాపమును రూపుమాపు దానిని తెలిపెదను. వినుము.
పురా కృతయుగే రాజా నృగో నామ మహాబలః,
బభ్రామ స వనం ఘోరం మృగయాసక్త మానసః.
పూర్వము కృత యుగమున నృగుడను మహా బలము గల రాజుండెను. ఆత డొకప్పుడు వేట యందు తగుల్కొన్న మనసుతో ఘోరమగు అడవిలో తిరుగాడెను.
స కదాచిత్తురంగేణ హృతో దూరం మహద్వనమ్,
వ్యాఘ్ర సింహ గజాకీర్ణం దస్యు సర్ప నిషేవితమ్.
అతడొక సమయమున గుఱ్ఱము గుంజుకొని పోవగా పెద్ద పులులు, సింహములు, ఏనుగులు, మొదలగు వానితో నిండిన పెద్ద అడవికి పోయెను.
ఏకాకీ తత్ర రాజా తు అశ్వం ముచ్య తరోరథః,
స్వయం కుశ మథ్యాస్తీర్య సుప్తో దుఃఖ సమన్వితః.
ఒంటరి యగు ఆ రాజు అచట గుఱ్ఱమును వదలి ఒక చెట్టు నీడను దర్భలు పరచు కొని దుఃఖముతో నిద్రించెను.
తావత్ తత్రైవ లుబ్ధానాం సహస్రాణి చతుర్దశ,
ఆగతాని మృగాన్ హన్తుం రాత్రౌ రాఙ్ఞః సమన్తతః.
ఆ రాత్రి పదు నాలుగు వేల మంది బోయవాండ్రు మృగములను చంపుటకై అచటికి వచ్చి రాజు చుట్టును చేరిరి.
తత్రా పశ్యన్త తే సుప్తం హేమరత్న విభూషితమ్,
నృగం రాజాన మత్యుగ్రం శ్రియా పరమయా యుతమ్.
అచట వారు బంగారు నగల అలంకారములు గలవాడును, మిక్కిలి తీవ్రముగా నున్న వాడును, గొప్ప తేజస్సుతో వెలిగి పోవుచున్న వాడును నిద్రించు చున్న వాడును అగు ఆ నృగ మహారాజును గాంచిరి.
తే గత్వా త్వరితం వ్యాధాః స్వభర్త్రే సంన్యవేదయన్,
సో పి రత్న సువర్ణార్థం రాజానం హన్తు ముద్యతః.
వారును త్వరత్వరగా పోయి తమ ప్రభువునకు నివేదించిరి. అతడును రత్నములు, బంగారము కొల్ల గొట్టుటకై ఆతనిని చంప బోయెను.
తురగస్య తు హేతోస్తు నిస్త్రింశా వనచారిణః,
రాజానం సుప్త మాసాద్య నిగృహీతుం ప్రచక్రముః.
గుఱ్ఱమును కూడ వశ పరచు కొనుటకై ఆ ఆటవికులు నిద్రించు చున్న రాజును చేరుకొని పట్టు కొనుటకు ప్రయత్నించిరి.
తావద్ రాజా శరీరాత్ తు శ్వేతాభరణ భూషితా,
నారీ కాచిత్ సముత్తస్థౌ స్రక్చందన విభూషితా,
ఉత్థాయ చక్రమాదాయ తేమ్లేచ్ఛా వినిపాతితాః.
ఇంతలో ఆ రాజు శరీరము నుండి తెల్లని ఆభరణములు, మాలలు, చందనములు తాల్చిన ఒక నారి వెలు వడెను. ఆమె లేచి చక్రమును గొని ఆ మ్లేచ్చుల నందరిని కూల వైచెను.
దస్యూన్ నిహత్యసా దేవీ తస్య రాజ్ఞ స్తనుం పునః,
ప్రవిశన్త్యాశు రాజాపి ప్రతిబుద్ధోథ దృష్టవాన్,
మ్లేచ్ఛాంస్తు నిహతాన్ దృష్ట్వా సా స్వమూర్తి లయం గతా.
ఆ దేవి ఆ దొంగ మూకలను చంపి మరల ఆ రాజు దేహము లోనికి ప్రవేశించెను. రాజంత మేల్కొని చచ్చి పడిన మ్లేచ్ఛులను, తన దేహములో కలసి పోయిన ఆ నారిని కాంచెను.
అశ్వ మారుహ్య స పున ర్వామ దేవాశ్రమం యయౌ,
తత్రాపృచ్ఛద్ ఋషిం భక్త్యా కాస్త్రీ కే తే నిపాతితాః,
ఏతత్ కార్య మృషే మహ్యం కథయస్వ ప్రసీద మే.
గుఱ్ఱమెక్కి ఆ రాజు వామ దేవుని ఆశ్రమమున కరిగెను. అచట భక్తితో ఆ మహర్షిన స్వామీ! ఆమె ఎవరు? ఆ చచ్చిన వారెవరు? దీనిని నాకు తెలుపుము. ప్రసన్నుడ వగుము, అని అడిగెను.
వామదేవుడు:
త్వమాసీ చ్ఛూద్ర జాతీయ అన్యజన్మని పార్థివ,
తత్ర త్వయా బ్రాహ్మణస్య ప్రేషణం కుర్వతా శ్రుతా,
శ్రావణస్యతు మాసస్య శుక్లపక్షేతు ద్వాదశీ.
వామదేవుడు:
రాజా! నీవు పూర్వ జన్మమున శూద్ర జాతి వాడవు. ఒక బ్రాహ్మణుడు శ్రావణ మాస శుక్ల పక్ష ద్వాదశి నాటి వ్రతమును ఉపదేశించు చుండగా వింటివి.
స విధానాత్ త్వయా రాజన్ భక్త్యా వై సముపోషితా,
ఉపోషితాయాం తస్యాంతు రాజ్యం లబ్ధం త్వయానఘ.
విధి పూర్వకముగా నీవు భక్తితో ఆ తిథినాడు ఉపవాస ముంటివి. దాని వలన నీకు రాజ్యము లభించినది.
సర్వాపత్సు చ సా దేవీ భవన్తం పరిరక్షతి,
యయా వినిహతాః క్రూరా మ్లేచ్ఛాః పాపసమన్వితాః,
భవాంశ్చ రక్షితో రాజన్ శ్రావణ ద్వాదశీ తు సా.
ఆ దేవి అన్ని ఆపదల యందును నిన్ను రక్షించు చున్నది. ఆ పాపాత్ములు, క్రూరులు అగు మ్లేచ్ఛులను సంహరించి నది ఆమెయే. నిన్ను రక్షించిన ఆమె శ్రావణ శుద్ధ ద్వాదశి.
ఏకైవ పాతి చాపత్సు రాజ్య మేకైవ యచ్ఛతి,
కిం పున ర్ద్వాదశైతాస్తు యేనైంద్రం న దదుఃపదమ్.
ఒక్కతెయే ఆపదల యందు రక్షించును. ఒక్కతెయే సామ్రాజ్యము నిచ్చును. ఇంక ఈ పండ్రెండు ద్వాదశుల సంగతి చెప్పనేల? వారు ఇంద్ర పదవిని కూడ ఈయరని చెప్పుటకు లేదు.