అధ్యాయము - 96

శ్రీవరాహ దేవుడు:

అథ రుద్ర వ్రతోత్పత్తిం శృణు దేవి వరాననే,

యేన జ్ఞానేన పాపానాం ముచ్యతే భూరి మానవః.

శ్రీవరాహ దేవుడు:

వరాననా! ఇంక రుద్ర వ్రతము పుట్టుకను గూర్చి వినుము. ఆజ్ఞానముతో మానవుడు సర్వ పాపముల నుండియు ముక్తుడగును.

బ్రహ్మణా తు యదా రుద్రః పూర్వం సృష్టో వరాననే,

తృతీయే జన్మని విభుః పిఙ్గాక్షో నీలలోహితః.

తదా కౌతూహలాద్‌ బ్రహ్మా స్కన్ధే తం జగృహే ప్రభుః,

స్కంధారూఢే తదా రుద్రే బ్రహ్మణోవ్యక్త జన్మనః.

జన్మతశ్చ శిరో యద్ధి పఞ్చమం తజ్జగాద హ,

మన్త్రమాధర్వణం ధాత్రి యేన సద్యః ప్రముచ్యతే.

బ్రహ్మ మునుపు రుద్రుని సృజించెను. అది మూడవ జన్మము (1. విష్ణువు 2. బ్రహ్మ 3. రుద్రుడు.) ఆ రుద్రుడు పచ్చని కన్నులు కలవాడు, నలుపు ఎరువుల వన్నె కలవాడు. అప్పుడు బ్రహ్మ వేడుకతో ఆ బాలుని భుజము పై నెత్తు కొనెను. అవ్యక్తము నుండి పుట్టిన బ్రహ్మ భుజముపై నెక్కించు కొనగా ఆతని అయిదవ తల ఆధర్వణ మంత్రములను పలికెను. దాని వలన మనుజుడు అప్పటి కప్పుడు ముక్తి పొందును.

కపాలి రుద్ర బభ్రోథ భవ కైరాత సువ్రత,

పాహి విశ్వం విశాలాక్ష కుమారవర విత్తమ.

కపాలీ! రుద్ర! బభ్రు! భవ! కిరాత రూప! సువ్రత! విశాలాక్ష! కుమార వర! సర్వజ్ఞా! ఈ విశ్వము నంతటిని రక్షింపుము.

ఏవముక్త స్తదా రుద్రో భవిష్యై ర్నామభి ర్భవః,

కపాలశబ్దాత్‌ కుపిత స్తచ్ఛిరో విచకర్త హ.

వామాంగుష్ఠనఖే నాద్యం ప్రాజాపత్యం విచక్షణః,

తన్నికృత్తం శిరో ధాత్రి హస్తలగ్నం బభూవ హ,

ఇట్లు బ్రహ్మ రానున్న నామములతో పిలువగా భవుడు కపాల శబ్దము వలన కోపించిన వాడై బ్రహ్మ యొక్క ఆ అయిదవ తలను ఎడమ చేతి వ్రేలి గోటితో తెగ గోసెను. ఆ తెగిన తల శివుని చేతి యందు తగులు కొని యుండెను.

తస్మిన్‌ కరస్థే శిరసి ప్రాజాపత్యే త్రిలోచనః,

బ్రహ్మాణం ప్రయతో భూత్వా రుద్రో వచన మబ్రవీత్‌.

ఆ ప్రజాపతి తల చేతి నుండగా ముక్కంటి వినయముతో బ్రహ్మతో నిట్లు పలికెను.

రుద్రుడు:

కథం కపాలం మే దేవ కరాత్‌ పతతి సువ్రత,

నశ్యతే చ కథం పాపం మమైతద్‌ వద మాచిరమ్‌.

రుద్రుడు:

దేవా! ఈ పుఱ్ఱె నాచేతి నుండి ఎట్లు పడును? ఈ నా పాపము ఎట్లు నశించును? ఆలసింపక చెప్పుము.

బ్రహ్మ:

ఇద మేవ వ్రతం దేవ చర కాపాలికం విభో,

సమయాచార సంయుక్తం కృత్వాస్వేనైవ తేజసా.

బ్రహ్మ:

దేవా! సమయా చారముతో కూడిన ఈ కాపాలిక వ్రతమునే నీదగు తేజస్సుతో ఆచరింపుము.

ఏవ ముక్త స్తదా రుద్రో బ్రహ్మణావ్యక్తమూర్తినా,

ఆజగామ గిరిం తుఙ్గం మహేన్ధ్రం పాపనాశనమ్‌.

వ్యక్తము కాని రూపము కల బ్రహ్మ యిట్లు పలుకగా రుద్రడు అప్పుడు మిక్కిలి ఎత్తైనది, పాపములను పోకార్చునది యగు మహేంద్ర పర్వతమునకు ఏతెంచెను.

తత్ర స్థిత్వా మహాదేవ స్తచ్ఛిరో విభిదే త్రిథా,

తస్మిన్‌ భిన్నే పృథక్‌ కేశాన్‌ గృహీత్వా కృతవాన్‌ భవః,

యజ్ఞోపవీతం కేశం తు మహాస్థ్యక్షమణీం స్తథా.

అందుండి మహా దేవుడు ఆ తలను మూడు ముక్కలు చేసెను. అది అట్లు పగులగా రుద్రుడు దాని కేశములను కైకొని జన్నిదముగా చేసి కొనెను. ఎముకలను అక్షమణులను కావించు కొనెను.

కపాలశకలం చైకమసృ క్పూర్ణం కరేస్థితమ్‌,

అపరం ఖండశః కృత్వా జటాజూటే న్యవేశయత్‌.

పుఱ్ఱ ముక్క నొక దానిని నెత్తురు నిండిన దానిని చేత నుంచు కొని మరొక ముక్క చేసి జుట్టు ముడిలో ఉంచెను.

ఏవం కృత్వా మహాదేవో బభ్రా మేమాం వసున్ధరామ్‌,

సప్తద్వీపవతీం పుణ్యాం మజ్జం స్తీర్థేషు నిత్యశః.

ఇట్లు చేసి మహా దేవుడు ఏడు ద్వీపములు గల పుణ్యమైన భూమి నంతటిని, తీర్థములలో మునుగుచు, తిరిగెను.

సముద్రే ప్రథమం స్నాత్వా తతో గంగాం వ్యగాహత,

సరస్వతీం తతో గత్వా యమునాసంగమం తతః.

మొదట సముద్రమున స్నానము చేసి తరువాత గంగలో మునిగెను. పిదప సరస్వతి కరిగి మరల యమునా సంగమ స్థానమున తాన మాడెను.

శతద్రూం చ తతో గత్వా దేవికాం చ మహానదీమ్‌,

వితస్తాం చన్ధ్రభాగాం చ గోమతీం సింధు మేవ చ,

తుఙ్గభద్రాం తథా గోదా ముత్తరే గణ్డకీం తథా.

శతద్రువు, దేవిక, మహానది, వితస్త, చంద్రభాగ, గోమతి, సింధువు, తుంగభద్ర, గోదావరి, గండకి అను నదులలో స్నాన మాడెను.

ఊర్థ్వగం తు తతో గత్వా గతో రుద్రమహాలయమ్‌,

తతో దారువనం గత్వా కేదారగమనం పునః.

పిదప పై సీమలకు వెళ్లెను. రుద్ర మహాలయము, దారువనము, కేదారము మొదలగు తీర్థములను సేవించెను.

భద్రేశ్వరం తతో గత్వా గయాం పున రథాగమత్‌,

గయాం గత్వా కృతస్నానః పితౄన్‌ సంతర్వ్య యత్నతః.

పశ్చాద్‌ వేగేన సకలం బ్రహ్మాండం భూతధారిణి,

బభ్రామ సర్వదేవేశః షష్ఠేబ్దే తస్య చాపతత్‌.

భ్రమతః పరిధానం తు కౌపీనం రశనాగతమ్‌,

తస్మింస్తు పతితే దేవి నగ్నః కాపాలికోభవత్‌.

భద్రేశ్వరమున కరిగి గయకు పోయెను. గయ కరిగి స్నానము చేసి యత్నముతో పితృ దేవతలకు తర్పణము చేసెను. పిదప వేగముగా సకల బ్రహ్మాండమును చుట్టి వచ్చెను. ఇట్లాతడు తిరుగు చుండగా ఆరవ ఏట ఆతని నడుమున నున్న గోచి గుడ్డ జారి పడెను. దేవీ! అది పడగా ఆతడు దిగంబరుడు ఆయెను. ఆ విధముగా కాపాలికుడు ఆయెను.

పునరబ్ద ద్వయం భ్రాన్తో బ్రహ్మాండం తీర్థకారణాత్‌,

తీర్థే తీర్థే హరః స్నాత్వా కపాలం త్యక్తు మైచ్ఛత,

త్యజతోపి న తద్ధస్తా చ్చ్యవతే తస్య ధారిణి.

ప్రతి తీర్థము నందును హరుడు స్నానము చేసి పుఱ్ఱెను వదలించు కొనగోరెను. కాని అది అతని నుండి జారి పోకున్నది.

తతోన్యద్‌ వర్ష మేకం తు వర్తతే హిమవద్గిరౌ,

భ్రమతో బభ్రూతా జాతా త్రి నేత్రస్య మహాత్మనా.

పిమ్మట మహాత్ముడగు ముక్కంటి ఒక్క ఏడు కాలము హిమవ త్పర్వతమున తిరిగెను. అట్లు తిరుగు చుండగా ఆతనికి కపిల వర్ణము కలిగెను.

పున రబ్దద్వయం చాన్యత్‌ పరమేష్ఠీ వృషాకపిః,

బభ్రామ రుద్ర స్తీర్థాని పురాణాని సమన్తతః.

మరల రెండేండ్లు పరమేష్ఠి, వృషాకపి యగు రుద్రుడు పురాణ ములగు తీర్థము లన్నింటిని చుట్టి వచ్చెను.

కస్యచిత్త్వథ కాలస్య ద్వాదశేబ్దే ధరాధరే,

వారాణసీం గతో దేవ స్తత్ర స్నాన మథాకరోత్‌.

అంత కొంత కాలమునకు పండ్రెండవ యేట ఆ దేవుడు వారాణసి కరిగి అచట స్నాన మాచరించెను.

గంగాయాం దేవదేవేశో యావన్మజ్జతి భామిని,

తావత్కపాలం పతితం యల్లగ్నం బ్రహ్మణః పురా.

దేవదేవుడు గంగ యందు మునిగిన వెంటనే మునుపు తగులు కొనిన బ్రహ్మ కపాలము జారి పడెను.

కపాల మోచనం నామ తత స్తీర్ధ మనుత్తమమ్‌,

పృథివ్యాం ఖ్యాతి మగమద్‌ వారాణస్యాం ధరాధరే.

భూదేవీ! అంతటి నుండి కాశీ నగరము నందలి ఉత్తమ మగు ఆ తీర్థము భూమిలో కపాల మోచనమను ఖ్యాతి గడించెను.

కపాలం పతితం దృష్ట్వా రుద్రహస్తా చ్చతుర్ముఖః,

ఆగతో దేవసహితో వాక్యం చేదమువాచ హ.

రుద్రుని చేతి నుండి పడిన కపాలమును చూచి బ్రహ్మ దేవతలతో పాటుగా వచ్చి ఇట్లు పలికెను.

బ్రహ్మ:

భవ రుద్ర విరూపాక్ష లోకమార్గే వ్యవస్థితః,

వ్రతాని కురు దేవేశ త్వచ్చీర్ణాని మహాప్రభో.

బ్రహ్మ:

భవా! రుద్రా! విరూపాక్షా! లోక మార్గమున మనసున్న వాడవై వ్రతములను ఆచరింపుము. మహాప్రభూ! ఈ వ్రతములు లోకమునకు ఉపయోగ పడును.

కపాలం గృహ్య యద్‌ భ్రాన్తం కౌపీనేన సమన్వితః,

తన్మహావ్రతసంజ్ఞం తు మనుష్యాణాం భవిష్యతి.

నీవు పుఱ్ఱెను గొని గోచితో తిరిగితివి. అది మనుజులకు మహా వ్రతమను పేరు గలది యగును.

నగ్నేన భూత్వా యద్‌భ్రాంతం కపాలవ్యగ్రపాణినా,

తద్ర్వతం నగ్నకాపాలం భవిష్యతి నృణాం భువి.

బట్టలు లేక కపాలమును శ్రద్ధగా చేత నుంచుకొని తిరిగితివి. అది నగ్న కాపాలిక వ్రతముగా మనుష్యుల కగును.

యచ్చ తే బభ్రూతా జాతా హిమవత్యచలోత్తమే,

భ్రమత స్తద్‌ వ్రతం దేవ బాభ్రవ్యం తే భవిష్యతి.

నీకు హిమ పర్వతమున తిరుగు చుండగా ఒక విధమగు ఎరుపు వన్నె కలిగినది. దేవా! అది బాభ్రవ్యమను వ్రత మగును.

యచ్చేదానీం విశుద్ధస్య తీర్థేస్మిన్‌ దేహశుద్ధతా,

తచ్ఛుద్ధశైవం భవతు వ్రతం తే పాపనాశనమ్‌.

ఇప్పుడు ఈ తీర్థమున విశుద్ధుడవగు నీకు దేహ శుద్ధత ఏర్పడినది. పాప నాశన మగు ఆ వ్రతము ‘శుద్ధశైవము’ అగును.

మాం పురస్కృత్య దేవాస్త్వాం పూజ్యన్తే వివిధా న్యుత,

శాస్త్రాణి తాని సర్వేషాం కథయిష్యసి నాన్యథా.

నన్ను పురస్కరించుకొని దేవతలు నిన్ను పెక్కు విధములుగా పూజింతురు. ఆ అన్నింటి శాస్త్రములను నీవే చెప్ప గలవు. మరొక పద్ధతి లేదు.

వ్రతాని కురుతే దేవ త్వత్కృతాని హి పుత్రక,

స త్వత్ర్పసాద్‌ దేవేశ బ్రహ్మహాపి విశుధ్యతి.

కుమారా! నీవు చేసిన వ్రతము లన్నింటిని చేయు వాడు నీ ప్రసాదము వలన బ్రహ్మ హత్య చేయు వాడైనను పరిశుద్ధుడగును.

యద్వ్రతం నగ్నకాపాలం యద్‌ బాభ్రవ్యం త్వయా కృతమ్‌,

యత్‌ కృతం శుద్ధశైవం చ తత్తన్నామ్నా భవిష్యతి.

నగ్న కాపాలము, బాభ్రవ్యము, శుద్ధశైవము అను వ్రతములను చేయువారు ఆ యా నామములు కలవార గుదురు.

మాం పురస్కృత్య దేవం త్వాం పూజ్యతే యో విధానతః,

తేషాం శాస్త్రాణి సర్వాణి శాస్త్రం పాశుపతం తథా,

కథయస్వ మహాదేవ సవిధానం సమాసతః.

దేవా! నన్ను ముందుంచు కొని విధానము ననుసరించి నిన్ను అర్చించు వారికి ఆ శాస్త్రము లన్నింటిని, అట్లే పాశుపత శాస్త్రమును విధాన పూర్వకముగా మహాదేవా! ఉపదేశింపుము.

ఏవముక్త స్తతో రుద్రో బ్రహ్మణా వ్యక్త మూర్తినా,

దేవై ర్జయేతి సంతుష్టః కైలాసనిలయం యయౌ.

తెలియ రాని ఆకృతి గల బ్రహ్మ యిట్లు పలుకగా రుద్రుడు సంతుష్టుడై, దేవతలు జయ జయ నాదములు చేయు చుండగా, కైలాస నిలయమున కరిగెను.

బ్రహ్మా అపి సురైః సార్ధం గతః స్వం లోకముత్తమమ్‌,

దేవా అపి యయుః సర్వే యథాగత ముపాగతాః.

బ్రహ్మయు దేవతలతో పాటు తన ఉత్తమ లోకమున కరిగెను. అట నుండి దేవత లందరును వచ్చిన మార్గమున తమ నెలవుల కరిగిరి.

ఏతద్‌ రుద్రస్య మాహాత్మ్యం మయా సంపరికీర్తితమ్‌,

చరితం యచ్చ దేవస్య వ్రతం సమభవద్‌ భువి,

కోన్యన్త్యభ్యధికంతస్య ముక్త్వా నారాయణం ప్రభుమ్‌.

భూదేవీ! ఇది రుద్రుని మహాత్మ్యము. నేను చక్కగా వివరించి చెప్పితిని. దేవుని చరితము, వ్రతము భూమి యందు ఎట్లేర్పడెనో వివరించితిని. ఆ రుద్రుని కంటె మిన్న యగువాడు, నారాయణ ప్రభువు ఒక్కడు తక్క, ఎవ్వడు కలడు?