వరాహ మహా పురాణము
అధ్యాయము - 5
అశ్వశిరుడు:
భవన్తౌ మమ సందేహ మేకం ఛేత్తు మిహార్హతః,
యేన ఛిన్నేన జాయేత మమ సంసారమిచ్యుతిః.
అశ్వశిరుడు:
పూజ్య పాదులారా! మీరు నాదగు ఒక సందేహమును తీర్ప వలయును. దానితో నాకు సంసార విముక్తి సంభవించును.
ఏవ ముక్తే నృపతినా తదా యోగివరో మునిః,
కపిలః ప్రాహ ధర్మాత్మా రాజానం యజతాం వరమ్.
రాజిట్లు పలుకగా అప్పుడు యోగులలో గొప్ప వాడగు ధర్మాత్ముడు కపిలుడు యజ్ఞ కర్తలలో శ్రేష్ఠుడగు రాజుతో నిట్లు పలికెను.
కపిలుడు:
కస్తే మనసి సందేహో రాజన్ పరమధార్మిక,
ఛిన్దామి యేన తచ్ఛ్రుత్వా బ్రూహి యత్తేభివాఞ్చితమ్.
కపిలుడు:
పరమ ధర్మాత్ముడా! ఓ రాజా! నీ మనసున నున్న సందేహమేమి? దానిని విని నేను తీర్చి వైచెదను. నీ కోరిక యేమో చెప్పుము.
రాజు:
కర్మణా ప్రాప్యతే మోక్ష ఉతాహో జ్ఞానినా మునే,
ఏతన్మే సంశయం ఛిన్ది యది మేనుగ్రహః కృతః.
రాజు:
ఓ మునీ! మోక్షము కర్మము వలన సిద్ధించునా? లేక జ్ఞానము వలననా? నా యందు దయ గలదేని యీ నా సంశయమును పటాపంచలు చేయుము.
కపిలుడు:
ఇమం ప్రశ్నం మహారాజ పురా పృష్టో బృహస్పతిః,
రైభ్యేణ బ్రహ్మపుత్రేణ రాజ్ఞా చ వసునా పురా.
కపిలుడు:
మహారాజా! మునుపు బ్రహ్మ పుత్రుడగు రైభ్యుడు ఈ ప్రశ్ననే బృహస్పతి నడిగెను. మరియు వసువను రాజు కూడా నడిగెను.
వసు రాసీ న్నృపశ్రేష్ఠో విద్వాన్ దానపతిః పురా,
చాక్షుషస్య మనోః కాలే బ్రాహ్మణోన్వయ వర్ధనః.
పూర్వము చాక్షుశుడను మనువు కాలమున బ్రహ్మ వంశమును పెంపొందించు వాడు, రాజ శ్రేష్ఠుడు, విద్వాంసుడు, దాతయు నగు వసువను రాజుండెడి వాడు.
వసుశ్చ బ్రహ్మణఃసద్మ గతవాం స్తద్దిదృక్షయా,
పథి చైత్రరధం దృష్ట్వా విద్యాధరవరం నృప,
అపృచ్ఛ చ్చ వసుః ప్రీత్యా బ్రహ్మణోవసరం ప్రభో.
ఆ వసువు ఒకనాడు బ్రహ్మ దేవుని చూడ గోరి యాతని భవనమున కరిగెను. దారిలో విద్యాధర వరుడగు చైత్ర రథుని గాంచి వసువు ప్రీతితో బ్రహ్మ దేవుడు తన వంటి వారిని చూచు సమయమేది? యని యడిగెను.
సో బ్రవీద్ దేవసమితి ర్వర్తతే బ్రహ్మణో గృహే,
ఏవం శ్రుత్వా వసు స్తస్థౌ ద్వారి బ్రహ్మౌకస స్తదా.
ఆ చైత్ర రథుడు ప్రస్తుతము బ్రహ్మ యింట దేవతల సభ జరుగు చున్నదని చెప్పెను. వసువది విని బ్రహ్మ భవనము వాకిట వేచి యుండెను.
తావత్ తత్రైవ రైభ్యస్తు ఆజగామ మహాతపాః.
అంతలో నచటికే రైభ్యుడను మహా తపస్వి వచ్చెను.
స రాజా ప్రీతమనసా వసుః సంపూర్ణ మానసః,
ఉవాచ పూజయిత్వాగ్రే క్వ ప్రయాతోసివై మునే.
అంత వసురాజు నిండు మనసుతో ప్రీతి బుద్ధితో అంతనిని ముందుగా పూజించి ‘ఓ మునీ! ఎందు బోవు చున్నావు?’ అని యడిగెను.
రైభ్యుడు:
అహం బృహస్పతేః పార్శ్వే ఆగతోస్మి మహానృప,
కిఞ్చి త్కార్యాన్తరం ప్రష్టు మహం దేవపురోహితమ్.
రైభ్యుడు:
మహారాజా! నేనొక విషయమును దేవ పురోహితుడగు బృహస్పతి నడుగుటకై యాతని కడకు వచ్చితిని.
ఏవం వదతి రైభ్యే తు బ్రహ్మణ స్తన్మహ త్సదః,
ఉత్తస్థౌ స్వాని ధిష్ణ్యాని గతా దేవగణాః ప్రభో.
రైభ్యుడిట్లు పలుక చుండగా దొడ్డది యగు ఆ బ్రహ్మ సభ ముగిసెను. దేవత లందఱు తమతమ గృహముల కరిగిరి.
తావద్ బృహస్పతి స్తత్ర రైభ్యేణ సహ సంవిదమ్,
కృత్వా స్వధిష్ణ్య మగమద్ వసునా చ సుపూజితః.
ఇంతలో బృహస్పతి అచట రైభ్యునితో ప్రసంగము చేసి, వసుని పూజ లందుకొని తన నెలవున కరిగెను. (సంవిదం కృత్వా – కలియుటకు అనుమతిని గొని యనియు నర్థము)
రైభ్య ఆజ్గిరసో రాజా వసుశ్చోపవివేశ హ,
ఉపవిష్టేషు రాజేన్ద్ర తేషు తేష్వపి సోబ్రవీత్.
బృహస్పతి ర్దేవగురూ రైభ్యం వచనమన్తికే,
కిం కరోమి మహాభాగ వేదవేదాజ్గ పారగ.
రైభ్యుడు, బృహస్పతి, వసు రాజు కూర్చుండిరి. వారందఱు కూర్చున్న పిదప దేవ గురువు బృహస్పతి రైభ్యునితో ‘ఓయీ! వేద వేదాంగముల తుదిముట్ట అధ్యయనము చేసిన పుణ్య మూర్తీ! నా వలన నగు పనియేమి’ అని పలికెను.
రైభ్యుడు:
బృహస్పతే కర్మణా కిం ప్రాప్యతే జ్ఞానినాథవా,
మోక్ష ఏత న్మమాచక్ష్య పృచ్ఛతః సంశయం ప్రభో.
రైభ్యుడు:
ప్రభూ! బృహస్పతీ! ఒక సంశయమును నిన్నడుగు చున్నాను. మోక్షము కర్మము చేత సిద్ధించునా? లేక జ్ఞానము గలవాడే మోక్షము పొందునా? ఇది నాకు తెలియ జెప్పుము.
బృహస్పతి:
యత్కించిత్ కురుతే కర్మ పురషః సాధ్వసాధు వా,
సర్వం నారాయణే న్యస్య కర్వన్ నైవ చ లిప్యతే.
బృహస్పతి:
పురుషుడు, అది మంచిదో, చెడ్డదో, ఏ చిన్న పని చేసినను దానిని నారాయణుని యందు సమర్పించి చేయునేని వానికి తగులము లేనేలేదు.
శ్రూయతే చ ద్విజశ్రేష్ఠ సంవాదో విప్రలుబ్దయోః,
ఆత్రేయో బ్రాహ్మణః కశ్చిద్ వేదాభ్యాసరతో మునిః.
విప్రునకు వేట గానికి జరిగిన సంవాద మొకటి, బ్రాహ్మణ ప్రవరా! వినవచ్చు చున్నది. అత్రి గోత్రము వాడగు బ్రాహ్మణు డొకడు, వేదములు వల్లించుటయే పనిగా గల ముని యుండెడి వాడు.
పసత్యవిరతం ప్రాతః స్నాయీ త్రిషవణే రతః,
నామ్నా సంయమనః పూర్వ మేకస్మిన్ దివసే నదీమ్,
ధర్మారణ్యే గతః స్నాతుం ధన్యాం భాగీరథీం శుభామ్.
అతడు అలపెరుగక ప్రతి దినము ప్రాతః కాలముననే స్నానమాడు వాడు. మూడు సంధ్యల నర్చించుట అతనికి ప్రీతి దాయకము. అతని పేరు సంయమనుడు. ఒకనా డాతడు ధర్మారణ్యమున పుణ్యముల ప్రోవు, మంగళములకు నెలవు అగు గంగా నదిలో స్నాన మాడుట కరిగెను.
తత్రాసీనం మహాయూథం హరిణానాం విచక్షణః,
లుబ్ధో నిష్ఠురకో నామ ధనుఃపాణిః కృతాన్తవత్,
ఆయయౌ తం జిఘాంసుః స ధనుష్యాయెజ్య సాయకమ్.
అచట పెద్ద లేళ్ళ గుంపొకటి యుండెను. అప్పుడ చటికి దానిని చంప గోరిన తెలివి గల వేటకా డొకడు నిష్ఠురకుడను వాడు విల్లు చేత బట్టి అమ్ము తొడిగి యముని వలె ఏతెంచెను.
తతః సంయమనో విప్రో దృష్ట్వా తం మృగయారతమ్,
వారయామాస మా భద్ర జీవఘాత మిమం కురు.
అంత విప్రుడగు ఆ సంయమనుడది చూచి ఆ వేట గానిని “బాబూ! ప్రాణి హింస చేయకు” మని అడ్డు పడెను.
ఏత చ్ఛ్రుత్వా వచో వ్యాధః స్మిత పూర్వమిదం వచః,
ఉవాచ నాహం హింసామి పృథగ్జీవం ద్విజోత్తమ.
అది విని ఆ బోయ చిరునవ్వుతో ఇట్లనెను. “విప్రవరేణ్యా! నేను వేరుగా ప్రాణిని చంపుట లేదు”.
పరమాత్మా త్వయం భూతైః క్రీడతే భగవాన్ స్వయమ్,
కృతా మృతా బలీవర్దా స్తద్వదేత న్నసంశయః.
“భగవంతుడగు ఈ పరమాత్మయే తనకు తానై ప్రాణులతో ఆడుకొను చున్నాడు. మనుజులు మట్టితో ఎద్దులను చేసినట్లే యిదియును, సంశయము లేదు.”
అహం భావః సదా బ్రహ్మ న్నవిద్యేయం ముముక్షుణామ్,
యాత్రా ప్రాణరతం సర్వం జగ దేతద్ విచేష్టితమ్,
తత్రాహ మితి యః శబ్దః స సాధుత్వం న గచ్ఛతి.
ముక్తి పొందగోరు వారికి ‘నేను’ అను ఈ భావము అజ్ఞానము వలన నేర్పడును. ఈ జగత్తంతయు ఒక యాత్ర. అది ప్రాణములు నిలుపు కొనుట యందే ఆసక్తితో నుండును. ఇదియొక వికారపు చేష్ట. అందు ‘నేను’ అను శబ్దము మేలైనది కాదు.
ఇత్యాకర్ణ్య స విప్రేంద్రో ద్విజః సంయమన స్తదా,
విస్మయే నాబ్రవీద్ వాక్యం లుబ్ధం నిష్ఠురకం ద్విజః.
ఆ మాట విని విప్రవర్యుడగు ఆ సంయమనుడు అచ్చెరువుతో ఆ నిష్ఠురకునితో నిట్లు పలికెను.
కిమేత దుచ్యతే భద్ర ప్రత్యక్షం హేతుమద్వచః,
తతః శ్రుత్వా మునే ర్విప్రం లుబ్ధకః ప్రాహ ధర్మవిత్,
కృత్వా లోహమయం జాలం తస్యాధో జ్వలనం దదౌ.
భద్రా! ఎట్ట ఎదురుగా ఇది ఏమి హేతు వాదము చేయు చున్నావు? అంత నా ధర్మ వేత్తయగు కిరాతుడు ముని వాక్యము విని యొక యినుప వల నేర్పరచి క్రింద నిప్పు పెట్టెను.
దత్త్వా వహ్నిం ద్విజం ప్రాహ జ్వాల్యతాం కాష్ఠ సంచయః,
తతో విప్రో ముఖే నాగ్నిం ప్రజ్వాల్య విరరామ హ.
అట్లు నిప్పు పెట్టి విప్రునితో ఈ కట్టెలను మండ బెట్టుమని యడిగెను. అంత నా ముని నోటితో ఊది అగ్నిని మండించి యూర కుండెను.
జ్వలితే తు పున ర్వహ్నౌ తం జాలం లోహసంభవమ్,
పృథక్‌పృథక్ సహస్రాణి నిన్యేన్తర్జాలకై ర్ద్విజ,
ఏకస్థాన గతస్యాపి వహ్నే రాయసజాలకైః.
అట్లు జ్వాలలు రాగా ఆ ఇనుప వల తన రంధ్రముల నుండి వేరు వేరుగా వేల కొలది జ్వాలలను వెలువరించెను. అగ్ని ఒక్క చోటున నున్నను వల నుండి మంటలు వేల కొలదిగా ఏర్పడెను.
తతో లుబ్ధోబ్రవీద్ విప్ర మేకాం జ్వాలాం మహామునే,
గృహాణ యేన శేషాణాం కరిష్యా మీహ నాశనమ్.
పిదప ఆ వేటగాడు బ్రాహ్మణునితో ‘విప్రా! మహామునీ! ఒక్క జ్వాలను కైకొనుము. దానితో తక్కిన జ్వాలలను ఆర్పి వేసెదను’ అని పలికెను.
ఏవ ముక్త్వా హుతాశే తు తోయపూర్ణం ఘటం ద్రుతమ్,
చిక్షేప సహసా వహ్నిః ప్రశశా మాశు పూర్వవత్.
అని పలికి అతడు నీరు నిండిన కుండను ఒక్కుమ్మడిగా నిప్పుపై క్రుమ్మరించెను. వెను వెంటనే అగ్ని తొంటి వలె అణగి పోయెను.
తతోబ్రవీ ల్లుబ్దక స్తు బ్రాహ్మణం తం తపోధనమ్,
భగవన్ యా త్వయా జ్వాలా గృహీతాసీ ద్ధుతాశనాత్,
ప్రయచ్ఛ యేన మార్గాణి మాంసాన్యానాయ్య భక్షయే.
పిదప ఆ లుబ్దకుడు తపో ధనుడగు ఆ బ్రాహ్మణునితో నిట్లు పలికెను. పూజ్యుడా! నీవు నిప్పు నుండి కైకొన్న ఆ జ్వాలను నా కొసగుము. నేను దానితో లేడి మాంసములను వండుకొని తిందును.
ఏవ ముక్త స్తదా విప్రో యావ దాయసజాలకమ్,
పశ్యత్యేవ న త్రతాగ్ని ర్మూలనాశే గతః క్షయమ్.
అత డిట్లు పలుకగా బాపడు ఇనుప వల చూచునంతలో అచట అగ్నియే లేకుండెను. క్రింద ఉంచిన అగ్ని చల్లారగా పైనున్న జ్వాలలు కూడ నశించెను గదా!
తతో విలక్షభావేన బ్రాహ్మణః శంసితవ్రతః,
తూష్ణీంభూతః స్థిత స్తావ ల్లుబ్ధకో వాక్యమబ్రవీత్.
అంత పండిన వ్రతములు గల ఆ బ్రాహ్మణుడు చెదరిన హృదయముతో మిన్న కుండగా అంతలో ఆ వేటగాడిట్లు పలికెను.
ఏతస్మి ఞ్జ్వలితో వహ్ని ర్బహుశాఖశ్చ సత్తమ,
మూలనాశే భవేన్నాశ స్తద్వ దేత దపి ద్విజ.
ఈ వలలో వెలుగొందిన నిప్పు పెక్కు జ్వాలలుగా చెల రేగెను. క్రింద నున్న మూలము ఆరిపోగా జ్వాల లన్నియు నశించెను. ద్విజుడా! ఇదియు ఇట్టిదియే.
ఆత్మా న ప్రకృతిస్థశ్చ భూతానాం సంశ్రయో భవేత్,
భూయ ఏషా జగత్సృష్టి స్తత్రైవ జగతో భవేత్.
మూల కారణమగు ఆ ఆత్మయే ఎల్ల భూతములకు ఆశ్రయము. ఈ జగత్తంతయు దాని నుండియే యేర్పడినది. అందే ప్రాణులన్నియు నేర్పడెను.
పిండగ్రహణ ధర్మేణ యదస్య విహితం వ్రతమ్,
తత్త దాత్మని సంయోజ్య కుర్వాణో నావసీదతి.
అన్నమును గొను ధర్మముతో ఆయా ప్రాణికి భగవంతు డేర్పరచిన వ్రతమును, ఆయా ప్రాణి ఆత్మ యందు లగ్నము చేసి చేయు నెడల వినాశము పొందుదు.
ఏవ ముక్తే తు వ్యాధేన బ్రాహ్మణే రాజసత్తమ,
పుష్పపృష్టి రథాకాశాత్ తస్యోపరి పపాత హ.
వ్యాదు డిట్లు బాపనితో పలుకగా రాజవరా! ఆకాశము నుండి వానిపై పూలవాన కురిసెను.
విమానాని చ దివ్యాని కమగాని మహాన్తి చ,
బహురత్నాని ముఖ్యాని దదృశే బ్రాహ్మణోత్తమః.
మరియు దివ్యములు, ఇచ్చ ననుసరించి పోవునవి, దొడ్డవి, పెక్కు రత్నములు కలవి యగు విమానములను ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎట్ట ఎదుట గాంచెను.
తేషు నిష్ఠురకం లుబ్ధం సర్వేషు సమవస్థితమ్,
దదృశే బ్రాహ్మణ స్తత్ర కామరూపిణి ముత్తమమ్.
ఆ బ్రాహ్మణుడు ఆ అన్నింటి యందును ఇచ్చ వచ్చిన రూపము తాల్చి యున్న ఉత్తముడగు ఆ నిష్ఠురకుడను వేటగానినే చూచెను.
అద్వైతవాసనా సిద్ధం యోగాద్ బహుశరీరకమ్,
దృష్ట్వా విప్రో ముదా యుక్తః ప్రయయౌ నిజ మాశ్రమమ్.
యోగ శక్తి వలన అద్వైత వాసనతో సిద్ధించిన పెక్కు శరీరములు గల అతనిని గాంచి ఆ విప్రుడు ఆనందమంది తన యాశ్రమమున కరిగెను.
ఏవం జ్ఞానపతః కర్మ కుర్వతోపి స్వజాతికమ్,
భవేన్ముక్తి ర్ద్విజశ్రేష్ఠ రైభ్య రాజన్ వసో ధ్రువమ్.
ఇట్లు జ్ఞానము కలవాడు తన జాతికి దైవ మేర్పరిచిన కర్మము చేయు చున్నను, రైభ్యా! వసురాజా! నిక్కముగా ముక్తి పొందును.
ఏవం తౌ సంశయచ్ఛేదం ప్రాప్తౌ రైభ్యవసూ నృప,
బృహస్పతే స్తతో ధిష్ణ్యా జ్జగ్మతు ర్నిజ మాశ్రమమ్.
ఇట్లు ఆ రైభ్య వసువు లిరువురు సంశయము తీర్చుకొని బృహస్పతి భవనము నుండి తమ యాశ్రమమున కరిగిరి.
తస్మాత్ త్వమపి రాజేన్ద్ర దేవం నారాయణం ప్రభుమ్,
అభేదేన స్వదేహస్థం పశ్య న్నారాధయ ప్రభుమ్.
కావున ఓ రాజేంద్రా! నీవు కూడా ప్రభువైన నారాయణ దేవుడు మరియొకడు గాక నీ దేహమందె యున్న వాడని చూచుచు ఆ ప్రభువు నారాదింపుము.
కపిలస్య వచః శ్రుత్వా స రాజాశ్వశిరా విభుః,
జ్యేష్ఠం పుత్రం సమాహూయ ధన్యం స్థూలశిరాహ్వయమ్,
అభిషిచ్య నిజే రాజ్యే స రాజా ప్రయయౌ వనమ్.
కపిలుని ఉపదేశము విని ఆశ్వశిరో మహారాజు పుణ్యాత్ముడగు తన పెద్ద కొడుకును స్థూల శిరుడను వానిని పిలిచి తన రాజ్యమున అభిషేకము చేసి తాను వనమున కరిగెను.
నైమిషాఖ్యం వరారోహే తత్ర యజ్ఞతనుం గురుమ్,
తపసారాధయామాస యజ్ఞమూర్తిం స్తవేన చ.
నైమిషమను అడవి కరిగి ఆ రాజు అచట యజ్ఞమే దేహముగా గల గురువును శ్రీమన్నారాయణుని తపస్సుతో ఆరాధించెను. ఆ యజ్ఞ మూర్తిని స్తుతించెను.
భూదేవి:
కథం యజ్ఞతనోః స్తోత్రం రాజ్ఞా నారాయణస్య హ,
స్తుతిః కృతా మహాభాగ పున రేతచ్చ శంస మే.
భూదేవి:
ప్రభూ! ఆ రాజు యజ్ఞ దేహము గల నారాయణుని స్తోత్ర మెట్లు చేసెనో దానిని నా కెరిగింపుము.
శ్రీవరాహ దేవుడు:
నమామి యాజ్యం త్రిదశాధిపస్య భవస్య సూర్యస్య హుతాశనస్య,
సోమస్య రాజ్ఞో మరుతా మనేకరూపం హరిం యజ్ఞనరం సమస్యే.
శ్రీవరాహ దేవుడు:
దేవేంద్రుడు, శివుడు, సూర్యుడు, అగ్ని, రాజైన చంద్రుడు, వేర్వేరు దేవతలు అనువారి యజ్ఞ మయమైన రూపము గల శ్రీహరికి నమస్కారము చేసెదను.
సుభీమదంష్ట్రం శశిసూర్యనేత్రం సంవత్సరే చాయనయుగ్మ కుక్షమ్,
దర్భాజ్గరోమాణ మథేధ్మ శక్తిం సనాతనం యజ్ఞనరం నమామి.
భయము గొలుపు దంతములు గలవాడు, సూర్య చంద్రులే కన్నులైన వాడు, సంవత్సరమున రెండు ఆయనములు కడుపుగా గలవాడు, దేహము నందలి రోమముల రూపమున నున్న దర్భలు కలవాడు, సమిధలే శక్తిగా గలవాడు, సనాతనుడు అగు యజ్ఞ రూప నరునికి హరికి నమస్కరింతును.
ద్యావాపృథివ్యో రిద మన్తరం హి వ్యాప్తం శరీరేణ దిశశ్చ సర్వాః,
త మీడ్య మీశం జగతాం ప్రసూతిం జనార్దనం తం ప్రణతోస్మి నిత్యమ్.
భూమికి ఆకాశమునకు గల నడిమి భాగము నంతటిని, దిక్కులన్నింటిని తన దేహముతో వ్యాపించిన వాడు, స్తుతింప దగిన వాడు, జగత్తులన్నింటి పుట్టుకకు కారణ మైనవాడు, నిత్యుడు (నాశనము లేనివాడు) అగు జనార్ధనునకు ప్రణామము లర్పింతును.
సురాసురాణాం చ జయాజయాయ యుగే యుగే యః స్వశరీర మాద్యమ్,
సృజత్యనాదిః పరమేశ్వరో యస్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్.
దేవతల విజయమునకు, రాక్షసుల ఓటమికిని తొలిదైన తన దేహమును ప్రతి యుగము నందును సృష్టించు పరమేశ్వరుడు, ఇది మొదలని నిర్ణయింప రాని వాడు, యజ్ఞ మూర్తి అయిన ప్రభువునకు మ్రొక్కు లిడుదును.
దధార మాయామయ ముగ్రతేజా జయాయ చక్రం త్వమలాంశు శభ్రమ్,
గదాపి శర్జాది చతుర్భుజోయం తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మినిత్యమ్.
భయము గొల్పు ఆ స్వామి జయమునకై నిర్మలము లగు కాంతులతో శుభ్రమైన ఆయా స్వరూపమగు చక్రమును ధరించెను. అట్లే గద, ఖడ్గము, శార్జ్ఞమను విల్లు అను వానిని చేపట్టెను. ఇట్లు నాలుగు భుజముల గల నిత్యుడగు యజ్ఞ మూర్తికి దోయిలింతును.
క్వచిత్ సహస్రం శిరసాం దధార క్వచి న్మహా పర్వతతుల్య కాయమ్,
క్వచిత్ స ఏవ త్రసరేణు తుల్యోయ స్తం సదా యజ్ఞనరం నమామి.
ఒకప్పుడు వేయి తలలు తాల్చును. ఒకప్పుడు పెద్ద కొండ వంటి దేహము కలవాడును. ఒకప్పుడు అతడే అతి సూక్ష్మమగు దుమ్ము కణమునకు పోలును. అట్టి యజ్ఞ రూప నరునకు ఎల్ల వేళల నమస్కరింతును.
చతుర్ముఖో యః సృజతే సమగ్రం రథాజ్గ పాణిః ప్రతిపాలనాయ,
క్షయాయ కాలానల సన్నిభో యస్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్.
ఆ యజ్ఞ మూర్తియే నాలుగు మోములు గల బ్రహ్మయై యీ లోకముల నన్నింటిని సృష్టి చేయు చున్నాడు. పాలనకై యాతడే చక్రము చేత దాల్చిన విష్ణువగు చున్నాడు. లోకములను ఉప సంహరించుటకై ప్రళయ కాలాగ్ని వంటి రూపము గల రుద్రుడగు చున్నాడు. అట్టి నిత్య మూర్తికి నమస్కరింతును.
సంసార చక్రక్రమణ క్రియాయై య ఇజ్యతే సర్వగతః పురాణః,
యోయోగిభి ర్ధ్యాయతే చాప్రమేయ స్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్.
ఈ సంసారమను చక్రము ప్రవర్తించుట యను కార్యమునకై అంతట వ్యాపించిన పురాణ పురుషుడు యజ్ఞ రూపమున అర్చింపబడు చున్నాడు. ఊహింప నలవి కాని మహిమ గల అతనిని యోగులు నిత్యమూ ధ్యానము చేయుదురు. అట్టి నిత్యుడగు యజ్ఞ మూర్తికి మ్రొక్కు లిడుదును.
సమ్య ఙ్మన న్యర్పితవా నహం తే యదా సుదృశ్యం స్వతనౌ ను తత్త్వమ్,
న చాన్య దస్తీతి మతిః స్థిరా మే యత స్తతో మావతు శుద్ధభావమ్.
ఓ ప్రభూ! నిన్ను నా మదిలో చక్కగా కుదురు కొల్పు కొంటిని. నా దేహమున నీ తత్త్వము నాకు సృష్టముగా కాన వచ్చు చున్నది. ఇంత కంటె వేరేమియు లేదని నాకు దృడమైన అభిప్రాయము కలిగినది. ఇట్టి శుద్ధ భావము నాకు దేని వలన కలిగినదో ఆ పరతత్త్వము నన్నెల్ల వేళల కాపాడు గాక!
ఇతీరిత స్తస్య హుతాశనార్చిః ప్రఖ్యం తు తేజః పురతో బభూవ
తస్మిన్ స రాజా ప్రవివేశ బుద్ధిం కృత్వా లయం ప్రాప్తవాన్ యజ్ఞమూర్తౌ.
ఇట్లాతడు చెప్పి నంతనే ఆ రాజు ముందు అగ్ని జ్వాల వంటి తేజ మొకటి సాక్షాత్కరించెను. ఆ రాజు ఆ యజ్ఞ మూర్తి యందు బుద్ధిని నిలిపి యందు చొచ్చి లయమై పోయెను.