అధ్యాయము - 114

తతోమహీవచః శ్రూత్వా దేవో నారాయణోబ్రవీత్‌,

కథయిష్యామి తే దేవి కర్మస్వర్గ సుఖావహమ్‌.

అంత ఆ భూదేవి పలుకు విని నారాయణ దేవుడిట్లు పలికెను. దేవీ! స్వర్గ సుఖమును కలిగించు కర్మ మార్గమును నీకు చెప్పెదను.

యత్త్వయా పృచ్ఛితం దేవి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

స్థితిసంస్థాన మర్త్యానాం భక్త్యా యే చ వ్యవస్థితాః.

వసుంధరా! భక్తితో స్థిర బుద్ధితో నుండు మానవుల స్థితిని గూర్చి నీవడిగిన దానికి సమాధానము వినుము.

నాహం దానసహస్రేణ నాహం యజ్ఞశతైరపి,

తుష్యామి నతు విత్తేన యే నరాః స్వల్పచేతసః.

అల్ప బుద్ధి గల నరు లిచ్చెడు వేల కొలది దానముల చేతను, నూర్ల కొలది యజ్ఞముల చేతగాని, ధనము చేత గాని నేను తుష్టి నందను.

ఏకచిత్తం సమాధాయ యో మాం భజతి మాధవి,

నిత్యం తుష్యామి తస్యాహం పురుషం బహుదోషతః

చిత్తమును ఏకాగ్రము చేసి నన్ను భజించు వాని విషయమున, పెక్కు దోషము లున్నను, నేను తుష్టి నందుదును.

యచ్చ పృచ్ఛసి మాం భద్రే కర్మ స్వర్గ సుఖావహమ్‌,

తచ్ఛ్రుణుష్వ వరారోహే గదతో మే శుచిస్మితే.

సుందరీ! పవిత్ర మగు మందహాసము కలదానా! స్వర్గమునకు కారణమైన కర్మమును గూర్చి నన్న డిగితివి. చెప్పు చున్నాను. వినుము.

యే సమస్యన్తి మాం నిత్యం పురుషా బహుచేతసః,

అర్ధరాత్రేన్ధకారే చ మధ్యాహ్నే చాపరాహ్ణయోః.

యస్య చిత్తం ననశ్యేత మమభక్తి వ్యవస్థితమ్‌,

ద్వాదశ్యా ముపవాసం తు యః కుర్యాన్మమ తత్పరః,

న తేషాం హి ప్రణశ్యామి కదాచిదపి మాధవి.

మాధవీ! పురుషులు పెక్కు భావనలు కలవారైనను, నడికి రేయి యందు, చీకటిలో, మధ్యాహ్నము నందు, అపరాహ్ణము నందు నిత్యము నాకు నమస్కారము చేయుచు, నా భక్తి యందు చక్కగా కుదురు కొన్న చిత్తము కలవారై శ్రద్ధతో ద్వాదశి యందు ఉపవాసము చేయుదురేని అట్టి వారికి నేనెన్నడును దూరము కాను.

లబ్ధచేతో గుణజ్ఞశ్చ నరో భక్తి పరాయణః,

యశ్చాపి మత్పరః సో వై స్వర్గే వసతి సుందరి.

చక్కని బుద్ధి పొంది గుణము లెరిగి భక్తి యందు ఏక చిత్తము కలిగి నన్నే అర్చించు నరుడు, సుందరీ! స్వర్గమున నివసించును.

స్వల్పకేన న గమ్యన్తే దుష్ర్పాప్యోహం వరాననే,

యాని కర్మాణి కుర్వన్తో మాం ప్రపశ్యన్తి మాధవి,

తాని తే కథయిష్యామి యేన భక్త్యా వ్యవస్థితాః.

వరాననా! నా వంటి వారు చిన్న విషయముతో లభ్యము కాదు. నేను మిక్కిలి సులభుడను కాను. పరమ భక్తితో స్థిరులైన వారు ఏమి కర్మములు చేసి నన్ను పొందుదురో వానిని చెప్పెదను.

ద్వాదశ్యా ముపవాసం తు యే వై కుర్వన్తి తేనరాః,

తే మామేవ ప్రపశ్యన్తి మమభక్తి పరాయణాః.

నా యందు చెదరని భక్తి కలవారై ద్వాదశి నాడు ఉపవాసము చేయు నరులు నన్నే చూతురు.

కృత్వా చైవోపవాసం తు గృహ్య చైవ జలాంజలిమ్‌,

నమో నారాయణేత్యుక్త్వా ఆదిత్యం చావలోకయేత్‌.

ఉపవాసము చేసి జలము దోసిలితో గ్రహించి నారాయణా! నీకు నమస్కారమని పలికి సూర్యుని చూడ వలయును.

యావన్తో బిన్దవః కించిత్‌ పతన్త్యే వాంజలే ర్జలాత్‌,

తావద్‌ వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే.

దోసిలి లోని నీటి నుండి ఎన్ని బిందువులు పడునో అన్ని వేల సంవత్సరములు ఆతడు స్వర్గ లోకమున ప్రసిద్ధి కెక్కును.

అథ చైవతు ద్వాదశ్యాం పురుషా ధర్మవాదకాః,

విధినా చ ప్రయత్నేన యే మాం కుర్వన్తి మానుషాః.

పాండురై శ్చైవ పుష్పైశ్చ మృష్టై ర్ధూపైశ్చ ధూపయేత్‌,

యే యే ధారయతే భూమే తస్యాసి శృణు యా గతిః.

మరియు ద్వాదశి నాడు ధర్మమును గూర్చి ప్రసంగించు వారై, విధి పూర్వకముగా ప్రయత్నముతో తెల్లని పూలతో, నిండిన ధూపములతో నన్ను పూజించుచు, హృదయమున భావించుచు నుండు నరులు పొందు గతి యెట్టిదో చెప్పెదను. వినుము.

దత్వా శిరసి పుష్పాణి ఇమం మన్త్రముదాహరేత్‌,

హృది కృత్వా తు మన్త్రాణి శుక్లాంబరధరో ధరే.

సుమనః సుమనా గృహ్య ప్రియో మేభగవాన్‌ హరిః,

ఏతేనమన్త్రేణ సుమనో దద్యాత్‌.

నా శిరస్సున పుష్పము లుంచి ఈ మంత్రమును హృదయమున నుంచుకొని తెల్లని వస్త్రములను ధరించి చేతిలో పుష్ప ముంచుకొని భగవంతుడగు హరి నాకు ప్రియుడు అను అర్థము గల మంత్రమును చదువుచు నర్పింప వలయును.

నమోస్తు విష్ణవే వ్యక్తావ్యక్త గన్ధసుగన్ధి చ,

గృహ్ణ గృహ్ణ నమో భగవతే విష్ణవే,

అనేన మన్త్రేణ గంధం దద్యాత్‌.

విష్ణువునకు నమస్కారము. “ఓం నమో భగవతే విష్ణవే”. వ్యక్తము, అవ్యక్తము అగు మంచి గంధమును స్వామీ నీవు గ్రహించు, గ్రహించు అను మంత్రముతో గంధము నీవలయును.

శ్రుత్వా ప్రత్యాగత మాధార సవనం పతయే భవ,

ప్రవిష్టే యే ధూపధూపనం గృహ్ణాతు భగవానచ్యుతః,

అనేన మంత్రేణ ధూపందద్యాత్‌.

భగవంతుడగు అచ్యుతుడు నా ప్రార్థన విని విచ్చేసెను. ఈ పూజకు ఆధార మాయెను. ఇందు ప్రవేశము పొంది నా ధూపమును ఆతడు గ్రహించు గాక! అను పవిత్ర వాక్యముతో ధూపము నొసగ వలయును.

శ్రుత్వా చైవ చ శాస్త్రాణి యో మామేవంతు కారయేత్‌,

మమ లోకం సగచ్ఛేత జాయతే వై చతుర్భుజః.

నేను విన్న వించుకొన్న శాస్త్ర వాక్యములను విని నాచేత ఈ పూజ చేయించు కొనెను. ఆతడు నాలోకమున కరిగి నాలుగు భుజములు కలవాడగును.

ఏతత్‌ తే కధితం దేవి శ్రేష్ఠం చైవ మమ ప్రియమ్‌,

తవచైవ ప్రియార్ధాయ మన్త్రపూజా సుఖావహమ్‌.

దేవీ! నాకు ప్రియమైన మంత్ర పూజా విధానమును, సుఖము కలిగించు దానిని, శ్రేష్ఠమగు దానిని నీ ప్రియము కొరకు చెప్పితిని.

శ్యామాకం షష్టికం చైవ గోధూమా ముద్గకం తథా,

శాలీన్యవో యవాంశ్చైవ తథా నీవారకఙ్గుకాః.

సస్యాన్యేతాని భుంజీత మమ కర్మ పరాయణః,

పశ్యన్తి శంఖచక్రం చ లాంగలం ముసలం సదా,

గదా నిత్యం సదాభక్తః పూజయేత్‌ సచ మే ప్రియః.

చామలు, షష్టికము, గోధుమలు, పెసలు, శాలి ధాన్యము, యవలు, నివ్వరి ధాన్యము, కొఱ్ఱలు అను ఈ ధాన్యములను నా పూజ యందు శ్రద్ధ కలవారు భుజింప వలయును. నాకు ప్రియుడై ఎల్ల వేళల నన్ను పూజించు వాడు శంఖమును, చక్రమును, నాగలిని, రోకలిని, గదను నిత్యము చూచు చుండును. (షష్టికమ్‌ = అరువది దినములలో పండెడు ధాన్యము. నాగలి, రోకలి = బలరాముని ఆయుధములు)

బ్రాహ్మణస్య తు వక్ష్యామి శృణు కర్మ వసుంధరే,

యాని కర్మాణి కుర్వన్తో మమ భక్తి పరాయణాః.

నా భక్తి యందు మిక్కిలి ఆసక్తి కలవారై ఆయా పూజలు చేయు వారిలో బ్రాహ్మణుని కర్తవ్యమును చెప్పెదను. వినుము.

షట్‌ కర్మనిరతో భూత్వా ఆహంకారవివర్జితః,

లాభాలాభం పరిత్యజ్య భిక్షాహారో జితేన్ద్రియః.

మమ కర్మసమాయుక్తః పైశున్యేన వివర్జితః,

ఋతుకాలాభిగామీ చ శాన్తాత్మా మానవర్జితః,

శాస్త్రానుసారీ మధ్యస్థో న వృద్ధశిశుచేతనః.

అతడు ఆరు కర్మముల యందు శ్రద్ధ కలవాడు, అహంకార మును వదలిన వాడు, లాభ నష్ట ములను పట్టించు కొనని వాడు, బిచ్చ మెత్తిన అన్నము తినువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, నా పూజ యందే శ్రద్ధ కలవాడు, లోభ గుణము లేనివాడు, ఋతు కాలమున మాత్రమే భార్యను పొందు వాడు, శాంతాత్ముడు, దుర భిమానము లేనివాడు, శాస్త్రముల ననుసరించు వాడు, పక్ష పాతము లేనివాడు, వృద్ధులయు, బాలురయు బుద్ధులు లేనివా డు కావలయును. (షట్కర్మములు = 1. యజ్ఞము చేయుట 2. చేయించుట 3. వేదములు చదువుట 4. చదివించుట 5. దాన మిచ్చుట 6. పుచ్చుకొనుట)

ఏతద్‌వై బ్రాహ్మణే కర్మ పాకచిన్తా పరాయణః,

కారయే దిష్టాపూర్తేన స మామేవ చ పశ్యతి.

ఇది బ్రాహ్మణుని విధి. ఆతడు పరిపాకము చెందిన భావమున శ్రద్ధ కలవాడై ఇష్టా పూర్తములతో ఆయా కర్మములను చేయ వలయును. అతడు నన్నే దర్శించును. (ఇష్టము = యజ్ఞము, పూర్తము = నూతిని త్రవ్వించుట, గుడి కట్టించుట, వనము ఏర్పరచుట, అన్న దానము చేయుట).

క్షత్రియాణాం ప్రవక్ష్యామి మమ కర్మ పరాయణాః,

యాని కర్మాణి కుర్వన్తి క్షత్రియా మధ్యసంస్థితాః.

నా కర్మము నందు శ్రద్ధ కలవాడు వర్ణములలో నడుమ నున్న వాడు అగు క్షత్రియుని కర్మము లెట్టివో చెప్పెదను.

దానశూరశ్చ కర్మజ్ఞో యజ్ఞేషు కుశలః శుచిః,

మమ కర్మసు మేధావీ అహంకార వివర్జితః.

ఆతడు దాన శూరుడు, కర్మములను చక్కగా ఎరిగిన వాడు, యజ్ఞము లందు నేర్పరి, శుచి, నా పనుల యందు మేధావి, అహంకారము వదలిన వాడును కావలయును.

అల్పభాషీ గుణజ్ఞశ్చ నిత్యం భాగవత ప్రియః,

గురువిద్యో ససూయుశ్చ గుహ్యకర్మస్వనారతః.

మితముగా భాషించు వాడు, గుణము నెరిగిన వాడు, నిత్యము భగవద్భక్తుల యందు ప్రియము కలవాడు, గొప్ప విద్యలు కలవాడు, అసూయ లేనివాడు, చాటుమాటు పనుల యందు తగులము లేని వాడును కావలయును.

అభ్యుత్థానాదికుశలః పైశున్యేన వివర్జితః,

ఏతై ర్గుణైః సమాయుక్తో యో మాం యజతి క్షత్రియః,

భజతే మమ యో నిత్యం మమ లోకాయ గచ్ఛతి.

పెద్దలు కనబడి నపుడు ఎదురేగుట మొదలగు పనులలో నేర్పు కలవాడు, లోభ గుణము లేనివాడు, ఇట్టి గుణములతో కూడిన వాడై నన్నర్చించు క్షత్రియుడు నా లోకమున కరుగును.

వైశ్యానాంతు ప్రవక్ష్యామి మమకర్మపరాయణః,

యాని కర్మాణి కురుతే మమ భక్తిపథే స్థితః.

నా భక్తి మార్గమున స్థిరముగా నిలిచి నా పనుల యందు శ్రద్ధ కలవాడగు వైశ్యుని కర్మములను గూర్చి చెప్పెదను.

ఏభిర్గుణైః స్వధర్మేణ లాభాలాభవివర్జితః,

ఋతుకాలాభిగామీ చ శాంతాత్మా మోహవర్జితః.

చెప్ప బోవు గుణములతో తన ధర్మమును పాటించుచు లాభ నష్టములను లెక్క పెట్టక, ఋతు కాలమున భార్యను కలియుచు శాంతాత్ముడు మోహము లేని వాడును కావలయును.

శుచి ర్దక్షో నిరాహారో మమకర్మరతః సదా,

గురుసంపూజకో నిత్యం యుక్తో భక్త్యానువత్సలః.

పరిశుద్ధుడు, సమర్థుడు, నా పనుల యందు ప్రీతి కలవాడై యున్నపుడు ఆహారము కొనని వాడు, గురువులను చక్కగా పూజించు వాడు భక్తితో కూడిన వాడు కావలయును.

వైశ్యో ప్యేవం సుసంయుక్తో యోనుకర్మానుసారయేత్‌,

తస్యాహం నప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.

ఈ విధముగా చక్కగా నా భావముతో కూడి యుండి తన కర్మమును అనుసరించు వానికి నేను దూరము కాను. ఆతడు నాకు దూరము కాడు.

అథ శూద్రస్య వక్ష్యామి కర్మాణి శృణు మాధవి,

యాని కర్మాణి వక్ష్యామి శూద్రో మహ్యం వ్యవస్థితః.

మాధవీ! ఇక శూద్రుని కర్మములను గూర్చి చెప్పెదను వినుము. నా యందు నిలుకడ గల శూద్రుని కర్మము లెట్టివో వక్కాణింతును.

దంపతీ మమ భక్తౌ యౌ మమ కర్మపరాయణౌ,

ఉభౌ భగవతో భక్తౌ మత్పరౌ కర్మనిష్ఠితౌ.

నా పనుల యందు పరమ శ్రద్ధయు, నిష్ఠయు కలిగి ఆలుమగ లిద్దరు నన్నే నమ్ముకొని నా యందు భక్తులై యుండువారు,

దేశకాలావజానన్తౌ వర్జితౌ తమసో రజః,

నిరహంకారశుద్ధాన్తౌ అతిధే ర్మన్త్ర వత్సలౌ.

శ్రద్ధావన్తౌ విపూతాంతౌ లోభమోహవివర్జితౌ,

నమస్కారప్రియౌ నిత్యం మమచిన్తా వ్యవస్థితౌ.

శూద్రకర్మాణి మే దేవి యఏవం స సమాచరేత్‌,

త్యక్త్వా ఋషిసహస్రాణి శూద్రమేవ భజామ్యహమ్‌.

దేశ కాలములను పట్టించు కొనక, రజ స్తమో గుణములను వదలి, అహంకారము లేని శుద్ధమగు అంతరంగము కలవారై. అతిథులను చక్కని భావములతో మన్నించుచు, శ్రద్ధ కలవారు, పవిత్రమైన హృదయము కలవారు, లోభ మోహములను పరిత్యజించిన వారు, నా నమస్కారము లందు ప్రీతి కలవారు, నన్నే భావించుటలో స్థిర చిత్తము కలవారు అగు శూద్ర దంపతులు వారి కర్మములను చక్కగా ఆచరించుకొన వలయును. దేవీ! వేల కొలది ఋషులను వదలి నేనట్టి శూద్రులను ఆదరింతును.

చాతుర్వర్ణ్యస్య కర్మాణి యత్త్వయా పరిపృచ్ఛితమ్‌,

ఏవం కర్మగుణైశ్చవ యేన భక్త్యా వ్యవస్థితాః.

దేవీ! నాలుగు వర్ణముల వారి కర్మములను, గుణములను నన్న డిగితివి. ఆ కర్మ గుణములతో పాటు చెదరని భక్తితో కూడిన వారిని గూర్చి వివరించి చెప్పితిని.

సర్వవర్ణాని మాం దేవి అపరే బ్రాహ్మణం శృణు,

యేన తత్ర్పాప్యతే యోగం తచ్ఛ్రుణుష్వ వసుంధరే.

వసుంధరా! అన్ని వర్ణములకు సాధారణము లైన వానిని చెప్పితిని. బ్రాహ్మణుని యందు మరియొక విశిష్టత కలదు. దేవితో అతడు ఆ యోగమును పొందునో దానిని చెప్పెదను. వినుము.

త్యక్త్వా లాభ మలాభం చ మోహం కామం చ వర్జయేత్‌,

న శీతేన నచోష్ణేన లబ్ధా లబ్ధం నచిన్తయేత్‌.

బ్రాహ్మణుడు లాభ నష్టములను గూర్చి భావింప రాదు. మోహమును, కామమును విడువ వలయును. చలికి, ఎండకు చలింప రాదు. దొరకిన దానిని దొరకని దానిని గూర్చి చింతింప రాదు.

న తిక్తే నా తి కటునా మధురామ్లై ర్న లావణైః,

న కషాయైః స్పృహా యస్య ప్రాప్నుయాత్‌ సిద్ధిముత్తమామ్‌.

చేదు, కారము, తీపి, పులుపు, ఉప్పు మొదలగు రుచుల యందు ఆసక్తి ఉన్న యోడల ఆతడు ఉత్తమ మగు సిద్ధి పొందడు.

భార్యా పుత్రః పితా మాతా ఉపభోగార్థసంయుతమ్‌,

య ఏతాన్‌ హి పరిత్యజ్య మమ కర్మరతః సదా.

పెండ్లము, కొడుకు, తండ్రి, తల్లి అని యిట్లు సుఖ భోగముల కైన సంబంధముల వదలి నా పనల యందే పరమాదరమును పొంద వలయును.

ధృతిజ్ఞః కుశలశ్చైవ శ్రద్ధధానో ధృతవ్రతః,

మత్పరో నిత్యముద్యుక్తః అన్య కార్యజుగుప్సకః.

ధైర్యము, నేర్పు, శ్రద్ధ, పట్టు వీడని వ్రతము కలవాడై నన్నే పరమ గతిగా భావించి ఇతర కార్యము లందు ఏవగింపు పొందుచు నిత్యము ప్రయత్న శీలుడు కావలయును.

బాలే వయసి కల్పశ్చ అల్పభోగీ కులాన్వితః,

కారుణ్యః సర్వసత్త్వానాం ప్రత్యుత్థాయీ మహాక్షమః.

చిన్న వయసు నుండియు సమర్థుడు, మితముగా భోగములు పొందు వాడు, కుల ధర్మమును తప్పని వాడు, అన్ని ప్రాణుల యందు దయ గలవాడు, పెద్దల కెదురేగు స్వభావము కలవాడు, గొప్ప ఓరిమి కలవాడును కావలయును.

కాలే మౌన క్రియాం కుర్యాద్‌ యావత్‌ తత్కర్మ కారయేత్‌,

త్రికాలం భజతే సంధ్యాం సదా కర్మపథే స్థితః.

ఒక పని చేయు నపుడు మౌనముతో ఆ పని చేయ వలయును. మూడు కాలములలో సంధ్యా వందనము చేయ వలయును. వైదిక కర్మముల యందు నిలుకడ కలిగి యుండ వలయును.

ఉపపన్నానుభుంజానః కర్మణా భోజనాని చ,

అనుష్ఠానపరశ్చైవ మమ పార్శ్వమనాశ్చ యః.

దొరకిన దానిని తృప్తితో భుజించుచు, తన పని కనుగుణమైన భోజనములు చేయుచు, అనుష్ఠానము నందు శ్రద్ధ కలవాడై నా వైపు మనసు పెట్టిన వాడై యుండ వలయును.

కాలే మూత్రపురీషాణి విసృజ్య స్నానవత్సలః,

పుష్పగన్ధే చ ధూపేచ సత్కర్మ చ సదారతః.

తగు కాలములలో మల మూత్రములను విడచుచు, స్నానము నందు మిక్కిలి ప్రేమ కలవాడై పూల వాసనల యెడ, ధూపాదుల యెడ, సత్కర్మముల యెడను ఎల్లప్పుడు ప్రీతి కలవాడై యుండ వలయును.

కదాచిత్‌ కన్దమూలాని ఫలాని చ కదాచన,

పయసా యావకేనాపి కదాచిద్‌ వాయుభక్షణః.

కదాచిత్‌ షష్ఠకాలేచ క్వచిద్దృష్టమహాఫలః,

కదాచిత్తు చతుర్థేన కదాచిత్‌ ఫలమేవ చ,

కదాచిద్‌ దశమే భుంజేత్‌ పక్షే మాసే వసుంధరే.

ఒకప్పుడు దుంపలు, ఒకప్పుడు పండ్లు, ఒకప్పుడు పాలు, గంజి, ఏమియు దొరకనిచో గాలిని భుజించు చుండ వలయును. ఒకప్పుడు ఆరవ కాలమున, ఒకప్పుడు లభించిన మహా ఫలము, ఒకప్పుడు నాల్గవ భాగముతో, ఒకప్పుడు కేవల మొక్క ఫలముతో గడుప వలయును. పది దినములకు, పదునైదు దినములకు, నెలకు భుజింప వలసి వచ్చినను బాద నొందరాదు.

య ఏవం వర్తతే విప్రో మమకర్మ కరోతి చ,

యెగినస్తాన్‌ ప్రవక్ష్యామి తేనై వచ సనాతనమ్‌.

ఇట్లు ప్రవర్తించు విప్రుడు నా పూజా కర్మలు చేయుచుండు వాడైనచో వానిని యోగి యని వక్కాణింతును. శాశ్వతముగా వాని తోడనే కలిసి యుందును.