వరాహ మహా పురాణము
అధ్యాయము - 4
ధరణీ దేవి:
యోసౌ నారాయణో దేవః పరమాత్మా సనాతనః,
భగవన్ సర్వభావేన ఉతాహో నేతి శంస మే.
ధరణీ దేవి:
ప్రభూ! ఈ నారాయణ దేవుడు సర్వ భావములతో పరమాత్ముడు, నిత్యుడు అగు దేవుడా? కాదా? నాకు తెలుపుము.
శ్రీవరాహ దేవుడు:
మత్స్యః కూర్మో వరాహశ్చ నరసింహోథ వామనః,
రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీ చ తే దశ.
శ్రీవరాహ దేవుడు:
మత్స్యము (చేప), కూర్మము (తాబేలు), వరాహము (పంది), నరసింహుడు, వామనుడు (పొట్టి వాడు), రాముడు (పరశు రాముడు), రాముడు (దశరథ రాముడు), కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అని వారు పదుగురు.
ఇత్యేతాః కథితా స్తస్య మూర్తయో భూతధారిణి,
దర్శనం ప్రాప్తు మిచ్ఛూనాం సోపానా నీవ శోభనే.
భూదేవీ! ఈ చెప్పిన పది మందియు ఆ నారాయణుని మూర్తులు. శ్రీమన్నారాయణుని దర్శనము పొందగోరు వారికివి మెట్ల వంటివి.
యత్ తస్య పరమం రూపం తన్న పశ్యంతి దేవతాః,
అస్మదాది స్వరూపేణ పూరయంతి తతో ధృతిమ్.
ఆ దేవ దేవుని పరమ రూపమును దేవతలును చూడ జాలరు. మావంటి రూపముల తోడనే తృప్తి పడు చుందురు.
బ్రహ్మా భగవతో మూర్త్యా రజస స్తమస స్తథా,
యాభిః సంస్థాప్యతే విశ్వం స్థితౌ సంచాల్యతే చ హ.
బ్రహ్మయు భగవంతుని స్వరూపము తోడనే రజస్తమో గుణములతో నేర్పడెను. ఈ రూపముల తోడనే విశ్వ మంతయు నిలిచి యున్నది. మరియు చైతన్యమును పొందు చున్నది.
త్వమేకా తస్య దేవస్య మూర్తి రాద్యా ధరాధరే,
ద్వితీయా సలిలం మూర్తిస్తృతీయా తైజసీ స్మృతా.
ఆ దేవుని మొట్ట మొదటి రూపము, ఓ భూదేవీ! నీవు. నీరు రెండవ మూర్తి. అగ్ని మూడవ మూర్తి.
చతుర్థీ వాయుమూర్తిః స్యా దాకాశాఖ్యా తు పఞ్చమీ,
ఏతాస్తు మూర్తయ స్తస్య క్షేత్రజ్ఞత్వం హి మద్దియామ్,
మూర్తిత్రయం తథా తస్య ఇత్యేతా శ్చాష్టమూర్తయః.
నాలుగవ మూర్తి వాయువు. ఆకాశామను పేరు గలది అయిదవది. ఇవి యాతని మూర్తులు. ఈ క్షేత్రము నెరిగిన తనము నా బుద్ధి యందు గలదు. ఇవి గాక మూడు మూర్తులు ఆతనికి కలవు. అవి సూర్యుడు, చంద్రుడు, యజమానుడు అనునవి. ఇవి యాతని ఎనిమిది మూర్తులు.
ఆభి ర్వ్యాప్త మిదం సర్వం జగన్నారాయణేన హ,
ఇత్యేతత్ కథితం దేవి కిమస్య చ్ఛ్రోతు మిచ్ఛసి.
ఈ జగత్తంతయు ఆ నారాయణుని ఈ ఎనిమిది రూపములతో నిండి యున్నది. దేవీ! ఇది నీకు చెప్పితిని. ఇంకేమి విన గోరుదువు?
భూదేవి:
నారదేనైవ ముక్త స్తు తదా రాజా ప్రియవ్రతః,
కృతవాన్ కిం మమాచక్ష్వ ప్రసాదాత్ పరమేశ్వర.
భూదేవి:
పరమేశ్వరా! నారదుడట్లు పలుకగా ప్రియవ్రత మహారాజు ఏమి చేసెను? దయతో అది నాకు చెప్పుము.
శ్రీ వరాహ దేవుడు:
భవతీం సప్తధా కృత్వా పుత్రాణాం చ ప్రదాయ సః,
ప్రియవ్రత స్తప స్తేపే నారదా చ్ఛ్రుత విస్మయః.
శ్రీ వరాహ దేవుడు:
నారదుని వలన అచ్చెరువు గొలుపు వార్త విని ఆ ప్రియ వ్రతుడు నిన్ను (తానేలు భూమిని) ఏడు భాగములు చేసి పుత్రుల కొసగి తప మొనరించెను.
నారాయణాత్మకం బ్రహ్మ పరం జప్త్వా స్వయంభువః,
తత స్తుష్టమానాః పారం పరం నిర్వాణ మాప్తవాన్.
నారాయణ స్వరూపుడగు పర బ్రహ్మమును జపించి యాతడు తుష్టి చెందిన మనస్సుతో ఆవలి యోడ్డగు నిర్వాణమును పొందెను.
శృణు చాన్యద్ వరారోహే యద్ వృత్తం పరమేష్ఠినః,
ఆరాధనాయ యతతః పరాకాలే నృపస్య హ.
ఓ సుందరీ! మరియొక కథ చెప్పెదను వినుము. ఇది ప్రాత కాలపు రాజునకు సంబంధించినది. అతడు బ్రహ్మ నారాధించుటకు పూను కొనెను.
ఆసీ దశ్వశిరా నామ రాజా పరమధార్మికః,
సోశ్వమేధేన యజ్ఞేన యష్ట్వా సుబహుదక్షిణః.
స్నాత శ్చావభృథే సోథ బ్రాహ్మణౖః పరివారితః,
యావ దాస్తే స రాజర్షి స్తావద్ యోగివరో మునిః,
ఆయయౌ కపిలః శ్రీమాన్ జైగీషవ్య శ్చ యోగిరాట్.
మునుపు ధర్మ పాలనలో గొప్ప వాడగు అశ్వశిరుడను రాజుండెను. గొప్పవి, మంచివియు నగు దక్షిణలతో నతడు అశ్వమేధ యాగ మొనర్చి అవబృథ స్నానమును (యజ్ఞము ముగియు న్నప్పుడు చేయు పవిత్ర స్నానము) బ్రాహ్మణులతో కూడి చేసి యుండగా ఆతని కడకు యోగి వరుడగు ముని కపిలుడును, యోగిరాజగు జైగీషవ్యుడును వచ్చిరి.
తత స్త్వరిత ముత్తాయ స రాజా స్వాగత క్రియామ్,
చకార పరయా యుక్తః స ముదా రాజసత్తమః.
అంత నా రాజు ఉప్పొంగు సంతోషముతో లేచి వారికి స్వాగతము నెరపెను.
తా వర్చితా వాసనగౌ దృష్ట్వా రాజా మహాబలః,
పప్రచ్ఛ తా తిగ్మధియౌ యోగజ్ఞా స్వేచ్ఛయాగతౌ.
అట్లు వారు పూజ లందుకొని ఆసనము లందు కూర్చున్న పిదప మహా బలుడగు ఆ రాజు తమంత వచ్చిన వారు నిశితమైన బుద్ధి గలవారు అగు ఆ యోగ వేత్తల నిట్లడిగెను.
భవన్తౌ సంశయం విప్రౌ పృచ్ఛామి పురుషోత్తమౌ,
కథ మారాధయేద్ దేవం హరిం నారాయణం పరమ్.
విప్రులారా! పురుషోత్తములారా! మిమ్ముల నొక సంశయము నడిగేదను. పరమ దైవమగు శ్రీమన్నారాయణుని ఆరాధించి విధమేది?
విప్రులు:
క ఏష ప్రోచ్యతే రాజం స్త్వయా నారాయణో గురుః.
ఆవాం నారాయణౌ ద్వౌతు త్వత్ర్పత్యక్ష గతౌ నృప.
విప్రులు:
రాజా! నీవు చెప్పెడు ఆ నారాయణ గురు వెవ్వరు? మేమిరువురము నారాయణులము. నీ ఎదుట నిలిచి యున్నాము.
అశ్వశిరుడు:
భవన్తౌ బ్రహ్మణౌ సిద్ధౌ తపసా దగ్ద కిల్బిషౌ,
కథం నారాయణా వావా మితి వాక్య మథేరితమ్.
అశ్వశిరుడు:
మీ రిరువురు బ్రాహ్మణులు, సిద్ధ పురుషులు తపస్సుతో మీ పాపములు కాలి పోయినవి. మేమే నారాయణులమని యెట్లు పలికితిరి?
శజ్ఖచక్రగదా పాణిః పీతవాసా జనార్దనః,
గరుడస్థో మహాదేవః క స్తస్య సదృశో భువి.
ఆ జనార్ధనుని చేతులలో శంఖము, చక్రము, గదయు నుండును. అతడు పచ్చని పట్టు బట్ట కట్టును. గరుడునిపై నుండును. అతడు మహాదేవుడు. అతనికి సాటివాడు భూమిలో మరి యెవ్వడు కలడు?
తస్య రాజ్ఞో వచః శ్రుత్వా తౌ విప్రౌ సంశిత వ్రతౌ,
జహసతుః పశ్య విష్ణుం రాజ న్నితి జజల్పతుః.
వ్రతములు పండిన ఆ విప్రులిరువురు ఆ రాజు మాట విని నవ్వుచు రాజా! విష్ణువును కనుగొను మని బల్కిరి.
ఏవ ముక్త్వా స కపిలః స్వయం విష్ణు ర్బభూవ హ,
జైగీషవ్యశ్చ గరుడ స్తత్షణాత్ సమజాయత.
ఇట్లు పలికి ఆ కపిలుడు స్వయముగా విష్ణు వాయెను. వెను వెంటనే జైగీషవ్యుడు గరుడు డాయెను.
తతో హాహాకృతం త్వాసీత్ తత్షణాద్ రాజమణ్డలమ్,
దృష్ట్వా నారాయణం దేవం గరుడస్థం సనాతనమ్.
ఆ క్షణమున గరుడునిపై నున్న సనాతనుడను నారాయణ దేవుని చూచి రాజకుల మంతయు హాహాకారములు చేసెను.
కృతాంజలిపుటో భూత్వా తతో రాజా మహాయశాః,
ఉవాచ శామ్యతాం విప్రౌ నాయం విష్ణు రథేదృశః.
గొప్ప కీర్తి గల రాజంత చేతులు జోడించి యిట్లు పలికెను. విప్రులారా! శాంతింపుడు. విష్ణు వనగా నిట్టివాడు కాడు.
యస్య బ్రహ్మా సముత్పన్నో నాభిషఙ్కజమధ్యతః,
తస్మాచ్చ బ్రహ్మణో రుద్రః స విష్ణుః పరమేశ్వరః.
విష్ణువు బొడ్డు తామర మధ్య నుండి బ్రహ్మ పుట్టెను. అతని నుండి రుద్రుడు పుట్టెను. అట్టి పరమేశ్వరుడు విష్ణువు.
ఇతి రాజవచః శ్రుత్వా తదా తౌ మునిపుజ్గవౌ,
చక్రతుః పరమాం మాయాం యోగమాయాం విశేషతః.
రాజిట్లు పలుకగా ఆ మునివరు లిరివిరు పరమ మాయ గావించిరి. విశేషించి యోగ మాయను ప్రదర్శించిరి.
కపిలః పద్మనాభస్తు జైగీషవ్యః ప్రజాపతిః,
కమలస్థో బభౌ హ్రస్వ స్తస్య చాజ్కే కుమారకః.
కపిలుడు పద్మనాభు డాయెను. (బొడ్డు నందు పద్మము కలవాడు) జైగీషవ్యుడు కమలము నందుండి యొడిలో పసివాని నొకని నుంచుకొని బ్రహ్మగా ఏర్పడెను.
దదర్శ రాజా రాక్తాక్షం కాలానలసమద్యుతిమ్,
నేత్థం భవతి విశ్వేశో మాయైషా యోగినాం సదా,
సర్వవ్యాపీ హరిః శ్రీమా నితి రాజా జగాద హ.
ఎరుపెక్కిన కనులతో ప్రళయాగ్ని వంటి తేజస్సుతో నున్న ఆ బాలుని రాజు కనుగొనెను. అతడిట్లు పలికెను. విశ్వేశ్వరు డిట్లుండడు. ఇది యోగుల మాయ. శ్రీహరి అంతట వ్యాపించి యుండు వాడు. లక్ష్మీ దేవితో కలసి యుండును.
తతో వాక్యావసానే తు తస్య రాజ్ఞో హి సంసది,
మశకా మత్కుణా యూకా భ్రమరాః పక్షిణోరగాః.
అశ్వా గావో ద్విపాః సింహా వ్యాఘ్రా గోమాయవో మృగాః,
అన్యేపి పశవః కీటా గ్రామ్యారణ్యాశ్చ సర్వశః,
దృశ్యన్తే రాజభవనే కోటిశో భూతధారిణి.
రాజు మాట ముగియగనే, ఓ భూదేవీ! ఆ సభలో, రాజ భవనములో దోమలు, నల్లులు, పేలు, తుమ్మెదలు, పక్షులు, పాములు, గుఱ్ఱములు, గోవులు, ఏనుగులు, సింహములు, పులులు, నక్కలు, లేళ్ళు ఇతర పశువులు, పురుగులు అడవులలో తిరుగునవి, జన పదములలో తిరుగునవి కోట్ల కొలదిగా కాన వచ్చినవి.
తం దృష్ట్వా భూతసంఘాతం రాజా విస్మితమానసః,
యావచ్చిన్తయతే కిం స్యా దేత దిత్యవగమ్య చ,
జైగీషవ్యశ్చ మాహాత్మ్యం కపిలస్య చ ధీమతః.
ఆ ప్రాణి కోటుల సముదాయమును గాంచి రాజు మనసున ఆశ్చర్య పడెను. ఇదియేమా? అని ఆలోచింపగా అతనికి జైగీషవ్యుని, బుద్ధి శాలియగు కపిలుని మహిమ తెలియ వచ్చెను.
కృతాంజలి పుటో భూత్వా స రాజాశ్వశిరా స్తదా,
పప్రచ్ఛ తావృషీ భక్త్యా కిమిదం ద్విజసత్తమౌ.
చేతులు జోడించి ఆ రాజు ఆశ్వశిరుడు భక్తితో ఆ ఋషులను విప్రవరులారా! ఇది ఏమి? యని పృచ్చ చేసెను.
బ్రాహ్మణులు:
ఆవాం పృష్టౌ త్వయా రాజన్ కథం విష్ణు రిహేజ్యతే,
ప్రాప్యతే వా మహారాజ తేనేదం దర్శితం తవ.
బ్రాహ్మణులు:
మహారాజా! విష్ణువును అర్చించు టెట్లు? అతనిని పొందుట యెట్లు? అని నీవు మమ్ముల నడిగితివి. ఆ విషయమును మేము ప్రదర్శించితిమి.
సర్వజ్ఞస్య గుణా హ్యేతే యే రాజం స్తవ దర్శితాః,
స చ నారాయణో దేవః సర్వజ్ఞః కామరూపవాన్.
రాజా! నీకు చూపిన ఇవియన్నియు సర్వజ్ఞుని గుణములు. ఆ నారాయణ దేవుడు సర్వము నెరిగిన వాడు. ఇచ్చ వచ్చిన రూపములు తాల్ప గలవాడు.
సౌమ్యస్తు సంస్థితః క్వాపి ప్రాప్యతే మనజైః కిల,
ఆరాధనేన చైతస్య వాక్య మర్థవదిష్యతే.
కొన్ని యెడల శ్రీమన్నారాయణుడు సౌమ్యుడుగా సుస్థిరుడుగా మనుజులకు అందు చున్నాడు. ఈతనిని ఆరాధించుట చేత వాక్కు అర్థవంతమగు చున్నది. (విష్ణువు నర్చించుట వలన వాక్కునకు గొప్ప శక్తి ఎర్పడు చున్నాదని భావము)
కిం తు సర్వశరీరస్థః పరమాత్మా జగత్పతిః,
స్వదేహే దృశ్యతే భక్త్యా నైకస్థానగతస్తు సః.
మరియు జగముల కేలికయగు ఆ పరమాత్మ అన్ని శరీరముల యందు నున్నాడు. భక్తితో ఎల్లవారును తమ దేహము నందే అతనిని చూడ వచ్చును. అతడు ఏదో ఒక చోటనే యున్నవాడు కాదు.
అతోర్థం దర్శితం రూపం దేవస్య పరమాత్మనః,
ఆవయో స్తవ రాజేన్ద్ర ప్రతీతిః స్యాద్ యథా తవ.
పరమాత్మ యగు దేవుని రూపమును నీకా కారణముగా చూపితిమి. దీని వలన నీకు విశ్వాసము కలుగ వలయునని మా భావన.
ఏవం సర్వగతో విష్ణు స్తవ దేహే జనేశ్వర.
మన్త్రిణాం భృత్యసజ్ఘస్య సురాద్యా యే ప్రదర్శితాః,
పశవః కీటసజ్ఘాశ్చ తేపి విష్ణుమయా నృప.
రాజా! ఇట్లు విష్ణువు నీ దేహమునను, నీ మంత్రుల దేహమునను, నీ సేవకుల దేహమునను, నీకు మేము చూపిన దేవతలు, పశువులు, పురుగులు మున్నగు వాని సముదాయము లందును, ఇంతయేల అన్నింటి యందును ఉన్నాడు. ఈ సర్వము విష్ణు మయమే.
భావనాం తు దృఢాం కుర్యాద్ యథా సర్వగతో హరిః,
నాన్యత్ తత్ సదృశం భూత మితి భావేన సేవ్యతే.
కాని హరి అంతట నున్నాడను భావనను గట్టి పరచు కొన వలయును. అతనికి సాటియగు వస్తువు లేదను భావనతో సేవింప వలయును.
ఏష తే జ్ఞానసద్భావ స్తవ రాజన్ ప్రకీర్తితః,
పరిపూర్ణేన భావేన స్మరన్ నారాయణం హరిమ్.
రాజా! మేము నిండైన బావముతో శ్రీనారాయణుని, హరిని మనసున నింపుకొని నీకు జ్ఞాన స్వరూపమును తెలియ జేసితిమి.
పరిపూర్ణేన భావేన స్మర నారాయణం గురుమ్,
పుష్పోపహారై ర్దూపైశ్చ బ్రాహ్మణానాం చ తర్పణౖః,
ధ్యానేన సుస్థితే నాశు ప్రాప్యతే పరమేశ్వరః.
నిండు మనస్సుతో శ్రీనారాయణ గురువును ఎల్ల వేళల స్మరింపుము. పూవుల నర్పించుట, ధూపము సమర్పించుట, బ్రహ్మ వేత్తలను తృప్తి పరచుట, చెదరని ధ్యానము చేయుట అనువానితో పరమేశ్వరుడు త్వరగా పొంద దగిన వాడు.