అధ్యాయము - 103

హోత:

మధుధేనుం ప్రవక్ష్యామి సర్వపాతకనాశినీమ్‌,

అనులిప్తే మహీపృష్ఠే కృష్ణజిన కుశోత్తరే.

ధేనుం మధుమయీం కృత్వా సంపూర్ణఘటషోడశీమ్‌,

చతుర్థేన తథాంశేన వత్సకం పరికల్పయేత్‌.

హోత:

రాజా! మధు ధేనువును గూర్చి చక్కగా చెప్పెదను. ఇది సర్వ పాతకములను నశింప జేయునది. అలికిన నేలపై లేడి చర్మము దుర్భాసనము నుంచి పదునారు నిండు కడవల తేనెతో ఆవును చేయ వలయును, అందు నాలుగవ భాగముతో దూడను కల్పింప వలయును.

సౌవర్ణం తు ముఖం కృత్వా శృఙ్గా ణ్యగురుచన్దనైః,

పృష్ఠం తామ్రమయం కృత్వా సాస్నాం పట్టమయీం తథా.

పాదా నిక్షుమయాన్‌ కృత్వా సితకంబలకంబలామ్‌,

ముఖం గుడమయం కృత్వా జిహ్వం శర్కరయా తథా.

ఓష్ఠౌ పుష్పమయౌ తస్యా దన్తాః ఫలమయాః స్మృతాః,

దర్భరోమా ధరాదేవీ రూస్యఖుర విభూషితా.

ప్రశస్త పత్రశ్రవణా ప్రమాణాత్‌ పరితస్తతా,

సర్వలక్షణసంయుక్తా సప్తధాన్యాని దాపయేత్‌.

బంగారముతో ముఖము, అగురు చందనములతో కొమ్ములు, రాగితో తోక, పట్టు వస్త్రములతో గంగడోలు, చెరకు గడలతో పాదములు, తెల్లని కంబళితో కప్పిన గంగడోలు, బెల్లముతో ముఖము, చెక్కెరతో నాలుక, పూవులతో పెదవులు, పండ్లతో దంతములు, దర్భలతో రోమములు, వెండితో గిట్టలు, కొలతకు సరి పడునట్లు ఆవును తీర్ప వలయును. ఏడు విధములగు ధాన్యములను ఉంచ వలయును.

చత్వారి తిలపాత్రాణి చతుర్ధిక్ష్వపి దాపయేత్‌,

ఛాదితాం వస్త్రయుగ్మేన ఘంటాభరణభూషితామ్‌,

కాంస్యోపదోహినీం కృత్వా గంధపుష్ఫైస్తు ధూపితామ్‌.

నాలుగు దిక్కు లందును నాలుగు నూవుల పాత్రలు ఉంచ వలయును. రెండు వస్త్రములు పైవి కప్ప వలయును. గంటలు, ఆభరణములతో అలంకరింప వలయును. కంచుతో చేసిన పాలు పితుకు పాత్రను ఏర్పరిచి, గంధ పుష్పములతో సువాసన కూర్పు వలయును.

అయనే విషువే పుణ్యే వ్యతీపాతే దినక్షయే,

సంక్రాంత్యా ముపరాగే చ సర్వకాలం యదృచ్చయా.

ద్రవ్యబ్రాహ్మణసంపత్తిం దృష్ట్వాతాంతు ప్రదాపయేత్‌,

ఆయనము, విషువము, పుణ్య తిథి, వ్యతీపాతము, దినక్షయము, (పగటి భాగము తక్కువగా నున్న దినము) సంక్రాంతి, గ్రహణము అను దినములలో కానీ, బుద్ధి పుట్టినప్పుడు కాని ద్రవ్యము, బ్రాహ్మణుడు లభించుటను చూచుకొని ఈ దానము చేయ వలయును.

బ్రాహ్మణాయ దరిద్రాయ శ్రోత్రియాయాహి తాగ్నయే.

ఆర్యావర్తే సముత్పన్నే వేదవేదాంగపారగే,

తాదృశాయ ప్రదాతవ్యా మధుధేను ర్నరోత్తమ.

దరిద్రుడు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, ఆర్యావర్తమున పుట్టిన వాడు (వింధ్య హిమవత్పర్వతముల నడిమి దేశమును ఆర్యావర్త మందురు.) వేద వేదాంగములను తుదిముట్ట చదివిన వాడు అగు బ్రాహ్మణునకు, లేదా అటు వంటి వానికి ఈ మధు దేనువును దానమీయ వలయును.

పుచ్ఛదేశోపవిష్టస్తు గంధధూపాది పూజితామ్‌,

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన ముద్రికాకర్ణ మాత్రకైః

స్వశక్త్యా దక్షిణాం దత్వా విత్తశాఠ్యవివర్జితః,

జలపూర్వంతు కర్తవ్యం పశ్చాద్‌ దానం సమర్పయేత్‌.

తోక దగ్గరగా కూర్చుండి గంధము ధూపము మొదలగు వానితో పూజించి జంట వస్త్రములతో కప్పి ఉంగరము, చెవి పోగులు అనువానితో పాటు శక్తి ననుసరించి ధన విషయమున వంచన చేయక దక్షిణ నొసగి ముందు నీరు వదలి తరువాత దానము చేయ వలయును.

రసజ్ఞా సర్వదేవానాం సర్వభూతహితే రతా,

ప్రియన్తాం పితృదేవాశ్చ మధుధేనో నమోస్తుతే.

ఏవ ముచ్చార్య తాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌.

తల్లీ! నీవు సర్వ దేవతలకు నాలుకవు. సర్వ భూతముల మేలు నందు ప్రీతికల దానవు. నీ వలన పితృ దేవత లందరు ప్రీతు లగుదురు గాక! ఓ మధుదేనూ! నీకు నమస్కారము అని పలికి ఆ గోవును బ్రాహ్మణునకు సమర్పింప వలయును.

అహం గృహ్ణామి త్వాందేవి కుటుంబార్థే విశేషతః,

కామం కామదుఘే కామాన్‌ మధుధేనో నమోస్తుతే.

తల్లీ! నేను ప్రత్యేకించి కుటుంబము కొరకు నిన్ను గ్రహించు చున్నాను. కామధేనూ! నా కామముల నన్నింటిని తీర్చుము. మధు ధేనూ! నీకు నమస్కారము (అని పుచ్చుకొను వాడు పలుక వలయును.)

మధు వాతేతి మన్త్రేణ దాపయాశుచికేన తు,

దత్వాధేనుం మహారాజ ఛత్రికోపానహౌ తథా.

దానము చేత పవిత్రుడై ‘మధువాతా’ ఇత్యాది మంత్రముతో, గొడుగు చెప్పులతో పాటుగా ధేనువును దానమీ వలయును.

ఏవం యః కురుతే భక్త్యా మధుధేనుం నరాధిప,

దత్వా దానం పాయసేన మధునా చ దినం నయేత్‌.

ఇట్లు భక్తితో మధు ధేనువును దాన మిచ్చిన వాడు పాయసముతో, తేనెతో ఆ దినము గడుప వలయును.

బ్రామ్మణోపిత్రిరాత్రంతు మధుపాయససంయుతమ్‌,

దానము పుచ్చుకొన్న బ్రాహ్మణుడు కూడ మూడు రాత్రులు పాయసము, తేనె గల భోజనముతో గడుప వలయును.

ఏవం కృతే తు యత్పున్యం తన్నిబోధ నరాధిప.

ఇట్లు చేసినచో కలుగు పుణ్య మెట్టిదియో ఓ రాజా! తెలిసి కొనుము.

యత్రమధువహా నద్యో యత్ర పాయసకర్ధమాః,

ఋషయో మునయ స్సిద్ధా స్తత్ర గచ్ఛన్తి ధేనుదాః.

తేనెలు, పాయస కర్దమములు గల నదులు ప్రవహించు చోటికిని, ఋషులు, మునులు, సిద్ధులు ఉన్న చోటికిని ధేనుదాత లరుగుదురు.

తత్ర భోగానథోభుంక్తే బ్రహ్మలోకే చ తిష్ఠతి,

క్రీడిత్వా సుచిరం కాలం పునర్మర్త్యముపాగతః,

స భుక్త్యా విపులాన్‌ భోగాన్‌ విష్ణులోకం స గచ్ఛతి.

అచట సుఖము లన్నియు అనుభవించి బ్రహ్మ లోకమున కరుగును. అందు బహు కాలము సుఖముగా నుండి మరల మనుష్య లోకమునకు వచ్చి విస్తారములగు భోగముల ననుభవించి విష్ణు లోకమున కరుగును

దశ పూర్వాన్‌ దశపరా నాత్మానం చైకవింశకమ్‌,

నయతే విష్ణుసాయుజ్యం మధుధేను ప్రాసాదతః.

వెనుక పది తరముల వారిని, ముందు పది తరముల వారిని తన తరమును మొత్తము ఇరువది యొక్క తరముల వారిని మధు ధేను ప్రసాదము వలన విష్ణు సాయుజ్యమును పొందించును.

యఇదం శృణుయాద్‌ భక్త్యా శ్రావయేద్‌ వాపిమానవః

సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి.

ఇది విను వాడును, భక్తితో వినిపించు వాడును సర్వ పాపముల నుండి ముక్తి పొంది విష్ణు లోకమున కరుగును.