వరాహ మహా పురాణము
అధ్యాయము - 91
శ్రీవరాహ దేవుడు:
యా మందరగతా దేవీ తపస్తప్తుం తు వైష్ణవీ,
రాజసీ పరమా శక్తిః కౌమారవ్రతధారిణీ.
సైకాకినీ తపస్తేపే విశాలాయాం తు శోభనే,
తస్యా స్తపన్త్యాః కాలేన మహతా క్షుభితం మనః.
శ్రీవరాహ దేవుడు:
మందరమునకు తపస్సునకై అరిగిన ఆ రజో గుణము వలన ఏర్పడిన పరమ శక్తి వైష్ణవి కౌమార వ్రత ధారిణి యై ఒంటరిగా విశాల యను చోట తపస్సు చేయు చుండెను. తపము చేయు చుండగా పెద్ద కాలమునకు ఆమె మనస్సు కలత పడెను.
తస్మాత్‌క్షోభాత్ సముత్తస్థుః కుమార్యః సౌమ్యలోచనాః,
నీలకుంచితకేశాన్తా బింబోష్ఠా యతలోచనాః,
నితంబరశనోద్దోమా నూపురాఢ్యాః సువర్చసః.
ఆ క్షోభ వలన నిర్మలములగు కన్నులు, నల్లని నొక్కుల జుత్తు, దొండ పండు వంటి పెదవులు, నిడుపాటి కన్నులు, మొలనూలు గల నడుములు, మ్రోయుచున్న అందెలు గల పాదములు, వెలిగి పోవుచున్న దేహ కాంతియు గల కుమారీ జనుల పుట్టుకొని వచ్చిరి.
ఏవం విధాః స్త్రియో దేవ్యా క్షోభితే మనసి ద్రుతమ్,
ఉత్తస్థుః శతసాహస్రాః కోటిశో వివిధాననాః
ఆ దేవి మనసు క్షోభ పడగా ఇట్లు కోట్ల కొలదిగా పెక్కు తీరులైన మొగముల కన్యలు పైకి లేచిరి.
దృష్ట్వా కుమార్యః సా దేవీ తస్మి న్నేవ గిరౌ శుభా,
తపసా నిర్మమే దేవీ పురం హర్మ్యశతాకులమ్.
విశాలరథ్యం సౌవర్ణప్రాసాదై రుపశోభితమ్,
అంతర్జలాని వేశ్వాని మణి సోపానవన్తి చ,
రత్నజాలగవాక్షాణి ఆసన్నోపవనాని చ.
అట్టి ఆ కుమారీ జనమును గాంచి ఆ దేవి ఆ పర్వతమున వెడల్పయిన బాటలు, బంగారు ప్రాసాదములు, లోపల నీరు గల భవనములు, మణులతో చేసిన సోపానములు రత్న జాలముల గవాక్షములు, అందుబాటులో ఉన్న ఉద్యానములు గల వందల కొలది భవనములున్న పురమును తపశ్శక్తి చేత నిర్మించెను.
అసంఖ్యాతాని హర్మ్యాణి తథా కన్యా ధరాధరే,
ప్రాధాన్యేన ప్రవక్ష్యామి కన్యా నామాని శోభనే.
భూదేవీ! ఆ భవనములు, ఆ కన్యలు లెక్క పెట్టరాని సంఖ్యలో ఉన్నవి. ప్రాధాన్యమును బట్టి ఆ కన్యల నామములను చెప్పెదను.
విద్యుత్ప్పభా చంద్రకాన్తిః సూర్యకాన్తి స్తథాపరా,
గంభీరా చారుకేశీ చ సుజాతా ముఞ్జకేశినీ.
ఘృతాచీ చోర్వశీ చాన్యా శశినీ శీలమండితా,
చారుకన్యా విశాలాక్షీ ధన్యా పీనపయోధరా.
చంద్రప్రభా గిరిసుతా తథా సూర్యప్రభామృతా,
స్వయంప్రభా చురుముఖీ శివదూతీ విభావరీ.
జయా చ విజయా చైవ జయన్తీ చాపరాజితా,
ఏతా శ్చాన్యాశ్చ శతశః కన్యా స్తస్మిన్ పురోత్తమే.
విద్యుత్ర్పభ, చంద్రకాంతి, సూర్యకాంతి, గంభీర, చారుకేశి, సుజాత, ముంజకేశిని, ఘృతాచి, ఉర్వశి, శశిని, శీలమండిత, చారుకన్య, విశాలాక్షి, పుష్టి గల స్తనములు గల ధన్య, చంద్రప్రభ, గిరిసుత, సూర్యప్రభ, అమృత, స్వయంప్రభ, చారుముఖి, శివదూతి, విభావరి, జయ, విజయ, జయంతి, అపరాజిత, వీరును ఇంకను వందల కొలది కన్యలును ఆ ఉత్తమ పురమున నివసించిరి.
దేవ్యా అనుచరాః సర్వాః పాశాంకుశధరాః శుభాః,
తాభిః పరివృతా దేవీ సింభాసనగతా శుభా.
సుసితై శ్చామరైః స్త్రీభి ర్వీజ్యమానా విలాసినీ,
కౌమారం వ్రతమాస్థాయ తపః కర్తుం సముద్యతా.
వీరందరు ఆ దేవిని వెంట నంటి యుందురు. పాశమును, అంకుశమును ధరించు వారు, మంచి వారు. వారు కొలిచి యుండగా ఆ దేవి సింహాసమున కూర్చుండి, తెల్లని వింజామరతో స్త్రీలు విసరు చుండగా కౌమార వ్రతమును తాల్చి తపస్సు చేయుటకు ఉద్యుక్త ఆయెను.
యౌవనస్థా మహాభాగా పీనవృత్త పయోధరా,
చంపకాశోకపున్నాగ నాగకేసరదామభిః.
సర్వాంగే ష్వర్చితా దేవీ ఋషి దేవనమస్కృతా,
పూజ్యమానా వరస్త్రీభిః కుమారీభిః సమంతతః.
యౌవనమున నున్నది, పూజ్యురాలు, చక్కని దేహపుష్టి కలది, సంపెంగలు, అశోకములు, పున్నాగములు, నాగ కేసరములు మొదలగు పూమాలలతో అన్ని యంగము లందును అర్చింప బడినది, ఋషులు, దేవతలు మొదలగు వారి నమస్కారములు కొను చున్నట్టిది, శ్రేష్ఠలగు కన్యలు పూజలు చేయు చున్నట్టిది అయి ఆ దేవి విరాజిల్లు చుండెను.
సర్వాజ్గభోగినీ దేవీ యావదాస్తే తపోన్వితా,
తావదాగతవాం స్తత్ర నారదో బ్రహ్మణః సుతః.
ఇట్లా దేవి సర్వాంగ భోగములు కలదియై తపస్సు చేయు చుండగా బ్రహ్మ కుమారుడు నారదు డచటికి వచ్చెను.
తం దృష్ట్వా సహసా దేవీ బ్రహ్మపుత్రం తపోధనమ్,
విద్యుత్ర్పభా మువాచేద మాసనం దీయతా మితి,
పాద్య మాచమనీయం చ క్షిప్రమస్మై ప్రదీయతామ్.
తపస్సే ధనముగా గలవాడు, బ్రహ్మ తనయుడు అగు అతనిని చూచి త్వరత్వరగా ఆ దేవి విద్యుత్ర్పభ యను సఖితో ఆతని కాసన మిమ్ము. కాలు గడుగు కొని నీరు, త్రావుటకు జలము త్వరగా ఇమ్ము అని పలికెను.
ఏవముక్తా తదా దేవ్యా కన్యా విద్యుత్ర్పభా శుభా,
ఆసనం పాద్య మర్ఘ్యం చ నారదాయ న్యవేదయత్.
అట్లు ఆ దేవి పలుకగా విద్యుత్రభ నారదునకు ఆసనమును, పాద్యమును, అర్ఘ్యమును నివేదించెను.
తతః కృతాసనం దృష్ట్వా ప్రణతం నారదం మునిమ్,
ఉవాచ వచనం దేవీ హర్షేణ మహతాన్వితా.
ఆసనమును స్వీకరించి వినయముతో ఉన్న నారద మునిని గాంచి ఆదేవి గొప్ప సంతోషముతో ఇట్లు పలికెను.
స్వాగతం భో మునిశ్రేష్ఠ కస్మాల్లోకా దిహాగతః,
కిం కార్యం వద తే కృత్యం మా తే కాలాత్యయో భవేత్.
ఓ మునిశ్రేష్ఠా! నీకు స్వాగతము. ఏ లోకము నుండి యిచటికి విచ్చేసితివి? నీ పని యేమి? నీకు నేను చేయ వలసిన దేమి? నీకు ఆలస్యము జరుగరాదు. చెప్పుము.
ఏవ ముక్త స్తదా దేవ్యా నారదః ప్రాహ లోకవిత్,
బ్రహ్మలోకా దిన్ధ్రలోకం తస్మాద్రౌద్ర మథాచలమ్.
తత స్త్వామిహ దేవేశి ద్రష్టు మభ్యాగతః శుభే,
ఏవముక్త్వా మునిః శ్రీమాం స్తాం దేవీ మన్వవేక్షత.
ఆ దేవి యట్లు పలుకగా లోకజ్ఞుడగు నారదు డిట్లాడెను. తల్లీ! బ్రహ్మ లోకము నుండి యింద్ర లోకమునకు వెళ్లి అటు నుండి రౌద్ర చలమున కరిగి అట నుండి నిన్ను దర్శించు కొనుటకై ఓ దేవేశీ! నీ కడకు వచ్చితిని, అని పలికి కాంతి శాలియగు ఆ నారదుడా దేవిని పరికించి చూచెను.
దృష్ట్వా ముహూర్తం దేవేశీం విస్మితో నారదోభవత్,
అహోరూప మహో కాంతి రహో ధైర్య మహో వయః.
అహో నిష్కామతా దేవ్యా ఇతి ఖేద ముపాయయౌ.
ఒక్క ముహూర్తము ఆ దేవేశిని పరికించి నారదు డచ్చెరు వందెను. ఆహా! ఏమి రూపము! ఏమి కాంతి! ఏమి ధైర్యము! ఏమి వయస్సు! ఏమి నిష్కామత! అని మనసున చింతించెను.
దేవగంధర్వసిద్ధానాం యక్షకిన్నరరాక్షసామ్.
న రూప మీదృశం క్వాపి స్త్రీష్వన్యాసు ప్రదృశ్యతే,
ఏవం సంచిన్త్య మనసా నారదో విస్మయాన్వితః.
దేవతలు, గంధర్వులు, సిద్ధులు, యక్షులు, కిన్నరులు, రాక్షసులు అను జాతులలో కాని ఇంక ఏ యితర స్త్రీలలో కాని ఇట్టి రూపము ఎందును లేదు. అని మనసున భావించి నారదుడు విస్మయము పొందెను.
ప్రణమ్య దేవీం వరదా ముత్పపాత్ నభస్తలమ్,
గతశ్చ త్వరయా యుక్తః పురీం దైత్యేన్ధ్ర పాలితామ్.
వరదురాలగు ఆ దేవికి దండ ప్రణామము గావించి ఆకాశమున కెరిగెను. తొందరతో దైత్యరాజు పాలించు పురి కరిగెను.
మహిషాఖ్యేన భూతేశి సముద్రాన్తః స్థితాం పురీమ్,
తత్రాససాద భగవా ససురం మహిషాకృతిమ్.
ఆ పురి మహిషము. సముద్రము లోపల కలదు. అచటికా పూజ్యుడరిగి దున్నపోతు ఆకారము గల ఆ రాక్షస రాజును చేరుకొనెను.
దృష్ట్వా లబ్ధవరం వీరం దేవసైన్యాంతకం మహత్,
స తేన పూజితో భక్త్యా తదా లోకచరో మునిః.
ప్రీతాత్మా నారద స్తస్మై దేవ్యా రూప మనుత్తమమ్,
ఆచచక్షే యథాన్యాయం యద్దృష్టం దేవతాపురే.
వరములు పొందిన వీరుడు, దేవ సైన్యమును పెద్ద మొత్తములో రూపు మాపినవాడు అగు ఆ రాక్షసుని గాంచి భక్తితో ఆతడుచే సిన పూజలందు కొని లోకము లందు తిరుగు చుండు ఆ ముని ప్రీతినొంది తాను దేవతా పురమున చూచిన ఆ దేవి సర్వోత్తమ రూపమును గూర్చి ఉన్నదున్నట్లు వక్కాణించెను.
నారదుడు:
అసురేన్ధ్ర శృణుష్వైకం కన్యారత్నం సమాహితః,
యేన లబ్ధం తు త్రైలోక్యం వరదానా చ్చరాచరమ్.
నారదుడు:
రాక్షస రాజా! ఒక కన్యా రత్నమును గూర్చి సావధానుడవై వినుము. వరదానము వలన ఆమో చరాచరమగు మూడు లోకముల సముదాయమును సాధించినది.
బ్రహ్మలోకా దహం దైత్య మందరాద్రి ముపాగతః,
తత్ర దేవీపురం దృష్టం కుమారీ శతసంకులమ్.
దైత్యా! నేను బ్రహ్మ లోకము నుండి మందర గిరి కరిగితిని. అందు వందల కొలది కన్యలతో బిలబిల లాడు దేవీ పురమును గాంచితిని.
తత్ర ప్రధానా యా కన్యా తపసీ వ్రతధారిణీ,
సా దేవదైత్యయక్షాణాం మధ్యే కాచి న్న దృశ్యతే.
అందు ముఖ్యురాలగు కన్య తపస్సు చేయు చున్నది. వ్రతమును పూని యున్నది. దేవతలతో, దైత్యులలో, యక్షులలో అట్టి ఆమెను నేనెచటను చూడలేదు.
యాదృశీ సా శుభా దైత్యా తాదృశ్యేకాండమధ్యతః,
భ్రమతా తాదృశీ దృష్ట్వా న కదాచిన్మయా సతీ.
ఈ బ్రహ్మాండము నడును నేను తిరుగు లాడుచు అట్టి కన్య నొక్క దానిని కూడ నేను ఎన్నడును కాంచ నైతిని.
తస్యాశ్చ దేవగన్ధర్వా ఋషయః సిద్ధచారణాః,
ఉపాసాంచక్రిరే సర్వే యోప్యన్యే దైత్యనాయకాః
దేవజాతి వారు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు, ఇతరులగు రాక్షస నాయకులు అందరు ఆమె కడ పడి గాపులు పడి యున్నారు.
తాం దృష్ట్వా వరదాం దేవీ మహం తూర్ణ మిహాగతః,
అజిత్వా దేవగంధర్వాన్ న తాం జయతి కశ్చన.
వరముల నొసగు ఆ దేవిని గాంచి వెంటనే నేనిటకు పరువెత్తి వచ్చితిని. దేవతలను, గంధర్వులను గెలువక ఆమె నొక్కడును గెలువ జాలడు.
ఏవ ముక్త్వా క్షణం స్థిత్వా తమనుజ్ఞాప్య నారదః,
యథాగతం యయౌ ధీమా నన్తర్ధానేన తత్షణాత్.
ఇట్లు పలికి ఒక్క క్షణమచట నిలిచి ఆతనిని వీడ్కొని ధీశాలియగు నారదుడు ఆ క్షణమున అంతర్ధానము చెందెను.