వరాహ మహా పురాణము
అధ్యాయము - 131
శ్రీవరాహ దేవుడు:
గత్వా తు మైథునం భద్రే అస్నాతో యో మమ స్పృశేత్,
రేతః పిబతి దుర్బుద్ధిః సహస్రం నవ పఞ్చ చ.
శ్రీవరాహ దేవుడు:
మిథున కర్మమును కావించి స్నానము చేయక నా వస్తువులను తాకు దుష్ట బుద్ధి పదునాలుగు వేల యేండ్లు రేతస్సును త్రావును.
తతో నారాయణా చ్ఛ్రుత్వా సా మహీ సంశితవ్రతా,
తత్ర దైన్యమనా భూత్వా ఉవాచ మధుసూదనమ్.
అంత నారాయణుని పలుకు విని శ్రేష్ఠమగు వ్రతముల గల భూదేవి దిగు లొందిన మనస్సు కలదియై మధుసూదనునితో ఇట్లు పలికెను.
కిమిదం భాషసే దేవ ధర్మం భీషణ సంకటమ్,
కథం దేవ పుమాన్ సోవై రేతః పానపరోభవేత్,
ఏత న్మే పరమం దుఃఖం తద్ భవాన్ వక్తు మర్హసి.
దేవా! భయము గొలుపు ఘోరమగు ధర్మమును ఏల పలుకుదువు? ఆ పురుషుడు రేతస్సు త్రావు వాడెట్లు అగును? ఇది నా పెను దుఃఖము. దీనిని గూర్చి నీవు వివరముగా చెప్ప వలయును.
శ్రీవరాహ దేవుడు:
శృణు తత్త్వేన మే దేవి ఇదం గుహ్య మనుత్తమమ్,
చిహ్న మేతద్ వరారోహే వ్యభిచారవినిశ్చయమ్.
శ్రీవరాహ దేవుడు:
దేవీ! ఇది మిక్కిలి రహస్యము. మిక్కిలి గొప్పది. వ్యభిచారమును నిర్ణయించు గుర్తును చెప్పెదను. వినుము.
పురుషాః స్త్రీషు కర్మాణి యే చ కుర్వన్తి నిర్ఘృణాః,
దోష స్త స్యాపరాధస్య ఫలం ప్రాప్నోతి మానవః.
జాలి ఏ కొంచెము లేనివారై పురుషులు స్త్రీల యందు చేసెడు పాపపు పనుల ఫలమును తప్పక పొందుదురు.
ఏవ మేతద్ వరారోహే యత్ త్వయా పరిపృచ్ఛితమ్,
అపరాధస్య దోషేణ విశుద్ధి శ్చ న జాయతే.
వరారోహా! నీవడిగిన ఈ దోషమునకు పరిశుద్ధియు లేదు.
ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి రాగదోషేణ యోషితః,
గృహస్థాః పురుషా భద్రే మమ కర్మ పరాయణాః.
నా పూజల యందు శ్రద్ధ గల గృహస్థులగు పురుషులు స్త్రీల విషయమున పొందెడు రాగమనెడు దోషమునకు ప్రాయశ్చిత్త మెట్టిదో చెప్పెదను.
యావకేవ దినత్రీణి పిణ్యాకేన పునస్త్ర్యహః,
వాయుభక్షో దినం త్వేకం తతో ముఞ్చతి కిల్బిషాత్.
మూడు దినములు అలసందల పిండిని, మరి మూడు దినములు బియ్యపు పిండిని, ఒక దినము గాలిని తిను నియమము వలన ఈ పాపము నుండి విముక్తు డగును.
య ఏవం కురుతే భూమి విధిదృష్టేన కర్మణా,
జ్ఞాత్వా కర్మాపరాధం తు న స పాపేన లిప్యతే.
శాస్త్రము చూపిన విధానముతో, చేసిన దోషమును తెలిసికొని ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొను వానికి ఆ పాపము అంటదు.
ఏతత్ తే కథితం భద్రే మైథునం యోభిగచ్ఛతి,
ప్రాయశ్చిత్తం మహాభాగ మమ లోక సుఖావహమ్.
ధర్మ విరుద్ధమగు స్త్రీ సంపర్కమును పొందిన వానికి ప్రాయశ్చిత్త మెట్టిదియో నీకు చెప్పితిని. అది నా లోక సుఖమును కూర్చునది యగును.
శవ స్పర్శనాపరాధ ప్రాయశ్చిత్తము
శవము తాకు దోషమునకు ప్రాయశ్చిత్తము.
శ్రీవరాహ దేవుడు:
స్పృష్టా చైవ మృతం భద్రే నరం పఞ్చత్వ మాగతమ్,
మమ శాస్త్రం బహిః కృత్వా శ్మశానం యః ప్రపద్యతే.
పితర స్తస్య సుశ్రోణి ఆత్మనా చ పితామహాః,
శ్మశానే జంబుకా భూత్వా భక్షమాణా శవాం స్తథా.
శ్రీవరాహ దేవుడు:
మరణించిన వాని దేహమును, తాకి, నా శాస్త్ర విధానములను పాటింపక వల్ల కాటికి చనువాని తండ్రులు, తాతలు, తనతో పాటు వల్లకాటిలో నక్కలై శవములను పీకుకొని తిను చుందురు.
తతో హరే ర్వచః శ్రుత్వా ధర్మకామా వసుంధరా,
ఉవాచ మధురం వాక్యం సర్వలోకహితాయ వై.
అంత హరి మాట విని ధర్మమున వాంఛగల వసుంధర లోకు లందరకు సుఖమును కలిగించు తీయని పలుకు నిట్లు పలికెను.
ధరణి:
తవ నాథ ప్రపన్నానాం కథం వా విద్యతే గతిః,
ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి యేన ముచ్యేత కిల్బిషాత్.
ధరణి:
నాథా! నీవే గతి యని నమ్మి కొలిచెడి వారికి ఈ విషయమున దారి యేది? ఆ పాపమును వదిలించు కొనుటకు ప్రాయశ్చిత్త మెట్టిది? నాకు చెప్పుము.
శ్రీవరాహ దేవుడు:
శృణు సుందరి తత్త్వేన యన్మాం త్వం పరిపృచ్ఛసి,
కథయిష్యామి తే హీదం శోభనం పాపనాశనమ్.
శ్రీవరాహ దేవుడు:
సుందరీ! నన్నడిగిన దానికి ఇదిగో పాపమును పోకార్చు శుభమును గూర్చి చెప్పెదను.
ఏకాహార దినాన్ సప్త త్రిరాత్రం చాప్యు పోషితః,
పఞ్చగవ్యం తతః పీత్వా శీఘ్రం ముచ్యతి కిల్బిషాత్.
ఏడు దినములు ఒంటి పూట భోజనము, మూడు దినములు ఉపవాసము, అటుపై పంచ గవ్యము పుచ్చు కొనుట అనువానితో ఈ పాపము నుండి ముక్తి పొందును. (పంచ గవ్యములు = ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రము)
శవే స్పృష్టే పరాధస్య ఏష తే కథితో విధిః,
సర్వథా వర్జనీయంచ సర్వభాగవతేన తు.
శవమును తాకగా కలుగు దోషమునకు సంబంధించి చేయదగు దానిని నీకు చెప్పితిని. భాగవతు లందరు అన్ని విధములుగా ఈ దోషమును వదలి వేయ వలయును.
య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్,
విముక్తః సర్వపాపేభ్యో అపరాధో న విద్యతే.
ఈ విధముగా ప్రాయశ్చిత్తమును చేసికొను వాడు పాపము లన్నింటి నుండి విడివడును. వానికి దోషము ఉండదు.
రజస్వలా స్పర్శశనాపరాధా ప్రాయశ్చిత్తమ్
ముట్టుతను తాకుట అను దోషమునకు ప్రాయశ్చిత్తము.
శ్రీవరాహ దేవుడు:
నారీం రజస్వలాం స్పృష్ట్వా యో మాం స్పృశతి నిర్భయః,
రాగమోహేన సంయుక్తః కామేన చ వశీకృతః.
వర్షాణాం తు సహస్రైకం రజః పిబతి నిర్ఘృణః,
అంధ శ్చ జాయతే దేవి దరిద్రోజ్ఞానమూర్ఖవాన్.
శ్రీవరాహ దేవుడు:
దేవీ! ముట్టయిన స్త్రీని ముట్టుకొని భయము లేనివాడై నన్ను తాకువాడు, రాగ మోహములతో కూడిన వాడై కామమునకు వశమై పోయిన వాడు ఒక వేయి యేండ్ల కాలము రజస్సును త్రావు చుండును. గ్రుడ్డివాడు, దరిద్రుడు, జ్ఞాన హీనుడు, మూర్ఖుడు అగును.
న చ విన్దతి చాత్మానం పతన్తం నరకే యథా,
అపరాధ మిమం కృత్వా తత్రైవం నాస్తి సంశయః.
ఈ అపరాధము చేసి నరకమున పడుచున్న వాడు తన్ను తాను గుర్తింప జాలడు. ఇందు సంశయము లేదు.
ధరణి:
తవ దేవ ప్రపన్నానాం మోక్షం సంసారసాగరాత్,
అపరాధసమాయుక్త స్తవ కర్మపరాయణః,
కర్మణా యేన శుద్ధ్యేత తన్మే బ్రూహి జనార్దన.
ధరణి:
జనార్దనా! నిన్నే శరణు పొంది నీ పనుల యందు శ్రద్ధ కలిగిన వాడు పొరపాటున ఈ దోషముతో కూడిన వాడైనచో ఏ పని చేసి శుద్ధు డగును? దానిని నాకు చెప్పుము.
శ్రీవరాహ దేవుడు:
స్పృష్ట్వా రజస్వలాం నారీం నరో మద్భక్తితత్పరః,
తతః కృత్వా త్రిరాత్రం తు ఆకాశశయనే వసేత్,
శుద్ధో భాగవతో భూత్వా మమ కర్మపరాయణః.
శ్రీవరాహ దేవుడు:
ముట్టయిన స్త్రీని ముట్టిన నా భక్తుడు మూడు రాత్రులు ఆకాశ శయనము చేయ వలయును. అంత నాతడు పరిశుద్ధు డగును. (ఆకాశ శయనము = ఆరు బయట పడు కొనుట)
ఏవం కృత్వా మహాభాగే ప్రాయశ్చిత్తం మమ ప్రియమ్,
ముచ్యేత కిల్బిషాద్దేవి ఆచారేణ బహిః కృతః.
ఆచారమునకు వెలియైన వాడు ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొని ఆ పాపము నుండి విడుదల పొందును.
ఏతత్ తే కథితం భద్రే యత్ స్పృష్ట్వా తు రజస్వలామ్,
ప్రాయశ్చిత్తం మహాభాగే సర్వసంసారమోక్షణమ్.
ఓ కాంతా! ఇట్లు ముట్టయిన స్త్రీని తాకుట అను దోషమును, దాని ప్రాయశ్చిత్తమును నీకు చెప్పితిని. ఇది సంసార దోషములను పోగొట్టు నట్టిది.
మృతకస్పర్శన ప్రాయశ్చిత్తమ్
శవమంటినదానికి ప్రాయశ్చిత్తము
శ్రీవరాహదేవుడు:
స్పృష్ట్వా తు మృతకం దేవి మమ క్షేత్రేషు తిష్ఠతి,
శతం వర్షసహస్రాణి గర్భేషు పరివర్తతే.
శ్రీవరాహదేవుడు:
చచ్చిన వానిని తాకి నా క్షేత్రములలో నిలుచు వాడు నూరు వేల యేండ్లు గర్భములలో పడి దొరలు చుండును.
దశవర్ష సహస్రాణి చండాల శ్చైవజాయతే,
అంధః సప్త సహస్రాణి మణ్డూకశ్చ శతం సమాః.
పది వేల ఏండ్లు చండాలుడై పుట్టును. ఏడు వేల సంవత్సరముల గ్రుడ్డి వాడగును. నూరేండ్లు కప్పయై ఉండును.
మక్షికా త్రీణి వర్షాణి టిట్టిభైకాదశం సమాః,
దశ వై సప్త చాన్యాని కృకలాసో భవేత్ సమాః.
మూడేండ్లు ఈగ యగును. పదునొకండు వత్సరములు లకుముకి పిట్ట యగును. పదునేడేండ్లు తొండయై పుట్టును.
హస్తీ వర్షశతం చైవ ఖరో ద్వాత్రింశకం భవేత్,
చతుర్వింశో బలీవర్దః శ్వా తు ద్వాదశవార్షికః,
మార్జారో నవవర్షాణి వానరో దశపఞ్చచ.
వంద యేండ్లు ఏనుగు, ముప్పది రెండేండ్లు గాడిద, ఇరువది నాలుగేండ్లు ఎద్దు, పండ్రెండేండ్లు కుక్క, తొమ్మిది ఏండ్లు పిల్లి, పదునైదేండ్లు కోతి యగును.
ఏవం స చాత్మదోషేణ మమ కర్మపరాయణః,
ప్రాప్నోతి సుమహ ద్దుఃఖం దేవి ఏవం న సంశయః.
నా పనుల యందు శ్రద్ధకల భక్తుడు ఇట్టి తన దోషము చేత పెను దుఃఖము పొందును. సంశయము లేదు.
తతో హరే ర్వచః శ్రుత్వా దుఃఖేన పరిపృచ్ఛతి,
సర్వసంసార మోక్షాయ ప్రత్యువాచ వసుంధరా.
అంత హరి మాట విని కుమిలి పోయిన భూదేవి అందరి సంసార దుఃఖమును పోగొట్టుటకై యిట్లు పలికెను.
కిమిదం భాషసే దేవ మానుషాణాం దురాసదమ్,
వాక్యం భీషణకం చైవ మమ మర్మ ప్రభేదకమ్.
ప్రభూ! మనుష్యులకు పొందనలవి కానిది, వెరపు గొలుపునది, నా ఆయువు పట్లను పగుల గొట్టునది అగు పలుకు పలికెద వేల?
ఆచారాచ్చ పరిభ్రష్టా స్తవ కర్మ పరాయణాః,
తరన్తి యేన దుర్గాణి ప్రాయశ్చిత్తం చ మే వద.
నీ కర్మము లందు నిష్ఠ కలవారు ఆచారముల నుండి పరిభ్రష్టులై ఈ మహా ఘోర స్థితుల నెట్లు దాటుదురో ఆ ప్రాయశ్చిత్త విధానమును నాకు తెలుపుము.
శ్రుత్వా పృథ్వ్యా స్తథా వాక్యం లోకనాథోజనార్దనః,
ధర్మసంరక్షణార్థాయ ప్రత్యువాచ వసుంధరామ్.
భూదేవి పలికిన ఆ మాటవిని లోకనాథుడగు జనార్దనుడు ధర్మమును పరిరక్షించుట కొరకు ఇట్లు పలికెను.
శ్రీవరాహ దేవుడు:
స్పృష్ట్వా తు మృతకం భూమి మమ కర్మపరాయణః,
ఏకాహార స్తత స్తిష్ఠేద్ దినాని దశ పఞ్చ చ.
శ్రీవరాహ దేవుడు:
నా భక్తుడు శవమును ముట్టి పదునైదు దినములు ఒంటి పూట భోజనము చేయుచు నుండ వలయును.
తత ఏవం విధిం కృత్వా పఞ్చగవ్యం తు ప్రాశయేత్,
శుద్ధ ఏవం విశుద్ధాత్మా కర్మణా చ న లిప్యతే.
ఈ విధానము నాచరించి పిదప పంచగవ్య ప్రాశనము చేయ వలయును. మనసులో మలినము లేని వాడిట్లు పరిశుద్ధుడై పాప మంటని వాడగును.
ఏతత్ తే కథితం దేవి స్పృష్ట్వా మృతక మేవచ,
దోషం చైవ విశుద్ధ్యేత యత్త్వయా పరిపృచ్ఛితమ్.
చచ్చిన వానిని ముట్టిన దోషము నుండి మనుజు డెట్లు పరిశుద్ధు డగునని నీవడిగిన దానికి సమాధానము చెప్పితిని.
య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్,
అపరాధవినిర్ముక్తో మమ లోకం స గచ్ఛతి.
ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొను వాడు దోషము నుండి విముక్తుడై నా లోకమున కరుగును.