అధ్యాయము - 3

ప్రియవ్రతుడు:

అన్యస్మిన్‌ భగవన్‌ జన్మన్యాసీద్‌ యత్తద్‌ విచేష్టితమ్‌,

సర్వం కథయ దేవర్షే మహత్‌ కౌతూహలం హి మే.

ప్రియవ్రతుడు:

మహర్షీ! జ్ఞాన సంపన్నుడా! మరియుక జన్మ నందు జరిగిన ఆ విలాసమంతయు నాకు చెప్పుము. నాకెంతో వేడుకగా నున్నది.

నారదుడు:

స్నాతస్య మమ రాజేన్ధ్ర తస్మిన్‌ వేదసరస్యథ,

సావిత్ర్యాశ్చ వచః శ్రుత్వా తస్మిన్‌ జన్మసహస్రకమ్‌,

స్మరణం తత్క్షణా జ్జాతం శృణు జన్మాంతరం మమ.

నారదుడు:

రాజేంద్రా! నేనా వేద సరస్సున స్నాన మాడిన పిదప సావిత్రీ దేవి వాక్కులను విన్న పిదప నా వేయి జన్మముల స్మరణము ఒక్క పెట్టున కలిగెను. ఆ పాత్ర పుట్టుకల సంగతి వినుము.

అస్త్యవంతీపురం రాజం స్తత్రాహం ప్రాగ్‌ ద్విజోత్తమః.

నామ్నా సారస్వతః పూర్వం వేదవేదాంగ పారగః.

రాజా! అవంతియను పుర మొకటి కలదు. మునుపు వేరొక కృత యుగమున నే నందొక బ్రాహ్మణ శ్రేష్ఠుడనై యుంటిని. అప్పటి నా పేరు సారస్వతుడు. వేద వేదాంగములను తుదముట్ట చదివితిని.

బహుభృత్యపరీవారో బహుధాన్యశ్చ పార్థివ,

అన్యస్మిన్‌ కృతసంజ్ఞే తు యుగే పరమబుద్ధిమాన్‌.

ఆ మరియొక కృత యుగమున నేను పెక్కండ్రు సేవకులు, పరివారము, గొప్ప ధాన్య సంపదయు కలవాడనై యుంటిని. గొప్ప బుద్ధి విశేషము కూడా నా కుండెడిది.

తతో ధ్యాతం మయైకాన్తే కి మనేన కరోమ్యహమ్‌,

ద్వన్ద్వేన సర్వ మేతద్ధి న్యస్త్వా పుత్రేషు యామ్యహమ్‌,

తపసే ధృతసంకల్పః సరః సారస్వతం ద్రుతమ్‌.

అంత నేను ఏకాంతమున నిట్లు చింతించితిని: నేనీ ద్వంద్వ భావముతో (సుఖ దుఃఖములు, లాభ నష్టములు మొదలగు దానితో) నేమి చేయ వలయును? దీని నంతటిని కొడుకుల కప్పగించి తపస్సునకు చెదరని సంకల్పము కలవాడనై సారస్వతమను సరస్సునకు వెను వెంటనే పోయెదను.

ఏవం చింత్య మయా ఇష్టః కర్మకాండేన కేశవః,

శ్రాద్దైశ్చ పితరో దేవా యజ్ఞై శ్చాన్యే తథా జనాః.

నే నిట్లు తలపోసి కేశవుని, శ్రాద్దములతో పితృ దేవతలను, యగ్నములతో ఇతర జీవులను అర్చించితిని.

తతోహం నిర్గతో రాజం స్తపసే ధృతమానసః,

సారస్వతం నామ సరో యదేతత్‌ పుష్కరం స్మృతమ్‌.

రాజా! పిదప నేను తపస్సునకు నిశ్చయిచుకొని పుష్కరమని జనులు చెప్పు కొను సరస్వతమను పేరుగల సరస్సునకు బయలు దేరితిని.

తత్ర గత్వా మయా విష్ణుః పురాణః పురుషః శివః,

ఆరాధితో మయా భక్త్యా జపం నారాయణాత్మకమ్‌.

అందేగి నేను పురాణ పురుషుడు, మంగళ స్వరూపుడు నగు విష్ణువును భక్తితో అరాధించితిని. శ్రీమన్నారాయణ జపము గావించితిని.

బ్రహ్మ పారమయం రాజన్‌ జపతా పరమం స్తవమ్‌,

తతో మే భగవాం స్తుష్టః ప్రత్యక్షత్వం జగామ హ.

బ్రహ్మమే పరదైవ మనెడు తత్త్వముతో నిండిన ఆ మహా స్తోత్రమును నేను జపింపగా భగవంతుడు తుష్టుడై నాకు ప్రత్యక్ష మయ్యెను.

ప్రియవ్రతుడు:

కీదృశం బ్రహ్మపారం తు శ్రోతు మిచ్ఛామి సత్తమ,

కథయస్వ ప్రసాదేన దేవర్షే సుప్రసన్నధీః.

ప్రియవ్రతుడు:

దేవర్షీ! మిక్కిలి ప్రసన్నమగు బుద్దికల నీవు నాయంద నుగ్రహముతో బ్రహ్మ పారమన నెట్టిదో నాకు చెప్పుము. వినగోరు చున్నాను.

నారదుడు:

పరం పరాణా మమృతం పురాణం పారం పరం విష్ణు మనంత వీర్యమ్‌,

నమామి నిత్యం పురుషం పురాణం పరాయణం పారగతం పరాణామ్‌.

నారదుడు:

పరముల కెల్ల పరముడు, అమృతుడు, పురాణుడు, చిట్ట చివరి వాడు, అంతు లేని శక్తి గల భావనలకు తుది గట్టు అయిన విష్ణువునకు మ్రొక్కు లిడుదును.

పురాతనం త్వప్రతిమం పురాణం పరాపరం పారగ ముగ్రతేజసమ్‌,

గంభీరగంభీరధియాం ప్రధానం నతోస్మి దేవం హరి మీశితారమ్‌.

సర్వమునకు మునుపు ఉన్నవాడు, సాటి లేని వాడు, అతి దూరమున నుండు వాడు, అతి సమీపమున నుండు వాడు, జగముల కవ్వలి హద్దున నుండు వాడు, భరింప రాని తేజము గలవాడు, సకల ప్రజ్ఞల కంటె లోతైన ప్రజ్ఞ కల ప్రధాన పురుషుడు, ప్రభువు అగు హరి దేవునకు మ్రొక్కెదను.

పరాత్పరం చాపరమం ప్రధానం పరాస్పదం శుద్ధపదం విశాలమ్‌,

పరాత్పరేశం పురుషం పురాణం నారాయణం స్తౌమి విశుద్ధ భావః.

పరమున కంటె పరమైన వాడు, తన కంటె ఉత్తముడు లేని వాడు, సర్వమునకు మూలమైన వాడు, పరులగు దేవజాతికి కూడా లక్ష్యమైన వాడు, పవిత్రమగు స్థానము, సర్వ జగత్తులను తనలో అణు స్వరూపముగా నిముడ్చు కొన్న విశాల స్వరూపుడు, పర దైవములకు కూడ పాలకుడు, పురాణ పురుషుడు అగు నారాయణుని విశుద్ధ భావముతో స్తుతింతును.

పురా పురం శూన్య మిదం ససర్జ తదా స్థితత్వాత్‌ పురుషః ప్రధానః,

జనే ప్రసిద్ధః శరణం మమాస్తు నారాయణో వీతమలః పురాణః.

మును పిదియంతయు శూన్యముగా నుండగా నాతడు, అంతకు ముందే యున్న వాడు కావున, ఈ సమస్త లోకములను ప్రసిద్ద మాయెను. అట్టి ఏదోషములు లేని నారాయణుడు నాకు దిక్కగు గాక!

పారం పరం విష్ణు మపారరూపం పురాతనం నీతిమతాం ప్రధానమ్‌,

ధృతక్షమం శాన్తిధరం క్షితీశం శుభం సదా స్తౌమి మహానుభావమ్‌.

తుది దిక్కు, అనంతమైన రూపములు కలవాడు, నీతి మంతులలో ప్రధానుడు, సర్వ భూమికి పట్టుగొమ్మ, శాంతిని నెలకొల్పు వాడు, భూమికి ఏలిక, మంగళ స్వరూపుడు, మహానుభావుడు అగు విష్ణువు నెల్లవేళలా స్తుతింతును.

సహస్రమూర్ధాన మనన్తపాదమనేకబాహుం శశిసూర్యనేత్రమ్‌,

క్షరాక్షరం క్షీర సముద్రనిద్రం నారాయణం స్తౌమ్యమృతం పరేశమ్‌.

వేల కొలది శిరస్సులు, లెక్కిడ రాని పాదములు హస్తములు గలవాడు, సూర్య చంద్రులు కన్నులైన వాడు, క్షరుడు (నాశము పొందు వాడు) అక్షరుడు (నాశము లేని వాడు) పాల కడలిలో శయనించు వాడు, అమృత స్వరూపుడు, పరమేశ్వరుడు అగు శ్రీ విష్ణువును కొని యాడుదును.

త్రివేద గమ్యం త్రినవైకమూర్తిం త్రిశుక్ల సంస్థం త్రిహుతాశభేదమ్‌,

త్రితత్త్వలక్ష్యం త్రియుగం త్రినేత్రం నమామి నారాయణ మప్రమేయమ్‌.

ఋగ్యాజు స్సామములు అనెడు మూడు వేదముల వలననే యెరుగ దగిన వాడు, ఇరువది ఏడు తత్త్వములు ఒకే రూపమైన వాడు, మూడు విధములగు శుద్ధ వస్తువులలో నెలకొని యుండు వాడు, మూడగ్నుల స్వరూప మైన వాడు (దక్షిణాగ్ని, ఆహవానీ యాగ్ని, గార్హ పత్యగ్ని అనునవి మూడగ్నులు). సత్యము, జ్ఞానము, అనంతము అను మూడు తత్త్వములకు గుఱియైన వాడు, కృత, త్రేతా, ద్వాపరముల స్వరూపమైన వాడు, సూర్య చంద్రాగ్నులు కన్నులైన వాడు, ఇట్టివా డింత వాడని యూహింప నలవి కాని వాడు అగు నారాయణునకు నమస్కరింతును.

కృతే సితం రక్తతనుం తథా చ త్రేతాయుగే పీతతనుం పురాణమ్‌,

తథా హరిం ద్వాపరతః కాలౌ చ కృష్ణేకృతాత్మాన మథో నమామి.

కృత యుగమున తెల్లనిదియు, త్రేతా యుగమున ఎర్రనిదియు, ద్వాపర యుగమున పసిమి వన్నె కలదియు, కలి యందు నల్లనిదియు నగు దేహ కాంతి కల ఆ హరికి కైమోడ్పు.

ససర్జ యో వక్త్రత ఏవ విప్రాన్‌ భుజాన్తరే క్షత్ర మథోరుయుగ్మే,

విశః పదాగ్రేషు తథైవ శూద్రాన్‌ నమామి తం విశ్వతనుం పురాణమ్‌.

ముఖము నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, కాలి తుదల నుండి శూద్రులను సృజించిన విశ్వ రూపడగు ఆది దేవునకు నమస్కరింతును.

పరాత్పరం పారగతం ప్రమేయం యుధాంపతిం కార్యత ఏవ కృష్ణమ్‌,

గదాసిచర్మణ్య భృతోత్థపాణిం నమామి నారాయణ మప్రమేయమ్‌.

దూరముల కెల్ల దవ్వయిన వాడు, పారము ముట్టిన వాడు, వేద ప్రమాణముచే తెలియ దగిన వాడు, సర్వ యుద్దములకు నాయకుడు, ఆయా పనులు నిర్వహించుటకు కృష్ణుడై పుట్టిన వాడు, గద, ఖడ్గము, డాలు ధరించిన చేతులతో నిత్యము సిద్దముగా నుండు వాడు, ఊహల కందని వాడు నగు శ్రీనారాయణునికి మ్రొక్కు లిడుదును.

ఇతి స్తుతో దేవవరః ప్రసన్నో జగాద మాం నీరదతుల్య ఘోషః,

వరం వృణీష్వే త్యసకృత్‌ తతోహం తస్యైవ దేహే లయ మిష్టవాంశ్చ.

నే నిట్లు స్తుతింపగా ఆ దేవదేవుడు ప్రసన్నుడై ఉరుము వంటి కంఠ ధ్వనితో నాయనా! వరము కోరుకొమ్మని మరల మరల నాతో పలికెను. అంత నేను దేహము నందే లయ మగుటను కోరు కొంటిని.

ఇతి శ్రుత్వా వచో మహ్యం దేవదేవః సనాతనః,

ఉవాచ ప్రకృతిం విప్ర సంసర స్వాక్షరా మిమామ్‌.

అంత సనాతనుడగు ఆ దేవ దేవుడు నా మాట విని బ్రాహ్మణోత్తమా! ఈ నాశనము లేని ప్రకృతి లోనికి చొరబడు మని ఆనవెట్టెను.

బ్రహ్మణో యుగసాహస్రం తత్తే తస్మాత్‌ సముద్భవః,

భవితా తే తథా నామ దాస్యతే సంప్రయోజనమ్‌.

బ్రహ్మ యొక్క వేయి యుగముల ఆయువు నీకు సిద్దించును. అట్లే అర్ధ వంతమగు పేరు కూడా నీ కేర్పడును.

నారం పానీయ మిత్యుక్తం తం పితౄణాం సదా భవాన్‌,

దదాతి తేన తే నామ నారదేతి భవిష్యతి.

నార మనగా త్రావు నీరు. నీ వెల్ల వేళల పితృ దేవతలకు, దాని నిత్తువు కనుక నీకు నారదుడను పేరు కలుగును.

ఏవ ముక్త్వా గతో దేవః సద్యో దర్శన ముచ్చకైః,

అహం కలేవరం త్యక్త్వా కాలేన తపసా తదా.

బ్రహ్మణోఙ్గే లయం ప్రాప్త స్తదోత్పత్తిం చ పార్థివ,

దివసే తు పునః సృష్టో దశభి స్తనయైః సహ.

ఇట్లా దేవుడు బిగ్గరగా పలికి కనబడ కుండ బోయెను. నేను తగు కాలమున ఆ దేహము విడచి తపస్సు మహిమ వలన బ్రహ్మ దేహమున లయ మైతిని. అట్లే మరల ఆతడు పుట్టిన దినమున అతని పది మంది పుత్రులలో నేనును పుట్టుక నొందితిని.

దినాది ర్యో హి దేవస్య బ్రహ్మణోవ్యక్త జన్మనః,

స సృష్ట్యాదిః సమస్తానాం దేవాదీనాం న సంశయః.

ఎందుండి పుట్టెనో ఎరుగని బ్రహ్మ దేవుని మొదటి దినము మొదలే సమస్త దేవతల సృష్టికి మొదలు. ఇందు సంశయము లేదు.

సర్వస్య జగతః సృష్టి రేషైవ ప్రభుధర్మతః,

ఏతన్మే ప్రాకృతం జన్మ యన్మాం పృచ్ఛసి పార్థివ.

ఇదియే సర్వేశ్వరుని ధర్మమును బట్టి సమస్త జగత్తునకు సృష్టి, రాజా! నన్ను నీవడిగిన నా పూర్వ జన్మ వృత్తంత మిదియే.

తస్మా న్నారాయణం ధ్యాత్వా ప్రాప్తోస్మి పరతో నృప,

తస్మాత్‌ త్వమపి రాజేన్ధ్ర భవ విష్ణు పరాయణః.

నేనెట్లు నారాయణుని ధ్యానించి ఉత్తమ పదవి నందితినో యట్లె నీవును విష్ణు నందు సర్వము నెలకొల్పిన వాడవగుము.