వరాహ మహా పురాణము
అధ్యాయము - 68
భద్రాశ్వుడు:
యోసౌ పరాపరో దేవో విష్ణుః సర్వగతో మునే,
చతుర్యుగే త్వసౌ కీదృగ్ విజ్ఞేయః పరమేశ్వరః.
భద్రాశ్వుడు:
ఓమునీ! పరుడు, అపరుడు, సర్వగతుడు అయిన ఈ విష్ణు దేవుడు నాలుగు యుగము లందు ఎట్టివాడు? ఆ పరమేశ్వరుని నెట్లు తెలిసికొన నగును.
యుగే యుగే క ఆచారో వర్ణానాం భవితా మునే,
కథం చ శుద్ధి ర్విప్రాణా మన్యస్త్రీ సంకరై ర్మునే.
మునీ! ప్రతి యుగము నందు ఆయా వర్ణముల వారి ఆచార మెట్టిది? ఇతర జాతుల స్త్రీలతో సంకర మేర్పడి నపుడు విప్రులకు శుద్ధి ఎట్లగును?
అగస్త్యుడు:
కృతే యుగే మహీ దేవై ర్భుజ్యతే వేదకర్మణా,
యజద్భి రసురై స్త్రేతా తద్వద్ దేవైశ్చ సత్తమ.
ద్వాపరే సత్వరజసో బహుళే నృపసత్తమ,
యావద్ ధర్మసుతో రాజా భవిష్యతి మహామతే.
తత స్తమః ప్రభవితా కలిరూపో నరేశ్వర,
తస్మిన్ కలౌ వర్తమానే స్వమార్గా చ్చ్యవతే ద్విజః.
అగస్త్యుడు:
శ్రేష్ఠుడా! కృత యుగమున ఈ భూమిని దేవతలు వేద కర్మముతో అనుభవింతురు. త్రేత యందు అసురులు, దేవతలు యజ్ఞములు చేయుచు అనుభవింతురు. ద్వాపరమున సత్త్వ రజస్సులు అతిశయముగా నుండును. రాజు ధర్మమూర్తియై ఒప్పారును. అటుపై కలి రూపమున తమస్సు ఏర్పడును. ఆ కలి యుగము రాగా బ్రాహ్మణుడు తన మార్గము నుండి భ్రష్టుడగును.
రాజానో వైశ్యశూద్రాశ్చ ప్రాయశో హీనజాతయః,
భవిష్యన్తి నృపశ్రేష్ఠ సత్యశౌచ వివర్జితాః.
రాజులు, వైశ్యులు, శూద్రులు తరచుగా జాతి భ్రష్టు లగుదురు. సత్యము, శుద్ధియు లేని వారగుదురు.
అగమ్యా గమనం తత్ర కరిష్యన్తి ద్విజాతయః,
అనృతం చ వదిష్యన్తి వేదమార్గ బహిష్కృతాః,
వివాహాంశ్చ కరిష్యన్తి సగోత్రా నసమాం స్తథా.
పొందరాని స్త్రీలను బ్రామ్మణులు పొందు చుందురు. వేద మార్గము నుండి భ్రష్టులై అబద్ధము లాడు చుందురు. తమ గోత్రముల వారితో, ఈడు కాని వారితో వివాహములను కూడ చేసికొను చుందురు.
రాజానో బ్రాహ్మణాన్ హింస్యు ర్విత్తలోభాన్వితాః శఠాః,
అన్త్యజా అపి వైశ్యత్వం కరిష్యంతి పణే రతాః,
అభిమానినో భవిష్యన్తి శూద్రజాతిషు గర్వితాః.
ధనము లందు లోభము గల మూఢులగు రాజులు బ్రహ్మ జ్ఞాన సంపన్నులను హింసింతురు. శూద్రులును వర్తక వృత్తి యందు ఆసక్తి కలవారై వైశ్య వృత్తిని చేయు చుందురు. శూద్ర జాతుల యందు గర్వితులై అభిమానము కలవారై యుందురు.
సర్వాశినో భవిష్యన్తి బ్రాహ్మణాః శౌచివర్జితాః,
సురాపేయ మితి ప్రాహుః సత్యశౌచ వివర్జితాః.
బ్రాహ్మణులు శౌచమును పాటింపక సత్యమును వదలి వైచి అన్ని విధముల తిండిని తినువార గుదురు. మద్యము సేవింప దగినదని నొక్కి పలుకుదురు.
తతో వినశ్యతే లోకో వర్ణధర్మశ్చ నశ్యతే.
అంత లోకస్ధితి చెడి పోవును. వర్ణ ధర్మము నశించును.
భద్రాశ్వుడు:
అగమ్యాగమనం కృత్వా బ్రాహ్మణః క్షత్రియోపి వా,
శూద్రోపి శుద్ధ్యతే కేన కిం వాగమ్యంతు శంస మే.
భద్రాశ్వుడు:
పొంద రాని స్త్రీని పొంది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఎట్లు శుద్ధి పొందును. పొందరాని తనమెట్లు కలుగును? నాకు చెప్పుము.
అగస్త్యుడు:
చాతుర్గామీ భవేద్విప్ర స్త్రిగామీ క్షత్రియో భవేత్,
ద్విగామీతు భవేద్ వైశ్యః శూద్ర ఏకగమః స్మృతః.
అగస్త్యుడు:
బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని, క్షత్రియుడు మూడు వర్ణముల వారిని, వైశ్యుడు రెండు వర్గముల వారిని, శూద్రుడు తన వర్ణము వారిని గమ్యలుగా (భార్యలుగా) భావింప వచ్చును.
అగమ్యాం బ్రాహ్మణీం ప్రాహుః క్షత్రియస్య నరేశ్వర,
క్షత్రాణీం చైవ వైశ్యస్య వైశ్యాం శూద్రస్య పార్థివ,
అధమ స్యోత్తమా నారీ అగమ్యా మమ రబ్రవీత్.
బ్రాహ్మణ స్త్రీ క్షత్రియునకు, క్షత్రియ కాంత వైశ్యునకు, వైశ్య కాంత శూద్రునకు అగమ్య అని చెప్పుదురు. క్రింది కులము వానికి పై కులపు కాంత అగమ్య అని మనువు చెప్పెను.
మాతా మాతృష్వసా శ్వశ్రూ ర్భ్రాతృపత్నీ చ పార్థివ,
స్నుషా చ దుహితా చైవ మిత్రపత్నీ స్వగోత్రజా.
రాజజాయత్మజా చైవ అగమ్యా ముఖ్యతః స్త్రియః,
రాజకాదిషు చాన్యాశ్చ స్త్రియోగమ్యాః ప్రకీర్తితాః,
అగమ్యాగమనం చైతత్ కృతం పాపాయ జాయతే.
రాజా! తల్లియు, తల్లి సోదరియు, అత్తయు, వదినయు మరదలును, కోడలును, కూతురు, మిత్రుని భార్య, తన గోత్రము నందలి కాంతయు, రాజ పత్నియు, ‘రాజు’ బిడ్డయు నగు స్త్రీలు ముఖ్యముగా మనుజునకు పొందరాని వారు. అట్లే వృత్తి పని చేయునట్టి చాకలి మున్నగు స్త్రీలు కూడ అగమ్యలు. ఈ అగమ్యా గమనము వలన పాపము కలుగును.
వియోనిగమనాయాశు బ్రాహ్మణాయ భవత్యలమ్.
శేషస్య శుద్ధి రేషైవ ప్రాణాయామశతం భవేత్.
బ్రాహ్మణుడు ఇతర స్త్రీని పొంది నంత మాత్రమున బ్రాహ్మణత్వము నుండి భ్రష్టుడగును. ఇతరునకు నూరు ప్రాణాయామముల వలన శుద్ధి ఏర్పడును.
బహునాపి హి కాలేన యత్ పాపం సముపార్జితమ్,
వర్ణ సంకరసంగత్యా బ్రాహ్మణేన నరర్షభ.
దశ ప్రణవగాయత్రీం ప్రాణాయామశతై స్త్రి భిః,
ముచ్యతే బ్రహ్మహత్యాయాః కింపునః శేషపాతకైః.
పెక్కు కాలము నందు చేసిన పాపము వర్ణ సంకర సంబంధము, బ్రహ్మ హత్య మున్నగు మహా పాపము లన్నియు ప్రణవ పూర్వక మైన గాయత్రిని పది మారులు చేయుట చేతను, మూడు నూర్ల ప్రాణాయామముల చేతను బ్రాహ్మణునకు నశించును. ఇతర పాతకముల సంగతి చెప్పనేల?
అథవా పరరూపం యో వేద బ్రాహ్మణ పుంగవః,
వేదాధ్యాయీ పాపశతైః కృతై రపి నలిప్యతే.
మరియును బ్రాహ్మణ శ్రేష్ఠుడు వేదములను అధ్యయనము చేయువాడై పరమాత్మ స్వరూపము నెరిగినచో వందల కొలది పాపముల నుండియు ముక్తుడగును.
స్మరన్ విష్ణుం పఠన్ వేదం దదద్ దానం యజన్ హరిమ్,
బ్రాహ్మణః శుద్ధ ఏవాస్తే విరుద్ధ మపి తారయేత్.
విష్ణువును స్మరించుచు, వేదమును పఠించుచు, దాన మొసగుచు, హరిని పూజించుచు బ్రాహ్మణుడు శుద్ధుడే యగును. ఇతరుని కూడ తరింప జేయును.
ఏతత్ తే సర్వ మాఖ్యాతం యత్ పృష్టో హం త్వయా నృప,
మన్వాదిభి ర్విస్తరశః కథ్యతే యేన పార్థివ,
సమాసత స్తేన మయా కథితం తే నృపోత్తమ.
రాజా! నన్ను నీవడిగిన విషయ మంతటిని నీకు చెప్పితిని. దీని నంతటిని మనువు మున్నగు వారు విస్తరించి చెప్పుదురు. నేను నీకు సంగ్రహముగా చెప్పితిని.