అధ్యాయము - 6

ధరణి:

స వసుః సంశయచ్ఛేదం ప్రాప్య రైభ్యశ్చ సత్తమః,

ఉభౌ కిం చక్రతు ర్దేవ శ్రుత్వా చాంగిరసం వచః.

ధరణి:

దేవా! ఆ వసువును, ఉత్తముడగు రైభ్యుడును బృహస్పతి ఉపదేశమును విని సంశయము తీర్చుకొని అటుపై ఏమి గావించిరి?

శ్రీ వరాహ స్వామి:

స వసుః సర్వధర్మజ్ఞః స్వరాజ్యం ప్రతిపాలయన్‌,

అయజద్‌ బహుభి ర్యజ్ఞైర్మహద్భి ర్భూరిదక్షిణౖః.

శ్రీ వరాహ స్వామి:

 ధర్మము లన్నింటి తత్త్వ మెరిగిన ఆ వసు మహారాజు తన రాజ్యమును చక్కగా పరిపాలించుచు, గొప్ప దక్షిణలు గల దొడ్డ యజ్ఞములు పెక్కింటిని చేసెను.

కర్మకాండన దేవేశం హరిం నారాయణం ప్రభుమ్‌,

తోషయామాస రాజేంద్ర స్త మభేదేన చింతయన్‌.

ఆ రాజేంద్రుడు దేవ దేవుడగు శ్రీమన్నారాయణుని భేదము లేని బుద్దితో భావించుచు కర్మ మార్గమున సంతోష పెట్టెను.

తతః కాలేన మహతా తస్య రాజ్ఞో మతిః కిల,

నివృత్తరాజ్య భోగస్య ద్వన్ద్వ స్యాన్త ముపేయుషీ.

చాలా కాలము గడచిన పిమ్మట రాజ్య భోగములపై మనసు పెట్టని ఆ రాజునకు ద్వంద్వముల నుండి మరలిన బుద్ది నెల కొనెను. (ద్వంద్వములు - సుఖ దుఃఖములు, లాభ నష్టములు మొదలైనవి. సంగము లేని స్థితి ఏర్పడెనని భావము.)

తతః పుత్రం వివిస్వన్తం శ్రేష్ఠం భ్రాతృశతస్య హ,

అభిషిచ్య స్వకే రాజ్యే తపోవన ముపాగమత్‌.

నూరుగురు అన్నదమ్ములలో మిన్నయగు వివస్వంతుడను కుమారుని తన రాజ్యమున అభిషేకించి అతడు తపో వనము చేరు కొనెను.

పుష్కరం నామ తీర్థానాం ప్రవరం యత్ర కేశవః,

పుండరీకాక్షనామా తు పూజ్యతే తత్పరాయణైః

తత్ర గత్వా స రాజర్షిః కాశ్మీరాధిపతి ర్వసుః,

అతితీవ్రేణ తపసా స్వశరీర మశోషయత్‌.

తీర్దములలో వాసి కెక్కినదియు, శ్రద్దాసక్తులు గలవారి పూజలందు కొనుచు నారాయణుడు పుండరీకాక్షు డను పేరున నెలకొన్న దియు అగు పుష్కరమను తీర్ధమున కరిగి కాశ్మీర రాజగు ఆ వసువు మిక్కిలి తీవ్రమగు తపస్సుతో తన శరీరమును ఎండ గట్టెను.

పుండరీకాక్షపారం తు స్తవం భక్త్యా జపన్‌ బుధః,

ఆరిరాధయిషు ర్దేవం నారాయణ మకల్మషమ్‌,

స్తోత్రాన్తే తల్లయం ప్రాప్తః స రాజా రాజసత్తమః.

పుండరీకాక్షుడే పర దైవమని ప్రతిపాదించు స్తోత్రమును భక్తితో జపించుచు ఎందును మచ్చ లేని శ్రీమన్నారాయణ దేవుని నిరంతరము కొలుచుచు స్తోత్రము ముగిసిన వెనుక రాజ వరేణ్యుడగు ఆ వసువు ఆ దేవునిలో కలసి పోయెను.

భూదేవి:

పుండరీకాక్షపారం తు స్తోత్రం దేవ కథం స్మృతమ్‌,

కీదృశం తన్మమాచక్ష్వ పరమేశ్వర తత్త్వతః.

భూదేవి:

పరమేశ్వరా! పుండరీకాక్ష పారమను ఆ స్తోత్ర మెట్టిది? దానిని జపించుట యెట్లు? ఉన్నదున్నట్లు నాకు ఎరిగింపుము.

శ్రీ వరాహ స్వామి:

నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన,

నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే.

శ్రీ వరాహ స్వామి:

పద్మముల వంటి కన్నులు గల ఓ దేవా! మధుసూదనా! సర్వ లోకముల ప్రభూ! వాడియగు చక్రము గలవాడా! నీకు నమస్సులు.

విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసమ్‌,

నమామి పుండరీకాక్షం విద్యావిద్యాత్మకం ప్రభుమ్‌.

సర్వము తానే అయిన వాడు, గొప్ప భుజములు కలవాడు, వరముల నొసగు వాడు, వెలుగు లన్నియు తానే అయిన వాడు, తామర కన్నుల వాడు, జ్ఞానము, అజ్ఞానము తానే అయిన ప్రభువు, అట్టి వానికి నమస్కారము (అజ్ఞానము తానే అగుట యనగా జ్ఞానము కంటె భిన్నముగా తోచు సంసారము కూడ తానే యని భావము).

ఆదిదేవం మహాదేవం వేదవేదాంగ పారగమ్‌,

గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనమ్‌.

తొట్ట తొలి దైవము, గొప్ప దైవము, వేదములయు వేదాంగములయు తుదిని గోచరించు దైవము, దేవతలు అందరిలో అంతు పట్టని దైవము అగు మధుసూదనునికి మ్రొక్కు లిడుదును. (మధు సూదనుడనగా మధువను రాక్షసుని రూపు మాపిన వాడు.)

విశ్వమూర్తిం మహామూర్తిం విద్యామూర్తిం త్రిమూర్తికమ్‌,

కవచం సర్వదేవానాం నమస్యే వారిజేక్షణమ్‌.

విశ్వమంతయు తన రూపమే అయిన వాడు, దానిని మించిన పెను రూపము కలవాడు, విద్యయంతయు తన రూపమే అయిన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో మూడు రూపములు కలవాడు, దేవతలు అందరకు కవచమైన వాడు, పద్మముల వంటి కనులు గలవాడు అగు దైవమునకు మ్రోక్కుదును. (కవచము దేహమునకు ఆయుదాదుల బాధ కలుగ కుండ కాపాడు తొడుగు).

సహస్ర శీర్షిణం దేవం సహస్రాక్షం మహాభుజమ్‌,

జగత్‌ సంవ్యాప్య తిష్ఠన్తం నమస్యే పరమేశ్వరమ్‌.

వేల తలలు, వేల కన్నులు, దొడ్డ భుజములు గలిగి లోకముల నన్నింటిని చక్కగా వ్యాపించి యున్న పరమేశ్వరునకు నమస్సు.

శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనమ్‌,

నీలమేఘ ప్రతీకాశం నమస్యే చక్రపాణినమ్‌.

లోకములు అన్నింటికి దిక్కు అయిన వాడు, రక్షకుడు, అంతట నిండిన వాడు, అన్నింటిని అందరను గెలువ గలవాడు, సనాతనుడు, నల్లని మబ్బు వంటి వన్నె కలవాడు, చక్రము చేత దాల్చిన వాడు అగు దేవునకు ప్రణామములు, (సనాతనుడు - సృష్టికి ముందు నుండియు ఉన్నవాడు).

శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనమ్‌,

భావాభావ వినిర్ముక్తం నమస్యే సర్వగం హరిమ్‌.

శుద్దుడు, అంతట నిండిన వాడు, నాశము లేని వాడు, ఆకాశము వంటి రూపము కలవాడు, సనాతనుడు, భావములను,అభావములను ఊడ్చి వైచిన వాడు, ఎల్ల యెడల నుండు వాడు అగు హరిని నమస్కరింతును. (భావాభావ వినిర్ముక్తమ్ = లోకమున తక్కిన పదార్ధములకు వలె ఉండుట, లేకుండుట అను ధర్మములు లేని వాడని భావము).

నాన్యత్‌ కించిత్‌ ప్రపశ్యామి వ్యతిరక్తం త్వయాచ్యుత,

త్వన్మయం చ ప్రపశ్యామి సర్వ మేత చ్చరాచరమ్‌.

అచ్యుతా! నీకంటే వేరయున దేమియు ఇనుమంతయు నాకు కాన రాకున్నది. ఈ చరాచర ప్రపంచ మంతయు నీతో నిండినది గనే నాకు కన్పట్టు చున్నది.

ఏవం తు వదత స్తసప్య మూర్తిమాన్‌ పురుషః కిల,

నిర్గత్య దేహా న్నీలాభో ఘనఛండో భయంకరః.

రక్తాక్షో హ్రస్వకాయ స్తు దగ్ధ స్థూణా సమప్రభః,

ఉవాచ ప్రాంజలి ర్భూత్వా కింకరోమి నరాధిప.

ఇట్లా రాజు స్తుతి చేయు చుండగా ఆతని ముందొక రూపము గొన్న పురుషుడు తన దేహము నుండి వెలువడి నిలిచెను. కారు మేఘము వలె తీవ్రుడై యుండెను. భయము గొలుపు చుండెను. కన్నులు ఎఱ్ఱగా నుండెను. దేహము పొట్టిగా నుండెను. కాలిన ఇనుప స్తంభము వలె నుండెను. అతడు చేతులు జోడించి రాజా! ఏమి యాజ్ఞ? అని పలికెను.

రాజు:

కోసి కిం కార్య మిహ తే కస్మాదాగతవా నసి,

ఏతన్మే కథయ వ్యాధ ఏత దిచ్ఛామి వేదితుమ్‌.

రాజు:

ఓయీ! కిరాతా! నీ వేవడవు? నీ కిట పనియేమి? ఎందుండి వచ్చితివి? ఇది తెలియ గోరుదును. నాకు తెలుపుము.

వ్యాధుడు:

పూర్వం కలియుగే రాజన్‌ రాజా త్వం దక్షినాపథే,

పూర్ణ ధర్మోద్భవః శ్రీమాంజనస్థానే విచక్షణః.

వ్యాధుడు:

రాజా! మునుపటి కలి యుగమున నీవు దక్షిణా పథమున జన స్థానమున నిండు ధర్మములతో పుట్టిన, సిరులకు నెలవగు బుద్దిగల రాజవు. (దక్షిణా పథము = వింధ్యకు దక్షిణమున నున్న దేశము).

స కదాచిద్‌ భవాన్‌ వీర తురగైః పరివారితః,

అరణ్య మాగతో హన్తుం శ్వాపదాని విశేషతః.

అట్టి నీవు ఒకనాడు గుఱ్ఱములు చుట్టిరాగా క్రూర మృగములను చంపుటకు అడవి కేతెంచితివి.

తత్ర త్వయాన్యకామేన మృగవేషధరో మునిః,

దణ్దయుగ్మేన దూరే తు పాతితో ధరణీతలే.

అచట నీవు ఒకనాడు మృగ వేషమున నున్న ఒక మునిని దూరము నుండి రెండు బాణములతో తెలియక నేల గూల్చితివి.

సద్యో మృతశ్చ విప్రేంద్ర స్త్వం చ రాజన్‌ ముదాయుతః.

హరిణోయం హత ఇతి యావత్‌ పశ్యసి పార్థివ,

తావ న్మృగవపు ర్విప్రో మృతః ప్రస్రవణే గిరౌ.

ఆ విప్రవరుడు వెను వెంటనే చచ్చెను. నీవు లేడిని కూల్చితినని సంతోషముతో చూచునంతలో ప్రస్రవనమను కొండపై మృగ దేహము గల విప్రుడు చచ్చి పడి యుండెను.

తం దృష్ట్వా త్వం మహారాజ క్షుభితేన్ద్రియమానసః,

గృహం గత స్తతోన్యస్య కస్యచిత్‌ కథితం త్వయా.

మహారాజా! అతనిని చూచిన నీకు ఇంద్రియములు, మనస్సును కుమిలి పోయెను. ఇంటికి పొయిన నీ వీ వృత్తాంతమును మరి యోకనికి చెప్పితివి.

తతః కతిపయాహస్య త్వయా రాత్రౌ నరేశ్వర,

బ్రహ్మహత్యాభయా ద్భీతచిత్తే నైతద్‌ విచిన్తితమ్‌,

కృత్యం కరోమి శాంత్యర్థం ముచ్యతే యేన పాతకాత్‌.

అంత కొన్ని రోజులకు నీ వోకరాత్రి బ్రహ్మ హత్య వలన భయపడిన చిత్తముతో ఈ పాతకము నుండి ముక్తి నొందు శాంతి కార్యము నాచరింతునని తల పోసితివి.

తత స్త్వయా మహారాజ సకృన్నారాయణం ప్రభుమ్‌.

సంచింత్య ద్వాదశీ శుద్ధా త్వయా రాజ న్నుషోషితా.

అపుడు నీవు శ్రీమన్నారాయణు నొక్క మారు మనసున ధ్యానించి శుద్ధ ద్వాదశి నాడు ఉపవాస ముంటివి.

నారాయణో మే సుప్రీత ఇతి ప్రోక్త్వా శుభేహని.

గౌ ర్దత్తా విధినా సద్యో మృతోస్యుదరశూలతః

ఆ పుణ్య దినమున ‘నారాయణుడు నా యెడల సుప్రీతుడగు గాక!’ అని పలికి శాస్త్రము ననుసరించి గోవును దాన మిచ్చితివి. వెనువెంటనే కడుపు నొప్పితో మరణించితివి.

అభుక్తో ద్వాదశీధర్మే యత్‌ తత్రాపిచ కారణమ్‌,

కథయామి భవత్పత్నీ నామ్నా నారాయణీ శుభా.

సా కంఠగేన ప్రాణేన వ్యాహృతా తేన తే గతిః

కల్పమేకం మహారాజ జాతా విష్ణుపురే తవ.

ద్వాదశి విధి యందు నీవు ఉపవాస ముండుటకు కూడా ఒక కారణము కలదు. అది చెప్పెదను. నీ ధర్మపత్ని పేరు పవిత్రమైన నారాయణి. నీవు ప్రాణములు కంఠము దాక వచ్చి పోవునపుడు ఆమెపేరు ఉచ్చరించితివి. ఆ కారణమున, మహారాజా! నీకొక కల్పకాలము విష్ణు పురమున నివాసము లభించినది.

అహం చ తవ దేహస్థః సర్వం జానామి చాక్షయమ్‌,

బ్రహ్మగ్రహో మహాఘోరః పీడయామీతి మే మతిః.

నే నొక బ్రహ్మ రాక్షసుడను. మహా ఘోరుడను. నీ దేహమున నుండి అంతయు తెలిసితిని. నిన్ను పీడింప వలయునని నా భావన.

తావద్‌ విష్ణోస్తు పురుషైః కింకరై ర్ముసలై రహమ్‌,

ప్రహతః సంక్షయం యాత స్తత స్తే రోమకూపతః

ఇంతలో నన్ను విష్ణు భటులు రోకల్లతో చావ గొట్టిరి. అంత నేను నీ రోమ కూపముల నుండి వెలు వడితిని.

స్వర్గస్థస్యాపి రాజేన్ద్ర స్థితోహం స్వేన తేజసా.

నీవు స్వర్గము నందున్నపుడును నా తేజము వలన నీ యందే యుంటిని.

తతోహః కల్పే నిర్వృత్తే రాత్రికల్పే చ సత్తమ,

ఇదానీ మాది సృష్టౌ తు కృతే నృపతి సత్తమ.

సంభూత స్త్వం మహారాజ రాజ్ఞః సుమనసో గృహే,

కాశ్మీరదేశాధిపతే రహం చాంగరుహై స్తవ.

అంత పగటి కల్పము గడచిన వెనుక రాత్రి కల్పమున ఇప్పుడు సృష్టి యందు కృత యుగమున నీవు కాశ్మీర రాజగు సుమనో మహారాజు గృహమున పట్టితివి. నేనును నీ రోమ కూపములతో నీలోనే యుంటిని. (కల్పమనగా బ్రహ్మ దేవునికి ఒక పగలు, ఒక రాత్రి. అహః కల్పమనగా బ్రహ్మకు ఒక దినము నందలి పగలు , రాత్రి కల్పమనగా రాత్రి).

యజ్ఞై రిష్టం త్వయానేకై ర్బహుభి శ్చాప్తదక్షిణైః,

న చాహం తై రపహతో విష్ణుస్మరణ వర్జితైః

నీవు గొప్ప దక్షిణలతో పెక్కు జన్నములు చేసితివి. కాని యవి విష్ణు స్మరణ లేని కారణమున నన్ను రూపు మాప లేక పోయినవి.

ఇదానీం యత్‌ త్వయా స్తోత్రం పుండరీకాక్ష పారకమ్‌,

పఠితం తత్ప్రభావేన విహాయాంగరుహా ణ్యహమ్‌,

ఏకీభూతః పున ర్జాతో వ్యాధరూపో నృపోత్తమ.

రాజవరేణ్యా! ఇప్పుడు నీవు పుండరీకాక్షుడే పరదైవ మని ప్రతిపాదించు స్తోత్రము చదువగా నీ రోమములను వదలి ఏక రూపము తాల్చి బోయవాడనై పుట్టితిని.

అహం భగవతః స్తోత్రం శ్రుత్వా ప్రాక్‌ పాపమూర్తినా,

ముక్తోస్మి ధర్మబుద్ధి ర్మే వర్తతే సాంప్రతం విభో.

నేనును భగవంతుని స్తోత్రము విని మునుపటి పాప రూపము నుండి విడుదల పొంది తిని. ప్రభూ! నాకు ఇప్పుడు ధర్మము నందు బుద్ది ఏర్పడినది.

ఏతచ్ఛ్రుత్వా వచో రాజా పరం విస్మయ మాగతః,

వరేణ చందయామాస తం వ్యాధం రాజసత్తమః

ఆ రాజ శ్రేష్ఠుడు ఇది విని పరమాశ్చర్యము పొందెను. ఆ వ్యాధుని వరము కోరు కొమ్మనెను.

రాజు:

స్మారితోస్మి యథా వ్యాధ త్వయాజన్మాంతరం గతమ్‌,

తథా త్వం మత్ప్రసాదేన ధర్మవ్యాధో భవిష్యసి.

రాజు:

ఓయీ వ్యాధుడా! నీ వలన నా మరియొక జన్మము వృత్తాంతము గుర్తునకు తెచ్చు కొంటిని. కావున నా అనుగ్రహము వలన నీవు ధర్మ వ్యాధుడు వగుదువు.

య శ్చైతత్‌ పుణ్డరీకాక్షపారగం శృణుయాత్‌ పరమ్‌,

తస్య పుష్కరయాత్రాయాం విధిస్నానఫలం భవేత్‌.

పుండరీకాక్షుడు (విష్ణువే) పరదైవ మని ప్రతి పాదించు ఈ స్తోత్రమును విను వానికి పుష్కర తీర్ధమున పవిత్ర స్నాన మాచరించు ఫలము కలుగును.

శ్రీ వరాహ స్వామి:

ఏవ ముక్త్వా తతో రాజా విమానవర మాస్థితః,

పరేణ తేజసా యోగ మవాపాశేషధారిణి.

శ్రీ వరాహ స్వామి:

ఓ భూతధాత్రీ! ఇట్లు పలికిన ఆ రాజు శ్రేష్ఠమగు విమానము నెక్కి గొప్ప తేజస్సులో లీన మాయెను.