వరాహ మహా పురాణము
అధ్యాయము - 110
హోత:
అథాతః సంప్రవక్ష్యామి కపిలాధేను ముత్తమామ్,
యత్ర్పదానాన్నరో యాతి విష్ణులోక మనుత్తమమ్.
హోత:
ఇక ఇటుపై యగు కపిలా ధేనువును గూర్చి చెప్పెదను. దాని దానము వలన నరుడు అత్యంత శ్రేష్ఠమగు విష్ణు లోకమును పొందును.
పూర్వోక్తేన విధానేన దద్యాద్ ధేనుం సవత్సకామ్,
సర్వాలంకార సంయుక్తాం సర్వరత్న సమన్వితామ్.
మునుపు చెప్పిన విధానముతో దూడతో కూడిన కపిల ధేనువును, అన్ని అలంకారములు, అన్ని రత్నములు కల దానిని దానము చేయ వలయును.
కపిలాయాః శిరో గ్రీవాం సర్వతీర్థాని భామిని,
పితామహనియోగాచ్చ నివసన్తి హి నిత్యశః.
కపిల ధేనువు తల యందు, కంఠము నందును బ్రహ్మ ఆదేశము వలన సర్వ తీర్థములు నెలకొని యుండును.
ప్రాత రుత్థాయ యో మర్త్యః కపిలాగళ మస్తకాత్,
చ్యుతం తు భక్త్యా పానీయం శిరసా వన్దతే శుచిః.
స తేన పుణ్యతోయేన తత్క్షణాద్ దగ్ధకిల్బిషః,
త్రింశద్వర్షకృతం పాపం దహత్యగ్ని రివేన్దనమ్.
ఉదయమున లేచి మానవుడు పుల్లావు మెడ నుండియు, తల నుండియు జారిన నీటిని భక్తితో తలకద్దు కొనుచు శుచియై ఆ పవిత్ర జలము వలన ఆప్పటి కప్పుడు మాడిన సర్వ పాపములు కల వాడగును. ముప్పదేండ్లు చేసిన పాపమును కూడ, అగ్ని కట్టెను వలె, కాల్చి వేయును.
కల్యముత్థాయ యో మర్త్యః కుర్యాత్ తాసాం ప్రదక్షిణమ్,
ప్రదక్షిణీ కృతా తేన పృథివీ స్యా ద్వసుంధరే.
ఉషః కాలమున లేచి కపిల గోవులకు ప్రదక్షిణము చేయు నరుడు, ఓ భూదేవి! భూమికి ప్రదక్షిణము చేసిన వాడగును.
ప్రదక్షణేన చైకేన శ్రద్ధాయుక్తేన తత్షణాత్,
దశజన్మకృతం పాపం తస్య నశ్యత్య సంశయమ్.
శ్రద్ధతో కూడిన ఒక ప్రదక్షిణము చేత పది జన్మములలో చేసిన ఆతని పాపము నశించును. సంశయము లేదు.
కపిలాయాస్తు మూత్రేణ స్నాయాచ్చైవ శుచివ్రతః,
స గంగాదిషు తీర్థేషు స్నాతో భవతి మానవః.
కపిల గోవు మూత్రముతో స్నానము చేసిన మానవుడు మిక్కిలి పతివ్రతు డగును. గంగ మొదలగు తీర్థము లందు స్నానము చేసిన వాడగును.
తేన స్నానేన చైకేన భావయుక్తేన వై నరః,
యావ జ్జీవకృతాత్ పాపాన్ముచ్యతే నాత్ర సంశయః.
ఆ ఒక్క స్నానము మంచి భావముతో చేసిన నరుడు పుట్టినది మొదలు కొని చేసిన సర్వ పాపముల నుండి విముక్తు డగును. సంశయము లేదు.
గోసహస్రంతు యో దద్యా దేకాంచ కపిలాం నరః,
సమ మేతత్ పురాప్రాహ బ్రహ్మా లోకపితామహః.
వేయి గోవులను ఇచ్చు వాడును. ఒక్క కపిల ధేనువు నిచ్చు వాడును సమాన మేయని లోకపితా మహుడగు బ్రహ్మ మునుపు నొక్కి చెప్పెను.
గవామస్థి నతప్యేత మృతగన్ధే న దూషయేత్,
యావజ్జిఘ్రతి తం గన్ధం తావత్పుణ్యౖ స్తు పూర్యతే.
గోవుల ఎముకను కాల్పరాదు. చచ్చిన ఆవు వాసనను నిందింప రాదు. ఆ వాసనను గ్రహించు నంత వరకు ఆతడు పుణ్యములతో నిండి పోవును.
గవాం కండూయనం శ్రేష్ఠం తథాచ పరిపాలనమ్,
తుల్యం గోశతదానస్య భయరోగాదిపాలనే.
గోవులను గోకుట ఉత్తమ కార్యము. అట్లే గోవులను పెంచుట మంచిది. వానికి భయము, రోగము కలిగి నపుడు రక్షించుట నూరావులను దానము చేయుటతో సమానము.
తృణోదకాని యో దద్యాత్ క్షుధితానాం గవాహ్నికమ్,
గోమేధస్య ఫలం దివ్యం లభతే మానవోత్తమః.
ప్రతి దినము ఆకలి గల ఆవులను గడ్డి నీరు ఇచ్చు ఉత్తమ మానవుడు గోమేధము చేసిన ఫలమును పొందును.
విమానై ర్వివిధై ర్దవ్యైః కన్యాభి రభితోర్పితైః,
సేవ్యమానః సుగన్ధై ర్వై దీప్యమానో యథాగ్నయః.
అట్టివాడు పెక్కు విధములగు దివ్య విమానములతో చుట్టు నున్న కన్యలతో మంచి గంధములతో సేవలు కొనుచున్న వాడై అగ్నుల వలె వెలిగిపోవు చుండును.
సువర్ణ కపిలా పూర్వం ద్వితీయా గౌరపింగలా,
తృతీయా చైవ రక్తాక్షీ చతుర్థీ గుడ పింగలా.
పఞ్చమీ బహువర్ణా స్యాత్ షష్ఠీచ శ్వేతపింగలా,
సప్తమీ శ్వేతపింగాక్షీ అష్టమీ కృష్ణ పింగలా.
నవమీ పాటలా జ్ఞేయా దశమీ పుచ్ఛ పింగలా,
ఏకాదశీ ఖురశ్వేతా త్వేతాసాం సర్వలక్షణా.
బంగారు వన్నెతో గోరోచన వర్ణము కలిసినది మొదటిది. పసుపు ఎరుపులు కలిసినది రెండవది. ఎర్రని కన్నులు కలది మూడవది. బెల్లము రంగు కలది నాలుగవది. పెక్కు రంగులు కలది అయిదవది. తెలుపు గోరోజనము వన్నెలు కలది ఆరవది. తెలుపు గోరోచనముల వన్నెకల కన్నులు కలది ఏడవది. నలుపు గోరోచనముల వన్నెలు కలిసినది ఎనిమిదవది. తెలుపు ఎరుపుల కలయిక కలది తొమ్మిదవది. తోక యందు గోరోజన వర్ణము కలది పదియవది. గిట్టల యందు తెలుపు కలది పదు నొకండవది. వీనిలో అన్ని లక్షణములు కలది గొప్పది.
సర్వలక్షణసంయుక్తా సర్వాలంకృతసుందరీ,
బ్రాహ్మణాయ ప్రదాతవ్యా భుక్తిముక్తి ప్రదాయినీ,
భుక్తిముక్తి ప్రదా గావో విష్ణులోకం స గచ్ఛతి.
అన్ని లక్షణములు కలదియు సర్వాలంకారము లతో చూడ ముచ్చట అయినదియు నగు గోవును బ్రాహ్మణునకు సమర్పింప వలయును. గోవులు భుక్తిని ముక్తిని ఇచ్చునవి. వాని దానము చేసిన వాడు విష్ణు లోకమున కరుగును.