అధ్యాయము - 23

ప్రజాపాలుడు:

కథం గణపతే ర్జన్మ మూర్తిమంతం చ సత్తమ,

ఏతన్మే సంశయం ఛింది ధృతికష్టం వ్యవస్థితమ్‌.

ప్రజాపాలుడు:

మహర్షీ! గణపతి పుట్టుక కథ ఏమి? అతనికి ఆ ఆకార మెట్లు వచ్చెను. నా మనస్సునకు బరువుగా నున్న ఈ సంశయమును దీర్పుము.

మహా తపుడు:

పూర్వం దేవగణాః సర్వే ఋషయశ్చ తపోధనాః,

కార్యారంభం తథా చక్రుః సిధ్యంతే చ న సంశయః.

మహా తపుడు:

మునుపు దేవతలు, తపో ధనులగు ఋషులు ఆయా పనులు చక్కగా సిద్ధి పొందునట్లు కార్యములను ప్రారంభించెడి వారు.

సన్మార్గవర్తిషు యథా సిధ్యంతే విఘ్నతః క్రియాః,

అసత్కారిషు సర్వేషు తద్వదేవ మవిఘ్నతః

మంచి నడవడి కలవారి యందు పనులు ఆటంకముల తోడను, చెడు నడవడి కలవారి యందు ఏ విఘ్నములు లేకుండా ఫలించుటయు సంభవించెను.

తతో దేవాః సపితర శ్చింతయామాసు రోజసా,

అసత్కర్యేషు విఘ్నర్థం సర్వఏవాభ్యమంత్రయన్‌.

అది చూచి దేవతలు, పితరులు శక్తి కొలది విచారించిరి. చెడు పనుల యందు విఘ్నము కలుగుటకై అందఱు ఆలోచించిరి.

తతస్తేషాం తదా మంత్రం కుర్వతాం స్త్రిదివౌకసామ్‌,

బభూవ బుర్ధిర్గమనే రుద్రం ప్రతి మహామతిమ్‌.

అట్లు ఆలోచన చేయుచున్న దేవతల బుద్ధికి దొడ్డ బుద్ధి గల రుద్రుని కడకరుగ వలయునను భావన కలిగెను.

తే తత్ర రుద్ర మాగమ్య కైలాసనిలయం గురుమ్‌,

ఊచుః సవినయం సర్వే ప్రణిపాతపురః సరమ్‌.

అంట వారందఱు కైలాస వాసియగు గురువు రుద్రుని కడ కరిగి దండ ప్రణామములు గావించి వినయముతో నిట్లు పలికిరి.

దేవతలు:

దేవదేవ మహాదేవ శూలపాణే త్రిలోచన,

విఘ్నార్థ మవిశిష్టానా ముత్పాదయితు మర్హసి.

దేవతలు:

దేవదేవా! మహాదేవా! శూలపాణీ! త్రిలోచనా! దుష్టుల కార్యములకు విఘ్నములు కలిగించుటకై యోకనిని నీవు పుట్టింప వలయును.

ఏవ ముక్తస్తదా దేవై ర్భవః పరమయా ముదా,

ఉమాం నిరీక్షయామాస చక్షుషానిమిషేణ హ.

దేవత లిట్లు పలుకగా పరమేశ్వరుడు పరమానందము నొంది రెప్పపాటు లేని కంటితో పార్వతిని చూచెను.

దేవానాం సన్నిధౌ తస్య పశ్యతోమాం మహాత్మనః,

చింతాభూద్‌ వ్యోమ్ని మూర్తి ర్నో దృశ్యతే కేన హేతునా.

ఇట్లు దేవతల యెదుట ఉమను చూచు చున్న ఆ మహాత్ముని మదిలో ఆకాశమునకు రూపము లేని కారణమేమా? అని ఆలోచన బయలు దేరెను.

పృథివ్యా విద్యతే మూర్తి రపాం మూర్తి స్త థైవ చ,

తేజసః శ్వసన స్యాపి మూర్తి రేషాతు దృశ్యతే,

ఆకాశంచ కథంనేతి మత్వా దేవో జహాస చ.

భూమికి ఆకృతి కలదు. నీటికి నట్లే కలదు. అగ్నికి, వాయువునకు ఆకృతి కలదు, ఈ ఆకాశమున కేల లేదు? అని భావించుచు దేవుడు నవ్వెను.

జ్ఞానశక్తి ముమాం దృష్ట్వా యద్‌దృష్టం వ్యోమ్నిశంభునా,

యచ్చోక్తం బ్రహ్మణాపూర్వం శరీరంతు శరీరిణామ్‌.

యచ్చాపి హసితం తేన దేవేన పరమేష్ఠినా,

ఏతత్కార్య చతుష్కేణ పృధివ్యాంచ చతుర్ష్వపి.

మూర్తిమా నతితేజస్వీ హసతః పరమేష్ఠినః,

ప్రదీప్తాస్యో మహాదీప్తః కుమారో భాసయన్‌ దిశః,

పరమేష్ఠి గుణౖ ర్యుక్తః సాక్షాద్‌ రుద్ర ఇవాపరః,

జ్ఞాన శక్తియగు ఉమను చూచి, రుద్రుడు ఆకాశమును చూచెను. మఱియు ముందే బ్రహ్మ శరీరుల శరీరమును గూర్చి పలికి యుండెను. పరమేశ్వరుడు నవ్వెను. ఈ నాలుగు కార్యముల తోడను, భూమి మొదలగు నాలుగు భూతము లందున్న గుణముల తోడను కూడి నవ్వుచున్న పరమేశ్వరుని నుండి గొప్ప ఆకారము, దొడ్డది యగు తేజస్సు, వెలిగి పోవుచున్న ముఖము, గొప్ప వెలుగు గల కుమారుడు దిక్కులను ప్రకాశింప జేయుచు పరమేష్ఠి గుణములతో కూడిన వాడై అపర రుద్రుడా యన్నట్లు ఏర్పడెను.

ఉత్పన్నమాత్రో దేవానాం యోషితః సప్రయోహయన్‌;

కాంత్యా దీప్త్యా తథా మూర్త్యా రూపేణ చ మహాత్మవాన్‌

కాంతి, తేజస్సు, ఆకారము, రూపము అను వానితో ఆ మహాత్ముడు పుట్టుచునే దేవ కాంతలను మురిపించెను.

తద్‌దృష్ట్వా పరమం రూపం కుమారస్య మహాత్మనః,

ఉమానిమేష నేత్రాభ్యాం త మపశ్యత భామినీ.

మహాత్ముడగు ఆ కుమారుని చక్కని రూపమును గాంచి ఉమా రెప్ప లార్పక వానిని చూచు చుండెను.

తం దృష్ట్వా కుపితో దేవః స్త్రీభావం చంచలంతథా,

మత్వా కుమారరూపం తు శోభనం మోహనం దృశామ్‌,

తతః శశాప తం దేవః స్త్రీ శంకాం పరమేశ్వరః

ఆ కుమారుని రూపము అందముగా కన్నులకు కైపు కలిగించు నదిగా ఉండుటను, స్త్రీల భావము చంచలమైన దగుటను పరికించిన పరమేశ్వరుడు స్త్రీల విషయమున శంక నొంది అతనిని ఇట్లు శపించెను.

కుమార గజవక్త్రస్త్వం ప్రలంబజఠరస్తథా,

భవిష్యసి తధా సర్చై రుపవీత గతి ర్ధ్రునమ్‌,

ఏవం శశాప తం దేవ స్త్రీవ్ర కోపసమన్వితః

కుమారా! ఏనుగు మోము, జారిన పొట్టయు, పాముల జందెము గలవాడ వగుదువు అని యిట్లు పట్టరాని కోపముతో పరమేశ్వరుడు శపించెను.

అర్థకోట్యా చ రోమాణా మాత్మనోఙ్గే త్రిలోచనః,

కూపకాస్వేదసలిల పూర్ణ శూలధర స్తథా,

దున్వన్‌ శరీర ముత్థాయ తతో దేవో రుషాన్వితః

ముక్కంటి దేవర యేబది లక్షల రోమ కూపములలో చెమట నిండి పోయెను. అట్టి త్రిశూలధారి దేహమును విదిలించుచు పెను కోపముతో లేచెను.

యథా యథాసౌ స శరీర మాద్యం ధునోతి దేవ స్త్రి శిఖాస్త్రపాణిః,

తథా తథా చాఙ్గరుహా శ్చకాసు ర్జలం క్షితౌ సంన్యపతం స్తథాన్యాః

త్రిశూలము చేత బట్టిన ఆ దేవుడు ఎట్లెట్లు తన మొదటిదగు దేహమును విదలించు చుండెనో అట్లట్లు ఆతని కేశములు విరాజిల్లు చుండెను. చెమట నీరు నేలపై కాలువలు కట్టెను.

వినాయకా నేకవిధా గజాస్యా స్తమాల నీలాంజన సంనికాశాః,

ఉత్తస్థు రుచ్చెః ర్వివిధాస్త్రహస్తా స్తతస్సు దేవా మనసా కులేన.

కిమేత దిత్యద్భుత కర్మకారీ హ్యేకః కరోత్యప్రతిమం మహచ్చ,

కార్యం సురాణాం కృత మేత దిష్టం భవే దథైతం పరితం కుత స్తత్‌.

ఏనుగు మోము గలవారు చీకటి చెట్ల వలె, కాటుక వలె, నల్లని దేహములు గలవారు, పెక్కు ఆయుధములు దాల్చిన వారు నగు వినాయకులు పెక్కు తీరుల వారు లేచి వచ్చిరి. అంత దేవత లందరు మనసులలో కలత పడి ఇదియేమి? అద్భుత కర్మ మాచరించుచు ఈ శివుడు ఇంత దొడ్డపని చేయు చున్నాడు? దేవతల కార్యమిత డొక్కడే చేయ గలవాడు. మఱి యీ పెక్కు స్వరూపములతో పని యేమి?

దివౌకసాం చిన్తయతాం తథా తు వినాయకైః క్ష్మా క్షుభితా బభూవ,

చతుర్ముఖ శ్చాప్రతియో విమాన మారుహ్య ఖే వాక్య మిదం జగాద.

దేవతల లిట్లు చింతించు చుండగా వినాయకులతో భూమి యంతయు గగ్గోలు పడి పోయెను. అంట సాటిలేని బ్రహ్మ విమాన మెక్కి ఆకసమున నిలిచి యిట్లు పలికెను.

ధన్యాః స్థ దేవాః సురనాయకేన త్రిలోచనే నాద్భుతరూపిణా చ,

అనుగృహీతాః పరమేశ్వరేణ సురద్విషాం విఘ్నకృతాం నతౌ చ.

దేవతలారా! మీరు ధన్యు లయితిరి. అద్భుత మగు రూపము గల ముక్కంటి దేవర పరమేశ్వరుడు మిమ్ముల ననుగ్రహించెను. ఈ రూపము లన్నియు దేవతల శత్రువులకు విఘ్నములు కలిగించునవి.

ఇత్యేవముక్త్వా ప్రపితామహ స్తా నువాచ దేవస్త్రిశిఖాస్త్ర పాణిమ్‌,

యస్తే విభో వక్త్రసముద్భవః ప్రభుర్వినాయకానాం భవతు త్విమేనుగాః.

తాత దేవతలతో ఇట్లు పలికి పిదప పరమేశ్వరునితో ఇట్లనెను. ప్రభూ! నీ మోము నుండి పుట్టిన ఆ స్వామి వినాయకులకు ప్రభువగు గాక! వీరందఱు అతని బంటులగుదురు గాక!

భవాంస్తథా స్యాత్మవరేణ చాంబరే త్వయా చతుర్వన్తు శరీరచారీ,

ఆకాశ మేతద్‌ బహుధా వ్యవస్థితం త్వయా వరేణ్యః కృత ఏవ నాన్యః

నీవు అందరి కంటే మిన్నగా నిర్మించిన ఒక్కడు శరీరముతో తిరుగు వాడై ఆకాశమున నిలుచు గాక! అతడు మొదట నాలుగు లక్షణములతో ఏర్పడిన వాడేయగు గాక! ఈ ఆకాశము చాల పెద్దది గదా! నీవు శ్రేష్ఠునే చేసితివి. ఇతరుని కాదు.

ప్రభు ర్భవ త్వం ప్రతిమాస్త్ర పాణినా ఇమాని చాస్త్రాణి వరాంశ్చ దేహి,

ఇత్యేవ ముక్త్వాధిగతే పితామహే త్రిలోచన శ్చాత్మభవం జగాద.

ఆ వినాయకునకు నీవు ప్రభువగుము. ప్రతిమల వంటి అస్త్రములను చేత దాల్చి యీ బాలునకు అస్త్రములను, వరములను ఇమ్ము. అని పలికి బ్రహ్మ దేవుడు వెడలి పోగా ముక్కంటి తన కొడుకుతో నిట్లు పలికెను.

వినాయకో విఘ్నకరో గజాస్యో గణేశనామా చ భవస్యపుత్రః,

ఏతే చ సర్వే తవ యాన్తు భృత్యా వినాయకాః క్రూరదృశః ప్రచణ్డాః

ఉచ్ఛుష్మ దానాది వివృద్ధ దేహః, కార్యేషు సిద్ధం ప్రతిపాదయంతః

నీవు వినాయకుడు, విఘ్నకరుడు, గజ ముఖుడు, శివ పుత్రుడు, గణేశుడు అను పేర్లతో ప్రసిద్ధి పొందుము. ఈ క్రూరమగు చూపులు భయము గొల్పు చేష్టలు గల ఈ వినాయకు లందఱు నీకు భంటు లగుదురు. తాపములు లేని వారొసగు పదార్థములతో పెంపొందిన దేహము గల వీరు ఆయా జనుల కార్యములను సఫలము చేయు చుందురు.

భవాంశ్చ దేవేషు తథా మఖేషు కార్యేషు చాన్యేషు మహానుభావాత్‌,

అగ్రేషు పూజాం లభతే న్యథా చ వినాశయిష్య స్యథ కార్యసిద్ధిమ్‌.

నీవును నీ మహానుభావము వలన దేవతలలో యజ్ఞములలో, ఆయా శుభ కార్యములలో మొట్ట మొదట పూజ నందు కొనెదవు. అట్లు కానిచో ఆయా కార్యముల సిద్ధిని నాశ మొందింతురు.

ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః సమం కాంచనకుంభ సంస్థైః

జలై స్తథా సా వభిషిక్తగాత్రో రరాజ రాజేంద్ర వినాయకానామ్‌.

పరమేశ్వరు డిట్లు పలికి దేవతలలో పాటు బంగారు కుండలతో నున్న జలములతో అతని నభిషేకించెను. అట్లు వినాయకులతో అతడు విరాజిల్లెను.

దృష్ట్వాభిషిచ్యమానం తు దేవాస్తం గణనాయకమ్‌,

తుష్టువుః ప్రయతాః సర్వే త్రిశూలాస్త్రస్య సంనిధౌ.

అట్లు అభిషేకము పొందుచున్న ఆ గణ నాయకుని గాంచి దేవత లందఱు త్రిశూల పాణి సన్నిధానమున శ్రద్ధా శక్తులతో స్తుతించిరి.

దేవతలు:

నమస్తే గజవక్త్రాయ నమస్తే గణనాయక,

వినాయక నమస్తేస్తు నమస్తే చండ విక్రమ.

దేవతలు:

ఏనుగు మోము దేవరయగు నీకు నమస్కారము. గణ నాయక! వినాయక! భయము గొల్పు పరాక్రమము గల నీకు మ్రొక్కులు.

నమోస్తు తే విఘ్నకర్త్రే నమస్తే సర్పమేఖల,

నమస్తే రుద్రవక్త్రోత్థ ప్రలంబజఠరాశ్రిత.

విఘ్నకర్తా! నీకు నమస్కారము. సర్పములు మొల నూలుగా గల స్వామీ! నీకు వందనము. రుద్రుని ముఖము నుండి పుట్టిన దేవా! నీకు నతులు. జారు బొజ్జ గల దేవరా! నీకు కైమోడ్పు.

సర్వదేవ నమస్కారా దవిఘ్నం కురు సర్వదా.

సర్వ దేవతలు నీకు మ్రొక్కు చున్నారు. అందు వలన వారికి ఎల్లవేళల విఘ్నములు లేకుండా జేయుము.

ఏవంస్తుత స్తదా దేవై ర్మహాత్మా గణనాయకః,

అభిషిక్తస్య రుద్రస్య సోమ స్యాపత్యతాం గతః

ఇట్లు దేవతల స్తుతుల నందు కొనిన గణనాయకుడు అభిషిక్తుడాయెను. ఉమా సహితుడగు రుద్రునికి కుమారు డాయెను.

ఏతచ్చతుర్థ్యాం సంపన్నం గణాధ్యక్షస్య పార్థివ,

యత స్తతోయం మహతీ తిథీనాం పరమాతిథిః.

ఇట్లు వినాయకుడు గణనాథు డగుట చవితి నాడు జరిగినది. అందు వలన చతుర్థీ తిథి తిథులలో శ్రేష్ఠమై యలరారినది.

ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా భక్త్యా గణపతిం నృప,

ఆరాధయతి తస్యాశు తుష్యతే నాస్తి సంశయః.

ఈ తిథి యందు నువ్వులను భుజించి గణపతిని భక్తితో పూజించిన వాని యెడ గణపతి ప్రసన్ను డగును. ఇందు సందియము లేదు.

యశ్చైతత్‌ పఠతే స్తోత్రం యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా,

న తస్య విఘ్న జాయంతే న పాపం సర్వథా నృప.

ఈ స్త్రోత్రము చదివిన వానికి, విన్న వానికిని విఘ్నములు కలుగవు. పాప మేవిధముగను అంటదు.