అధ్యాయము - 24

భూదేవి:

కథం తే గాత్ర సంస్పర్శా న్మూర్తిమన్తో మహాబలాః,

నాగా బభూవు ర్దేవేశ కారణం తే మహీధర.

భూదేవి:

దేవదేవా! భూధారీ! గొప్ప బలము, పెద్ద ఆకారము గల సర్పములు ఆ పరమేశ్వరుని శరీరమును అంటి యుండుటకు కారణ మెయ్యది?

శ్రీవరాహ దేవుడు:

శ్రుత్వా గణపతే ర్జన్మ ప్రజాపాలో నరాధిపః,

ఉవాచ శ్లక్షయా వాచా తం మునిం సంశితవ్రతమ్‌.

శ్రీవరాహ దేవుడు:

గణపతి పుట్టుకను గూర్చి విన్న ప్రజాపాల మహారాజు మధురమగు వాక్కుతో పవిత్రమగు వ్రతములు గల ఆ మునిని గూర్చి యిట్లు పలికెను.

ప్రజాపాలుడు:

భగవంస్తార్క్షవిషయాః కథం మూర్తి ముపాగతాః,

నాగా బభూవుః కుటిలా ఏత దాఖ్యాతు మర్హసి.

ప్రజాపాలుడు:

భగవానుడా! వంకర తనము గల నాగులు ఎట్లు రూపొందిరి. ఇది నాకు చెప్పుము. మరియు వారికి ఆకారమెట్లు కలిగినది?

మహాతపుడు:

సృజతా బ్రహ్మణా సృష్టిం మరీచిః సూతికారణమ్‌,

ప్రథమం మనసా ధ్యాత స్తస్య పుత్రస్తు కశ్యపః.

మహాతపుడు:

బ్రహ్మ దేవుడు సృష్టి చేయుచు సంతానము కొఱకై మొదట మనసున ధ్యానింపగా మరీచి పుట్టెను. అతని కొడుకు కశ్యపుడు.

తస్య దాక్షాయణీ భార్యా కద్రూ ర్నామా శుచిస్మితా,

మారీచో జనయామాస తస్యాం పుత్రాన్‌ మహాబలాన్‌.

ఆ కశ్యపునకు దక్షుని పుత్రిక యను సుందర వదన భార్య యాయెను. కశ్యపుని యందామెకు గొప్ప బలము గల పుత్రులు పుట్టిరి.

అనంతం వాసుకిం చైవ కంబలం చ మహాబలమ్‌,

కర్కోటకం చ రాజేంద్ర పద్మం చాన్యం సరీసృపమ్‌,

మహాపద్మం తథా శంఖం కులికం చాపరాజితమ్‌,

ఏతే శ్యపదాయాదాః ప్రధానాః పరికీర్తితాః.

అనంతుడు, వాసుకి, మహా బలుడగు కంబలుడు, కర్కోటకుడు, పద్ముడు, మహా పద్ముడు, శంఖుడు ఎవ్వరికిని ఓడని కులికుడు అను వీరు కశ్యపుని సంతానము నందు ప్రధానులు.

ఏతేషాం తు ప్రసూత్యా తు ఇద మాపూరితం జగత్‌,

కుటిలా హీనకర్మాణ స్తీక్షాణస్యాత్థో విషోల్బణాః

దృష్ట్వా సందశ్య మనుజాన్‌ కుర్యుర్భస్మ క్షణాద్‌ ధ్రువమ్‌.

వీరి సంతానముతో జగ మంతయు నిండి పోయెను. వంకర దేహములు, క్రూరపు పనులు, వాడి మోములు, పొంగి వచ్చు విష తీవ్రతయు గల వీరు మనుజులను చూచి నంతనే కాటు వేసీ క్షణములో బూడిద గావించు చుండెడి వారు.

శబ్దగామీ యథా స్పర్శం మనుష్యాణాం నరాధిప,

అహన్యహని జాయేత క్షయః పరమదారుణః.

ధ్వనిని బట్టి ఆ నాగులు మనుష్యుల కడచేరి వారిని తాకుదురు. ఈ విధముగా ప్రతి దినము పరమ ఘోరమగు వినాశము సంభవించు చుండెను.

ఆత్మనస్తు క్షయం దృష్ట్వా ప్రజాః సర్వాః సమంతతః,

జగ్ముః శరణ్యం శరణం పరం తు పరమేశ్వరమ్‌.

ఇట్లు తమ వినాశము కల్గు చుండగా చూచి ప్రజా లందఱు అన్ని వైపులా నుండి బయలు దేరి రక్షకుడు, పర దైవము అగు పరమేశ్వరుని శరణు జొచ్చిరి.

ఇమ మేవార్థ ముద్దిశ్య ప్రజాః సర్వా మహీపతే,

ఊచుః కమలజం విష్ణుం పురానం బ్రహ్మసంజ్ఞితమ్‌.

ఈ పని కొఱకే ప్రజ లందఱు పద్మమున బుట్టిన పురాణ దైవము బ్రహ్మను గాంచి యిట్లు పలికిరి.

దేవతలు:

దేవదేవేశ లోకానాం ప్రసూతిం పరమేశ్వర,

త్రాహి నస్తీక్ష్ణ దంష్ట్రాణాం భుజంగానాం మహాత్మనామ్‌.

దేవతలు:

దేవదేవా! ప్రభూ! పరమేశ్వరా! నీ సంతాన మగుమమ్ము వాడి కోరలు, పెద్ద దేహములు గల పాముల బారి నుండి రక్షింపుము.

అహన్యహని యద్దేవ పశ్యేయు రురగా దృశా,

మనుష్యపశురూపం వా తత్సర్వం భస్మసాద్‌ భవేత్‌.

దేవా! ప్రతి దినము మనుష్య రూపము గాని పశు రూపము గాని ఆ పాముల కంట బడి నంత బూడిదయై పోవు చున్నది.

త్వయా సృష్టిః కృతా దేవ నీయతే సా భుజంగమైః,

ఏతత్‌ జ్ఞాత్వాతు దుర్వృత్తం తత్కురుష్వ మహామతే.

నీవు పుట్టించు చున్నావు. ఆ నాగులు నాశనము చేయు చున్నారు. ఈ పాడు పనిని గమనించి తగిన కార్యమా చరింపుము.

బ్రహ్మ:

అహం రక్షాం విధాస్యామి భవతీనాం న సంశయః,

ప్రజధ్వం స్వాని ధిష్ణ్యాని ప్రజా మాభూత్‌ ససాధ్వసా.

బ్రహ్మ:

నేను మీకు రక్షణ కల్పింతును. సంశయము వలదు. మీమీ యిండ్లకు పొండు. ప్రజలకు కంగారు కలుగ రాదు.

ఏవముక్తాః ప్రజాస్తేన బ్రహ్మణావ్యక్తమూర్తినా,

ఆజగ్ముః పరమప్రీత్యా నత్వాచైవ స్వయంభువే.

ఇట్టిదని చెప్పరాని ఆకృతి గల బ్రహ్మ యిట్లు పలుకగా ప్రజ లందఱు పరమ ప్రీతితో స్వయంభువునకు నమస్కరించి తిరిగి వచ్చిరి.

ఆగతాసు ప్రజాస్వాద్య స్తానాహూయ భుజంగమాన్‌,

శశాప పరమక్రుర్ధో వాసుకి ప్రముఖాం స్తదా.

అట్లు ప్రజలందరు తిరిగి పోగా బ్రహ్మ వాసుకి మొదలగు పాములను పిలిచి పట్టరాని కోపముతో వారి నిట్లు శపించెను.

బ్రహ్మ:

యతోమత్ప్రభవాన్‌ నిత్యం క్షయం నయత మానుషాన్‌,

భవాంతరే అథాన్యస్మిన్‌ మాతుః శాపాత్‌ సుదారుణాత్‌,

భవితాతిక్షయం ఘోరం నూనం స్వాయంభువేంతరమ్‌.

బ్రహ్మ:

నా ప్రజ లందరిని మీరు ప్రతి దినము నాశ మొందించు చున్నారు. కావున మీ మరియొక పుట్టుక యందు తల్లి యిచ్చేడు భయంకర శాపము వలన ఘోరమైన వినాశము పొందుదురు. ఇది స్వాయంభువ మన్వంతరమున జరుగును.

ఏవ ముక్తాస్తు వేపంతో బ్రహ్మాణం భుజగోత్తమాః,

నిపత్య పాదయో స్తస్య ఇదమూచు ర్వచ స్తదా.

బ్రహ్మ యిట్లు పలుకగా ఆ నాగ ముఖ్యు లందఱు వణకి పోవుచు బ్రహ్మ పాదములపై బడి యిట్లు పలికిరి.

నాగులు:

భగవన్‌ కుటిలా జాతి రస్మాకం భవతా కృతా,

విషోల్బణత్వం క్రూరత్వం దృక్శస్త్రత్వం చ నస్త్వయా,

సంపాదితం త్వయా దేవ ఇదానీం శమయాచ్యుత.

నాగులు:

భగవంతుడా! మా జాతిని నీవే కుటిలముగా చేసితివి. పెల్లుబికెడు విషము, క్రూరత్వము, చూపే శస్త్రమగు లక్షనమును నీవే యేర్పరచితివి. ఇప్పుడు, అచ్యుతా! నీవు శాతింప వలయును.

బ్రాహ్మ:

యది నామ మయా సృష్టా భవన్తః కుటిలాశయాః,

తతః కిం మనుజాన్‌ నిత్యం భక్షయధ్వం గతవ్యధాః

బ్రహ్మ:

తప్పుడు భావములు గల నాగులారా! నేను మిమ్ములను సృజించినచో మీరు చీకును చింతయు లేక మనుజుల నేల నిత్యమూ తిను చున్నారు?

నాగులు:

మర్యాదాం కురు దేవేశ స్థానం చై పృథక్‌ పృథక్‌,

మనుష్యాణాం తథాస్మాకం సమయంచ పృథక్‌ పృథక్‌.

నాగులు:

దేవదేవా! మాకును మనుష్యులకు హద్దు లేర్పరపుము. వేరు వేరుగా ఉండు చోటులను ఏర్పరపుము. కట్టుబాటు చేయుము.

నాగానాం వచనం శ్రుత్వా దేవో వచన మబ్రవీత్‌,

అంత బ్రహ్మ ఆ నాగుల మాట విని యిట్లు పలికెను.

అహం కరోమి వో నాగాః సమయం మనుజైః సహ,

తదేకమనసః సర్వే శృణుధ్వం మమ శాసనమ్‌.

నాగులారా! మీకు మానవులతో ఒక కట్టడి చేసెదను. నా శాసనమును చెదరని మనస్సుతో వినుడు.

పాతాలం వితలం చైవ హర్మ్యఖ్యం చ తృతీయకమ్‌,

దత్తం చైవ సదారమ్యం గృహం తత్ర గమిష్యథ.

పాతాళము, వితలము, హర్మ్యము అను మూడు లోకములు ఎల్ల వేళల చూడ ముచ్చట గొలుపునవి మీకు నివాసముగా నిచ్చితిని. అచ్చటకు పొండు.

తత్ర భోగాన్‌ బహువిధాన్‌ భుజంగానా మమ శాసనాత్‌,

తిష్ఠద్వం సప్తమం యావద్‌ రాత్య్రన్తంతు పునఃపునః.

అచట నా ఆజ్ఞ వలన పెక్కు తీరులగు సుఖముల ననుభవించుచు ఏడు రాత్రుల వరకు ఉండుడు.

తతో వైవస్వతస్యాదౌ కాశ్యపేయా భవిష్యథ,

దాయాదాః సర్వదేవానాం సుపర్ణస్య చ ధీమతః.

అంత వైవస్వత మన్వంతరము ప్రారంభమున మరల మీరు కశ్యప ప్రజాపతికి పుత్రులగుదురు. దేవత లందరకును, బుద్ధి మంతుడగు గరుత్మంతునకును జ్ఞాతులుగా పుట్టుదురు.

తదా ప్రసూతి ర్వః సర్వా భోక్ష్యతే చిత్రభానునా,

భవతాం నైవ దోషోయం భవిష్యతి న సంశయః.

అప్పుడు నీ సంతానము అంతయు అగ్ని దేవునకు భోజన మగును. నీకీ శాపము తగులదు. సంశయము లేదు.

యే వై క్రూరాభోగినో దుర్వినీతాస్తేషామంతో భవితా నాన్యథైతత్‌,

కాలప్రాప్తం భక్షయధ్వం దశధ్వం తథాపకారే చ కృతే మనుష్యమ్‌.

క్రూరులు, చెడ్డ బుద్ధి గలవారు మీలో నుందురేని వారికి వినాశము తప్పదు. తిండి వేలకు దొరికిన మనుజులను, అపకారము చేసిన వారిని మాత్రము తిను చుండుడు.

మంత్రౌషధై ర్గారుడమండ లైశ్చబద్ధై ర్దుష్టై ర్మానవా యే చరంతి,

తేషాం భీతై ర్వర్తితవ్యం నచాన్యచ్చింత్యం కార్యం చాన్యథా వో వినాశః.

మంత్రములతో ఒషదులతో, గరుడ సంబంధమైన మండలములతో తిరుగు మానవులకు మీలో దుష్టులు చిక్కి పోవుదురు. వారి వలన మాత్రము మీరు భయముతో తిరుగుడు. ఇతర విధముల మీరు చింతింపబని లేదు. అట్లు గానిచో మీకు వినాశము తప్పదు.

ఇతీరితే బ్రహ్మణా తే భుజంగా జగ్ముఃస్థానం క్ష్మాతలాఖ్యం హి సర్వే,

తస్తు ర్భోగాన్‌ భుంజమానాః సమగ్రాన్‌ రసాతలే లీలయా సంస్థితా స్తే.

బ్రహ్మ ఇట్లు పలుకగా ఆ నాగు లందఱు క్ష్మాతల మను చోటి కరిగిరి. అందు విలాసముగా నివసించుచు నిండైన భోగము లనుభవించుచు నిలిచిరి.

ఏవం శాపం తు తేలబ్ధ్వా ప్రసాదం చ చతుర్ముఖాత్‌,

తస్తుః పాతాలనిలయే ముదితే నాంతరాత్మనా.

ఇట్లు బ్రహ్మ వలన వారు శాప మంది పిదప అనుగ్రహమును సంపాదించి మోదము గల భావములతో పాతాళ లోకమున నివసించిరి.

ఏతత్‌ సర్వంచ పంచమ్యాం తేషాం జాతం మహాత్మనామ్‌,

అత స్త్వియం తిథి ర్ధన్యా సర్వపాపహరా శుభ.

ఆ మహాత్ముల ఈ కథ యంతయు పంచమి నాడు జరిగెను. అందు అలన ఈ తిథి పుణ్య వంతమైనది. సర్వ పాపములను హరించునది, శుభ ప్రదమైనది.

ఏతస్యాం సంయతో యస్తు ఆవ్లుంతు పరివర్జయేత్‌,

క్షీరేణ స్నాపయే న్నాగాం స్తస్య యాస్యంతి మిత్రతామ్‌.

ఈ తిథి యందు నియమము గలవాడు పులుపు పరిహరింప వలయును. నాగులను పాలతో అభిషేకింప వలయును. అట్లయినచో వారికి మిత్రము లగుదురు.