వరాహ మహా పురాణము
అధ్యాయము - 12
శ్రీవరాహ దేవుడు:
తతః పుత్రం రథాఙ్గాగ్ని దగ్ధం శ్రుత్వా నృపోత్తమః,
సుప్రతీకః ప్రతీతాత్మా చింతయామాస పార్థివః,
తస్య చింతయత స్త్వేవం తదా బుద్ధి రజాయత.
అంతట సుప్రతీక మహారాజు విష్ణువు చేతి చక్రమునగ్నికి తన కొడుకు బూదియైన వార్త విని చింతించెను. అట్లు చింతించు చుండగా ఆతని కిట్లు బుద్ధి పొడమెను.
చిత్రకూటే గిరౌ విష్ణుః సదా రామేతి కీర్త్యతే,
తతోహం రామసంజ్ఞేన నామ్నా స్తౌమి జగత్పతిమ్.
చిత్రకూటమను పేరుగల పర్వతమున విష్ణువును రాముడను నామముతో జనులు కొని యాడుదురు. కావున నేను రామ నామముతో జగత్పతిని స్తుతించెదను.
సుప్రతీకుడు:
నమామి రామం నరనాథ మచ్యుతం కవిం పురాణం త్రిదశారినాశనమ్,
శివస్వరూపం ప్రభవం మహేశ్వరం సదా ప్రపన్నార్తిహరం ధృతశ్రియమ్.
సుప్రతీకుడు:
నరనాథుడు, అచ్యుతుడు, కవి, పురాతనుడు, రాక్షసులను రూపు మాపిన వాడు, మంగళ స్వరూపడు, సమర్థుడు, మహేశ్వరుడు, ఎల్ల వేళల శరణు పొందిన వారి ఆర్తిని పోకార్చు వాడు, లక్ష్మీ దేవికి ఆశ్రయమైన వాడు అగు శ్రీరామ చంద్రునకు మ్రొక్కెదను.
భవాన్ సదా దేవ సమస్త తేజసాం కరోషి తేజాంసి సమస్తరూపధృక్,
క్షితౌ భవాన్ పంచగుణ స్తథా జలే చతుః ప్రకార స్త్రివిధోథ తేజసి,
ద్విధాథ వాయౌ వియతి ప్రతిష్ఠితో భవాన్ హరే శబ్ద వపుఃపుమానసి.
ప్రభూ! నీవు వెలుగు లన్నింటికిని వెలుగుల నొసగు వాడవు. అన్ని రూపములను తాల్చు వాడవు, భూమి యందు అయిదు గుణములతో, నీట నాలుగు గుణములతో, నిప్పు నందు మూడు గుణములతో, గాలి యందు రెండు గుణములతో, గగనమున ఒక్క గుణముతో నెలకొని యుందువు. ఓ హరీ నీవు నాద మయమగు దేహము గల పురుషోత్తముడవు. (భూమి యందు~ శబ్ద స్పర్శ రూప రస గంధములు. నీటి యందు ~ శబ్ద స్పర్శ రూప రసములు, అగ్ని యందు ~ శబ్ద స్పర్శ రూపములు, గాలి యందు ~ శబ్ద స్పర్శములు, ఆకాశము నందు శబ్దము ~ అనునవి గుణములు).
భవాన్ శశీ సూర్య హుతాశనోసి త్వయి ప్రలీనం జగదేత దచ్యుతే,
భవత్ర్పతిష్ఠితం రమతే జగద్ యతః స్తుతోసి రామేతి జగత్ర్పతిష్ఠితమ్.
నీవు చంద్రుడవు, సూర్యుడవు, అగ్నివి, ఎందును, ఎప్పుడును నాశనము లేని నీయందు ఈ జగత్తంతయు లీనమై యున్నది. నీ యందు చెదరక నిలిచి యుండి ‘రమించు’ చున్నది కావుననే నిన్ను రాముడని కొని యాడుదురు. నీ వలననే జగత్తునకు ప్రతిష్ఠ యేర్పడు చున్నది.
భవార్ణవే దుఃఖతరోర్మిసంకులే తథాక్షమాస గ్రహణేతిభీషణే,
స మజ్జతి త్వత్స్మరణ ప్లవో నరః స్మృతోసి రామేతి తథా తపోవనే.
ఈ సంసార మొక మహా సముద్రము. అందు పెను దుఃఖములను అలలు ఎల్లవేళల చీకాకుగా ఎగిరిపడు చుండును. ఇంద్రియము లనెడు పెను మొసళ్లతో భరింపరాని భయము గొల్పు చుండును. అట్టి ఈ సముద్రమున నరుడు నిన్ను తల పోయుట అను తెప్పను గ్రహించి మునిగి పోవ కున్నాడు. అట్టి నిన్ను తపో వనము లందు తప స్సంపన్నులు ‘రామ’ అని నోరార కొని యాడుదురు.
వేదేషు నష్టేషు భవాం స్తథా హరే కరోషి మాత్స్యం వపురాత్మనః సదా,
యుగక్షయే రఞ్జిత సర్వ దిఙ్ముఖో భవాం స్తథాగ్ని ర్బహురూపధృగ్ విభో.
ప్రభూ! హరీ! నీవు వేదములను రక్కసులు కొనిపోయి నపుడు మత్స్య స్వరూపము ధరించితివి. యుగము ముగియు నపుడు దిక్కు లన్నింటిని ఎరు పెక్కించితిని. అట్టి అగ్ని స్వరూపుడగు నీవు బహు రూపములను ధరింతువు.
కౌర్మం తథా తే వపు రాస్థితః సదా యుగే యుగే మాధవ తోయమన్థనే,
న చాస్య దస్తీతి భవత్సమం క్వచిజ్జనార్దనాద్ యః స్వయం భూతముత్తమమ్.
మాధవా! ప్రతి యుగము నందును నీవు సముద్రమును చిలుకు నపుడు తాబేటి రూపుతాల్చి నిలుతువు. జనార్దనుడవగు నీకు సాటి వచ్చున దెందును లేదు. నీవే స్వయముగా ఉత్తమ భూతమవు.
త్వయా తతం విశ్వ మిదం మహాత్మన్ స్వకాఖిలాన్ వేద దిశశ్చ సర్వాః.
కథం త్వ మాద్యం పరమం తు ధామ విహాయ చాన్యం శరణం ప్రజామి.
మహాత్మా! ఈ విశ్వ మంతయు నీ తోడనే నిండి యున్నది. ఈ దిక్కు లన్నియు నీవే యని నీవే యెరుగుదువు. ఆద్యుడవు. పరంధాము డవునగు నిన్ను వదలి నేనెట్లు ఇతరుని శరణు కోరుదును?
భవా నేకః పూర్వ మాసీత్ తతశ్చ త్వత్తో మహీ సలిలం వహ్ని రుచ్చైః,
వాయు స్తథా ఖం చ మనోపి బుద్ధిశ్చేతోగుణా స్త్వత్ర్పభవం చ సర్వమ్.
ముందు నీ వొక్కడవే యుంటివి. ఆ పిమ్మట నీ నుండి పెద్ద పెట్టున భూమి, నీరు, నిప్పు, గాలి, నింగి అను అయిదు మహా భూతములు ఏర్పడినవి. అట్లే మనస్సు, బుద్ది, చిత్తము మొదలగు గుణము లన్నియు నీ నుండియే వెలువడినవి.
త్వయా తతం విశ్వ మిదం సమస్తం సనాతన స్త్వం పురుషో మతో మే,
సమస్త విశ్వేశ్వర విశ్వమూర్తే సహస్రబాహో జయ దేవ దేవ,
నమోస్తు రామాయ మహానుభావ.
ఈ విశ్వ మంతయు నీ చేతనే అల్లు కొనబడి యున్నది. నీవు సనాతనుడగు పురుషుడనని నా భావము. సమస్త విశ్వమునకు ప్రభువవగు ఓ విశ్వమూర్తీ! వేల హస్తములు గల దేవాది దేవా! నీకు జయము. రామా! మహానుభావా! నీకు నమస్కారము.
ఇతి స్తుతో దేవవరః ప్రసన్నః తదా రాజ్ఞః సుప్రతీకస్య మూర్తిమ్,
సందర్శయామాస తతోభ్యువాచ పరం వృణిష్వేతి చ సుప్రతీకమ్.
ఇట్లా సుప్రతీకుడు స్తుతింపగా దేవదేవుడు ప్రసన్నుడై సుప్రతీకునకు తన రూపమును చూపించెను. వరము కోరుకొమ్మని ప్రీతితో పలికెను.
ఏవం శ్రుత్వా వచనం తస్య రాజా ససంభ్రమం దేవదేవం ప్రణమ్య,
ఉవాచ దేవేశ్వర మే ప్రయచ్ఛ లయం యదాస్తే పరమం వపుస్తే.
అట్లు పలికిన విష్ణువు పలుకు విని సుప్రతీక మహారాజు తత్తర పాటుతో ప్రణమిల్లి దేవ దేవా! నాకు నీ దివ్య దేహమున లయ మగునట్లు వర మిమ్మని వేడు కొనెను.
ఇతీరితే రాజవరః క్షణేన లయం తథాగా దసురఘ్న మూర్తౌ,
స్థిత స్తస్మి న్నాత్మభూతో విముక్తః స భూమిపః కర్మకాణ్డౖ రనేకైః.
విష్ణువట్లు పలుకగా రాజు సుప్రతీకుడు వెను వెంటనే రాక్షస సంహారకుడగు విష్ణువు మూర్తిలో లీన మయ్యెను. ఆ రాజు పెక్కు కర్మ కాండముల నుండి విడివడి ఆత్మ భూతుడై యతనిలో నెలకొని యుండెను.
శ్రీవరాహ దేవుడు:
ఇతీరితం తేతు మయా పురాణం స్వాయంభువే చాది కృతైక దేశమ్,
శక్యం న చాస్యైర్బహుభిః సహస్రై రహీహ కేనాపి ముఖేన వక్తుమ్.
శ్రీవరాహ దేవుడు:
ఇట్లు నేను స్వాయంభువ మన్వంతరము నందలి మొదటి కృత యుగము నాటి పురాణ కథను కొంత భాగము చెప్పితిని. వేయి నోళ్లు గలవాడైన వాడు కూడ దీనిని పూర్తిగా చెప్పలేడు.
ఉద్దేశతః సంస్కృతమాత్ర మేత న్మయా భద్రే కథితం పురాణమ్,
సముద్రతోయాత్ పరిమాణసృష్టిః క్వచిత్ క్వచిద్ వృత్తమథోహ్యనర్ఘ్యమ్.
భూదేవీ! నాకు గుర్తునకు వచ్చినంత మాత్రము సూచనగా నీకు పురాణ కథను చెప్పితిని. సముద్ర జలము నుండి పాత్రల ప్రమాణమును బట్టి మాత్రమే కదా నీరు తీసి కొనుటకు వీలగును. అట్లే ఎంతో విలువ గల ఆ చరిత్రలో అక్కడక్కడ తడవితిని.
స్వయంభూవా కథితం బ్రహ్మణాపి నారాయణేనాపి కుతో భవేన్యః,
అశక్య మస్మాభి రితీరితం తే తన్మూర్తిత్వాత్ స్మరణే నేద మాద్యమ్.
తనంత తానుదయించిన బ్రహ్మయు, శ్రీమన్నారాయణుడు దీనిని వివరించి చెప్పిరి. భూమిపై మరియెవ్వడు చెప్ప గలడు? నాకును ఇది అశక్యమే. కాని ఆ నారాయణుని ఒక అంశము నగుట వలన ఏదో స్మరణకు తెచ్చుకొని నీకు చెప్ప గలిగితిని.
సముద్రే వాలుకా సంఖ్యా విద్యతే రజసః క్షితౌ,
నతు సృష్టేః పునః సంఖ్యా క్రీడతః పరమేష్ఠినః.
సముద్రమున ఇసుక రేణువుల లెక్కయు, భూమి యందలి దుమ్ము కణముల లెక్కయు తెలియ రావచ్చును. అటుగా చేయుచున్న బ్రహ్మ సృష్టి యొక్క లెక్క తెలియ శక్యము కాదు.
ఏష నారాయణస్యాంశోమయా ప్రోక్తః శుచిస్మితే,
కృతే వృత్తాంత ఏషశ్చ కిమస్య చ్ఛ్రోతు మిచ్ఛసి.
మనోజ్ఞమగు నగవు గల భూదేవీ! ఇది నారాయణుని ఒక అంశము. దీనిని నేను నీకు చెప్పితిని. ఇది కృత యుగమున జరిగిన వృత్తాంతము. ఇటుపై నీవేమి విన గోరుదువు?