అధ్యాయము - 81

రుద్రుడు:

అతః పరం పర్వతేషు దేవానా మవకాశా వర్ణ్యన్తే,

తత్రయోసౌ శాంతాఖ్యః పర్వతస్యోపరి మహేన్ద్రస్య క్రీడాస్థానమ్‌.

తత్ర దేవరాజస్య పారిజాతక వృక్షవనమ్‌.

తస్య పూర్వపార్శ్వే కుంజరో నామ

గిరిఃతస్యోపరి దానవానా మష్టౌ పురాణి చ.

రుద్రుడు:

ఇటుపై పర్వతము లందలి దేవతల స్థానములను వివరింతును. అందు ‘శాంతము’ అను పేరు గల దేవేంద్రుని క్రీడా స్థలము కలదు. అది మహేంద్ర గిరిపై భాగమున నున్నది. అందు దేవతల రాజు ఇంద్రుని పారిజాతక వృక్షముల తోట కలదు. దాని తూర్పు భాగమున కుంజరమను కొండయు, దానిపై దానవుల ఎనిమిది పురములను కలవు.

తేచ నామ్నా నీలకాః కామరూపిణః

మహానీలోపి శైలేంద్రపురాణి.

పంచదశ సహస్రాణి కిన్నరాణాం ఖ్యాతాని.

పంచదశకిన్నరాణాం గర్వితాః.

తాని సౌవర్ణాని బిలప్రవేశనాని చ పురాణి.

తత్ర దేవదత్త చంద్రాదయో రాజానః.

నీలకములు, కామ రూపులు మొదలగునవి వాని పేర్లు. మహా నీలమనియు ఇవి పర్వతములపై నున్న పురములు. కిన్నరుల పురములు పదునైదు వేలు ప్రసిద్ధి కెక్కినవి. దేవదత్తుడు, చంద్రుడు మొదలగు వారు కిన్నరుల రాజులు. పదునైదుగురు గర్వితులు. కలుగులు ప్రవేశముగా గలవారి పురములు స్వర్ణ మయములు.

చంద్రోదయే చ పర్వతవరే నాగానా మధివాసః

తేచ బిలప్రవేశాః బిలేషు వైనతేయ విషయావర్తినో

 వ్యవస్థితానురాగే చ దానవేంద్రా వ్యవస్థితాః.

చంద్రోదయమను గొప్ప పర్వతము నాగులకు నివాస భూమి. రంధ్రములలో ప్రవేశించు ఆ నాగులు ఆ రంధ్రములలో గరుత్మంతునకు దొరకక తిరుగు చుందురు. అనురాగమను పర్వతమున రాక్షసేంద్రులు నివసింతురు.

వేణుమత్యపి విద్యాధర పురత్రయమ్‌.

త్రింశద్యోజన శతవిస్తీర్ణ మేకైకం తావదాయతనమ్‌.

ఉలూక రోమశ మహావేత్రాదయశ్చ రాజానో విద్యాధరాణామ్‌.

ఏకైకే చ శైలరాజని స్వయమేవ గరుడో వ్యవస్థితః.

వేణుమంతమను పర్వతమున విద్యాధరుల మూడు పురములు కలవు. ఒక్కొక్కటి ముప్పది ఆమడల వైశాల్యము కలిగినది. ఉలూకుడు, రోమశుడు, మహావేత్రుడు మొదలగు వారు విద్యాధరుల రాజులు. ఒక్కొక్క పర్వత రాజమున స్వయముగా గరుడుడు నివసించి యుండును.

కుంజరే తు పర్వతవరే నిత్యం పశుపతిః స్థితః,

వృషభాంకో మహాదేవః శంకరో యోగినాం వరః.

కుంజరమను ప్రసిద్ధి గల కొండపై పశుపతి, వృషభము గుర్తుగా గలవాడు, మహా దేవుడు, యోగులలో శ్రేష్ఠుడు అగు శంకరుడు నిత్యము నివసించును.

అనేక గణభూత కోటి సహస్ర వారో

భగవాన్‌ అనాది పురుషో వ్యవస్థితః.

పెక్కు గణములుగా గల భూతలముల సముదాయములు వేలకొలదిగా సేవించెడు భగవానుడు అనాది పురుషుడు శంకరుడందు కాపుర ముండును.

వసుధారే చ పుష్పవతాం వసూనాం చ సమావాసః

వసుధార రత్నధారయో ర్మూర్ధ్ని అష్టౌ సప్త చ సంఖ్యయా

పురాణి వసుసప్తర్షీణాం చేతి.

వసుధారము పుష్పవంతులగు వసువుల నెలవు. వసుధార రత్నధార పర్వతముల శిఖరముపై ఎనిమిది, ఏడు సంఖ్యలు గల పురములు అష్ట వసువులకు, సప్తర్షులకు సంబంధించినవి కలవు.

ఏక శృంగేచ పర్వతోత్తమే ప్రజాపతేః స్థానం చతుర్వక్త్రస్య బ్రహ్మణః.

గజపర్వతే చ మహాభూత పరివృతా స్వయమేవ భగవతీ తిష్ఠతి.

వసుధారే చ పర్వతవరే మునిసిద్ధవిద్యాధరాణా మాయతనమ్‌.

చతురాశీత్యపర పుర్యో మహాప్రాకారతోరణాః.

తత్ర చానేకపర్వతా నామ గంధర్వా యుద్ధశాలినో వసన్తి.

తేషాం చాధిపతి ర్దేవో రాజరాజైక పిఙ్గలః.

ఏక శృంగమను పర్వతమున భగవంతుడగు చతుర్ముఖుని స్థానము కలదు. గజ పర్వతమున మహా భూతములు కొలిచి యుండగా భగవతియే స్వయముగా నెలకొని యున్నది. వసుధారము అను పర్వతము మునులు, సిద్ధులు, విద్యాధరులు అను వారి నెలవు. గొప్ప ప్రాకారములు తోరణములు గల ఎనుబది నాలుగు పురములు అందు గలవు. అచట అనేక పర్వతులను గంధర్వులు యుద్ధములు చేయుటలో ఆరితేరిన వారు నివసింతురు. వారి అధిపతి రాజరాజగు ఏక పింగళుడు. (కుబేరుడు)

సురరాక్షసాః పఞ్చకూటే దానవాః

శతశృఙ్గే యక్షాణాం పురశతమ్‌.

తామ్రాభే తక్షకస్య పురశతమ్‌.

విశాఖపర్వతే గుహస్యాయతనమ్‌.

శ్వేతోదయే గిరివరే గరుడపుత్రస్య సునాభస్యావాసః.

పిశాచకే గిరివరే మహాగంధర్వభవనమ్‌.

పంచకూటమున సురలయు, రాక్షసులయు, శత శృంగమున దానవులయు, యక్షులయు నూరేసి పురములు కలవు. తామ్రాభమున తక్షకుని నూరు పురములు, విశాఖ పర్వతమున గుహుని నివాసము కలవు. శ్వేతో దయమను గిరవర మందు గరుడుని పుత్రుడగు సునాభుని నివాసము, పిశాచకమను గిరివరమున మహా గంధర్వుల భవనము కలవు.

హరికూటే హరిర్దేవః.

కుముదే కిన్నరావాసః. అంజనేమహోరగాః.

కృష్ణే గంధర్వనగరమ్‌.

విద్యాధర పురాణిచ సప్త శోభితాని.

సహస్రశిఖరే చ దైత్యానా ముగ్రకర్మిణా మావాసః.

హరి కూటమున హరి దైవము. కుముదమున కిన్నరుల నెలవు, అంజనమున మహా సర్పములు, కృష్ణమున గంధర్వ నగరము, విద్యాధరుల పురములు ఏడు అలరారు చున్నవి. సహస్ర శిఖరమున భయంకర చేష్టలు గల దైత్యుల నివాసములు కలవు.

పురాణాం సహస్రమేకం హేమమాలినాం ముకుటే,

పన్నగోత్తమాః వివస్వతస్తు సోమస్య వాయోర్నాగాధి

పస్య చ ప్రపక్షే పర్వతవరే చత్వార్యాయతనానితు.

ఏవం మేరుపర్వతేషు దేవానా మధివాసః.

హేమమాలి పర్వతముల యందు ఒక వేయి పురములు కలవు. అందు శిఖరమున పాముల రాజు లుందురు. ప్రపక్షమను పర్వత వరమున వివస్వంతుడు, సోముడు, వాయువు, నాగరాజు అనువారి భవనములు నాలుగు కలవు. ఈ విధముగా మేరు పర్వతముల యందు దేవతల నివాసము లున్నవి.

మర్యాదాపర్వతే దేవకూటే పురవిన్యాసః కీర్త్యతే.

తస్యోపరి యోనశతం గరుడస్య జాతం క్షేత్రమ్‌.

తస్యైవ పార్మ్వత స్త్రింశద్యోజనవిస్తీర్ణా

శ్చత్వారింశ దాయతాః సప్త గంధర్వ నగరాః.

ఆగ్నేయాశ్చ నామ్నా గంధర్వాతిబలినః.

మర్యాదా పర్వతమున దేవ కూటమున పురముల స్థితిని తెలుపు చున్నాను. దానిపై నూరు యోజనముల మేర గరుడుని స్థాన మేర్పడి యున్నది. దాని ప్రక్క భాగముననే ముప్పది ఆమడల వెడల్పు, నలుబది ఆమడల పొడవు గల ఏడు గంధర్వ నగరములు కలవు. అచటి గంధర్వులు ఆగ్నేయు లనువారు. గొప్ప బలము కలవారు.

తత్ర చాన్యత్‌ త్రింశ ద్యోజన మండలం పురం సైంహికే యానామ్‌.

తత్ర చ దేవర్షిచరితాని దేవకూటే దృశ్యన్తే.

పురం చ కాలకేయానాం తత్రైవ.

తస్యైవ దక్షిణే త్రింశ ద్యోజన విస్తృతం ద్విషష్టి

యోజనాయామం పురం కామరూపిణాం దృప్తానామ్‌.

మధ్యమే చ తస్య హేమకూటే మహాదేవస్య న్యగ్రోధః.

అందు మరియొక పురము సైంహికేయులది ముప్పది యోజనముల మండలము కలదు. అందు దేవర్షులు దేవ కూటమున తిరిగెడు తావులు కాన వచ్చును. కాలకేయుల పురము కూడ అందే కలదు. దానికి దక్షిణమున ముప్పది యోజనముల వెడల్పు అరువది రెండు యోజనముల పొడవు గల మహా గర్వము గల కామరూపుల పురము కలదు. హేమ కూటము నడుమ మహాదేవుని రావి చెట్టు కలదు.

అధాతః కైలాసవర్ణకో భవతి.

కైలాసస్య తటే యోజనశత మాయామ విస్తృతం భువనమాలాభివ్యాప్తమ్‌.

తస్యాశ్చ మధ్యే సభా. తత్ర చ తత్పుష్కరం నామ విమానం తిష్ఠతి.

ధనదస్య చ తద్విమాన మధివాసశ్చ.

తత్ర పద్మ మహాపద్మ మకర కచ్ఛపకుముదశంఖ

నీలనంద మహానిధయః ప్రతివసన్తి.

తత్ర చంద్రాదీనాం లోకపాలానా మావాసః. తత్ర చ మందాకినీ నామ నదీ.

తథా కనకమందా మందా చేతి నామభిః సరితః.

తత్రాన్యా అపి నద్యః సన్తి.

ఇటుపై కైలాస వర్ణనము. కైలాసము ఒడ్డున నూరామడల పొడవు వెడల్పులు గల భువన పంక్తి వ్యాపించి యున్నది. దాని నడుమ సభ. అందే పుష్కరమను విమానము కలదు. అదే కుబేరునిది. అదియే అతని నివాస స్థలము. అందు పద్మము, మహా పద్మము, మకరము, కచ్ఛపము, కుముదము, శంఖము, నీలము, నందము అను మహా నిధులు కలవు. అందు చంద్రుడు మొదలగు లోక పాలుర నివాసములును ఉన్నవి. అందే మందాకిని, కనకమంద, మంద అను నదులు, మరియు ఇతర నదులు కలవు.

పూర్వ పార్శ్వే చ శతయోజనాయామ స్త్రింశద్యోజన విస్తృతా దశగంధర్వపుర్యః

తాసుచ సుబాహు హరికేశ చిత్రసేనాదయో రాజానఃతస్యైవ చ పశ్చిమకూటే

అశీతి యోజనాయామం చత్వారింశ ద్విస్తృత మేకైకం యక్షనగరమ్‌.

తేషుచ మహామాలి సునేత్ర చక్రాదయో నాయకాః.

తూర్పు పార్శ్వమున నూరామడల పొడవు, ముప్పది ఆమడల వెడల్పు గల పది గంధర్వ నగరులు కలవు. అందు సుబాహువు, హరికేశుడు, చిత్రసేనుడు మొదలగు వారు రాజులు. దాని పడమటి శిఖరమున ఒక్కొక్కటి ఎనుబది యోజనముల పొడవు, నలువది యోజనముల వెడల్పు గల యక్ష నగరములు కలవు. అందు మహామాలి, సునేత్రుడు, చక్రుడు మొదలగు వారు నాయకులు.

తస్యైవ దక్షిణే పార్శ్వే కుంజదరీషు గుహాసు సముద్రాః.

సముద్రం యావత్‌ కిన్నరాణాం పురశతమ్‌.

తేషు చ ద్రుమసుగ్రీవాది భగదత్త ప్రముఖం రాజశతమ్‌.

తత్ర చ రుద్ర స్యోమయా సార్థం వివాహ స్సంవృత్తః.

తపశ్చ కృతవతీ గౌరీ. కిరాతరూపిణా చ రుద్రేణ స్థితమ్‌.

తత్రైవ తత్ర స్థితేన సోమేన శంకరేణ జంబూద్వీపావ లోకనం కృతమ్‌.

తత్ర చానేకకిన్నర గంధర్వోపగీత ముమావనం

నామాప్సరోభి రనేక పుష్పలతావల్లరీభి రుపేతమ్‌.

యత్ర భగవతా మహేశ్వరేణార్ధనారీనరవపుః ప్రాప్తమ్‌.

దాని దక్షిణ పార్శ్వమున పొదలు గల చరియలు గల గుహల యందు సముద్రములు కలవు. సముద్ర ములనగా కిన్నరుల నూరు ఇండ్లు. వాని యందు ద్రుమ, సుగ్రీవ, భగదత్త ప్రముఖులగు రాజులు నూరుగురు కలరు. అందే రుద్రునకు ఉమాదేవితో వివాహము జరిగినది. గౌరియు అందే తపస్సు చేసినది. అందుండియే శంకరుడు ఉమాదేవితో పాటు జంబూ ద్వీపమును చూచెను. అందు పెక్కండ్రు కిన్నరులు, గంధర్వులు గానములు చేయు ఉమా వనము కలదు. అందు పెద్ద సంఖ్యలో అప్సరసలు, పూల తీవెలు కలవు. అందే భగవంతుడగు రుద్రుడు అర్ధనారీనర రూపమును పొందెను.

తత్ర చ కార్తికేయస్య శరద్వనమ్‌.

పుష్పచిత్ర క్రౌంచయో ర్మద్యే కార్తికేయాభిషేకః కృతః.

తస్య చ పూర్వతటే సిద్ధమునిగణావాసః కలాపగ్రామో నామ.

తథా చ మార్కండేయవసిష్ఠ పరాశర నలవిశ్వా మిత్రోద్దాల

కాదీనాం మహర్షీణా మనేకాని సహస్రాణ్యాశ్రమాణాం హి భవతి.

అందు మరియు కార్తికేయుని (కుమార స్వామి) శరద్వనము కలదు. పుష్ప చిత్రము, క్రౌంచము అనువాని మధ్య కార్తికేయుని అభిషేకము జరిగెను. దాని తూర్పు ఒడ్డున సిద్ధులయు, ముని గణములయు నివాస మగు కలాపమను గ్రామము కలదు. అట్లే మార్కండేయుడు, వసిష్ఠుడు, పరాశరుడు, నలుడు, విశ్వామిత్రుడు, ఉద్దాలకుడు మొదలగు మహర్షుల వేల ఆశ్రమములు కలవు.

తథా చ పశ్చిమస్యాచలేన్ద్రస్య నిషధస్య భాగం శృణుత.

తస్య చ మధ్యమ కూటే విష్ణ్వాయతనం మహాదేవస్య.

తస్యైవోత్తరతటే త్రింశద్యోజన విస్తృతం

మహత్పురం లంబాఖ్యాతం రాక్షసానామ్‌.

తస్యైవ దక్షిణే పార్శ్వే బిలప్రవేశ నగరమ్‌.

మరియు, పడమటి దిక్కున నున్న నిషధ పర్వత భాగమును గూర్చి వినుడు. దాని మధ్య శిఖరమున మహా దేవుని విష్ణ్వాలయము కలదు. దాని ఉత్తరపు ఒడ్డున ముప్పది ఆమడల వైశాల్యము కల ‘లంబ’ అను పేరుగల రాక్షస పురము కలదు. దాని దక్షిణ పార్శ్వమున బిల ప్రవేశ నగరము ఉన్నది.

ప్రభేదకస్య పశ్చిమేన దేవదానవ సిద్ధాదీనాం పురాణి.

తస్య గిరే ర్మూర్ధ్ని మహతీ సోమశిలా తిష్ఠతి.

తస్యాం చ పర్వణి సోమః స్వయ మేవావతరతి.

తస్యై వోత్తరపార్శ్వే త్రికూటం నామ.

తత్ర బ్రహ్మా తిష్ఠతి క్వచిత్‌. తథాచ వహ్న్యాయతనమ్‌.

మూర్తిమాన్‌ వహ్ని రుపాస్యతే దేవైః.

ప్రభేదకమను కొండకు పడమరగా దేవ దానవ సిద్ధాదుల పురములు కలవు. ఆ గిరి కొమ్మున పెద్ద సోమశిల కలదు. దాని యందు పర్వమున (పూర్ణిమ దినము) చంద్రుడు స్వయముగా అవతరించును. దాని ఉత్తర పార్శ్వమున త్రికూటమను పర్వతము కలదు. అందు అప్పుడప్పుడు బ్రహ్మ ఉండును. మరియు అది అగ్నిదేవుని ఆలయము. రూపుగొన్న అగ్ని దేవుని అచట దేవతలు ఉపాసింతురు.

ఉత్తరేచ శృంగాఖ్యే పర్వతవరే దేవతానా మాయతనాని.

పూర్వే నారాయణ స్యాయతనమ్‌. మధ్యే బ్రహ్మణః,

శంకరస్య పశ్చిమే. తత్ర చ యక్షాదీనాం కేచిత్‌ పురాణి.

తత్ర చోత్తరతీరే జాతుభే మహాపర్వతే త్రింశద్యోజన

మండలం నందజలం నామ సరః.

తత్ర నందో నామ నాగరాజా వసతి శతశీర్ష ప్రచండ ఇతి.

శృంగము అను ఉత్తర దిక్కు నందలి పర్వతమున దేవతల భవనములు కలవు. తూర్పున నారాయణుని ఆలయము. మధ్య బ్రహ్మ దేవునిది. పడమటి దిక్కున శంకరునిది మరియు అందు యక్షాదుల పురములు కొన్ని కలవు. దాని ఉత్తరపు తీరమున నున్న జాతు భమను పర్వతమున ముప్పది ఆమడల మండలముల నంద జలమను సరస్సు కలదు. అందు నందుడను నాగరాజు నూరు తలలవాడు, ప్రచండుడు ఉండును.

ఇత్యే తేష్టౌ దేవపర్వతా విజ్ఞేయాః. తేనానుక్రమేణ

హేమ రజత రత్న వైడూర్యమనఃశిలా హింగులాది వర్ణాః.

ఇయం చ పృథ్వీ లక్షకోటి శతానేక సంఖ్యాతానాం పూర్ణా.

తేషు చ సిద్ధ విద్యా ధరాణాం నిలయాః.

తే చ మేరోః పార్శ్వతః కేసరవలయాలవాలం సిద్ధలోకేతి కీర్త్యతే.

ఈ విధముగా ఈ ఎనిమిది దేవ పర్వతములు తెలియ దగినవి. వరుసగా బంగారము, వెండి, రత్నము, వైడూర్యము, మణిశిల, హింగుళము మొదలగు వర్ణములు వానికి కలవు. (హింగుళము = ఇంగిలీకము). ఈ భూమి నూరు లక్షల కోట్ల జనముతో నిండినది. వాని యందు సిద్ధులు, విద్యాధరులు మొదలగు వారి నివాసములు కలవు. మేరువు ప్రక్కగా నున్న కేసర వలయముల పాదువంటి ఆ నిలయముల నన్నింటిని కలిపి సిద్ధ లోకమని చెప్పుదురు.

ఇయం పృథ్వీ పద్మాకారేణ వ్యవస్థితా, ఏషచ

సర్వపురాణేషు క్రమః సామాన్యతః ప్రతిపాద్యతే.

ఈ భూమి పద్మము ఆకారముతో నెలకొని యున్నది. ఇది అన్ని పురాణముల యందును సాధారణముగా చెప్పబడు విషయము.