అధ్యాయము - 30

మహాతపుడు:

శృణు చాన్యాం వసుపతే రుత్పత్తిం పాపనాశినీమ్‌,

యథా వాయుః శరీరస్థో ధనదః సంబభూవ హ.

మహాతపుడు:

రాజా! పాపములను పోకార్చు మరియొ కథ వినుము. అది వసుపతికి సంబంధించినది (వసుపతి - ధనములకు అధిపతి - కుబేరుడు) బ్రహ్మ శరీరమున నున్న వాయువు, కుబేరుడుగా ఎట్లు పుట్టెనో చెప్పెదను.

ఆద్యం శరీరం యత్‌ తస్మిన్‌ వాయు రన్తఃస్థితోభవత్‌,

ప్రయోజనా న్మూర్తిమత్త్వమాదిష్టం క్షేత్రదేవతా.

వాయువు మొదట మొదటి దగు దేహమున నుండెను. ఆ క్షేత్రమున కధిష్ఠాన దేవత ఒక పని కొరకు వాయువునకు ఆకారము కలుగునట్లు ఆదేశించెను.

తత్ర మూర్తస్య వాయోస్తు ఉత్పత్తిః కీర్త్యతే మయా,

తాం శృణుష్వ మహాభాగ కథ్యమానాం మయానఘ.

అట్లు ఆకారము పొందిన వాయువు ఉత్పత్తి ఎట్లు జరిగెనో నేను వివరించు చున్నాను. పుణ్యాత్మా! నేను చెప్పుచున్న ఆ ఉత్పత్తి నాలకింపుము.

బ్రహ్మణః సృష్టికామస్య ముఖాద్‌ వాయు ర్వినిర్యయౌ,

ప్రచండ శర్కరావర్షీ తం బ్రహ్మా ప్రత్యషేధయత్‌,

మూర్తో భవస్వ శాన్తశ్చ తత్రోక్తో మూర్తిమాన్‌ భవత్‌.

సృష్టి చేయగోరు బ్రహ్మ ముఖము నుండి మిక్కిలి తీవ్రమగు గులక రాలను వర్షించుచు వాయువు వెలువడెను. బ్రహ్మ వానిని నిలువరించెను. ఆకారము పొందుము. శాంతింపుము. అని బ్రహ్మ పలుకగా వాయువు ఆకారము ధరించెను.

సర్వేషాం చైవ దేవానాం యద్‌ విత్తం ఫలమేవచ,

తత్సర్వం పాహి యేనోక్తం తస్మాద్‌ ధనపతి ర్భవత్‌.

దేవత లందరకు గల ధనమును, వారార్జించిన ఫలమును అంతటిని నీవు రక్షింపుము. అని బ్రహ్మ పలుకగా వాయువు ధనపతి అయ్యెను.

తస్య బ్రహ్మా దదౌ తుష్ట స్తిథి మేకాదశీం ప్రభుః,

తస్యా మనగ్ని పక్వాశీ యో భవేన్నియతః శుచీ.

తస్యాశు ధనధో దేవ స్తుష్టం సర్వం ప్రయచ్ఛతి,

ఏషా ధనపతే ర్మూర్తిః సర్వకిల్బిష నాశినీ.

బ్రహ్మ సంతృప్తి పడి ఆ కుబేరునకు ఏకాదశి తిథిని కల్పించెను. ఆ తిథి యందు అగ్నితో వండని పరార్థములను భుజించుచు నిష్ఠతో కూడిన పరిశుద్ధునకు కుబేరుడు తృప్తుడై కోరినదెల్ల ఒసగును. ఈ ధనపతి రూపము పాపము లన్నింటిని పటాపంచలు చేయును.

య ఏతాం శృణుయాద్‌ భక్త్యా పురుషః పఠతేపి వా,

సర్వకామ మవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి.

ఈ కథను భక్తితో విను వాడును, చదువు వాడను, కోరిన కోర్కెలనెల్ల పొందును. స్వర్గ లోకమున కరుగును.