వరాహ మహా పురాణము
అధ్యాయము - 111
హోత:
అతః పరం మహారాజోభయముఖ్యాః సమాసతః,
విధానం యద్ వరాహేణ ధరణ్యాః కథితం పురా,
తదహం సంప్రవక్ష్యామి తవ పుణ్యఫలం చ యత్.
హోత:
మహారాజా! ఇటుపై వరాహ దేవుడు భూదేవికి మునుపు చెప్పిన ఉభయ ముఖ్యములగు ధర్మములను చెప్పెదను. అది నీపుణ్య ఫలమును అగును. (ఉభయములు = పరము, ఇహము.)
ధరణి:
యా త్వయా కపిలా నామ పూర్వముత్పాదితా ప్రభో,
హోమధేనుః సదా పుణ్యా సా జ్ఞేయా కతిలక్షణా.
ధరణి:
ప్రభూ! నీవు మునుపు కపిలను సృజించితివి. ఆ హోమ ధేనువు ఎల్లవేళల పుణ్య అయినదిగా తెలియ దగినది. దానికెన్ని లక్షణములు?
కియత్యః కపిలాః ప్రోక్తాః స్వయమేవ స్వయంభువా,
ప్రసూయమానా దానేన కింపుణ్యా స్యాచ్చ మాధవ,
ఏత దిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ జగద్గురో!
ఓ జగద్గురూ! మాధవా! స్వయంభువు స్వయముగా ఎన్ని విధములగు కపిల గోవులను వక్కాణించెను? ఈను చున్న కపిలను దానము చేయుట వలన కలుగు పుణ్య మెట్టిది? దీనిని సవిస్తరముగా వినగోరు చున్నాను.
శ్రీవరాహ దేవుడు:
శృణుష్వ భద్రే తత్త్వేన పవిత్రం పాపనాశనమ్,
యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః.
శ్రీవరాహ దేవుడు:
భద్రురాలా! తత్త్వ పూర్వకముగా చెప్పెదను. వినుము. ఇది పవిత్ర మైనది. పాపములను నశింప జేయునది. దీనిని విని సర్వ పాపముల నుండియు మానవుడు ముక్తుడగును. సంశయము లేదు.
కపిలా అగ్నిహోత్రార్థే యజ్ఞార్థే చ వరాననే,
ఉద్ధృత్య సర్వతేజాంసి బ్రహ్మణా నిర్మితా పురా.
వరాననా! అగ్ని హోత్రము కొరకును, యుజ్ఞము కొరకును సర్వ తేజస్సులను పైకి తెచ్చి బ్రహ్మను మునుపు కపిలను సృజించెను.
పవిత్రాణాం పవిత్రంచ మంగలానాం చ మంగలమ్,
పుణ్యానాం పరమం పుణ్యం కపిలా చ వసుంధరే!
వసుంధరా! కపిల పవిత్రములలో పవిత్రము. మంగళము లలో మంగళము. పుణ్యములలో పుణ్యము.
తపసాం తప ఏనాగ్రం వ్రతానా ముత్తమం వ్రతమ్,
దానానా ముత్తమం దానం నిధీనాం హ్యేత దక్షయమ్.
తపస్సులలో మిన్నయగు తపస్సు, వ్రతములలో ఉత్తమమగు వ్రతము. దానములలో ఉత్తమమగు దానము. నిధులలో ఇది తరుగు పోనిది.
పృథివ్యాం యాని తీర్థాని గుహ్యా న్యాయతనాని చ,
పవిత్రాణి చ పుణ్యాని సర్వలోకేషు సుందరి.
భూమి యందు గల సర్వ తీర్థములతో, అందరకు తెలియ రాకుండు పవిత్ర స్థలములతో, సర్వ పవిత్రములతో, సర్వ లోకముల పుణ్యములతో ఇది సాటి యగును.
హోతవ్యా న్యగ్నిభోత్రాణి సాయంప్రాత ర్ద్విజాతిభిః,
కపిలాయ ఘృతేనేహ దధ్నా క్షీరేణ వా పునః.
బ్రాహ్మణులు సాయం కాలములలో ప్రాతః కాలములలో చేయు అగ్ని హోత్రములను కపిల గోవు నేతితో గాని పెరుగుతో గాని పాలతో గాని అర్చింప వలయును.
జుహ్వతే హ్యగ్నిహోత్రాణి మన్త్రైశ్చ వివిధైః సదా,
పూజయ న్నతిథీంశ్చైవ పరాం భక్తి ముపాగతాః,
తే యా న్త్యాదిత్యవర్ణైశ్చ విమానై ర్ద్విజసత్తమాః.
పెక్కు విధములగు మంత్రములతో ఎల్లవేళల అగ్ని హోత్రములను పూజించు వారును, మిక్కిలి భక్తితో అతిథులను అర్చించు వారును అగు ఉత్తమ బ్రాహ్మణులు సూర్యుని వంటి వన్నె కల విమానములతో విహరింతురు.
సూర్యమండలమధ్యేన బ్రహ్మణా నిర్మితా పురా,
కపిలా యా పింగలాక్షీ సర్వసౌఖ్యప్రదాయినీ,
సిద్ధిబుద్ధిప్రదా ధేనుః కపిలానన్తరూపిణీ.
మునుపు బ్రహ్మ సూర్య మండలము నడుమ, గోరోచనము రంగు కన్నులు గలదియు, సర్వ సౌఖ్యములను ప్రసాదించు నదియు, సిద్ధి బుద్ధుల ననుగ్రహించు నదియు, అనంత రూపములు గలది యునునగు కపిల ధేనువును నిర్మించెను.
ఏకాదశీ సమాఖ్యాతాః కపిలాస్తే వరాననే,
సర్వహ్యేతా మహాభాగా స్తారయన్తి నసంశయః,
సంగమేషు ప్రశస్తాశ్చ సర్వపాపప్రనాశినీః.
వరాననా! ఈ కపిలలు పదునొకండు విధములు. ఇవి యన్నియు గొప్ప మహిమ కలవి. తరింప జేయునవి. సంశయము లేదు. నదీ సంగమములలో దానములకు ప్రశస్తము లయినవి. పాపముల నన్నింటిని పోకార్చునవి.
అగ్నిపుచ్ఛా అగ్నిముఖా అగ్నిలోమానలప్రభా,
తధాగ్నేయీ సదా దేవీ సువర్ణాఖ్యా ప్రవర్తతే.
అగ్ని పుచ్ఛ (అగ్ని వంటి తోక కలది.) అగ్ని ముఖ (అగ్ని వంటి ముఖము కలది.) అగ్ని లోను (అగ్ని వంటి వెంట్రుకలు కలది), అనల ప్రభ (అగ్ని వంటి కాంతి గలది) ఆగ్నేయి (అగ్ని లక్షణములు కలది) సువర్ణాఖ్య (బంగారు వంటి వన్నె కలది.) అని కపిలలో పెక్కు విధము లైనవి కలవు.
గృహీత్వా కపిలాం శూద్రః కామతః సదృశీం పిబేత్,
అతీతః సద్విజాతీనాం చండాలసదృశోహి సః.
కపిలను కైకొని ఇష్టము వచ్చినట్లు పాలు పిండుకొని త్రావు శూద్రుడు ద్విజు లందరకు పనికి రానివాడు. అతడు చండాల సదృశుడు.
తస్మాన్నప్రతిగృహ్ణీయా చ్ఛూద్రాద్విప్రః ప్రతిగ్రహమ్,
దూరతః పరిహర్తవ్యాః శ్వానస్తు క్షమినాం వరే.
కావున శూద్రుని నుండి విప్రుడు కపిల గోవులను దానము పుచ్చుకొన రాదు. వానిని కుక్కలను వలె దూరముగా తొలగించ వలయును.
సర్వకాలేహి సర్వేవై వర్జితాః పితృదైవతైః,
అసంభాష్యాప్రతిగ్రాహ్యాః శూద్రాస్తే పాపకర్మిణః.
ఆ విధముగా కపిలలను పీకుకొని బ్రదుకు పాపకర్ములగు శూద్రులను సర్వ సమయములలో విడిచి పెట్టవలయును. వారితో మాటాడ రాదు. వారి నుండి దానములు కొనరాదు.
పిబన్తి యావత్ కపిలాం తావత్తేషాం పితామహః,
భూమేర్మలం సమశ్నన్తి జాయన్తే విడ్భుజ శ్చిరమ్.
కపిలా క్షీరమును ఎంత కాలము త్రావుదురో అంత కాలము వారి తాతలు పురుగులై మట్టి మలమును తిను చుందురు.
తాసాం క్షీరం ఘృతం వాపి నవనీత మథాపి వా,
ఉపజీవన్తి యేశూద్రా స్తేషాం గతిమతః శృణు.
కపిల గోవుల పాలు, నెయ్యి, వెన్న అను వానితో జీవనము పుచ్చు వారి గతి యెట్టిదో వినుము.
కపిలోపజీవినః శూద్రాః క్రూరా గచ్ఛన్తి రౌరవమ్,
రౌరవేషు చ పచ్యన్తే వర్షకోటిశతం ధరే.
కపిల గోవులపై ఆధార పడి బ్రదుకు వారు క్రూరులై రౌరవ నరకమున కరుగుదురు. అందు నూరు కోట్ల ఏండ్లు పాతక మనుభవింతురు.
తతో విముక్తాః కాలేన శ్వానయోనిం ప్రజన్తి తే,
శ్వాసయోన్యా విముక్తాస్తు విష్ఠాయాం జాయతే కృమిః.
కొంత కాలమునకు దాని నుండి విముక్తులై కుక్క కడుపున కరుగుదురు. అటుపై బురదలో పురుగై పుట్టుదురు.
విష్ఠాస్థానేషు పాపిష్ఠో దుర్గన్ధిషుచ నిత్యశః,
భూయో భూయో జాయమానాః సద్యోనాశంవ్రజన్తి తే
మల స్థానములలో పరమ దుర్వాసన గలచోట పాపిష్ఠులు పుట్టు చుందురు. నాశము పొందు చుందురు.
బ్రాహ్మణ శ్చైవ యోవిద్వాన్ కుర్యాత్ తేషాం ప్రతిగ్రహమ్,
తతః ప్రభృత్యమేధ్యాన్తః పితర స్తస్య శేరతే.
విద్వాంసుడగు బ్రాహ్మణు డిట్టి వారి నుండి దానము పుచ్చు కొన్నచో అది మొదలు మలముతుదిగా గల నరకములలో వాని పితరులు పడి యుందురు.
న తం వివ్రం సుసంభాషే న్న చైవైకాసనం విశేత్,
స నిత్యం వర్జనీయో హి దూరాత్ తుబ్రాహ్మణోధ్వరే.
అట్టి విప్రునితో ఎవ్వడు పలుక రాదు. ఒక ఆసనముపై కూర్చుండ రాదు. వాడు యజ్ఞమున దూరముగా విడువ దగిన వాడు.
యత్నేన సహసంభాషేత్ తథా చైకాసనం వ్రజేత్,
ప్రాజాపత్యం చరేత్ కృత్స్నం తేన శుద్ధ్యతి సద్విజః.
ఒకవేళ మాటాడినచో, ఒక ఆసనమున కూర్చున్నచో ప్రయత్నముతో ప్రాజాపత్యమను ప్రాయశ్చిత్తమును చేసి కొనవలయును. అప్పుడా ద్విజుడు శుద్ధుడగును.
ఏకస్య గోప్రదానస్య సహస్రాంశేన పూర్యతే,
కిమన్యై ర్బహుభి ర్దానైః కోటిసంఖ్యాతవిస్తరైః.
ఒక కపిలను దానము చేయుట వేయి రెట్లు ఫలితమును నింపును. కోట్ల కొలదిగా విస్తరించిన అనేక దానముల సంగతి చెప్పనేల?
శ్రోత్రియాయ దరిద్రాయ సువృత్తాయాహితాగ్నయే,
ఆసన్నప్రసవాం ధేనుం దానార్థీ ప్రతిపాలయేత్,
కపిలార్ధప్రసూతా వై దాతవ్యా చ ద్విజాతయే.
వేదము చక్కగా చదువు కొన్నవాడు, దరిద్రుడు, మంచి నడవడి కలవాడు, అగ్ని హోత్రములను నిత్యము అర్చించు వాడు అగు బ్రాహ్మణునకు ఈనమోసిన కపిల ధేనువుని రక్షించి, ఈను చుండగా దాన మీవలయును.
జాయమానస్య వత్సస్య ముఖం యోన్యాం ప్రదృశ్యతే,
తావత్ సా పృధివీ జ్ఞేయా యావద్ గర్భం నముఞ్చతి.
బిడ్డ పుట్టు చుండగా ముఖము యోని యందు కన్పడు చుండగా ఇంకను గర్భమును పూర్తిగా వదలక ముందు, అట్టి ఆవును పృథివిగా తెలియ దగును.
ధేన్వా యావన్తి రోమాణి నవత్సాయా వసుంధరే,
తస్యాశ్చ పాంశవో యావద్ గర్భోదక పరిప్లుతాః.
తాపత్యో వర్షకోట్యస్తు బ్రహ్మవాదిభి రర్చితాః,
బ్రహ్మలోకే నివసన్తి యేచ వై కపిలాప్రదాః.
కపిల గోవును దాన మొసగువారు, దూడతో పాటు ఆ ఆవునకు ఎన్ని రోమములు కలవో, ఆ గర్భపు నీటి కంటుకొని ఎన్ని ధూళి కణములు కలవో అన్ని కోట్ల వర్షములు బ్రహ్మవేత్తలు కొలుచు చుండగా బ్రహ్మ లోకమున నివసింతురు.
సువర్నశృఙ్గీం యః కృత్వా రౌప్యయుక్తఖురాం తథా,
బ్రాహ్మణస్య కరే దత్వా సువర్ణం రౌప్య మేవచ.
కపిలాయా స్తదా పుచ్ఛం బ్రాహ్మణస్య కరే న్యసేత్,
ఉదకం చ కరే దత్వా వాచయేచ్ఛుద్ధయా గిరా.
స సముద్రవనా తేన సశైలవనకాననా,
రత్నపూర్ణా భవేద్దత్తా పృథివీ నాత్ర సంశయా.
బంగారు కొమ్ములు, వెండి గిట్టలు గల కపిల ధేనువును సువర్ణము గాని వెండిని గాని దక్షిణగా ఇచ్చి తోక దగ్గర నీటిని వదలి దానము చేయు చున్నానని పలుక వలయును. అట్టివాడు సముద్రముతో వనములతో కొండలతో అడవులతో కూడినదియు, రత్నములతో నిండి నదియు అగు భూమిని దానము చేసిన వాడగును. ఇందు సంశయము లేదు.
పృథివీదానతుల్యేన దానేనైతేన వై నరః,
నన్దితో యాతి పితృభి ర్విష్ణ్వాఖ్యం పరమం పదమ్.
భూదానముతో సమానమగు ఈ దానముతో నరుడు ఆనంద మొంది తన పితృ దేవతలతో పాటు విష్ణువు అను పేరు గల పరమ పదమున కరుగును.
బ్రహ్మస్వహారిణో గోఘ్నె భ్రూణహా పాకభేదకః,
మహాపాతక యుక్తోపి వఞ్చకో బ్రహ్మదూషకః.
నిన్దకో బ్రాహ్మణానాంచ తథా ధర్మోపదూషకః,
ఏతైః పాతక యుక్తోపి గవాం దానేన శుద్ధ్యతి.
బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించిన వాడు, గోవును చంపిన వాడు, భ్రూణ హత్య చేసిన వాడు (భ్రూణము= గర్భము లోని శిశువు) కొంపలు తగుల బెట్టిన వాడు, మహా పాతకములు చేసిన వాడు, వంచకుడు, బ్రహ్మ జ్ఞానులను నిందించు వాడు, ధర్మమును దూషించు వాడు ఇట్టి వారందరు కపిల గోవు దానము చేత శుద్ధి పొందుదురు.
యశ్చోభయముఖీం దద్యాత్ ప్రభూత కనకాన్వితామ్,
తద్ దినం పాయసాహారం పయసా వాతివాహయేత్.
‘ఉభయ ముఖి’ అని ప్రసిద్ధి గల కపిలను గొప్ప ధనముతో కూడిన దానిని దాన మొసగు వాడు ఆ దినమున పాయసము గాని పాలు గాని ఆహారముగా కొని ఉండ వలయును. (ఉభయ ముఖి - ఈనుచున్న ఆవు)
సువర్ణస్య సహస్రేణ తదర్ధేనాపి భామిని,
తస్యాప్యర్దశతేనాథ పఞ్చాశచ్చ తతోర్ధకమ్,
యథాశక్త్యా ప్రదాతవ్యా విత్తశాఠ్యం వివర్జయేత్.
వేయి కాసులు గాని, అందు సగము గాని, దానిలో సగము గాని, నూరు గాని, ఏబది గాని, దానిలో సగము గాని దక్షిణగా ఒసగ వలయును. విత్తము విషయమున వంచన పనికి రాదు.
ఇమాం గృహ్ణోభయముఖీం భయత్రాతా మమాశుచ,
దదే వంశవివృద్ధ్యర్థం సదా స్వస్తికరీ భవ.
ఈ కపిల ధేనువును గ్రహింపుము. నన్ను భయము నుండి కాపాడుము. వంశము వృద్ధి పొందుటకై ఈ దానము చేయు చున్నాను. నాకు శుభమును కల్పింపుము అని దాత పలుక వలయును
ప్రతిగృహ్ణామి త్వాం ధేనో కుటుంబార్థే విశేషతః,
స్వస్తిర్భవతు మే నిత్యం రుద్రాఙ్గే తే నమో నమః.
ధేనూ! కుటుంబము కొరకు ప్రత్యేకించి నిన్ను గ్రహించు చున్నాను. రుద్రాంగా! నీకు స్వస్తియగు గాక! నమస్కారము! (రుద్రాంగ = రుద్రుని అంగము అయినది.)
ఓం ద్యౌ స్త్వా దదత్వితిపున ర్మన్త్రేణ ప్రతిగృహ్ణాతి,
కో దదాదితి మన్త్రేణ ప్రతిగృహ్య వసుంధరే,
విసృజ్య బ్రాహ్మణం దేవి తాం ధేనుం తద్గృహం నయేత్.
‘‘ఓంద్యౌస్త్వా దదతు’’ మొదలగు మంత్రములను, ‘కోదదాద్’ మొదలగు మంత్రములను పఠించి గ్రహించు వాడు దానమును కైకొన వలయును. తరువాత దాత ఆ బ్రాహ్మణుని ఇంటికి పంపి ఆవును ఆతని యింటికి చేర్ప వలయును.
ఏవంప్రసూయమానాం యో గాం దదాతి వసుంధరే,
పృథివీ తేన దత్తా స్యాత్ సప్తద్వీపా న సంశయః.
ఇట్లు ఈనుచున్న ఆవును ఇచ్చు వాడు, ఏడు ద్వీపములతో కూడిన భూమి నంతటిని ఇచ్చిన వాడగును. సంశయము లేదు.
చరన్తి తం చంద్రసమానవక్త్రాః ప్రతప్త జాంబూనద తుల్య వర్ణాః,
మహాసితత్వా స్తనువృత్తమధ్యాః సేవన్త్యజస్రం కులితా హి దేవాః.
చంద్రునితో సమానమగు ముఖము కలవారు, బాగుగా కరగిన బంగారు వంటి వన్నె కలవారును, గొప్ప ఖడ్గముల వంటి వాడియగు తత్వము కలవారును, సన్నని గుండ్రని నడుములు గల వారును, నిత్య జాగరూకత కలవారును అగు దేవులు అతనిని ఎల్లవేళల సేవించుచు తిరుగు చుందురు.
ప్రాత రుత్థాయ యోభక్తః కల్పం ధేన్వా ముదాయుతమ్,
జితేన్ద్రియః శుచిర్భూత్వా పఠేద్ భక్త్యా సమాహితః.
త్రిః సదావర్తనం కృత్వా పాపం వర్షకృతం చ యత్,
నశ్యతే తత్క్షణాదేవ వాయునా పాంసనో యథా.
ఉదయమున లేచి భక్తుడు ఈ ధేను కల్పమును ఇంద్రియ నిగ్రహము కలవాడై పవిత్రుడై చదివినచో, మూడు మారులు గోవునకు ప్రదక్షిణము చేసినచో సంవత్సరము కాలము అతడు చేసిన పాపము ఆ క్షణములో, గాలికి దుమ్ము కొట్టుకొని పోయినట్లు, నశించును.
శ్రాద్ధకాలే పఠేద్యస్తు ఇదం పావన ముత్తమమ్,
తస్యాన్నం సంస్కృతం తద్ధి పితరోశ్నన్తి ధీమతః.
పవిత్రము, ఉత్తమము అగు ధేను కల్పమును శ్రాద్ధ కాలమున పఠించినచో చక్కగా సంస్కారము పొందిన ఆ అన్నమును పితృ దేవతలు ప్రీతితో భుజింతురు.
అమయాం వాథ యః కశ్చిద్ ద్విజానా మగ్రతః పఠేత్,
పితర స్తస్య తృప్యన్తి వర్షాణాం శతమేవ తు.
అమావాస్య నాడు బ్రాహ్మణుల ముందు దీనిని పఠించినచో ఆతని పితృ దేవతలు నూరేండ్లు తృప్తి పడుదురు.
యశ్చైత చ్ఛ్రుణుయా న్నిత్యం తద్గతేనాన్తరాత్మనా,
సంవత్సర కృతం పాపం తత్షణాదేవ నశ్యతి.
దీనిని శ్రద్ధతో నిత్యము విను వానికిని ఏడాది చేసిన పాపము ఆ క్షణమున నశించును.
హోత:
ఇదం రహస్యం రాజేన్ద్ర వరాహేణ పురాతనమ్,
ధరణ్యై కథితం రాజన్ ధేనుమాహాత్మ్య ముత్తమమ్,
మయా తే కథితం సర్వం సర్వపాపప్రణాశనమ్.
రాజా! శ్రీవరాహ దేవుడు భూదేవికి చెప్పిన రహస్యము, పురాతనము అయిన ఈ ధేను మాహాత్మ్యమును, నేను నీకు సర్వమును సర్వ పాపములను పోగొట్టు దానిని చెప్పితిని.
ద్వాదశ్యాం మాఘమాసస్య శుక్లాయాం తిలధేనుదః,
సర్వకామసమృద్ధార్థో వైష్ణవం పదమాప్నుయాత్.
మాఘ మాసము శుక్లపక్ష ద్వాదశి యందు తిలధేనువు నిచ్చువాడు నిండిన కోరిక లన్నింటితో సమృద్ధమైన విష్ణు పదమును పొందును.
ద్వాదశ్యాం శ్రావణే మాసి శుక్లాయాం రాజసత్తమ,
ప్రత్యక్షధేను ర్దాతవ్యా సహిరణ్యా నృపోత్తమ.
శ్రావణ మాసమున శుక్ల పక్ష ద్వాదశి తిథి యందు సువర్ణముతో పాటు నిజమైన గోవును దానమీ వలయును.
సర్వదా సర్వధేనూనాం ప్రదానం రాజసత్తమ,
సర్వపాపప్రశమనం భుక్తిముక్తిప్రదాయకమ్.
ఎప్పుడైనను అన్ని విధములైన గోవులను దానము చేయుట సర్వ పాపములను అణచు నట్టిది. భుక్తిని ముక్తిని ప్రసాదించు నట్టిది.
ఏతత్ తే సర్వమాఖ్యాతం సమాసాద్ బహువిస్తరమ్,
అపారఫలముద్దిష్టం బ్రహ్మణా లోకకర్తృణా.
ఈ సర్వము బహు విస్తరముగా ఒక్క రూపమున నీకు చెప్పితిని. లోక కర్తయగు బ్రహ్మ దీనికి అపారమైన ఫలమును నిర్ణయించెను.
అథవా పీడ్యసేత్యంతం క్షుధయా పార్థివోత్తమ,
తదానీం కార్తికే దేయం వర్తతేద్య నరాధిప.
రాజా! నీవు ఆకలితో మిక్కిలిగా పీడనొందు చున్నావు. ఇప్పుడు కార్తికము నడచు చున్నది. కావున ఇప్పుడు నీవు దానము చేయుము.
బ్రహ్మాండం సర్వసంపన్నం భూతరత్నౌషధై ర్యుతమ్,
దేవదానవ యక్షైశ్చ యుక్త మేతత్ సదా విభో.
ఈ బ్రహ్మండము భూతములతో రత్నములతో, ఓషధులతో, దేవ దానవ యక్షులతో కూడి ఎల్లవేళల సర్వ సంపదలు కలిగి యున్నది.
ఏతద్ధేమమయం కృత్వా సర్వబీజసమన్వితమ్,
సరత్నం పురుషః కృత్వా కార్తిక్యాం ద్వాదశీదినే.
అథవా పఞ్చదశ్యాం వా కార్తిరస్యైవ నాన్యతః,
పురోహితాయ గురవే దాపయేద్ భక్తిమాన్నరః.
దీనిని సువర్ణ మయముగా, అన్ని బీజములతో కూడి నదిగా చేసి రత్నములతో పాటు కార్తిక ద్వాదశి నాడు, లేదా పూర్ణిమ నాడు భక్తితో గురువైన పురోహితునకు సమర్పింప వలయును.
బ్రహ్మాండోదరవర్తీని యాని భూతాని పార్థివ,
తాని దత్తాని తేన స్యుః సమాసాత్ కథితం తవ.
అట్లు చేసిన వాడు బ్రహ్మాండము కడుపులో నున్న భూతము లన్నింటిని దానము చేసిన వాడగును, సంగ్రహముగా చెప్పితిని.
యో యజ్ఞై ర్యజతే రాజన్ సహస్రవరదక్షిణౖః,
సైకోద్ధేశం యజేత్ తస్య బ్రహ్మాండస్య విశేషతః.
వేల కొలది మేలైన దక్షిణలతో యజ్ఞములు చేయు వాడును బ్రహ్మాండములో ఒక భాగమును మాత్రమే ఇచ్చిన వాడగును.
యఃపునః సకలం చేదం బ్రహ్మాణ్డం యజతే నరః,
తేన యష్టం హుతం దత్తం పఠితం కీర్తితం భవేత్.
ఇక ఈ సమస్తమైన బ్రహ్మాండమును అర్చించు నరుడు యజించుట, హోమము, దానము, అధ్యయనము, కీర్తనము చేసినవాడే యగును.
ఏవం శ్రుత్వా తతో రాజా హేమకుంభంతు కల్పయేత్,
బ్రహ్మాండ మృషయే ప్రాదాత్ సవిధానం చ తత్క్షణాత్.
ఇది విని రాజు హేమ కుంభమును బ్రహ్మాండముగా కల్పించి విధి పూర్వకముగా దానిని ఋషి కర్పించెను.
సర్వకామైః సుసంభూతో యయౌస్వర్గం నరాధిపః,
తస్మాత్ త్వమపి రాజేన్ధ్ర తద్ దత్త్వా తు సుఖీ భవ.
నిండిన సర్వమైన కోరికలు కలవాడై ఆ రాజు స్వర్గమున కరిగెను. కావున ఓ రాజేంద్రా! నీవును అది యిచ్చి సుఖము కలవాడ వగుము.
ఏవముక్తో వసిష్ఠేన సోప్యేవ మకరో న్నృపః,
జగామ పరమాం సిద్ధిం యత్ర గత్వా న శోచతి.
వసిష్ఠు డిట్లు పలుకగా ఆ రాజు అట్లే కావించెను. దుఃఖము లేని పరమ సిద్ధ పదమునకు ఏగెను.
శ్రీవరాహ దేవుడు:
ఇయం తే సంహితా దేవి కథితా సర్వకామికా,
వరాహాఖ్యా వరారోహే సర్వపాతకనాశినీ.
శ్రీవరాహ దేవుడు:
ఓ వరారోహా! అన్ని కోరికలను తీర్చు ఈ వరాహ సంహిత అను పేరుగల దానిని నీకు చెప్పితిని. ఇది సర్వ పాతకములను నాశనము చేయునది.
సర్వజ్ఞా దుత్ధితా చేయం తతోబ్రహ్మాబుబోధ హ,
బ్రహ్మాపి స్వసుతే ప్రాదాత్ పులస్త్యాయ మహాత్మనే,
పులస్త్యోపి ప్రదద్యాద్ వైభార్గవాయ మహాత్మనే.
ఇది మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరుని నుండి బయలు దేరినది. అతని వలన బ్రహ్మ తెలిసి కొనెను. అతడు తన కుమారుడు మహాత్ముడునగు పులస్త్యున కొసగెను. పులస్త్యుడు మహాత్ముడగు భార్గవునకు ఇచ్చెను.
అసావపి స్వశిష్యాయ ప్రాదాదుగ్రాయ ధారిణే,
ఉగ్రోపి మునయే ప్రాదా దేషోపి పరికీర్తితః.
అతడును తన శిష్యుడగు ఉగ్రున కొసగెను. అతడు ముని కిచ్చెను. ఈ పరంపర ఇట్లుగా చెప్ప బడినది.
సంబంధః పూర్వకల్పోక్తో ద్వితీయం శృణు సాంప్రతమ్,
సర్వజ్ఞా ల్లబ్ధవానస్మి త్వం చ మత్తో ధరాధరే.
ఇది పూర్వ కల్పమున చెప్ప బడిన సంబంధము. ఇప్పుడు రెండవ సంబంధమును వినుము. నేను సర్వజ్ఞుని వలన పొందితిని. నా నుండి నీవు గ్రహించితివి.
త్వత్తశ్చ తపసా యుక్తా వేత్స్యన్తే కపిలాదయః,
క్రమేణ యావద్ వ్యాసేన జ్ఞాత మేతద్ భవిష్యతి.
నీ నుండియు తపస్సుతో కూడిన కపిలుడు మున్నగు వారు తెలిసి కొందురు. క్రమముగా వ్యాసుని వలన ఇది లోకమునకు తెలియ గలదు.
తస్యాపిశిష్యో భవితా నామ్నావై రోమహర్షణః,
అసౌ శునకపుత్రస్య కథయిష్యతి నాన్యథా.
రోమ హర్షణుడను వాడు అతనికి శిష్యుడగును. అతడు దీనిని యథాతథముగా శౌనకునకు చెప్పెను.
అష్టాదశ పురాణాని వేద ద్వైపాయనో గురుః,
బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా.
తథాన్యం నారదీయం చ మార్కణ్డేయం చ సప్తమమ్,
ఆగ్నేయ మష్టమం ప్రోక్తం భవిష్యం నవమం తథా.
దశమం బ్రహ్మవైవర్తం లైజ్గమేకాదశం స్మృతమ్,
వారాహం ద్వాదశం ప్రోక్తం స్కాందం చాపి త్రయోదశమ్.
చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం స్మృతమ్,
మాత్స్యంచ గారుడం చైవ బ్రహ్మాండం చ తతఃపరమ్.
ద్వైపాయనుడను గురువు పదు నెనిమిది పురాణము లెరిగిన వాడు. బ్రాహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, నారదీయము, మార్కండేయము, అగ్నేయము, భవిష్యము, బ్రహ్మ వైవర్తనము, లైంగము, వారాహము, స్కాందము, వామనము, కౌర్మము, మాత్స్యము, గారుడము, బ్రహ్మాండము అనునవి అష్టాదశ పురాణములు.
శ్రీవరాహ దేవుడు:
య ఏతత్ పారయేద్ భక్త్యా కా ర్తిక్యాం ద్వాదశీదినే,
తస్య నూనం భవేత్ పుత్రో అపుత్రస్యాపి ధారిణి.
శ్రీవరాహ దేవుడు:
భూదేవీ! కార్తిక ద్వాదశి నాడు భక్తితో దీనిని నిర్వహించు వాడు అపుత్రు డైనను తప్పక పుత్రుని పొందును.
యస్యేదం తిష్ఠతే గేహే లిఖితం పూజితం సదా,
తస్య నారాయణో దేవః స్వయం తిష్ఠతి ధారిణి.
భూదేవీ! ఎవని యింట ఈ సంహిత వ్రాయ బడునో పూజింప బడునో ఆ యింట నారాయణ దేవుడు స్వయముగా నిలిచి యుండును.
యశ్చైత చ్ఛ్రుణుయాద్ భక్త్యా నైరన్తర్యేణ మానవః,
శ్రుత్వా తు పూజయే చ్ఛాస్త్రం తథావిష్ణుం సనాతనమ్.
ఈ శాస్త్రమును వదలక భక్తితో చదువు వాడు, విని పూజించు వాడును సనాతనుడగు విష్ణువును పూజించు వాడగును.
గన్ధైఃపుష్పై స్తథా వస్త్రై ర్బ్రాహ్మణానాం చ తర్పణైః,
యథాశక్త్యా నృపోగ్రామైః పూజయేద్ వాచకం ధరే.
ధరాదేవీ! గంధములతో, పూవులతో, వస్త్రములతో, బ్రాహ్మణ సంతర్పణలతో శక్తి ననుసరించి గ్రామములతో రాజు వాచకుని పూజింప వలయును.
శ్రుత్వా తు పూజయేద్ యస్తు శాస్త్రం వారాహసంజ్ఞితమ్,
సర్వపాపవినిర్ముక్తో విష్ణుసాయుజ్య మాప్రజేత్.
ఈ వరాహమను పేరు గల శాస్త్రమును చదివి పూజించు మానవుడు పాపము లన్నింటి నుండి పూర్తిగా విముక్తి పొంది విష్ణు సాయుజ్యమును పొందును.