అధ్యాయము – 16

భూదేవి:

తదా దుర్వాససా శప్తో దేవరాజః శతక్రతుః,

వసిష్యసి త్వం మర్త్యేషు సుప్రతీకసుతేన తు.

భూదేవి:

ప్రభూ! అప్పుడు దేవ రాజగు ఇంద్రుని దుర్వాసుడు నిన్ను సుప్రతీకుని కుమారుడు పోద్రోలగా మనుజులతో కలిసి నివసింతునని శపించెను గదా!

ఉత్సాదితో దివో మూఢేత్యేవ ముక్తస్తు భూధరః,

ఇంద్రో మర్త్య ముపాగమ్య సర్వదేవసమన్వితః.

బుద్ధి హీనుడా! సుప్రతీకుని కొడుకు నిన్ను స్వర్గము నుండి త్రోలి వైచును. అని దుర్వాసుడు పలుకగా దేవత లందరితో కూడిన దేవేంద్రుడు మనుష్య జన్మము పొంది ఏమి చేసెను?

కించకార చ తస్మింస్తు దుర్జయే చ నిపాతితే,

పరమేష్ఠినా భగవతా తేన యోగ విదుత్తమౌ.

స్వర్గే విద్యుత్సువిద్యుచ్చ తౌ చకిం చాక్రతు స్తదా,

ఏతన్మే సంశయం దేవ కథయస్వ ప్రసాదతః.

మరియు ఆ దుర్జయుని భగవంతుడగు బ్రహ్మ కూల్చి వేసిన పిదప ఉత్తమ యోగ జ్ఞానము గల విద్యుత్తు సువిద్యుత్తు అనువారు స్వర్గమున నేమి చేసిరి? ప్రభూ! ప్రసన్నుడవై నాయీ సంశయమును తీర్పుము.

శ్రీవరాహ దేవుడు:

దుర్జయేన జితో ధాత్రి దేవరాజః శతక్రతుః

భారతే హి తదా వర్షే వరాణాస్యాం తు పూర్వతః,

ఆశ్రిత్యసంస్థితో దేవైః సహ యక్షమహోరగైః.

శ్రీవరాహ దేవుడు:

భూదేవీ! దేవేంద్రుడు దుర్జయునకు ఓడి భరత వర్షమున వారాణసి నాశ్రయించి యక్షులతో, నాగులతో, దేవతలతో కలసి నివసించెను.

విద్యుత్‌ సువిద్యుచ్చ తదా యోగ మాస్థాయ శోభనే,

దీర్ఘతాపజ్వరం వాయుకర్మయోగేన సంశ్రితౌ,

లోకపాలాయతం కృత్స్నం చక్రతు ర్యోగమాయమా.

అంత ఆ విద్యుత్ సువిధ్యుత్తులు యోగము నవలంభించి వాయు కార్య సంబంధము చేత దీర్ఘ తాప జ్వరమును కల్పించి యోగ మాయతో లోక పాలురను క్రమ్మునట్లు కావించిరి.

తం దుర్జయం మృతం శ్రుత్వా సముద్రాంతం స్థితం సదా,

ఆనీయ చతురంగంతు దేవాన్‌ ప్రతి విజగ్మతుః

ఆ దుర్జయుడు మరణించె నని విని సముద్రము కడ నున్న చతురంగ బలమును రావించి దేవతల పైకి దండు వెడలిరి.

ఆగత్య తౌ తదా దైత్యా మహత్సైన్యేన పర్వతమ్‌,

హిమవంతం సమాశ్రిత్య సంస్థితౌ తు బభూవతుః.

అట్లు పెను సేనతో వచ్చి వారు హిమవత్పర్వతము నాశ్రయించి నిలిచి యుండిరి.

దేవా అపి మహాత్సైన్యం సఃహత్య కృతదంశితాః,

మంత్రయాఞ్చక్రు రవ్యగ్రా ఐంద్రం పద మభీప్సవః.

దేవతలును గొప్ప సేన కూర్చుకొని రక్షణ ఏర్పాటులు కావించుకొని ఇంద్ర పదవి నొంద గోరిన వారై మెలకువతో మంతనము లాడు చుండిరి.

అబ్రవీత్తత్ర దేవానం గురు రాంగిరసో మునిః,

గోమేధేన యజధ్వం వై ప్రథమం తదనంతరమ్‌.

యష్టవ్యం క్రతుభిః సర్వై రేషా స్థితి రథామరాః,

ఉపదేశో మయా దత్తః క్రియతాం శీఘ్ర ఏష వై.

అందు దేవ గురుడు బృహస్పతి, మొదట గోమేధము చేయుడు. పిదప తక్కిన యజ్ఞము లన్నియు చేయ వలయును. దేవతలారా! ఇది పద్ధతి. ఇది నేను మీకిచ్చు ఉపదేశము, దీనిని త్వరగా నాచరింపుడు.

ఏవముక్తా స్తదా దేవా గాః పశూంశ్చానుకల్ప్యతే,

ముముచు శ్చరణార్థాయ రక్షార్థం సరమాం దదుః.

ఆతడిట్లు పలుకగా ఆ దేవతలు గోవులను, ఇతర పశువులను కూర్చుకొని వానిని సంచారము కొరకు వదలిరి. వారి రక్షకై సరమను ఏర్పరచిరి. (సరమ - దేవతల కుక్క)

తాశ్చ గావో దేవశున్యా రక్ష్యమాణా ధరాధరే,

తత్ర జగ్ము స్తదా గావ శ్చరంత్యో యత్ర తేసురాః.

దేవతల శునకము కాపాడు చున్న ఆ గోవులు అందందు తిరుగుచు ఆ రక్కసులున్న తావున కరిగెను.

తేచగావస్తు తా దృష్ట్వా శుక్రమూచుఃపురోహితమ్‌,

పశ్యత్వం దేవ గా బ్రహ్మంశ్చార్యంతే రక్షమాణయా,

దేవశున్యా సరమయా వద కిం క్రియతేధునా.

అంత నా రక్కసులు ఆ గోవులను గాంచి పురోహితుడగు శుక్రునితో, ‘ప్రభూ! చూడు. దేవతల శుని సరమ కాపాడు చుండగా గోవుల నిందు త్రిప్పు చున్నారు. ఇప్పుడు మనమేమి చేయ వలయును’ అని అడిగిరి.

ఏవ ముక్తా స్తదా శుక్రః ప్రత్యువాచాసురాం స్తదా

ఏతా గా హ్రియతాం శీఘ్ర మసురా మా విలంబథ.

అంత శుక్రుడు రక్కసులతో ‘అసురులారా! వెను వెంటనే ఈ గోవులను పట్టు కొనుడు. జాగు సేయకుడు’ అని పలికెను.

ఏవముక్తా దైత్యా జహ్రు స్తా గా యదృచ్ఛయా.

ఇట్లన్న తోడనే ఆ దైత్యులు ఆ గోవులను చేజిక్కించు కొనిరి.

హృతాసు తాసు సరమా మార్గాన్వేషణ తత్పరా,

అపశ్యత్సా దితేః పుత్రై ర్నీతా గావో ధరాధరే,

దైత్యైరపి శునీ దృష్టా దృష్టమార్గా విశేషతః.

వారట్లు గోవులను హరింపగా సరమ అవి పోయిన దారిని శ్రద్ధతో వెదికెను. కడకు దితి కొడుకులు వానిని తోలుకొని పోవు చుండగా కనుగొనెను. దైత్యులును తమదారి నెరిగిన సరమను గాంచిరి.

దృష్ట్వా తే తాం చ సామ్నైవ సామపూర్వ మిదం వచః,

ఆసాం గవాంతు దుగ్ధ్వైవ క్షీరం త్వం సరమే శుభే,

పిబస్వైవ మితి ప్రోక్త్వా తస్యై తద్దదు రంజసా.

కాంచి వారు మంచి మాటలతో సరమా! ఈ గోవుల పాలు పిండి నీవు త్రాగుము. అని వాని క్షీరమును దాని కొసగిరి.

దత్త్వాతు క్షీరపానంతు తస్యైతే దైత్యనాయకాః,

మాభద్రే దేవరాజాయ గాస్త్విమా వినివేదయ.

అట్లు రాక్షస నాయకులు పాలు సరమ కొసగి ఓ యమ్మా! ఈ గోవులను గూర్చి దేవ రాజునకు చెప్ప వలదని పలికిరి.

ఏవముక్త్వా తతోదైత్యా ముముచుంస్తాం శునీం వనే,

తైర్ముక్తా సా సురాం స్తూర్ణం జగామ ఖలు వేపతీ.

దైత్యులిట్లు పలికి ఆ శునిని వనమున వదలి వైచిరి. అంతనా సరమ వణకి పోవుచు వడివడిగా దేవతలకడ కరిగెను.

నమశ్చక్రే చ దేవేంద్రం సరమా సురసత్తమమ్‌.

సరమ దేవేంద్రునకు మ్రొక్కు లిడెను.

తస్యా శ్చ మరుతో దేవా దేవేంద్రేణ నిరూపితాః,

గూఢం గచ్ఛత రక్షార్థం దేవశున్యా మహాబలాః.

దేవేంద్రు డామెకు మరుత్తులను దేవతలను చూపి ‘మహా బలులారా! మీరీ దేవ శునితో పాటు గుట్టుగా రక్షణకుగా నరుగుడు’ అని పలికెను.

ఇత్యుక్తా స్తేన సూక్ష్మేణ వపుషా జగ్ము రంజసా,

తేప్యాగమ్య సురేంద్రాయ సమశ్చక్రు ర్ధరాధరే.

దేవేంద్రుడట్లు చెప్పగా వారు సూక్ష్మమగు దేహముతో వడివడిగా నరిగిరి. వారును తిరిగి వచ్చి దేవేంద్రునకు నమస్కరించిరి.

తాన్‌ దేవరాజః పప్రచ్ఛ గావః కిం సరమేభవన్‌,

ఏవముక్తా తు సరమా నజానామీతి చాబ్రవీత్‌.

దేవేంద్రుడు, సరమా! గోవు లేమైనవి? అని యడిగెను. సరమ తెలియదని బదులు చెప్పెను.

తత ఇంద్రో రుషా యుక్తో యజ్ఞార్థ ముపకల్పితాః,

గావః క్వ చేతి మరుతః ప్రోవాచేదం శునీ కధమ్‌.

అంత ఇంద్రుడు కోపముతో యజ్ఞమునకై ఏర్పరచిన గోవులేవి? ఈ శుని సంగతి యేమి? అని మరుత్తుల నడిగెను.

ఏవ ముక్తాస్తు మరుతో దేవేంద్రేణ ధరాధరే,

కథయామాసు రవ్యగ్రాః కర్మ తత్సరమాకృతమ్‌.

దేవేంద్రుడిట్లు పలుకగా మరుత్తులు మెల్లగా దాపరికము లేకుండ సరమ చేసిన పనిని నివేదించిరి.

తత ఇంద్రః సముత్థాయ పదా సన్తాడయంచనీమ్‌,

క్రోధేన మహతా విష్టో దేవేంద్రః పాకశాసనః.

అంత పాకశాసనుడగు దేవేంద్రుడు పట్టరాని కోపముతో ఆ కుక్కను కాలితో మట్టగింప సాగెను.

క్షీరం పీతం త్వయా మూఢే గావస్తాశ్చాసురైర్హృతాః.

ఏవముక్త్వా పదా తేన తాడితా సరమా ధరే.

‘బుద్ధిలేని దానా! నీవు పాలు త్రాగితివి. ఆ రక్కసులు గోవులను కాజేసిరి’ అని పలుకుచు సరమను కాలితో తన్న సాగెను.

తస్యేంద్రపాద ఘాతేన క్షీరం వక్త్రా త్ర్పసుస్రువే,

స్రవతా తేన పయసా సా శునీ యత్ర గా భవన్‌,

జగామ తత్ర దేవేంద్రః సహసైన్యస్తదా ధరే.

ఇంద్రుని కాలి దెబ్బల వలన దాని నోటి నుండి పాలు వెలికి వచ్చెను. అట్లు వచ్చుచున్న పాలతో ఆ శుని గోవులున్న చోటి కరిగెను. దేవేంద్రుడు సేనలతో కూడి దాని వెంట నరిగెను.

అపశ్యత్తత్ర దేవేంద్ర స్తాగా దైత్యైరుపాహృతాః,

చక్రుర్యేపాలనం దైత్యాస్తేదైత్యా బలినో భృశమ్‌,

తైఃసైన్యై ర్నిహతాః సద్యస్తత్యజుర్గాః స్వమూర్తిభిః.

అంత దేవేంద్రుడు దైత్యుడు అపహరించిన గోవులను గాంచెను. వానిని రక్షించు చున్న బలవంతులగు రక్కసలను దేవ సేనలు రూపు మాపెను. గోవులు రూపము చెడక వశ మాయెను.

సామన్తైశ్చ సురేంద్రోథ వృతః పరమహర్షితైః,

తాశ్చలబ్ధ్వా మహేంద్రస్తు ముదా పరమయా యుతః

పెల్లు బికిన సంతోషము గల సామంతులతో దేవరాజు గోవులను పొంది పరమానంద మందెను.

చకార యజ్ఞాన్‌ వివిధాన్‌ సహస్రా నపి స ప్రభుః,

క్రియమాణై స్తతో యజ్ఞై ర్వవృధేంద్రస్య తద్బలమ్‌.

అట్లు గోవులను చేజిక్కించుకొన్న దేవేంద్రుడు వేల కొలదిగా వివిధములగు యజ్ఞము లాచరించెను. అట్లు చేయు చుండగా ఆతని బలము పెంపొంద సాగెను.

వృద్ధితేన బలేనేంద్రో దేవసైన్య మువాచ హ,

సన్నహ్యతాం సురాః శీఘ్రం దైత్యానాంవధకర్మణి.

అట్లు పెంపొందిన బలముతో దేవేంద్రుడు దేవ సేనను ‘దైత్యులను రూపు మాపు కార్యమునకు సిద్ధపడు’ డని హెచ్చరించెను.

ఏవముక్తా స్తదా దేవాః సన్నద్ధా స్తతక్షణేభవన్‌,

అసురాణా మభావాయ జగ్ముర్దేవాః సవాసవాః.

ఆతడట్లు పలుకగనే దేవతలు ఏర్పాటు లన్నియు కావించుకొని రాక్షసులను రూపు మాపుటకై దేవేంద్రునితో కూడి బయలు దేరిరి.

గత్వాతు యుయుధుస్తూర్ణం విజిగ్యుస్త్వాసురీం చమూమ్‌,

జితాశ్చదేవై రసురా హతశేషా ధరాధరే,

మమజ్జుః సాగరజలే భయత్రస్తా విచేతసః.

అట్లు వెడలి దేవతలు రక్కసుల మూకతో పోరాడి గెలిచిరి. చావగా మిగిలిన రక్కసులు భయముతో గుండె చెదరి సముద్ర జలములో మునిగిరి.

దేవరాజోపి త్రిదివం లోకపాలైః సమం ధరే,

ఆరుహ్య బుభుజే ప్రాగ్వత్‌ సదేవో దేవరాడ్విభుః.

అట్లు దేవరాజు లోక పాలురతో కూడి స్వర్గము నాక్రమించి మునుపటి వలె ఏల సాగెను.

య ఏనం శృణుయా న్నిత్యం పరమాఖ్యానముత్తమమ్‌,

స గోమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః.

ఈ ఉత్తమ కథను ప్రతి దినము విను మానవుడు గోమేధ యజ్ఞము చేసిన ఫలము పొందును.

భ్రష్ట రాజ్యశ్చ యో రాజా శృణోతీదం సమాహితః,

స దేవేంద్ర ఇవ స్వర్గం రాజ్యం స్వం లభతే నరః.

ఎవ్వడు గాని రాజ్యము కోల్పోయిన రాజు ఈ కథను శ్రద్ధతో నాలకించినచో, దేవేంద్రుడు స్వర్గమును పొందినట్లు, తన రాజ్యమును తిరిగి పొందును.