అధ్యాయము - 72

శ్రీవరాహ దేవుడు:

సర్వజ్ఞం సర్వకర్తారం భవం రుద్రం పురాతనమ్‌,

ప్రణమ్య ప్రయతోగస్త్యః పప్రచ్ఛ పరమేశ్వరమ్‌.

శ్రీవరాహ దేవుడు:

సర్వజ్ఞుడు, సర్వకర్త, భవుడు, పురాతనుడు, రుద్రుడు అగు పరమేశ్వరునికి ప్రణమిల్లి అగస్త్యుడు శ్రద్ధతో ఇట్లడిగెను.

అగస్త్యుడు:

భవాన్‌ బ్రహ్మాచ విష్ణుశ్చ త్రయమేతత్‌ త్రయీ స్మృతా,

దీపోగ్ని ర్దీప సంయోగైః సర్వశాస్త్రేషు సర్వతః.

కస్మిన్‌ ప్రధానో భగవాన్‌ కాలే కస్మిన్నధోక్షజః,

బ్రహ్మా వా ఏత దాచక్ష్వ మమ దేవ త్రిలోచన.

అగస్త్యుడు:

మూడు కన్నుల దేవరా! నీవు బ్రహ్మయును, విష్ణువును, ఈ మువ్వురును సర్వ శాస్త్రముల యందును అన్ని యెడలను త్రిమూర్తులుగా ప్రఖ్యాతులు. ఒక దీపము నందలి అగ్ని పెక్కు దీపములను వెలిగించు నట్లుండు వారు. అందు తమ ప్రధానత ఎప్పుడు? విష్ణు వెప్పుడు ప్రధానుడు? బ్రహ్మ ఎప్పుడు? దీనిని నాకు తెలియ జెప్పుము.

రుద్రుడు:

విష్ణురేవ పరం బ్రహ్మ త్రిభేద మిహ పఠ్యతే,

వేదసిద్ధాంత మార్గేషు తన్న జానన్తి మోహితాః.

రుద్రుడు:

విష్ణువే పర బ్రహ్మము. వేద సిద్ధాంత మార్గములు దీనినే చెప్పు చున్నవి. అదియే మూడు భేదములను పొందు చున్నది. అజ్ఞానులు దీని నెరుగ కున్నారు.

విశ ప్రవిశనే ధాతు స్తత్ర ష్ణు ప్రత్యయాదను,

విష్ణు ర్యః సర్వదేవేషు పరమాత్మా సనాతనః.

‘విశ’ అను ధాతువునకు ప్రవేశించుట అర్థము. దానికి ‘ష్ణు’ అను ప్రత్యయము చేరగా ‘‘విష్ణు’’ అనురూప మేర్పడినది. సర్వ దేవుల యందు ప్రవేశించు సనాతనుడగు పరమాత్మయే విష్ణువు.

యోయం విష్ణుస్తు దశధా కీర్త్యతే చైకధా ద్విజాః,

స ఆదిత్యో మహాభాగ యోగైశ్వర్య సమన్వితాః.

ఈ విష్ణువే పదునొకండు రూపములుగా చెప్పబడు నప్పుడు యోగము ఐశ్వర్యము, అను లక్షణములతో కూడిన వాడై ఆదిత్యు డగు చున్నాడు.

స దేవకార్యాణి సదా కురుతే పరమేశ్వరః,

మనుష్యభావ మాశ్రిత్య సమాం స్తౌతి యుగేయుగే,

లోకమార్గ ప్రవృత్త్యర్థం దేవకార్యార్థ సిద్ధయే.

ఆ పరమేశ్వరుడే ఎల్లవేళ దేవ కార్యములను చేయు చుండును. ప్రతి యుగము నందును లోక మార్గములను చక్కగా సాగించుటకు, దేవ కార్యములను నెరవేర్చుటకు, మనుష్య భావమును పొంది నన్ను స్తుతించు చుండును.

అహం చ వరద స్తస్య ద్వాపరే ద్వాపరే ద్విజ,

అహం చ తం సదా స్తౌమి శ్వేతద్వీపే కృతేయుగే.

ప్రతి ద్వాపర యుగము నందును నేనాతనికి వరము లిచ్చు వాడను, కృత యుగమున శ్వేత ద్వీపమున నేనాతనిని స్తుతించు చుందును.

సృష్టికాలే చతుర్వక్త్రం స్తౌమి కాలో భవామి చ,

బ్రహ్మా దేవాసురా స్తౌతి మాం సదా తు కృతేయుగే,

లింగమూర్తిం చ మాం దేవా యజన్తే భోగకాంక్షిణః.

సృష్టి కాలమున నేను నలు మోముల దేవరను స్తుతింతును. నేను కాలుడ నగుదును. కృత యుగమున బ్రహ్మయు, దేవతలు, రాక్షసులు నన్నెప్పుడు స్తుతింతురు. భోగములను కోరెడు దేవతలు లింగమే మూర్తిగా గల నన్ను పూజింతురు.

సహస్రశీర్షకం దేవం మనసా తు ముముక్షవః,

యజన్తే యం స విశ్వాత్మా దేవో నారాయణః స్వయమ్‌.

ముక్తి కోరువారు మనస్సులో వేయి శిరస్సులు కల దేవుని అర్చింతురు. అతడే విశ్వాత్ముడు. దేవుడు నగు నారాయణుడు.

బ్రహ్మయజ్ఞేన యే నిత్య యజన్తే ద్విజసత్తమాః,

త్రే బ్రాహ్మాణం ప్రీణయన్తి వేదో బ్రహ్మా ప్రకీర్తితః.

బ్రాహ్మణోత్తములు నిత్యము బ్రహ్మ యజ్ఞముతో పూజించుచు బ్రహ్మను ప్రీతుని గావింతురు. బ్రహ్మ అనగా వేదమే.

నారాయణః శివో విష్ణుః శంకరః పురుషోత్తమః,

ఏతైస్తు నామభిర్బ్రహ్మ పరంప్రోక్తం సనాతనమ్‌,

తంచ చిన్తామయం యోగం ప్రవదన్తి మనీషిణః.

నారాయణుడు, శివుడు, విష్ణువు, శంకరుడు, పురుషోత్తముడు, అను ఈ పేరు లన్నియు సనాతనుడగు పర బ్రహ్మమునే చెప్పును. మేధావులు ఇట్టి దానిని ధ్యానమయ యోగమని వక్కాణింతురు.

పశూనాం శమనం యజ్ఞో హోమకర్మ చ యద్భవేత్‌,

తదోమితి చ విఖ్యాతం తత్రాహం సంవ్యవస్థితః.

యజ్ఞము నందు పశువులను వ్రేల్చు హోమ కర్మమున ‘ఓమ్‌’ అని ప్రసిద్ధమైన దాని యందు నేను చక్కగా నెలకొని యుందును.

కర్మవేద యుజాం విప్ర బ్రహ్మా విష్ణు ర్మహేశ్వరః,

వయం త్రయోపి మన్త్రాద్యా నాత్ర కార్యా విచారణా.

కర్మములకై వేదముల నుపయోగించు వారికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అను మేము మువ్వురము మంత్రముల తొలి వర్ణములము. ఇందు భావింప వలసినది లేదు.

అహం విష్ణు స్తథా వేదా బ్రహ్మ కర్మాణి చాప్యుత,

ఏతత్‌ త్రయం త్వేక ఏవ న పృథక్‌ భావయేత్‌ సుధీః.

నేనును విష్ణువును, బ్రహ్మయును మేమే వేదములము కర్మములము. ఇవన్నియు నొక్కటియే. బుద్ధి మంతుడు వేరుగా భావింప రాదు.

యోన్యథా భావయే దేతత్‌ పక్షపాతేన సువ్రత,

స యాతి నరకం ఘోరం రౌరవం పాపపూరుషః.

పక్ష పాతము చేత ఎవ్వడును గాని వీనిని వేర్వేరుగా భావించునేని ఆ పాప పురుషుడు ఘోరమైన రౌరవమను నరకమున కరుగును.

అహం బ్రహ్మా చ విష్ణుశ్చ ఋగ్యజుః సామ ఏవ చ,

నైతస్మిన్‌ భేదమస్యాస్తి సర్వేషాం ద్విజసత్తమ.

ఉత్తమా! నేనును, బ్రహ్మయును, విష్ణువును, వరుసగా ఋక్కు, యజుస్సు, సామములము. ఎవ్వరికిని దీని యందు భేదము ఉండ రాదు.