అధ్యాయము - 102

హోత:

తద్వచ్చ శర్కరాధేనుం శృణు రాజన్‌ యథార్థతః,

అనులిప్తే మహీపృష్ఠే కృష్ణాజిన కుశోత్తరే.

ధేనుం శర్కరయా రాజన్‌ కృత్వా భారచతుష్టయమ్‌,

ఉత్తమా కథ్యతే సద్భి శ్చతుర్థాంశేన వత్సకమ్‌.

తదర్థం మధ్యమా ప్రోక్తా కనిష్ఠా భారకేణ తు,

తద్వ ద్వత్సం ప్రకుర్వీత చతుర్థాంశేన తత్త్వతః.

హోత:

అట్లే చక్కెర ధేనువును గూర్చి ఉన్న దున్నట్లు చెప్పెదను. రాజా! వినుము. అలికిన నేలపై లేడి చర్మము, దర్భాసనము నుంచి నాలుగు బారువుల చక్కెరతో ఆవును చేయ వలయును. అది ఉత్తమ పద్ధతి. అందు నాలుగవ వంతు చక్కెరతో దూడను నిర్మింప వలయును. అందులో సగము మధ్యమము, ఒక బారువుతో నైనచో చివరి పద్ధతి. దాని ప్రకారమే నాల్గవ వంతు భాగముతో దూడను చేయ వలయును.

అథ కుర్యాదష్టశతై రూర్ధ్వం నృపతిసత్తమ,

స్వశక్త్యా కారయేద్‌ ధేనుం యథాత్మానం నపీడయేత్‌.

ఆవు ఎత్తు ఎనిమిది వందల అంగుళ ములుండ వలయును. లేదా శక్తిని బట్టి చేయింప వలయును. తన్ను తాను బాధ పెట్టుకొన రాదు.

సర్వబీజాని సంస్థాప్య చతుర్దిక్షు సమన్తతః,

సౌవర్ణముఖశృ జ్గాణి మౌక్తికానయనాని చ.

నాలుగు దిక్కు లందును అన్ని విధములైన విత్తనములను ఉంచ వలయును. ఆ ఆవునకు బంగారు ముఖము కొమ్ములు, ముత్యాల కన్నులు ఏర్పరుప వలయును.

గుడేన తు ముఖం కార్యం జిహ్వా పిష్టమయీ తథా,

కంబలం పట్టసూత్రేణ కంఠాభరణ భూషితమ్‌.

బెల్లముతో ముఖమును, పిండితో నాలుకను, గంగడోలును పట్ట సూత్రము, కంఠా భరణమును కూర్ప వలయును.

ఇక్షు పాదాం రౌప్యఖురాం నవనీతమయ స్తనామ్‌,

ప్రశస్తపత్ర శ్రవణాం సితచామరభూషితామ్‌,

పఞ్చ రత్న సమాయుక్తాం వస్త్రైరాచ్ఛాదితోపరి.

చెరకు గడల పాదములు, వెండి గిట్టలు, వెన్నతో పొదుగు, చక్కని ఆకులతో చెవులు, తెల్లని చామరములు అలంకరాములు, అయిదు రత్నములు మొదలగు వానితో ఆ ఆవును నిర్మించి పైన వస్త్రములను కప్ప వలయును.

గంధపుష్ఫై రలంకృత్య బ్రాహ్మణాయ కుటుంబినే,

శ్రోత్రియాయ దరిద్రాయ సాధువృత్తాయ ధీమతే.

వేదవేదాఙ్గ విదుషే ఆహితాగ్నే ర్విశేషతః,

అదుష్టాయ ప్రదాతవ్యా నతు మత్సరిణే ద్విజే.

దానిని గంధములతో పూవులతో అలంకరించి, కుటుంబము కలవాడు, వేదము చక్కగా చదివిన వాడు, దరిద్రుడు, మంచి నడవడి కలవాడు, బుద్ధిశాలి, వేద వేదాంగము లను చక్కగా తెలిసిన వాడు, నిత్యాగ్ని హోత్ర అర్చన కలవాడు, దుష్టత లేనివాడు, అగు బ్రాహ్మణునకు ఒసగ వలయును. ఇతరులను చూచి కుళ్లుకొను వానికి ఈరాదు.

అయనే విషువే పుణ్యే వ్యతీపాతే శశిక్షయే,

ఏషు పుణ్యేషు కాలేషు యదృచ్ఛా వా స దాపయేత్‌.

అయనము లందు, విషువము నందు, పుణ్య తిథి యందు, వ్యతీపాత యోగమున్న దినమునను (పూర్ణిమ సోమ వారముల కలయిక రోజు) అమావాస్య యందును ఈ పుణ్య దినము లందు కాని ఎప్పుడైనను కాని ఈ దానము చేయ వలయును.

సత్పాత్రం చ ద్విజం దృష్ట్వా ఆగతం శ్రోత్రియం గృహే,

తాదృశాయ ప్రదాతవ్యా పుచ్ఛ దేశోపవిశ్య చ.

పూర్వాముఖస్థితో దాతా అథవా చ ఉదఙ్ముఖః,

ధేనుం పూర్వముఖీం కృత్వా వత్సముత్తరతో న్యసేత్‌.

మంచి యోగ్యత గల శ్రోత్రియ బ్రాహ్మణుడు ఇంటికి రాగా అట్టి వాని కీయ వలయును. దాత తూర్పునకు గాని, ఉత్తరమునకు గాని మొగము పెట్టి ఆవుతోక దగ్గర కూర్చుండ వలయును. ఆవును తూర్పు ముఖముగా, దూడను ఉత్తర ముఖముగా నిలుప వలయును.

దానకాలే తు యే మన్త్రా స్తాన్‌ పఠిత్వా సమర్పయేత్‌,

సంపూజ్య విధివద్‌ విప్రం ముద్రికా కర్ణభూషణైః

స్వశక్త్యా దక్షిణాం దత్వా విత్తశాఠ్యవివర్జితః,

హస్తేతు దక్షిణాం దత్వా గంధపుష్పం సచందనమ్‌,

ధేనుం సమర్పయేత్‌ తస్య ముఖం చ న విలోకయేత్‌.

దాన కాలము నందు చదువ వలసిన మంత్రములను చదివి సమర్పింప వలయును. విధి ప్రకారము విప్రుని ఉంగరముతో, కర్ణ భూషణములతో పూజింప వలయును. తన శక్తి ననుసరించి దక్షిణ నొసగ వలయును. విత్తశాఠ్యమును విడువ వలయును (ధనము విషయములో వంచన పనికి రాదు. సమర్థుడై తక్కువ ఇచ్చుట, శక్తిలేని యెడల ఎక్కువ ఇచ్చుటకు ప్రయత్నించుట విత్త శాఠ్యము) చేతి యందు దక్షిణ నుంచి గంధమును, పూవులను ధేనువును సమర్పింప వలయును. ఇచ్చు నపుడు పుచ్చు కొనువాని ముఖమును చూడ రాదు.

ఏకాహం శర్కరాహారో బ్రాహ్మణస్త్రిదినం వసేత్‌,

సర్వపాపహరా ధేనుః సర్వకామప్రదాయినీ,

సర్వకామ సమృద్ధస్తు జాయతే నాత్ర సంశయః.

ఒక దినము చక్కెర భోజనముతో ఉండ వలయును. పుచ్చుకొన్న బ్రాహ్మణుడు మూడు దినములు చక్కెర భోజనముతో గడుప వలయును. ఆ ధేనువు సర్వ పాపములను హరించుచు. అన్ని కోరికలను ప్రాసాదించును. ఆ దాత అన్ని కోరికలు తీరిన వాడగును. ఇందు సంశయము లేదు.

విష్ణులోకం నరో గచ్ఛేద్‌ యావదాహూత సంప్లవమ్‌,

స్వపితౄంస్తారయేచ్చైవ మాతామహ సమన్వితాన్‌,

ఆత్మానం విష్ణుసాయుజ్యం నయతే నాత్ర సంశయః

నరుడు ప్రళయ కాల పర్యంతము విష్ణు లోకమున నుండును. తన పితరులను, తల్లివైపు వారితో పాటు తరింప జేయును. తన్ను విష్ణువులో లీనము చేసికొనును. సంశయము లేదు.

దీయమానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమాం గతిమ్‌,

య ఇదం శృణుయాద్‌ భక్త్యా పఠతే వాపి మానవః,

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి.

ఆవు నిచ్చు చుండగా చూచు వారును పరమ గతి కరుగుదురు. దీనిని భక్తితో విన్న వాడును, చదువు వాడును సర్వ పాపముల వలన ముక్తుడై విష్ణు లోకమున కరుగును.