అధ్యాయము - 124

సూతుడు:

శ్రుత్వా షడృతు కర్మాణి పృథివీ శంసితవ్రతా,

తతో నారాయణం భూయః ప్రత్యువాచ వసుంధరా.

సూతుడు:

కొనియాడ బడు వ్రతములు గల భూదేవి ఆరు ఋతువుల కర్మములను విని నారాయణ దేవునితో మరల ఇట్లనెను.

మంగల్యాశ్చ పవిత్రాశ్చ యేత్వయా సముదాహృతాః

మమ లోకేషు విఖ్యాతా మనః ప్రహ్లాదయన్తి మే.

మంగళ కరములు, పవిత్రములు నగు విషయములను చెప్పితివి. ఇవి నా లోకము లందు తేట తెల్లము లగును. నామనస్సునకు మిక్కిలి ఆనందమును కూర్చు చున్నవి.

శ్రుత్వాత్వేతాని కర్మాణి త్వన్ముఖోక్తాని మాధవ

జాతాస్మి నిర్మలా దేవ శశాఙ్క ఇవ శారదః.

నీ ముఖము నుండి పలుక బడిన యీ అర్చన కర్మములను విని, దేవా! మాధవా! శరత్కాలపు చంద్రుని వలె నిర్మల నయితిని.

ఏతన్మే పరమం గుహ్యం పరం కౌతూహలం తథా

మమైవ చ హితార్థం త్వం విష్ణో వక్తు మిహార్హసి.

మిక్కిలి రహస్యము, వేడుక పుట్టించు నదియునగు ఈ విషయమును, నా మేలు కొరకు విష్ణూ! నీవు చెప్పదగును.

యా మేనాం భాషసే దేవ మమ మాయేతి నిత్యశః,

కా మాయా కీదృశీ విష్ణో కిం వా మాయేతి చోచ్యతే

జ్ఞాతు మిచ్ఛామి మాయార్థం రహస్యం పర ముత్తమమ్‌

దేవా! పలు మారులు నీవు ‘నా మాయ’ అను చుందువు. ఆ మాయ అనగా నేమి? ఎటువంటిది? దేనిని మాయ యందురు. ఈ మాయా రహస్యమును మిక్కిలి ఉత్తమ మైన దానిని తెలియ గోరు చున్నాను.

తత స్తస్యా వచః శ్రుత్వా విష్ణు ర్మాయా కరండకః,

ప్రహస్య మధురం వాక్యం ప్రత్యువాచ వసుంధరామ్‌.

అంత ఆమె మాటను విని మాయకు బరణి యగు విష్ణువు చిరునవ్వు నవ్వి భూదేవితో మధురమగు ఈ వాక్యమును పలికెను.

ఇయం మా భూమి తేమాయా యాం మాంత్వం పరిపృచ్ఛసి

కించ మాక్లిశ్యతే భూమి నమాయాంజ్ఞాతు మిచ్ఛసి.

భూదేవీ! ఈ మాయను గూర్చి అడుగకుము. నీవు కష్టపడ నేల? మాయను తెలిసికొన జాలవు.

అద్యాపి మాం నజానన్తి రుద్రేన్ద్రాః సపితామహాః

మమ మాయాం విశాలాక్షి కిం పునస్త్వం వసుంధరే.

ఈనాటికిని రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మయు నా మాయను తెలియ జాలరు. విశాలాక్షీ! ఇంక నీ సంగతి చెప్పనేల?

పర్జన్యో వర్షతే యత్ర తజ్జలేన ప్రపూరయేత్‌

దేశో నిర్జలతాం యాతి ఏషా మాయా మమప్రియే.

ఒకచోట వాన దేవుడు పెద్దగా కురియును. ఆ ప్రాంతము నీటితో నిండి పోవును. మరియొక దేశము నీటి బోట్టు లేక యెండి పోవును. ప్రియా! ఇది నా మాయ.

సోమోపి క్షీయతే పక్షే పక్షే చాపి వివర్ధతే,

అమాయాం న సదృశ్యేత మాయేయం మమ సుందరి

చంద్రుడు ఒక పక్షమున తరుగుదల నందును. మఱియొక పక్షమున పెరుగు దల పొందును. అమావాస్య నాడు మొత్తముగా కనబడడు. ఇదియే నా మాయ.

హేమన్తే సలిలం కూపే ఉష్ణం భవతి తత్త్వతః,

భవేచ్చ శీతలం గ్రీష్మే మాయేయం మమ తత్త్వతః.

హేమంతమున (చలి కాలమున) నూతిలో నీరు వేడిగా నుండును. గ్రీష్మమున (వేసవి యందు) చల్లగా నుండును. ఇది తత్వమును బట్టి నా మాయ.

పశ్చిమాం దిశ మాస్థాయ యదస్తం యాతి భాస్కరః

ఉదేతి పూర్వతః ప్రాత ర్మాయేయం మమ సుందరి.

సూర్యుడు పడమటి దిక్కున చేరి అస్తమించి మరల ఉదయమున తూర్పు దిక్కున ఉదయించును. ఇది నా మాయ.

శోణితం చైవ శుక్లం చ ఉభే ప్రాణిషు సంస్థితే

గర్భే చ జాయతే జన్తు ర్మమ మాయే య ముత్తమా.

రక్తము, శుక్లము రెండును ప్రాణుల యందు ఉండు ననియే. అవి గర్భమున చేరి క్రొత్త జీవియగు చున్నది. ఇది నా ఉత్తమ మాయ.

జీవః ప్రవిశ్య గర్భేతు సుఖం దుఃఖాని విన్దతి

జాతశ్చ విస్మరేత్‌ సర్వ మేషా మాయా మమోత్తమా.

జీవుడు గర్భమున ప్రవేశించి సుఖమును, దుఃఖమునను పొందును. పుట్టి నంతనే దాని నంతటిని మరచి పోవును. ఇది నా గొప్ప మాయ.

ఆత్మకర్మాశ్రితో జీవో నష్టసంజ్ఞో గతస్పృహః

కర్మణా నీయతేన్యత్ర మాయైషా మమ చోత్తమా.

తాను చేసిన కర్మములను పట్టి వ్రేలాడి జీవుడు తెలివిని, చేష్టను కోల్పోవును, కర్మము వానిని మరియొక చోటికి గుంజుకొని పోవును. ఇది నా దొడ్డ మాయ.

శుక్రశ్రోణితసంయోగా జ్జాయన్తే యది జన్తవః,

అంగుల్య శ్చరణౌ చైవ భుజౌ శీర్షం కటి స్తథా.

పృష్ఠం తథోదరం చైవ దంతోష్ఠ పుటనాసికా

కర్ణనేత్ర కపోలౌ చ లలాటం జిహ్వయా సహ

ఏతయా మాయయా యుక్తా జాయన్తే యది జన్తవః.

రక్తము, వీర్యము, కలిసి కదా జంతువులు పుట్టుట! వ్రేళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, కనులు, బుగ్గలు, నుదురు, నాలుక ఇవన్నియు ఏర్పడుట నా మాయ, దాని తోడనే ప్రాణుల పుట్టుట.

తస్యైవ జీర్యతే భుక్త మగ్నినా పీత మేవచ,

అధశ్చ స్రవతే జన్తు రేషా మాయా మమోత్తమా.

ఆతడు తిన్న తిండిని జఠరాగ్ని పీల్చి వేయగా అది అరిగి పోవుచున్నది. పిదప క్రింది నుండి మల రూపమున జారిపోవు చున్నది. ఇది నా మహా మాయ.

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గన్ధశ్చ పఞ్చమః,

అతః ప్రవర్తతే జన్తు రేషామాయా మమప్రియే.

శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను వానితో జంతువు ప్రవర్తించు చున్నది. ప్రియా! ఇది నా మాయ (జంతువనగా పుట్టిన ప్రాణి అని అర్థము)

సర్వర్తుషు నిజాకారః స్థావరే జంగమే తథా,

తత్త్వం నజ్ఞాయతే తస్య మాయైషా మమసుందరి.

స్థావరము, జంగమము అను వారి యందు అన్ని ఋతువులలో ఒకే ఆకారము. కాని దాని తత్త్వము తెలియ రాదు. ఇది నా మాయ.

ఆపో దివ్యా స్తథా భౌమా ఆపో యేషు ప్రతిష్ఠితాః

వ చ వృద్ధిం ప్రయాన్త్యత్ర మాయైషా పరమా మమ.

ఆకసమున నీరు కలదు. భూమి యందు నీరున్నది. అవి వృద్ధి పొంద కున్నవి. ఇది నా పరమ మాయ.

వృష్టౌ బహూదకాః సర్వే పల్వలాని సరాంసి చ

గ్రీష్మే సర్వాణి శుష్యన్తి ఏతన్మాయాబలం మమ.

వర్షర్తువున గుంటలు, చెరువులు నీటితో నిండి పోవును. గ్రీష్మమున అవి యన్నియు ఎండి పోవును. ఇది నా మాయా బలము.

హిమవచ్చిఖరా న్ముక్తా నామ్నా మన్దాకినీ నదీ,

గాం గతా సా భవేద్‌ గంగా మాయైషా మమకీర్తితా.

హిమవంతుని శిఖరము నుండి జాలు వారిన నదికి మందాకిని అని పేరు. అదియే నేలకు దిగు నప్పటికి గంగ అయినది. ఇది నా మాయ. (గాంగతా = నేలకు వచ్చినది = గంగా).

మేఘా వహన్తి సలిలం లవణం సలిలార్ణవే

వర్షన్తి మధురం లోకే సర్వం మాయాబలం మమ.

ఉప్పునీటి సముద్రము నుండి మేఘములు నీరు గ్రహించు చున్నవి. లోకమున తీయని నీటిని కురియు చున్నవి. ఇది నా మాయా బలము.

రోగార్తా జన్తవః కేచిద్‌ భక్షయన్తి మహౌషధమ్‌,

తస్య వీర్యం సమాశ్రిత్య మాయాంతు విసృజామ్యహమ్‌.

కొన్ని ప్రాణులు రోగములను పొంది గొప్ప ఔషధములను తిను చుందురు. వాని శక్తి యందు నేను నా మాయను జార విడుతును.

ఔషధే దీయమానేపి జన్ముః పఞ్చత్వ మేతి యత్‌,

నిర్వీర్య మౌషధం కృత్వా కాలో భూత్వా హరామ్యహమ్‌.

మందు నొసగినను ప్రాణి మరణించు చున్నది. అనగా ఔషధమును శక్తి హీనము చేసి నేను కాల రూపుడనై హరించు వేయుదు నన్నమాట.

ప్రథమం జాయతే గర్భః పశ్చా జ్జాయేత వై పుమాన్‌,

జాయతే మధ్యమ స్తత్ర తతోపి జరసా పునః,

తత ఇన్ద్రియ నాశశ్చ ఏతన్మాయాబలం మమ.

మొదట గర్భము ఏర్పడు చున్నది. తరువాత పురుషుడు పుట్టు చున్నాడు. కొంత కాలమునకు నడి వయస్సు వాడగు చున్నాడు. అటుపై ముసలి తనము, ఆపై ఇంద్రియములు నశించు చున్నవి. ఇది యంతయు నా మాయా బలము.

యద్భూమౌ నిహితం బీజం తస్మాత్త జ్జాయతేంకురమ్‌,

ఏకబీజాద్‌ ప్రకీర్ణాద్‌ వై జాయన్తే తాని భూరిశః,

తత్రామృతం విసృజామి మాయాయోగేన మాధవి.

నేల యందు విత్తనము నాటుదురు. అది మొలకెత్తు చున్నది. వెదజల్లిన ఒక్క విత్తనము నుండి గింజలు పెక్కులు కలుగు చున్నవి. దాని యందు నేను మాయ కూర్పుతో అమృతమును జాలు వార్తును.

లోక ఏవం విజానాతి గరుడో వహతేచ్యుతమ్‌,

భూత్వా వేగేన గరుడో వహామ్యాత్మాన మాత్మనా.

గరుడుడు విష్ణువును మోయు చున్నాడని లోకము సంభావించును. నిజమునకు నేనే వేగముతో గరుడుడనై నన్ను నేను మోసికొను చున్నాను.

యా ఏతా దేవతాః సర్వా యజ్ఞభాగేన తోషితాః,

మాయా మేతా మహం కృత్వా తోషయామి దివౌకసః.

ఈ దేవత లందరు యజ్ఞ భాగముతో సంతసించు చున్నారు. నేనే ఈ మాయను కల్పించి స్వర్గ వాసులను తృప్తి పరచు చున్నాను.

లోకాః సర్వే విజానన్తి దేవా నిత్యం మఖాశినః,

మాయామేతా మహం కృత్వా రక్షామి త్రిదశాన్‌ సదా.

దేవతలు ఎల్లవేళల యజ్ఞము నందలి హోమ ద్రవ్యములను భుజింతురని లోకు లందరు తలచు చున్నారు. నేనే మాయను కల్పించి సర్వదా ఆ దేవతలను రక్షించు చుందును.

సర్వోపి భజతే లోకో యష్టారం చ బృహస్పతిమ్‌,

మాయా మాంగిరసీం కృత్వా యాజయామి దివౌకసః.

బృహస్పతి యజ్ఞకర్త అని లోక మంతయు కొనియాడు చుండును. ఆంగీరస మాయను కల్పించి దేవతల యాగములను చేయించు నది నేనే.

సర్వే లోకే విజానన్తి వరుణః పాతి సాగరమ్‌,

మాయాంతు వారుణీం కృత్వా అహం కృత్వా అహంపామి మహోదధిమ్‌.

వరుణుడు సముద్రమును పాలించు చున్నాడని లోకు లందరు తలతురు. వారుణ మాయ కల్పించి మహా సముద్రమును కాపాడు చున్నవాడను నేనే.

సర్వే లోకా విజానన్తి కుబేరోయం ధనేశ్వరః,

కుబేర మాయా మాదాయ అహం రక్షామి తద్ధనమ్‌.

కుబేరుడు ధనమునకు ప్రభువని లోకము లన్నియు సంభావించును. కుబేర మాయను స్వీకరించి ఆ ధనమును నేనే రక్షింతును.

ఏవం లోకా విజానన్తి వృత్రః శక్రేణ సూదితః,

శాక్రీం మాయాం సమాస్థాయ మయా వృత్రో నిఘాదితః.

వృత్రుని ఇంద్రుడు పరిమార్చెనని లోకులు అనుకొను చున్నారు. ఇంద్ర సంబంధమగు మాయను తాల్చి వృత్రుని రూపు మాపినది నేనే!

ఏవం లోకా విజానన్తి ఆదిత్య శ్చ ధ్రువో మహాన్‌

దేహం మాయామయం కృత్వా వహామ్యాదిత్య మేవచ.

లోకులు ఆదిత్యుడు కదలని మహా గ్రహమని తల పోయుదురు. మాయా మయమగు దేహమును తాల్చి ఆదిత్యుని మోయు చున్నది నేనే.

ఏవ మాభాషతే లోకో జలం కిం నశ్యతేఖిలమ్‌,

బడబాముఖమాయేన పిబామి తదహం జలమ్‌,

వాయుమాయా మహం కృత్వా మేఘేఘ విసృజామ్యహమ్‌.

నీరంతయు వట్టి పోవు చున్నదని లోకము వాకొనును. బడబాగ్ని రూపము తాల్చి దానింతటిని నేనే త్రాగివేయు చున్నాను. వాయు మాయను తాల్చి దానిని మేఘము లందు వదలు చున్నాను.

యదిదం భాషతే లోకః కృత్వైతత్‌ తిష్ఠతే జలమ్‌,

దేవా అపి నజానన్తి అమృతం కుత్ర తిష్ఠతి,

మమమాయానియోగేన తిష్ఠతేహ్యౌషధీషు తత్‌.

లోకము ఈ నీరంతయు గూడుకట్టి యెక్కడ నిలుచు చున్నది అని పలుకును. అమృత మొక్కడ నిలుచునో దేవతలును ఎరుగరు. అది నా మాయ చేసిన ఆజ్ఞ మేరకు ఓషధుల యందు నిలిచి యున్నది.

లోకోహ్యేవం విజానాతి రాజా పాలయతే ప్రజాః,

రాజమాయామహం కృత్వా పాలయామి వసుంధరమ్‌.

రాజు ప్రజలను పాలించునని లోకము భావన. కాని రాజ మాయను కల్పించి వసుంధరను నేను పాలించు చున్నాను.

యేతు వై ద్వాదశాదిత్యా ఉదేష్యన్తి యుగక్షయే,

ప్రవిశ్య తానహం భూమి మాయాం లోకే సృజామ్యహమ్‌.

యుగము ముగియు నప్పుడు పన్నిద్దరు భాస్కరులు ఉదయింతురు. నేను వారిలో చొరబడి లోకమున మాయను సృజింతును.

వర్షశ్చ పాంసునా భూమి లోకేషు పతతే సదా.

మాయాంపాంసుమయీం కృత్వాపూరయామ్యఖిలం జగత్‌.

భూమి! వర్షము ధూళితో పాటు లోకముల యందు పడు చున్నది. పాంసుమయా మాయను కల్పించి నేనే జగత్తును నింపుదును.

వర్షతే యత్ర సంవర్తో ధారై ర్ముసల సన్నిభైః,

మాయాం సాంవర్తికీం గృహ్య పూరయామ్యఖిలం జగత్‌.

సంవర్తమను మేఘము రోకలిపాటి ధారలతో కురియును. సంవర్తక మాయను గ్రహించి లోక మంతటిని నింపు వాడను నేను.

యత్‌ స్వపామి వరారోహే శేషస్యోపరి ధారిణి

అనన్త మాయయా చాహం ధారయామి స్వపామి చ.

ధాత్రీ! నేను శేషునిపై పవ్వళించి నిద్రింతునని లోకము భావించును. అనంత మాయతో ఆ శేషుని మోయుచు నిద్రించు చుందును. (అనంతుడు = ఆదిశేషుడు)

వరాహమాయామాదాయ భూమే జానాసి కింన వై

దేవా యత్ర నిలీయన్తే సామాయా మమ కీర్తితా.

భూమి! వరాహ మాయను తాల్చిన సంగతి నీవెరుగవా! దేవులందరు అందు లీనమై పోవుదురు. అది నా మాయ.

తదాపి వైష్ణవీం మాయాం కస్మాజ్జానాసి నైవ చ

ధారితాసి చ సుశ్రోణి వారాన్‌ సప్తదశైవ తు.

అయినను నీవు విష్ణు మాయను ఏ విధముగను ఎరుగ జాలవు. నిన్ను నేను పదునేడు మారులు పట్టి నిలిపితిని.

మాయా తు మమ దేవీయం కృత్వా హ్యేకార్ణవీం మహీమ్‌,

మమ మాయాబలం హ్యేతద్‌ యేన తిష్ఠామ్యహంజలే.

నేను ఈ భూమి నంతటిని ఒకే సముద్రముగా చేసి ఆ జలమున నిలుతును. ఇది నా మాయా బలము.

ప్రజాపతించ రుద్రం చ సృజామి చ హరామి చ

తేపి మాయాం నజానన్తి మమమాయావిమోహితాః.

నేను బ్రహ్మను, రుద్రుని సృజింతును. హరింతును. అయినను వారు నా మాయకు మోహితులై దాని నెరుగ కుందురు.

అథో పితృగణాశ్చైవ యఏతే సూర్యతేజసః,

మాయాం పితృమయీం హ్యేతాం గృహ్లా మీహ చ తత్త్వతః.

సూర్యుని తేజస్సు వంటి తేజస్సు గల ఈ పితృ గణముల వారున్నారే వారిని పితృమయ యగు మాయతో నేను పట్టుకొని యుందును.

కింతు మాయైవ సుశ్రోణి అన్యచ్చ శృణు సుందరి

ఋషి ర్మానుష సారేణ స్త్రియో యోనిం ప్రవేశితః.

మరియు శోభనాంగీ! మరియొక మాయను గూర్చి చెప్పెదను. వినుము. ఒక ఋషిని పురుష స్వరూపుని స్త్రీ యోని యందు ప్రవేశ పెట్టితిని. (స్త్రీని చేసితి నని భావము)

తతో విష్ణో ర్వచః శ్రుత్వా శ్రోతకామా వసుంధరా

కరాభ్యా మంజలిం కృత్వా వాక్యమేతత్‌ తదాబ్రవీత్‌.

అంత విష్ణుని పలుకు విని మరియు విన గోరినదై వసుంధర చేతులతో దోసిలి పట్టి యీ వాక్యమును పలికెను.

ధరణి:

కింతేన ఋషిముఖ్యేన కృతం కర్మ సుదుష్కరమ్‌,

స్త్రీత్వం చైవ పునః ప్రాప్తం స్త్రీయోనించ ప్రజాపతిః.

ఏతన్మే సర్వ మాఖ్యాహి పరం కౌతూహలం మమ

తస్య బ్రాహ్మణముఖ్యస్య స్త్రీత్వే యత్కర్మ పాపకమ్‌.

ధరణి:

ఆ ఋషి ముఖ్యుడు అంత చేయరాని పని యేమి చేసెను? ఆతడు స్త్రీ రూపము నేల పొందెను? ఆ బ్రాహ్మణ ముఖ్యుడు స్త్రీ యగుటకు చేసిన పాప మెట్టిది? నాకు మిక్కలి కుతూహలము కలుగు చున్నది. అది యంతయు వివరించి చెప్పుము.

తతో మహ్యా వచః శ్రుత్వా హృష్టతుష్టమనా హరిః,

మధురం వాక్యమాదాయ ప్రత్యువాచ వసుంధరామ్‌.

అంత భూదేవి మాటవిని మిక్కిలి ఆనంద మందిన హృదయము గల హరి తీయని మాటను గొని భూదేవి కిట్లనెను.

శృణు తత్వైనే మే దేవి ధర్మాఖ్యానం మహామతే

మాయా మమ విశాలాక్షి రోహిణీ లోమహర్షిణీ.

దేవీ! విశాలాక్షీ! మహామతీ! ఆ ధర్మా ఖ్యానమును వినుము. ఒడలు గగుర్పొడుచు నా మాయను గూర్చి చెప్పెదను.

మాయయా మమ యోగేన సోమశర్మా చ క్లేశితః

గతో గతీ రనేకాశ్చ ఉత్తమాధమ మధ్యమాః

బ్రాహ్మణత్వం పునః ప్రాప్తో మమమాయాప్రణోదితః.

నా మాయ కూర్పు వలన సోమశర్మ పడరాని పాట్లు పడెను. పెక్కు గతులు పొందెను. అందు కొన్ని ఉత్తమములు, కొన్ని నీచములు, కొన్ని మధ్యమములు. మరియు తిరిగి నా మాయ త్రోయగా బ్రాహ్మణ త్వమును పొందెను.

యథా బ్రాహ్మణముఖ్యేన స్త్రియో యోనిశ్చ ప్రాపితా,

న తస్య వికృతం కర్మ అపరాధో న విద్యతే.

ఆ బ్రాహ్మణ ముఖ్యుడు స్త్రీ రూపము నెట్లు పొందెనో తెలిపెదను. ఆతడు చేసిన వికృత కర్మము లేదు. అపరాధము లేదు.

మమై వారాధనపరో మమ కర్మపరాయణః

నిత్యం చిన్తయతే భూమి మమ చిన్తాం మనోరమామ్‌.

ఆతడు నిత్యము నా అర్చన యందు, నా పనుల యందు మిక్కిలి శ్రద్ధ కలవాడు. సర్వదా నన్ను గూర్చిన భావనయే అతని హృదయము నలరించును.

అథ దీర్ఘేణ కాలేన తస్య తుష్టోస్మి సుందరి

తపసా కర్మణా భక్త్యా అనన్యమనసా స్తుతః.

అంత పెద్ద కాలమునకు ఈతడు అనన్య హృదయముతో చేసిన తపస్సు. కర్మము, భక్తి అను వానికి నేను మిక్కిలి తృప్తి నందితిని.

తత స్తస్య మయా దేవి దత్వా దర్శన ముత్తమమ్‌,

వరేణ ఛందితో విప్రః సాధు తుష్టోస్మి తే ప్రభో.

అంత నేనతనికి నా ఉత్తమమగు దర్శన మొసగితిని నీ విషయమున తృప్తుడ నైతిని. వరము కోరు కొమ్మంటిని.

వరం వరయ భద్రంతే తవ యద్‌ హృది వర్తతే

తత్‌ తత్‌ సర్వం ప్రదాస్యామి సర్వకామసమాశ్రితమ్‌.

నాయనా! నీ హృదయమున నున్న వరము నెల్ల కోరుకొనుము. అన్ని కోరికలతో కూడిన ఆ వరముల నెల్ల నీకు ఇత్తును.

కింనువై కంచనం గావః కించ రాజ్య మకంటకమ్‌,

అథ చేచ్ఛసి స్వర్గం చ యత్ర తే చాప్సరోగణాః.

సువర్ణమా? గోవులా? ఏ పీడయు లేని రాజ్యమా? లేక అప్సరసల గణముల స్వర్గమా? దేనిని కోరుదువు?

అథ చేచ్ఛసి విప్రేన్ద్ర ఋషీణాం వా తపో మహత్‌,

భవితా వా తతశ్చైవ మమ కర్మ పరాయణః.

లేదా! ఓ విప్రవరా! ఋషుల మహా తపస్సును కోరెదవా? కాక నా కర్మముల యందు మహా శ్రద్ధకల వాడగుదువా?

అథ చేచ్ఛసి కన్యానాం సహస్రం దివ్య ముత్తమమ్‌,

ధన రత్న సమృద్ధానాం హేమ భాండ విభూషితమ్‌.

అట్లు కాక వేయు మంది దివ్య కన్యలను ధనములు రత్నములు సమృద్ధిగా కలవారిని, స్వర్ణా భరణములు అలంకరించు కొన్న వారిని కోరెదవా?

సర్వాసాం దివ్యరూపానాం భవన్త్య ప్సరసోపమాః

దదామి తేవరం చైవ విప్ర యత్తే విచిన్తితమ్‌.

అప్సరసల కీడైన దివ్య రూపము గల ఇంతులను కోరెదవా? నీకు వర మిత్తును. నీవేది తలతువో చెప్పుము.

తతో మమ వచః శ్రుత్వా సచ బ్రాహ్మణపుంగవః

శిరసా పతితో భూమ్యా మువాచ మధురాం గిరిమ్‌.

అంత ఆ బ్రాహ్మణ వరేణ్యుడు నా మాట విని శిరస్సు నేలకు తాకునట్లుగా నేలపై వ్రాలి తీయని పలుకుతో ఇట్లనెను

అథ నో కుప్యసే దేవ వరం సమనుయాచతే,

యత్త్వయా భాషితం దేవ మమ దేయం యదృచ్ఛయా.

నచాహం కాంచనం దేవ నచస్త్రీ రాజ్యమేవ చ

నాప్సరోనైవ చ స్వర్గ మైశ్వర్యం న మనోహరమ్‌.

దేవా! నీవు కోపగింప వేని ఒక్క వరమ డుగుదును. నీవు పలికిన విధముగా నేను కోరిన దొసగ వలయును. నాకు బంగారము వలదు. ఇంతి వలదు, రాజ్యము వలదు. అప్సరస వలదు. స్వర్గము వలదు. మనసున కింపైన ఐశ్వర్యము వలదు.

తథా స్వర్గ సహస్రాణి ఏక స్తత్ర న రోచతే,

జ్ఞాతు మిచ్ఛామి తే మాయాం యయా క్రీడసి మాధవ.

వేయి స్వర్గములలో ఒక్కటియు నాకు రుచింపదు. నీవు ఎల్లప్పుడు క్రీడించు నీ మాయను తెలియ గోరు చున్నాను.

తత స్తస్య వచః శ్రుత్వా సమయా తత్ర భాషితః,

కింమాయయా తే విప్రేన్ద్ర అకార్యం పృచ్ఛసే ద్విజ,

దేవా అపి న జానన్తి విష్ణు మాయా విమోహితాః.

అంత నతని మాట విని నేనిట్లంటిని: ఓ విప్రవరేణ్యా! నీకు ఆ మాయతో పని యేమి? కాని పని నడుగు చున్నావు. విష్ణు మాయ చేత మిక్కిలి మోహితులై దేవతలు కూడ దాని నెరుగరు.

తతో మమ వచః శ్రుత్వా సచ బ్రాహ్మణపుంగవః,

ఉవాచ మధురం వాక్యం మాయాకర్మ ప్రణోదితః.

అప్పుడా బ్రాహ్మణోత్తముడు నా మాట విని మాయా కర్మము పురికొల్పగా తీయగా ఇట్లు పలికెను.

యది తుష్టోసి మే దేవ కర్మణా తపసా తథా

తవ దేవ ప్రసాదేన మమైవం దీయతాం వరః.

దేవా! నా కర్మము, నా తపస్సు నీకు తృప్తి కలిగించినచో నీ అనుగ్రహము వలన నాకీ వరమునే ఒసగ వలయును.

తతస్తు సమయా ప్రోక్త స్తపస్వీ బ్రాహ్మణ స్తథా

గచ్ఛ కుబ్జామ్రకే గంగాం స్నాతో మాయంతు ద్రక్ష్యసి.

అప్పుడా తపస్వియగు బ్రాహ్మణునితో, కుబ్జామ్రక మనుచోట కరుగుము. అందు గంగలో స్నానము చేసి నా మాయను చూతువు, అంటిని.

మమైవం వచనం శ్రుత్వా కృత్వా చైవ ప్రదక్షిణమ్‌,

కుబ్జామ్రకే దేవి విప్రో మమ మాయాభి కాంక్షిణః.

ఈ నామాట విని ఆ విప్రుడు నా మాయను చూడ గోరినవాడై నాకు ప్రదక్షిణ మొనరించి కుబ్జామ్రకమున కరిగెను.

తతః కుండీ త్రిదండీ చ మాత్రా భాండం చ యత్నతః,

స్థాపయిత్వా యథాన్యాయం తీర్థమారాధయద్‌ యథా.

అంత నాతడు కమండలువును, దండమును, ఇతర వస్తువుల భాండములను ఒకచోట నుంచి తీర్థమును సేవించెను.

తతో హ్యవతరన్‌ గంగాం విధిదృష్టేన కర్మణా,

అవగాహ్య తతో గంగాం సర్వగాత్రాణి క్లేదితాః.

అంత నాతడు శాస్త్రము చెప్పిన తీరున గంగ లోనికి దిగి నీట మునిగి అన్ని అవయములను తడుపు కొనెను.

నిషాదాన్తర్గతో గర్భే తిష్ఠతే స చ బ్రాహ్మణః

హృదయే చిన్తయత్‌ తత్ర గర్భక్లేశేన పీడితః.

అంత ఆ బ్రాహ్మణుడు హఠాత్తుగా ఒక నిషాద వనిత గర్భమున నిలిచెను. గర్భ క్లేశము పీడింపగా హృదయమున ఇట్లు తలపోసెను.

అహో కష్టం మయా కించి త్కర్మ వాదుష్కృతం కృతమ్‌,

యోహం నిషాదగర్బేస్మిన్‌ వసామి నరకేషు చ.

అయ్యో! ఎంత కష్టము! నేనేమి పాడుపని చేసితినో ఆటవిక స్త్రీ కడుపున పడితిని. ఈ నరకము లందుంటిని.

ధిక్‌ తపో ధిక్‌ చ మే కర్మ ధిక్‌ ఫలం ధిక్‌ చ జీవితమ్‌.

యోహం నిషాద గర్భేషు పీడ్యతేధన సంకులే.

ఛీ! నా తపమేల? నాకర్మ మెట్టిది? దాని ఫలమేమి. నా బ్రదుకెంత నికృష్ట మయినది! నేను నిషాద గర్భమున ఏ భాగ్యము లేని చోట నలిగి పోవు చున్నాను.

త్రీణి చాస్థిశతే పూర్ణే నవద్వారాభిదర్శనే

మూత్ర పురీషసాకీర్ణే మాంసశోణిత కర్దమే.

దుర్గంధి దుఃసహేచైవ వాతికే శ్లేష్మపైత్తికే

బహురోగసమాకీర్ణే బహుదుఃఖ సమాకులే

అలం కిం తేన చోక్తేన దుఃఖాద్యనుభవామిచ.

మూడు నూర్ల ఎముకలు, తొమ్మిది ద్వారములు, మలమూత్రముల సంకీర్ణత, రక్త మాంసముల బురద, భరింప నలవి కాని దుర్వాసన, వాతము, పిత్తము, శ్లేష్మముల వికారములు, పెక్కు రోగముల రొంపి, పెక్కు దుఃఖముల గందర గోళము గల ఈ గర్భమున, నోటితో చెప్పనేల? పడరాని పాట్లు పడు చున్నాను.

కుతో విష్ణుః కుతో వాహం కుతో గంగాజలానిచ

గర్భసంసారనిష్క్రాన్తః పశ్చాద్‌ యాస్యామి యాంక్రియామ్‌.

విష్ణు వెక్కడ? నేనెక్కడ? గంగా జలము లెక్కడ? ఈ గర్భ సంసారము నుండి వెలువడి యటుపై నేనేమి చేయ వలసి యున్నదో?

ఏవం చిన్తయమానస్తు శీఘ్రం గర్భాద్‌ వినిఃసృతః,

భూమ్యాం తు పతత స్త స్య నష్టం తద్ధి విచిన్తితమ్‌.

ఇట్లు తల పోయుచు ఆతడు వెను వెంటనే గర్భము నుండి వెలువడెను. వెంటనే అతని ఆభావ మంతయు నశించెను.

ప్రజాతా సతతః కన్యా నిషాదస్య గృహే తదా,

యో సౌ కుణ్డీత్రిదండీ చనదీతీరేషు తిష్ఠతి,

నచతం విన్దతే కశ్చి న్మమ మాయాప్రమోహితః.

అంత నతడు ఒక నిషాదుని (ఆటవికుని) యింట కన్యగా పుట్టెను. కమండలువు, దండము నది ఒడ్డున నుండెను. నా మాయ వలన ఆతడు దాని నెరుగ కుండెను.

అథ దీర్ఘేణ కాలేన నిషాదస్య గృహే తదా,

ధనధాన్య సమృద్దస్య వర్తతే సచ బ్రాహ్మణః,

నచ సంజ్ఞాయతే కశ్చిద్‌ విష్ణుమాయాప్రమోహితః.

అంత పెద్ద కాలము ధన ధాన్యములు నిండుగా గల ఆ నిషాదుని యింట ఆ బ్రాహ్మణుడు తిరుగు చుండెను. విష్ణు మాయ క్రమ్మగా ఆతడేమియు తెలియ కుండెను.

అథ దీర్ఘస్య కాలస్య కృతోద్వాహా యశస్వినీ,

పుత్రం దుహితరం చైవ జనయ న్మమ మాయమా.

పిదప పెద్ద కాలమునకు ఆమె వివాహము చేసికొని నా మాయ వలన కొడుకును కూతురును కనెను.

భక్షాభక్షం చ ఖాదేత పేయాపేయం చ తత్పిబేత్‌,

జీవాని చైవ విక్రీయ ఘాతితాంశ్చ తతస్తతః.

తిన దగిన దానిని, తగని దానిని తినెను. త్రాగ దగిన దానిని, తగని దానిని త్రాగెను. చంపిన జంతువులను అందందు అమ్ముకొని బ్రతుకు చుండెను.

కార్యాకార్యం నజానీతే వాచ్యావాచ్యం న జానతి,

గమ్యాగమ్యం నజానాతి మాయాజాలేన మోహితః.

ఏది చేయ నగునో ఏది చేయరాదో, ఏది పలుక నగునో ఏది పలుక రాదో, ఏది పొంద దగినదో, ఏదికాదో ఏదియు నా మాయా జాలము మోహమున తెలియ కుండెను.

పఞ్చాశతేషు వర్షేషు మయా ధ్యాతః సబ్రాహ్మణః,

తపసశ్చ ప్రభావేణ ఘటం స్పర్శతి సుందరి.

ఏబది యేండ్లు గడచిన పిమ్మట నా తలపు వలనను తపస్సు ప్రభావము వలనను ఆ బ్రాహ్మణుడు కుండను తాకెను.

మనసా కురుతే స్నానం వస్త్రం చ పరినిక్షిపేత్‌,

భూమ్యాం వస్త్రం సమాస్థాప్య విగాహయతి జాహ్నవీమ్‌.

మనసులో స్నానమును భావించి వస్త్రములను తీసివైచి వానిని నేలపై ఉంచి గంగలో మునిగెను.

ప్రస్వేద ఘర్మసంతప్తా సశిరశ్చాప మాహతే

జాత స్తపోధన స్తత్ర దండకుణ్డిధర స్తథా.

మిక్కిలి చెమట తాపమున కుడికి తలను నీట ముంపగా అంత ఆ వనిత దండ కమండలువులు తాల్చిన తపోధనుడుగా ఆయెను.

తతః పశ్యతి విప్రోసౌ మాత్రాం కుణ్డం త్రిదణ్డికామ్‌,

వస్త్రాణి దర్శితా శ్చైవ యత్ర సంస్థాపితాః పురా

విప్రేణ జాతజ్ఞానేన విష్ణుమాయాభికాంక్షిణా.

అంత నా విప్రుడు వస్తువుల పెట్టెను, కమండలువును, త్రిదండమును, మున్ను తానుంచిన వస్త్రములను చూచెను. విష్ణు మాయను తెలిసికొన గోరిన విప్రుడనను జ్ఞానము కలిగెను.

తత ఉత్తరత స్తత్ర గంగాయాం తు తపోధనః

సవ్రీడో గృహ్ణతే వాసో యోగం చ పరిచిన్తయన్‌

ఉపవిశ్యాత్ర గంగాయాం పులినేన సమంతికే.

అంత గంగకు ఉత్తరముగా ఆ తపోధనుడు సిగ్గుతో వాసమును కల్పించు కొని దగ్గరలో ఉన్న ఆ యిసుక తిన్నె యందు కూర్చిండి యోగమును గూర్చి భావించుచు నుండెను.

తతో విన్దతి చాత్మానం తత్ర తత్ర విగర్హితమ్‌,

మయా కిం పాపకర్మేణ కృతం కర్మ సుదుష్కరమ్‌,

అగాధం వా పరిభ్రష్టం యేనాహం ప్రాపిత స్త్వియమ్‌.

అంత నాతనికి తాను నిషాద వనితగా నుండగా అందందు చేసిన పాప కర్మము లన్నియు స్మృతికి వచ్చెను. పాప కర్ముడను. చేయరాని పనులు ఎంతగా చేసితిని! అగాధములో కూలి పోయితిని. ఈ స్త్రీ జన్మ మెత్తితిని.

నిషాదస్య కులే జాతో భక్షాభక్షశ్చ భక్షితః,

జీవాశ్చ ఘాతితాః సర్వే స్థలజా జలజానిచ.

బోయ కులమున పుట్టితిని. విచక్షణ లేని తిండి తింటిని. నేలపై నీటిలో నుండు ప్రాణుల నన్నింటిని చంపితిని.

పేయాపేయం చ మే పీతం విక్రీతా శ్చాప్యవిక్రయాః

అగమ్యాగమనం చైవ వాచ్యావాచ్యం న రక్షితమ్‌.

అన్ని విధములగు త్రాగుడులను త్రావితిని. అమ్మరాని వాని నమ్మితిని. పొంద రాని వారిని పొందితిని. అనరాని మాట లంటిని.

వేశ్మతో భోజ్యభోజ్యాని భుక్తం చైవ నసంశయః

పుత్రా దుహితరశ్చైవ నిషాదా జ్జనితా మయా.

అన్ని కొంపల నుండి తినరాని తిండ్లు సంకోచింపక తింటిని. నిషాదుని వలన కొడుకులను, కూతుండ్రను కంటిని.

తతః కిం చాపరాధం వా కేన మామనుచిన్తయే

యేనాహం ప్రాపితో హ్యేనాం నైషాదీ మీదృశీం దశామ్‌.

నేనేమి తప్పు చేసితిని? ఏ పాప కర్మముచేత ఈ నిషాద వనితయగు దశను పొందితినో చెప్పగల ఎవనిని నేనిప్పుడు భావింతును?

ఏతస్మిన్నంతరే భూమి నిషాదః క్రోధమూర్ఛితః,

పుత్రైః పరివృత స్తత్ర మాయా తీర్థముపాగతః.

అని యిట్లనుకొను చున్నంతలో ఆ మాయా తీర్థమునకు ఆ నిషాదుడు (ఆ సోమశర్మ నిషాదిగా ఉన్నప్పటి మగడు) బిడ్డలు చుట్టు కొనిరాగా ఒడ లెరుగని కోపముతో వచ్చెను.

తతో మృగయతే భార్యాం భక్తిమాన్‌ శుభలక్షణామ్‌,

పరిపృచ్చతి చైకైకం తపమానం తపోధనమ్‌.

చక్కని లక్షణములు గల భార్యను మిక్కిలి అనురాగము కలవాడై వెదకు చుండెను.అచట తపస్సు చేయుచున్న ప్రతి తపోధనుని అడుగు చుండెను.

కింను పశ్యధ భార్యా మే గంగాతీరముపాగతా

ఘట మాదాయ హస్తేన ఆగతా జలకారణాత్‌.

అయ్యలారా! నా యింటిది నీటి కొరకు కుండ పట్టుకొని గంగ ఒడ్డునకు వచ్చినది. మీరు చూచితిరా?

తత్రైవ చ నరాః కేచి న్మాయాతీర్థముపాగతాః,

పశ్యన్తే తత్ర పరివ్రాజం కుంభం చైవ యథాస్థితమ్‌.

ఆ మాయా తీర్థమునకు వచ్చిన జనులు, తాము ఒక సన్యాసిని, అదిగో అచట ఉన్న కుండను చూచితిమని చెప్పిరి.

తతో దుఃఖేన సంతప్తః అపశ్యంశ్చ స్వకాం ప్రియామ్‌,

దృష్ట్వా పటం చ కుంభం చ కరుణం పరిదేవయత్‌.

అంత నతడు తన ప్రియురాలిని కానక పెను దుఃఖముతో కుమిలి పోవుచు ఆమె తాల్చిన వస్త్రమును, నీటి కుండను చూచి జాలి కలుగు నట్లుగా ఏడ్చు చుండెను.

ఇదం వాసశ్చ కుంభంచ నదీకూలేషు తిష్ఠతి,

న చాపి దృశ్యతే భార్యా మమ గంగా ముపాగతా.

ఇదిగో వస్త్రము. ఇదిగో కుండ నది ఒడ్డున నున్నవి. గంగకు వచ్చిన నా యింటిది మాత్రము కానరాదు.

అథ కేనాపి గ్రహేణ స్నాయమానా తపస్వినీ

గృహీతా తోయసంస్థేన జిహ్వాలోభేన చస్త్రియమ్‌.

ఆ దీనురాలు స్నానము చేయు చుండగా నీట నున్న మొసలి ఏదైన జిహ్వా చాపల్యము చేత తిని వేసెనేమో!

న వాప్రియం మయేత్యుక్త్వా కదాచిదపి వాచకమ్‌,

స్వప్నేపి నోక్తపూర్వోస్మి కదాచిదపి చాప్రియమ్‌.

ఒక్క నాడును, కలలో కూడ నేనామెను మనసునకు కష్టము కలుగు నట్లు తిట్టి యుండలేదు.

అథవాపి పిశాచేన భక్షితా భూతరాక్షసైః,

ఆకృష్టా కింను రోగేణ గంగాతీరసమాశ్రితా.

ఒక వేళ ఏ పిశాచమో, భూతమో, రక్కసియో మ్రింగ లేదు కదా! గంగ ఒడ్డునకు చేరిన ఆమెను ఏ రోగమో పట్ట లేదు కదా!

కిం కృతం దుష్కృతం పూర్వం మమ కర్మ సుసంకటమ్‌,

యేన మత్పురతో భార్యా త్వద్దృష్టా విగతిం గతా.

నేను మునుపు ఎంత ఘోరమైన పాపము చేసితినో నా ముందు నా భార్య మీరు చూచు చుండగా దుర్గతి పాలైనది.

ఏహి మే సుభగే కాంతే మమ ఛందానువర్తిని,

పశ్యైతాన్‌ వా సగంభీరాన్‌ క్లిశ్యమానా నితస్తతః.

ఓ సుందరీ! నా యిష్టమును బట్టి నడచుకొను దానవు. రా! ఇదిగో పరమ దుఃఖముతో నలిగి పోవుచు అటుఇటు తిరుగు చున్న ఈ బిడ్డల నైన చూడుము.

కిం మాం పశ్య వరారోహే త్రీన్‌ పుత్రాన్‌ సుసుబాలకాన్‌,

దుహితౄః పశ్య చత్వారి సర్వంతు మమ మానదే.

ఓసి నా ప్రియురాలా! ఈ నీ పాల బుగ్గల పసి బాలురు ముగ్గురు కొడుకులను, నలుగురు బిడ్డలను చూడుము. నీవే నాకు అన్నియు అయితివి.

మమ పుత్రా రుదన్త్యేతే బాలకా స్తవ లాలసాః,

నిత్యం చ దారికా రక్ష మమ దుష్కృత కారిణః.

నీ కొరకు అంగలార్చు చున్న ఈ పిల్లలు ఏడ్చు చున్నారు. పాపాత్ముడనగు నా బిడ్డలను కాపాడుము.

కామం మాం క్షుధితం చైవ యాస్యసి త్వం పిపాసితమ్‌,

త్వమేవ ముచ్య కల్యాని మమ భక్త్యా వ్యవస్థితా.

నాపై మిక్కిలి ప్రేమకల దానవు, ఆకలి దప్పులతో అలమటించు చున్న నన్ను వదలి పోయితివి.

ఏవం విలపమానస్య నిషాదస్య యతస్తతః,

సవ్రీడో భాషతే విప్రో నిషాదత గచ్ఛ నాస్తి సా

సుఖం యోగం సమాఖ్యాతం పుత్ర భార్యా గతోహియః.

ఇట్లు పరమ కరుణగా ఆ నిషాదుడు ఏడ్చు చుండగా ఆ విప్రుడు సిగ్గుతో నిషాదునితో ఇట్లు పలికెను. ఆమె లేదు. పొమ్ము. ఆలు బిడ్డలు నశించుట సుఖమైన యోగమని పెద్దలు చెప్పుదురు.

తం తథా రుదితం దృష్ట్వా కారుణ్యేన పరిప్లుతమ్‌,

నిషాదం భాసతే తత్ర గచ్ఛ కిం పరిక్లిశ్యసే.

ఇంకను అట్లే కరుణతో నిలువెల్ల మునిగిన ఆ నిషాదునితో ఆ విప్రుడు ఇట్లు పలికెను. వెళ్లు. ఊరక యేల అట్లు కుమిలి పోయెదవు?

తాని బాలాని రక్షస్వ ఆహారై ర్వివిధై రపి

ఏతే వై త్రాయాణీయాస్తే సదా కాలం హి పుత్రకాః.

పెక్కు విధములగు ఆహారములతో ఈ పిల్లలను రక్షింపుము. ఈ నీ బిడ్డలను ఎల్లవేళ నీవు రక్షింప వలయును గదా!

పరివ్రాజవచః శ్రుత్వా నిషాద స్తస్య సన్విధౌ,

ఉవాచ మధురం వాక్యం దుఃఖశోకపరిప్లుతాః.

ఆ నిషాదుడు అ సన్యాసి పలుకువిని, దుఃఖము నిలువెల్ల క్రమ్ముకొనగా మెల్లగా ఇట్లు పలికెను.

అహో మునివర శ్రేష్ఠ అహో ధర్మవిదాం వర,

సాన్త్వితోస్మి త్వయా విప్ర వచనై ర్మధురాక్షరైః.

అయ్యవారా! గొప్ప ధర్మము తెలిసిన వాడవు. తీయని మాటలతో నన్ను ఓదార్చితివి.

నిషాదస్య వచః శ్రుత్వా సమునిః సంశితవ్రతః,

ఉవాచ మధురం వాక్యం దుఃఖశోకపరిప్లుతః.

నిష్ఠతో చేసిన వ్రతములు గల ఆ ముని నిషాదుని మాట విని దుఃఖము తన్ను ముంచి యెత్తగా ఇట్లు పలికెను.

మా రోదీ ర్వచ్మి భద్రం తే తవాహం ప్రవరస్త్రియః,

గంగాతీరం సమాసాద్య జాతాస్మి చ తవప్రియా.

ఏడవకు! నీకు చెప్పెదను. నీకు శుభ మగును. నేనే నీ దొడ్డ భార్యను. ఈ గంగ ఒడ్డుకు వచ్చి నీకు ప్రియురాల నయితిని.

పరివ్రాజవచః శ్రుత్వా నిషాదో విగతజ్వరః,

శ్లక్షం వచన మాదాయ ప్రత్యువాచ ద్విజోత్తమమ్‌.

సన్యాసి మాట విని నిషాదుడు కొంత తేరుకొని ఆ బ్రాహ్మణోత్తమునితో ప్రియమైన పలుకులతో నిట్లనెను.

కిమిదం భాషసే అవ్యక్తం యత్కదాచన,

అభాషైవ చ కర్మాణి పుంసః స్త్రీత్వం నచార్హతి.

బాపనయ్యా! ఏమి యిట్లు అయోమయముగా పలుకు చున్నావు? మగవాడు ఆడుది యగుట ఎన్నడు విన్నది కూడ కాదు.

నిసాదస్య వచః శ్రుత్వా బ్రాహ్మణో దుఃఖమూర్ఛితః,

ఉవాచ మధురం వాక్యం గంగాతీరేషు ధీవరమ్‌.

నిషాదుని మాటవిని బ్రాహ్మణుడు ఒడ లెరుగని శోకముతో గంగ ఒడ్డున ఆ బోయతో తీయగా ఇట్లు పలికెను.

శీఘ్రం గచ్ఛ స్వకం దేవ మేతాన్‌ గృహ్య స్వబాలకాన్‌,

సర్వేషాం చ యథాసంఖ్యం స్నేహం కర్తవ్య మేవచ.

త్వరగా నీ తావునకు ఈ పసి వారిని కొని పొమ్ము. అందరి యందును సమాన మగు ప్రేమ చూప వలయును.

సతేన చోదితో హ్యేవం నిషాదో నావగచ్ఛతి

మధురం స్వర మాదాయ ప్రత్యువాచ స బ్రాహ్మణమ్‌.

ఆతడట్లు చెప్పు చున్నను నిషాదున కేమియు తెలియ వచ్చుట లేదు. తీయని స్వరముతో ఆ బ్రాహ్మణున కిట్లు పలికెను.

కిం త్వయా దుష్కృతం కర్మ కృతం పూర్వం పురాతనమ్‌,

మమ యద్‌ భాషసే చైవ మహం తే ప్రవరస్త్రియః.

అయ్యా! నేను నీ దొడ్డ యిల్లాలి నను చున్నావు. ఇట్లగుటకు నీవు మున్ను చేసిన మహా పాపమేమి?

కేన దోషేణ ప్రాప్తస్వం స్త్రియత్వం ఋషిపుంగవ,

మునిత్వం చ కథం ప్రాప్తం మేతదాచక్ష్య పృచ్ఛతః.

ఋషి పుంగవా! ఏ తప్పు చేత నీకు ఆడుదనము కలిగినది? మరల ముని వెట్లయితివి? ఇది నాకు చెప్పుము.

ఏవం తస్య వచః శ్రుత్వా స ఋషిః సంశితవ్రతః,

ఉవాచ మధురం వాక్యం మాయాతీర్థజలేచరమ్‌.

అని యిట్లు పలుకగా ఆఋషి మాయా తీర్థము జలమున సంభవించిన దానిని గూర్చి తీయగా ఇట్లు పలికెను.

నిషాద శృణు తత్త్వేన యత్కథా మమ తత్త్వతః,

న మయా దుష్కృతం కించిత్కృత మేవ హి కేనచిత్‌.

నిషాదుడా! నా కథ ఉన్న దున్నట్లు చెప్పెదను. వినుము. నేనెన్నడు తప్పుడు పనిని చేయ లేదు. నాచేత ఎవ్వరు చేయింప లేదు.

ఏవం భక్తి సమాచార మభక్ష్యం చైవ వర్జితమ్‌,

సమయారాధితో దేవో లోకనాథో జనార్దనః,

కర్మభి ర్బహుభి శ్చైవ మయా దర్శనకాంక్షిణా.

నేను భక్తి నిండిన ఆచారములు కలిగి, తినరాని దానిని వదలి వైచి అనేక పుణ్య కార్యములతో లోకనాథుడగు జనార్దనుని దర్శనము కోరి ఆరాధించితిని.

అథ దీర్ఘేణ కాలేన మయా దృష్టో జనార్దనః,

ఈప్సితా చ మయా తత్ర విష్ణుమాయా మహాభయా.

అంత పెద్ద కాలమునకు జనార్దనుడు నాకు దర్శన మిచ్చెను. నేనును మహా భయంకరమగు విష్ణు మాయను చూడ గోరితిని.

తతో మాం భాషతే విష్ణుః కింతే మాయేన బ్రాహ్మణ

గచ్ఛ కుబ్జామ్రకం శ్రేష్ఠం స్నానం కురు చ జాహ్నవీమ్‌.

అంత విష్ణువు నాతో విప్రా! నీకా మాయతో పనియేమి? సరే! కుబ్జామ్రక క్షేత్రమున కరుగుము. గంగలో స్నానము చేయుము.

ఏవం తత్ర వచశ్చోక్త్వా విష్ణు శ్చాన్తరధీయత,

అహం మాయాప్రలోభేన గంగాతీర ముపాగతః

స్థాపితం దడ్డ కుణ్ణీ చ పాత్రం వస్త్రం చనిక్షిపేత్‌.

ఇట్లు పలికి విష్ణు వంతర్థానము చెందెను. నేనును మాయ నెరుగు పిచ్చి కోరికతో గంగ ఒడ్డునకు వచ్చితిని. దండమును కుండిని, పాత్రను, వస్త్రములను ఒకచోట ఉంచితిని.

ఉచితే నోపచారేణ నిమజ్య సలిలాంభసి

న తత్ర కించిజ్జానామి కిమిదం కింప్రవర్తతే.

తగు విధమైన ఉపచారముతో గంగ నీట మునిగితిని అటుపై ఏమి జరిగినదో ఏమియు తెలియ నైతిని.

సర్వ మేవ విజానామి యో నిషాదగృహేవసమ్‌

లోభమోహార్ధకామార్థక్రోధేన చ పరిప్లుతః.

లోభము, మోహము, కామము, క్రోధము అనునవి ముంచి యెత్తు చుండగా నిషాదుని యింట ఉండుట మాత్రము తెలియ వచ్చినది.

తతః కేనాపి కర్మేణ జలకృత్య మిహాగతః

నిమజ్య సలిలే చాత్ర జాతోస్మి బ్రాహ్మణోహ్యహమ్‌.

అంత ఏదో కర్మ వశమున నీటి కొరకు ఇక్కడకు వచ్చితిని. ఇచట నీట మునిగి మరల బ్రాహ్మణుడ నయితిని.

నిషాద పశ్య కుండం చ మాత్రా వస్త్రం సచీవరమ్‌,

పఞ్చా శద్వర్షవాసోపి తతస్తత్ర న నశ్యతి.

నిషాదా! ఇదిగో కుండ, ఇవిగో కావిగుడ్డలు, ఏబది యేండ్లుయినను చెడక ఇక్కడ అట్లే యున్నవి.

నజీర్ణా శ్చీవరాః సర్వే జాహ్నవ్యానైవ తేహృతాః.

చివికి పోయిన నా కావి గుడ్డలన్నియు గంగలో కొట్టుకొని పోకున్నవి.

ఏవం తేన తతశ్చోక్తో నిషాదోదృశ్యతాం గతః,

యే చ తే బాలకా స్తత్ర తేషాం కశ్చిన్నదృశ్యతే.

ఇట్లతడు పలుకు చుండగా నిషాదుడు అదృశ్యు డాయెను. అచట నున్న బిడ్డలలో ఒక్కడును కాన రాడాయెను.

సతతో బ్రహ్మణో దేవి తప స్తపతి నిశ్చితః

ఊర్ద్వశ్వాసోర్ధ్వబాహుశ్చ వాయుభక్ష పరాయణః.

అంత నా బ్రాహ్మణుడు శ్వాసను పైకి గట్టిగా తీసి కొనుచు (ప్రాణాయామము చేయుచు) చేతులు పైకెత్తి, వాయువు మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయు చుండెను.

తస్య వై తిష్ఠమానస్య అపరాహ్ణం తు జాయతే,

తతః ప్రముచ్య తోయం తం దేవి కృత్వా యథోచితమ్‌.

అట్లు నిలిచి యుండగా అపరాహ్ణ సమయ మాయెను. అంత నాతడు నీటిని వదిలి తగు కృత్యములు చేసికొనెను.

కర్మణ్యేషు చ పుణ్యేషు మమార్చనరత స్తతః,

అర్చయిత్వా యథాన్యాయం వీరాసన ముపాగతః,

వృతస్తు బ్రాహ్మణౖ ర్ముఖ్యై ర్గఙ్గాస్నానేషు వై ద్విజః.

నా పూజల యందు, పుణ్య కార్యముల యందు ఎల్లవేళల మిక్కిలి ఆసక్తి కలవాడై వీరాసనము వేసికొని నన్నర్చించు చుండెను. గంగా స్నానమునకు వచ్చిన ఉత్తమ బ్రాహ్మణు లందరు ఆతని చుట్టును చేరిరి.

ఊచు స్తతో ద్విజా స్తత్ర తపస్వీ తపసిస్థితః

పూర్వాహ్ణే స్థాపితా మాత్రా త్రిదండీ దండకుండికా.

ఇతో గతోసి బ్రహ్మేన్ద్ర స్థాపయిత్వాతుచీవరాన్‌

విస్మారిత మిదం స్థానం శీఘ్రం న త్వముపాగతః.

అంత నా బ్రాహ్మణు లందరు అట్లు తపస్సున కూర్చున్న ఆ తాపసితో ఇట్లనిరి: బ్రాహ్మణోత్తమా! ఎప్పుడో పూర్వాహ్ణమున ఈమాత్ర, దండము, కమండలువు, నార చీరలు ఇక్కడ ఉంచి ఎటకో పోయితివి. ఈ స్థలమును మరచితివి? త్వరగా రాకుంటివి.

తతో విప్రవచః శ్రుత్వా తూష్ణీ మాసీన్ముని స్తదా,

బ్రాహ్మణానుగతం స్థాన మాత్మనాత్మాను సంస్థితః.

ఆ విప్రుల పలుకులు విని ఆ ముని మిన్న కుండెను. వారున్న తావును గూర్చి మనసులో భావించు చుండెను.

ఏతస్మిన్నంతరే దేవి స చ బ్రాహ్మణపుంగవః,

చిన్తయన్‌ మనసా దేవి కిమిదం చాద్భుతం మహత్‌

అద్య పఞ్చాశద్‌ వర్షాణి అమావాస్యాతు ఏష వై.

ఇంతలో ఆ బ్రాహ్మణ ప్రవరుడు మదిలో ఇట్లు తలపోసెను. ఇదియేమి ఆశ్చర్యము? ఏబది వత్సరములు గడచినవి. ఈనాడు అమావాస్య.

కిమిదం వర్తతే కాలం కిం మామూచుశ్చ బ్రాహ్మణాః

పూర్వాహ్ణే స్థాపితా మాత్రా అపరాహ్ణే కుతో గతః.

ఇపుడు ఏ కాలము జరుగు చున్నది? ఈ బ్రాహ్మణులు పలుకు చున్న దేమి? నా సంచిని పూర్వాహ్ణమున ఇచట ఉంచి ఎటకేగి అపరాహ్ణమునకు వచ్చితివను చున్నారు.

ఏతస్మిన్నన్తరే దేవి బ్రాహ్మణం తస్య బ్రాహ్మణః,

దర్శితం తస్య చాత్మానం దివ్యరూపేణ వర్చసా,

దర్శయిత్వా తతో రూపం భాషితం వచనం మయా.

ఇంతలో అచట బ్రాహ్మణ స్వరూపములో ఉన్న నేను ఆ బ్రాహ్మణునకు దివ్యమైన రూపము తేజస్సు గల నా నిజ రూపమును చూపితిని. చూపి అతనితో ఇట్లంటిని.

స్నాతుకామో గతో విప్ర పూర్వాహ్ణే జపకారణాత్‌,

ఇదం పశ్యాపరాహ్ణే వై కింప్రభో వినివర్తసే.

విప్రా! స్నానము చేయ గోరి జపము కొరకు పూర్వాహ్ణమున వెళ్లితివి. ఇదిగో, చూడు. అపరాహ్ణము. ఇపుడు తిరిగి వచ్చితి వేమి?

మమైవ వచనం శ్రుత్వా స చ శ్రోత్రియపుంగవః,

కృతాంజలి పుటో భూత్వా మన్యునా చాభిపీడితః,

భూమౌ చ స్వశిరః కృత్వా ప్రత్యువాచ తతో మమ.

నా ఆ మాట విని ఆ శ్రోత్రియుడు చేతులు జోడించి తలను నేల కాన్చి దుఃఖము పైకొనగా ఇట్లు పలికెను.

జాతా మే సప్త జాతాని అపత్యాని చ పుష్కలాన్‌,

విక్రీతం జాతకం మద్యం కచ్ఛపం చ సితాత్మకమ్‌.

నా కేడుగురు పిల్లలు పుట్టిరి. మద్యమును, పిల్లలను, తెల్లని తాబేటిని అమ్మితిని.

భక్షాభక్షం కృతం చాన్యత్‌ పేయాపేయం చ పీతవాన్‌,

గమ్యాగమ్యం కృతంచాపి వాచ్యావాచ్యం చ భాషితమ్‌.

తినరాని తిండి, త్రాగరాని త్రాగుడు, పొందరాని పొందు పలుక రాని పలుకులు ఈ యన్నింటిని చేసితిని.

కిం మయా వికృతం కర్మ సేవమానేన మాధవ,

తపశ్చ తప్యమానేన కిం మయా వికృతంతపః,

భక్షితం కిమకర్మణ్యం సేవమానేన చాచ్యత.

వ్యభిచారం చ మే తత్ర కృతం చైవ తవార్చనే

ఏత దాచక్ష్వ తత్త్వేన యేనాహం నరకం గతః.

మాధవా! నిన్ను సేవించుచు నేను చేసిన పాడు పనియేమి? తపస్సు చేయుచు నేను చేసిన వికృతమగు తపస్సెట్టిది? నీ ఆరాధన చేయుచు, అచ్యుతా! నేనే పూజకు పనికి రాని కూడు తింటిని? నీ పూజలో నేను చేసిన అకార్య మేమి? నేనా నరకమునకు పోవుటకు చేసిన పాప మెట్టిదో ఉన్న దున్నట్లు నాకు తెలియ జెప్పుము.

ఏతత్‌ తేనామ ముక్తస్తు వచనం దుఃఖసంయుతమ్‌,

మాయాలుబ్ధేన విప్రేన గంగాపులిన సంసది.

తత స్తస్య వచః శ్రుత్వా కరుణం పరిదేవితమ్‌,

ఉక్త వానస్మి తం విప్రం దుఃఖ సంతప్తలోచనమ్‌.

ఇట్లు పెను దుఃఖముతో మాయకు వశుడైన ఆ విప్రుని జాలి గొలుపు ఏడుపు పలుకులు విని గంగ పులినము నందు దుఃఖముతో కుమిలి పోయిన కన్నులు గల ఆతనితో ఇట్లు పలికితిని.

మా మత్యం కురువై విప్ర ఆత్మదోషో హి తే భవత్‌,

యేన దుఃఖ మనుప్రాప్తం తిర్యగ్యోనిం చవై గతః.

విప్రా! మనసును చెదరగొట్టు కొనకుము. ఇది నీ స్వీయ దోషము. దాని వలన ఈ దుఃఖము పొందితివి. నీచ యోని యందు పడితివి.

ఉక్త మేవ మయాపూర్వం విప్ర కిం తవ మాయయా,

దదామి దివ్యలోకాన్‌ వై తాంస్తు బ్రాహ్మణ నేచ్ఛసి.

నేను ముందే చెప్పితిని. విప్రా! నా మాయతో నీకు పనియేమి? దివ్య లోకముల నిత్తును. అంటిని. అవి నీవు కోరకుంటివి.

దృష్ట్వా తు వైష్ణవీ మాయా యాత్వయా బ్రాహ్మణేప్సితా,

నగతం దివసంచైవ నాపరాహ్ణ మశేషతః,

వర్షాణి నైవ ప ఞ్చాశ న్నిషాదస్య గృహేభవత్‌.

బ్రాహ్మణా! నీవు కోరిన వైష్ణవ మాయను చూచితివి. రోజు గడవ లేదు. అపరాహ్ణము కాలేదు. ఏబది యేండ్లు నీవు నిషాదుని యింట నిలువ లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ర్ఛుణుష్వ ద్విజోత్తమ,

యా ఏషా వైష్ణవీ మాయా త్వయా బ్రాహ్మణ ఈప్సితా

త్వయా నతత్కృతం కిఞ్చి చ్ఛుభం వాశుభ మేవవా,

సర్వం మాయామయం తత్ర విస్మయాత్‌ పరితప్యసే.

విప్రవరుడా! మరియొక విషయము కూడ నీకు చెప్పెదను. దానిని ఆలకింపుము. ఇది యంతయు నీవు కోరిన వైష్ణవ మాయ. నీవు శుభమును గాని అశుభమును గాని ఏమియు చేయలేదు. ఇది యంతయు మాయతో నైనది. నీవు విస్మయము వలన కుందుచున్నావు.

యత్త్వయా దుష్కృతం కర్మ వ్యభిచారం తథాకృతమ్‌,

అర్చనం నచతే భ్రష్టం తపశ్చైవ న నాశితమ్‌.

నీవు చేసిన పాడు పని, వ్యభిచారముల వలన నీ తప మేమియు చెడ లేదు. తపస్సు పాడు కాలేదు.

పునరన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రు ణోషి ద్విజోత్తమ,

యస్య చైవాపరాధేన స్వయం కృత్వా భవాన్తరే.

మరియొక విషయము చెప్పెదను. పూర్వ జన్మము నందలి ఏ అపరాధముతో నీవిట్లయితివో దానిని చెప్పెదను.

శుద్ధా భాగవతా విప్ర మద్భక్తా నాభివాదితాః,

తస్య దోషాపరాధస్య ఫలం ప్రాప్తం తతో ద్విజ,

సర్వధా వన్దనీయా వై భక్తా భాగవతాః శుచిః.

నా భక్తులు, పరిశుద్ధులు నగు భాగవతులను నీవు అభినందింప కుంటివి. ఆ తప్పు ఫలమును నీవిపుడు ఈ రూపమున పొందితివి. నా భక్తులు శుచులు అగు భాగవతులు ఎల్ల విధముల వందనీయులు.

యే తు వన్దన్తి విప్రేన్ద్ర భక్తాన్‌ భాగవతాన్‌ మమ

వన్దితో స్మీహ విప్రేన్ద్ర సత్య మేతన్న సంశయః.

భక్తులగు భాగవతులకు వందనము చేయువారు నాకు వందనము చేయు వారగుదురు. ఇందు సందియము లేదు.

యో మాం పృచ్ఛతి వై గన్తుం యస్య వాచ్యం న విద్యతే,

అనన్య మనసో భూత్వా మద్భక్తేషు నియోజయేత్‌.

నన్ను పొందుటకు కోరు వాడును, ఎట్టి నిందలు పొందని వాడును అనన్యమగు మనస్సుతో నాభక్తుల యందు తగులము పొంద వలయును.

గచ్ఛ బ్రాహ్మణ సిద్దోసి ప్రాణాం శ్చాత్రైవ సంన్యస,

గచ్ఛ మే పరమం స్థానం శ్వేత ద్వీపం మయా సహ.

పొమ్ము! బ్రాహ్మణా! సిద్ధుడవైతివి. ప్రాణముల నిచటనే వదలుము. పద! నాతో పాటు పరమ స్థానమగు శ్వేత ద్వీపమున కరుగుము.

ఏవముక్తో మయా భూమి సచ బ్రాహ్మణ పుంగవః,

దత్త్వా వరం మహాభాగే తత్త్రై వాంతర ధీయత.

నేనిట్లు ఆ బ్రాహ్మణునితో పలికి వరమిచ్చి అంతర్థానము చెందితిని.

బ్రాహ్మణో దేహం సంన్యస్య మాయాతీర్థే యశస్విని,

కృత్వా సుదుష్కరం కర్మశ్వేతద్వీపముపాగతః.

బ్రాహ్మణుడిట్లు ఇతరులకు చేయ నలవి కాని మహా కార్యము చేసి మాయా తీర్థమున దేహమును వదలి శ్వేత ద్వీపమును చేరు కొనెను.

ధన్వీ తూణీ శరీ ఖడ్గీ మహాబల పరాక్రమః,

మమ పశ్యతి వై నిత్యం మాయాబలం సుసంస్థితమ్‌.

ధనస్సు, అంబుల పొంది, బాణములు, ఖడ్గము తాల్చి గొప్ప బల పరాక్రమములు కలవాడై నిత్యము చక్కని స్థితితో నున్న నా మాయా బలమును ఆతడు చూచు చున్నాడు.

తవ మాయేన కింభూమే నమాయాంజ్ఞాతుమర్హసి,

మమ మాయాం నజానన్తి దేవదానవ రాక్షసాః.

కనుక భూమి! నీకు నా మాయతో నేమిపని? నా మాయను నీవెరుగ జాలవు. దేవతలు, దానవులు, రక్కసులును ఎవ్వరు ఎరుగరరు.

ఏతత్‌ తే కథితం భూమే మాయాఖ్యానం మహౌజసమ్‌,

మాయాచక్ర మితి ఖ్యాతం సర్వం దుఃఖసుఖావహమ్‌.

భూమీ! నీ కిట్లు మాయ కథ చెప్పితిని. ఇది మహా శక్తి కలిగి నట్టిది. దీనిని మాయా చక్ర మని కీర్తింతురు. సర్వ దుఃఖములను పోకార్చి సుఖముల కూర్చు నట్టిది.

ఆఖ్యానానాం మహాఖ్యానం తపసాం చ పరం తపః,

పుణ్యానాం పరమం పుణ్యం గతీనాం పరమా గతిః.

ఇది కథలలో మహా కథ. తపస్సులలో గొప్ప తపస్సు. పుణ్యములలో పరమ పుణ్యము. గతులలో పరమ గతి.

పఠేచ్చ నిత్యం భక్తేషు అభక్తేషు న కీర్తయేత్‌,

మాపఠేన్నీచమధ్యే వై న పఠేచ్ఛాస్త్రదూషకే.

దీనిని భక్తుల నడుమ చదువ వలయును. భక్తి లేని వారి కడ కీర్తింప రాదు. నీచుల నడుమను, శాస్త్రముల నిందించు వారి కడను పఠింప రాదు.

అగ్రతః పృష్ఠతో మహ్యం మద్భక్తేషు యథాగ్రతః,

పఠతః శోభతే విప్ర నతు యే శాస్త్రదూషకాః.

నా ముందు, నా వెనుక నా భక్తుల ముందును దీనిని చదువు వాడు శోభిల్లును. కాని శాస్త్ర దూషకుల కడ అట్లు ప్రకాశింపడు.

కల్య ముత్థాయ యోనిత్యం పఠతే చ దృఢవ్రతః,

తేన ద్వాదశవర్షాణి మమాగ్రే పఠితం భవేత్‌.

చెదరని దీక్షతో ఉదయమున లేచి నిత్యము దీనిని పఠించు వాడు పండ్రెండేండ్లు నా ముందు పఠించిన వాడగును.

అథ పూర్ణేన కాలేన పుమాన్‌ పఞ్చత్వ మాగతః,

మద్భక్తో జాయతే దేవి వియోనిం చ న గచ్ఛతి.

కాలము నిండిన తరువాత ఆ నరుడు దేహమును చాలించి నా భక్తుడగును. నీచ జన్మములు పొందడు.

య ఏవం శృణుయా న్నిత్యం మహాఖ్యానం వసుంధరే,

న స చాయేత మందాత్మా వియోనిం నైవ గచ్ఛతి.

వసుంధరా! ఈ మహాఖ్యానమును నిత్యము వినువాడు బుద్ధి హీనుడు కాకుండును. నీచ జన్మము పొంద కుండును.

ఏతత్తే కథితం భద్రే త్వయా యత్పూర్వ మీప్సితమ్‌,

ముచ్యమానం వరారోహే కిమన్యత్‌ పరిపృచ్ఛసి.

భద్రా! నీవు నన్ను మున్నడిగిన విషయమును వివరించితిని. ఇటు పై ఇంక ఏమి అడుగుదువు?