వరాహ మహా పురాణము
అధ్యాయము - 97
ధరిణి:
యోసౌ సత్యతపా నామ లుబ్ధో భూత్వా ద్విజో బభౌ,
యే నారుణీ ర్వ్యాఘ్రభయాద్ రక్షితో యః స్వశక్తితః.
దుర్వాససా శ్రుతార్థశ్చ హిమవన్తోత్తరం యయౌ,
తస్యోపరి మహాశ్చర్యం భవతీతి త్వ యేరితమ్,
కీదృశం తన్మమాచక్ష్వ మహత్ కౌతూహలం విభో.
ధరిణి:
ప్రభూ! సత్య తపుడను వాడు మొదట బోయ అయి, తరువాత బ్రహ్మణుడై ప్రకాశించెను, అతడు తన శక్తి మేరకు ఆరుణి అను వానిని పెద్దపులి భయము వలన కాపాడెను. దుర్వాసుడు ఉపదేశింపగా హిమ వత్పర్వతపు ఉత్తర దిశ కరిగెను. అందొక గొప్ప వింత జరిగెనని నీవు చెప్పితివి. అది ఎట్టిది? చాల వేడుకగా నున్నది. నాకు దానిని చెప్పుము.
శ్రీవరాహ దేవుడు:
సహి సత్యతపాః పూర్వం భృగువంశోద్భవో ద్విజః,
దస్యుసంసర్గ సంభూతో దస్యువత్ సమజాయత.
శ్రీవరాహ దేవుడు:
ఆ సత్యతపుడు పూర్వము భృగు వంశమున పుట్టిన బ్రాహ్మణుడు, క్రూరుల సంసర్గము వలన బోయ వాడుగా పుట్టెను.
తతః కాలేన మహతా ఋషినఙ్గాత్ పున ర్ద్విజః,
బభౌ దుర్వాససా సమ్యగ్ బోధితశ్చ విశేషతః.
అంత పెద్ద కాలమునకు ఋషుల చెలిమి వలన మరల బ్రాహ్మణు డాయెను. దుర్వాసుని బోధ వలన మరింత ప్రకాశించెను.
హిమాద్రే రుత్తరే పాదే పుష్పభద్రా నదీ శుభా,
తస్యాస్తీరే శిలా దివ్యా నామ్నా చిత్రశిలా ధరే.
హిమగిరి ఉత్తర పాదమున పుష్పభద్ర అను మంచి నది కలదు. దాని యొడ్డున ఒక దివ్య శిల కలదు. దాని పేరు చిత్రశిల.
న్యగ్రోధశ్చ మహాం స్తత్ర నామ్నా భద్రమహావటః,
తత్ర సత్యతపాః స్థిత్వా తపః కుర్వన్ మహాతపాః.
అక్కడ ఒక గొప్ప మఱిచెట్టు భద్ర మహావట మనునది కలదు. అందా సత్య తపుడు తపస్సు చేయుచు మహాతాపసు డాయెను.
స కదాచిత్ కుఠారేణ చకర్త సమిధః కిల,
అఛైత్సీ దజ్గుళిం చైకాం వామతర్జనికాం మునిః.
అతడొక నాడు గొడ్డలితో సమిధలు కోయుచు ఎడమ చేతి చూపుడు వ్రేలిని నరకు కొనెను.
ఛిన్నాయా అంగుళే స్తస్య భస్మచూర్ణం భవత్ కిల,
నలోహితం నమాంసం తు నమజ్జా తత్ర దృశ్యతే.
తెగిన వ్రేలి నుండి భస్మపు పొడి ఏర్పడిన దట. రక్తము, మాంసము, క్రొవ్వు ఏదియు కాన రాలేదు.
సోనాదృత్య పునర్వృశ్య సమిధో మునిపుంగవః,
ఏవమేవ పునర్భస్మ స్రవన్తం తు ప్రదృశ్యతే,
అంగుళీసంధితా తేన పూర్వవచ్చాభవత్ కృతే.
అతడు లెక్క పెట్టక మరట సమిధలు కొట్టు చుండెను. మరల అట్లే భస్మము కారుచు కన్పట్టెను. వ్రేలు అతుకు కొని మునుపటి వలె ఆయెను.
తస్మిన్ భద్రవటే చైకం మిథునం కింనరం స్థితమ్,
రాత్రౌ సుప్త మృషే స్తస్య దృష్ట్వా తన్మహ దద్భుతమ్,
ప్రభాతే విమలే ప్రాప్త మిన్ద్రలోక మితిస్మృతిః.
ఆ భద్ర వటమున ఒక కిన్నర మిథునము కలదు. రాత్రి నిద్రించి యుండెను. ఆ ఋషికి సంబంధించిన అద్భుతమును చూచి తెల్లవారిన పిదప ఇంద్ర లోకమున కరిగెను.
అధేంద్రేణ సురాఃసర్వే యక్షగంధర్వకిన్నారాః,
వృష్టాః కిఞ్చదిహాశ్చర్య మపూర్వం కథ్యతామితి.
అంత ఇంద్రునితో పాటు దేవత లందరు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఏదేని మును పెన్నడు మహాశ్చర్యము కలిగెనా చెప్పుడని అడిగిరి.
తత్ర రుద్ర సరస్తేరే యదేతన్మిథునం శుభమ్,
స్థితం కింనరయో స్తచ్చ వాక్యం చేదమువాచ హ.
అంత రుద్ర సరస్సు ఒడ్డున ఉండు ఈ కిన్నరుల జంట ఇట్లు పలికెను.
దృష్టం కిఞ్చిదిహాశ్చర్యం దృష్టంతు హిమవద్గిరౌ
పుష్పభద్రానదీతీరే మహదాశ్చర్య ముత్తమమ్.
హిమ వత్పర్వతమున పుష్ప భద్రానది యొడ్డున మేమొక మహాశ్చర్యమును చూచితి మని వారు పలికిరి.
యదేతత్ సత్యతపసః నమవోచు స్తతః శుభే,
స్రవణం భస్మన శ్చైవ శ్రుతం సర్వం శశంస హ.
సత్య తపసుని వృత్తాంతము, చేతి నుండి భస్మము వెలికి వచ్చుట అను దానిని వివరించి చెప్పిరి.
తచ్ఛ్రుత్వా సహసా శక్రో విస్మితో విష్ణు మబ్రవీత్,
ఆగచ్ఛ విష్ణో గచ్ఛావ హిమవత్పార్శ్వముత్తమమ్,
తత్రాశ్చర్యమపూర్వం మే కథితం కిన్నరేణ హ.
అది విని ఇంద్రుడు అచ్చెరు వంది విష్ణువుతో ఇట్లనెను. విష్ణూ! రమ్ము, హిమ వత్పర్వతము వైవు వెళ్లుదము. అక్కడ ఒక మహాశ్చర్యము సంభవించి నదట. కిన్నరుడు చెప్పెను.
ఏవముక్త స్తతో విష్ణు ర్వరాహః సంబభూవ హ,
మృగయశ్చ తథైవేన్ద్రో జగ్మతు స్తమృషిం ప్రతి.
ఇట్లు పలుకగా విష్ణువు వరాహ మాయెను. ఇంద్రుడు వేటకాడై వారిరువురు ఆ ఋషికడ కరిగిరి.
విష్ణు ర్వరాహరూపేణ ఋషిదృష్టిపథే స్థితః,
భూత్వా దృశ్యోప్యదృశ్యోభూత్ పునరేవచ దృశ్యతే.
విష్ణువు పంది రూపముతో ఋషి కంటబడి నిలిచెను. కనపడియు కనబడక మరల కనబడుచు ఉండెను.
తావదిన్ద్రో ధనుః పాణి స్తీ క్షణసాయకధృక్ పురః,
ఆగత్య సత్యతపస మృషి మేన మువాచ హ.
ఇంతలో ఇంద్రుడు విల్లు చేపట్టి వాడి బాణములు తాల్చి వచ్చి సత్య తపర్షితో ఇట్లనెను.
భగవన్నిహ దృష్టస్తే వరాహః పృథులో మహాన్,
యేన తం హన్మి భృత్యానాం పోషణాయ మహామునే.
మహామునీ! దొడ్డదొరా! ఇచట ఒక బలిసిన పెద్ద పందిని చూచితివా? దానిని నావారి పోషణకై చంపెదను.
ఏవముక్తో మునిస్తేన చింతయామాస ధారణి,
యది తం దర్శయా మ్యస్మై వరాహో హన్యతే తదా.
న చేత్ కుటుంబం క్షుధయా సీదత్యస్య న సంశయః
జాయాపుత్ర సమాయుక్తో లుబ్ధకోయం క్షుధాన్వితః.
ఇట్లు పలుకగా, ధరణీ! ఆ ముని యిట్లు తలపోసెను. ఈతనికి ఆ పందిని చూపితినా దానిని వీడు చంపును. చూప కుందునా, ఆకలితో వీని కుంటుంబము నిస్సంశయముగా నశించును. పెండ్లము బిడ్డలతో వీడు మిక్కలి ఆకలితో నున్నాడు.
సశల్యశ్చ వరాహోయం మమాశ్రమ ముపాగతః,
ఏవం గతే తు కిం కార్యం మయా సౌ చిన్తయన్మునిః,
నాధ్యగచ్ఛత బుద్ధిశ్చ క్షణాత్ తస్య వ్యజాయత.
బాణము తగిలిన పంది నా ఆశ్రమమును చేరుకొనినది. ఇట్టి స్థితిలో నేనేమి చేయుదును? అని ఆ ముని చింతించుచు నిశ్చయము పొంద కుండెను. క్షణములో ఆతని కొక ఊహ తోచెను.
ద్రష్టుం చక్షు ర్నిహితం జఙ్గమేషు జిహ్వా వక్తుం మృగయో తద్ విసృష్టమ్,
ద్రష్టుం చక్షు ర్నాస్తి జిహ్వేహ వక్తుం జిహ్వయైవ స్యాద్ వక్తి యో నాస్తి చక్షుః.
ప్రాణము కలవారికి చూచుటకు కంటిని, పలుకుటకు నాలుకను భగవంతుడు ఏర్పరచెను. వేటకాడు వదలిన దానిని చూచిన కంటికి పలుక గల నాలుక లేదు. పలికెడు నాలుకకు చూచు కన్ను లేదు.
ఏవం శ్రుత్వా ద్వావపి తస్య తుష్టా వింద్రా విష్ణూ దర్శయతాం స్వమూర్తిమ్,
వాక్యం చేద మూచతు ర్బ్రూహి నౌ తే తుష్టౌ ధన్యం వర మేకం వదస్వ.
ఇది విని ఆ ఇంద్రుడు, విష్ణువును, సంతోషించి తమ నిజ రూపమును చూపిరి. మేము సంతసించితిమి. నీవొక కోరిక కోరు కొనుము. అనియు పలికిరి.
తచ్ఛ్రుత్వాసౌ సత్యతపా ఉవాచ దేవా వలం మే వర ఏష ధన్యః,
యద్‌దృష్టౌ మే పురతో దేవదేవౌ నచాతిరిక్తోస్తి వరః పృథివ్యామ్.
అది విని సత్యతపుడు ఇట్లనెను. దేవులారా! ఈ వరమే నాకు చాలును. నేను ధన్యుడను. దేవదేవు లిరువురు నాముందు కాన వచ్చితిరి. భూమిపై ఇంతకు మించిన వర మేముండును?
తథాపీదం యే సదా పర్వకాలే విప్రాన్ విప్రాః శ్రావయన్తీతి భక్త్యా,
తేషాం పాపం నశ్యతాం మాస మేకం యత్ సంచితం త్వేష ఏకో వరోస్తు.
అయినను పండుగ దినములలో ఒక నెల ఈ కథను విప్రులకు భక్తితో వినిపించినచో విప్రుల ప్రోగువడిన పాప మంతయు నశించు గాక. ఇది నేను కోరు ఒక వరము.
ముక్తిం చాహం వ్రజామీతి ద్వితీయోస్తు వరోమమ,
తథేత్యుక్త్వా తు తౌ దేవౌ దత్వా తస్య వరం శుభమ్.
అదర్శనం గతౌ దేవౌ సోపి తత్ర వ్యవస్థితః,
లబ్ధ్వా వరం సత్యతపా బ్రహ్మభూతోభవద్ హృది.
నేను ముక్తి పొంద వలయును. ఇది రెండవ వరము. అని పలుకగా ఆ దేవు లిరువురు అట్లే అని ఆతనికా శుభమైన వరము నొసగి అదృశ్యులైరి. అతడును వరములు పొంది ఆ ఆశ్రమమున నుండి హృదయమున బ్రహ్మ భూతుడాయెను.
యావదాస్తే శుభే దేశే కృతకృత్యో మహామునిః
తావత్తస్య గురుస్తత్ర ఆరుణిః సమదృశ్యత.
అట్లు నెరవేరిన ప్రయోజనము గల ఆ మహాముని ఆ దేశమున ఉండగా ఆతని గురువు ఆరుణి అతనికి కానవచ్చెను.
పృథ్వీం ప్రదక్షిణీకృత్య తీర్థహేతో ర్విచక్షణః,
తేన చాసౌ మహా భక్త్యా పూజితో మునిపుంగవః.
పాద్యాచమనగోదానైః కృతాసనపరిగ్రహః.
ఆ ఆరుణి భూమి నంతయు తీర్థ యాత్రలకై చుట్టి వచ్చెను. ఆ ముని పుంగవుని ఈతడు పాద్యము, ఆచమనము, గోదానము మున్నగు వానితో మహాభక్తితో పూజించెను. ఆ ఆతడును ఆసనమును స్వీకరించి యుండెను.
జ్ఞాత్వా స శిష్యం సిద్ధం తు తపసా దగ్ధకిల్బిషమ్,
ఉవాచ వినయాపన్నం ప్రాఞ్జలిం పురతః స్థితమ్
ఆతడును ఆ శిష్యుడు తపస్సు చేత కాలిన పాపములు గల సిద్ధుడని ఎరిగి, ఎదురుగా చేతులు మోడ్చి వినయముతో నిలిచి యున్న ఆతనితో నిట్లనెను.
ఆరుణి :
పుత్ర సిద్ధోసి తపసా బ్రహ్మభూతోసి పుత్రక,
ఇదానీ మాత్మనా సార్ధం ముక్తికాల మితోస్తితే.
ఆరుణి :
బిడ్డా! తపస్సు చేత సిద్ధుడ వయితివి. బ్రహ్మ భూతుడ వయితివి. ఇప్పుడు నీకు ముక్తి కాలము చేకూరినది.
ఉత్తిష్ఠ గమ్యతాం పుత్ర మయా సార్ధం వరం పదమ్,
యద్గత్వా నపునర్జన్మ భవతీతి న సంశయః.
లే, రా! నాతో కలసి పరమ పదమునకు రమ్ము. అచటకు పోయినచో నీకు మరల జన్మము కలుగ దనుటకు సంశయము లేదు.
ఏవ ముక్త్వా తతః సిద్ధావుభౌ సత్యతపోరుణీ,
ధ్యాత్వా నారాయణం దేవం సదేహౌ తౌ దివంగతౌ.
ఇట్లు పలికిన పిమ్మట ఆ సిద్ధు లిరువురు సత్య తపుడును, ఆరుణియు నారాయణ దేవుని ధ్యానించి తమ దేహములతో స్వర్గమున కరిగిరి.
యశ్చా పి శృణుయాత్ పాదం పర్వాధ్యాయం సవిస్తరమ్,
శ్రావయేద్ వా స పితరో యజేద్ గత్వా గయామితి.
ఈ విస్తరమైన పర్వా ధ్యయమున ఒక్క నాలుగవ భాగము నైనను చదువు వాడు, వినిపించు వాడు గయ కరిగి పితృ దేవతలను పూజించిన ఫలమును పొందును.