వరాహ మహా పురాణము
అధ్యాయము - 123
శ్రీవరాహ దేవుడు:
ఫాల్గునస్య తు మాసస్య శుక్ల పక్షస్య ద్వాదశీమ్,
గృహ్య వాసంతికాన్ పుష్పాన్ సుగంధాన్ యే క్రమాగతాః.
శ్వేత పాండురకం చైవ సుగంధం శోభనం బహు
విధినా మన్త్రయుక్తేన సుప్రీతే నాన్తరాత్మనా.
శ్రీవరాహ దేవుడు:
ఫాల్గున మాసపు శుక్లపక్ష ద్వాదశి నాడు మంచి పరిమళము గల అడవి మొల్లలను, తెలుపు మించిన పసిమి వన్నె గల వానిని గ్రహించి మిక్కిలి ప్రీతి నొందిన అంతరాత్మతో మంత్ర పూర్వకమైన విధానముతో భాగవతుడు శుచియై కర్మము లన్నింటిని చక్కగా ఎరిగి పూజింప వలయును.
తదాహ రేత కర్మాణి విధిదృష్టేన కర్మణా,
విధినా మంత్ర పూతేన కుర్యాచ్ఛాంతమనోమలః.,
నమో నారాయణే త్యుక్త్వా ఇమంమన్త్రముదీరయేత్.
శాస్త్ర విధానము నను సరించిన కర్మముతో పూజా కార్యములు చేయ వలయును. కార్యము మంత్రములతో పవిత్రము కావలయును. భక్తుడు శాంతము నిర్మలము అగు మనస్సు కలవాడు కావలయును “ఓంనమో నారాయణాయ” అని పలుకుచు ఈ మంత్రమును ఉచ్చరింప వలయును.
ఓం నమో వాసుదేవేశ శంఖచక్ర ధరాచ్యుత,
నమోస్తు తే లోకనాథ ప్రవీరాయ నమోస్తుతే.
వాసుదేవా! ఈశ! శంఖ చక్రధరా! అచ్యుతా! లోకనాథ! మహా వీరుడవగు నీకు నమస్సు, నీకు నమస్సు.
సంపుష్పితస్యేహ వసంత కాలే, వనస్పతే ర్గంధరసప్రయుక్తాః.
పశ్యేదిమాన్ పుష్పితపాదపేన్ద్రాన్, వసంతకాలే సముపాగతే చ.
వసంత కాలమున వనస్సతులు చక్కగా పూచినవి. చక్కని గంధ రసముతో కూడి యున్నవి. వసంత కాలము వచ్చినది. ఈ పూచిన గొప్ప చెట్లను చూడుము.
యశ్చైతేన విధానేన కుర్యా న్మాసే తు ఫాల్గునే,
న స గచ్ఛతి సంసారం మమ లోకాయ గచ్ఛతి.
ఈ విధముగా ఫాల్గున మాసమున అర్చన చేయువాడు సంసారమును పొందడు. నా లోకమున కరుగును.
యచ్చ పృచ్ఛసి సుశ్రోణి మాసే వైశాఖ ఉత్తమే,
శుక్లపక్షే తు ద్వాదశ్యాం యత్ఫలం తచ్ఛ్రుణుష్వ మే.
సుశ్రోణి! వైశాఖము శుక్ల పక్ష ద్వాదశి నాటి అర్చన ఫలమును గూర్చి నన్న డిగితివి. దానిని వినుము.
పుష్పితేషు చ శాలేషు తథాన్యేషు ద్రుమేషు చ
గృహీత్వా శాలపుష్పాణి మమ కర్మణి సంస్థితాః.
చక్కగా పూచిన మద్ది మొదలగు చెట్ల పూవులను గ్రహించి నాపూజకు సిద్ధము కావలయును.
కృత్వా తు మమ కర్మాణి శుభాని తరుణాని చ,
పూజ్య భాగవతాన్ సర్వాన్ స్థాపయిత్వా తతోగ్రతః.
ఋషిస్తువన్తి మన్త్రేణ వేదోక్తేన చ మాధవి,
గంధర్వప్సరశ్చైవ గీతనృత్యైః సవాదితైః.
కాలమునకు తగిన శుభ కర్మ లన్నింటి నాచరించి భగవద్భక్తుల నందరిని ముందుచు కొని వేదము చెప్పిన విధానముగా మంత్రములను చదువుచు గంధర్వుల అప్సరసల నాట్యములతో ఆటలతో పాటలతో వాద్యములతో పూజలు సలుప వలయును.
స్తువన్తి దేవలోకాశ్చ పురాణం పురుషోత్తమమ్,
సిద్ధవిద్యాధరా యక్షాః పిశాచోరగరాక్షసాః,
స్తువన్తి దేవభూతానాం సర్వలోకస్య చేశ్వరమ్.
అప్పుడు దేవ లోకము వారు పురాణ పురుషోత్తముని స్తుతింతురు. సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, పిశాచులు, నాగులు, రాక్షసులు సర్వ లోకాధిపతి యగు పురుషోత్తముని స్తోత్రములు చేయు చుందురు.
ఆదిత్యా పసవో రుద్రా అశ్వినౌ సమరుద్గణాః,
స్తువన్తి దేవదేవేశం యుగానాం సంక్షయేక్షయమ్.
ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు వీరందరు, దేవ దేవేశుడు, యుగముల నాశనము నందును చెడని వాడు అగు దేవుని స్తుతింతురు.
తతో వాయుశ్చ విశ్వేచ అశ్వినౌ చ సమన్వితాః,
స్తువన్తి కేశవం దేవమాదికాలమయం ప్రభుమ్.
అంత వాయువు, విశ్వేదేవతలు, అశ్వులు అందరు గుమికూడి ఆది కాల మయుడు, ప్రభువునగు కేశవుని కీర్తింతురు.
తతో బ్రహ్మా చ సోమశ్చ శక్రశ్చాగ్ని సమన్వితః,
స్తువన్తి నాధం భూతానాం సర్వలోకమహేశ్వరమ్.
బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అగ్నియు సర్వ భూతములకు నాథుడును, సర్వ లోకములకు ప్రభువును అగు విష్ణువును అగు విష్ణువును స్తుతింతురు.
నారదః పర్వతశ్చైవ అసితో దేవల స్తథా,
పులహశ్చ పులస్త్యశ్చ భృగు శ్చాంగిర ఏవ చ.
ఏతే చాన్యే చ బహవో మిత్రావసు పరావసూ,
స్తువన్తి నాథం భూతానాం యోగినాం యోగముత్తమమ్.
నారదుడు, పర్వతుడు, అసితుడైన దేవలుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, అంగిరసుడు, ఇంకను పెక్కండ్రు మహర్షులు, మిత్రావసు పరావసువులును భూతనాథుడు, యోగినాథుడు, ఉత్తమయోగ స్వరూపుడునగు నారాయణుని స్తుతింతురు.
శ్రుత్వా తు ప్రతినిర్ఘోషం దేవానాం తు మహౌజసమ్,
తతో నారాయణో దేవః ప్రత్యువాచ వసుంధరామ్.
మిక్కిలి శక్తి గల ఆ దేవతల నాదములను విని నారాయణ దేవుడు వసుంధరతో ఇట్లు పలికెను.
కిమయం శ్రూయతే శబ్ధో బ్రహ్మఘోషేణ చోదితః,
దేవానాం చ మహాభాగే మహాశబ్దోత్ర శ్రూయతే.
ఇదియేమి శబ్దము వినవచ్చు చున్నది? వేద ఘోషముతో మొదలైనది. దేవతల మహా శబ్దము ఇందు వినవచ్చు చున్నది.
తతః కమలపత్రాక్షీ సర్వరూపగుణాన్వితా,
వారాహరూపిణం దేవం ప్రత్యువాచ వసుంధరా.
అంత తామర రేకుల వంటి కన్నులు కలదియు, అన్ని రూపములతో, గుణములతో కూడినదియు నగు భూదేవి ఆ వరాహ రూప దేవునితో ఇట్లు పలికెను.
దేవాః కాంక్షన్తి తే దేవ వారాహీరూప సంస్థితమ్,
త్వన్నియోగనియుక్తాస్య తదర్థం లోకభావనా.
దేవా! నీవు వరాహ రూపమునే తాల్చి ఉండ వలయు ననియు, వారందరు నీ ఆజ్ఞకు లోబడి లోక భావనను చేయ వలయు ననియు దేవతలు కోరు చున్నారు.
తతో నారాయణో దేవః పృథివీం ప్రత్యువాచ హ,
అహం జానామి తాన్ దేవి మార్గమాణాన్ పథిస్థితాన్.
అంత నారాయణ దేవుడు భూమితో ఇట్లనెను. దేవీ! వారు నన్ను వెదకుచు మార్గమున నున్నారని నేనెరుగుదును.
దివ్యం వర్షసహస్రం వై ధారితాసి వసుంధరే,
మయా లీలాయమానేన ఏకదంష్ట్రాక్రమేణ చ.
వసుంధరా! నేను నిన్ను దివ్యమైన వేయి వత్సరములు లీలగా నా ఒక కోరతో పట్టి నిలిపితిని.
ఇహాగచ్ఛన్తి భద్రంతే ద్రష్టుకామా దివౌకసః,
ఆదిత్యా వసవో రుద్రాః స్కన్దేంద్రసపితామహాః
నన్ను చూచుటకై దేవలోక వాసు లందరు అదిత్యుడు, వసువులు, రుద్రులు, కుమార స్వామి, ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు వారు ఇచటకి వచ్చు చున్నారు.
ఏవం తస్య వచః శ్రుత్వా మాధవస్య వసుంధరా,
శిరసా చాంజలిం కృత్వా తతస్తచ్చరణౌ పతత్.
ఇట్లా మాధవుని మాట విని భూదేవి దోసిలిని నుదుటపై జోడించి ఆతని పాదములపై పడెను.
వారాహం పురుషం దేవం విజ్ఞాప్యతి వసుంధరా,
ఉద్ధృతాస్మి త్వయా దేవ రసాతలగతా హ్యహమ్,
శరణం త్వా మనాథా వై త్వద్భక్తస్య గతిః ప్రభుః
భూదేవి వరాహ రూపుడగు దేవున కిట్లు విన్నవించు కొనెను. దేవా! రసాతల మునకు క్రుంగిన నన్ను నీవు పైకెత్తి నిలిపితివి. దిక్కు లేని దానను నాకు రక్షకుడ వైతివి. నీ భక్తునకు నీవే గతివి. ప్రభువవు.
కిం కర్మ కర్మణా కేన కింవా జన్మపరాయణమ్,
కథం వా తుష్యసే దేవ పూజ్యః కేనాసి కర్మణా
తదహం కారయిష్యామి కర్మ స్వర్గసుఖావహమ్.
నాకేది కర్తవ్యము? ఏ పనితో నిన్నర్చింతును. నా జన్మమునకు పరమ గతి యేమి? ఏ విధముగా పూజించినచో నీవు తుష్టి నందెదవు? స్వర్గ సుఖమునకు తావలమైన ఆ పనిని నేను ఆచరింతును.
న చ మే స్తి వ్యథా కాచిత్ తవ కర్మ విధానతః,
న గ్లాని ర్న జరా కాచి న్న జన్మమరణే తథా.
నీ పూజా విధానము చేసెడు నాకు బాధ లేదు. అలసట లేదు. ముసలి తనము లేదు. పుట్టుటయు గిట్టు టయును లేవు.
సర్వే సురాసురా లోకా రుద్రేంద్ర సపితామహాః
కోష్ఠే నివాసం కుర్వన్తి తవైకస్య యశోధరాః.
దేవతలు, రాక్షసులు, సర్వజనులు, రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ అను కీర్తిధారు లందరు నీ కడుపున ఒక మూల నివసింతురు.
కాని కర్మాణి కుర్వన్తి యై స్త్వాం పశ్యన్తి మాధవ
కిమాహారాః కిమాచారా స్త్వాం పశ్యన్తీహ మాధవ.
మాధవా! నిన్ను చూచుటకై వారే కృత్యములు చేయుదురు? ఏ ఆహారములు తిందురు? ఏ ఆచారములు పాటింతురు?
బ్రాహ్మణస్య చ కింకర్మ క్షత్రియస్య చ కింభవేత్,
వైశ్యః కిం కురుతే కర్మ శూద్రః కిం కర్మ కారయేత్.
బ్రాహ్మణుని కర్మ మేది? క్షత్రియుని కేది యగును? వైశ్యుడేమి చేయును? శూద్రుని కర్మ మెట్టిది?
యోగో వై ప్రాప్యతే కేన తపో వా కేన నిశ్చితమ్,
కించాత్ర ఫల మాప్నోతి తవ కర్మపరాయణః.
ఎవడు యోగమును పొందును? ఎవడు తపమును ఎన్నుకొని చేయును? నీ కర్మమున మిక్కిలి శ్రద్ధ కలవాడే ఫలమును పొందును?
కించ దుఃఖనివాసం వా భోజనం పానకం తథా
కించ కర్మ ప్రయోక్తవ్యం తవ భక్తేషు మాధవ.
ఏ భావము దుఃఖమునకు నెలవగును? భోజన మెట్టిది? త్రాగున దేమి? నీ భక్తులు చేయ వలసిన క్రియ ఎట్టిది?
ప్రాపణం కీదృశం చాపి దిశాసు విదిశాసు చ
కథం యోనిం నగచ్ఛేత వియోనిం చ న గచ్ఛతి.
దిక్కు లందు మూల లందు ఎట్టి నివేదనలు సలుప వలయును? గర్భ వాసమును, జంతు జన్మాదులను పొంద కుండుటెట్లు?
తిర్యగ్యోనిం నగచ్ఛేత కర్మణా కేన కేశవ
తన్మమాచక్ష్వ సకలం యేన మే సుసుఖం భవేత్.
ఏ కర్మ మొనరించి నరుడు పశు జన్మము పొంద కుండును? కేశవా! నాకు మిక్కిలి సుఖము కలుగు నట్లు ఈ సకలము తెలియ జెప్పుము.
జరా వా కేన గచ్ఛేత జన్మ కేన చ గచ్ఛతి,
గర్భవాసం న గచ్ఛేత కర్మణా కేన వాచ్యుత.
ఏ పనిచేత ముసలి తనమును పొందును? దేని చేత జన్మమును పొందును? గర్భ వాసమును పొంద కుండుటకేమి చేయ వలయును?
సంసారం చ న గచ్ఛేత కస్య చైవ ప్రభావతః,
ఇత్యుక్తో భగవాం స్తత్ర ప్రత్యువాచ వసుంధరామ్.
దేని ప్రభావము చేత నరుడు సంసారమున పడ కుండును? అని వసుంధర ఇట్లడుగగా భగవాను డిట్లు బదలు పలికెను.
శృణ్వన్తు మేభాగవతా యేచ మోక్షే వ్యవస్థితాః,
తాన్మన్త్రాన్ కీర్తయిష్యామి యై స్తోషం యామి నిత్యశః,
మోక్ష మార్గమున స్థిరముగా నిలిచి యున్న భాగవతురాలా! నేను దేని వలన మిక్కిలి సంతోషమును ఎల్ల వేళల పొందుదునో ఆ మంత్రములను కీర్తింతును. వినుడు.
మంత్రము:
మాసేషు సర్వేషు చ ముఖ్యభూత స్త్వం మాధవో మాధవ మాస ఏవ
పశ్యేద్ దేవం తం తు వసంతకాలే ఉపాగతం గంధరసప్రయుక్త్యా.
నిత్యం చ యజ్ఞేషు తథేజ్యతే యో నారాయణః సప్తలోకేషు వీరః.
మంత్రము:
మాధవా! నీవు మాసము లన్నింటను ముఖ్యమైన వైశాఖ మాసమవు, మంచి పరిమళముతో, చక్కని రసములతో వసంత కాలమున నీవు దేవుని దర్శించుచు వచ్చితివి. ఎల్లప్పుడు యజ్ఞము లందు అర్చింప బడెడు ఈ నారాయణుడు ఏడు లోకము లందు వీరుడు.
ఏవం గ్రీష్మే విధించైవ కుర్యాత్ సర్వం విధానతః,
ఇమ ముచ్చారయే న్మన్త్రం సర్వభాగవతప్రియమ్.
ఇట్లే గ్రీష్మము నందు సర్వమును విధి పూర్వకముగా చేయ వలయును. భాగవతు లందరికి ప్రియమగు ఈ మంత్రమును పఠింప వలయును.
మంత్రము:
మాసేషు సర్వేష్వసి ముఖ్యభూతో మాసో భవాన్ గ్రీష్మ ఏకః ప్రసన్నః,
పశ్యేద్భవాన్ వర్తతి గ్రీష్మకాలే ఉపాగతం గన్ధరస ప్రయుక్త్యా
నిత్యం చయజ్ఞేషు తథేజ్యమానో నారాయనః సర్వలోకేషు వీరః.
మంత్రము:
మాసము లన్నింటిలో ప్రధాన మగు గ్రీష్మమా! నీవు ప్రసన్నముగా వచ్చితివి. గంధ రసములతో కూడి నీవు ఏతెంచితివి. నిత్యము యజ్ఞము లందు పూజలు కొనెడు శ్రీనారాయణుడు సర్వ లోకము లందును వీరుడు.
ఏతేనైవ విధానేన గ్రీష్మే చై వార్చనం కురు
న జన్మ మరణం తస్య మమ లోకే గతిర్భవేత్.
ఇదే విధముగా గ్రీష్మము నందును ఆర్చనము చేయ వలయును. అట్టి వానికి జనన మరణము లుండవు. నా లోకమునకు గతి కలుగును.
యావన్తః పుష్పితాః శాలాః పృథ్వ్యాం యావత్సుగన్ధకాః,
అర్చితః సభవేత్ సర్వైః కృతో యేన హ్యయం విధిః.
ఈ విధముగా నన్నర్చించు వాడు భూమిలో చక్కని పరిమళము గల శాల వృక్షముల పూవు లన్నింటితో పూజించిన వాడగును.
ఏవం మాధవమాసే తు మమ కర్మ చ కారయేత్,
నిష్కలా భవతే బుద్ధిః సంసారే చ నజాయతే.
ఇట్లు వైశాఖ మాసమున నా పూజ నాచరించు వానికి బుద్ధి నిర్మల యగును. ఆతడు మరల సంసారమున పుట్టడు.
అన్యచ్చ తేప్రవక్ష్యామి కర్మ సంసారమోక్షణమ్,
కదంబకుటజాశ్చైవ శల్ల కార్జునకా స్తథా,
ఏభి రేవార్చనం కుర్యాద్ విధిదృష్టేన కర్మణా.
నీకు మరియొక విషయము కూడ చెప్పెదను. అది సంసారము నుండి విడుదల కలిగించును. కడిమి, కొండ గోగు శల్లకము, అర్జునకము అను పూవులతో విధి ననుసరించి అర్చనము గావింప వయును.
తతః సంస్థాపనం కుర్యా న్మమ మన్త్రపరాయణః,
నమో నారాయణాయేతి ఇమం మన్త్ర ముదాహరేత్.
పిదప నా మంత్రము లందు శ్రద్ధ కలవాడై నన్ను ప్రతిష్ఠాపనము చేయ వలయును. ‘ఓంనమో నారాయణాయ’ అనుచు ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
పశ్యన్తి మేధ్యా అపి మేఘవర్ణం
త్వా మాగతాః పూజ్యమానం మహిమ్నా,
నిద్రాం భవాన్ గృహ్ణతు లోకనాథ
వర్షస్త్విమం పశ్యతు మేఘబృన్దమ్.
మంత్రము:
పవిత్ర హృదయములు గలవారు మేఘము వన్నెకల పూజ్యుడ వగు నిన్ను మహిమతో చూచు చున్నారు. లోకనాథా! వర్షా కాలము వచ్చినది. మేఘముల బృందములను చూడుము. నిద్రను పొందుము.
ఆషాఢమాసే ద్వాదశ్యాం సర్వశాన్తికరం శుభమ్,
య ఏతేన విధానేన మమ కర్మతు కారయేత్.
స మర్త్యో న ప్రణశ్యేత సంసారేస్మిన్ యుగేయుగే
ఆషాడ మాస ద్వాదశి యందు సర్వ శాంతి కరమగు ఈ శుభ కర్మమును శాస్త్రము ననుసరించి చేయ వలయును. అట్లాచరించు వాడు ఎన్నటికిని ఏ యుగము నందును నశింపడు.
ఏతత్ తే కథితం దేవి ఋతూనాం కర్మ చోత్తమమ్,
తరన్తి యేన సంసారం నరాః కర్మ పరాయణాః.
దేవీ! కర్మ శ్రద్ధ కల నరులు దేని చేత సంసారమును తరింతురో అట్టి ఋతువు లందు చేయ దగిన ఉత్తమ కర్మమును నీకు చెప్పితిని.
ఏతద్ గుహ్యం మహాభాగే దేవాః కేచి న్నజానతే
ముక్త్వా నారాయణం దేవం వారాహం రూపమాస్థితమ్.
పుణ్యాత్మురాలా! ఈ పరమ రహస్యమును నీకు చెప్పితిని. వరాహ రూపమును, తాల్చిన నారాయణ దేవుడు కాక దేవతలును దీని నెరుగరు.
నాదీక్షితాయ దాతవ్యం మూర్ఖాయ పిశునాయచ
కుశిష్యాయ న దాతవ్యం యే చ శాస్త్రార్థదూషకాః.
యజ్ఞ దీక్షలేని వానికి, మూర్ఖునకు, తంపుల మారి వానికి నీచ శిష్యునకు, శాస్త్ర విషయములను నిందించు వారికి దీని నొసగ రాదు.
న పఠేద్ గోఘ్నమధ్యే వై న పఠే చ్ఛఠమధ్యగః
ధనధర్మక్షయ స్తేషాం పఠనా దాశు జాయతే.
కసాయి వారి నడుమను, మూర్ఖుల దగ్గరను దీనిని చదువ రాదు. అట్లు చదువుట వలన వారికి ధర్మము, ధనము వెంటనే నశించును.
ఏతేన కర్మణా భద్రే యత్త్వయా పరిపృచ్ఛితమ్,
కార్త్న్సేన కథితం హ్యేతత్ కిమన్యత్ పరిపృచ్ఛసి.
దేవీ! నీ వడిగిన దానిని మొత్తముగా చెప్పితిని. ఇంక నీవు దేని నడుగుదువు?