అధ్యాయము - 28

ప్రజాపాలుడు:

కథం మాయా సముత్పన్నా దుర్గా కాత్యాయనీ శుభా,

ఆదిక్షేత్రే స్థితా సూక్ష్మా పృథగ్మూర్తా వ్యజాయత.

ప్రజాపాలుడు:

మాయా రూపిణి కాత్యాయని దుర్గ, మంగళరూప యెట్లు ఉదయించెను? ఆమె మొదటి స్థితిలో సూక్ష్మ రూపముతో ఉండెను గదా! వేరు స్వరూపముతో ఎట్లు ఆవిర్భవించెను?

మహాతపుడు:

ఆసీద్‌ రాజా పురా రాజన్‌ సింధుద్వీపః ప్రతాపవాన్‌,

వరుణాంశో మహారాజ సోరణ్యే తపసి స్థితః.

మహాతపుడు:

రాజా! మునుపు సింధు ద్వీపుడను గొప్ప ప్రతాపము గల రాజుండెను. ఆతడు వరుణుని అంశముతో పుట్టిన వాడు. అరణ్యమున తపస్సున నెలకొని యుండెను.

పుత్రో మే శక్రనాశాయ భవేదితి నరాధిపః

ఏవం కృతమతిః సోథ మహతా తపసా స్వకమ్‌,

కలేవరం స్థితో భూత్వా శోషయామాస సువ్రత.

ఆ రాజు నాకుమారుడు ఇంద్రుని నశింప జేయు వలయునని నిశ్చయించి గొప్ప తపస్సుతో తన దేహమును ఎండ గట్టెను.

ప్రజాపాలుడు:

కథం తస్య ద్విజశ్రేష్ఠ శక్రేణాపకృతం భవేత్‌,

యేనా సౌ తద్వినాశాయ పుత్ర మిచ్ఛన్‌ వ్రతే స్థితః.

ప్రజాపాలుడు:

బ్రహ్మణవరేణ్యా! ఆతనికి ఇంద్రుని వలన అపకార మెట్లు సంభవించెను? దానితో గదా ఆతడు ఇంద్రుని చంపు పుత్రుని గోరుచు తపమున నిలిచెను.

మహాతపుడు:

సోన్యజన్మని పుత్రో భూత్‌ త్వష్టు ర్బలభృతాం వరః,

అవధ్యః సర్వశస్త్రేషు అపాం ఫేనేన నాశితః.

మహాతపుడు:

ఆతడు పూర్వ జన్మమున త్వష్టుడను వాని కొడుకు. గొప్ప బలము గలవాడు. ఏ ఆయుధములకు చావని వాడు. నీటి నురుగుతో ఇంద్రుని వలన మరణించెను.

జలఫేనేన నిహత స్తస్మిన్‌ లయ మవాప్తవాన్‌,

పున ర్బ్రహ్మాన్వయా జ్జాతః సిన్ధుద్వీపేతి సంజ్ఞితః,

సతేపే పరమం తీవ్రం శక్రవైర మనుస్మరన్‌.

ఆతడు నీటి నురుగుతో మడిసి యందు లయము పొందెను. తిరిగి బ్రాహ్మణ వంశమున పుట్టి సింధు ద్వీపుడను పేరు గల వాడాయెను. ఆ ఇంద్రుని తోడి పగను మరవక ఆతడు ఘోరమైన తపస్సు గావించెను.

తతః కాలేన మహతా నదీ వేత్రవతీ శుభా,

మానుషం రూపమాస్థాయ సాలంకారం మనోరమమ్‌,

ఆజగామ యతో రాజా తేపే పరమకం తపః.

అంత పెద్ద కాలమునకు వేత్రవతి యను నది చక్కని అలంకారములు, అంద చందములు గల మనుష్య వేషము తాల్చి ఆ రాజు తపము చేయుచున్న తావునకు వచ్చెను.

తాం దృష్ట్వా రూపసంపన్నాం సరాజా క్రుద్ధమానసః,

ఉవాచ కాసి సుశ్రోణి సత్యం కథయ భామిని.

చక్కని రూప సంపద గల ఆ కాంతను గాంచి రాజు కోపముతో మండిపడి ఓ భామినీ! నీవెవరవు? నిజము చెప్పుమని యడిగెను.

నది:

అహం జలపతేః పత్నీ వరుణస్య మహాత్మనః,

నామ్నా వేత్రవతీ పుణ్యా త్వామిచ్ఛన్తీహ మాగతా.

నది:

నేను మహాత్ముడు, జలాధి దేవతయు నగు వరుణుని పత్నిని. పేరు వేత్రవతి. పుణ్యురాలను. నిన్ను కామించి యిటకు వచ్చితిని.

సాభిలాషాం పరస్త్రీం చ భజమానాం విసర్జయేత్‌,

సపాపః పురుషో జ్ఞేయో బ్రహ్మహత్యాం చ విన్దతి,

ఏవం జ్ఞాత్వా మహారాజ భజమానాం భజస్వమామ్‌.

కోరి వచ్చినదియు, తన్ను సేవించు నదియు నగు ఇంతి పర స్త్రీ అయినను ఆమెను వదలి వైచు మనుజుడు పాపుడగును. బ్రహ్మ హత్యా పాతక మందును. ఇది యెరిగి నిన్ను కోరిన నన్ను పొందుము.

ఏవ ముక్తస్తయా రాజా సాభిలాషోపభుక్తవాన్‌,

తస్య సద్యోభవత్‌ పుత్రో ద్వాదశార్క సమప్రభః.

ఇట్లు ఆమె పలుకగా రాజు అభిలాషతో ఆమె ననుభవించెను. వెనువెంటనే ఆతనికి పండ్రెండుగురు సూర్యులకు దీటైన కాంతి గల కొడుకు పుట్టెను.

వేత్రవత్యుదరే జాతో నామ్నా వైత్రాసురోభవత్‌,

బలవానతితేజస్వీ ప్రాగ్జ్యోతిషపతి ర్భవత్‌.

వేత్రవతి కడుపున పుట్టెను గనుక వాడు వైత్రాసురు డయ్యెను. గొప్ప బలము, దొడ్డ తేజము గల ఆతడు ప్రాగ్జ్యోతిషమునకు ఏలిక యయ్యెను.

సకాలేన యువా జాతో జలవాన్‌ దృధవిక్రమః,

మహాయోగేన సంయుక్తో జిగా యేమాం వసుంధరామ్‌.

కొంత కాలమునకు ఆతడు యువకుడు, బల పరాక్రమములు గల వాడునై పెద్ద యోగము కలసి రాగా ఈ భూమిని గెలిచెను.

సప్తద్వీపవతీం పశ్చాన్మేరు పర్వత మారుహత్‌,

తత్రేన్ద్రం ప్రథమం జిగ్యే పశ్చాదగ్నిం యమం తతః,

నిరృతిం వరుణం వాయుం ధనదం చేశ్వరం తతః.

ఇట్లు ఏడు ద్వీపములుగా నున్న భూమి నంతటిని గెలిచి పిదప మేరు పర్వతము నెక్కెను. అందు మొదట ఇంద్రుని తరువాత అగ్నిని, అటుపై యముని, నిరృతిని, వరుణుని, వాయువు, కుబేరుని, ఈశానుని వరుసగా గెలిచెను.

ఇంద్రో భగ్నో గతః సోగ్ని మగ్ని ర్భగ్నో యమంయయౌ

యమో నిరృతి మాగచ్ఛ న్నిరృతి ర్వరుణం యయౌ.

ఇంద్రాదిభి రుపేతస్తు వరుణో వాయు మన్వగాత్‌,

వాయు ర్దనపతిం త్వాగాత్‌ సర్వై రింద్రాదిభిః సహ.

ఇంద్రుడు దెబ్బ తిని అగ్నికడ కరిగెను. అగ్ని ఓడి యముని జేర బోయెను. యముడు నిరృతి కడకు వచ్చెను. నిరృతి వరుణుని చేరెను. ఇంద్రాదులతో కూడిన వరుణుడు వాయువు నాశ్రయించెను. వాయువు కుబేరుని కడ కరిగెను.

ధనదోపి స్వకం మిత్ర మీశం దేవసమన్వితః,

ఇయాయ గదయా సోపి దానవో బలదర్పితః,

గదామాదాయ దుద్రావ శివలోకం ప్రతి ప్రభో.

కుబేరుడు దేవతలతో కూడి ఒక గద చేపట్టి తన మిత్రుడగు ఈశానుని చేరుకొనెను. బలముతో కనుగానని ఆ దానవుడు గదను లాగుకొని వానిని శివ లోకమునకు తరిమెను.

శివోప్యవధ్యం తంమత్వాదేవాన్‌ గృహ్యయయౌ పురీమ్‌,

బ్రహ్మణః సురసిద్ధాధ్యై ర్వన్దితాం పుణ్యకారిభిః.

శివుడును, ఆ రాక్షసుడు చంపరాని వాడని తలపోసి దేవతలను గైకొని, సురలు, సిద్ధులు మొదలగు పుణ్యవంతులు కొనియాడు బ్రహ్మనగరి కరిగెను.

తత్ర బ్రహ్మా జగత్ర్సష్టా విష్ణు పాదోద్భవే జలే,

నియామితా కాశగతో జపత్యన్త ర్జలే శుభే,

క్షేత్రజ్ఞమాయాం గాయత్రీం తతో దేవా విచుక్రుశుః.

జగత్తులను సృష్టి చేయు బ్రహ్మ అచట విష్ణు పాదము లందు పుట్టిన పవిత్ర జలము లోపలి భాగమున ఆకాశమును ఏర్పాటు చేసికొని క్షేత్రజ్ఞుడగు పరమాత్మ మాయయగు గాయత్రిని జపించు చుండెను. అంత దేవతలు పెద్దగా దుఃఖముతో అరచిరి.

త్రాహి ప్రజాపతే సర్వాన్‌ దేవా నృషివరానపి,

అసురార్భయ మాపన్నాన్‌ త్రాహిత్రాహీ త్యచోదయన్‌.

ప్రజాపతీ! కాపాడు. రక్కసుని వలన భయము పొందిన దేవతలను, ఋషి వరులను కాపాడు, కాపాడు అని తొందర చేసిరి.

ఏవముక్త స్తదా బ్రహ్మా దృష్ట్వా దేవాం స్తదాగతాన్‌,

చింతయామాస దేవస్య మాయేయం వితతం జగత్‌,

నాసురా న సురాశ్చాత్ర మాయేయం కీదృశీ మతా.

అంత బ్రహ్మ అట్లు వచ్చిన దేవత లందరును గాంచి ఇది యంతయు దేవుని మాయ. జగత్తంతయు దీనితో నిండినది. ఇచట రక్కసులు లేరు. దేవతలు లేరు. ఇది యెట్టి మాయయో కదా! అని తల పోసెను.

ఏవం చింతయత స్తస్య ప్రాదురాసీ దయోనిజా.

శుక్లామ్బరధరా కన్యా స్రక్కిరీటోజ్జ్వలాననా,

అష్టభి ర్భాహుభి ర్యుక్తా దివ్య ప్రహరణోద్యతా.

ఆత డిట్లు భావించు చుండగా ఆతని ముందు ఒక కన్య ప్రత్యక్ష మాయెను. ఆమె స్త్రీ గర్భమున పుట్టినది కాదు. తెల్లని వస్త్రములను ధరించి యుండెను. పూమాలతో కిరీటములతో ఆమె మోము వెలుగొందు చుండెను. ఆమె యెనిమిది చేతులతో, దివ్యములగు ఆయుధములు తాల్చి యుండెను.

చక్రం శంఖం గదాం పాశం ఖడ్గం ఘణ్టాం తథా ధనుః,

ధార్తయన్తీ తథాచాన్యాన్‌ బద్ధతూణాం జలాద్బహిః.

నిశ్చక్రామ మహదేవి సింహవాహన వేగితా,

యుయుధే చాసురాన్‌ సర్వానేకైవ బహుధా స్థితా.

చక్రము, శంఖము, గద, పాశము, ఖడ్గము, ఘంట, విల్లు అను వానిని మరియు ఇతర ఆయుధములను చేపట్టి అమ్ముల పొది కట్టుకొని నీటి నుండి వెలువడి ఆ మహాదేవి సింహ వాహనయై వడివడిగా వచ్చెను. ఒక్కతెయే పెక్కు రూపములు తాల్చి రక్కసు లందరితో పోరు సల్ఫెను.

దివ్యం వర్షసహస్రం తు దివ్యై రస్త్రైర్మహాబలమ్‌,

యుద్ధ్వా కాలాత్యయే దేవ్యా హతో వైత్రాసురో రణే,

తతః కిలకిలాశబ్దో దేవసైన్యేభవన్మహాన్‌.

దేవతల వేయి సంవత్సరముల కాలము, దివ్యములగు అస్త్రములతో ఆ మహా బలునితో ఆ దేవి యుద్ధము చేసెను. అట్లు పోరి కొంత కాలము గడచిన పిదప ఆ వైత్రాసురుని రణమున చంపి వైచెను. అంత దేవతల సేన యందు కిలకిలా రావములు పెద్ద పెట్టున చెలరేగెను.

హతే వైత్రసురే భీమే తదా సర్వే దివౌకసః,

ప్రణేము ర్జయ యుద్ధేతి స్వయ మీశః స్తుతిం జగౌ.

అట్లు భయంకరుడగు వైత్రాసురుడు చావగా స్వర్గ వాసులందరు గెలువుము, పోరుము అని ఆమెను ప్రశంసించుచు ప్రణమిల్లిరి. స్వయముగా ఈశ్వరుడు ఇట్లు స్తుతి చేసెను.

మహేశ్వరుడు:

జయస్వదేవి గాయత్రి మహామాయే మహాప్రభే,

మహాదేవి మహాభాగే మహాసత్త్వే మహోత్సవే.

మహేశ్వరుడు:

దేవీ! గాయత్రీ! మహామాయా! మహాప్రభా! మహాదేవి! గొప్ప శక్తియు, గొప్ప ఆనందము గల ఓ పుజ్యులారా! జయము గొనుము.

దివ్యగన్ధాను లిప్తాంగి దివ్యస్రగ్ధామభూషితే,

వేదమాత ర్నమ స్తుభ్యం త్రక్ష్యరస్థే మహేశ్వరి.

దివ్యములగు గంధముల పూతగల దేహముతో, దివ్యములగు పూల మాలలతో అలరారు మహేశ్వరీ! మూడక్షరము లందున్న ఓ వేద మాతా! నీకు నమస్సులు. (మూడక్షరములు - ఓం కారము)

త్రిలోకస్థే త్రితత్త్వస్థే త్రివహ్నిస్థే త్రిశూలిని,

త్రినేత్రే భీమవక్త్రే చ భీమనేత్రే భయానకే,

కమలాసనజే దేవి సరస్వతి నమోస్తు తే.

మూడు లోకము లందును మూడు తత్త్వము లందును మూడగ్నుల యందును నెలకొని యున్న ఓ త్రిశూల ధారిణీ! మూడు కన్నులు, భయము గొలుపు మోము, భయము గొలుపు కన్నులు గలిగిన భయంకర స్వరూపిణీ! కమలము ఆసనముగా గల బ్రహ్మ వలన పుట్టిన ఓ సరస్వతీ దేవి! నీకు నమస్కారము.

నమః పంకజ పత్రాక్షి మహామాయేమృత స్రవే,

సర్వగే సర్వభూతేశి స్వాహాకారే స్వధేమ్బికే.

పద్మ పత్రముల వంటి కన్నులు గల ఓ మహా మాయా! అమృతమును జాలువార్చు ఓ దేవీ! అంతట నిండిన తల్లీ! సర్వ భూతములకు ఏలికయైన మాతా! స్వాహాకార స్వరూపిణీ! స్వధా రూపిణీ! అంబికా! నీకు నమస్సు.

సంపూర్ణే పూర్ణచంద్రాభే భాస్వరాంగే భవోద్భవే,

మహావిద్యే మహావేద్యే మహాదైత్యవినాశిని,

మహాబుద్ధ్యుద్భవే దేవి వీతశోకే కిరాతిని.

సంపూర్ణా! పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతి గల దానా! తళతళ లాడు దేహ కాంతి గల దేవీ! భవుని పుట్టుకకు కారణమైన తల్లీ! మహా విద్యా స్వరూపిణీ! జ్ఞాన స్వరూపిణీ! మహా దైత్యులను రూపుమాపు కరుణామయీ! శోకము లేని ఆనంద రూపా! పర్వత రాజ పుత్రీ! నీకు నమస్కారము.

త్వం నీతి స్త్వం మహాభాగే త్వం గీస్త్వం గౌ స్త్వమక్షరమ్‌,

త్వంధీ స్త్వం శ్రీ స్త్వమోంకార స్తత్తేచాపి పరిస్థితా,

సర్వసత్త్వహితే దేవి నమస్తే పరమేశ్వరి.

ఓ దేవి! నీవు నీతివి. నీవు వాక్కు. నీవు భూమివి. నీవు అక్షరమవు. నీవు బుద్ధి స్వరూపిణివి. నీవు లక్ష్మీ దేవివి. నీవు ఓంకారమువు. నీవు తత్వమున నిలిచి యున్న దానవు. సర్వ ప్రాణులకు హితము చేయు దానవు. ఓ పరమేశ్వరీ! అట్టి నీకు నమస్కారము.

ఇత్యేవం సంస్తుతా దేవీ భవేన పరమేష్ఠినా,

దేవై రపి జయేత్యుచ్చైరిత్యుక్తా పరమేశ్వరీ.

పరమేశ్వరుడగు శివు డిట్లు ఆదేవిని సంస్తుతించెను. దేవత లందరును జయ జయనాదములు ఆ పరమేశ్వరిని గూర్చి పెద్దగా చేసిరి.

యావదాస్తే చతుర్వక్త్ర స్తావదన్త ర్జలాద్‌ బహిః,

నిశ్చక్రామ తతో దేవీం కృతకృత్యాం దదర్శ సః.

ఆ బ్రహ్మ దేవుడు నీటి నుండి వెలుపలికి వచ్చి కార్యము నెరవేరిన ఆ దేవిని దర్శించు కొనెను.

తాం దృష్ట్వా దేవకార్యం చ సిద్ధిం మత్వా పితామహః,

భవిష్యం కార్య ముద్ధిశ్య తతో వచన మబ్రవీత్‌.

బ్రహ్మ ఆమెను గాంచి దేవ కార్యము నెరవేరినదని తలచి రాబోవు కార్యమును గూర్చి యిట్లు పలికెను.

బ్రహ్మ:

ఇయం దేవీ వరారోహో యాతు శైలం హిమోద్భవమ్‌,

తత్ర యూయం సురాః సర్వే గత్వా నన్దత మాచిరమ్‌.

బ్రహ్మ:

ఈ దేవి హిమవత్ప ర్వతమునకు అరుగు గాక! దేవతలారా! మీరందఱు కూడ నచట కరిగి ఆనంద మందుడు. ఆలసింపకుడు.

నవమ్యాం చ సదా పూజ్యా ఇయం దేవీ సమాధినా,

వరదా సర్వలోకానాం భవిష్యతి స సంశయః.

ఈ దేవిని ఏకాగ్ర బుద్ధితో నవమి నాడు పూజింప వలయును. అట్లు ఆమె సర్వ లోకములకు వరముల నొసగునది యగును. సంశయము లేదు.

నవమ్యాం యశ్చ పిష్టాశీ భవిష్యతి హి మానవః,

నారీ వా తస్య సంపన్నం భవిష్యతి మనోగతమ్‌.

నవమి నాడు మగవాడు కాని, స్త్రీ కాని, పిండి భోజనము నియమముగా చేసికొని యీమె నర్చించినచో మనసులోని కోరిక తీరును.

యశ్చ సాయం తథా ప్రాత రిదం స్తోత్రం పఠిష్యతి,

త్వయేరితం మహాదేవ తస్యదేవ్యా సమం భవాన్‌.

వరదో దేవ సర్వాసు ఆపత్స్వప్యుద్ధరస్వతమ్‌,

ఓ మహాదేవా! నీవు పలికిన ఈ స్తోత్రమును ఉదయ సాయం కాలములలో పఠించు వానికి నీవు దేవితో పాటు వరముల నొసగుము. ఆపద లన్నింటి నుండియు వాని నుద్ధరింపుము.

ఏవముక్త్వా భవం బ్రహ్మా పునర్దేవీం సచాబ్రవీత్‌.

ఇట్లు శివునితో పలికి బ్రహ్మ మరల దేవితో నిట్లనెను.

త్వయా దేవి మహత్కార్యం కర్తవ్యం చాన్య దస్తి నః.

భవిష్యం మహిషాఖ్యస్య అసురస్య వినాశనమ్‌.

దేవీ! నీవు మాకు చేయ వలసిన మరియొక ఘన కార్యము కలదు. మహిషుడను రక్కసుని వినాశనమును నీవు భవిష్యత్తున చేయ వలయును.

ఏవముక్త్వా తతో బ్రహ్మాసర్వే దేవా శ్చ పార్థివ,

యథాగతం తతో జగ్ముర్దేవీం స్థాప్య హిమే గిరౌ,

సంస్థాప్య నన్దితా యస్మాత్‌ తస్మా న్నన్దాభవత్‌ తు సా.

బ్రహ్మ యిట్లు పలుకగా సర్వ దేవతలును ఆయనను హిమ గిరి యందు ప్రతిష్ఠించి తమతమ నెలవుల కరిగిరి. ఆమెనట్లు ప్రతిష్ఠించి వారందరు ఆనందము పొందుట వలన ఆమెకు ‘నంద’ యను పేరు కలిగెను.

యశ్చేదం శృణుయాజ్జన్మ దేవ్యా యశ్చ స్వయం పఠేత్‌,

సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణ మృచ్ఛతి.

ఈ దేవి జన్మ కథను విను వాడును, తనకు తాను, పఠించు వాడును సర్వ పాపముల నుండి విముక్తుడగును. మోక్షము నొందును.