అధ్యాయము - 21

ప్రజాపాలుడు:

కథం గౌరీ మహాప్రాజ్ఞ సంస్తుతా వరదానతః,

మూర్తిం లబ్ధవతీ పుంసః పరస్య పరమాత్మనః.

ప్రజాపాలుడు:

గొప్ప ప్రజ్ఞ గల ఓ మునీంద్రా! పరమాత్ముడైన పరమ పురుషుని వర దానము వలన గౌరీ దేవి యెట్లు రూపము పొంది స్తుతులందినదో నాకు తెలియ జెప్పుము.

మహాతపుడు:

పూర్వం ప్రజాపతి ర్దేవః సిసృక్షు ర్వివిధాః ప్రజాః,

చింతయామాస ధర్మాత్మా యదా తా నాధ్యగచ్ఛత.

తదాస్య కోపాత్‌ సంజజ్ఞే స చ రుద్రః ప్రతాపవాన్‌,

రోదనాత్‌ తస్య రుద్రత్వం సంజాతం పరమేష్ఠినః.

మహాతపుడు:

మునుపు ప్రజాపతి వేర్వేరు తీరుల ప్రజలను సృజింప గోరెను. ఎంత చింతించినను సృష్టి ఏర్పడని కారణముగా నాతనికి పెను కోపము కలిగెను. ఆ కోపము వలన గొప్ప ప్రతాపము గల రుద్రుడు జనించెను. రోదనము చేసిన కారణమున పరమేష్టి ఆతనికి రుద్రుడను పేరు పెట్టెను.

తస్య బ్రహ్మా శుభాం కన్యాం భార్యాయై మూర్తిసంభవామ్‌,

గౌరీనామ్నిం స్వయం దేవీం భారతీం తాందదౌ పితా,

రుద్రాయామిత దేహాయ స్వయం బ్రహ్మా ప్రజాపతిః.

బ్రహ్మ రుద్రునకు భార్యగా ఒక చక్కని కన్యను తన దేహము నుండి సృజించెను. ఆమెకు గౌరీ యను పేరు ఆయననే పెట్టెను. తానే ఆమెకు తండ్రియై మిక్కుటమగు దేహము గల రుద్రున కొసగెను.

స తాం లబ్ధ్వా వరారోహాం ముదా పరమయా యుతః,

సర్గ కాలేషు తం బ్రహ్మా తపసా ప్రత్యువాచ హ.

ఆ రుద్రుడా సుందరిని పొంది పరమానంద మందెను. బ్రహ్మ సృష్టి సమయములలో ఆతనిని గాంచి యిట్లు పలుకు చుండెను.

రుద్రా ప్రజాః సృజస్తేతి పౌనః పున్యేన నోదితః,

అసమర్థ ఇతి జలే నిమజ్జత మహాబలః.

‘రుద్రా! ప్రజలను సృష్టి చేయుము’. ఇట్లు బ్రహ్మ మాటి మాటికి నొక్కి చెప్పు చుండగా గొప్ప బలము గల రుద్రుడు. ఇది నాకు చేత కాదని నీట మునిగెను.

తపోర్థిత్వం తపోహీనః స్రష్టుం శక్నోతి న ప్రజాః,

ఏవం చింత్య జలే మగ్న స్తతో రుద్రః ప్రతాపవాన్‌.

ఇది తపస్సునకు సాధ్యము. తపస్సు లేని వాడు ప్రజలను సృజింప జాలడని తలచి మహా ప్రతాపము గల రుద్రుడు నీట మునిగెను.

తస్మిన్నిమగ్నే దేవేశే తాంబ్రహ్మా కన్యకాం పునః,

అంతః శరీరగాం కృత్వా గౌరీం పరమశోభనామ్‌.

అట్లు రుద్రుడు నీట మునుగగా బ్రహ్మ మహా సౌందర్యము గల ఆ గౌరీ యను కన్యను మరల తన దేహములో లీనము గావించెను.

పునః సిసృక్షు ర్భగవా నసృజత్సప్త మానసాన్‌,

దక్షం చ తేషా మారభ్య ప్రజాః సమ్యగ్వివర్ధితాః.

భగవానుడు బ్రహ్మ మరల ప్రజలను సృజించ గోరి దక్షునితో పాటు ఏడుగురు మానస పుత్రులను సృజించెను. వారి వలన ప్రజలు పెంపొందిరి.

తత్ర దాక్షాయణీపుత్రాః సర్వే దేవాః సవాసవాః,

వసవోష్టౌచ రుద్రాశ్చ ఆదిత్యా మరుత స్తథా.

అందు దక్షుని భార్య సంతానము దేవతలు, దేవేంద్రుడు, ఎనిమిది మంది వసువులు, పండ్రెండుగురు ఆదిత్యులు, ఏడుగురు మరుత్తులు అను వారు.

సాపి దక్షాయ సుశ్రోణీ గౌరీ దత్తాథ బ్రమ్మణా,

దుహితృత్వే పురా యా హి రుద్రేణోఢా మహాత్మనా.

మునుపు రుద్రునకు తాను భార్యగా నొసగిన గౌరి యను సుందరాంగిని బ్రహ్మ దక్షునకు కూతురుగా నొసగెను.

సా చ దాక్షాయణీ దేవీ పునర్భూత్వా నృపోత్తమ.

ఇట్లా గౌరియు దాక్షాయణీ దేవిగా ఏర్పడెను.

తతో దక్షః ప్రహృష్టాత్మా దౌహిత్రాంస్తాన్‌ సమృద్ధికృత్‌,

దృష్ట్వా యజ్ఞ మథారేభే ప్రీణనాయ ప్రజాపతేః.

అంత దక్షుడు మురిసి పోవుచు మనుమలను (కూతురు కొడుకులను) సమృద్దిగా పొంద గోరి ప్రజాపతి తృప్తికై ఒక యజ్ఞము నారంభించెను.

తత్ర బ్రహ్మ సుతాః సర్వే మరీచ్యాదయ ఏవచ,

చక్రు రార్త్విజకం కర్మ స్వేస్వే మార్గే వ్యవస్థితాః.

అపుడు బ్రహ్మ కుమారులగు మరీచి మొదలగు వారు తమ తమ మార్గముల యందు చక్కగా కుదురు కొని ఋత్విక్కుల కార్యమును నిర్వహించిరి.

బ్రహ్మా స్వయం మరీచ్యస్తు బభూవాన్యే తథాపరే,

అత్రి స్తు యజ్ఞ కర్మస్థ ఆగ్నీధ్ర స్త్వఙ్గి రా భవత్‌.

మరీచి స్వయముగా బ్రహ్మ యాయెను. ఇతరులు ఇతర కార్యములను నిర్వహించిరి. అత్రి యజ్ఞ కర్మమును నిర్వహించు చుండెను. అంగీరుడు అగ్నీధ్రు డయ్యెను.

హోతా పులస్త్య స్త్వభవ దుద్గాతా పులహోభవత్‌,

క్రతౌ క్రతుస్తు ప్రస్తోతా తదా యజ్ఞే మహాతపాః.

పులస్త్యుడు హోత యాయెను. పులహుడు ఉద్గాత యయ్యెను. క్రతువను మహా తపశ్శాలి ఆ యజ్ఞమున ప్రస్తోత యయ్యెను.

ప్రతిహర్తా ప్రచేతాస్తు తస్మిన్‌ క్రతువరౌ బభౌ,

సుబ్రహ్మణ్యో వశిష్ఠస్తు సనకాద్యాః సభాసదః,

ప్రచేతసుడు విఘ్నములను నివారించు పని నిర్వహించెను. వశిష్ఠుడు సుబ్రహ్మణ్యు డాయెను. సనకుడు మొదలగు వారు సదస్యు లైరి. (బ్రహ్మ, ఆగ్నీధ్రుడు, హోత, ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్యుడు, సదస్యులు - ఈ పేర్లన్నియు యజ్ఞము నందు ఆయా కర్మముల నిర్వహించు ఉద్యోగుల వ్యవహార నామములు)

తత్ర యాజ్యః స్వయం బ్రహ్మా సచ ఇజ్యస్తు విశ్వకృత్‌,

పూజ్యా దక్షస్య దౌహిత్రా రుద్రాదిత్యాఙ్గి రాదయః

యజ్ఞమున అర్చనల నందువాడు, యజ్ఞ ఫలముల నందువాడు విశ్వము నంతటిని సృజించిన బ్రహ్మ దేవుడే. సంమానము పొందువారు దక్షుని మనుమలు (దౌహిత్రులు) రుద్రులు, ఆదిత్యులు, అంగిరులు మొదలగు వారు.

ప్రత్యక్షం పితరస్తే హి తైః ప్రీతైః ప్రీయతే జగత్‌,

తత్ర భాగార్థినో దేవా ఆదిత్యా వసవ స్తథా.

వారే కదా ప్రత్యక్షముగా నున్న పితృ దేవతలు. వారు ప్రీతి నొందినచో జగము ప్రీతి నొందును. ఆ యజ్ఞమున దేవతలు, ఆదిత్యులు, వసువులు తమ వంతు హోమ ద్రవ్యములను కోరుచు నుండిరి.

విశ్వేదేవాః సపితరో గంధర్వాద్యా మరుద్గణాః,

జగృహు ర్యజ్ఞభాగాం స్తాన్‌ యావత్తే హవిషార్పితాన్‌.

విశ్వే దేవులు, పితృ దేవతలు, గంధర్వులు, మరుద్గణములు తమకు అనువైన యజ్ఞ భాగములను హవిస్సు రూపమున అగ్నిలో వ్రేల్చిన వానిని కైకొను చుండిరి.

తావత్కాలం జలాత్సద్య ఉత్తస్థౌ బ్రహ్మణః పునః,

రుద్రః కోపోద్భవో యస్తు పూర్వమగ్నో మహాజలే.

ఇంతలో మునుపు బ్రహ్మ కోపము వలన పుట్టి పెను జలమున మునిగి యున్న రుద్రుడు ఒక్క పెట్టున పైకి లేచెను.

స సహస్రార్క సఙ్కాశో నిశ్చక్రామ జలాత్తతః,

సర్వజ్ఞానమయో దేవః సర్వదేవమయోమలః

వేయి సూర్యలు ప్రోవువలె వెలు గొందుచు, సర్వ జ్ఞానము ముద్ద కట్టి వచ్చిన స్వరూపముతో, దేవులందరి తత్త్వములు తనలో నిండగా స్వచ్ఛ రూపముతో ఆతడు నీటి నుండి వెలు వడెను.

ప్రత్యక్ష దర్శీ సర్వస్య జగత స్తపసా బభౌ.

అట్లాతడు తపస్సుతో ప్రకాశించుచు సమస్త జగమునకు సాక్షాత్కరించెను.

తస్మింస్తు కాలే పఞ్చానాం జాతః సర్గో నరోత్తమ,

దివ్యానాం పృథివీస్థానాం చతుర్ణాం మరజాతినామ్‌.

రాజా! ఆ సమయముననే దేవలోక సంబంధముగా అయిదు విధములగు జాతులయు, భూమి యందుండు నవియు మృత్యు ధర్మము కలవి యునగు నాలుగు జాతులయు సృష్టి ఏర్పడెను.

రౌద్రసర్గస్య సంభూతి స్తదా సద్యోపి జాయతే,

ఇదానీం రుద్ర సర్గం త్వం శృణు పార్థివసత్తమ.

ఆ విషముగా రుద్రుడు చేసిన సృష్టి ఒక పెట్టున ఏర్పడెను. రాజవరేణ్యా! ఆ రుద్ర సృష్టిని గూర్చి యిప్పుడు నీకు తెలిపెదను. వినుము.

దశవర్ష సహస్రాణి తప స్తప్త్వా మహజ్జలే,

ప్రతిబుద్ధో యదా రుద్ర స్తదా చోర్వీం సకాననామ్‌.

ధృష్ట్వా సస్యవతీం రమ్యాం మనుష్య పశుసబ్కులామ్‌,

శుశ్రావ చ తదా శబ్ధా నృత్విజాం దక్షసద్మని,

ఆశ్రమే యజ్జినాం చోచ్చై ర్యోగస్థై రితి కీర్తితాన్‌.

అట్లు పది వేలేండ్లు పెన్నీట తప మొనరించి మేల్కొన్న వాడై రుద్రుడు చక్కని పైరులతో, అడవులతో, మనుష్యులతో, పశువులతో, చూడ ముచ్చటగా నున్న భూమిని గాంచెను. మఱియు దక్షుని యజ్ఞ వాటిక యందు యజ్ఞికులు చెదరని బుద్దితో పెద్ద స్వరముతో చేయుచున్న వేద నాదములను వినెను.

తతః శ్రుత్వా మహాతేజాః సర్వజ్ఞః పరమేశ్వరః,

చుకోప సుభృశం దేవో వాక్యం చేద మువాచ హ.

మహా తేజస్వియు, సర్వము నెఱిగిన వాడును అగు పరమేశ్వరుడా శబ్దమును విని పెల్లు కోపించి యిట్లు పలికెను.

అహం పూర్వం తు కవినా సృష్టః సర్వాత్మనా విభుః,

ప్రజాః సృజస్వేతి తదా వాక్యమేతత్త థోక్తవాన్‌.

మొదట పరమాత్మ నన్ను పుట్టించెను. ఆ ప్రభువు నిండు హృదయముతో ప్రజలను సృజింపు మని పలికెను.

ఇదానీం కేన తత్కర్మ కృతం సృష్ట్యాది వర్ణనమ్‌,

ఏవ ముక్త్వా భృశం కోపా న్ననాద పరమేశ్వరః.

ఇప్పుడు ఈ సృష్టి మొదలగు పని నంతటిని ఎవ్వడు చేసెను? అని యిట్లు పలికి పెను కోపముతో పరమేశ్వరుడు పెద్ద నాదము గావించెను.

తస్యైవ నదతో జ్వాలాః శ్రోత్రేభ్యో నిర్యయు స్తదా,

తత్ర భూతాని వేతాలాః ఉచ్ఛుష్మాః ప్రేత పూతనాః,

కూష్మాండా యాతాధానాశ్చ సర్వే ప్రజ్వాలితాననాః,

ఉత్తస్థుః కోటిశ స్తత్ర నానాప్రహరణావృతాః.

అట్లు రంకెలు వేయుచున్న ఆతని చెవుల నుండి నిప్పులు గ్రక్కుచున్న వేతాళము లును భూతములు ప్రేతములగు పూతనలు, ఆయుధములు తాల్చి కోట్ల కొలదిగా వెలువడిరి.

తే దృష్ట్యా భూతసంఘాతా వివిధాయుధ ప్రాణయః,

ససర్జ వేదవిద్యాఙ్గ రథం పరమశోభనమ్‌.

పెక్కు విధములగు ఆయుధములు తాల్చిన ఆ భూతముల మొత్తములను గాంచి ఆ మహా దేవుడు వేదవిద్యలే అంగములుగా గల అందమైన రథము నొక దానిని సృజించెను.

తస్మిన్‌ ఋగాదయ స్త్వశ్వా స్త్రితత్త్వం చ త్రివేణుకమ్‌,

త్రిపూజకం త్రిషవణం ధర్మాక్షం మారుతధ్వనిమ్‌.

ఆ రథమునకు ఋక్కు మొదలగు నవియే గుఱ్ఱములు, మూడు తత్త్వములే మూడు బొగులు, మూడు సవనములే మూడు పూజకములు, ధర్మమే యిరుసు, వాయువే ధ్వనిగా నమరి యుండెను.

అహోరాత్రే పతాకే ద్వే ధర్మాధర్మేతు దండకమ్‌,

శకటం సర్వవిద్యా శ్చ స్వయం బ్రహ్మా హి సారథిః.

పగలు రాత్రియను రెండు పతాకలు, ధర్మము, అధర్మము అను రెండు దండములు ఆ బండికి అమరెను. ఇట్లు సర్వ విధ్యా రూపమైన ఆ బండికి సాక్షాత్తు బ్రహ్మయే సారథిగా నయ్యెను.

గాయత్రీ చ ధను స్తస్య ఓంకారో గుణ ఏవచ,

స్వరాః సప్త శరాస్తస్య దేవదేవస్య సువ్రత.

ఆ దేవదేవునకు గాయిత్రియే విల్లు, ఓంకారమే అల్లెత్రాడు, ఏడు స్వరములు బాణములు ఆయెను.

ఏవం కృత్వా స సామగ్రీన్‌ దేవ దేవః ప్రతాపవాన్‌,

జగామ దక్షయాజ్ఞాయ కోపాద్రుద్రః ప్రతాపవాన్‌.

ఇట్లు సాధన సంపత్తి నేర్పరుచుకొని మహా ప్రతాపము గల దేవదేవుడు రుద్రుడు కోపముతో దక్ష యజ్ఞము కడ కరిగెను.

గచ్ఛత్త స్తస్య దేవస్య అమ్బరాఙ్గి రసం నయత్‌,

ఋత్విజాం మంత్రనిచయో నష్టో రుద్రాగమే తదా.

ఆ దేవు డట్లు పోవు చుండగా సూర్యుడు ప్రకాశింప కుండెను. ఋత్విజులు మంత్ర పఠనము ఆగి పోయెను.

విపరీత మిదం దృష్ట్వా తదా సర్వేత్ర ఋత్విజః,

ఊచుః సంనహ్యతాం దేవా మహద్వో భయమాగతమ్‌.

ఈ విపరీతమును గాంచి, అందున్న ఋత్విక్కు లందఱు ఇట్లు పలికిరి. దేవులారా! సిద్దముగా నుండుడు. మీకొక పెను భయము వచ్చి పడినది.

కశ్చిదాయాతి బలవానసురో బ్రహ్మనిర్మితః,

యజ్ఞ భాగార్థ మేతస్మిన్‌ క్రతౌ పరమదుర్లభమ్‌.

బ్రహ్మ వలన రూపొందిన ఒక పెను రక్కసుడు గొప్ప బలముతో అందరాని యజ్ఞ ఫలమున వంతునకై వచ్చు చున్నాడు.

ఏవముక్తా స్తతో దేవా ఊచు ర్మాతామహం తదా,

దక్ష తాత కిమత్రాస్మత్కార్యం బ్రూహి వివక్షితమ్‌.

ఈ మాటలు విన్న అమరులు తాతయగు దక్షునితో నిట్లనిరి: తాతా! ఇప్పుడు మేమేమి చేయుదుము? నీ నిర్ణయమేమో తెలుపుము.

దక్షుడు:

ఉహ్యంతాం ద్రుత మస్త్రాణి సఙ్గ్రామోత్ర విధీయతామ్‌.

దక్షుడు:

వడివడిగా ఆయుధములు చేత బట్టుడు. ఇచట మనము పోరాడ వలయును.

ఏవముక్తే తదా దేవై ర్వివిధాయుధధారిభిః,

రుద్రస్యానుచరైః సార్థం మహ ద్యుద్ధం ప్రవర్తితమ్‌.

దక్షుడిట్లు పలుకగా దేవతలు పెక్కు తీరుల ఆయుధములను ధరించి రుద్రుని సేవకులతో పెద్ద కయ్యము గావించిరి.

తత్ర వేతాలభూతాని కూష్మాండా గ్రహపూతనాః,

యుయుధు ర్లోకపాలైశ్చ నానా శస్త్ర ధరాణి చ.

పెక్కు విధములగు ఆయుధములు తాల్చిన బేతాళ భూతములు కూష్మాండులు, గ్రహ పూతనలు (వీరందరు రుద్రానుచరులు) లోక పాలురతో పోరు సలిపిరి.

భూతాన్యపి మృధే ఘోరా ణ్యుల్ముకై రస్థిభిః శరైః,

జగ్ము ర్దేవాన్‌ మృధే రోషాద్‌ రుద్రస్య పురతో బలాత్‌.

వెరపు గొలుపు భూతములు కూడా రుద్రుని ముందు నిలువ ద్రొక్కుకొని రోషముతో కొఱవులను, ఎముకలను, బాణములను దేవతలపై క్రుమ్మరించు చుండిరి.

తత స్తస్మిన్‌ మహారౌద్రే సఙ్గ్రామే భీమరూపిణి,

రుద్రో భగస్య నేత్రే తు బిభేదైకేషుణా మృధే.

ఇట్లు మహాతీవ్రముగా భయము గొలుపు యుద్దము సాగుచుండగా రుద్రుడు ఒక్క వాడి బాణముతో భగుని రెండు కనులను పొడిచి వైచెను. (భగుడు - ద్వాదశ ఆదిత్యులలో ఒకడు)

రుద్రస్య శరతాపేన నష్టనేత్రం భగం తదా,

దృష్ట్వా స్య క్రోధాత్‌ తేజస్వీ పూషా రుద్ర మయోధయత్‌.

రుద్రుని బాణము మంటకు కనులు పోయిన భగుని చూచి క్రోధముతో తేజస్వియగు పూషుడు పైకి దూకెను. (పూషుడు ద్వాదశ ఆదిత్యులలో ఒకడు)

సృజంత మిషుజాలాని పూషణంతు మహామృధే,

దృష్ట్వా రుద్రోస్య దంష్ట్రాంస్తు చకర్ష పరవీరహా.

అట్లు బాణములు గుప్పించు చున్న పూషుని గాంచి రుద్రుడు మహా యుద్దమున వాని దంతములను ఊడ లాగెను.

తస్య దంతాం స్తదా దృష్ట్వా పూష్ణో రుద్రేణ పాతితాన్‌,

దుద్రువు ర్వసవో దిక్షు రుద్రా స్త్వేకాదశ ద్రుతమ్‌.

పూషుని దంతములు రుద్రుని వలన నేల కూలగా చూచి వసువులు చెల్లాచెదరైరి. పదునొకండు రుద్రులు వారిని వెంట నంటి తోలిరి.

తాన్‌ భగ్నాన్‌ సహసా దిక్షు దృష్ట్వా విష్ణుః ప్రతాపవాన్‌,

అదిత్యావరజో వాక్య మువాచ స్వబలం తదా.

అట్లు దెబ్బతిని దిక్కులకు పారుచున్న వారిని గాంచి ఆదిత్యుల తమ్ముడు, ప్రతాప వంతుడు నగు విష్ణువు తన బలముతో నిట్లు పలికెను.

క్వ యాత పౌరుషం త్యక్త్వా దర్పం మహాత్మ్యమేవచ,

వ్యవసాయం కులం భూతిం కథం నస్మర్యతే ద్రుతమ్‌.

మగతనుమును, గర్వమును, మహిమను వదలి వైచి యెందు పోయెదరు? మీరు వచ్చిన పనియేమో, మీ కుల గౌరవ మెట్టిదో, మీ సంపద యెట్టిదో ఏల స్మరింపురు?

పరమేష్ఠిగుణౖ ర్యుక్తో లఘువద్భీతితః పురా,

నమస్కం కురుతే మోఘం పృథివ్యాం పద్మజః స్వయమ్‌.

సృష్టి కర్త గుణము లన్నియు కలిగియు, సాధారణ జనుని వలె ఈ బ్రహ్మయు మునుముందు భయమంది వ్యర్ధముగా చేతులు ముడుచు కొనుచున్నాడు.

ఏవ ముక్త్వా గరుత్మంత మారురోహ హరి స్తదా,

శఙ్ఖచక్రగదాపాణిః పీతవాసా జనార్దనః.

ఇట్లు పలికి ఆ విష్ణువు అంత శంఖమును, చక్రమును, గదను చేతుల యందు తాల్చి, పట్టు వస్త్రము ధరించి జనార్ధనుడై గరుత్మంతు నదిరోహించెను.

తతో హరిహరం యుద్ధ మభవ ల్లోమహర్షణమ్‌,

రుద్రః పాశుపతాస్త్రేణ వివ్యాధ మరి మోజసా,

హరి ర్నారాయణాస్త్రేణ రుద్రం వివ్యాధ కోపవాన్‌.

అంత హరి హరులకు మేను గగుర్పొడుచు పోరు సాగెను. రుద్రుడు శక్తి నంతయు కూడ దీసికొని పాశుపతాస్త్రముతో హరిని కొట్టెను. హరి కోపము పెల్లు రేగగా నారయణాస్త్రముతో రుద్రుని మోదెను.

నారాయణం పాశుపత ముభేస్త్రే వ్యోమ్ని రోషితే

యుయుధాతే భృశం దివ్యం పరస్పరజిఘాంసయా,

దివ్యం వర్షసహస్రంతు తయో ర్యుద్ధ మభూత్‌ తదా.

పెను రోషము గల ఆ నారాయణ పాశుపతము లనెడు అస్త్రములు రెండును ఆకసమున ఒకటి నొకటి రూపుమాప వలయు నన్న భావముతో దివ్యములగు వేయి యేండ్లు పోరినవి. ఆ విధముగా హరి హరుల పోరు సాగెను.

తత్రైకం ముకుటోద్బద్ధం మూర్ధన్యం జటజాలకమ్‌,

ఏకం ప్రధ్మాపయచ్ఛఙ్ఖ మన్యడ్డమరుకం శుభమ్‌.

ఆ అస్త్రములలో ఒకటి కిరీటముతో ఒదిగి యున్నది. మఱి యొకటి విప్పారిన జడలతో అలరి యున్నది. ఒకటి శంఖమును పూరించు చున్నది. మఱి యొకటి శుభమైన డమరుకమను మ్రోగించు చున్నది.

ఏకం ఖడ్గకరం తత్ర తథాన్యం దండధారిణమ్‌,

ఏకం కౌస్తుభదీప్తాఙ్గ మన్యం భూతి విభూషితమ్‌.

ఒకటి కత్తి చేత తాల్చి యున్నది. మఱి యొకటి దండము ధరించి యున్నది. ఒకటి కౌస్తుభము వెలుగులు ఒడలెల్ల ప్రాకి యున్నది. వేరొకటి భస్మముతో చెలువొంది యున్నది.

ఏకం గదాం భ్రామయతి ద్వితీయం దండమేవచ,

ఏకం శోభతి కంఠస్థై ర్మణిభి స్త్వ స్థిభిం పరమ్‌.

ఒకటి గదను త్రిప్పు చున్నది. ఇంకొకటి దండమును త్రిప్పు చున్నది. ఒకటి కంఠమున నున్న మణులతో నలరారు చున్నది. వేరొకటి అస్తిమాలతో ఒప్పారు చున్నది.(ఆస్థి = ఎముక)

ఏకం పీతామ్బరం తత్ర ద్వితీయం సర్పమేఖలమ్‌.

ఒకటి పచ్చని వస్త్రము తాల్చి యున్నది. రెండువది రెండవది పాముల మొలనూలితో విరాజిల్లు చున్నది.

ఏవం తౌ స్పర్థినా వస్త్రౌ రౌద్రనారాయణాత్మకౌ,

అన్యోన్యాతిశయోపేతౌ తదాలోక్య పితామహః.

ఉవాచ శామ్యతా మస్త్రౌ స్వస్వభావేన సువ్రతౌ,

ఏవం తే బ్రహ్మణా చోక్తౌ శాంతభావం ప్రజగ్మతుః.

ఇట్లు పరస్పరము పగగొన్న పాశుపత నారాయనాస్త్రములు రెండును, ఒకటి కొకటి మించ వలయునన్న భావముతో నుండగా బ్రహ్మ అది గాంచి, మేలైన నడవడి గల అస్త్రములారా! మీ మీ స్వభావముతో శాంతింపుడు, అని యిట్లు బ్రహ్మ పలుకగా అవి రెండును శాంతించి నవి.

తథా విష్ణుమరౌ బ్రహ్మా వాక్య మేత దువాచ హ,

ఉభౌ హరిహరౌ దేవౌ లోకే ఖ్యాతిం గమిష్యథః

అంత బ్రహ్మ హరి హరులను గాంచి యిట్లు పలికెను. దేవులగు హరిహరు లిరువురు లోకమున కీర్తి నందెదరు.

అయం చ యజ్ఞ విధ్వస్తః సంపూర్ణత్వం గమిష్యతి,

దక్షస్య ఖ్యాతిమాన్‌ లోకః సంతత్యాయం భవిష్యతి.

పాడైన యీ దక్షుని యజ్ఞము పరిపూర్ణతను గాంచును. దక్షుని సంతాన రూపమైన యీ యజ్ఞము లోకమున వాసి గాంచును.

ఏవ ముక్త్వా హరిహరౌ తదా లోకపితామహః,

బ్రహ్మ లోకానువాచేదం రుద్రభాగోస్య దీయతామ్‌.

ఇట్లు హరి హరులతో పలికి లోక పితా మహుడగు బ్రహ్మ లోకుల నుద్ధేశించి రుద్ర భాగము నీ రుద్రున కొసగుడని పలికెను.

రుద్రోభాగో జ్యేష్ఠభాగ ఇతీయం వైదికీ శ్రుతిః

స్తుతిం చ దేవాః కురుత రుద్రస్య పరమేష్ఠినః,

అంత రుద్రుని భాగము జ్యేష్ఠ భాగమని వేదవాక్కు విన వచ్చెను. దేవతలారా! పరమేశ్వరుడగు రుద్రుని స్తుతింపుడు అనియు వేదవాక్కు వెలువడెను.

భగనేత్రహరం దేవం పూష్ణో దంతవినాశనమ్‌,

స్తుతిం కురుత వః శ్రీఘ్రం గీతై రేతైస్తు నామభిః,

యేనాయం వః ప్రసన్నాత్మా వరదత్వం భజేత హ.

భగుని కన్నులను పోగొట్టిన వానిని, పూషుని దంతములు విరుగ గొట్టిన వానిని ఈ రుద్రుని ఇట్టి నామములతో వడిగా స్తుతింపుడు. దానితో ఆతడు మీ యందు పసన్నుడై మీకు వరముల నొసగును.

ఏవ ముక్తాస్తు తే దేవాః స్తోత్రం శంభో ర్మహాత్మనః,

చక్రుః పరమయా భక్త్యా నమస్కృత్య స్వయంభువే.

అని వేదమాత పలుకగా దేవతలు పరమ భక్తితో నమస్కరించి మహాత్ముడును. స్వయం భువునగు శంభుని స్తోత్రము నిట్లు చేసిరి.

దేవతలు:

నమో విషమనేత్రాయ నమస్తే త్ర్యమ్బకాయ చ,

నమః సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే.

దేవతలు:

విషమ నేత్రుడు, ముక్కంటి, వేయి కన్నులు కలవాడు శూలము చేత దాల్చిన వాడు నగు పరమేశ్వరా! నీకు నమస్సు.

నమః ఖట్వాంగహస్తాయ నమో దండభృతే కరే,

త్వం దేవ హుతభుగ్జ్వాలా కోటి భాను సమప్రభః

మంచపు కోడు వంటి ఆయుధము గల ఓ స్వామీ! నీకు నమస్కారము, చేత దండము ధరించిన దేవా! నీకు మ్రొక్కులు. నీవు అగ్ని జ్వాలలు గల కోట్లకొలది సూర్యులకు దీటైన తేజస్సు కలవాడవు.

ఆదర్శనేన యద్‌ దేవ మూఢ విజ్ఞానతోధునా,

కృత మస్మాభి రేవేశ తదత్ర క్షమ్యతాం ప్రభో.

మా విజ్ఞానమునకు పొరలు క్రమ్మి నేడు నిన్ను గుర్తింపక చేసిన తప్పును ప్రభూ! క్షమింపుము.

నమస్తినే త్రార్తిహరాయ శంభో త్రిశూలపాణే వికృతాస్యరూప,

సమస్త దేవేశ్వర శుద్ధభావ ప్రసీద రుద్రాచ్యుత సర్వభావ.

ఓ ముక్కంటీ! నీవు పీడలను పరిమార్తువు. శంభూ! త్రిశూల ధారీ! వింతైన మొగము గల దేవా! సమస్త దేవేశ్వరా! శుద్ధ స్వభావా! రుద్రా! అచ్యుతా! సర్వ భావముల సమష్టి రూపమైన ఓ ప్రభూ! మాయందు ప్రసన్నుడ వగుము.

పూష్ణో స్య దంతాంతక! భీమరూప! ప్రలంబ భోగీన్ద్రలులంతకంఠ!

విశాలదేహాచ్యుత! నీలకంఠ! ప్రసీద విశ్వేశ్వర! విశ్వమూర్తే!

ఈ పూషుని దంతము లూడ గొట్టిన ఓ భీమరూపా! వ్రేలాడు నాగరాజు మెడకు చుట్టు కొన్న స్వామీ! విశాల దేహము గల దేవా! అచ్యుతా! నీలకంఠా! విశ్వేశ్వరా! విశ్వమూర్తీ! మా యెడ దయగొనుము.

భగాక్షి సంప్ఫోటన దక్ష కర్మా గృహాణ భాగం ముఖతః ప్రధానమ్‌,

ప్రసీద దేవేశ్వర! నీలకంఠ! ప్రపాహి నః సర్వగుణోపపన్న!

భగుని కను గ్రుడ్లను పొడిచి వేయుటలో నేర్పుగల ఓ దేవా! ఈ యజ్ఞమున నీవు ప్రధాన భాగమును స్వీకరింపుము, దేవదేవా! నీలకంఠా! సర్వ గుణములు నెలకొన్న మహానుభావా! మా యందు దయ చూపుము. మమ్ము పరిపాలింపుము.

సితాంగ రాగాప్రతిపన్నమూర్తే కపాలధారిం స్త్రిపురఘ్న దేవ,

ప్రపాహి నః సర్వభయేషు చైవ ఉమాపతే పుష్కరనాళ జన్మ.

తెల్లని భూతిపూత గల నీ స్వరూపము గుర్తింప రానిది. ఓ కపాలదారీ! త్రిపురాసురులను మట్టు పెట్టిన స్వామీ! ఉమాపతీ! తామర తూడు నుండి ఉద్భవించిన ఓ ప్రభూ! మమ్ము సర్వ భయముల నుండి కాపాడుము.

పశ్యామ తే దేహగతాన్‌ సురేశ సర్గాదయో వేదవరా ననంత,

సాంగాన్‌ సవిద్యాన్‌ సపదక్రమాంశ్చ సర్వాన్‌ నిలీనాం స్త్వయి దేవదేవ.

దేవ దేవా! నీ దేహమున సృష్టుల నన్నింటిని గాంచు చున్నాము. అట్లే! అనంతా! అంగములతో, విద్యలతో, పదము, క్రమము అను విభాగములతో నీయందు కలిసి యున్న వేదముల నన్నింటిని గనుగొను చున్నాము.

భవ శర్వ మహాదేవ పినాకిన్‌ రుద్ర తేహర,

నతాః స్మ సర్వే విశ్వేశ త్రాహి నః పరమేశ్వర.

భవా! శర్వా! మహాదేవా! పినాకీ! రుద్రా! హరా! విశ్వేశా! మేమందరము నీకు అణగి యున్నాము. పరమేశ్వరా! మమ్ము రక్షింపుము.

ఇత్థం స్తుత స్తదా దేవై ర్దేవదేవో మహేవ్వరః,

తుతోష సర్వదేవానాం వాక్యం చేద మువాచ హ.

అట్లు దేవత లందఱు తనను స్తుతింపగా దేవ దేవుడగు మహేశ్వరుడు సంతోష మందెను. ఆ దేవత లందరకు నిట్లు పలికెను.

రుద్రుడు:

భగస్య నేత్రం భవతు పూష్ణో దంతా స్తథా మఖః,

దక్షస్యాచ్ఛిద్రతాం యాతు యజ్ఞశ్చాదితేః సుతాః,

పశుభావం తథా చాపి అపనేష్యామి వః సురాః.

రుద్రుడు:

అదితి సుతులారా! భగునకు నేత్రములు వచ్చుగాక! పూషుని దంతములు మరల ఏర్పడుగాక! దక్షునిదగు ఈ యజ్ఞము ఏ లోపము లేనిదగు గాక! దేవతలారా! మీ పశు భావమును గూడ పోగొట్టెదను.

మద్దర్శనేన యో జాతః పశుభావో దివౌకసామ్‌,

స మయాపహృతః సద్యః పతిత్వం వో భవిష్యతి.

నన్ను చూచుట వలన స్వర్గ వాసుల కేర్పడిన పశు భావమును నేను వెను వెంటనే తొలగించెదను. మీకు మరల అధిపతిత్వము కలుగు గాక!

అహం చ సర్వవిద్యానాం పతిరాద్యః సనాతనః,

అహం వై పశుభావేన పశుమధ్యే వ్యవస్థితః.

అతః పశుపతి ర్నామ మమలోకే భవిష్యతి,

యే మాం యజన్తి తేషాం స్యాద్‌దీక్షా పాశుపతీ భవేత్‌.

నేను విద్య లన్నింటికి మొదటి ప్రభువను. సనాతసుడను. నేనే పశువుల నడుమ పతి లక్షణముతో నెలకొని యున్న వాడను. కావున నాకు ‘పశుపతి’ యనుపేరు లోకమున ఏర్పడును. నన్ను పూజించు వారికి పాశుపత దీక్ష కలుగును.

ఏవ ముక్తేథ రుద్రేణ బ్రహ్మా లోకపితామహః,

ఉవాచ రుద్రం స్నేహం స్మితపూర్వమిదం వచః.

రుద్రు డిట్లు పలుకగా లోకపితా మహుడగు బ్రహ్మ చనవుతో, చిరునగవుతో రుద్రునితో నిట్లు పలికెను.

ధ్రువం పశుపతి ర్దేవ త్వం లోకే ఖ్యాతి మేష్యతి

అయం చ దేవ స్త్వన్నామ్నా లోకే ఖ్యాతిం గమిష్యతి,

ఆరాద్యశ్చ సమస్తానాం దేవాదీనాం గమిష్యతి.

దేవా! నీవు ‘పశుపతి’ అని లోకమున ఖ్యాతి నందెదవు. ఇది ధ్రువము. నీ పేరుతో ఈతడును లోకమున కీర్తి కెక్కును. దేవత లందరకు ఆరాధ్యు డగును.

ఏవముక్త్వా తదా బ్రహ్మా దక్షం ప్రోవాచ బుద్దిమాన్‌,

గౌరీం ప్రయచ్ఛ రుద్రాయ పూర్వ మేవోపపాదితామ్‌.

ఇట్లని బ్రహ్మ జ్ఞాన సంపద కలవాడై దక్షునితో రుద్రునకు, మున్నే నిశ్చయించిన విధముగా, గౌరీదేవి నొసగు మని పలికెను.

ఏవముక్తా స్తదా దక్ష స్తాం కన్యాం బ్రహ్మ సంనిధౌ,

దదౌ రుద్రాయ మహతే గౌరీం పరమశోభనామ్‌.

బ్రహ్మ యిట్లు పలుకగా దక్షుడు బ్రహ్మ సమక్షమున మహా దేవుడగు రుద్రునకు సర్వ మంగళ యగు గౌరిని సమర్పించెను.

స తాం జగ్రాహ విధివద్‌ రుద్రః పరమ శోభనామ్‌,

దక్షస్య చ ప్రియం కుర్వన్‌ బహుమాన పురఃసరమ్‌.

అంత రుద్రుడు దక్షునకు మన్ననతో ప్రియ మొనర్చుచు సమస్త కళ్యాణ గుణములు గల గౌరిని యథావిధిగ స్వీకరించెను.

గృహీతాయాం తు కన్యాయాం దాక్షాయణ్యాం పితామహః,

దదౌ రుద్రస్య నిలయం కౌలాసం సురసంనిధౌ.

దక్షుని పుత్రికను శివుడు కైగొనగా బ్రహ్మ దేవతల యెదుట కైలాసమును శివునకు నెలవుగా నొసగెను.

రుద్రోపి ప్రయయౌ భూతైః సమం కైలాస పర్వతమ్‌,

దేవా శ్చాపి యథాస్థానం స్వంస్వం జగ్ముర్ముదాన్వితాః,

బ్రహ్మాపి దక్షసహితః ప్రాజాపత్యం పురం యయౌ.

రుద్రుడు భూత గణములతో పాటు కైలాస పర్వతమున కరిగెను. దేవత లందఱు సంతోషముతో తమ తమ తావుల కరిగిరి. బ్రహ్మయు దక్షునితో కూడి ప్రాజాపత్య పురమున కరిగెను.