అధ్యాయము - 79

రుద్రుడు:

సీతాంతస్యాచలేంద్రస్య కుముదస్యాంతరేణ చ,

ద్రోణ్యాం విహంగపుష్టాయాం నానాసత్వనిషేవితమ్‌.

త్రియోజన శతాయామం శతయోజనవిస్తృతమ్‌,

సురసామల పానీయం రమ్యం తత్ర సురోచనమ్‌.

రుద్రుడు:

సీతాంతము, కుముదము అను కొండల నడుమ నున్న విశాలమైన భూమి యందు అనేక పక్షులు, పెక్కు మృగములు ఆశ్రయించినది, మూడు వందల యోజనముల పొడవు, నూరు యోజనముల వెడల్పు కలది, చక్కని స్వచ్ఛమైన రుచికరమగు నీరుగల అందమైన సరస్సు ఒకటి కలదు.

ద్రోణమాత్ర ప్రమాణౖశ్చ పుండరీకైః సుగన్ధిభిః,

సహస్రశతపత్రైశ్చ మహాపద్మై రలంకృతమ్‌.

పెద్ద కుండ లంతటివి సువాసనలను విర జిమ్మునవి, వేయి రేకులు కలవి అగు తెల్లని మహా పద్మములు దాని నలంక రించినవి.

దేవదానవగంధర్వై ర్మహాసర్పై రధిష్ఠితమ్‌,

పుణ్యం తచ్ఛ్రీసరో నామ సప్రకాశ మిహేహచ.

దేవతలు, దానవులు, గంధర్వులు, మహా సర్పములు అందు నెలకొని యున్నవి. పుణ్యమైన ఆ సరస్సు పేరు శ్రీ సరస్సు. మంచి కాంతితో అలరారును.

ప్రసన్నసలిలైః పూర్ణం శరణ్యం సర్వదేహినామ్‌,

తత్ర త్వేకం మహాపద్మం మధ్యే పద్మవనస్య చ.

కోటిపత్రప్రకలితం తరుణాదిత్య వర్చసమ్‌,

నిత్యం వ్యాకోశమధురం చలత్వా దతిమండలమ్‌.

చారుకేసరజాలాఢ్యం మత్తభ్రమరనాదితమ్‌,

తస్మిన్‌ మధ్యే భగవతీ సాక్షాచ్ఛ్రీర్నిత్యమేవ హి,

లక్ష్మీస్తుతం తదావాసం మూర్తిమంతం న సంశయః.

ప్రసన్నములగు జలములతో నిండినది, ప్రాణు లన్నింటికి ఆశ్రయ మొసగునది అగు ఆ సరస్సు నడిమి భాగమున పద్మముల తోటలో ఒక పెద్ద పద్మము కలదు. దానికి కోటి రేకులు కలవు. ఉదయించు సూర్యుని వంటి దీప్తి కలదు. ప్రతి దినము వికసించుట చేత మధుర మైనది. కదలు చుండుట చేత పెద్ద మండలము కలిగి యుండెను. అందమైన కేసరములు గుత్తులతో, మదించిన తుమ్మెదల నాదములతో ఒప్పారు చుండును. దాని నడుమ భగవతి లక్ష్మి నిత్య నివాస మొనరించును. ఆ నివాసమున సాక్షాత్తు రూపము ధరించి లక్ష్మి కన్పట్టును. సంశయము లేదు.

సరస స్తస్య తీరే తు తస్మిన్‌ సిద్ధనిషేవితమ్‌,

సదాపుష్పఫలం రమ్యం తత్ర బిల్వవనం మహత్‌.

ఆ సరస్సు ఒడ్డున సిద్ధులు నివసించెడునది, ఎల్లప్పుడు పూవులతో పండ్లతో సమృద్ధిగా ఉండునది, అందమైనది అగు మారేడు వన మొకటి కలదు.

శత యోజన విస్తీర్ణం ద్వియోజన శతాయతమ్‌,

అర్ధక్రోశాచ్చ శిఖరై ర్మహావృక్షైః సమంతతః,

శాఖాసహస్రకలితై ర్మహాస్కంధైః సమాకులమ్‌.

నూరు యోజనముల వెడల్పు, రెండు నూర్ల యోజనముల పొడవు కలిగి, అర్ధ క్రోశము వరకు వ్యాపించిన చివరలు గలవి, వేల కొలది కొమ్మలు కలవి, గొప్ప కాండములు కలవి అగు మహా వృక్షములతో నిండి యున్నది.

ఫలైః సహస్ర సంకాశైః హరితైః పాండురై స్తథా,

అమృతస్వాదుసదృశై ర్భేరీమాత్రైః సుగన్ధిభిః.

పెద్ద భేరు లంతటి వేలకొలది, పచ్చని, తెల్లని అమృతము వలె రుచికరమైన, మంచి వాసన గల పండ్లతో ఒప్పారును.

శీర్యద్భిశ్చ పతద్భిశ్చ కీర్ణభూమివనాంతరమ్‌,

నామ్నా తచ్ఛ్రీవనం నామ సర్వలోకేషు విశ్రుతమ్‌.

పండి పగిలి, రాలి పడుచున్న పండ్లతో ఆ భూమి యంతయు వ్యాపించి యున్నది. దాని పేరు శ్రీవనము. అన్ని లోకములలో ప్రసిద్ధి కెక్కినది.

దేవాదిభిః సమాకీర్ణ మష్టాభిః కకుభిః శుభమ్‌,

బిల్వాశిభిశ్చ మునిభిః సేవితం పుణ్యకారిభిః,

తత్ర శ్రీః సంస్థితా నిత్యం సిద్ధసంఘనిషేవితా.

ఎనిమిది దిక్కు లందును దేవతలతో, బిల్వ ఫలములను మాత్రమే భుజించు పుణ్య వంతులగు మునులతో నిండి యున్నది. అచట సిద్ధ సంఘములు కొలుచు చున్న శ్రీదేవత సర్వ కాలములలో నివాసము చేయును.

ఏకైకస్యాచలేంద్రస్య మణిశైలస్య చాన్తరమ్‌,

శతయోజనవిస్తీర్ణం ద్వియోజన శతాయతమ్‌.

విమలం పంకజవనం సిద్ధచారణసేవితమ్‌,

పుష్పం లక్ష్మ్యా ధృతం భాతి నిత్యం ప్రజ్వలతీవ హ.

ఒక్కొక్క కొండకు కొండకు నడిమి ప్రదేశము నూరు యోజనముల వెడల్పు, రెండునూర్ల యోజనముల పొడవు కలిగి యుండెను. అందు విమల మైన పద్మ వనము కలదు. దానిని సిద్ధులు, చారణులు సేవించి యుందురు. లక్ష్మీ దేవి తాల్చిన పుష్పము వలె ఎల్లప్పుడు వెలిగి పోవుచు ప్రకాశించును.

అర్ధక్రోశం చ శిఖరై ర్మహాస్కంధైః సమావృతమ్‌,

ప్రఫుల్లశాఖా శిఖరం పిఞ్జరం భాతి తద్వనమ్‌.

అర్ధ క్రోశము ఎత్తుగల చివరి భాగములతో పెద్ద పెద్ద కాండములతో బాగుగా పుష్పించిన కొమ్మల చివరలతో ఆ వనము లేత ఎరుపు వన్నెతో అలరారును.

ద్విబాహు పరిణాహైస్తై స్త్రిహస్తాయతవిస్తృతైః,

మనఃశిలాచూర్ణ నిభైః పాణ్డుకేసరశాలిభిః.

పుష్పై ర్మనోహరై ర్వ్యాప్తం వ్యాకోశై ర్గంధశోభిభిః,

విరాజతి వనం సర్వం మత్తభ్రమరనాదితమ్‌.

రెండు బారల చుట్టు కొలతయు మూడు బారల విస్తృతియు, మణిశిల చూర్ణము వంటి రంగుతో, తెల్లని కేసరములతో, నిత్యము వికసించుచు, సువాసనలతో అలరారు పూవులతో ఆ వనము మదించిన తుమ్మెదల నాదముతో ప్రకాశించు చుండును.

తద్వనం దానవై ర్దైత్యై ర్గంధర్వై ర్యక్షరాక్షసైః,

కిన్నరై రప్సరోభిశ్చ మహాభోగైశ్చ సేవితమ్‌.

దానవులు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, సర్పములు దానిని ఆశ్రయించి యుండును.

తత్రాశ్రమో భగవతః కశ్యపస్య ప్రజాపతేః,

సిద్ధసాధుగణాకీర్ణం నానాశ్రమసమాకులమ్‌.

అందు భగవంతుడగు కశ్యప ప్రజాపతి ఆశ్రమము కలదు. సిద్ధులు, సాధు గుణములు కలవారు అందు కొల్లలుగా నుందురు. అనేక ఆశ్రమములతో అది నిండి యుండును.

మహానీలస్య మధ్యేతు కుంభస్య చ గిరే స్తథా,

మధ్యే సుఖా నదీనామ తస్యాస్తీరే మహద్వనమ్‌.

మహా నీలము కుంభము అను కొండల మధ్య ‘సుఖ’ అను నది కలదు. దాని ఒడ్డున పెద్ద వన మున్నది.

పఞ్చాశద్యోజనాయామం త్రింశద్యోజనమండలమ్‌,

రమ్యం తాలవనం శ్రీమత్‌ క్రోశార్ధోచ్ఛ్రిత పాదపమ్‌.

ఏబది యోజనముల పొడవు, ముప్పది యోజనముల మండలము కలిగిన ఆ తాల వనము అందమైనది. శోభ నిండినది. అర్ధ క్రోశము ఎత్తు పెరిగిన చెట్లు కలది.

మహాబలైర్మహాసారైః స్థిరై రవిచలైః శుభైః,

మహ దంజనసంస్థానైః పరివృత్తై ర్మహా ఫలైః.

మృష్టగన్ధ గుణోపేతై రుపేతం సిద్ధసేవితమ్‌,

ఐరావతస్య కరిణ స్తత్రైవ సముదాహృతమ్‌.

గొప్ప బలము, గొప్ప సారము, గట్టి తనము, గల పండ్లు అందు కాటుక కొండల వలె నుండును. గుండ్రని తనముతో నలరారెడు మహా ఫలములతో ఆ వనము ఒప్పారు చుండును. ఇంపైన పరిమళము ప్రకాశించును. సిద్ధులు సేవించు ఆ ప్రదేశము ఐరావత గజమునకు స్థాన మైనదిగా చెప్పు చుందురు.

ఐరావతస్య రుద్రస్య దేవశైలస్య చాన్తరే,

సహస్రయోజనాయామా శతయోజన విస్తృతా.

సర్వా హ్యేకశిలా భూమి ర్వృక్షవీరుధ వర్జితా,

ఆప్లుతా పాదమాత్రేణ సలిలేన సమన్తతః.

ఐరావతము, రుద్రము అను దేవ పర్వతముల నడుమ వేయి యోజనముల పొడవు, నూరు యోజనముల వెడల్పు గల ఒక రాతి భూమి చెట్టు చేమలు లేనిది కలదు. కాలిలోతు నీరులో అన్ని వైపుల మునిగి యుండును.

ఇత్యేతాభ్యంతరద్రోణ్యో నానాకారాః ప్రకీర్తితాః,

మేరోః పార్శ్వేన విప్రేన్ద్రా యథావదనుపూర్వశః.

విప్రవర్యులారా! మేరు పార్శ్వమున అనేక ఆకారములు గల మైదానములను గూర్చి మీకు వివరించి చెప్పితిని.