వరాహ మహా పురాణము
అధ్యాయము - 44
దుర్వాసుడు:
వైశాఖే ప్యేవ మేవం తు సంకల్ప్య విధినా నరః,
తద్వత్ స్నానాదికం కృత్వా తతో దేవాలయం వ్రజేత్.
దుర్వాసుడు:
వైశాఖ మాసమున కూడ జను డిట్లే సంకల్పించి, మునుపు చెప్పినట్లు స్నానము మొదలగు నది ఆచరించి దేవాలయమున కరుగ వలయును.
తత్రారాధ్య హరింభక్త్యా ఏభిర్మంత్రై ర్విచక్షణః,
జామదగ్న్యాయ పాదౌతు ఉదరం సర్వధారిణే,
మధుసూదనాయేతి కటి మురః శ్రీ వత్సధారిణే.
క్షత్రాంతకాయ చ భుజౌ మణికంఠాయ కంఠకమ్,
స్వనామ్నా శంఖచక్రౌతు శిరో బ్రహ్మాండధారిణే.
అచట భక్తితో హరిని ఈ మంత్రములతో నర్చింప వలయును. ‘ఓం నమో జామదగ్న్యాయ’ అని పాదములను, ‘సర్వ ధారిణే’ అని ఉదరమును, ‘మధుసూదనాయ’ అని నడుమును, ‘శ్రీవత్స ధారిణే’ అని రొమ్మును, ‘క్షత్రాంతకాయ’ అని భుజములను, ‘మణి కంఠాయ’ అని కంఠమును, వాని పేరులతో - అనగా ‘పాంచజన్యాయ’ అని శంఖమును, ‘సుదర్శనాయ’ అని చక్రమును, ‘బ్రహ్మాండ ధారిణే’ అని శిరస్సును నమస్కరింప వయును.
ఏవ మభ్యర్చ్య మేధావీ ప్రాగ్వత్ తస్వాగ్రతో ఘటమ్,
విన్యస్య స్థగితం తద్వద్ వస్త్రయుగ్మేన వేష్టితమ్.
ఇట్లు కొలిచి బుద్ధిశాలి మునుపటి వలెనే జంట బట్టలు చుట్టి నదియు, మూసినదియు నగు ఘటమును ఆ దేవుని ముందు నిలుప వలయును.
వైణవేన తు పాత్రేణ తస్మిన్ సంస్థాపయే ద్ధరిమ్,
జామదగ్న్యేతి విఖ్యాతం నామ్నా క్లేశ వినాశనమ్.
జమదగ్ని తనయు డని పేరొందిన పరశురాముని, కష్టములు పోకార్చు వానిని వెదురు పాత్రతో నిర్మించి అందు ఉంచ వలయును.
దక్షిణే పరశుం హస్తే తస్య దేవస్య కారయేత్,
సర్వగంధైశ్చ సంపూజ్య పుష్పైప ర్నానావిధైః శుభైః.
అతని కుడిచేతి యందు గొడ్డలిని ఏర్పరుప వలయును. సుగంధములు గల పెక్కు విధములగు పూవులతో పూజింప వలయును.
తతస్త స్యాగ్రతః కుర్యా జ్జాగరం భక్తిమా న్నరః,
ప్రభాతే విమలే సూర్యే బ్రాహ్మనాయ నివేదయేత్,
ఏవం నియమ యుక్తస్య యత్ఫలం తన్నిబోధ మే.
పిదప ఆతని ముందు భక్తితో జాగరము చేయ వలయును. తెల్లవారిన పిదప (సూర్యోదయ మైన తరువాత) ఆ కుంభమును బ్రాహ్మణునకు సమర్పింప వలయును. ఇట్లు నియమముతో కూడి వ్రతము చేయు వాడు పొందు ఫలము చెప్పెదను. వినుము.
ఆసీద్ రాజా మహాభాగో వీరసేనో మహాబలః,
అపుత్రః సపురా తీవ్రం తప స్తేపే మహౌజసా.
పూర్వము వీరసేనుడను మహా బలము గల రాజుండెడి వాడు. అతడు పుత్రులు లేనివాడు. గొప్ప శక్తితో తీవ్రమగు తపస్సు చేసెను.
చరత స్తత్తపో ఘోరం యాజ్ఞవల్క్యో మహామునిః,
ఆజగామ మహాయోగీ తం దృష్ట్వా నాతిదూరతః.
అట్లు ఘోరమైన తపస్సు చేయుచున్న ఆతనిని అల్లంత దూరము నుండి చూచి యాజ్ఞవల్క్య మహాముని యను మహాయోగి ఆతని కడకు వచ్చెను.
త మాయాంత మథో దృష్ట్వా ఋషిం పరమవర్చసమ్,
కృతాఞ్జలి పుటో భూత్వా రాజాభ్యుత్థాన మాకరోత్.
గొప్ప ముఖ వర్చస్సు గల ఆ ఋషి వచ్చు చుండగా చూచి రాజు దోయిలొగ్గి ఆతని కెదురేగెను.
స పూజితో మునిః ప్రాహ కిమర్థం తప్యతే తపః,
రాజన్ కథయ ధర్మజ్ఞ కింతే కార్యం వివక్షితమ్.
ఆతని పూజలంది ముని రాజా! ధర్మజ్ఞా! దేని కొరకు తపస్సు చేయు చున్నావు? నీవు సంకల్పించిన ఫలమేమి? అని అడిగెను.
రాజు:
అపుత్రోహం మహాభాగ నాస్తి మే పుత్రసంతతిః,
తేన మే తప ఆస్థాయ కృశ్యతే స్వతను ర్ద్విజ.
రాజు:
పుణ్యాత్ముడా! నేను అపుత్రుడను. నాకు పుత్ర సంతానము లేదు. కావున తపస్సు చేత నా దేహమును కష్టపెట్టు చున్నాను.
యాజ్ఞవల్క్యుడు:
అలం తే తప సానేన మహాక్లేశేన పార్థివ,
అల్పాయాసేన తే పుత్రో భవిష్యతి న సంశయః.
యాజ్ఞవల్క్యుడు:
రాజా! చాల కష్టమైన ఈ తపస్సు వలదు. నీకు కొంచెము పాటి క్లేశముతో పుత్రుడు లభించును. సంశ యింపకుము.
రాజు:
కథం మే భవితా పుత్రో అల్పాయాసేన వై ద్విజ,
ఏతన్మే కథయ ప్రీతో భగవన్ ప్రణతస్య హ.
రాజు:
బ్రాహ్మణోత్తమా! తేలిక శ్రమతో నాకు పుత్రుడెట్లు కలుగును? నీకు మ్రొక్కెదను. నాయందు ప్రీతి కలవాడవై నాకు దానిని బోధింపుము.
దుర్వాసుడు:
ఏవ ముక్తో ముని స్తేన పార్థివేన యశస్వినా,
ఆచఖ్యౌ ద్వాదశీం చేమాం వైశాఖే సితపక్షజామ్.
దుర్వాసుడు:
ఆ రాజట్లు పలుకగా ఆ ముని అతనికి వైశాఖ మాసమున శుక్ల పక్షమున ద్వాదశి నాడు చేయ వలసిన ఆ పూజను గూర్చి వివరించెను.
స హి రాజా విధానేన పుత్రకామో విశేషతః,
ఉపోష్య లబ్ధవాన్ పుత్రం నలం పరమధార్మికమ్,
యోద్యాపి కీర్త్యతే లోకే పుణ్యశ్లోకో నరోత్తమః.
పుత్రులను కోరిన ఆ రాజు విధానము ననుసరించి ఉపవాస ముండి ఆ వ్రత మాచరించి పరమ ధార్మికుడగు నల మహారాజును పుత్రునిగా పడసెను. ఈనాటికి ఆ నలుని పుణ్య శ్లోకుడని కీర్తించు చున్నారు.
ప్రాసంగికం ఫలం హ్యేతద్ గతస్యాస్య మహామునే,
సుపుత్రో జాయతే విత్తవిద్యావాన్ కాంతి రుత్తమా.
ఓ మహామునీ! ఈ వ్రతము నాచరించు వానికి ధనము విద్య, చక్కని ముఖ కాంతి గల మంచి కుమారుడు కలుగును. ఇది ఒక అప్రధానమగు ఫలము.
ఇహ జన్మని కించిత్రం పరలోకే శృణుష్వ మే,
కల్ప మేకం బ్రహ్మలోకే వసిత్వాప్సరసాంగణౖః,
క్రీడత్యన్తే పునః సృష్టౌ చక్రవర్తీ భవేద్ధ్రువమ్,
త్రింశత్యబ్ద సహస్రాణి జీవతే నాత్ర సంశయః.
ఈ లోకమున ఇట్టి ఫల మందుట ఏమి చిత్రము? పర లోకము మాట వినుము. ఒక కల్ప కాలము బ్రహ్మ లోకమున అప్సరసల గణములతో విలాసముగా గడపి మరు సృష్టి యందు చక్రవర్తియై జనించును. ముప్పది వేల సంవత్సరములు జీవించును. సంశయ మిందు లేదు.