వరాహ మహా పురాణము
అధ్యాయము - 64
అగస్త్యుడు:
అథాపరం ప్రవక్ష్యామి శౌర్య వ్రత మనుత్తమమ్,
యేన భీరో రపి మహచ్ఛౌర్యం భవతి తత్ క్షణాత్.
అగస్త్యుడు:
ఇటుపై నీకు మిక్కిలి శ్రేష్ఠమైన శౌర్య వ్రతమును గూర్చి చక్కగా తెలిపెదను. దీని వలన పిరికి వానికిని అప్పటి కప్పుడు గొప్ప శౌర్యము కలుగును.
మాసి చాశ్వయుజే శుద్ధాం నవమీం సముపోషయేత్,
సప్తమ్యాం కృతసంకల్పః స్థిత్వాష్టమ్యాం నిరోదనః.
ఆశ్వయుజ మాస శుక్ల పక్షమున నవమి నాడు ఉపవాసము చేయ వలయును. సప్తమి నాడు సంకల్పము చేసి అష్టమి నాడును ఉపవాసము ఉండ వలయును.
నవమ్యాం పారయేత్ షిష్టం ప్రథమం భక్తితో నృప,
బ్రాహ్మణాన్ భోజయేద్ భక్త్యా దేవీం చైవతు పూజయేత్,
దుర్గాం దేవీం మహాభాగాం మహామాయాం మహాప్రభామ్.
నవమి నాడు మొదట పిండిని భుజింప వలయును. భక్తితో బ్రాహ్మణుకు సంతర్పణము చేయ వలయును. మహామాయ, మహాప్రభ మహాభాగ యగు దుర్గా దేవిని పూజింప వలయును.
ఏవం సంవత్సరం యావ దుపోష్యేతి విధానతః,
వ్రతాంతే భోజయేద్ ధీమాన్ యథాశక్త్యా కుమారికాః.
ఇట్లు ఒక సంవత్సర కాలము విధానము ననుసరించి ఆ తిథి యందు ఉపవాస ముండి బుద్ధి మంతుడగు నరుడు వ్రతము ముగిసిన వెనుక శక్తి ననుసరించి కన్యకలకు అన్న మొసగ వలయును.
హేమవస్త్రాదిభి స్తాస్తు భూషయిత్వాతు శక్తితః,
పశ్చాత్ క్షమాపయేత్ తాస్తు దేవీ మే ప్రీయతా మితి.
బంగారు వస్త్రములు మున్నగు వానితో శక్తి మేరకు వారి నలంకరించి పిదప దేవి నా యెడల ప్రీత యగుగాక అని వారి నుద్దేశించి విన్నపము చేయ వలయును.
ఏవం కృతే భ్రష్టరాజ్యో లభేద్ రాజ్యం న సంశయః,
అవిద్యో లభతే విద్యాం భీతః శౌర్యం చ విన్దతి.
ఇట్లు చేసినచో రాజ్యమును కోలుపోయిన వాడు రాజ్యమును తప్పక పొందును. విద్య లేని వాడు విద్యను పొందును. భయము నందిన వాడు శౌర్యమును పొందును.