అధ్యాయము - 65

అగస్త్యుడు:

సార్వభౌమ వ్రతం చాన్యత్‌ కథయామి సమాసతః,

యేన సమ్య క్కృతేనాశు సార్వభౌమో నృపో భవేత్‌.

అగస్త్యుడు:

సార్వభౌమ వ్రతమును గూర్చి సంగ్రహముగా చెప్పెదను. దీని నాచరించి రాజు వెంటనే సార్వభౌముడగును.

కార్తికస్య తు మానస్య దశమీ శుక్లపక్షికా,

తస్యాం నక్తాశనో నిత్యం దిక్షు శుద్ధ బలిం హరేత్‌.

కార్తిక మాసమున శుక్ల పక్షము దశమి నాడు రాత్రి భోజనము చేయువాడై ప్రతి దినము అన్ని దిక్కుల యందును శుద్ధమైన బలిని ఉంచ వలయును.

విచిత్రైః కుసుమై ర్భక్త్యా పూజయిత్వా ద్విజోత్తమాన్‌,

దిశాం తు ప్రార్థనాం కుర్యా న్‌ మన్త్రేణానేన సువ్రతః,

సర్వా భవన్త్యః సిద్ధ్యన్తు మమ జన్మని జన్మని.

రంగు రంగుల పూవులతో భక్తితో ఉత్తమ విప్రులను పూజించి ఆయా దిక్కును గూర్చి ‘దిక్కులారా! మీరందరు నాకు ప్రతి జన్మము నందును సిద్ధిని కూర్చు వారగుదురు గాక’ అను నర్థము గల మంత్రముతో దిక్ర్పార్థనము కావింప వలయును.

ఏవ ముక్త్వా బలిం తాసు దత్వా శుద్ధేన చేతసా,

తతో రాత్రౌ తు భుంజీత దధ్యన్నంతు సుసంస్కృతమ్‌.

ఇట్లు పలికి ఆ దిక్కుల యందు నిర్మలమగు మనస్సుతో బలిని ఉంచ వలయును. ఆ రాత్రి చక్కగా మంత్రములతో సంస్కరించిన పెరుగన్నమును భుజింప వలయును.

పూర్వం పశ్చాద్‌ యథేష్టంతు ఏవం సంవత్సరం నృప,

యః కరోతి నరో నిత్యం తస్య దిగ్విజయో భవేత్‌.

మొదట ఇట్లు దధ్యోదనమును తిని తరువాత ఇష్టము ననుసరించి భుజింప నగును. ఇట్లీ వ్రతమును ఏడాది కాలము చేయు వానికి దిగ్విజయము తప్పక కలుగును.

ఏకాదశ్యాంతు యత్నేన నరః కుర్యాద్‌ యథావిధి,

మార్గశీర్షే శుక్లపక్షా దారభ్యాబ్దం విచక్షణః,

మార్గశీర్ష మాసము శుక్ల పక్షము ఏకాదశి నాటి నుండి ప్రారంభించి యీ వ్రతమును వివేకవంతుడు పట్టుదలతో చేయ వలయును.

తద్‌వ్రతం ధనదస్యేష్టం కృతం విత్తం ప్రయచ్ఛతి.

కుబేరున కిష్టమైన ఈ వ్రతమును చేసినచో ఇది పుష్కలముగా ధనము నిచ్చును.

ఏకాదశ్యాం నిరాహారో యో భుంక్తే ద్వాదశీ దినే,

శుక్లే వాప్యథవా కృష్ణే తద్‌ వ్రతం వైష్ణవం మహత్‌.

ఏవం చీర్ణం సుఘోరాణి హన్తి పాపాని పార్థివ,

త్రయోదశ్యాం తు నక్తేన ధర్మవ్రత మథోచ్యతే.

ఏకాదశి నాడు, శుక్ల పక్షమున గాని, కృష్ణ పక్షమున గాని ఆహారము కైకొనక ద్వాదశి దినమున పారణ చేయుట అను ఈ వైష్ణవ వ్రతమును ఆచరించు వాడు మిక్కిలి ఘోరములైన పాపములను పరిమార్చును. త్రమోదశి నాడు నక్తమును పాటించుట ధర్మ వ్రతముగా చెప్పబడును.

శుక్లపక్షే ఫాల్గునస్య తథారభ్య విచక్షణః,

రౌద్రం వ్రతం చతుర్దశ్యాం కృష్ణపక్షే విశేషతః,

మాఘమాసా దథారభ్య పూర్ణం సంవత్సరం నృప.

ఫాల్గున మాసము శుక్లపక్షము మొదలుకొని ఈ వ్రతము చేయ వలయును. కృష్ణ పక్షము నందు విశేషముగా రౌద్ర వ్రతము మాఘ మాసము మొదలుకొని ఒక సంవత్సరము వరకు చేయ వలయును.

ఇందు వ్రతం పంచదశ్యాం శుక్లాయాం నక్తభోజనమ్‌,

పితృవ్రత మమావాస్యా మితి రాజన్‌ తథేరితమ్‌.

శుక్ల పక్షమున పూర్ణిమ తిథి యందు నక్త భోజనము (రాత్రి పూట మాత్రము భోజనము చేయుట) ఇందు వ్రతము. అమావాస్య నాడు చేయుట పితృ వ్రతము.

దశ పఞ్చ చ వర్షాణి య ఏవం కురుతే నృప,

తిథివ్రతాని కస్తస్య ఫలం వ్రతప్రమాణతః.

పదునైదేండ్లు ఈ విధముగా తిథి వ్రతములను చేయు వానికి వ్రతము ప్రమాణము ననుసరించి మహా ఫలములు లభించును.

అశ్వమేధ సహస్రాణి రాజసూయశతాని చ,

యష్టాని తేన రాజేంద్ర కల్పోక్తాః క్రతవ స్తథా.

వేల కొలది అశ్వమేధములు, వందల కొలది రాజసూయములు కల్పము ప్రకారము ఆతడు చేసినట్లగును.

యః పునః సర్వ మేతద్ధి కుర్యా న్నరవరాత్మజ,

స శుద్ధో విరజో లోకా నాప్నోతి సకలం నృప.

రాజోత్తమా! దీని నంతటిని చక్కగా చేయు నరుడు శుద్ధుడు, రజస్సు లేని వాడునై సర్వ లోకములను పొందును.