వరాహ మహా పురాణము
అధ్యాయము - 42
దుర్వాసుడు:
తద్వత్ ఫాల్గునమాసే తు శుక్ల పక్షే తు ద్వాదశీమ్,
ఉపోష్య ప్రోక్తవిధినా హరిమారాధయేత్ సుధీః.
దుర్వాసుడు:
అట్లే బుద్ధి మంతుడు పాల్గున మాసము శుక్ల పక్షము ద్వాదశి నాడు చెప్పిన పద్ధతి ప్రకారము ఉపవాస ముండి హరి నారాధింప వలయును.
నరసింహాయ పాదౌ తు గోవిందా యేత త్యురూ తథా,
కటిం విశ్వభుజే పూజ్య అనిరుద్ధే త్యుర స్తథా.
కంఠంతు శితికంఠాయ పింగకేశాయ వైశిరః
అసురధ్వంసనా యేతి చక్రం తోయాత్మనే తథా,
శంఖ మిత్యేవ సంపూజ్య గంధపుష్పఫలై స్తథా.
“ఓం నరసింహాయ నమః” అని పాదములను, “గోవిందాయ నమః” అని తొడలను, “విశ్వభుజే నమః” అని రొమ్మును, “శితి కంఠాయ నమః” అని కంఠమును”, “పింగకేశాయ నమః” అని శిరస్సును, “అసుర ధ్వంసనాయ నమః” అని చక్రమును, “తోయాత్మనే నమః” అని శంఖమును పూజించి గంధమును పుష్పములను ఫలములను సమర్పింప వలయును.
తదగ్రే ఘట మాదాయ సితవస్త్రయుగాన్వితమ్
తస్యోపరి నృసింహం తు సౌవర్ణం తామ్ర భాజనే,
సౌవర్ణం శక్తితః కృత్వా దారువంశమయేపి వా.
రత్న గర్భఘటే స్థాప్య తం సంపూజ్య చ మానవః,
ద్వాదశ్యాం వేదవిదుషే బ్రాహ్మణాయ నివేదయేత్.
స్వామి యందు తెల్లని వస్త్రములు రెండు చుట్టిన ఘటము నుంచి దానిపై రాగి పాత్రలో బంగారు నృసింహ ప్రతిమను శక్తిని బట్టి ఉంచ వలయును. లేనిచో కొయ్య బొమ్మ నైనను ఉంచ వచ్చును. రత్నములు లోపల గల ఘటము నందు స్వామి ప్రతిమ నుంచి చక్కగా పూజింప వలయును, ద్వాదశి నాడు వేద పండితుడగు బ్రాహ్మణునకు సమర్పింప వలయును.
ఏవం కృతే ఫలం ప్రాప్తం యత్ పురా పార్థివేన తు,
తస్యాహం సంప్రవక్ష్యామి వత్సనామ్నా మహామునే.
మునుపు వత్సుడను రాజు ఈ వ్రతము చేసి పొందిన ఫలమును గూర్చి చక్కగా తెలిపెదను.
ఆసీత్ కింపురుషే వర్షే రాజా పరమధార్మికః,
భారతేతి చ విఖ్యాత స్తస్య వత్స స్సుతో భవత్.
పూర్వము కింపురుష వర్షమున మిక్కిలి ధార్మికుడగు భారతుడను రాజుండెడి వాడు. అతనికి వత్సుడను కుమారుడు కలడు.
స శత్రుభి ర్జితః సంఖ్యే హృతకోశో ద్విపాదవాన్,
వనం ప్రాయాత్ సపత్నీకో వసిష్ఠ స్యాశ్రమేవసత్.
అతడు యుద్ధమున శత్రువులకు ఓడి ధన మంతయు కోల్పోయి పాద చారియై పత్నీ సహితముగా వనమున కరిగెను. వసిష్టుని ఆశ్రమమున నివసించెను.
కాలేన గచ్ఛతా సోథ వసిష్టేన మహర్షిణా,
కిం కార్యమితి సప్రోక్తో వస స్యస్మిన్ మహాశ్రమే.
కాలము గడుచు చుండగా వసిష్ఠ మహర్షి, ఈ మహా శ్రమమున వసించు చున్నావు. పనియేమి? అని అడిగెను.
రాజు:
భగవన్ హృతకోశోహం హృతరాజ్యో విశేషతః,
శత్రుభి ర్హతసంకల్పో భవన్తం శరణం గతః,
ఉపదేశప్రదానేన ప్రసాదం కర్తు మర్హసి.
రాజు:
పూజ్యుడా! నా కోశము పోయినది. నా రాజ్యము శత్రువల పాలైనది. పగవారు నా సంకల్పమును దెబ్బ కొట్టిరి. నిన్ను శరణు చొచ్చితిని. నాకు ఉపదేశము ననుగ్రహింపుము.
ఏవముక్తో వసిష్ఠస్తు తస్యేమాం ద్వాదశీం మునే,
విధినా ప్రత్యువాచాథ సోపి సర్వం తథాకరోత్.
అతడిట్లు పలుకగా వసిష్ఠు డతనికి ఈ ద్వాదశీ వ్రతము నుపదేశించెను. అతడును దానిని సర్వమును విధి పూర్వకముగా ఆచరించెను.
తస్య వ్రతాంతే భగవాన్ నారసింహ స్తుతోష హ,
చక్రం పాదాచ్చ శత్రూణాం విధ్వంసనకరం పరమ్.
ఆ వ్రతము ముగిసిన పిదప నరసింహ భగవానుడు సంతోష పడెను. శత్రువులను రూపు మాపెడి చక్రము నాతని కొసగెను.
తేనాస్త్రేణ స్వకం రాజ్యం జితవాన్ స నృపోత్తమః,
రాజ్యే స్థిత్వా శ్వమేధానాం సహస్ర మకరోద్ విభుః,
అన్తే చ విష్ణులోకాఖ్యం పదమాపచ స సత్తమ.
ఆ రాజవరుడు ఆ అస్త్రముతో తనదైన రాజ్యమును గెలుచు కొనెను. రాజ్యమున నిలువ ద్రొక్కుకొని వేయి అశ్వమేధ యాగములను గావించెను. తుదికి ఆ శ్రేష్ఠుడు విష్ణు లోకమను ఉత్తమ పదము గాంచెను.
ఏషా ధన్యా పాపహరా ద్వాదశీ భవతో మునే,
కథితా యా ప్రయత్నేవ శ్రుత్వా కురు యథేప్సితమ్.
మునీ! ఇది చాల ధన్య. పాపములను హరించు నది. ఇట్టి ద్వాదశిని గురించి నీకు ప్రయత్న పడి చెప్పితిని. నీ కోరికను బట్టి ఆచరింపుము.