వరాహ మహా పురాణము
అధ్యాయము - 127
శ్రీవరాహ దేవుడు:
క్షత్రియస్య ప్రవక్ష్యామి తచ్చ్రుణో హి వసుంధరే,
త్యక్త్వా ప్రహరణాన్ సర్వాన్ యః కశ్చి త్పూర్వశిక్షితమ్.
పూర్వమన్త్రేణ మే భూమి తస్య దీక్షాం చ కారయేత్.
శ్రీవరాహ దేవుడు:
ఓ వసుంధరా! ఇప్పుడు క్షత్రియునకు సంబంధించిన దీక్షను గూర్చి చెప్పెదను. వినుము ఆతడు ముందు నేర్చుకొన్న ఆయుధముల నన్నింటిని వదలి వేయ వలయును. పిమ్మట ఆతనికి ముందు చెప్పిన మంత్రముతో దీక్షనొసగ వలయును.
మయా చ పూర్వా ముక్తాని యాని సంభారకాణిచ,
తాని సర్వాన్ సమానీయ ఏవం వర్జ్యం యశస్విని.
నేను మునుపు చెప్పిన వస్తువుల నన్నింటిని, చెప్పబోవు వానిని విడచి, కూర్చుకొన వలయును.
న దద్యాత్ కృష్ణసారస్య చర్మ తత్ర కదాచన,
పాలాశం దండకాష్ఠం చ దీక్షాయాం నతు కారయేత్.
నల్ల జింక చర్మమును, మోదుగ కర్రను ఈ దీక్ష యందు ఎన్నటికిని ఉపయోగింప రాదు.
ఛాగస్య కృష్ణసారస్య తస్య చర్మ చ కారయేత్,
ఆశ్వత్థ దండ కాష్ఠంచ దీక్షాయై తదనన్తరమ్.
నల్లని గొఱ్ఱె చర్మమును, మఱ్ఱి చెట్టు దండమును ఈ దీక్ష కొరకు కూర్చుకొన వలయును.
కృత్వా ద్వాదశహస్తాని స్థణ్డిలం చోపలేపయేత్,
సర్వాణ్యేతాని వై కృత్వా యన్మయా భాషితాని వై.
పండ్రెండు మూరల చదరపు స్థలమును ఏర్పరచుకొని చక్కగా అలువ వలయును. పిదప నేను మునుపు చెప్పిన విధానముల నన్నింటిని చేయ వలయును.
ఏవం కృత్వా తతః సర్వం క్షత్రియే దీక్షకారిణే,
మమైవ శరణం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్.
ఇట్లు దీక్షను పొందెడు క్షత్రియుడు విధాన మంతయు కావించి నన్నే శరణు పొందుచు ఈ మంత్రమును పఠింప వలయును.
మంత్రము:
త్యక్తాని విష్ణో శస్త్రాణి త్యక్తం కర్మ చ క్షత్రియమ్,
సర్వం త్యక్త్వా దేవం విష్ణుం ప్రపన్నో స్మి,
నాథ సంసారార్థైవ జాతిం మాం జనయస్వ.
విష్ణూ! నేను ఆయుధముల నన్నింటిని వదలి వైచితిని. క్షత్రియ కర్మమును వదలితిని. అన్నియు వదలి విష్ణు దేవుడవైన నిన్ను చేరుకొంటిని. ఇటుపై నన్ను సంసారము కొరకు, మరియొక జన్మము కొరకును పుట్టింపకుము.
ఏవం తతో వచ శ్చోక్త్వా క్షత్రియో మమపార్శ్వతః,
చరణౌగృహ్య ఇమం మన్త్ర ముదీరయేత్.
ఇట్లు పలికి క్షత్రియుడు నా ప్రక్కను ఉండి నా రెండు పాదములను పట్టుకొని యీ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
నాహం శస్త్రం దేవేదవ స్పృశామి పరాపవాదం నచ వై బ్రవీమి,
కర్మ కరోమి సంసారమోక్షణం త్వయా చోక్త మేవ వరాహసంస్థితమ్.
మంత్రము:
దేవదేవా! నేను ఆయుధమును ముట్టను. పరులను గూర్చి చెడు మాటలను పలుకను. సంసారము నుండి ముక్తి కలిగించు కర్మమును, నీవు వరాహ రూపుడవై ఉపదేశించిన ప్రకారము ఆచరింతును.
తత్ర ఏవం వచో బ్రూతో సర్వం చైవాత్ర యోజయేత్,
వివిధై ర్గన్ద పత్రైశ్చ ధూపై శ్చైవ యథోదితమ్.
ఇట్లు అచట పలికి పెక్కు విధములగు గంధములను, ధూపములను మున్ను చెప్పిన విధముగా సమర్పింప వలయును.
యథా తేనైవ తాన్ భూమే భోజయేత్ తదనన్తరమ్,
శుభాన్ భాగవతాం శ్చైవ ఏవ మేత న్న సంశయః.
భూమి! అటుపై ఆతడు అదే విధముగా పరిశుద్దులగు భాగవతులకు అన్నమిడ వలయును.
ఏషా వై క్షత్రియే దీక్షా దేవి సంసారమోక్షణమ్,
మత్ప్రసాదేన కర్తవ్యం యతీచ్ఛేత్ సిద్ది ముత్తమామ్.
దేవీ! క్షత్రియుడు ఉత్తమ సిద్దిని కోరునేని నా అనుగ్రహముతో ఇట్టి దీక్షను సంసార ముక్తికై పొంద వలయును.
వైశ్యస్యైవ ప్రవక్యమి శృణు తత్త్వేన సుందరి,
దీక్షా చ యాదృశీ తత్ర యథా భవతి సుందరి.
సుందరీ! వైశ్యునకు దీక్ష యెట్టిదో చెప్పెదను. వినుము.
త్యక్త్వా తు వైశ్యకర్మాణి మమ కర్మ పరాయణః,
యథా చ లభతే సిద్దిం తృతీయో వర్ణ సంస్థితః.
మూడవ వర్ణమున నున్న వ్యక్తి, నా పూజ యందు శ్రద్ద కల వాడునగు వైశ్యుడు సిద్దిని పొందుటకై వైశ్య కర్మములను విడనాడ వలయును.
సర్వాం స్తత్ర సమానీయ యే మయా పూర్వభాషితాః,
వింశ ద్దస్తం సమాలిప్య పూర్వ్యయేన కారయేత్,
చర్మణా పీతభాగస్య స్వాగతం పరివేష్టయేత్.
నేను మునుపు తెలిపిన వస్తువుల నన్నింటిని కూర్చుకొన వలయును. ఇరువది మూరల మేర అలికి మునుపటి వలెనే చేయ వలయును. పసుపు వన్నె గొఱ్ఱె చర్మము నందు పరప వలయును.
ఉదుంబరం దండకాష్ఠం చ గృహ్య హస్తే తు దక్షిణే,
కుర్యాద్ భాగవతాన్ శుద్దాన్ త్రీణి వారాన్ ప్రదక్షిణమ్,
జానుభ్యా మవనిం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్.
మేడిచెట్టు కర్రను కుడిచేత పట్టుకొని పవిత్రులగు భాగవతులకు మూడు మారులు ప్రదక్షిణ నమస్కారము గావింప వలయును. మోకాళ్ళపై నిలబడి ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
అహం హి వైశ్యో భవన్త ముపాగతః ప్రముచ్య కర్మాణి చ వైశ్యయోగమ్,
దీక్షా చ లబ్దా భగవత్ ప్రసాదాత్ ప్రసీద సంసారకరోహి మోక్షణమ్.
మంత్రము:
నేను వైశ్యుడను తమ కడ కరు దెంచితిని. వైశ్య జాతి కర్మముల నన్నింటిని వదలి వైచితిని. భగవంతుని ప్రసాదము వలన దీక్ష నాకు లభించినది. ప్రసన్నులై నాకు సంసార మోక్షమును దయ సేయుడు.
మమ త్వేదం తత శ్చోక్త్వా మమ కర్మప్రసాదనాత్,
గురవే చరణౌ గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్.
ఈ విధముగా నన్ను గూర్చి పలికి నా అనుగ్రహమును పొంది గురువు పాదములను పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
త్యక్త్వా వై కృషిగోరక్షా వాణిజ్యక్రయ విక్రయమ్,
లబా చ త్వత్ప్రసాదేన విష్ణుదీక్షా థ కామయేత్.
మంత్రము:
నేను వ్యవసాయము, గోపాలనము, వాణిజ్యము కొనుగోలు, అమ్మకము అను వానిని వదలి వైచి నీ దయ వలన కోరిన విష్ణు దీక్షను పొందితిని.
దేవాభివాదనం కృత్వా పురో భాగవతేషు చ,
పశ్చాత్ తు భోజనం దద్యాదపరాధబహిష్కృతమ్.
ముందు భాగవతులకు, పిదప దేవునకు మ్రొక్కులు చెల్లించి ఏ దోషమును లేని విధముగా భోజనము పెట్ట వలయును.
ఏవం దీక్షా తు వైశ్యానాం మమ మార్గానుసారిణామ్,
యేన ముచ్యతి సుశ్రోణి ఘోరసంసారసాగరాత్.
నా మార్గము ననుసరించు వైశ్యులకు ఇది దీక్షా విధానము. దీనితో ఆతడు ఘోరమగు సంసారము నుండి ముక్తి పొందును.
శూద్రస్యాపి ప్రవక్ష్యామి మద్భక్తస్య వసుంధరే,
యస్తు దీక్షాం సమాసాద్య ముచ్యతే సర్వకిల్బిషైః.
నా భక్తుడగు శూద్రునకు దీక్ష యెట్టిదియో చెప్పెదను. ఇది పొందిన ఆతడు అన్ని పాపముల నుండియు విముక్తి పొందును.
సర్వద్రవ్యాణి సంస్కారాన్ యే మయా పూర్వభాసితాః,
దీక్షాకామస్య శూద్రస్య ఏతాన్ శీఘ్రం ప్రకల్పయేత్.
నేను ముందు చెప్పిన విధముగా అన్ని వస్తువులను, అన్ని సంస్కారములను దీక్షను కోరెడు శూద్రుని కొరకు కూర్ప వలయును.
ఉపలిప్య సప్తహస్తం స్థణ్డిలం తదనన్తరమ్,
చర్మణా కృష్ణభాగస్య తస్య గాత్రాణి వేష్ఠియేత్,
ఖాదిరం దండకాష్ఠం చ గురునా తత్ర్పకల్పయేత్.
ఏడు మూరల నేలను ఆవు పేడతో ఆలికి స్థండిలమును ఏయ వలయును. నల్లని గొఱ్ఱె చర్మముతో ఆతని అంగముల నన్నింటిని కప్ప వలయును. ఖదిర వృక్షపు దండమును గురువు ఆతనికి కూర్ప వలయును.
ఏవం గృహ్య యథాన్యాయం శూద్రో దీక్షాదికారణమ్,
మమైవ శరణం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్.
ఇట్లు దీక్షకు సంబంధించిన వస్తువుల నన్నింటిని తగు విధముగా తెచ్చుకొని నన్నే శరణు పొందుచు ఈక్రింది మంత్రములను పలుక వలయును.
మంత్రము:
శూద్రోహం శూద్రకర్మాణి ముక్త్వా భక్షం చ సర్వశః,
భక్షయామో హ్యభక్ష్యం వై శూద్రకర్మ చ కుర్వతః.
మంత్రము:
నేను శూద్రుడను. శూద్ర కర్మముల నన్నింటిని వదలు చున్నాను. మునుపు శూద్ర కర్మములను చేయుచు తినరాని వస్తువులను తినెడి వాడను. ఆ తిండిని కూడ వదలి వేయు చున్నాను.
త్యక్తు మిచ్ఛామి తత్సర్వం విష్ణోః కర్మ కరోమి వై,
పశ్యవైదేవ శూద్రోహం తవ ప్రపన్నోస్మి గురు ప్రసాదాత్.
ఆ తిండి మొదలగు దాని నంతటిని వదలి వేయ గోరుచున్నాను. ఇటుపై విష్ణుని ఆరాధనమునే చేయుదును. దేవా! చూడు. నేను శూద్రుడను. గురువు దయ వలన నిన్ను సర్వభావముతో చేరు కొంటిని.
ఏవం వదేత్ తతో దేవం శూద్రో దీక్షాకాంక్షిణిః,
విముక్తః సరపాపేభ్యో లబ్ధసంజ్ఞో గతస్పృహః.
దీక్షను పొందెడు శూద్రుడిట్లు పలుక వలయును. అతడు పాపము లన్నింటి నుండి విముక్తు డగును. జ్ఞానము పొందును. ఆశ లుడిగిన వాడగును.
ఉభౌ చరణౌ సంగృహ్య గురవే తదనన్తరమ్,
గురోః ప్రసాదనార్థాయ ఇమం మన్త్ర ముదాహరేత్.
తరువాత గురువు పాదములను రెండింటిని పట్టుకొని అతని దయపొంద గోరుచు ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
విష్ణుప్రసాదేన గుహ్యం ప్రసన్నపూర్వం లబ్ధ్వార్థ మేనం,
సంసారమోక్షణాయ కరోమి కర్మ ప్రసీద.
మంత్రము:
గురుదేవా! విష్ణువు ప్రసాదము వలన రహస్యమైన దీక్షను సంసార ముక్తి కొరకు నేను పొందితిని. దాని కనుగుణ మగు కర్మమునే ఆచరింతును. నా యందు ప్రసన్నడవు కమ్ము.
ఏవం మన్త్ర ముదీర్యాథ కుర్యా త్తత్ర ప్రదక్షిణమ్,
చతురశ్చ యథాన్యాయం పునశ్చైవాభివాదయేత్.
ఇట్లు మంత్రమును పలికి నాలుగు మారులు ప్రదక్షిణము చేసి మరల తగు విధములుగా అభివాదన మాచరింప వలయును.
అనన్తరం తతః కుర్యాద్ గన్ధమాల్యేన చార్చనమ్,
భోజనం చ యథాన్యాయ మపరాధవివర్జితః.
పిదప గంధములతో, మాలలతో అర్చనము గావింప వలయును. మనసులో ఏ చెడు భావములు లేకుండ భోజనము సమర్పింప వలయును.
దీక్షా ఏషా చ శూద్రాణా ముపచారశ్చ ఈదృశః,
చతుర్ణామపి వర్ణానాం దుఃఖసంసార మోక్షణమ్.
శూద్రులకు దీక్ష యిట్టిది. ఉపచారము (సేవ) ఈ విధ మైనది. నాలుగు వర్ణముల వారికి దుఃఖ రూపమైన సంసారము నుండి ముక్తి కలిగించు దీక్షను గూర్చి తెలిపితిని.
అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,
చతుర్ణామపి వర్ణానాం ఛత్రం ప్రదీయతే.
వసుంధరా! నీకు మరియొక విషయమును తెలిపెదను వినుము. నాలుగు వర్ణముల వారికి గొడుగుల నొసగు విధానమును గూర్చి చెప్పెసదను.
బ్రాహ్మణే పాణ్డురం దద్యాద్ రక్తం దాతవ్యం క్షత్రియే,
వైశ్యాయ పీతకం దద్యాన్ నీలం శూద్రాయ దాపయేత్.
బ్రాహ్మణునకు తెల్లనిది, క్షత్రియునకు ఎర్రనిది, వైశ్యునకు పచ్చనిది, శూద్రునకు నల్లనిది యగు గొడుగు నొసగ వలయును.
సూతుడు:
చాతుర్వర్ణస్య శ్రుత్వా వై పా మహీ సంశిత వ్రతా,
వరాహరూపిణం దేవం ప్రత్యువాచ వసుంధరా.
సూతుడు:
నిర్మములగు వ్రతములు గల ఆ భూదేవి నాలుగు వర్ణముల వారి దీక్షలను గూర్చి విని వరాహ రూపుడగు దేవునితో ఇట్లు పలికెను.
ధరణి:
శ్రుత్వా దీక్షాం యథాన్యాయం చాతుర్వర్ణ్యస్య కేశవ,
దీక్షితైః కిం ను కర్తవ్యం తవ కర్మపరాయణౖః.
ధరణి:
కేశవా! నాలుగు వర్ణముల వారికి సంబంధించిన దీక్షలను గూర్చి వింటిని. నీ పూజల యందు శ్రద్ధ కల ఆ దీక్షితులకు కర్తవ్య మెట్టిది?
తతో మహీవచః శ్రుత్వా మేఘదుందుభినిః స్వనః,
వరాహరూపీ భగవా నువాచ స మహీం స్థితః.
అంత భూమి పలుకులు విని మేఘ దుందుభి నాదము వంటి కంఠ ధ్వని గల వరాహ రూప దేవుడు భూమితో ఇట్లు పలికెను.
శ్రీవరాహ దేవుడు:
శృణు తత్త్వేన కల్యాణి యన్మాం త్వం పరిపృచ్ఛసి,
సర్వత్ర చిన్తనీయోహం గుహ్యమేవ గణాన్తికమ్.
శ్రీవరాహ దేవుడు:
కల్యాణీ! నీవు నన్నడిగిన దానికి నిజమైన సమాధానము చెప్పెదను. వినుము. దీక్ష పొందిన వ్యక్తి నన్ను, గుహ్యమైన గణాంతికమును భావించు చుండ వలయును.
నారాయణవచః శ్రుత్వా ధరణీ సంశితవ్రతా,
హృష్ణతుష్టమనా స్తత్ర శ్రుత్వా ధర్మం మహౌజసమ్,
శుచి ర్భాగవతాం శ్రేష్ఠా తవ కర్మాణి నిత్యశః.
తతః కమలపత్రాక్షీ భక్తాభక్తేషు వత్సలా,
కరాభ్యా మఞ్జిలిం కృత్వా నారాయణ మథాబ్రవీత్.
నారాయణుని పలుకు విని దోషము లేని వ్రతములు గల ధరణి మిక్కిలిగా సంతోషముతో ఉప్పొంగిన హృదయము కలది యాయెను. గొప్ప శక్తిగల ధర్మమును విన్న భాగవత శ్రేష్ఠ యగు ఆమె భక్తుల యందును, భక్తులు కాని వారి యందును వాత్సల్యము కలదియై చేతులు మోడ్చి నారాయణునితో మరల ఇట్లు పలికెను.
ధరణి:
missing slంkas 41 t 43
శ్రీవరహ దేవుడు:
దేవి తత్త్వేన వక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి,
యేన చిన్తయతే మర్త్యః మమ కర్మపరాయణః.
శ్రీవరహ దేవుడు:
దేవీ! నీవు నన్నడిగిన దానికి సరియైన సమాధానము చెప్పెదను. నా భక్తి కర్మమున శ్రద్ధ కలవాడు నన్నెట్లు భావింప వలయునో తెలియ జెప్పెదను.
ఏషా గణాన్తికా నామ దక్షిణాంబుజనిః సృతా,
ఏతద్ గుమ్యం మహాభాగే మమ చిన్తాం విచిన్తయేత్.
ఇది భగవంతుని కుడి పద్మము నుండి వెలువడి నది. దీని పేరు ‘గణాంతిక’. మిక్కిలి గుట్టుగా ఉంచ దగిన దీనిని మానువుడు భావించు చుండ వలయును.
దీక్షితేన తు శుద్ధేన విధిదృష్టేన కర్మణా,
గృహీతవ్యం విశాలక్షి మన్త్రేణ విధినాత్రవై.
శాస్త్రము చూపిన విధానమును బట్టి పరిశుద్ధుడై దీక్ష గొన్న వ్యక్తి దీనిని మంత్ర విధితో గ్రహింప వలయును.
యస్తు భాగవతో భూత్వా తద్ గృహ్ణాతి ‘గణాన్తికామ్’,
జనస్య దర్శన స్పర్శ సంయుక్తాం వామసంయుతామ్,
తస్య ధర్మో న విద్యేత న స దీక్షిత కోచ్యతే.
భగవంతుని యందు భక్తి కలిగి ఈ గణాంతిక దీక్షను కైకొన్న వ్యక్తి జనుల దర్శనమును, స్పర్శను, ముఖ్యముగా ఎడమ చేతి స్పర్శను పొందినచో అతనికి ధర్మము కలుగదు.
అట్టవాడు దీక్షితుడుగా చెప్ప బడును.
యస్తు గృహ్ణాతి సుశ్రోణి మన్త్రపూతాం గణాన్తికామ్,
ఆసురీ దీక్షణా తస్య న మే ధర్మే ప్రవర్తతే.
మంత్రము చేత పవిత్రమైన ఈ గణాంతిక దీక్షను సాధారణ బుద్ధితో గ్రహించిన వానికి అది అసుర (రాక్షస సంబంధమైన) దీక్ష అగును. అట్టివాడు నా ధర్మమున ప్రవర్తించు వాడు కాడు.
గుహ్యం గణాంతికాం దేవి యో మాం చిన్తయతే బుధః,
జన్మాంతర సహస్రాణి చింతితోహం చ తేన వై.
ఈ గణాంతిక దీక్షను గ్రహించి ఎవనికి తెలియ రాకుండ భావించు చుండు మేధావి వేయి జన్మములలో నన్ను భావించు వాడగును.
గ్రహణస్య ప్రవక్ష్యామి యథా శిష్యాయ దీయతే,
మన్త్రం లోకసుఖార్థాయ తచ్ఛ్రుణుష్వ వసుంధరే.
ఈ మంత్రమును గ్రహించు విధానమును, శిష్యున కొసగు విధానమును లోక సుఖము కొరకు వివరించి చెప్పెదను. భూదేవీ! దానిని వినుము.
కౌముదస్య తు మాసస్య మార్గశీర్షస్య వాప్యథ,
వైశాఖస్యాపి మాసస్య శుక్లపక్షేతు ద్వాదశీ.
కుర్యా న్నిరామిషం తత్ర దినాని త్రీణి నిశ్చితః,
తతో గణాన్తికా గ్రాహ్యా మన్త్రవద్ ధర్మనిశ్చితా.
కార్తీకము, మార్గశిరము, వైశాఖము నెలలో శుక్లపక్ష ద్వాదశి నాడు మూడు రోజులు మాంసము లేని భోజనము తీసికొని ధర్మము నిర్ణయించిన ఈ గణాంతిక దీక్షను మంత్ర పూర్వకముగా గ్రహింప వలయును.
మమాగ్రతో వరారోహే ప్రజ్వాల్య చ హుతాశనమ్,
కుశైః సంస్తరణం కృత్వా స్థాపయిత్వా గణాన్తికామ్.
తతః శిష్యో గురుశ్చైవ దీక్షితః శుచి ముత్తమమ్,
నమో నారాయణే త్యుక్త్వా ఇమం మన్త్ర ముదాహరేత్.
నా ముందు అగ్ని హోత్రమును ప్రజ్వలింప జేసి దర్భలతో సంస్తరణము నేర్పరచి గణాంతికను దానిపై నిలుప వలయును. (సంస్తరణము = వెడల్పుగా పరచుట) అంత శిష్యుడును గురువును శుచిగా దీక్షితులై ‘‘ఓం నమో నారాయణాయ’’ అనుచు ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
యా ధారితా పూర్వపితామహేన బ్రహ్మణ్యదేవేన భవోద్భవేన,
నారాయణాద్ దక్షిణమాత్ర జాతాం గృహ్ణమహే వశ్యామృతం తు తత్త్వతః.
మంత్రము:
మొదట లోకపితా మహుడు, బ్రహ్మణ్య దేవుడు, భవోద్భవుడు అగు బ్రహ్మ నారాయణుని కుడి భాగము నుండి పుట్టిన దీనిని ధరించెను. అట్టి వశ్యము, అమృతము అయిన దీనిని మేము గ్రహించు చున్నాము.
తత ఏతేన మన్త్రేణ పునర్గృహ్య గణాన్తికామ్,
శిష్యాయ ప్రదదౌ తత్ర పునర్మన్త్ర ముదాహరేత్.
పిదప ఈ మంత్రముతో గురువు మరల ‘గణాంతిక’ ను గ్రహించి శిష్యున కొసగుచు మరల ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
నారాయణాద్ దక్షిణమాత్రజాతాం,
స్వశిష్య గృహ్ణన్ సమయేన దేవీమ్,
ఇమాం చిన్తాపరో భూత్వా భవోద్భావ నజాయతే.
మంత్రము:
శిష్యా! నారాయణుని కుడి వైపున జనించిన ఈ దేవిని ప్రతిజ్ఞ చేసి కైకొనుము. ఎల్లప్పుడు దీని భావన యందు శ్రద్ధ కలవాడ వగుము. దీనిని భావించిన వాడు మరల సంసారమున పుట్టడు.
ధరణి:
స్నానోపకల్ప నాన్తేషు కిం కర్తవ్యం తు మాధవ,
ప్రసాధనవిధిం చైవ కేన మన్త్రేణ కారయేత్,
అకర్మణ్యేవ ముచ్యన్తే తవ కర్మపరాయణః.
ధరణి:
మాధవా! స్నానము మొదలగు కార్యము లందు చేయ దగిన విధి ఏమి? అలంకరణమును ఏ మంత్రముతో చేయ వలయును? నీ పనుల యందు శ్రద్ధా సక్తులు కలవాడు ఇతర కార్యములు చేయ కున్నను ముక్తి పొందును కదా!
తతో భూమ్యా వచః శ్రుత్వా లోకనాథో జనార్దనః,
ధర్మసంయుక్తవాక్యేన ప్రత్యువాచ వసుంధరామ్.
లోక నాథుడగు జనార్దనుడు భూదేవి పలుకు విని ధర్మముతో కూడిన పలుకుతో వసుంధర కిట్లు బదులు చెప్పెను.
శ్రీవరాహ దేవుడు:
దేవి తత్త్వేన వక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి,
స్నానస్యై వోపచారాణి యాని కుర్వన్తి కర్మణః.
శ్రీవరాహ దేవుడు:
దేవీ! నీవు నన్నడిగిన దానికి యథార్థమైన సమాధానము చెప్పెదను. ఈ కర్మము నందు స్నానము, ఉపచారములు ఎట్లు చేయుదురో వివరించెదను.
వృత్తశ్చైవోపచారేషు జలప్రముదితేషుచ,
కఙ్కతీం చాంజనం చైవ శీఘ్ర మేవోపకల్పయేత్,
దర్పణం చ వరారోహే యేన మన్త్రేణ దీయతే.
ఉపచారములు, స్నాన క్రియలు అను వానిని ముగించిన వ్యక్తి దువ్వెన, కాటుక, అద్దము మున్నగు వానిని ఆయా మంత్రములతో కూర్చుకొన వలయును.
స్పృష్ట్వా తు మమ గాత్రాణి క్షౌమనస్త్రేణ తత్త్వతః,
అంజనం కఙ్కతీం చైవ శీఘ్రమేవ ప్రకల్పయేత్.
నా అంగముల నన్నింటిని పట్టు వస్త్రముతో కప్పి కాటుకను, దువ్వెనను ఉపయోగింప వలయును.
తతో జానుస్థితో భూత్వా మమ కర్మపరాయణః,
అంజలిం కఙ్కతం గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్.
పిదప మోకాళ్లపై కూర్చుండి శ్రద్ధ కలవాడై దువ్వెనను మోడ్చిన చేతులతో పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.
మంత్రము:
ఏషోఞ్జలిం కఙ్కతం దేవ ప్రసీద నారాయణ శిరః ప్రాసధి హి,
మహానుభావే నేత్రే వశ్చ యే పశ్యన్తి సర్వలోకా,
లోకప్రభో సర్వలోకప్రధాన ఏషోనయనమ్
అఞ్జయ లోకనాథ ప్రసీద నారాయణ గృహ్ణ గృహ్ణ
పశ్యేత ముద్భావ సద్భావేన.
మంత్రము:
నారాయణ! దేవా! దయ చూడు. ఇదిగో దోసిలి. ఇదిగో దువ్వెన. దీనితో నీ శిరస్సును చక్కదిద్దు కొనుము. మహానుభావము లైన మీ కన్నులను సర్వ లోకములును చూచును. ఓ లోకప్రభూ! లోకప్రధానా! ఈ కాటుకను కన్నులకు పెట్టు కొనుము. దయ జూడుము. గ్రహింపుము. గ్రహింపుము. నన్ను మంచి భావముతో చూడుము.
నమో నారాయణేత్యుక్త్వా ఇమం మన్త్ర ముదాహరేత్.
పిదప ‘నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.
మంత్రము:
ఏషా మయా మాధవ త్వత్ర్పసాదాద్ గురుప్రసాదాచ్చ మన్త్ర పూజా,
ప్రాప్తా మయైషా చ గణాన్తికా వై భవత్యధర్మం న చ మే కదాచిత్.
మంత్రము:
మాధవా! నీ దయ వలనను, గురువు దయ వలనను, నేనీ మంత్ర పూజ గల గణాంతిక దీక్షను పొందితిని. నాకు ఎన్నటికిని అధర్మము కలుగ కుండు గాక.
య ఏతేన విధానేన మమ కర్మాణి దీక్షితః,
గృహ్యతే గురుసంయుక్తో మమ లోకాయ గచ్ఛతి.
ఈ విధముగా దీక్షితుడై నా పూజా విధానములను గురువుతో కూడి గ్రహించు వాడు నా లోకమున కరుగును.
కుశిష్యాయ న దాతవ్యం పిశునాయ శఠాయ చ,
ఏషా చైవ వరారోహే గృహ్ణేమం చ గణాన్తికమ్,
సుశిష్యాయ చ దాతవ్యం హస్తేష్వేవ గణాన్తికమ్.
మంచి నడవడి లేని శిష్యునకు, క్రూరునకు, మొండి వానికి ఈ దీక్ష నొసగ రాదు. ఉత్తమ శిష్యుని చేతుల యందే ఈ గణాంతిక కర్మమును సమర్పింప వలయును.
మంగల్యం మంగలం సిద్ధం భక్తసంసారమోక్షణమ్,
పరిమాణం ప్రవక్ష్యామి శృణు తత్త్వేన మాధవి.
ఇది శుభములతో కూడినది. శుభమైనది. సిద్ధి కలిగించునది. భక్తుని సంసారము నుండి విముక్తి చేయునది. దీని పరిమాణమును చెప్పెదను. ఓ మాధవీ! వినుము.
ఉత్తమా తు శతం పూర్ణం పఞ్చాశతిక మధ్యమా,
పఞ్చవింశతికాన్యాసా పరిమాణం విధీయతే.
నూరు గింజల మాల ఉత్తమ మైనది. ఏబదింటితో అయినది మధ్యమము. ఇరువది అయిందిటితో అయినది తక్కువది. ఈ విధముగా కొలత నిర్ణయింప. బడినది.
రుద్రాక్షా ఉత్తమా చైవ పుత్రజీవకమధ్యమా,
కన్యసీ అష్టకై ర్విధ్వా దేవి త్వాం కథితం మయా.
రుద్రాక్షలతో చేసిన మాల ఉత్తమ మైనది. పుత్ర జీవకములతో చేసినది మధ్యమము. అష్టకములతో గ్రుచ్చినది అధమ. దేవీ! దీనిని నీకు చెప్పితిని.
ఏతన్న జానతే కశ్చి జ్జన్మాంతరశతై రపి,
సర్వలోకహితాం శుద్ధాం మోక్షకామాం గణాన్తికామ్.
సర్వ లోకములకు మేలు చేయు నదియు, శుద్ధ అయినదియు, మోక్ష మందు కోరిక పుట్టించు నదియునగు ఈ గణాంతిక దీక్షను నూరు జన్మముల కైనను ఎవ్వడును తెలియ జాలడు.
నోచ్ఛిష్టేన తు స్పృష్టవ్యా స్త్రీణాం హస్తే న కారయేత్,
ఆకాశే స్థాపనం కుర్యాద్ యదీచ్ఛేత్ పరమాం గతిమ్.
దీనిని ఎంగిలితో తాకరాదు. స్త్రీ చేతి యందు ఉంచ రాదు. పరమ గతిని కోరువాడు దీనిని మిక్కిలి ఎత్తున నిలుప వలయును.
గుహ్యానాం పరమం గుహ్యం సంధ్యోపాసన మేవ చ,
ఏష మన్త్రశ్చ జాప్యశ్చ పూజ్యమేవ గణాన్తికమ్.
ఇది రహస్యములలో మిక్కిలి రహస్య మైనది. సంధ్యా కాలముల యందు ఉపాసింప దగినది. ఈ మంత్రము మిక్కిలిగా పూజింప దగినది. జపింప దగినది.
ఏవం హి విధిపూర్వేణ పాలయేచ్చ గణాన్తికామ్,
విశుద్ధో మమ భక్తశ్చ మమ లోకాయ గచ్ఛతి.
ఈ గణాన్తికను విధి పూర్వకముగా పాలింప వలయును. అట్లు చేసిన నాభక్తుడు మిక్కిలి శుద్ధుడై నా లోకమున కరుగును.
ఏవం విష్ణోర్వచః శ్రుత్వా ధరణీ రత్నభూషితా,
ప్రత్యువాచ పరం శ్రేష్ఠం లోకనాథం మహౌజసమ్.
రత్నముల అలంకారములు గల భూదేవి విష్ణువు వాక్కును విని లోకనాథుడు, మహా శక్తిశాలి అయిన పరమ పురుషునితో మరల ఇట్లు పలికెను.
దర్పణం తే కథం దేయం తత్వ మాఖ్యాహి మాధవ,
యేన తుష్టో నిజం రూపం పశ్యసే చిన్తితః ప్రభో.
ప్రభూ! మాధవా! నీకు అద్దము నెట్లు పట్ట వలయును. ఎట్లు పట్టినచో నీ నిజ రూపమును చూచుకొని తృప్తినంది భక్తుని భావనల కందుదువు?
ధరణ్యా స్తద్వచః శ్రుత్వా వరాహః పున రబ్రవీత్,
శృణు మే దర్పణవిధిం యథావత్ దేవి సువ్రతే.
భూదేవి పలుకు విని శ్రీ వరాహ దేవుడు ఇట్లు పలికెను. దేవీ! నాకు అద్దము చూపుట యెట్లో ఉన్న దున్నట్లు తెలిపెదను. వినుము.
నమో నారాయణేత్యుక్త్వా ఇమం మన్త్ర ముదీరయేత్,
‘‘నమో నారాయణాయ’’ నారాయణ దేవునకు నమస్సు అనుచు ఈ మంత్రమును పఠింప వలయును.
మంత్రము:
శుచి ర్భాగవతాః శ్రేష్ఠా స్తవ కర్మవినిశ్చితాః,
గాత్రాణి తే సర్వజగత్ ప్రధానం ముఖం చంద్రాతపాగ్రే
నేత్రే ఇమం చ మే దర్పణం లోకనాథస్య పశ్యస్వరూపం జగత్ సర్వతః.
మంత్రము:
దేవా! నీ పూజల యందు శ్రద్ధగల భాగవతు లందరు శ్రేష్ఠులు. స్వామీ! ఇవిగో నీ అంగములు. అన్ని లోకములలో ముఖ్యమైన నీ ముఖము చంద్రుని సూర్యుని వెలుగులు గల కన్నులు. ఇదిగో లోక నాథుడవగు నీకు అద్దము. అన్ని వైపుల నుండియు నీ స్వరూపమే అయిన జగత్తును దర్శింపుము.
య ఏతేన విధానేన మమ కర్మపరాయణః,
మమ కర్మాణి కుర్వీత తారితాః సప్త వై కులాః.
నా పూజా కర్మము నందు శ్రద్ధ కలవాడు ఈ విధానముతో నా కర్మములను ఆచరించినచో ఆతని ఏడు తరముల బంధువులు తరింతురు.
ఏతన్మన్త్రేణ వై భూమి ఉపచారస్తు ఈదృశః,
హృష్టతుష్టేన కర్తవ్యం యదీచ్ఛేత్ పరమాం గతిమ్.
భూమీ! ఈ మంత్రముతో ఈ విధమగు ఉపచారముతో ఆనందము, తృప్తి కలవాడు, పరమ గతిని కోరినచో, చేయ వలయును.