అధ్యాయము - 32

మహాతపుడు:

అథోత్పత్తిం ప్రవక్ష్యామి ధర్మస్య మహతో నృప,

మహాత్మ్యం చ తిథిం చైవ తన్నిబోధ నరాధిప.

మహాతపుడు:

రాజా! నీకిపుడు గొప్పది యగు ధర్మము ఎట్లు పుట్టెనో, దాని మహిమ యెట్టిదో, దానికి సంబంధించిన తిథి యేమో వివరించెదను శ్రద్ధగా వినుము.

పూర్వం బ్రహ్మావ్యయః శుద్ధః పరాద పరసంజ్ఞితః,

స సిసృక్షుః ప్రజాస్త్వాదౌ పాలనం చ విచిన్తయత్‌.

మునుపు అవ్యయుడు, శుద్ధుడు, పరమున కంటె అపరుడను పేరు గలవాడు అగు బ్రహ్మ ప్రజలను సృజింప గోరి మొదట వారి పాలన మార్గమేమా! అని ఆలోచించెను.

తస్య చిన్తయత స్త్వఙ్గాద్‌ దక్షిణా చ్ఛ్వేతకుణ్డలః.

ప్రాదుర్బభూవ పురుషః శ్వేత మాల్యానులేపనః.

అట్లు చింతించు చుండగా ఆతని కుడి భాగము నుండి తెల్లని కుండలములు, తెల్లని మాల్యములు, మైపూతలు గల పురుషు డొకడు పుట్టుకొని వచ్చెను.

తం దృస్ట్వో వాచ భగవాం శ్చతుష్పాదం వృషాకృతిమ్‌,

పాలయేమాః ప్రజాః సాధో త్వం జ్యేష్ఠో జగతో భవ.

నాలుగు పాదములతో ఎద్దు వంటి ఆకారము గల ఆ పురుషుని గాంచి భగవానుడు ‘సాధూ! ఈ ప్రజల నందరిని పాలింపుము. నీవు జగత్తునకు మొదటి వాడవు కమ్ము’ అని పలికెను.

ఇత్యుక్తః సమవస్థోసౌ చతుష్పాత్‌స్యాత్‌ కృతేయుగే,

త్రేతాయాం త్రిపదశ్చాసౌ ద్విపాదో ద్వాపరేభవత్‌,

కలా వేకేన పాదేన ప్రజాః పాలయతే ప్రభుః.

బ్రహ్మ యిట్లు పలుకగా ఆతడు చక్కని స్థితి గాంచి కృత యుగమున నాలుగు పాదములతో, త్రేత యందు మూడు పాదములతో, ద్వాపరమున రెండు పాదములతో, కలి యందు ఒక పాదముతో నిలిచి ప్రజలను పాలించెను.

షడ్భేదో బ్రహ్మణానాం స త్రిథా క్షత్రే వ్యవస్థితః,

ద్విధా వైశ్యైకధాశూద్రే స్థితః సర్వగతః ప్రభుః.

బ్రహ్మణుల యందు ఆరు భేదములతో, క్షత్రియుల యందు మూడు భావములతో, వైశ్యుని యందు రెండు భావములతో, శూద్రుని యందు ఒక్క భావముతో ఆతడు నెలకొని అందరి యందున్న వాడై పాలన చేసెను. (బ్రాహ్మణుని యందు ఆరు భావములు 1. యజ్ఞము చేయుట. 2. యజ్ఞములు చేయించుట 3. వేదములు చదువుట 4. చదివించుట 5. దానము చేయుట 6. దానమును పుచ్చు కొనుట. క్షత్రియుని యందు మూడు విధములు 1. యజ్ఞము చేయుట 2. వేదమును చదువుట, 3. దానము చేయుట. వైశ్యుని రెండు తీరులు 1. వ్యవసాయము. 2. వాణిజ్యము, శూద్రుని యందు ఒక విధము వృత్తుల రూపమున పై మూడు వర్గముల వారికి తోడ్పడుట.)

రసాతలేషు సర్వేషు ద్వీపవర్షే స్వయంప్రభుః.

సమస్త లోకముల యందును ద్వీపముల యందును ఆ ధర్ముడనెడు ప్రభువు పాలన గావించెను.

ద్రవ్యగుణ క్రియా జాతిచతుఃపాదః ప్రకీర్తితః,

సంహితా పదక్రమశ్చైవ త్రిశృఙ్గోసౌ స్మృతో బుధై.

తథా ఆద్యన్త ఓంకార ద్విశిరాః సప్తహస్తవాన్‌,

త్రిబద్ధబద్ధో విప్రాణాం ముఖ్యః పాలయతే జగత్‌.

ద్రవ్యము, గుణము, క్రియ, జాతి అను నీ నాలుగును ఆతని పాదములు. సంహిత, పదము, క్రమము అనునవి ఈ వృషభ రూప పురుషుని మూడు కొమ్ములు. ఓం కారము మొదలు తుది అను రెండును ఈతని రెండు శిరస్సులు. విభక్తులు ఏడును ఏడు హస్తములు. ఉదాత్త, అనుదాత్త స్వరితములను మూడు విధములుగా రూపొందిన నాదమయ పురుషు డాతడు. జ్ఞాన సంపన్నులలో ముఖ్యుడై జగము నంతటిని పాలించు చుండెను.

సధర్మః పీడితః పూర్వం సోమే నాద్భుతకర్మణా,

తారాం జిఘృక్షతా పత్నీం భ్రాతు రాఙ్గిరసస్య హ.

వింత గొలుపు పనులు గల చంద్రుడు మునుపు అంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను తారను చేజిక్కించు కొని ఆ ధర్మ పురుషుని నొప్పించెను.

సో೭పాయాద్‌ భీషితస్తేన బలినా క్రూరకర్మణా,

అరణ్యం గహనం ఘోర మావివేశ తదా ప్రభుః.

అప్పుడా ధర్మ ప్రభువు క్రూర కర్ముడు, బలవంతుడు నగు ఆ చంద్రుడు భయపెట్టగా భయంకరము, చొర రానిది అగు అడవికి చొచ్చెను.

తస్మిన్‌ గతే సురాః సర్వే అసురాణాం తు పత్నయః,

జిఘృక్షన్త స్త దౌకాంసి బభ్రము ర్ధర్మవఞ్చితాః,

అసురా అపి తద్వచ్చ సురవేశ్మని బభ్రముః

అట్లు ధర్మ పురుషుడు అడవుల పాలుకాగా దేవత లందరు రాక్షసుల పత్నులను పట్టుటకై ధర్మ హీనులై వారి యిండ్లలో తిరుగ జొచ్చిరి. అట్లే రక్కసులు దేవతల యిండ్లలో తిరుగాడిరి.

నిర్మర్యాదే తథా జాతే ధర్మనాశే చ పార్థివ,

దేవాసురా యుయుధిరే సోమదోషేణ కోపితాః,

స్త్రీ హేతో శ్చ మహాభాగ వివిధాయుధ పాణయః.

ఇట్లు హద్దులు పోయి ధర్మము నశింపగా సోముడు చేసిన తప్పు వలన కోపించిన దేవతలును, రాక్షసులును స్త్రీ కారణముగ పెక్కు తీరుల ఆయు ధములను చేపట్టి పోర దొడగిరి.

తాన్‌ దృష్ట్వా యుధ్యతో దేవానసురైః సహ కోపితాన్‌,

నారదః ప్రాహ సంగమ్యపిత్రే బ్రహ్మణి హర్షితః.

అట్లు రక్కసుల యెడ కోపించి పోరాడు చున్న దేవతలను గాంచి సంబర పడి నారదుడీ వార్తను బ్రహ్మ కడ కరిగి వివరించెను.

స హంసయాన మారుహ్య సర్వ లోకపితామహః,

నివారయామాస తదా కస్యార్థేయుద్ధ మబ్రవీత్‌.

అంత సర్వ లోకములకు తాతయగు బ్రహ్మ హంస వాహనము నెక్కి అటకు వచ్చి ఈ యుద్ధము నకు ప్రయోజన మేమి? అని పలుకుచు వారిని నివారించెను.

సర్వే శశంసుః సోమంతు సతుబుద్ధ్వా స్వకం సుతమ్‌,

పీడనా దపయాతం తు గహనం వన మాశ్రితమ్‌.

వారందరు దీనికి కారణము సోముడని చెప్పిరి. ఆతని పీడ వలననే తన పుత్రుడగు ధర్ముడు అడవుల పాలాయె నని బ్రహ్మ తెలిసి కొనెను.

తతోబ్రహ్మా యయౌ తత్ర దేవాసురయుతస్త్వరన్‌,

దదర్శ చ సురైః సార్థం చతుష్పాదం వృషాకృతిమ్‌,

చరన్తం శశిసంకాశం దృష్ట్వా దేవా సువాచ హ.

అంత బ్రహ్మ దేవ దానవులతో కలసి వడిగా ధర్ముడున్న చోటి కరిగెను. అందు నాలుగు పాదములతో వృషభము రూపుతో చంద్రుని వలె విహరించు చున్న ఆ ధర్ముని దేవతలతో పాటు గాంచి వారితో నిట్లు పలికెను.

బ్రహ్మ:

అయం మే ప్రథమః పుత్రః పీడితః శశినా భృశమ్‌,

పత్నీం జిఘృక్షతా భ్రాతు ర్దర్మసంజ్ఞో మహామునిః.

బ్రహ్మ:

ఈతడు నా మొదటి కొడుకు ధర్ముడను పేరు గలవాడు. మహాముని. సోదరుని భార్యను పట్ట నెంచిన చంద్రుడు ఈతని మిక్కిలి పీడించెను.

ఇదానీం తోషయధ్వం వై సర్వ ఏవ సురాసురాః,

యేన స్థితి ర్వో భవతి సమం దేవాసురా ఇతి.

దేవతలారా! అసురులారా! మీరందరు ఇతనిని సంతోష పెట్టుడు. దాని వలన మీ ఉభయులకు సమముగా చక్కని స్థితి కలుగును.

తతఃసర్వే స్తుతిం చక్రు స్తస్య దేవస్య హర్షితాః,

విదిత్వాబ్రహ్మణో వాక్యాత్‌ సంపూర్ణ శశిసంనిభమ్‌.

అంత దేవత లందరు బ్రహ్మ మాట వలన ఆతని సంగతి నెరిగి నిండు చంద్రుని బోలు ఆతని స్తుతించిరి.

దేవతలు:

నమోస్తు శశిసంకాశ నమస్తే జగతః పతే,

నమోస్తు దేవరూపాయ స్వర్గమార్గప్రదర్శక,

కర్మమార్గ స్వరూపాయ సర్వగాయ నమో నమః.

దేవతలు:

చంద్రుని బోలిన దేవా! జగత్పతీ! దేవరూపా! స్వర్గమునకు దారి చుపు వాడా! కర్మ మార్గమే స్వరూపమైన వాడా! సర్వమున నుండు స్వామీ! నీకు నమస్కారము.

త్వయేయం పాల్యతే పృథ్వీ త్రైలోక్యంచ త్వయైవ హి,

జన స్తపస్తథా సత్యం త్వయా సర్వంతు పాల్యతే.

నీవే యీ భూమి నంతటని రక్షించు చున్నావు. ముల్లోకమలును నీ రక్షణ యందే నిలిచి యున్నవి. జన లోకము, తపో లోకము, సత్య లోకము – అది యిది యననేల సర్వమును నీవే పాలించు చున్నావు.

న త్వయా రహితం కించి జ్జగత్‌ స్థావరజంగమమ్‌,

విద్యతే తద్విహీనం తు సద్యో నశ్యతి వై జగత్‌.

చరాచర ప్రపంచమున నీవు లేనిది కొంచె మేనియు లేదు. నీవు లేని యెడల జగమంతయు అప్పటి కప్పుడు నాశన మగును.

త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్త్వస్వరూపవాన్‌,

రాజసానాం రజస్త్వంచ తామసానాం తమోమయః.

నీవు సర్వ భూతములకు ఆత్మవు. సజ్జనులకు సత్త్య స్వరూపముతో, రజో గుణము గల వారికి రజ స్స్వరూపముతో, తమో గుణము మిక్కుటమైన వారికి తమో గుణమయ రూపముతో నీవు కన్పట్టుదువు.

చతుష్సాదో భవాన్‌ దేవ చతుశ్శృఙ్గ స్త్రిలోచనః,

సప్తహస్తి స్త్రి బన్దశ్చ వృషరూప నమోస్తుతే.

దేవా! నీకు నాలుగు పాదములు, నాలుగు కొమ్ములు, మూడు కన్నులు, ఏడు చేతులు, మూడు బంధములు. ఇట్టి వానితో వృషభ రూపమున నున్న దేవా నీకు నమస్కారము.

త్వయా హీనా వయం దేవ సర్వ ఉన్మార్గ వర్తినః,

తన్మార్గం యచ్ఛ మూఢానాం త్వం హి నః పరమాగతిః.

నీవు లేని మేము పిచ్చి మార్గములను పట్టితిమి. ఆ మార్గమును మూఢుల కొసగుము. మాకు నీవే పరమ గతివి.

ఏవం స్తుత స్తదా దేవై ర్వృషరూపీ ప్రజాపతిః,

తుష్టః ప్రసన్నమనసా శాన్తచక్షు రపశ్యత.

దేవత లందరు ఇట్లు కీర్తింపగా వృషభ రూప ధర్ముడు తుష్టి చెంది ప్రసన్నమైన మనసుతో శాంతమైన చూపుతో వారిని చూచెను.

దృష్ట మాత్రాస్తు తే దేవాః స్వయం ధర్మేణ చక్షుషా.

క్షణేన గత సంమోహాః సమ్యక్‌ సద్ధర్మసంహితాః.

ధర్మ పురుషుడు తన కంటితో చూచినంత మాత్రమున దేవత లందరు క్షణముతో మోహమును వదలి వైచిరి. చక్కని ధర్మముతో కూడిన వారైరి.

అసురా అపి తద్వచ్చతతో బ్రహ్మా ఉవాచ తమ్‌,

అద్యప్రభృతి తే ధర్మ తిథి రస్తు త్రయోదశీ.

రక్కసులును అట్లే అయిరి. అంత బ్రహ్మ అతనితో ఇట్లు పలికెను. ధర్మా! ఈ దినము నుండి నీకు త్రయోదశి ప్రియమగు తిథి యగు గాక!

యస్తా ముపోష్య పురుషో భవన్తం సముపార్జయేత్‌,

కృత్వా పాపసమాహారం తస్మాన్ముఞ్చతి మానవః.

ఆ తిథినాడు ఉపవాస ముండి నిన్ను సాధించు వాడు. పాపము లన్నియు చేసిన వాడైనను వాని నుండి విముక్తి పొందును.

యచ్చారణ్యమిదం ధర్మ త్వయా వాప్తంచిరం ప్రభో,

నామ్నా భవిష్యతి హ్యేత ద్ధర్మారణ్య మితిప్రభో.

నీవు బహు కాలము తిరిగిన కారణమున ప్రభూ! ఈ అరణ్యమునకు నీ పేరుతో ధర్మారణ్యమను ప్రసిద్ధి కలుగును.

చతుస్త్రి పాద్ద్వ్యేక పాదాశ్చ ప్రభో త్వం కృతాదిభి ర్లక్ష్యసే యేన లోకైః,

తథాతథా కర్మభూమౌ నభశ్చ ప్రాయోముక్తః స్వగృహం పాహి విశ్వమ్‌.

నాలుగు, మూడు, రెండు ఒకటి అయిన పాదములతో కృత త్రేతా ద్వాప కలి యుగము లందు నీవు లోకులకు గాన వత్తువు. అట్లు ఈ కర్మ భూమి యందును, పై లోకము లందును నీవు సాధారణముగా స్వగృహము నందు వలె నిలుచుచు ఈ విశ్వ మంతటిని పరిరక్షింపుము.

ఇత్యుక్తమాత్రః ప్రపితామహోధునా సురాసురాణా మథ పశ్యతాం నృప,

అదృశ్యతా మగమత్‌ స్వాలయాం శ్చ జగ్ముః సురాః సవృషా వీతశోకాః.

ఇట్లువారు పలికి నంత బ్రహ్మ దేవుడు దేవ దానవులు చూచు చుండగా అదృశ్యు డాయెను. ఆ దేవతలును దుఃఖమును వీడి ధర్మ సహితులై తమతమ గృహముల కరిగిరి.

ధర్మోత్పత్తిం య ఇమాం శ్రావయీత తదా శ్రాద్ధేన తర్పయేత పితౄంశ్చ,

త్రయోదశ్యాం పాయసేన స్వశక్త్యా స స్వర్గగామీ తు సురా నుపేయాత్‌.

ఈ ధర్ముని పుట్టుక కథను వినిపింప జేసిన వాడును, శ్రాద్ధ కర్మలలో దీనితో పితృ దేవతలకు తర్పణము చేయు వాడును త్రయోదశి యందు శక్తి కొలది పాయసముతో భోజనము పెట్టు వాడును స్వర్గమున కరిగి దేవతలతో కలిసి యుండును.