అధ్యాయము - 135

రక్తవస్త్ర పరిధాన ప్రాయశ్చిత్తమ్‌

ఎరుపు బట్టలను కట్టు దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

రక్తవస్త్రేణ సంయుక్తో యో హి మా ముపసర్పతి,

తస్యాపి శృణు సుశ్రోణి కరమసంసారమోక్షణమ్‌.

శ్రీవరాహ దేవుడు:

ఎర్రని వస్త్రముతాల్చి నా కడకు అరుదెంచు వాని సంసార ముక్తి విధాన మెట్లుండునో, ఓ భూదేవీ! వినుము.

రజస్వలాసు నారీషు రజో యత్తత్ర్పవర్తతే,

తేనా సౌ రజసా స్పృష్టో కర్మదోషేణ జానతః,

తెలిసి చేసిన కర్మ దోషము చేత మానవుడు ముట్టుతలైన స్త్రీల రజస్సును తాకిన వాడగును.

వర్షాణి దశపఞ్చైవ తస్య తే తత్ర నిశ్చయః,

రజో భూత్వా మహాభాగే రక్త వస్త్రపరాయణః.

ఎఱ్ఱని వలువలు తాల్చిన వ్యక్తి పదునైదు వత్సరములు అట్టి రజస్సై యుండి పోవును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య కాయవిశోధనమ్‌,

యేన శుద్ధ్యన్తి వై భూమి పురుషాః శాస్త్రవర్జితాః.

అట్లు శాస్త్ర విధిని వదలి ప్రవర్తించు పురుషులు శుద్ధి పొందెడు ప్రాయశ్చిత్త విధానమును వక్కాణించెను.

ఏకాహారం తతః కృత్వా దినాని దశ సప్త చ,

వాయుభక్షో దినత్రీణి దిన మేకం జలాశనః.

పదునేడు దినములు ఒంటి పూట భోజనము చేయ వలయును. మూడు దినములు గాలిని, ఒక రోజు నీటిని పుచ్చుకొన వలయును.

ఏవం స ముచ్యతే భూమి మమ విప్రియకారకః,

ప్రాయశ్చిత్తం తతః కృత్వా మమాసౌ రోచతే సదా.

ఈ విధముగా నాకు అప్రియము చేసిన వాడు అట్టి ప్రాయశ్చిత్తమును చేసికొని దోషము నుండి విడివడును. నాకు ప్రియుడును అగును.

ఏతత్‌ తే కథితం భూమి రక్త వస్త్ర విభూషితమ్‌,

ప్రాయశ్చిత్తం మహాభాగే సర్వసంసారమోక్షణమ్‌.

భూమీ! ఎఱ్ఱని వస్త్రములు (నా పూజా సమయమున) తాల్చుట, దాని ప్రాయశ్చిత్తము అను వానిని నీకు తెలిపితిని. ఇది సంసార మోక్షణమును కలిగించు నట్టిది.

అంధకార ప్రాయశ్చిత్తమ్‌

చీకటిలో దైవస్పర్శక ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

యస్తు మామన్ధకారేషు వినా దీపేన సుందరి,

స్పృశతే మాం వినా శాస్త్రం త్వరమాణో విమోహితః.

పతనం తస్య వక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తేన క్లేశం సమాసాద్య క్లిశ్యతే చ నరాధమః.

శ్రీవరాహ దేవుడు:

సుందరీ! శాస్త్రమును పాటింపక చీకటిలో దీపము లేకుండ నన్ను త్వర పడుచు, విజ్ఞత లేక తాకువాని పతన మెట్లుండునో చెప్పెదను. వినుము. ఆ పాపము చేత ఆ నరాధముడు కష్టములలో నలిగి పోవును.

అన్ధో భూత్వా మహాభాగే ఏకం జన్మ తమోమయః,

సర్వాశీ సర్వభక్షశ్చ మానవ శ్చైవ జాయతే.

వాడు ఒక్క జన్మ కాలము గ్రుడ్డివాడై చీకటి గుయ్యారమున అడ్డమైన గడ్డిని తినువాడై ప్రవర్తించును.

యత స్మృతి సత్త శ్చైవ మద్భక్త శ్చైవ జాయతే,

అనన్యమానసో భూత్వా భూమే హ్యేతత్‌ ప్రసాదయేత్‌.

ఎప్పుడు తన తప్పు తెలిసికొని నన్ను చెదరని మనస్సుతో స్మరించునో అప్పుడు నా భక్తుడై పుట్టును. ఇది ఆతనిని చక్క దిద్దు విధానము.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి అంధకారే తు యః స్పృశేత్‌,

తరన్తి యేన సంసారం మమ లోకాయ గచ్ఛతి.

చీకటిలో నన్ను తాకు వానికి ప్రాయశ్చిత్త మెట్టిదో, దేనితో అతడు తరించునో, నా లోకమున కరుగునో దానిని చెప్పెదను.

అక్ష్యాచ్ఛాదం విధాయిత్వా దినాని దశ పఞ్చ చ,

ఏకాహారం తతః కృత్వా దినవింశం సమాహితాః.

యస్య కస్యాపి మాసస్య ఏకా మేవ చ ద్వాదశీమ్‌,

ఏకాహారస్తతో భూత్వా తిష్ఠే చ్చాపి జలాశనః.

పదునైదు దినములు కన్నులకు గంతలు కట్టుకొన వలయును. ఇరువది దినములు శ్రద్ధతో ఒంటిపూట భోజనము చేయ వలయును. ఏదో ఒక నెలలో ద్వాదశి నాడు నీరు మాత్రము త్రావుచు ఉండ వలయును.

తతో యవాన్నం భుఞ్జీత గోమూత్రేణ ప్రపాచితమ్‌,

ప్రాయశ్చిత్తేన చైతేన ముచ్యతే పాతకాత్‌ తతః.

పిమ్మట గోవు మూత్రముతో వండిన యవల అన్నమును భుజింప వలయును. ఇట్టి ప్రాయశ్చిత్తము చేత ఆ పాతకము నుండి అతడు విడుదల పొందును.

కృష్ణవస్త్రాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

నల్లని వలువలు ధరించు దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

యః పునః కృష్ణవస్త్రేణ మమ కర్మపరాయణః,

దేవి కర్మాణి కుర్వీత తస్య వై పతనం శృణు.

శ్రీవరాహ దేవుడు:

నల్లని బట్టలు కట్టుకొని నా పూజల యందు ఆసక్తి కలవాడై ఆయా పనులు చేయువాని పాటెట్టిదో, వినుము.

ఘుణో వై పఞ్చవర్షాణి కాష్ఠభక్ష శ్చ జాయతే.

మశక స్త్రీణి వర్షాణి దంశస్త్రీణి చ పఞ్చచ.

మత్స్యో వై దశవర్షాణి లావకస్తు సమాస్త్రయః,

పఞ్చ వర్షాణి నకులో దశ వర్షాణి కచ్ఛపః.,

ఏవం భ్రమతి సంసారే మమ కర్మపరాయణః.

చెట్లపై పురుగై అయిదేండ్లు, దోమయై మూడేండ్లు, ఈగయై మూడేండ్లు, చేపయై పదియేండ్లు, లకుముకి పిట్టయై పదునైదేండ్లు, ముంగిసయై యైదేండ్లు, తాబేలై పదియేండ్లు ఈ ప్రపంచమున త్రిమ్మరు చుండును.

పారావతశ్చ జాయతే నవ వర్షాణి పఞ్చ చ,

తిష్ఠతే మమ పార్శ్వేషు యత్రైవాహం ప్రతిష్ఠితః.

నన్ను ప్రతిష్టించిన తావులలో పదునాల్గేండ్లు పావురమై నా పరిసరములలో నిలిచి యండును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య సంసారమోక్షణమ్‌,

యేనాసౌ లభతే సిద్ధిం కృష్ణ వస్త్రాపరాధతః.

నల్లని బట్టలు తాల్చిన దోషమునకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దీనితో అతడు సిద్ధిని పొందును. సంసారము నుండి మోక్షము పొందును.

సప్తాహం యావకం భుక్త్వాత్రిరాత్రం సక్తు పిణ్డికాః,

త్రీణి పిణ్డాంస్త్రి రాత్రం తు ఏవం ముచ్యేత కిల్బిషాత్‌.

ఏడు దినములు యవల పిండిని, మూడు రాత్రులు పేలాల పిండిని రాత్రికి మూడు చొప్పున తినుచు పాపము నుండి విడుదల పొందును.

య ఏతేన విధానేన దేవి కర్మాణి కారయేత్‌,

శుచి ర్భాగవతో భూత్వా మమ మార్గాను సారకః,

న స గచ్ఛతి సంసారం మమ లోకాయ గచ్ఛతి.

ఈ పద్ధతితో కర్మములు చేయువాడు శుచియగు భాగవతుడై నా దారి ననుసరించు వాడై సంసారమునకు పోకుండును. నా లోకమునకు పయనించును.

అధౌతవాసోపరాధ ప్రాయశ్చితమ్‌

ఉతుకని వస్త్రముల దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

వాససా న చ ధౌతేన యో మే కర్మాణి కారయేత్‌,

శుచి ర్బాగవతో భూత్వా మమ మార్గానుసారకః. 23

తస్య దోషం ప్రవక్ష్యామి అపరాధం వసుంధరే,

పతన్తి యేన సంసారం వాససోచ్ఛి ష్ట కారిణః.

శ్రీవరాహ దేవుడు:

ఉతుకని వస్త్రము తాల్చి నా భక్తుడు నా పూజలు చేసినచో ఆ దోషమునకు శిక్ష యేమో తెలిపెదను. అట్లు మాసిన బట్టలు తాల్చి పూజ చేయువాడు సంసారమున పడి పోవును.

దేవి భూత్వా ఖగం తే తు జన్మ చైకం న సంశయః,

ఉష్ట్రం చైకం భవేజ్జన్మా జన్మచైకం ఖర స్తథా.

గోమాయు రేకజన్మా వై జన్మ చైకం హయ స్తథా,

సారఙ్గ స్త్వేకజన్మా వై మృగో భవతి వై తతః.

ఒక జన్మమున పక్షియు, ఒక జన్మమున లొట్టి పిట్టయు, ఒక జన్మమున గాడిదయు, ఒక జన్మమున నక్కయు, ఒక జన్మమున గుఱ్ఱమును, ఒక జన్మమున లేడియు నగును.

సప్త జన్మాన్తరం పశ్చాత్‌ తతో భవతి మానుషః,

మద్భక్త శ్చ గుణజ్ఞశ్చ మమ కర్మపరాయణః,

నిరపరాధో దక్షశ్చ అహంకార వివర్జితః.

ఇట్లు ఏడు జన్మముల తరువాత మానవుడై పుట్టును. నాకు భక్తుడు, గుణము లెరిగిన వాడు, నా పూజల యందు శ్రద్ద కలవాడు, దోషము లేనివాడు, సమర్థుడు అహంకారము లేనివాడు నగును.

ధరణి:

శ్రుత మేతత్‌ ప్రయత్నేన యత్త్వయా సముదాహృతమ్‌,

సంసారం వాస సోచ్ఛిష్టా యేన గచ్ఛన్తి మానుషాః.

ధరణి:

మాసిన వలువలు కట్టి పూజ చేయు మానవులు పొందెడు దుఃఖమును నీవు చక్కగా వివరించి చెప్పితివి.

ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి సర్వకర్మ సుఖావహమ్‌,

కిల్బిషాత్‌ యేన ముచ్యన్తి తవ కర్మపరాయణాః.

సర్వ కర్మములకు మేలు కూర్చెడు ప్రాయశ్చిత్తమును కూడ నాకు చెప్పుము. నీ పూజ యందు చెదరని ఆసక్తి కల భక్తులు ఏమి చేసి యీ పాపము నుండి ముక్తి పొందుదురో దానిని నాకు సెలవిమ్ము.

శ్రీవరాహ దేవుడు:

శృణు తత్త్వేన మే దేవి కథ్యమానం మయానఘే,

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి మమ కర్మ సుఖావహమ్‌.

శ్రీవరాహ దేవుడు:

దేవీ! నా అర్చనలకు సుఖమును కూర్చునట్టి ప్రయశ్చిత్తమును చెప్పెదను. వినుము.

యావకేన దినత్రీణి పిణ్యాకేన పునస్త్రయః,

కణభక్షో దినత్రీణి పాయసేన దినత్రయమ్‌,

పయోభక్షో దినత్రీణి వాయుభక్షో దినత్రయమ్‌.

ఏవం కృత్వా మహాభాగ వాససోచ్ఛిష్ట కారిణః,

అపరాధం న విద్యేత సంసారం చ న గచ్ఛతి.

యవల పిండితో మూడు దినములు, పిండితో మూడు దినములు, నూకలతో మూడు దినములు, పాయసముతో మూడు దినములు, పాలతో మూడు దినములు, ఏమియు తినకుండ మూడు దినములు, ఇట్లు మాసిన గుడ్డలు కట్టుకొని పూజ చేయువాడు ప్రాయశ్చిత్తము చేసి కొనినచో అతనికి దోష ముండదు. సంసారమునకు అరుగడు.

శ్వానోచ్ఛిష్టాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

కుక్క ఎంగిలి దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు

శ్వానోచ్ఛిష్టం తు యో దద్యా న్మమ కర్మ పరాయణః,

పాపం తస్య ప్రవక్ష్యామి సంసారస్య మహద్‌ భయమ్‌.

శ్రీవరాహ దేవుడు

కుక్క ముట్టిన పదార్థమును నాకు నివేదన మొసగువాడు, ఆ పాపము వలన సంసారమను మహా భయమున చిక్కుకొనును.

శ్వానో వై సప్తజన్మాని గోమాయు స్సప్త వై తథా,

ఉలూకః సప్త వర్షాణి పశ్చా జ్జాయేత మానుషః.

ఏడు పుట్టుకలు కుక్కయు, ఏడు పుట్టుకలు నక్కయు, ఏడేండ్లు గ్రుడ్లగూబ యునై పిదప మానవుడుగా పుట్టును.

విశుద్దాత్మా శ్రుతిజ్ఞశ్చ మద్భక్తశ్చైవ జాయతే,

గృహే భాగవతోత్కృష్టే అపరాధ వివర్జితః.

అంత భాగవతులలో శ్రేష్ఠుడైన వాని యింటి యందు విశుద్ధమగు బుద్ధి కలవాడు, వేదముల నెరిగిన వాడు నా భక్తుడు నై పుట్టును.

శృణు తత్త్వేన వసుధే ప్రాయశ్చిత్తం మహౌజసమ్‌,

తరన్తి మానుషా యేన త్యక్త్వా సంసారసాగరమ్‌.

పిక్కటిల్లిన శక్తి గల ప్రాయశ్చిత్తమును చెప్పెదను, మానవులు దానితో పాపమును వదలి సంసారమను సముద్రమును దాటుదురు.

మూలభక్షో దినత్రీణి ఫలాహారో దినత్రయమ్‌,

శాకభక్షో దినత్రీణి పయోభక్షో దినత్రయమ్‌.

దధ్యాహరో దినత్రీణి పాయసేన దినత్రయమ్‌,

వాయ్వాహారో దినత్రీణి స్నానం కృత్వా దృఢవ్రతః.

ఏవం దినాన్యేకవింశత్‌ కృత్వా వై శుభలక్షణమ్‌,

అపరాధం న విన్దేత మమ లోకాయ గచ్ఛతి.

దుంపలు, పండ్లు, కూరలు, పాలు, పెరుగు, పాయసము, గాలి, వీనిని మూడేసి దినముల చొప్పున తినుచు ఇరువది యొక్క రోజులు చెదరని దీక్షతో, మంచి లక్షణములతో గడుప వలయును. అప్పుడా దోషము ఉండదు. నా లోకమునకు అరుగును.

వారాహమాంసభక్షణ ప్రాయశ్చిత్తమ్‌

పందిమాంసము తినిన దానిక ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

భుక్త్వా వరాహ మాంసం తు యశ్చ మామిహ సర్పతి,

పతనం తస్య వక్ష్యామి యథా భవతి సున్దరి.

శ్రీవరాహ దేవుడు:

పంది మాంసము తిని నా కడకు వచ్చు వాని పాటెట్టిదో, సుందరీ! చెప్పెదను.

వరాహో దశవర్షాణి భూత్వా త చరతే వనే,

వ్యాధో భూత్వా మహాభాగే సమాః సప్తచ సప్తచ,

భూమి ర్భూత్వా సమాః సప్త తిష్ఠతే తస్య పుష్కరే.

పందియై పది యేండ్లు అడవిలో తిరుగును. పదునాల్గేండ్లు బోయ వాడగును. పిదప ఏడేండ్లు మట్టియై నీట మునుగు చుండును.

తతశ్చ మూషకో భూత్వా వర్షాణి చ చతుర్ధశ,

ఏకోనవింశ వర్షాణి యాతుధానశ్చ జాయతే.

పిదప పదు నాలుగేండ్లు ఎలుక అయి, అటుపై పందొమ్మి దేండ్లు రక్కసుడగును.

శల్యకం చాష్టవర్షాణి జాయతే స వనే బహు,

వ్యాఘ్ర స్త్రింశ చ్చ వర్షాణి జాయతే పిశితాశనః.

ముళ్ళ పందియై ఎనిమిదేండ్లు అడవిలో తిరుగు చుండును. ముప్పదియేండ్లు మాంసము తిండిగా గల పులియై పుట్టును.

ఏవం సంసారితాం గత్వా వారాహామిషభక్షకః,

జాయతే విపులే సిద్ధే కులే భాగవతస్తథా.

ఇట్లు యాతనల నన్నింటి ననుభవించి పంది మాంసము తిన్నవాడు పుణ్యము కల కులమున భాగవతుడై పుట్టును.

హృషీకేశవచః శ్రుత్వా సర్వం సంపూర్ణలక్షణమ్‌,

శిరసా చాఞ్జలిం కృత్వా వాక్యం చేద మువాచ హ.

నిండైన క్షణములు గల హృషీకేశుని మాట యంతయు విని భూదేవి తలపై దోసిలి యొగ్గి ఇట్లు పలికెను.

ఏత న్మే పరమం గుహ్యం తవ భక్త సుఖావహమ్‌,

వరాహ మాంసభక్షం తు యేన ముచ్యేత కిల్బిషాత్‌.

పంది మాంసము తిన్నవానికి ప్రాయశ్చిత్త మెట్టిదియో భక్తులకు సుఖమును కూర్చెడు ఆ పరమ రహస్యమును నాకు తెలుపుము.

శ్రీవరాహ దేవుడు:

తరన్తి మానవా యేన తిర్యక్సంసార సాగరాత్‌,

గోమయేన దినం పఞ్చ కణాహారేణ సప్తవై.

పానీయం తు తతో భుక్త్వా తిష్ఠత్‌ సప్తదినం తతః,

అక్షారలవణం సప్త సక్తుభిశ్చ తథా త్రయః.

తిలభక్షో దివాన్‌ సప్త సప్త పాషాణ భక్షకః,

పయోభుక్త్వా దినం సప్త కారయే చ్ఛుద్ది మాత్మనః.

శ్రీవరాహ దేవుడు:

పశువుల పుట్టుక యనెడు సముద్రము నుండి మానవు లెట్లు దాటుదురో చెప్పెదను. అయిదు దినములు ఆవు పేడతో, ఏడు దినములు నూకలతో, ఏడు దినములు నీటితో, ఏడు దినములు ఉప్పు కారములు లేని చప్పిడి కూటితో, మూడు దినములు పేలాల పిండితో, ఏడు దినములు నూవులతో, ఏడు దినములు ఉప్పుతో, ఏడు దినములు పాలతో గడపి తనకు శుద్ధిని కలిగించుకొన వలయును.

క్షాన్తం దాన్తం పరాకృత్వా అహంకార వివర్జితః,

దినా న్యూకోనపఞ్చాశ చ్చరతః కృతనిశ్చయః.

విముక్తః సర్వపాపేభ్యః ససంజ్ఞో విగతజ్వరః,

కృత్వాతు మమ కర్మాణి మమ లోకాయ గచ్ఛతి.

క్షమ, ఇంద్రియ నిగ్రహము కల వాడగును. అహంకారమును విడనాడును. ఇట్లు చెదరని దీక్ష కలవాడై నలుబది తొమ్మిది రోజులు ప్రవర్తించు వాడు పాపములన్నింటి నుండియు ముక్తి పొంది జ్ఞానము కలవాడై, ప్రమాదము లేనివాడై నా కర్మము లాచరించి నీ లోకమున కరుగును.

జాలపాదభక్షణాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

బాతు మాంసపు దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవారాహ దేవుడు:

జాలపాదం భక్షయిత్వా యస్తు మా ముపసర్పతి,

జాలపాదం తతో భూత్వా వర్షాణి దశ పఞ్చ చ,

కుంభీరో దశవర్షాణి పఞ్చ వర్షాణి సూకరః.

శ్రీవారాహ దేవుడు:

బాతు మాంసము తిని నా కడ కరుదెంచు వాడు పదునైదేండ్లు బాతు అగును. పదియేండ్లు మొసలి యగును. అయిదేండ్లు పంది యగును.

తావద్‌ భ్రమతి సంసారే మమ చైవాపరాధతః,

కృత్వా తు దుష్కరం కర్మ జాయతే విపులే కులే.

నా యెడల చేసిన ఈ తప్పునకు సంసారమున పడి పొరలు చుండును. కడకు చేయరాని పుణ్య కర్మముచేసి శ్రేష్ఠమగు కులమున పుట్టును.

శుద్దో భాగవతః శ్రేష్ఠ స్త్వపరాధ వివర్జితః,

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి.

పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, దోషము లేనివాడు నగు భాగవతుడై సర్వ ధర్మములను వదలి వైచి నా లోకమున కరుగును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి జాలపాదస్య భక్షణే,

తరన్తి మనుజా యేన ఘోరసంసారసాగరాత్‌.

మనుజుల ఘోరమైన దుఃఖమనెడు సముద్రము నుండి దేని వలన దాటుదురో అట్టి ప్రాయశ్చిత్తమును, బాతు మాంసము తిన్న పాపమునకు చేయ వలసిన దానిని చెప్పెదను.

యావకానాం దినత్రీణి వాయుభక్షో దినత్రయమ్‌,

ఫలభక్షో దినత్రీణ తిలభక్షో దినత్రయమ్‌.

అక్షారలవణాన్నాశీ పునస్తత్ర దినత్రయమ్‌,

పఞ్చదశ దినాన్యేవం ప్రాయశ్చిత్తం సమాచరేత్‌.

మూడు దినములు యవల అన్నము, మూడు దినములు గాలిని, మూడు దినములు, పులుపు, ఉప్పులేని అన్నమును, ఇట్లు పదునైదు దినములు భోజన నియమమును పెట్టుకొని ప్రాయశ్చిత్తమును చేసికొన వలయును.

జాలపాదాపరాధస్య ఏవం కుర్వీత శోధనమ్‌,

వినీతాత్మగతి ర్భూత్వా యదీచ్ఛేత్‌ సుందరాం గతిమ్‌.

మనోజ్ఞమైన గతిని కోరువాడగు నేని చక్కదిద్దు కొన్న బుద్ధి కలవాడై బాతు మాంసము తిన్న తప్పునకు ప్రాయశ్చిత్తము నిట్లు చేసికొన వలయును.