వరాహ మహా పురాణము
అధ్యాయము - 120
శ్రీవరాహ దేవుడు:
యేన గర్భం నగచ్ఛేత తన్మేశృణు హి మాధవి,
కథయిష్యామి తే హ్యేవం సర్వధర్మ వినిశ్చయమ్.
శ్రీవరాహ దేవుడు:
ఓమాధవీ! దేని చేత మనుజుడు గర్భ వాసము పొంద కుండునో ఆ సర్వ ధర్మ వినిశ్చయమును చెప్పెదను వినుము.
కృత్వాపి విపులం కర్మ ఆత్మానం న ప్రశంసతి,
కుర్వతే చ బహు కర్మ శుద్ధేనైవాంతరాత్మనా.
గొప్ప పని చేసియు తన్ను తాను పొగడు కొనక నిర్మలమగు మనస్సుతో పెక్కు సత్కర్మములు ఆచరించు వాడు.
కృత్వాపి మమ కర్యాణి మత్ర్పియాణి వసుంధరే,
నైవ కుర్వన్త్యహంకారం క్రోధం చైవ నగృహ్ణతి.
నాకు ప్రియమైన నా పూజాది కార్యములు చేసియు అహంకారము పొందని వాడు, క్రోధము తాల్పని వాడు.
సమం పశ్యతి చిత్తేన లాభాలాభవివర్జితః,
పఞ్చానా మిన్ద్రియాణాంచ సమర్థో నిగ్రహే రతః.
మనస్సుతో సమమును దర్శించుచు, లాభ నష్టములను పట్టించు కొనక అయిదు ఇంద్రియములపై అదుపు కలిగి, ఆ నిగ్రహమున ప్రీతి కలవాడు.
కార్యా కార్యే విజానాతి సర్వధర్మేషు నిష్ఠితః,
శీతోష్ణవాత వర్షాశ్చ క్షుత్పిపాసా సహాశ్చయే.
కార్యము, అకార్యమలను చక్కగా ఎరుగు వాడు, ధర్మము లన్నింట నిష్ఠకలాడు, చలి వేడి, గాలి, ఆకలి దప్పి అను వానిని సహించు వాడు.
యో దరిద్రో నిరాలస్యః సత్యవాగనసూయకః,
స్వదారనిరతో నిత్యం పరదారవివర్జకః.
దరిద్రు డయ్యును, పనుల యందు సోమరి తనము లేనివాడు, సత్యమే పలుకు వాడు, అసూయ లేని వాడు, ఎల్లప్పుడు తన భార్య యందే మనసు కలవాడు, ఇతరుల భార్యలను మోహింపని వాడు.
సత్యవాదీ విశుద్ధాత్మా నిత్యం భాగవతప్రియః,
సంవిభాగీ విశేషజ్ఞో నిత్యం బ్రాహ్మనవత్సలః.
సత్య స్వరూప మగు పరమాత్మను గూర్చియే పలుకు వాడు, విశుద్ధమగు అంతరంగము కలవాడు, నిత్యము భగవద్భక్తుల యందు ప్రియము కలవాడు, వివేక వంతుడు, విశేషముల నెరుగువాడు, బ్రహ్మ జ్ఞానుల యందు పుత్ర ప్రేమ కలవాడు.
ప్రియవాదీ ద్విజానాం చ మమ కర్మ పరాయణః,
కుయోనిం తు నగచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి.
ప్రియములు పలుకు వాడు, ద్విజులయు, నా యొక్కయు కార్యముల యందు శ్రద్ధ కలవాడును అగు భక్తుడు పాడు కడుపులలో పడడు. నా లోకమున కరుగును.
అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,
యో వియోనిం నగచ్ఛేత మమ కర్మపరాయణః.
వసుంధరా! నా పూజ యందు మిక్కిలి ఆసక్తి కల నరుడు వేరు జాతుల కడుపులలో పడకుండుటను గూర్చి వివరించి చెప్పెదను వినుము.
జీవాని యే నహింసన్తి సర్వభూతహితః శుచిః,
సర్వే సమాని పశ్యన్తి కాంచనం లోష్టవిద్యయా.
ప్రాణులను హింసింపడు, సర్వ ప్రాణుల మేలును కోరు చుండును. పరిశుద్ధుడై అన్నింటిని సమానముగా చూచును బంగారమును మట్టిపెళ్ల వలె భావించును.
బాలే వయసి వర్తన్తః క్షాంతా దాంతాః శుభే రతాః,
కృత్యాన్యేవ విజానన్తి పరేణాపి కృతం క్వచిత్.
చిన్న వయసు నందున్నను క్షమ, దమము కలవాడై పుణ్య కార్యముల యందాసక్తి కలిగి యుండును. మంచి పనులనే తెలిసి కొనును. పగవాడు కీడు చేసినను పట్టించు కొనడు
కృత్యం నవిస్మరేద్ యేన ఆసత్యం చ న జల్పతి,
వ్యలీకేషు నివర్తన్తే పర్యేతి కృతనిశ్చయః.
చేయ వలసిన దానిని మరవడు. అబద్ధములు వాగుడు. మోసముల నుండి మరలును. ఒక నిశ్చయమునకు వచ్చి దానిని తుది ముట్ట సాధించును.
నిత్యం చ ధృతిమాన్ యశ్చ పరోక్షే న చ నిక్షిపేత్,
ఋతుకాలేభిగచ్చేత అపత్యార్థం స్వకాం స్త్రియమ్.
ఎల్లప్పుడు ధృతి కలిగి యుండును. చాటు మాటున ఆక్షేపించడు, కేవలము సంతానము కొరకు తన యిల్లాలిని ఋతు కాలమున మాత్రమే పొందును.
ఈదృశాస్తు నరాభద్రే మమ కర్మపరాయణాః,
వియోనిం తే న గచ్ఛన్తి మమ గచ్ఛన్తి సుందరి.
భూదేవీ! ఇట్టి నరులు నా కర్మమున మిక్కిలి శ్రద్ధ కలవారై వేరు జాతుల గర్భము లందు పడరు. నా లోకమున కరుగుదురు.
పున రన్యత్ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణోహి వసుంధరే,
పురుషాణాం ప్రపన్నానాం యశ్చ ధర్మః సనాతనః.
వసుంధరా! మరల ఇంకొక విషయమును చెప్పెదను వినుము. ప్రపన్నులగు పురుషులకు సనాతనమగు ధర్మ మేదియో ఎరుగుము.
మనునాప్యన్యథా దృష్టో హ్యన్యధాజ్గిరసేన చ,
శుక్రేణ చాన్యథా దృష్టో గౌతమేనాపి చాన్యథా.
సోమేన చాన్యథా దృష్టో రుద్రేణై వాన్యథా పునః,
శజ్ఖేన చాన్యథా దృష్టో లిఖితేనైవ చాన్యథా.
కశ్యపేనాన్యథా దృష్టో ధర్మేణై వాన్యథా ధరే,
అగ్నినా వాయునా చైవ దృష్టో ధర్మోన్యథా ధరే.
య మేన చాన్యథా దృష్ట ఇన్ద్రేన వరుణేన చ,
కుబేరేణాన్యథా దృష్టః శాణ్డిల్యేనాపి చాన్యథా.
పులస్త్యే నాన్యథా దృష్ట ఆదిత్యేనై నాపి చాన్యథా,
పితృభి శ్చాన్యథా దృష్ట మన్యథా చ స్వయంభువా.
మనువు, అంగిరసులు, శుక్రుడు, గౌతముడు, సోముడు, రుద్రుడు, శంఖుడు, లిఖితుడు, కశ్యపుడు, ధర్ముడు, అగ్ని, వాయువు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, శాండిల్యుడు, పులస్త్యుడు, ఆదిత్యుడు, పితృ దేవతలు, స్వయంభువగు బ్రహ్మ, వీరందరు ధర్మమును వేరు వేరు విధములుగా దర్శించిరి.
ఆత్మన్యాత్మని ధర్మేణ యే నరా నిశ్చితవ్రతాః,
స్వకం పాలయతే ధర్మ స్వమతేనవ భాషితమ్.
ఆయా నరులు తమ తమ ఆత్మల యందు ధర్మము విషయమున నిశ్చయమైన వ్రతము గలవారు. ఎవరి ధర్మమును వారు పాలింతురు. తమ అభిప్రాయమునే ధర్మముగా వక్కాణించిరి.
పరవాదం నకుర్వీత సర్వధర్మేషు నిశ్చితః,
న నిందేత్ ధర్మకార్యాణి ఆత్మధర్మపథే స్థితః.
ధర్మము లన్నింటి యందును నిశ్చయ బుద్ధి కలవాడై యితరులను నిందిప రాదు. తన ధర్మము నందు తాను గట్టిగా నిలిచి ధర్మ కార్యములను తూల నాడకుండ వలయును.
ఏభి ర్గుణైః సమాయుక్తో మమ కర్మాణి కుర్వతి,
వియోనింతే నగచ్ఛన్తి మమ లోకాయ గచ్ఛతి.
ఈ గుణములతో చక్కని పొందిక కలిగి నా పనులు చేయు చుండు వాడు పశుపక్ష్యది యోనులలో ప్రవేశింపడు. నా లోకమున కరుగును.
పున రన్యత్ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వేహ మాధవి,
తరన్తి పురుషా యేన గర్భసంసార సాగరాత్.
మాధవీ! గర్భమను సంసార సాగరము నుండి తరించు మార్గమును మరియొక దానిని వక్కాణించెదను. వినుము.
జితేన్ద్రియా జితక్రోధా లోభమోహ వివర్జితాః,
ఆత్మపాకరతా నిత్యం దేవాతిథి పితృప్రియాః.
ఇంద్రియములను గెలిచిన వారు, క్రోధముపై అదుపు కలవారు. లోభ మోహములను వదలి వైచిన వారు, తన పరిణత స్థితి యందు ప్రీతి కలవారు, ప్రతి దినము దేవతలను, అతిథులను, పితృ దేవతలను ప్రీతిగా చూచువారు.
హింసాదీని న కుర్వన్తి మధుమాంసవివర్జితాః,
గావశ్చ నిత్యం వన్దన్తి సురాపాన వివర్జితాః.
హింస మొదలగు నీచ కార్యములను చేయని వారు, మద్య మాంసములను ముట్టని వారు, నిత్యము, గోవులకు వందన మాచరించు వారు, సురా పానము పొంత పోవని వారు.
మనసా బ్రాహ్మణీం చైవ యో న గచ్ఛేత్ కాదాచన,
కపిలాం దదతే విప్రే వృద్ధం సాంత్వేన పాలయేత్.
బ్రాహ్మణ వనితను మనస్సు నందు కూడ దుష్ట భావముతో పొందని వాడు, విప్రునకు కపిల గోవును దాన మోసగు వాడు. ముదుసలిని మంచి మన్ననతో పరి రక్షించు వాడు.
సర్వేషాం చైవ పుత్రాణాం విశేషం యో సకుర్వతి,
సంక్రుద్ధం బ్రాహ్మణం దృష్ట్వా యస్తు తత్ర ప్రసాదయేత్.
కుమారు లందరిలో భేద బుద్ధిని చేయని వాడు, మిక్కిలి కోప గించిన బ్రహ్మవేత్తను చూచి ప్రసన్నుని చేయువాడు.
యఃస్పృశేత్ కపిలాం భక్త్యా కుమారీం చ న దూషయేత్,
అగ్నించ నాక్రమేత్ పద్భ్యాం న చపుత్రేణ భాషయేత్,
జలే న మేహనం చైవ గురువాక్యం నజల్పకః.
కపిల గోవును భక్తితో తాకువాడు, కన్యను చెఱుపని వాడు. అగ్నిని కాళ్లతో తాకని వాడు, కొడుకుతో వివాదము చేయని వాడు. నీటిలో మల మూత్రములు వదలని వాడు, గురువు పలుకును వెక్కిరింపని వాడు.
ఏవం ధర్మేణ సంయుక్తో యో ను మాం ప్రతిపద్యతే,
సచ గర్భం నగచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి
ఇట్లిట్లు ధర్మముతో కూడిన వాడై నన్ను పొందెడు వాడు గర్భవాస దుఃఖమును పొందడు. నా లోకమున కరుగును.