వరాహ మహా పురాణము
అధ్యాయము - 43
దుర్వాసుడు:
ఏవ మేవ మునే మాసి చైత్రే సంకల్ప్య ద్వాదశీమ్,
ఉపోష్యారాధయేత్ పశ్చాత్ దేవదేవం జనార్దనమ్.
దుర్వాసుడు:
మునీ! ఇట్లే చైత్ర మాసము నను సంకల్పము చేసికొని దేవ దేవుడగు జనార్ధనుని ఆరాధింప వలయును.
వామనాయేతి పాదౌతు విష్ణవే కటి మర్చయేత్,
వాసుదేవేతి జఠర మురః సంపూర్ణకాయచ.
కంఠం విశ్వకృతే పూజ్య శిరో వై వ్యోమరూపిణే,
బాహూ విశ్వజితే పూజ్య స్వనామ్మా శంఖచక్రకే.
‘ఓం నమో వామనాయ నమః’ అని పాదములను, ‘విష్ణవే నమః’ అని నడుమును, ‘వాసుదేవాయ నమః’ అని గర్భమును, ‘సంపూర్ణకాయ నమః’, అని రొమ్మును, ‘విశ్వకృతే నమః’ అని కంఠమును, ‘వ్యోమ రూపిణే నమః’ అని శిరస్సును, ‘విశ్వజితే నమః’ అని బాహువులను, వాని పేరులతో అనగా ‘పాంచ జన్యాయ నమః’ అని శంఖమును, ‘సుదర్శనాయ నమః’ అని చక్రమును పూజింప వలయును.
అనేన విధినాభ్యర్చ్య దేవదేవం సనాతనమ్,
ప్రాగ్వదేవోత్తరం కుంభం సయుగ్మం పురతో న్యసేత్.
ఈ పద్ధతి తోడనే సనాతనుడగు దేవ దేవుని అర్చించి మునుపటి వలెనే ఉత్తర దిక్కున రెండు వస్త్రములతో కుంభమును దేవుని ముందు ఉంచ వలయును.
ప్రాగుక్త పాత్రే సంస్థాప్య వామనం కాంచనం బుధః,
యథాశక్త్యా కృతం హ్రస్వం సితయజ్ఞోపవీతినమ్.
మునుపు చెప్పిన రాగి పాత్ర యందు బంగారముతో వామనుని ప్రతిమను శక్తి మేరకు చేయించి తెల్లని జన్నిదము కల ఆ పొట్టి రూపును నిలుప వలయును.
కుండికాత్ స్థాపయేత్ పార్శ్వే ఛత్రికాం పాదుకే తథా,
అక్షమాలాం చ సంస్థాప్య బృసికాం చ విశేషతః,
ప్రక్క భాగమున కమండలువును, గొడుగును, పాదుకలను, జప మాలను, దర్భా సనమును ఉంచ వలయును.
ఏతై రుపస్కర ర్యుక్తం ప్రభాతే స ద్విజాతయే,
దాపయేత్ ప్రీయతాం విష్ణు ర్హ్రస్వరూపీత్యుదీరయేత్.
ఈ పరికరములతో కూడిన వామన మూర్తిని తెల్లవారిన పిదప బ్రాహ్మణునకు గుజ్జు రూపు విష్ణువు ప్రీతి నొందు గాక అని పలుకుచు దాన మీయ వలయును.
మాసనామ్నా తు సంయుక్తం ప్రాదుర్భావ విధానకమ్,
ప్రీయతా మితి సర్వత్ర విధి రేష ప్రకీర్తితః.
నెల పేరు కలియు నట్లుగా వామనుని అవతారమును భావించుచు ప్రీతి నొందు గాక అని చెప్పు చుండ వలయును. ఇది అన్ని యెడల విధానము.
శ్రూయతే చ పురా రాజా హర్యశ్వః పృథివీపతిః,
అపుత్రః స తప స్తేపే పుత్ర మిచ్ఛం స్తపోధనమ్.
పూర్వము హర్యశ్వుడను రాజు విన వచ్చును. అతడు సంతానము లేనివాడు. గొప్ప తప స్సంపద గల కుమారుని కోరుచు తపస్సు చేసెను.
తస్యైవ కుర్వతో వ్యుష్టిం పుత్రార్థే మునిసత్తమ,
ఆజగామ హరిః పూర్వం ద్విజరూపం సమాశ్రితః.
ఇట్లు పుత్రుని కొరకు తపస్సు చేయు చుండగా విష్ణువు బ్రాహ్మణ రూపమును దాల్చి ఆతని కడకు వచ్చెను.
ఉవాచ తపసా రాజన్ కింతే వ్యవసితం ప్రభో,
పుత్రార్థ మితి ప్రోవాచ తం విప్రః ప్రత్యువాచ హ.
రాజా! తపస్సు చేత నీవు కోరున దేమి? అని అడిగెను. పుత్రుల కొరకు తపస్సు అని అతడు బదులు చెప్పెను. అంత నా రాజునకు నా బ్రాహ్మణు డిట్లు బదులు పలికెను.
ఇద మేవ విధానం తు కురు రాజ న్నువాచ హ,
ఏవ ముక్త్వాతు రాజానం క్షణాదన్తర్హితః ప్రభుః.
“రాజా! ఈ ద్వాదశీ వ్రత విధానమునే ఆచరింపుము.” అని ఆ ప్రభువు క్షణములో అదృశ్యు డాయెను.
రాజాపి తం చకారాశు మంత్రవంతం ద్విజాతయే,
దరిద్రాయ తథా ప్రాదాత్ జ్యోతిర్గార్గాయధీమతే.
రాజును ఆ వ్రతమును మంత్ర సహితముగా వెంటనే ఆచరించెను. దరిద్రుడు, బుద్ధి మంతుడునగు జ్యోతిర్గార్గుడను బ్రాహ్మణునకు ఆ వామన మూర్తిని దాన మొసగెను.
యథాతిదే రపుత్రాయాః స్వయం పుత్రత్వ మాగతః,
భగవం స్తేన సత్యేన మమాప్యస్తు సుతో వరః.
సంతానము లేని అదితికి స్వయముగా కొడుకై జన్మించితివి. అట్లే భగవంతుడా! నాకును ఆ సత్యము తోడనే శ్రేష్ఠుడగు పుత్రుడు కలుగు గాక!
అనేన విధినా దత్తే తస్య పుత్రోభవ న్మునే,
కువలాశ్వ ఇతిఖ్యాత శ్చక్రవర్తీ మహాబలః.
ఈ విధితో ఆతడు దాన మొసగెను. ఆతనికి, ఓ మునీ, కువలాశ్వుడని పేరొందిన చక్రవర్తి మహా బలుడు పుత్రుడు కలిగెను.
అపుత్రో లభతే పుత్ర మధనో లభతే దనమ్,
భ్రష్ట రాజ్యో లభేద్ రాజ్యం మృతో విష్ణుపురం వ్రజేత్.
సంతానము లేని వాడు పుత్రులను, ధనము లేని వాడు ధనమును, రాజ్యము కోల్పయిన వాడు రాజ్యమును, మరణించిన వాడు విష్ణు పురమును దీని వలన పొందును.
కీర్తిత్వా సుచిరం తత్ర ఇహ మర్త్య ముపాగతః,
చక్రవర్తీ భవేద్ ధీమాన్ యయాతి రివ నాహుషః
అచట బహు కాలము కీర్తి నొంది మరల మానవ లోకమునకు వచ్చిన ఆ ధీశాలి నహుషుని కుమారుడు యయాతి వలె చక్రవర్తి యగును.