వరాహ మహా పురాణము
అధ్యాయము - 113
శ్రీవరాహ దేవుడు:
సంస్తూయమానో భగవాన్ మునిభి ర్మన్త్రవాదిభిః,
తుష్టో నారాయణో దేవః కేశవః పరమో విభుః.
శ్రీవరాహ దేవుడు:
మునులు, వేద పండితులు మున్నగు వారు ఇట్లు చక్కగా స్తుతించు చుండగా నారాయణుడు, దేవుడు, కేశవుడు, పరముడు, విభువు తుష్టు డాయెను.
తతో ధ్యానం సమాస్థాయ దివ్యం యోగం చ మాధవః,
మధురం స్వరమాస్థాయ ప్రత్యువాచ వసుంధరామ్.
అంత కొంతవడి ధ్యానమును పొంది, దివ్యమగు యోగమును పొంది మాధవుడు తీయని స్వరముతో వసుంధరతో నిట్లనెను.
తవ దేవి ప్రియార్థాయ భక్త్యా యచ్చ వ్యవస్థితమ్,
కారయిష్యామి తే సర్వం యత్తే హృది వ్యవస్థితమ్.
దేవీ! నీ ప్రియము కొరకును, నీ భక్తి చేతను, నీ హృదయమున ఏది కలదో అది అంతయు చేసెదను.
అహం త్వాం ధారయిష్యామి సశైలవనకాననామ్,
ససాగరాం ససరితాం సప్తద్వీపసమన్వితామ్.
కొండలతో, అడవులతో, సముద్రములతో, నదులతో ఏడు ద్వీపములతో కూడిన నిన్ను నేను పట్టుకొని నిలిపెదను.
ఏవ మాశ్వాసయిత్వాతు వసుధాం సతు మాధవః,
రూపం సంకల్ప యామాస వారాహం సుమహౌ జసమ్.
ఇట్లు వసుధకు ఊరట కలిగించి మాధవుడు పిక్కటిల్లిన దేహ బలము గల వరాహ రూపమును భావించెను.
షట్ సహస్రాణి చోచ్ఛ్రాయో విస్తారేణ పునస్త్రయః,
ఏవం నవ సహస్రాణి యోజనానాం విధాయ చ.
ఆరు వేల యోజనముల ఎత్తు, మూడు వేల యోజనముల వెడల్పుగా మొత్తము తొమ్మిది వేల యోజనముల రూపమును కల్పించెను.
వామయా దంష్ట్రయా గృహ్య ఉజ్జహార స మేదినీమ్,
సపర్వతవనాకారాం సప్తద్వీపాం సపత్తనామ్.
ఎడమ కోరతో పట్టుకొని కొండలు, అడవులు, ఏడు ద్వీపములు, పట్టణములు గల భూమి నంతటిని పైకి లాగెను.
నగా విలగ్నాః పతితాః కేచిద్ విజ్ఞాన సంశ్రితాః,
శోభన్తే చ విచిత్రాంగా మేఘా వర్షాగమే యథా.,
పట్టు దొరకని కొన్ని పర్వతములు పడి పోయినవి. ఏదో తెలియ వచ్చునట్లు వ్రేలాడు చుండినవి. విచిత్రములగు అంగములు కల అట్టివి వర్ష కాలములో మేఘముల వలె శోభిల్లినవి.
చంద్ర నిర్మలసంకాశా వరాహముఖ సంస్థితాః,
శోభన్తే చక్రపాణేశ్చ మృణాళం కర్దమే యథా.
చక్రము చేత దాల్చిన వరాహ స్వామి ముఖమున వ్రేలుచు ఆ కొండలు చంద్రుని వలె నిర్మల స్వరూపము కలవియై బురదలో తామర తూడుల వలె ప్రకాశించినవి.
ఏవం విధార్యమాణా సా పృథివీ సాగరాన్వితా,
వర్షాణాం చ సహస్రం హి వజ్రదంష్ట్రేణ సాధునా.
ఈ విధముగా వజ్రముల వంటి కోరలు గల ఉత్తమ స్వభావము గల ఆ విష్ణువు సాగరములతో కూడిన భూమిని వేయి ఏండ్లు పట్టుకొని నిలిపెను.
తస్యామేవం తు కాలస్య పరిమాణం యుగేషు చ,
ఏకసప్తతిమే కల్పే కర్దమోయం ప్రజాపతిః
అట్లు ఎన్నో యుగముల కాలము ఆ భూమి ఆ విధముగా నుండగా డెబ్బది యొకటవ కల్పమున కర్దముడు ప్రజాపతి అయి ఉండెను.
తతః పృథివ్యా దేవశ్చ భగవాన్ విష్ణురవ్యయః,
అన్యోన్యాభిమతాశ్చైవ వారాహే కల్ప ఉత్తమే.
అపుడు భగవానుడు, అవ్యయుడు, దేవుడునగు విష్ణువును, భూమియు ఆ ఉత్తమ మగు వరాహ కల్పమున ఒకరి యందొకరు ప్రీతి కలవారై యుండిరి.
సా గౌః స్తువతి తం చైవ పురాణం పరమవ్యయమ్,
యోగేన పరమేణైవ శరణం చైవ గచ్ఛతి
ఆ భూమి పురాణుడు, అవ్యయుడు, పరముడు నగు ఆ దేవుని స్తుతించెను. పరమ మగు యోగముతో ఆతనిని శరణు చొచ్చెను.
ఆధారః కీదృశో దేవ ఉపయోగశ్చ కీదృశః,
కాలేకాలే చ దేశే చ కర్మణశ్చాపి కీదృశః.
దేవా! నన్ను పట్టు కొనుటలో నీకు ఆధార మెట్టిది? ఉపయోగ మెట్టిది? ఆయా కాలము నందు, ఆయా దేశము నందు, ఆయా కర్మము నందు నీ వ్యవసాయ మెట్టిది?
కీదృశా పశ్చిమా సంధ్యా కీదృశా హ్యర్ధవాహ్యతః,
శేషాః సమానా స్త్వాం దేవైః యేతు కర్మాణి కుర్వతే.
పడమటి సంధ్య ఎట్టిది? ఆ పై విషయము లెట్టివి? నీ యెడల ఆయా పనులు చేయుచున్న దేవతలతో తక్కిన వారు సమానులా?
కింను సంస్థాపనా దేవ ఆవాహనవిసర్జనే,
అగురుం గన్ధధూపంచ ప్రాపణం గృహ్యసే కథమ్.
నిన్ను నెలకొల్పుట ఎట్లు? ఆవాహన యెట్లు? విసర్జన ఎట్లు? అగరు గంధ ధూపనము నీవెట్లు గ్రహింతువు?
కథం పాద్యం చ గృహ్ణాసి స్థాపనా లేపనాని చ,
కథం దీపం చ దాతవ్యం కందమూలఫలాని చ.
నీకు పాద్య మొసగుట ఎట్లు? నిన్ను నిలుపుట ఎట్లు? నీకు గంధము పూయుట ఎట్లు? నీకు దీప మొసగుట ఎట్లు? నీకు దుంపలు పండ్లు నివేదించుట ఎట్లు?
ఆసనం శయనం చైవ కిం కర్మణి విధీయతే,
కథం పూజా ప్రకర్తవ్యా ప్రాపణా స్తత్ర వై కతి,
పూర్వపశ్చిమ సంధ్యాయాం కిం పుణ్యం చాపితత్రవై.
నీకు ఆసనము, శయనము కూర్చుట ఎట్లు? నీ పూజ చేయుట ఎట్లు? ఎన్ని సందర్భములలో పూజ చేయ వలయును. తూర్పు, పడమరల సంధ్యలలో పూజించుట వలన కలుగు పుణ్య మెట్టిది?
శరది కీదృశంకర్మ శిశిరేకర్మ కీదృశమ్,
వసన్తే కీదృశం కర్మ గ్రీష్మే కిం కర్మ కారయేత్,
ప్రావృట్ కాలేచ కిం కర్మ వర్షాన్తే కించ కారయేత్.
శరత్తు, శిశిరము, వసంతము, గ్రీష్మము, వర్షము, వర్షము ముగిసిన కాలము అను నీ ఋతువులలో చేయదగు కర్మ మెట్టిది?
యాని తత్రోపయోగ్యాని పుష్పాణి చ ఫలాని చ,
కర్మణ్యాశ్చ అకర్మణ్యా యే వై శాస్త్ర బహిష్కృతాః.
అందు ఉపయోగింప దగు పూలెట్టివి? పండ్లెట్టివి? కర్మము, అకర్మము అను వానిలో శాస్త్రము వెలి పెట్టిన పదార్థము లెట్టివి?
కిం కర్మణా భోగవతా యావద్ గచ్ఛతి కీదృశాః.
కథం కర్మ నచాన్తేషు అతిగచ్ఛతి కీదృశాః.
భోగవంతులు ఏ పని చేసి లక్ష్యమున కరుగుదురు? ఎట్టి వారు ఆయా పనుల తుది భాగము లందు అతిక్రమింప కుందురు?
అర్చాయాః కిం ప్రమాణం తు స్థాపనం చాపి కీదృశమ్,
పరిమాణం కథం దేవ ఉపవాసశ్చ కీదృశః.
పూజకు ప్రమాణ మేమి? స్థాపనము ఎట్టిది? పరిమాణ మెంతటిది? ఉపవాస మనగా నెట్టిది?
పీతకం శుక్ల రక్తం వా కథం గృహ్ణీత శాశ్వతమ్,
తేషాం తు కానివస్త్రాణి యై ర్హితం ప్రతిపద్యతే.
పసుపు, తెలుపు, ఎరుపు రంగుల అభరణములలో ఎట్టి వానిని నీవు శాశ్వతముగా గ్రహింతువు? ఏ రంగు వస్త్రములు నీకు ఇచ్చిన వారు మేలు పొందెదరు?
కేషు ద్రవ్యేషు సంయుక్తం మధుపర్కం చ దీయతే,
కే తు కర్మగుణా స్తస్య మధుపర్కస్య మాధవ,
కాని లోకాని గచ్ఛన్తి మధుపర్కస్య ప్రాశనాత్.
ఏ ద్రవ్యములు కలిపి మధు పర్కమును నీకీయ వలయును? అందు కర్మ మెట్టిది? గుణము లెట్టివి? మధు పర్కము పుచ్చు కొనుట వలన నరుడు ఏ లోకముల కరుగును?
స్తవే పరమకాలేపి తవ భక్తస్య మాధవ,
కిం ప్రమాణం తు దాతవ్యం మధుపర్కసమన్వితమ్.
నీ స్తోత్రము చేయు పరమ పుణ్య కాలమున నీ భక్తుడు మధు పర్కమును ఏ ప్రమాణములో ఈవలయును?
కాని మాంసాని తే దేవ ఫలం శాకశ్చ కీదృశః,
ప్రాపణేష్వపి యుజ్యేత కర్మశాస్త్ర సమాయుతమ్.
ఏ యే మాంసములు, ఏ కూరలు, ఏ పండ్లు నీ సంబంధములగు పనులలో నివేదనకు శాస్త్రమున నుసరించి యోగ్యములు?
ఆహూతస్య చ మన్త్రేణ ఆగతే భక్తవత్సలే,
కేన మన్త్రవిధానేన ప్రాశనం తే ప్రదీయతే.
మంత్రముతో నిన్నాహ్వా నింపగా భక్త వత్సలుడవు నీ వరుదెంతువు. అప్పుడు ఏ మంత్ర విధానముతో నీకు నైవేద్యము ఒసగ వలయును?
కిం తస్య చోపచారేణ అర్చయిత్వా యథావిధి,
కాని కర్మాణి కుర్వీత తవ భక్తస్య భోజనాత్.
నిన్నాయా ఉపచారములతో యథావిధిగ అర్చించి భక్తుడు చేయ వలసిన పను లెట్టివి? భోజనమైన తరువాత చేయ దగిన కర్మము లెట్టివి?
యత్ స్తుతం ప్రాపణం దేవ నచదోష ప్రసాదితమ్,
కేత్ర భుంజన్తి తద్దేవ సర్వశుద్ధికరం శుభమ్.
నీ స్తుతి, నీ అర్పణములు ఏ దోసము లేకుండ ముగిసిన తరువాత సర్వ శుద్ధికరము, శుభము అగు నీ ప్రసాదమును భుజించు వారెవ్వరు?
యేతు ఏకాశిరో దేవ ముపసర్పన్తి మాధవమ్,
తేషాంతు కా గతిర్దేవ తవ భక్తి పరాయణాః.
ఒంటి పూట భోజనము చేసి నీ కడకు వచ్చు భక్తి పరాయణులు ఏ గతికి పోవుదురు?
షష్ఠాష్టమేవ కాలేన యోభిగచ్ఛేత మాధవమ్,
తేషాంతు కా గతిర్దేవ తవ భక్తి పరాయణమ్.
షష్ఠాష్టమ కాలమున భక్తి పరాయణ భావముతో మాధవుని కడ కేతెంచు వారి గతి యేమి?
కృచ్ఛ్రం చాన్ద్రాయణం కృత్వాయేభిగచ్ఛన్తి మాధవమ్,
తేషాంతు కా గతి ర్దేవ తవ కర్మపరాయణమ్.
కృచ్ఛ్ర చాంద్రాయణములను కర్మము లందు ఆసక్తి కలిగి నిర్వహించు వారు మాధవుని కడ కేతెంచినచో వారు పొందెడు స్థితి యెట్టిది?
వ్రతం కృత్వా యథోక్తేన యేభిగచ్ఛన్తి మాధవమ్,
కాం గతిం పురుషా యాన్తి భావితా స్తవ శాసనే.
శాస్త్రము చెప్పిన విధముగా వ్రత మొనరించి నీ శాసనము నందు చక్కగా మెలగు వారు మాధవుని గూర్చి ప్రయాణింతురేని వారు పొందెడు గతి యెట్టిది?
కృచ్ఛ్రం సాంతపనం కృత్వా యేభిగచ్ఛన్తి మాధవమ్,
కాం గతిం తే ప్రపద్యన్తే తవ కర్మపరాయణాః.
నీ కర్మము లందు పరమ శ్రద్ధ కలవారై అతి కష్టమైన సాంతపనమను వ్రతమును చేయువారు మాధవుని కడ కరుగుచు ఏ గతి పొందుదురు?
వాయ్వాహారం తతః కృత్వా కృష్ణం సమధిగచ్ఛతి,
తేషాంతు కా గతిః కృష్ణ తవభక్తి వ్యవస్థితాః.
కృష్ణా! వాయువే ఆహారముగా గ్రహించి నీ యందలి భక్తితో అచంచలముగా నుండు వారు కృష్ణుని పొందుచు పొందు గతి యేమి?
అక్షారలవణం కృత్వా యేభిగచ్ఛన్తి చాచ్యుతమ్,
కాం గతిం తే ప్రపద్యన్తే తవ కర్మానుసారిణః.
స్వామీ! నీ కర్మము ననుసరించు వారై ఉప్పు కారములు లేని భోజనము తినుచు అచ్యతుని వైపు ప్రయాణించు వారు ఏ గతిని పొందు దురు?
తులాపురుషకం కృత్వా యేభిచ్ఛన్తి కేశవమ్,
కాం గతిం తే ప్రపద్యన్తే నరా యే వ్రతచారిణః.
వ్రతముల నాచరించుచు తులా పురుషక వ్రతమును చేసి కేశవుని వైపు పోవు నరులు ఏ గతిని పొందెదరు?
కృత్వా పయోవ్రతం చైవ యేభిగచ్ఛన్తి చాచ్యుతమ్,
కాం గతిం తే ప్రపద్యన్తే నరా యే వ్రతచారిణః.
అచ్యుతుని కడకరుగు వారై పాలను మాత్రమే పుచ్ఛుకొని వ్రతము చేయువారు ఏగతిని కరుగుదురు?
దత్వా గవాహ్నికం చైవ యే ప్రపద్యన్తి మాధవమ్,
కాం గతిం తేప్రపద్యన్తే తవ భక్త్యా వ్యవస్థితాః.
నీ యందు చెదరని భక్తి కలవారై ప్రతి దినము ఆవునకు మేత ఇడుచు మాధవార్చన చేయు వారు ఏగతి కరుగుదురు?
ఉఞ్ఛవృత్తిం సమాస్థాయ యేభిగచ్ఛన్తి మాధవమ్,
కాం గతిం తే ప్రపద్యన్తే నరా భిక్షోపజీవినః.
బిచ్చ మెత్తుకొని బ్రదుకుచు రాలిన గింజ లేరుకొని తిను వ్రతము నవలంబించి మాధవు నర్చించు వారే గతి పొందుదురు?
గృహస్థధర్మం కృత్వా వై యేభిగచ్ఛన్తి కేశవమ్,
కాం గతిం తే ప్రపద్యన్తే తవకర్మ పరాయణాః.
నీ కర్మము లందు మిక్కిలి శ్రద్ధ కలిగి గృహస్థ ధర్మమును పాటించుచు కేశవు నర్చించు వారు ఏ గతి పొందుదురు.
వైకుంఠ తవ క్షేత్రేషు యేతు ప్రాణాన్ విముంచతే,
కాంల్లోకాంస్తే ప్రపద్యన్తే తవ క్షేత్రేషు యే మృతాః.
వైకుంఠా! నీ క్షేత్రము లందు ప్రాణములు విడుచు వారు. మరణము పొందిన వారు ఏ లోకముల కరుగుదురు?
కృత్వా పఞ్చాత్మకం చైవ మాధవాయ ప్రపద్యతి,
కాంగతిం తు పరాం యాన్తి యేతే పఞ్చత్వ మాశ్రితాః.
పంచాగ్ని మధ్య తపస్సు నాచరించి మాధవుని శరణు చొచ్చిన వారు మరణించిన పిదప ఎట్టి పరమ గతి కరుగుదురు?
కణ్టశయ్యాం సమాసాద్య యే ప్రపద్యన్తి చాచ్యుతమ్,
తేషాంతు కా గతిర్దేవ కణ్టశయ్యాం సమాశ్రితాః.
ముళ్ల పానుపు నెక్కి అచ్యుతు నారాధించుచు తపము చేయు వారు ఏ గతి కరుగుదురు?
ఆకాశశయంన కృత్వా యేప్రపద్యన్తి చాచ్యుతమ్,
తేషాం తు కాగతిః కృష్ణ తవ భక్తి పరాయణాః.
నీ భక్తిపై మిక్కిలి అనురక్తి కలవారై కృష్ణా! ఆకాశ శయనము కావించి తపస్సు చేయు వారి గతి యెట్టిది?
గోవ్రజే శయనం కృత్వా యే ప్రపద్యన్తి కేశవమ్,
తేషాం తు కాగతి ర్దేవ తవభక్తిపరాయణాః.
నీ పై అచంచల మగు భక్తి కలవారై ఆవుల మందలో నిద్రించు వ్రత మాచరించు వారి గతి యెట్టిది?
శాకాహారం తతః కృత్వా యేభిగచ్ఛన్తి చాచ్యుతమ్,
తేషాంతు కాగతి ర్దేవ తవభక్తి పరాయణాః.
నీ యందలి పరమ భక్తితో కూరలు మాత్రమే తినుచు అచ్యుతుని వైపు ప్రయాణించు వారు పొందెడు గతి యెట్టిది?
పఞ్చగవ్యం తతః పీత్వా యేభిగచ్ఛన్తి మాధవమ్,
తేషాంతు కా గతిర్దేవ యే నరా యావకాశినః.
పంచ గవ్యములను త్రావి విష్ణుని ఆరాధించు భక్తుల గతి యెట్టిది? (పంచ గవ్యములు - ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మూత్రము.)
ఆహారం గోమయం కృత్వా యేభిగచ్ఛన్తి కేశవమ్,
నారాయణ గతి స్తేషాం కీదృశ్యత్ర విధీయతే.
గోమయమునే ఆహారముగా గొని కేశవు నర్చించు వారి గతి, నారాయణా! ఎట్టిది?
సక్తూంశ్చ భక్షయిత్వా తు యేప్రపద్యన్తి చాచ్యుతమ్,
తేషాం తు కా గతిర్దేవ తవ కర్మపరాయణాః.
నీ సేవలో శ్రద్ధ కలవారై పేల పిండిని మాత్రము తినుచు మాధవు నారాధించు వారు పొందు గతి యేమి?
శిరసా దీపకం కృత్వా యేభిగచ్ఛన్తి కేశవమ్,
తేషాంతు కా గతి ర్దేవ శిరసా దీపధారణాత్.
తలపై దీప ముంచుకొని కేశవు నర్చించు వారికి దేవా! గతి యెట్టిది?
యే హి నిత్యం పయః పీత్వా తవచిన్తావ్యవస్థితాః,
తేగతిం కాం ప్రపద్యన్తి తవచిన్తా పరాయణాః.
నిత్యము పాలు మాత్రము త్రావుచు నిన్నే విడువక ధ్యానించు చుండువారు ఏ గతి నందుదురు?
ఆమాశనం వ్రతం కృత్వా యే ప్రపద్యన్తి నిత్యశః,
తేషాంతు కా గతిర్దేవ తవభక్తి పరాయణాః.
నీ భక్తి యందు పరమానురాగము కలవారై ఆమ బోజనము అను వ్రతముతో నిన్నర్చించు వారి గతి ఏమి ? (ఆమము = వడంని పదార్థము)
భక్షయిత్వా తు దుర్వాం యే ప్రపద్యన్తి మీనీషిణః,
తేషాం తుకా గతిర్దేవ స్వకర్మ గుణచారిణః.
గరికము మాత్రమే తినుచు తమ కర్మములను గుణములను అనుసరించుచు నిన్ను చేరుకొను వారు పొందు గతి యెట్టిది?
జానుభ్యాం ప్రతిపద్యన్తి తవ ప్రీత్యా చ మాధవ,
తేషాంతు కా గతి ర్దేవ తన్మమాచక్ష్వ పృచ్ఛతః.
నీ యందలి ప్రీతితో మోకాళ్లపై కూర్చుండి ధ్యానించు వారి గతి యెట్టిదో అడుగు చున్న నాకు తెలియ జెప్పుము.
ఉత్తానశయనం కృత్వా యే విధారన్తి దీపికాః,
తేషాంతు కాగతిర్దేవ తన్మమాచక్ష్వ పృచ్ఛతః.
వెల్లికిలగా పండుకొని పైన దీపము లుంచుకొని నిన్నర్చించు వారు పొందెడు గతి యెట్టిదో చెప్పుము.
జానుభ్యాం దీపకం కృత్వా కేశవాయ ప్రపద్యతే.
తేషాంతు కాగతి ర్దేవ తవ ధర్మపారయణాః.
నీ ధర్మమున శ్రద్ధ కలిగిన మోకాళ్ల మీద దీప ముంచుకొని కేశవు నర్చించు వారి గతి ఎట్టిది?
కరాభ్యాం దీపకం గృహ్య కేళవాయ ప్రపద్యతే,
తేషాం తు కాగతి ద్రేవ కథ్యతే చైవ శాశ్వతీ.
రెండు చేతులలో దీప ముంచుకొని కేశవు నర్చించు వారి శాశ్వత గతి యెట్టిదో చెప్పుము.
అవాక్ శిరాస్తు భూత్వా వై యఃప్రపద్యే జ్జనార్దనమ్,
భగవన్ కాగతి స్తస్య అవాక్ శిరసి శాయినః.
తల క్రిందుగా ఉంచుకొని పండు కొని వారు జనార్దునుని ఆశ్రయించి పొందెడు గతి ఏమి?
పుత్రదారగృహం చైవ ముక్త్వా యోనుప్రపద్యతే.
తేషాంతు కా గతిః సిద్ధా కథయస్వ సురోత్తమ.
కొడుకులను, భార్యను, ఇంటిని వదలి నిన్నే గతిగా కైకొను సిద్ధు లెట్టిగతి నందుదురో తెలియ బలుకుము.
భాషితో సి మయాహ్యేవం సర్వలోకసుఖావహమ్,
గమనాగమనం చైవ త్వత్రసన్నేన మాధవ.
మాధవా! అన్ని లోకములకు సుఖ కారణమైన రాక పోకలను గూర్చి నీవు ప్రసన్నుడ వైన కారణముగా నేను పలుక గలిగితిని.
త్వం మాతా త్వంపితా త్వంచ సర్వధర్మ వినిశ్యయః,
అతస్త్వయైన వక్తవ్యం యోగసాంఖ్య వినిశ్చయః.
నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సర్వ ధర్మములకు నిశ్చయ రూపుడవు. కావున యోగము, సాంఖ్యము అను వాని నిర్ణయమును గూర్చి చెప్ప వలయును.
త్వాం భజం శ్చ గతే జీవే మధుపర్కసమన్వితమ్,
భస్మాకులేషు నిక్షిప్య కథం చాగ్నౌ ప్రపద్యతే.
నిన్ను భజించుచు జీవుడు మృతి చెందినచో మధు పర్కముతో పాటు భస్మము నందు కలిసి వాని దేహమును అగ్నిలో దహనము చేయు విధాన మెట్టిది ?
కాంగతిం తే ప్రపద్యన్తే త్వద్భక్తే జలసంస్థితే.
త్వత్‌క్షేత్ర సంస్థితో వా పి తన్మమాచక్ష్వ పృచ్ఛతః.
నీ భక్తుడు నీట మునిగి నప్పుడు, నీ క్షేత్రమున నిలిచి యున్నపుడు నిన్ను పొందినచో అతని గతి యెట్టిది?
స్మరణం తేషు తే కృష్ణ యైస్తు నామప్రకీర్తితమ్,
నమో నారాయణేత్యుక్త్వా తేషాం వై కా గతిర్భవేత్.
నీ నామములను కీర్తించుచు “నమో నారాయణాయ”ని పలుకుచు దానినే స్మరించుచు వారి గతి యెట్టిది?
ఉద్యతేష్వసి శస్త్రేషు హన్యమానా రణే నరాః,
యేతు నామ ప్రకీర్త్యన్తే తేషాం వై కీదృశీ భవేత్.
ఆయుధము నెత్తి పట్టుకొని శత్రువులు చంపు చున్నపుడు. నీ నామమును కీర్తించు వారు పొందు గతి యెట్టిది?
అహం శిష్యా చ దాసీ చ దవభక్తై వ్యవస్థితా,
రహస్యం ధర్మసంయుక్తం తన్మమాచక్ష్వ మాధవ.
నేను నీకు శిష్యను, నీ దాసినీ, నీ భక్తి యందు స్థిరముగా నుండు దానను. ధర్మముతో కూడిన ఈ రహస్యమును మాధవా! నాకు చెప్పుము.
ఏవంతే పరమం గుహ్యం మమప్రీత్యా జగుద్గురో,
లోకధర్మార్థం చిన్త్యత్వం తధ్ భవాన్ వక్తుమర్హసి.
జగద్గురూ! ఇది పరమ రహస్యము. నా యందలి ప్రీతితో లోక ధర్మమును విచారించి నీవు నాకు చెప్ప వలయును.